కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి చేయగలిగినదంతా చేయండి

వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి చేయగలిగినదంతా చేయండి

వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి చేయగలిగినదంతా చేయండి

‘పెండ్లియైన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించుచున్నాడు.’—1 కొరిం. 7:10.

మీరు వివరించగలరేమో చూడండి:

పెళ్లి చేసుకునే వాళ్లను ‘జతపరిచేది’ యెహోవాయే అని ఎందుకు చెప్పవచ్చు?

వైవాహిక జీవితంలో సమస్యలున్న దంపతులకు సంఘ పెద్దలు ఎలా సహాయం చేయవచ్చు?

వివాహ బంధాన్ని మనమెలా దృష్టించాలి?

1. క్రైస్తవులు వివాహాన్ని ఎలా దృష్టించాలి? ఎందుకు?

 క్రైస్తవులు పెళ్లి చేసుకున్నప్పుడు యెహోవా దేవుని ముందు ప్రమాణం చేస్తారు కాబట్టి వాళ్లు ఆ బాధ్యతను తేలికగా తీసుకోకూడదు. (ప్రసం. 5:4-6) వివాహ ఏర్పాటును యెహోవాయే స్థాపించాడు కాబట్టి పెళ్లి చేసుకునే వాళ్లను ‘జతపరిచేది’ ఆయనే అని చెప్పవచ్చు. (మార్కు 10:9) పెళ్లి విషయంలో ఏ దేశ చట్టం ఏమి చెబుతున్నా పెళ్లి చేసుకున్నవాళ్లు దేవుని దృష్టిలో భార్యాభర్తలే. యెహోవా సేవకులు తమ వివాహ ప్రమాణానికి జీవితాంతం కట్టుబడివుండాలి, పెళ్లి చేసుకునే సమయానికి వాళ్లు సత్యంలో లేకపోయినా వాళ్లు అలాగే కట్టుబడివుండాలి.

2. ఈ ఆర్టికల్‌లో మనం ఏ ప్రశ్నలు పరిశీలిస్తాం?

2 క్రైస్తవ దంపతుల వైవాహిక జీవితం సాఫీగా సాగితే వాళ్లెంతో సంతోషంగా ఉంటారు. ఒకవేళ వాళ్ల మధ్య సమస్యలు తలెత్తితే, ఆ పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి ఏమి చేయవచ్చు? వాళ్లకు ఎలాంటి సహాయం అందుబాటులో ఉంది?

వైవాహిక జీవితం సాఫీగా సాగాలంటే . . .

3, 4. పెళ్లి చేసుకోవడానికి సరైన వ్యక్తిని ఎంచుకోకపోతే ఏమి జరగవచ్చు?

3 క్రైస్తవ దంపతుల వైవాహిక జీవితం సాఫీగా సాగితే వాళ్లెంతో సంతోషంగా ఉంటారు, దానివల్ల యెహోవాకు ఘనత వస్తుంది. కానీ అలా సాగకపోతే చెప్పలేనంత దుఃఖం కలుగుతుంది. పెళ్లి చేసుకోవాలనుకుంటున్న క్రైస్తవులు దేవుని నిర్దేశాన్ని పాటిస్తే వైవాహిక జీవితాన్ని చక్కగా ప్రారంభించవచ్చు. కానీ సరైన వ్యక్తిని ఎంచుకోకపోతే అసంతృప్తి, దుఃఖం కలగవచ్చు. ఉదాహరణకు, కొంతమంది యౌవనులు వైవాహిక జీవితానికి సంబంధించిన బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా లేకపోయినా పెళ్లి చేసుకొనే ప్రయత్నాలు మొదలుపెడతారు. కొంతమంది అమ్మాయిని లేక అబ్బాయిని ఇంటర్నెట్‌లో చూసుకొని పెళ్లి చేసుకుంటారు, ఆ తర్వాత బాధలు పడతారు. మరికొంతమంది, ఫలానా వ్యక్తిని పెళ్లి చేసుకోవాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి ఆ వ్యక్తితో కలిసి గడిపే సమయంలో (కోర్ట్‌షిప్‌ సమయంలో) గంభీరమైన పాపం చేసి, తప్పనిసరి పరిస్థితుల్లో ఆ వ్యక్తినే పెళ్లి చేసుకుంటారు. కానీ ఒకరి మీద ఒకరికి అసలేమాత్రం గౌరవం ఉండదు.

4 కొంతమంది క్రైస్తవులు “ప్రభువునందు మాత్రమే” పెళ్లి చేసుకోవాలనే ఆజ్ఞను మీరి, సత్యంలో లేని భర్త లేక భార్య ఉండడం వల్ల వచ్చే బాధాకరమైన పర్యవసానాలను ఎదుర్కొంటారు. (1 కొరిం. 7:39) ఒకవేళ మీ పరిస్థితి కూడా అదే అయితే క్షమించమని, సహాయం చేయమని యెహోవాను వేడుకోండి. గతంలో చేసిన తప్పుల వల్ల వచ్చిన పర్యవసానాలను ఆయన తీసివేయడు గానీ కష్టాలను సహించేందుకు పశ్చాత్తాపం చూపించిన వాళ్లకు సహాయం చేస్తాడు. (కీర్త. 130:1-4) ఇప్పుడూ ఎల్లప్పుడూ ఆయనను సంతోషపెట్టడానికి కృషిచేయండి, అలా చేస్తే ‘యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలం పొందుతారు.’—నెహె. 8:10.

సమస్యలు తలెత్తినప్పుడు . . .

5. భార్యాభర్తల మధ్య సమస్యలు తలెత్తినప్పుడు ఎలా ఆలోచించకూడదు?

5 తమ మధ్య సమస్యలు తలెత్తడం వల్ల బాధపడుతున్న భార్యాభర్తలు, ‘మా ఇద్దరి మధ్య ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు మేము కలిసి ఉండడం అవసరమా? కాలాన్ని వెనక్కి తిప్పి, వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఎంత బావుంటుందో!’ అనుకునే ప్రమాదం ఉంది. వాళ్లు తమ భార్యను లేక భర్తను విడిచిపెట్టేయాలని కలలుగంటూ, ‘నాకు మళ్లీ స్వేచ్ఛ కావాలి! నేను విడాకులు పొందే అవకాశం ఉందా? ఒకవేళ లేఖనాల ఆధారంగా విడాకులు పొందలేకపోయినా నా భార్య లేక భర్త నుండి విడిపోయి, నేను మళ్లీ నా జీవితాన్ని సంతోషంగా గడపవచ్చు’ అనుకుంటారు. క్రైస్తవులు ఆ విధంగా ఆలోచించే బదులు, ‘ఇలా జరిగితే బావుండు అలా జరిగితే బావుండు’ అంటూ కలలు కనే బదులు దేవుని నిర్దేశాల కోసం ప్రయత్నించి వాటిని అనుసరించడం ద్వారా ప్రస్తుత పరిస్థితిని సరిదిద్దుకోవడానికి తాము చేయగలిగినదంతా చేయాలి.

6. మత్తయి 19:9లోవున్న యేసు మాటలను వివరించండి.

6 క్రైస్తవులు విడాకులు తీసుకుంటే, మళ్లీ పెళ్లి చేసుకునే విషయంలో వాళ్లకు లేఖనాధారంగా స్వేచ్ఛ ఉండవచ్చు, ఉండకపోవచ్చు. “వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లిచేసికొనువాడు వ్యభిచారము చేయుచున్నాడు.” (మత్త. 19:9) ఈ లేఖనంలో “వ్యభిచారము” అని అనువదించబడిన మూలభాషా పదం అక్రమసంబంధాల్నే కాక గంభీరమైన ఇతర లైంగిక పాపాల్ని కూడా సూచిస్తోంది. a కాబట్టి వ్యభిచార కారణం లేకుండా విడాకులు తీసుకోవాలని ఏ ఒక్కరికి అనిపించినా, ఆ విషయం గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించడం ప్రాముఖ్యం.

7. క్రైస్తవుల వైవాహిక జీవితం సాఫీగా సాగకపోతే చూసేవాళ్లు ఏమనుకోవచ్చు?

7 ఒకవేళ భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోతే దేవునితో వాళ్లకు సరైన సంబంధం లేదని చెప్పవచ్చు. అందుకే అపొస్తలుడైన పౌలు ఆలోచింపజేసే ఈ ప్రశ్న వేశాడు, “ఎవడైనను తన యింటివారిని ఏలనేరక పోయినయెడల అతడు దేవుని సంఘమును ఏలాగు పాలించును?” (1 తిమో. 3:5) ఇద్దరూ క్రైస్తవులమని చెప్పుకుంటున్నప్పటికీ వాళ్ల వైవాహిక జీవితం సాఫీగా సాగకపోతే, ఆ దంపతులు తాము బోధించేదాన్ని నిజంగా పాటించడంలేదని చూసేవాళ్లు అనుకోవచ్చు.—రోమా. 2:21-24.

8. క్రైస్తవ దంపతులు విడిపోవాలని నిర్ణయించుకుంటే, వాళ్లకు ఏ సమస్య ఉందని చెప్పవచ్చు?

8 క్రైస్తవ దంపతులు లేఖనాధార కారణం లేకుండా విడిపోవాలని లేదా విడాకులు తీసుకోవాలని ఆలోచిస్తుంటే, దేవునితో వాళ్లకు సరైన సంబంధం లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు. దంపతులిద్దరూ లేదా వాళ్లల్లో ఒకరు లేఖన సూత్రాలను పాటించడం లేదని చెప్పవచ్చు. వాళ్లు నిజంగా ‘పూర్ణహృదయంతో యెహోవాపై నమ్మకం ఉంచితే’ విడిపోరు.—సామెతలు 3:5, 6 చదవండి.

9. సమస్యల్ని ఓపికగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించిన కొంతమంది క్రైస్తవ దంపతులు ఎలాంటి ఫలితాలు పొందారు?

9 ఫలానా క్రైస్తవ దంపతులు కలిసి ఉండలేరని ఇతరులు అనుకున్నా అలాంటి ఎంతోమంది దంపతులు నిజానికి సంతోషంగా కలిసివుండగలిగారు. సమస్యల్ని ఓపికగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించే క్రైస్తవ దంపతులు తరచూ మంచి ఫలితాలు పొందుతారు. సత్యాన్ని అంగీకరించని భార్య లేక భర్త ఉన్నవాళ్ల విషయంలో ఏమి జరగవచ్చో గమనించండి. “స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి; అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే, వారు భయముతోకూడిన మీ పవిత్రప్రవర్తన చూచి, వాక్యము లేకుండనే తమ భార్యల నడవడివలన రాబట్టబడవచ్చును” అని అపొస్తలుడైన పేతురు రాశాడు. (1 పేతు. 3:1, 2) సత్యంలో ఉన్న భార్య మంచి నడవడి వల్ల, సత్యంలో లేని భర్త సత్యాన్ని అంగీకరించవచ్చు. భార్యాభర్తలు కలిసి జీవించాలని నిర్ణయించుకుంటే దేవునికి ఘనత వస్తుంది. అంతేగాక వాళ్లు, వాళ్ల పిల్లలు ఎన్నో ఆశీర్వాదాలు పొందుతారు.

10, 11. వైవాహిక జీవితంలో అనుకోని విధంగా ఎలాంటి సమస్యలు తలెత్తవచ్చు? అయితే క్రైస్తవులు ఏ నమ్మకాన్ని కలిగివుండవచ్చు?

10 చాలామంది క్రైస్తవులు యెహోవాను సంతోషపర్చాలనే కోరికతో తోటి యెహోవాసాక్షుల్నే పెళ్లి చేసుకుంటారు. అయినా పరిస్థితులు అనుకోని విధంగా మలుపు తిరగవచ్చు. ఉదాహరణకు, చాలా అరుదుగా, భార్య లేక భర్త తీవ్రమైన భావోద్వేగ సమస్యలు ఎదుర్కోవచ్చు. లేక పెళ్లైన కొంతకాలానికి, బహుశా భార్య లేక భర్త నిష్క్రియులైపోవచ్చు. లిండా b అనే సహోదరి పరిస్థితినే పరిశీలించండి, ఆమె ఉత్సాహవంతురాలైన క్రైస్తవురాలు, ప్రేమగల తల్లి. యెహోవాసాక్షియైన తన భర్త లేఖన విరుద్ధమైన పనులు చేయడం మొదలు పెట్టినప్పుడు ఆమె ఏమీ చేయలేకపోయింది. ఆమె భర్త పశ్చాత్తాపపడనందుకు చివరికి బహిష్కరించబడ్డాడు. చక్కదిద్దుకోలేమని అనిపించే అలాంటి పరిస్థితుల్లో ఉన్న క్రైస్తవులు ఏమి చేయాలి?

11 ‘ఏమి జరిగినా సరే నేను నా భార్యతో లేక భర్తతో కలిసి జీవించడానికే ప్రయత్నిస్తూ ఉండాలా?’ అని మీకు అనిపించవచ్చు. ఆ విషయంలో ఎవరూ మీ కోసం నిర్ణయాలు తీసుకోలేరు, అలా తీసుకోకూడదు కూడా. అయితే, సమస్యల్ని ఓపికగా పరిష్కరించుకొని కలిసే జీవించడానికి ఎన్నో మంచి కారణాలు ఉన్నాయి. మనస్సాక్షి నిమిత్తం వైవాహిక జీవితంలో వచ్చే సమస్యలను సహించే దైవభక్తిగల స్త్రీపురుషులు యెహోవా దృష్టిలో విలువైనవాళ్లు. (1 పేతురు 2:19, 20 చదవండి.) వైవాహిక జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి పట్టుదలగా ప్రయత్నించే క్రైస్తవులకు యెహోవా తన వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా సహాయం చేస్తాడు.

వాళ్లు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు

12. పెద్దల సహాయం తీసుకుంటే వాళ్లు మిమ్మల్ని ఎలా దృష్టిస్తారు?

12 మీ వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటే పరిణతి చెందిన క్రైస్తవుల నుండి ఆధ్యాత్మిక సహాయం తీసుకోవడానికి వెనుకాడకండి. సంఘ పెద్దలు మంద కాపరులుగా సేవ చేస్తారు కాబట్టి లేఖనాల్లోవున్న దైవ ప్రేరేపిత సలహాలు ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. (అపొ. 20:28; యాకో. 5:14, 15) సంఘ పెద్దల దగ్గరకు వెళ్లి మీ వైవాహిక జీవితంలో ఉన్న తీవ్రమైన సమస్యల గురించి చెప్పుకొని ఆధ్యాత్మిక సహాయం తీసుకుంటే మీపై వాళ్లకున్న గౌరవం పోతుందేమోనని అనుకోకండి. దేవునికి ఇష్టమైన విధంగా జీవించాలనే మీ బలమైన కోరికను చూసి వాళ్లకు మీపై ఉన్న ప్రేమ, గౌరవం పెరుగుతాయి.

13. మొదటి కొరింథీయులు 7:10-16లో ఏ సలహా ఉంది?

13 సత్యంలో లేని భార్య లేదా భర్త ఉన్న క్రైస్తవులకు సంఘ పెద్దలు అపొస్తలుడైన పౌలు ఇచ్చినటువంటి సలహానే ఇస్తారు. ఆయన ఈ సలహా ఇచ్చాడు, “పెండ్లియైన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించునదేమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు. ఎడబాసినయెడల పెండ్లిచేసికొనకుండవలెను; లేదా, తన భర్తతో సమాధానపడవలెను. మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. ... ఓ స్త్రీ, నీ భర్తను రక్షించెదవో లేదో నీకేమి తెలియును? ఓ పురుషుడా, నీ భార్యను రక్షించెదవో లేదో నీకేమి తెలియును?” (1 కొరిం. 7:10-16) అవిశ్వాసియైన భార్య లేక భర్త సత్యాన్ని అంగీకరించడం ఎంతో గొప్ప ఆశీర్వాదం.

14, 15. క్రైస్తవ భార్యలు ఎలాంటి పరిస్థితుల్లో ఎడబాయవచ్చు? దాని గురించి ప్రార్థనాపూర్వకంగా, నిజాయితీగా పరిశీలించడం ఎందుకు ప్రాముఖ్యం?

14 క్రైస్తవ భార్యలు ఎలాంటి పరిస్థితుల్లో ‘ఎడబాయవచ్చు’? కుటుంబానికి అవసరమైన ఆర్థిక మద్దతు ఇవ్వకపోవడం వల్ల లేదా తమను విపరీతంగా కొట్టడం వల్ల లేదా యెహోవాసాక్షిగా కొనసాగనివ్వక పోవడం వల్ల కొంతమంది విడిపోయారు.

15 విడిపోవాలా వద్దా అనేది వ్యక్తిగత నిర్ణయం. అయితే యెహోవాసాక్షియైన భార్య లేక భర్త ఆ విషయం గురించి ప్రార్థనాపూర్వకంగా, నిజాయితీగా పరిశీలించాలి. అవిశ్వాసియైన భార్య లేక భర్త వల్లే యెహోవాసాక్షిగా కొనసాగలేని పరిస్థితి వచ్చిందా లేకపోతే, విశ్వాసియైన భార్య లేక భర్త తామే బైబిలు అధ్యయనాన్ని నిర్లక్ష్యం చేస్తూ, కూటాలకు, పరిచర్యకు క్రమంగా వెళ్లడం లేదా?

16. విడాకుల విషయంలో క్రైస్తవులు ఎందుకు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు?

16 మనం యెహోవాతో మనకున్న సంబంధాన్ని విలువైనదిగా ఎంచితే, ఆయన బహుమానమైన వివాహం పట్ల మనకు కృతజ్ఞత ఉంటే విడాకులు తీసుకునే విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోం. యెహోవా సేవకులముగా మనం ఆయన పరిశుద్ధ నామానికి ఎలాంటి మచ్చా తీసుకురాకూడదని కోరుకుంటాం. అందుకే వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనే ఆలోచనతో భార్య లేక భర్త నుండి విడిపోవాలని ఎప్పుడూ కుయుక్తిగా ప్రయత్నించం.—యిర్మీ. 17:9; మలా. 2:13-16.

17. ‘సమాధానంగా ఉండడానికి దేవుడు పిలిచాడు’ అనే మాటను పెళ్లైన క్రైస్తవులకు ఎలాంటి పరిస్థితుల్లో అన్వయించవచ్చు?

17 అవిశ్వాసియైన భార్య లేక భర్త ఉన్న క్రైస్తవులు తమ వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి తీవ్రంగా కృషిచేయాలి. అయితే అలా కాపాడుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవిశ్వాసియైన భార్య లేక భర్త కలిసి ఉండడానికి ఇష్టపడకపోతే క్రైస్తవులు అపరాధ భావాలతో బాధపడాల్సిన అవసరం లేదు. పౌలు ఇలా రాశాడు, “అవిశ్వాసియైనవాడు ఎడబాసిన ఎడబాయవచ్చును; అట్టి సందర్భములలో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధము లేదు. సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచియున్నాడు.”—1 కొరిం. 7:15. c

యెహోవాపై నమ్మకం ఉంచండి

18. ఎంతగానో ప్రయత్నించి వివాహ బంధాన్ని కాపాడుకోలేకపోయినా ఎలాంటి సత్ఫలితాలు రావచ్చు?

18 వైవాహిక జీవితంలో వచ్చే సమస్యలతో వ్యవహరిస్తున్నప్పుడు ధైర్యం కోసం యెహోవాపై ఆధారపడి, ఆయనపై ఎల్లప్పుడూ నమ్మకం ఉంచండి. (కీర్తన 27:14 చదవండి.) ముందటి పేరాల్లో ప్రస్తావించబడిన లిండా విషయం మరోసారి పరిశీలించండి. ఆమె తన వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి ఎన్నో సంవత్సరాల పాటు కష్టపడి ప్రయత్నించినా చివరికి ఆమె వైవాహిక జీవితం విడాకులతో ముగిసింది. అనవసరంగా కాలం వృథా చేశానని ఆమె బాధపడుతోందా? “నేనస్సలు బాధపడడం లేదు. నా ప్రయత్నాల వల్ల యెహోవాకు ఘనత వచ్చింది. నా మనస్సాక్షి నిర్మలంగా ఉంది. అన్నిటికన్నా మంచి విషయం ఏమిటంటే మా అమ్మాయి సత్యంలో స్థిరంగా ఉండడానికి ఆ సంవత్సరాలు తోడ్పడ్డాయి, ఇప్పుడామె బాప్తిస్మం తీసుకొని ఉత్సాహంగా యెహోవా సేవ చేస్తోంది” అని లిండా చెబుతోంది.

19. వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి కృషిచేస్తే ఏమవుతుంది?

19 యెహోవాపై నమ్మకం ఉంచి, తన వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి తీవ్రంగా కృషి చేసినందుకు మెర్లిన్‌ అనే సహోదరి ఎంతో సంతోషిస్తోంది. ఆమె ఇలా చెబుతోంది, “నా భర్త ఆర్థిక మద్దతు ఇవ్వకపోవడం వల్ల, ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొనడాన్ని కష్టతరం చేయడం వల్ల ఆయన నుండి విడిపోవాలని నాకు బలంగా అనిపించేది. నా భర్త సంఘ పెద్దగా సేవ చేసేవాడు, కానీ ఆ తర్వాత తెలివితక్కువ నిర్ణయం తీసుకొని కొన్ని వ్యాపారాల్లో అడుగుపెట్టాడు. మెల్లగా కూటాలు ఎగ్గొట్టడం మొదలుపెట్టాడు, కొన్ని రోజులకు మేమిద్దరం మాట్లాడుకోవడం కూడా మానేశాం. ఉగ్రవాదులు మా పట్టణంపై దాడి చేసినప్పుడు నేనెంతో భయపడిపోయి, నలుగురిలోకీ రావడానికి ఇష్టపడేదాన్ని కాదు. ఆ తర్వాత, నాలో కూడా తప్పు ఉందని గ్రహించాను. మేము మళ్లీ మాట్లాడుకోవడం మొదలుపెట్టాం, మళ్లీ కుటుంబ అధ్యయనం చేసుకోవడం, కూటాలకు క్రమంగా హాజరవడం కూడా మొదలుపెట్టాం. సంఘ పెద్దలు మా పరిస్థితిని అర్థం చేసుకొని, మాకు ఎంతో సహాయం చేశారు. భార్యాభర్తలుగా మళ్లీ మాకు ఒక కొత్త జీవితం ప్రారంభమయ్యింది. కొంతకాలానికి నా భర్త సంఘంలో మళ్లీ బాధ్యతలు చేపట్టడానికి అర్హుడయ్యాడు. మేము ఎంతో కష్టపడి పాఠం నేర్చుకోవాల్సి వచ్చినా, చివరికైతే మంచి ఫలితాలు వచ్చాయి.”

20, 21. వైవాహిక జీవితానికి సంబంధించి మన నిర్ణయం ఏమై ఉండాలి?

20 వివాహితులమైనా, అవివాహితులమైనా ఎల్లప్పుడూ ధైర్యంగా ఉంటూ యెహోవాపై నమ్మకం ఉంచుదాం. పెళ్లైన వాళ్లు తాము ‘ఇద్దరుకాక, ఏకశరీరముగా ఉన్నామని’ గుర్తుంచుకొని వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించుకోవడానికి తీవ్రంగా కృషిచేయాలి. (మత్త. 19:6) కష్టమైనా సరే అవిశ్వాసియైన భాగస్వామితో కలిసి ఉండడానికి పట్టువిడువకుండా కృషిచేస్తే, ఏదో ఒకరోజు వాళ్లు సత్యాన్ని అంగీకరించడం చూసి ఆనందించే అవకాశం మనకు దొరకవచ్చు.

21 మన పరిస్థితి ఏదైనప్పటికీ, అవిశ్వాసుల దృష్టిలో యెహోవా సేవకులకు మంచి పేరు వచ్చేలా మనం జాగ్రత్తగా నడుచుకోవాలని నిర్ణయించుకుందాం. వైవాహిక జీవితంలో సమస్యలు వస్తే పట్టుదలగా ప్రార్థించాలి, మన ఆలోచనలను నిజాయితీగా పరిశీలించుకోవాలి, లేఖనాలను జాగ్రత్తగా పరిశీలించాలి, సంఘ పెద్దల ఆధ్యాత్మిక సహాయం తీసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా, ప్రతీ విషయంలో యెహోవాకు సంతోషం కలిగేలా నడుచుకోవాలి, ఆయన బహుమానమైన వివాహాన్ని విలువైనదిగా ఎంచాలి.

[అధస్సూచీలు]

a తెలుగు పరిశుద్ధ గ్రంథములో ‘పోర్నియా’ అనే గ్రీకు పదాన్ని జారత్వం, వ్యభిచారం అని వివిధ రకాలుగా అనువదించారు.

b అసలు పేర్లు కావు.

c ‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’ అనే పుస్తకంలోని 251-253 పేజీలు; కావలికోట (ఆంగ్లం) నవంబరు 1, 1988 సంచికలోని 26-27 పేజీలు, సెప్టెంబరు 15, 1975 సంచికలోని 575వ పేజీ చూడండి.

[అధ్యయన ప్రశ్నలు]

[10వ పేజీలోని బ్లర్బ్‌]

సమస్యల్ని ఓపికగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించే క్రైస్తవ దంపతులు తరచూ మంచి ఫలితాలు పొందుతారు

[12వ పేజీలోని బ్లర్బ్‌]

ధైర్యం కోసం యెహోవాపై ఆధారపడండి, ఆయనపై ఎల్లప్పుడూ నమ్మకం ఉంచండి

[9వ పేజీలోని చిత్రం]

వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చినా తమ బంధాన్ని కాపాడుకోవడానికి కృషిచేసే క్రైస్తవులను యెహోవా ఆశీర్వదిస్తాడు

[11వ పేజీలోని చిత్రం]

క్రైస్తవ సంఘంలో ఊరటను, ఆధ్యాత్మిక సహాయాన్ని పొందవచ్చు