జీవిత కథ
పరిశుద్ధ సేవలో మేము తెలుసుకున్న రహస్యం
ఓలివీయే రాండ్రియమూర చెప్పినది
“దీనస్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును; ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండియుండుటకును ఆకలిగొనియుండుటకును . . . నేర్చుకొనియున్నాను. నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను.”—ఫిలి. 4:12, 13.
అపొస్తలుడైన పౌలు చెప్పిన ఆ మాటల నుండి నేనూ నా భార్య యూలీ ఇప్పటికీ ఎంతో ప్రోత్సాహాన్ని పొందుతున్నాం. మడగాస్కర్లో సేవ చేస్తున్న మేము యెహోవాపై పూర్తిగా ఆధారపడడం ద్వారా పౌలులా ఎలాంటి పరిస్థితిలోనైనా సంతోషంగా, సంతృప్తిగా ఉండే రహస్యాన్ని తెలుసుకున్నాం.
1982లో యెహోవాసాక్షులు యూలి వాళ్ల అమ్మతో బైబిలు అధ్యయనం చేయడం ప్రారంభించారు, అప్పటికే నాకు, యూలికి పెళ్లి నిశ్చయమైంది. నేను కూడా బైబిలు అధ్యయనం మొదలుపెట్టాను, కొంతకాలానికి యూలి కూడా బైబిలు అధ్యయనానికి అంగీకరించింది. 1983లో మా పెళ్లైంది, మేము 1985లో బాప్తిస్మం తీసుకుని, వెంటనే సహాయ పయినీరు సేవ మొదలుపెట్టాం. 1986 జూలైలో మేము క్రమ పయినీర్లమయ్యాం.
1987 సెప్టెంబరులో ప్రత్యేక పయినీరు సేవ చేసే నియామకాన్ని అందుకున్నాం. మొదటిగా మమ్మల్ని మడగాస్కర్లో వాయవ్య దిక్కున ఉన్న ఒక చిన్న పట్టణానికి పంపించారు, అప్పటివరకు అక్కడ సంఘమే లేదు. మడగాస్కర్లో దాదాపు 18 ముఖ్యమైన జాతులు, లెక్కలేనన్ని తెగలు ఉన్నాయి. వాళ్ల ఆచారాల్లో, సంప్రదాయాల్లో చాలా తేడా ఉంటుంది. వాళ్ల అధికారిక భాష మలగాసీ, అయినా ఆ భాషలో చాలా మాండలికాలు కూడా ఉన్నాయి. మేము మా నియామక ప్రాంతంలో మాట్లాడే మాండలికం నేర్చుకోవడం ప్రారంభించాం, దానివల్ల అక్కడి వాళ్లు మేము చెప్పేది వినడానికి సుముఖత చూపించారు.
మొదట్లో, ప్రతీ ఆదివారం నేనొక బహిరంగ ప్రసంగం ఇచ్చేవాణ్ణి, ప్రసంగం అయిపోయిన వెంటనే యూలి తన వంతుగా చప్పట్లు కొట్టేది. ఎందుకంటే ఆ కూటంలో ఉండేది మేమిద్దరమే. మేము దైవ పరిపాలనా పరిచర్య పాఠశాలలో కూడా ఏ భాగాన్నీ విడిచిపెట్టకుండా అన్నీ చేసుకునేవాళ్లం, యూలి గృహస్థురాలు ఉన్నట్లుగా ఊహించుకుని తన భాగాన్ని నిర్వహించేది. ప్రాంతీయ పర్యవేక్షకుడు మా దగ్గరకు వచ్చినప్పుడు, కూటాలు నిర్వహించడంలో కాస్త మార్పుచేసుకోమని సలహా ఇవ్వడంతో మాకు మంచిగా అనిపించింది.
అప్పట్లో తపాలా సౌకర్యం అంత బాగా లేకపోవడం వల్ల ప్రతినెలా మాకు రావాల్సిన డబ్బు సరిగ్గా అందేది కాదు. అందువల్ల మేము ఉన్నంతలోనే జీవించడం అలవాటు చేసుకున్నాం. ఒకసారి, మేమున్న ప్రాంతానికి 130 కిలోమీటర్ల దూరంలో ఒక ప్రాంతీయ సమావేశం జరుగుతోంది, అక్కడికి వెళ్లడానికి బస్సు చార్జీలకు సరిపడా డబ్బు మా దగ్గర లేదు. అప్పుడు, “మీ సమస్యలేంటో యెహోవాకు చెప్పండి, ఎంతైనా మీరు చేసేది ఆయన పనే కదా” అని తోటి సాక్షి ఇచ్చిన మంచి సలహా మాకు గుర్తొచ్చింది. దాంతో మేము ప్రార్థన చేసుకుని, నడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నాం. మేం బయలుదేరబోతుండగా, అనుకోకుండా ఒక సహోదరుడు వచ్చి బహుమానంగా మాకు కొంత డబ్బు ఇచ్చాడు, అది సరిగ్గా బస్సు చార్జీలకు సరిపోయింది.
ప్రయాణ సేవ
1991 ఫిబ్రవరిలో నన్ను ప్రయాణ పర్యవేక్షకునిగా నియమించారు. అప్పటికి మా చిన్న గుంపులో 9 మంది ప్రచారకులు ఉన్నారు, వాళ్లలో ముగ్గురు బాప్తిస్మం తీసుకున్న ప్రచారకులు.
కూటాలకు సగటున 50 మంది వచ్చేవాళ్లు. ప్రయాణ సేవ కోసం శిక్షణ పొందిన తర్వాత, మేము ఆ దేశ రాజధానియైన అంటానానారివోలో ఉన్న ఒక సర్క్యూట్లో సేవ చేశాం. 1993లో మమ్మల్ని ఆ దేశంలో తూర్పున ఉన్న మరో సర్క్యూట్కి పంపించారు. జీవన స్థితిగతుల విషయంలో అక్కడికి, అంటానానారివో నగరానికి చాలా తేడా ఉంది.సంఘాలను, మారుమూల ప్రాంతాల్లోవున్న గుంపులను సందర్శించడానికి మేము నడిచే వెళ్లేవాళ్లం. ఒక్కోసారి దట్టమైన అడవులున్న కొండల గుండా దాదాపు 145 కిలోమీటర్లు నడిచేవాళ్లం. మేము సాధ్యమైనంత తక్కువ లగేజీ తీసుకెళ్లేవాళ్లం. అప్పట్లో ప్రాంతీయ పర్యవేక్షకుడిచ్చే బహిరంగ ప్రసంగాల్లో కొన్నిసార్లు స్లైడు షో ఉండేది. కాబట్టి, ఆ సందర్భాల్లో మా లగేజీ బరువు పెరిగేది. నేను 12 వోల్టుల కార్ బ్యాటరీ మోసేవాణ్ణి, యూలి స్లైడు ప్రొజెక్టర్ పట్టుకునేది.
ఒక సంఘం నుంచి మరొక సంఘానికి వెళ్లడానికి తరచూ మేము రోజుకు దాదాపు 40 కిలోమీటర్లు ప్రయాణించేవాళ్లం. దారిపొడవునా కొండలు ఎక్కిదిగేవాళ్లం, నదులు దాటేవాళ్లం, బురదలో అతి కష్టమ్మీద నడిచేవాళ్లం. ఒక్కోసారి రోడ్డు పక్కనే పడుకునేవాళ్లం. చాలామట్టుకు రాత్రిళ్లు ఉండడానికి స్థలం కోసం ఏదైనా ఊరు చేరుకోవడానికి ప్రయత్నించేవాళ్లం. కొన్నిసార్లు మాకు ఏమాత్రం పరిచయం లేనివాళ్ల దగ్గరకు వెళ్లి మమ్మల్ని ఆ రాత్రికి వాళ్లింట్లో ఉండనివ్వమని అడిగేవాళ్లం. ఉండడానికి చోటు దొరగ్గానే వంట మొదలుపెట్టేవాళ్లం. యూలి ఎవరినైనా ఒక పాత్ర అడిగి తీసుకొని, దగ్గర్లోవున్న నదికి లేదా చెరువుకు వెళ్లి దాంతో నీళ్లు తీసుకొచ్చేది. ఈ లోగా నేను ఎవరినైనా ఒక గొడ్డలి అడిగి, వంట చేసుకోవడానికి కట్టెలు కొట్టుకొచ్చేవాడిని. ఇవన్నీ చేయడానికి చాలా సమయం పట్టేది. అప్పుడప్పుడు మేము ఒక కోడిని కొనుక్కుని, దాన్ని కోసి, శుభ్రం చేసి వండుకునేవాళ్లం.
భోజనమయ్యాక స్నానాల కోసం మరిన్ని నీళ్లు మోసుకొచ్చేవాళ్లం. కొన్నిసార్లు వంటగదిలోనే పడుకునేవాళ్లం. వర్షం వచ్చినప్పుడు పైకప్పు కారితే తడవకుండా ఉండడానికి, గోడకు ఆనుకుని నిద్రపోయేవాళ్లం.
మాకు ఆశ్రయం ఇచ్చినవాళ్లకు సాక్ష్యమివ్వడానికి మేము ఎప్పుడూ ప్రయత్నించేవాళ్లం. మేము మా గమ్యానికి చేరుకున్నాక, అక్కడ ఉన్న క్రైస్తవ సహోదర సహోదరీల ప్రేమ, ఆతిథ్యాలకు ఉబ్బితబ్బిబ్బై పోయేవాళ్లం. మా సందర్శనం పట్ల వాళ్లు మనస్ఫూర్తిగా కృతజ్ఞత వ్యక్తం చేసినప్పుడు, దారిలో మేము పడిన కష్టాలన్నీ మర్చిపోయేవాళ్లం.
సహోదరుల ఇళ్లలో ఉన్నప్పుడు, వాళ్ల ఇంటి పనుల్లో వాళ్లకు సంతోషంగా సహాయం చేసేవాళ్లం. దానివల్ల వాళ్లు మాతో కలిసి పరిచర్యకు రాగలిగేవాళ్లు. సహోదరులు ఇవ్వలేని సౌకర్యాలనుగానీ పలురకాల ఆహార పదార్థాలనుగానీ మేమెప్పుడూ ఆశించలేదు.
మారుమూల ప్రాంతాల్లోని గుంపులను సందర్శించాం
మారుమూల ప్రాంతాల్లోని గుంపులను సందర్శించడం మాకెంతో సంతోషాన్నిచ్చింది. ఆ ప్రాంతాల్లోని సహోదరులు, మేము రోజంతా బిజీగా ఉండేలా కార్యక్రమం సిద్ధం చేసి ఉంచేవాళ్లు. ‘అలసట తీర్చుకోవడానికి’ మాకు ఎప్పుడోగానీ సమయం దొరికేదికాదు. (మార్కు 6:31) ఒక ప్రాంతంలోనైతే, ఓ క్రైస్తవ జంట తమ బైబిలు విద్యార్థులందరినీ అంటే 40 మందిని తమ ఇంటికి ఆహ్వానించారు. మేము వాళ్లతో బైబిలు అధ్యయనం చేసేలా ఏర్పాట్లు చేశారు. సహోదరితో కలిసి యూలి దాదాపు 20 అధ్యయనాలు చేస్తే, నేనేమో సహోదరుడితో కలిసి మిగతా 20 చేశాను. ఒక అధ్యయనం పూర్తవ్వగానే మరొకటి ప్రారంభించాం. కొన్ని అధ్యయనాలయ్యాక కాస్సేపాగి సంఘ కూటాలు జరుపుకుని మళ్లీ అధ్యయనాలు కొనసాగించాం. అలా అధ్యయనాల పరంపర ముగిసేసరికి రాత్రి ఎనిమిది దాటివుంటుంది.
మేము ఇంకో గుంపును సందర్శించినప్పుడు ఏం జరిగిందంటే, అందరం కలిసి ఉదయాన్నే దాదాపు ఎనిమిది గంటలకు పక్క ఊరికి బయల్దేరాం. మేమందరం పాత బట్టలు వేసుకున్నాం.
అడవి గుండా చాలాసేపు ప్రయాణించి మేము అక్కడికి చేరుకునేసరికి మధ్యాహ్నం దాదాపు పన్నెండైంది. వెంటనే బట్టలు మార్చుకొని ఇంటింటి పరిచర్య మొదలుపెట్టాం. అక్కడ కొన్ని ఇల్లులే ఉన్నాయి. మేము చాలామందిమి ఉన్నాం కాబట్టి మొత్తం ఊరిని దాదాపు 30 నిమిషాల్లో పూర్తిచేశాం. ఆ తర్వాత మేము దాని పక్కనున్న మరో ఊరికి వెళ్లాం. ఆ ఊర్లో కూడా ప్రకటించాక, మేము మళ్లీ చాలా గంటలు ప్రయాణం చేసి ఇంటికి చేరుకున్నాం. అయితే, అలా గంటల తరబడి ప్రయాణించి, పరిచర్యలో ఒక్క గంట మాత్రమే గడపడం వల్ల మొదట్లో మాకు నిరాశగా అనిపించేది. కానీ, స్థానిక సాక్షులు విసుక్కోకుండా అదే ఉత్సాహాన్ని చూపించారు.టవిరనాంబోలో మారుమూల ప్రాంతంలో ఉన్న ఒక గుంపు కొండ కొన మీద ఉండేది. అక్కడ ఒక సాక్షుల కుటుంబం ఒకే గది ఉన్న ఇంట్లో ఉండేవాళ్లు. వాళ్లింటికి దగ్గర్లో ఉన్న మరో చిన్న గదిలో కూటాలు జరిగేవి. మేము సందర్శించడానికి వెళ్లినప్పుడు ఆ కుటుంబం వాళ్లు మమ్మల్ని తమ ఇంట్లో ఉండనిచ్చారు. ఆ సహోదరుడు ఒక్కసారిగా “సహోదరులారా!” అని బిగ్గరగా పిలవడం మొదలుపెట్టాడు. పక్కనున్న కొండ కొన మీద నుండి, “ఓయ్!” అని జవాబు వచ్చింది. అప్పుడు ఈ సహోదరుడు “సీ.ఓ. వచ్చేశారు!” అని మళ్లీ అరిచాడు. దాంతో, “అలాగే, వస్తున్నాం!” అని జవాబు వచ్చింది. కొద్దిసేపటికే ఆ కబురు ఇంకా దూరంగా ఉన్న వాళ్లకు కూడా చేరింది. అంతలోనే జనం పోగయ్యారు, కూటం మొదలయ్యే సరికి వంద మంది ఉన్నారు.
ప్రయాణంలో అవస్థలు
1996లో మళ్లీ మమ్మల్ని అంటనానారివోకు దగ్గర్లోని ఒక సర్క్యూట్కి పంపించారు. ఇక్కడ ఇంకో రకమైన అవస్థలు ఎదురయ్యాయి. చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లడానికి రవాణా సౌకర్యాలు సరిగా ఉండేవికావు. మేము అంటనానారివోకు దాదాపు 240 కి.మీ. దూరంలో ఉన్న బేయన్కానాలోని (బేసాకేలోని) గుంపును సందర్శించే వంతు వచ్చింది. ఒక చిన్న ట్రక్కు ఆ ఊరి వైపుగా వెళ్తుంటే, దాన్ని ఆపి డ్రైవరుతో మాట్లాడి, మేము కూడా అందులో ఎక్కాం. అప్పటికే ఆ ట్రక్కు లోపల, ట్రక్కు మీద దాదాపు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. కొంతమంది పైకప్పు ఎక్కారు, మరికొందరు వెనక వేలాడుతున్నారు.
ఎప్పటిలాగే కాసేపటికి ట్రక్కు ఆగిపోయింది, దాంతో మేము నడవడం మొదలుపెట్టాం. కాళ్లీడ్చుకుంటూ కొన్ని గంటలపాటు నడిచాక అటువైపుగా ఒక పెద్ద ట్రక్కు వచ్చింది. అప్పటికే అది ప్రయాణికులతో కిక్కిరిసిపోయి ఉంది, దానికితోడు దానిలో సామాన్లు కూడా ఉన్నాయి. అయినాసరే మమ్మల్ని చూసి ఆ డ్రైవరు ఆపాడు. నిలబడాల్సే ఉంటుందని తెలిసినా మేము అందులో ఎక్కాం. అయితే దారిలో ఒక నది ఉంది, దాని వంతెన పాడై ఉంది. దాంతో మేము మళ్లీ నడకసాగించి, ఒక చిన్న ఊరికి చేరుకున్నాం. ఆ ఊర్లో కొంతమంది ప్రత్యేక పయినీర్లున్నారు. మా సందర్శనంలో ఆ చిన్న ఊరు భాగం కాకపోయినా, పాడైన వంతెన రిపేరై ఆ దారిన ఏదో ఒక వాహనం వచ్చేంతవరకు మేము అక్కడే ఉండి వాళ్లతో కలిసి పరిచర్య చేస్తూ గడిపాం.
వారం తర్వాత ఒక వాహనం రానే వచ్చింది, దాంతో మేము
మళ్లీ మా ప్రయాణాన్ని కొనసాగించాం. ఆ రోడ్డు నిండా గతుకులే. కాబట్టి, మోకాళ్ల లోతు నీటిగుంటల్లో వాహనం ఇరుక్కుపోయినప్పుడు, మేము కిందామీదా పడి వాహనాన్ని ముందుకు తోయాల్సివచ్చింది. అలా, తెల్లవారక ముందే ఎటూకాని సమయంలో మేము ఒక చిన్న ఊరికి చేరుకున్నాం. అక్కడ నుండి వరి పొలాల గుండా నడుము లోతు బురద నీళ్లలో కాలినడకన మేము వెళ్లాల్సిన ఊరికి పయనం సాగించాం.మేము ఆ ప్రాంతానికి వెళ్లడం అదే మొదటిసారి కాబట్టి, ఆ పొలాల్లో పని చేస్తున్న కొంతమందికి సాక్ష్యమిస్తూ, స్థానిక సాక్షులు ఎక్కడ ఉంటారో అడగాలనుకున్నాం. అయితే, అక్కడ పని చేస్తున్నవాళ్లు మన సహోదరులే అని తెలుసుకొని మేము ఎంతో సంతోషించాం.
పూర్తికాల పరిచర్య చేయమని ఇతరులను ప్రోత్సహించాం
ఇన్నేళ్లలో, ఎంతోమందిని పూర్తికాల పరిచర్య చేయమని ప్రోత్సహించడం వల్ల వచ్చిన ఫలితాలను చూసి మాకు ఎంతో సంతోషం కలిగింది. ఒకసారి తొమ్మిది మంది క్రమ పయినీర్లున్న ఒక సంఘాన్ని మేము సందర్శించాం. ప్రతీ పయినీరు మరో పయినీరును తయారుచేసే లక్ష్యాన్ని పెట్టుకోవాలని ఆ తొమ్మిది మందిని మేము ప్రోత్సహించాం. ఆరు నెలల తర్వాత మళ్లీ మేము ఆ సంఘాన్ని సందర్శించే సమయానికి, అక్కడి క్రమ పయినీర్ల సంఖ్య 22కు చేరుకుంది. ఇద్దరు పయినీరు సహోదరీలు క్రమ పయినీరు సేవ మొదలు పెట్టమని సంఘ పెద్దలుగా సేవచేస్తున్న తమ తండ్రులను ప్రోత్సహించారు. దాంతో వాళ్లు పయినీరు సేవ మొదలుపెట్టారు. ఆ తర్వాత వాళ్లు, పయినీరు సేవచేయమని మరో పెద్దను ప్రోత్సహించారు. ఆయన కూడా క్రమ పయినీరు సేవ మొదలుపెట్టి, కొంతకాలానికి ప్రత్యేక పయినీరుగా నియమించబడ్డాడు. ఆ తర్వాత ఆయన ప్రాంతీయ పర్యవేక్షకుడిగా నియమించబడడంతో తన భార్యతో కలిసి ఆ సేవ చేపట్టాడు. మరి ఆ ఇద్దరు పెద్దల విషయమేమిటి? ఒకరు ప్రాంతీయ పర్యవేక్షకుడిగా, మరొకరు రాజ్యమందిర నిర్మాణ పనుల్లో స్వచ్ఛంద సేవకుడిగా సేవచేస్తున్నారు.
సొంత శక్తితో ఏమీ చేయలేమని మాకు తెలుసు కాబట్టి, యెహోవా చేస్తున్న సహాయానికి మేము రోజూ ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మేము కొన్నిసార్లు అలసిపోతాం, అనారోగ్యం పాలౌతాం. అయినా, మా పరిచర్య వల్ల వచ్చిన ఫలితాల్ని గుర్తుచేసుకున్నప్పుడు మేము ఎంతో సంతోషిస్తాం. యెహోవాయే తన పనిని ముందుకు నడిపిస్తాడు. ఆ పనిలో చిన్న వంతు కలిగివుండి ప్రత్యేక పయినీరు సేవ చేయగలుగుతున్నందుకు మేము సంతోషిస్తున్నాం. నిజంగా, మనల్ని ‘బలపర్చే’ యెహోవాపై పూర్తిగా ఆధారపడడం ద్వారా సంతోషానికి, సంతృప్తికి రహస్యాన్ని తెలుసుకున్నాం.
[6వ పేజీలోని బ్లర్బ్]
యెహోవాపై పూర్తిగా ఆధారపడడం ద్వారా సంతోషానికి, సంతృప్తికి రహస్యాన్ని తెలుసుకున్నాం
[4వ పేజీలోని మ్యాపు/చిత్రాలు]
బిగ్ రెడ్ ఐలండ్ అని పిలవబడే మడగాస్కర్ భూమ్మీదున్న నాల్గవ అతి పెద్ద ద్వీపం. ఎర్రని నేల ఉన్న ఈ ద్వీపంలో అనేక రకాల ప్రత్యేకమైన మొక్కలూ జంతువులూ ఉన్నాయి
[5వ పేజీలోని చిత్రం]
ప్రయాణాలు అతి కష్టంగా ఉండేవి
[5వ పేజీలోని చిత్రం]
బైబిలు అధ్యయనాలు చేయడమంటే మాకు ఇష్టం