‘అద్వితీయుడైన యెహోవా’ తన కుటుంబాన్ని సమకూరుస్తున్నాడు
‘అద్వితీయుడైన యెహోవా’ తన కుటుంబాన్ని సమకూరుస్తున్నాడు
‘ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోమని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.’—ఎఫె. 4:1, 3.
మీరెలా వివరిస్తారో చూడండి:
దేవుడు ఏ సంకల్పంతో ఒక ఏర్పాటు చేశాడు?
మనం ఎలా ‘ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవచ్చు’?
‘ఒకరి పట్ల ఒకరం దయ కలిగి’ ఉండడానికి ఏది సహాయం చేస్తుంది?
1, 2. భూమి విషయంలో, మానవుల విషయంలో యెహోవా సంకల్పం ఏమిటి?
కుటుంబం అనే మాట వినగానే మీకు ఏమి గుర్తుకొస్తుంది? ప్రేమానురాగాలా? సంతోషమా? ఒకే లక్ష్యాన్ని సాధించడానికి కలిసికట్టుగా పనిచేయడమా? కొత్త కొత్త విషయాల్ని నేర్చుకుంటూ, ఆలోచనల్ని పంచుకుంటూ పెరిగి పెద్దవాళ్లయ్యేందుకు తోడ్పడే నిలయమా? ఒకవేళ మీరు ప్రేమగల కుటుంబంలో పెరిగినవాళ్లైతే మీకు అవన్నీ గుర్తుకురావచ్చు. నిజానికి, కుటుంబ ఏర్పాటును ప్రారంభించింది యెహోవాయే. (ఎఫె. 3:14, 15) పరలోకంలోవున్న, భూమ్మీదున్న తన సృష్టి ప్రాణులందరూ భద్రతా భావంతో, ఒకరి పట్ల ఒకరు నమ్మకంగా, ఐక్యంగా ఉండాలన్నదే యెహోవా సంకల్పం.
2 మానవులు పాపం చేసిన తర్వాత దేవుని విశ్వవ్యాప్త కుటుంబం నుండి వేరైపోయారు, కానీ యెహోవా సంకల్ప నెరవేర్పుకు మాత్రం ఎలాంటి ఆటంకమూ ఏర్పడలేదు. ఆదాముహవ్వల సంతానంతో పరదైసు భూమి నిండి ఉండేలా యెహోవా చూస్తాడు. (ఆది. 1:28; యెష. 45:18) ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి యెహోవా అన్ని ఏర్పాట్లూ చేశాడు. అలాంటి చాలా ఏర్పాట్ల గురించి బైబిల్లోని ఎఫెసీయుల పత్రికలో ఉంది. ఆ పత్రిక ఐక్యత గురించే ఎక్కువగా మాట్లాడుతోంది. ఇప్పుడు మనం ఆ పత్రికలో నుండి కొన్ని వచనాలను పరిశీలించి, తన సృష్టిని ఐక్యం చేయాలన్న యెహోవా సంకల్ప నెరవేర్పుకు మనమెలా తోడ్పడవచ్చో చూద్దాం.
దేవుడు చేసిన ఏర్పాటు, అది చేసే పని
3. ఎఫెసీయులు 1:8-10లో ప్రస్తావించబడిన దేవుని ఏర్పాటు ఏమిటి? ఆ ఏర్పాటులోని మొదటి భాగం ఎప్పుడు మొదలైంది?
3 “మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా” అని మోషే ఇశ్రాయేలీయులతో అన్నాడు. (ద్వితీ. 6:4) యెహోవా చేసే ప్రతీ పని ఆయన సంకల్ప నెరవేర్పుకు దోహదపడుతుంది. “కాలము సంపూర్ణమైనప్పుడు,” తన సృష్టి ప్రాణులందరినీ ఐక్యం చేయడానికి దేవుడు ఒక ‘ఏర్పాటు’ చేశాడు. (ఎఫెసీయులు 1:8-10 చదవండి.) ఆ ఏర్పాటులో రెండు భాగాలు ఉన్నాయి. మొదటి భాగంగా, పరలోకంలో యేసుక్రీస్తు అధికారం కింద ఉండే అభిషిక్తుల్ని దేవుడు సమకూర్చడం మొదలుపెట్టాడు. అలా క్రీస్తుతో కలిసి పరిపాలించే వాళ్లను సమకూర్చడం సా.శ. 33 పెంతెకొస్తు రోజున మొదలైంది. (అపొ. 2:1-4) అభిషిక్తులు క్రీస్తు విమోచన క్రయధన బలి ఆధారంగా నీతిమంతులుగా తీర్చబడ్డారు కాబట్టి తాము ‘దేవుని పిల్లలుగా’ దత్తత తీసుకోబడ్డామని వాళ్లు గుర్తిస్తారు.—రోమా. 3:23, 24; 5:1; 8:15-17.
4, 5. దేవుడు తాను చేసిన ఏర్పాటులో రెండవ భాగంగా ఏమి చేస్తున్నాడు?
4 ఆ ఏర్పాటులో రెండవ భాగంగా, క్రీస్తు రాజుగా ఉండే మెస్సీయ రాజ్యం కింద భూపరదైసులో జీవించే ప్రజల్ని దేవుడు సమకూరుస్తున్నాడు. ఆ గుంపులో ప్రాథమికంగా “గొప్పసమూహము” ఉంటుంది. (ప్రక. 7:9, 13-17; 21:1-5) వెయ్యేళ్ల పరిపాలనా కాలంలో పునరుత్థానం చేయబడే కోట్లాదిమంది ఆ గొప్ప సమూహంతో కలుస్తారు. (ప్రక. 20:12, 13) పునరుత్థానం జరిగిన తర్వాత మన మధ్య ఉన్న ఐక్యతను నిరూపించుకునేందుకు ఎన్ని అవకాశాలు దొరుకుతాయో ఒక్కసారి ఆలోచించండి! వెయ్యేళ్ల పరిపాలన ముగింపులో, ‘భూమ్మీదున్న’ వాళ్లకు చివరిగా ఒక పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షలో నెగ్గిన వాళ్లు భూమ్మీద నిరంతరం జీవించేందుకు ‘దేవుని పిల్లలుగా’ దత్తత తీసుకోబడతారు.—రోమా. 8:20, 21; ప్రక. 20:7, 8.
5 దేవుడు తాను చేసిన ఏర్పాటులోని రెండు భాగాలకు సంబంధించిన పనిని అంటే పరలోకానికి వెళ్లే వాళ్లను, భూపరదైసులో జీవించే వాళ్లను సమకూర్చే పనిని ఇంకా కొనసాగిస్తున్నాడు. అయితే, ఇప్పుడు మనం వ్యక్తిగతంగా ఆ ఏర్పాటుకు ఎలా సహకరించవచ్చు?
‘ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోండి’
6. క్రైస్తవులు ఒకరితో ఒకరు సహవసించాలని లేఖనాలు ఎలా సూచిస్తున్నాయి?
6 క్రైస్తవులు అక్షరార్థంగా ఒక స్థలంలో సమకూడాలని లేఖనాలు సూచిస్తున్నాయి. (1 కొరిం. 14:23; హెబ్రీ. 10:24, 25) ఆ లేఖనాలను పాటించాలంటే, మనం ఒక చోటకు వెళ్లి సమయం గడిపితే సరిపోదు. ఎందుకంటే, ప్రజలు మార్కెట్‌కో ఆటల పోటీలు జరిగే స్థలానికో వెళ్లినప్పుడు చేసేది అదే. అయితే, నిజమైన ఐక్యతను సంపాదించుకోవడానికి మనం యెహోవా ఉపదేశాల్ని పాటిస్తూ ఆయన పరిశుద్ధాత్మ నిర్దేశాలకు అనుగుణంగా మన వ్యక్తిత్వాల్ని మలచుకోవాలి.
7. ‘ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవాలంటే’ ఏమి చేయాలి?
7 క్రీస్తు అర్పించిన విమోచన క్రయధన బలిపై విశ్వాసముంచే వాళ్లందరినీ యెహోవా నీతిమంతులుగా తీర్పు తీరుస్తూ వాళ్లలో అభిషిక్తుల్ని కుమారులుగా, వేరే గొర్రెల్ని స్నేహితులుగా అంగీకరిస్తాడు. అయినప్పటికీ ఏ నిరీక్షణ ఉన్నవాళ్లకైనా ప్రస్తుత విధానంలో భూమ్మీద జీవించినంత కాలం అభిప్రాయభేదాలు ఉండనే ఉంటాయి. (రోమా. 5:9; యాకో. 2:23) అందుకే, ‘ఒకరినొకరు సహించుకుంటూ’ ఉండమనే దైవ ప్రేరేపిత ఉపదేశం మనకు ఇవ్వబడింది. ఇంతకీ తోటి విశ్వాసులతో ఐక్యంగా ఉండడం ఎలా సాధ్యమౌతుంది? దానికోసం మనం ‘సంపూర్ణ వినయాన్ని, సాత్వికాన్ని’ పెంపొందించుకోవాలి. అంతేకాక పౌలు రాసినట్లుగా, మనం ‘సమాధానమనే బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవడానికి’ పట్టుదలగా కృషి చేయాలి. (ఎఫెసీయులు 4:1-3 చదవండి.) ఆ ఉపదేశాన్ని పాటించాలంటే దేవుని ఆత్మ ఇచ్చే నడిపింపుకు అనుగుణంగా ప్రవర్తిస్తూ ఆత్మ ఫలంలోని లక్షణాల్ని అలవర్చుకోవాలి. అవి విభేదాల్ని తొలగించుకోవడానికి సహాయం చేస్తాయి. కానీ, శరీర కార్యాలైతే ఎప్పుడూ విభేదాల్నే పెంచుతాయి.
8. శరీర కార్యాలు ఐక్యతను ఎలా దెబ్బతీస్తాయి?
8 ‘శరీర కార్యాలు’ ఐక్యతను ఎలా దెబ్బతీస్తాయో గమనించండి. (గలతీయులు 5:19-21 చదవండి.) జారత్వానికి పాల్పడే వ్యక్తి యెహోవాకు, సంఘానికి దూరమౌతాడు. అంతేకాక, వ్యభిచారం కారణంగా కుటుంబం విచ్ఛిన్నమై పిల్లలు తల్లిదండ్రులకు దూరమౌతారు. అలాగే, తప్పు చేయని భాగస్వామి తన భర్త లేదా భార్య నుండి విడిపోవాల్సి రావచ్చు. అపవిత్రత వల్ల ఒక వ్యక్తి దేవునితో, తనను ప్రేమించేవాళ్లతో సమాధానంగా ఉండలేడు. ఎందుకంటే, ఏవైనా రెండింటిని గట్టిగా అతికించాలంటే, అతుక్కోవాల్సిన భాగాలు శుభ్రంగా ఉండాలి. లెక్కలేనితనం కనబరిచే వ్యక్తికి దేవుని నీతియుక్తమైన నియమాల పట్ల అసలేమాత్రం గౌరవం ఉండదు. ఆ వచనంలో ప్రస్తావించబడిన మిగతా శరీర కార్యాలు కూడా ఒక వ్యక్తిని దేవునికి, ఇతరులకు దూరం చేస్తాయి. అలాంటి ప్రవర్తన యెహోవా వ్యక్తిత్వానికి పూర్తిగా భిన్నమైనది.
9. ‘సమాధానమనే బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడడానికి’ మనం పట్టుదలగా కృషి చేస్తున్నామో లేదో ఎలా తెలుసుకోవచ్చు?
9 కాబట్టి, మనలో ప్రతీ ఒక్కరం ఈ ప్రశ్నలు వేసుకోవాలి, “నేను ‘సమాధానమనే బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడడానికి’ ఎంత పట్టుదలగా కృషి చేస్తున్నాను? సమస్యలు వచ్చినప్పుడు నేనెలా స్పందిస్తాను? సమస్యకు కారణం నేను కాదనే విషయానికి మద్దతు పలుకుతారనే ఆశతో నా సమస్య గురించి పది మందికీ చెబుతానా? అవతలి వ్యక్తితో సమాధానపడేందుకు అసలేమాత్రం ప్రయత్నించకుండా సంఘ పెద్దలు నా తరఫున జోక్యం చేసుకోవాలని ఆశిస్తానా? నా మీద ఎవరికైనా విరోధం ఉందని తెలిస్తే, సమస్య గురించి వాళ్లతో మాట్లాడే బదులు నేను వాళ్లకు సాధ్యమైనంత దూరంగా ఉంటానా?” ఒకవేళ మనం అలా ప్రవర్తిస్తే, క్రీస్తునందు మళ్లీ అందరినీ సమకూర్చాలనే యెహోవా సంకల్పానికి తగినట్లుగా నడుచుకుంటున్నామని చూపిస్తామా?
10, 11. (ఎ) మన సహోదరులతో సమాధానంగా ఉండడం ఎంత ప్రాముఖ్యం? (బి) మనం ఏమి చేస్తే సమాధానకరమైన వాతావరణానికి దోహదపడి మెండైన ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు పొందుతాం?
10 యేసు ఇలా చెప్పాడు, ‘నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీమీద నీ సహోదరునికి విరోధమేమైననుకలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినయెడల అక్కడ బలిపీఠము నెదుటనే నీ యర్పణము విడిచిపెట్టి, మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము; అటు తరువాత వచ్చి నీ యర్పణము నర్పింపుము. నీవు త్వరగా వానితో సమాధానపడుము.’ (మత్త. 5:23-25) యాకోబు ఇలా రాశాడు, “నీతిఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును.” (యాకో. 3:17, 18) కాబట్టి, ఇతరులతో సమాధానపడకపోతే నీతియుక్తమైన ప్రవర్తనను కలిగివుండలేము.
11 ఉదాహరణకు, యుద్ధాలు జరిగిన కొన్ని దేశాల్లో మందుపాతర్లు ఎప్పుడు పేలతాయో, ఎక్కడ పేలతాయో అనే భయం లేకపోతే, రైతులు ప్రస్తుతం సాగుచేస్తున్న దానికన్నా 35 శాతం ఎక్కువ నేలను సాగుచేయగలుగుతారు. సాధారణంగా మందుపాతర పేలినప్పుడు, రైతులు ఆ నేలను వ్యవసాయానికి ఉపయోగించడం మానేస్తారు. దానివల్ల, పల్లెటూళ్లలో ప్రజలకు పని లేకుండా పోతుంది, నగరాల్లో ఆహారం దొరకకుండా పోతుంది. అలాగే, సహోదరులతో సమాధానాన్ని దెబ్బతీసే లక్షణాలు మనలో ఉంటే మనం ఆధ్యాత్మికంగా ఎదగలేము. కానీ, క్షమించడానికి సిద్ధంగా ఉండడం ద్వారా, ఇతరుల బాగోగుల కోసం కృషి చేయడం ద్వారా మనం సమాధానకరమైన వాతావరణానికి దోహదపడవచ్చు, మెండైన ఆశీర్వాదాలు పొందవచ్చు.
12. ఐక్యంగా ఉండడానికి సంఘ పెద్దలు మనకెలా సహాయం చేస్తారు?
12 ‘మనుష్యుల్లో ఈవుల’ వల్ల కూడా సంఘంలో నిజమైన సమాధానం నెలకొంటుంది. మనమందరం ‘విశ్వాసం విషయంలో ఏకత్వం’ పొందేందుకు సహాయం చేసేలా యెహోవా వాళ్లను మనకు ఇచ్చాడు. (ఎఫె. 4:8, 11, 12) సంఘ పెద్దలు పరిశుద్ధ సేవలో మనతో కలిసి పనిచేస్తున్నప్పుడు మనం మెరుగుపర్చుకోవాల్సిన విషయాల గురించి దేవుని వాక్యం ఆధారంగా సలహాలు ఇవ్వడం ద్వారా నూతన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకునేందుకు వాళ్లు మనకు సహాయం చేస్తారు. (ఎఫె. 4:22-24) తన కుమారుడైన యేసు పరిపాలన కింద ఉండే నూతనలోకంలో జీవించేలా మనల్ని సిద్ధం చేయడానికి యెహోవా సంఘ పెద్దల్ని ఉపయోగించుకుంటున్నాడని గుర్తుంచుకోండి. సంఘ పెద్దలారా, మీరు ఆ విషయాన్ని మనసులో ఉంచుకొని సహోదర సహోదరీలను సరిదిద్దడానికి ప్రయత్నిస్తున్నారా?—గల. 6:1.
‘ఒకరిపట్ల ఒకరు దయ కలిగి ఉండండి’
13. ఎఫెసీయులు 4:25-32 వచనాల్లోని ఉపదేశాన్ని పాటించకపోతే ఏమి జరుగుతుంది?
13 మనం వేటి వేటికి దూరంగా ఉండాలో ఎఫెసీయులు 4:25-29లో చెప్పబడింది. అబద్ధాలు ఆడకూడదని, కోపిష్ఠులుగా గానీ సోమరులుగా గానీ ఉండకూడదని, చెడ్డ మాటలు మాట్లాడకూడదని ఆ లేఖనం చెబుతోంది. అంతేకాక, ఇతరులకు మేలు కలిగేలా ప్రోత్సాహకరమైన మాటలు మాట్లాడాలని కూడా అది చెబుతోంది. ఒకవేళ మనం ఆ లేఖనాన్ని పాటించకపోతే ఐక్యతను పెంపొందించే దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తాం. (ఎఫె. 4:30) సహోదర సహోదరీలతో సమాధానంగా, ఐక్యంగా ఉండాలంటే పౌలు ఆ తర్వాతి వచనాల్లో రాసిన ఈ మాటలను కూడా పాటించడం ప్రాముఖ్యం, “సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి.”—ఎఫె. 4:31, 32.
14. (ఎ) ‘దయ కలిగి ఉండాలి’ అనే మాటలు ఏమి సూచిస్తున్నాయి? (బి) మనం దయగా వ్యవహరించడానికి ఏది సహాయం చేస్తుంది?
14 ‘దయ కలిగి ఉండాలి’ అనే మాట, దయ చూపించడంలో కాస్త కొరవడుతున్నామని, ఆ విషయంలో మనం మెరుగవ్వాలని సూచిస్తోంది. కాబట్టి మన భావాల కన్నా ఇతరుల భావాలకు ప్రాముఖ్యతనిచ్చేలా మనకు మనం శిక్షణ ఇచ్చుకోవడం ఎంత సముచితమో కదా! (ఫిలి. 2:4) కొన్నిసార్లు మనం అనాలనుకుంటున్న మాట నలుగురినీ నవ్వించవచ్చేమో లేదా మన తెలివిని ప్రదర్శించవచ్చేమో కానీ, ఆ మాట మాట్లాడితే దయ చూపించినట్లౌతుందా? మాట్లాడే ముందు కాస్త ఆలోచిస్తే మనం ‘దయ’ చూపించగలుగుతాం.
ప్రేమ, గౌరవం చూపించడం ఇంట్లోనే నేర్చుకోవాలి
15. క్రీస్తు సంఘంతో వ్యవహరించిన తీరులో ఏ అంశం గురించి పౌలు ఎఫెసీయులు 5:28లో చెప్పాడు?
15 క్రీస్తుకు సంఘంతో ఉన్న బంధాన్ని భర్తకు భార్యతో ఉండే బంధంతో బైబిలు పోలుస్తోంది. తన భార్యపై ప్రేమ, శ్రద్ధ చూపిస్తూ ఆమెకు సరైన నిర్దేశాన్ని ఇవ్వాలని భర్త అర్థంచేసుకోవడానికి, అలాగే తన భర్తకు లోబడి ఉండాలని భార్య అర్థంచేసుకోవడానికి క్రీస్తు మాదిరి భార్యాభర్తలకు సహాయం చేస్తుంది. (ఎఫె. 5:22-33) “అటువలెనే పురుషులు కూడ తమ సొంతశరీరములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు” అని పౌలు రాశాడు. ఇక్కడ పౌలు “అటువలెనే” అన్న మాటను ఎందుకు ఉపయోగించాడు? (ఎఫె. 5:28) ఎందుకంటే, క్రీస్తు సంఘాన్ని ప్రేమించి, ‘వాక్యంతో ఉదకస్నానము చేత దాన్ని పరిశుద్ధపరచి, దాని కొరకు తన్నుతాను అప్పగించుకున్నాడు’ అని పౌలు ముందటి వచనాల్లో రాశాడు. కాబట్టి, క్రీస్తునందు అందరినీ మళ్లీ సమకూర్చాలనే యెహోవా సంకల్పానికి అనుగుణంగా నడుచుకోవాలంటే ఒక భర్త తన కుటుంబాన్ని ఆధ్యాత్మికంగా పోషించేందుకు సంసిద్ధంగా ఉండాలి.
16. దేవుడు ఇచ్చిన బాధ్యతల్ని తల్లిదండ్రులు ఇంట్లో నిర్వర్తిస్తే ఎలాంటి ఫలితం వస్తుంది?
16 యెహోవా అప్పగించిన ఒక బాధ్యతను తాము నిర్వర్తిస్తున్నామని తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి. విచారకరంగా, నేటి లోకంలో చాలామంది ‘అనురాగం’ చూపించడం లేదు. (2 తిమో. 3:1, 3) చాలామంది తండ్రులు తమ బాధ్యతల్ని గాలికొదిలేస్తున్నారు. అది పిల్లలకు దుఃఖాన్ని మిగులుస్తోంది, వాళ్లకు హాని చేస్తోంది. కానీ పౌలు క్రైస్తవ తండ్రులకు ఈ ఉపదేశాన్నిచ్చాడు, “తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.” (ఎఫె. 6:4) ప్రేమ చూపించడం, అధికారం పట్ల గౌరవాన్ని చూపించడం పిల్లలు నేర్చుకునేది ఇంట్లోనే. పిల్లలకు అవి నేర్పించిన తల్లిదండ్రులు నిజంగా యెహోవా ఏర్పాటుకు తగిన విధంగా నడుచుకున్నారని చెప్పవచ్చు. తల్లిదండ్రులు ఇంట్లో కోపావేశాలకు, నొచ్చుకునే మాటలకు తావివ్వకుండా ప్రేమ చూపిస్తే అధికారాన్ని ఎలా గౌరవించాలో, ప్రేమను ఎలా చూపించాలో పిల్లలకు నేర్పించవచ్చు. అది, దేవుని నూతనలోకంలో ఉండే జీవితానికి వాళ్లను సిద్ధం చేస్తుంది.
17. సాతానును ఎదిరించాలంటే మనకేమి అవసరం?
17 విశ్వవ్యాప్త ఐక్యతకు మొట్టమొదటిగా భంగం కలుగజేసిన అపవాది, ఇప్పుడు దేవుని చిత్తం చేయాలనే మన ప్రయత్నాల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాడని మనం గుర్తించాలి. లోకంలో ప్రస్తుతం సాతాను కోరుకున్నట్లుగానే జరుగుతోంది. ఎందుకంటే, విడాకులు తీసుకునేవాళ్ల సంఖ్య పెరుగుతోంది, పెళ్లితో వచ్చే బాధ్యతల్ని మోయడం కన్నా సహజీవనం చేయడమే మంచిదని ప్రజలు అనుకుంటున్నారు, స్వలింగ సంపర్కుల పెళ్లిళ్లను ప్రజలు ఆమోదిస్తున్నారు. అయితే మనం, ప్రస్తుత సమాజంలోని ప్రజల ప్రవర్తనను, వైఖరులను అనుకరించం. కానీ క్రీస్తునే ఆదర్శంగా తీసుకుంటాం. (ఎఫె. 4:17-21) సాతానును, అతని దయ్యాలను విజయవంతంగా ఎదిరించాలంటే మనం ‘దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించాలి’ అని బైబిలు ఉపదేశిస్తోంది.—ఎఫెసీయులు 6:10-13 చదవండి.
‘ప్రేమ కలిగి నడుచుకుంటూ’ ఉండండి
18. క్రైస్తవ ఐక్యతకు కీలకమైనది ఏమిటి?
18 క్రైస్తవ ఐక్యతకు కీలకమైనది ప్రేమే. ‘ఒకే ప్రభువు’ పట్ల, ‘ఒకే దేవుని’ పట్ల, పొరుగువారిపట్ల ఉన్న ప్రేమను బట్టి మనం ‘సమాధానమనే బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవాలి’ అనే దృఢ నిశ్చయంతో ఉన్నాం. (ఎఫె. 4:3-6) యేసు అలాంటి ప్రేమ గురించి ఇలా ప్రార్థించాడు, “తండ్రీ, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున, వారును మనయందు ఏకమైయుండవలెనని వారికొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు; వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచు వారందరును ఏకమైయుండవలెనని వారికొరకును ప్రార్థించుచున్నాను. నీవు నాయందు ఉంచిన ప్రేమ వారియందు ఉండునట్లును, నేను వారియందు ఉండునట్లును, వారికి నీ నామమును తెలియజేసితిని, ఇంకను తెలియజేసెదను.”—యోహా. 17:20, 21, 26.
19. మీరు ఏమి చేయాలనే కృత నిశ్చయంతో ఉన్నారు?
19 అపరిపూర్ణత కారణంగా మన వ్యక్తిత్వంలో ఏదైనా ఒకదాన్ని మార్చుకోవడం కష్టమనిపిస్తుంటే, కీర్తనకర్తలా దేవునికి ఇలా ప్రార్థించేందుకు ప్రేమ మనల్ని పురికొల్పాలి, “నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము.” (కీర్త. 86:11) ప్రేమగల మన పరలోక తండ్రి నుండి, ఆయన అంగీకరించే ప్రజల నుండి మనల్ని దూరం చేయడానికి అపవాది చేస్తున్న ప్రయత్నాలను ఎదిరిస్తూ ఉండాలని దృఢంగా నిశ్చయించుకుందాం. కుటుంబంలో, పరిచర్యలో, సంఘంలో మనం ‘ప్రియులైన పిల్లలవలే దేవుని పోలి నడుచుకోవడానికి, ప్రేమ కలిగి నడుచుకుంటూ’ ఉండడానికి పట్టుదలతో కృషిచేద్దాం.—ఎఫె. 5:1, 2.
[అధ్యయన ప్రశ్నలు]
[29వ పేజీలోని చిత్రం]
బలిపీఠం దగ్గరే తన అర్పణను వదిలేసి ఆయన తోటి సహోదరునితో సమాధానపడేందుకు వెళ్తున్నాడు
[31వ పేజీలోని చిత్రం]
తల్లిదండ్రులారా, ఇతరులను ఎలా గౌరవించాలో మీ పిల్లలకు నేర్పించండి