తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు ఈక్వెడార్‌లో
తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు ఈక్వెడార్‌లో
ఇటలీకి చెందిన యౌవన సహోదరుడు బ్రూనో హైస్కూల్ విద్యలో టాపర్‌గా నిలిచినప్పుడు ఆయన బంధువులు, టీచర్లు ఆయనను ఇంకా పైచదువులు చదవమని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. అయితే అప్పటికి కొన్ని సంవత్సరాల క్రితమే ఆయన, తన జీవితంలో యెహోవా సేవకే మొదటిస్థానం ఇస్తానని ప్రమాణం చేస్తూ యెహోవాకు సమర్పించుకున్నాడు. మరి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నాడు? “నా సమర్పణకు తగినట్లు జీవిస్తానని, తన సేవకే మొదటిస్థానం ఇస్తానని నేను ప్రార్థనలో యెహోవాకు చెప్పాను. తన సేవలో జీవితం బోర్ కొట్టించేదిగా ఉండకుండా, వివిధ రకాల కార్యకలాపాలతో నిండివుండాలని నేను యెహోవాను నిర్మొహమాటంగా అడిగాను” అని ఆయన వివరించాడు.
కొన్ని సంవత్సరాల తర్వాత బ్రూనో దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్‌కు వెళ్లాడు. ఆయనిలా చెప్పాడు, “యెహోవా నేను అడిగిన దానికన్నా ఎక్కువే ఇచ్చాడు.” అక్కడకు వెళ్లేసరికి చాలామంది యౌవనస్థులు అక్కడ ఉండడం చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. వాళ్లు కూడా సాధ్యమైనంత ఎక్కువగా యెహోవా సేవ చేయడానికే అక్కడికి వచ్చారు.
యెహోవాపై నమ్మకం ఉంచే యౌవనులు
వేలాదిమంది ఇతర యౌవనస్థుల్లాగే బ్రూనో కూడా యెహోవా చేసిన ఈ వాగ్దానంపై నమ్మకం ఉంచాడు, “మీరు నన్ను శోధించినయెడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదను.” (మలా. 3:10) ఆ యౌవనస్థులు దేవునిపై ప్రేమతో, రాజ్య ప్రచారకుల అవసరం ఎక్కువగా ఉన్న ఒక దేశంలో సేవ చేయడానికి తమ సమయాన్ని, శక్తిని, వనరుల్ని ఉపయోగించి దేవుణ్ణి ‘శోధించాలని’ నిర్ణయించుకున్నారు.
సాధారణంగా అలాంటివాళ్లు కొత్త ప్రదేశానికి చేరుకున్న కొన్ని రోజులకే ‘కోత విస్తారంగా ఉందిగాని పనివాళ్లు కొద్దిమందే ఉన్నారు’ అని గ్రహిస్తారు. (మత్త. 9:37) ఉదాహరణకు, జర్మనీ నుండి వచ్చిన యాక్లీన్ అనే సహోదరి, “నేను ఈక్వెడార్‌కు వచ్చి రెండు సంవత్సరాలే దాటాయి. కానీ నేను ఇప్పటికే 13 బైబిలు అధ్యయనాలు నిర్వహిస్తున్నాను, వాళ్లలో నలుగురు కూటాలకు క్రమంగా వస్తున్నారు. ఎంత గొప్ప విషయమో కదా!” అని స్థానిక బ్రాంచి కార్యాలయానికి ఉత్సాహంగా రాసింది. కెనడా నుండి వచ్చిన షాంటెల్ ఇలా చెబుతోంది, “నేను 2008లో ఈక్వెడార్ తీరానవున్న ఒక ప్రాంతానికి వెళ్లాను. అప్పుడు అక్కడ ఒకే సంఘం ఉండేది కానీ ఇప్పుడు 3 సంఘాలు ఉన్నాయి, 30 కన్నా ఎక్కువమంది పయినీర్లు ఉన్నారు. చాలామంది కొత్తవాళ్లు ముందుకు రావడాన్ని చూడడం కన్నా సంతోషకరమైన విషయం మరేదీ ఉండదు. నేను ఇటీవలే ఆండీస్ పర్వతాలపై 9,000 అడుగుల (2,743 మీటర్ల) ఎత్తులోవున్న ఒక పట్టణానికి వచ్చాను. ఇక్కడి జనాభా 75,000 కన్నా ఎక్కువే కానీ ఒకే సంఘం ఉంది. చాలామంది సత్యం పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. నేనెంతో సంతోషంగా పరిచర్య చేస్తున్నాను.”
అది అన్నిసార్లూ అంత సులభం కాదు
వేరే దేశానికి వెళ్లి అక్కడ సేవచేయడం అన్నిసార్లూ అంత సులభం కాదు. కొంతమంది యౌవనస్థులు అలా వేరే దేశానికి వెళ్లడానికి ముందు కూడా ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నారు. అమెరికా నుండి వచ్చిన కేలా ఇలా చెబుతోంది, “సదుద్దేశం గల కొంతమంది సహోదరులు వెళ్లొద్దని చెప్పినప్పుడు నేను నిరుత్సాహపడ్డాను. పయినీరు సేవ చేయడానికి నేను ఎందుకు విదేశానికి వెళ్లాలనుకుంటున్నానో వాళ్లకు అర్థం కాలేదు. దానివల్ల, ‘నేను సరైన నిర్ణయమే తీసుకుంటున్నానా?’ అని నాకు కొన్నిసార్లు అనిపించేది.” అయినాసరే కేలా వెళ్లాలనే నిర్ణయించుకుంది. ఆమె ఇలా వివరిస్తోంది, “నేను ఈ విషయం గురించి ఎన్నోసార్లు యెహోవాకు ప్రార్థించి పరిణతి గల సహోదర సహోదరీలతో ఎంతోసేపు మాట్లాడడం వల్ల, ఇష్టపూర్వకంగా ముందుకు వచ్చేవాళ్లను యెహోవా ఆశీర్వదిస్తాడని గ్రహించాను.”
ఎంతోమందికి కొత్త భాష నేర్చుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఐర్లాండ్ నుండి వచ్చిన షేబోన్ ఇలా గుర్తుచేసుకుంటోంది, “నేను చెప్పాలనుకున్న విషయాల్ని ఆ భాషలో సరిగ్గా చెప్పలేకపోవడం నాకు ఎంతో బాధ కలిగించేది. ఓపిక చూపించడం, ఆ భాష నేర్చుకోవడానికి పట్టుదలతో ప్రయత్నించడం, నేను మాట్లాడుతున్నప్పుడు ఏమైనా తప్పులు దొర్లితే నవ్వుకోవడం నేర్చుకున్నాను.” ఎస్టోనియా నుండి వచ్చిన ఆన్నా ఇలా అంటోంది, “స్పానిష్ భాష నేర్చుకోవడంతో పోలిస్తే ఉష్ణమండల వేడికి, దుమ్మూధూళికి, వేణ్ణీళ్ల కొరతకు అలవాటుపడడం ఏమంత కష్టం కాలేదు. కొన్నిసార్లు, తిరిగి వెళ్లిపోదాం అనిపించేది. నేను మాట్లాడుతున్నప్పుడు భాషలో దొర్లే తప్పుల మీద కాక నేను సాధించిన ప్రగతి మీద దృష్టిపెట్టడం నేర్చుకున్నాను.”
ఇంటిమీద బెంగ పెట్టుకోవడం మరో ఆటంకం. అమెరికా నుండి వచ్చిన జోనథన్ ఇలా చెబుతున్నాడు, “ఇక్కడికి వచ్చిన కొత్తలో నా కుటుంబం, స్నేహితులు దగ్గర లేనందుకు నేను చాలా నిరుత్సాహపడ్డాను. కానీ వ్యక్తిగత బైబిలు అధ్యయనం చేస్తూ, పరిచర్యలో ఎక్కువగా గడపడం వల్ల నేను నిరుత్సాహాన్ని అధిగమించాను. కొంతకాలానికే పరిచర్యలో మంచి అనుభవాలు ఎదురవడం వల్ల, సంఘంలో కొత్త స్నేహితుల్ని సంపాదించుకోవడం వల్ల నేను నా ఆనందాన్ని తిరిగి పొందగలిగాను.”
మరో ఆటంకం ఏమిటంటే వేరే దేశంలోని జీవన విధానానికి
అలవాటుపడడం. అక్కడి పరిస్థితులు స్వదేశంలోని పరిస్థితుల్లా ఉండకపోవచ్చు. కెనడా నుండి వచ్చిన బో ఇలా చెబుతున్నాడు, “కెనడాలోనైతే విద్యుత్తు సరఫరా, నీటి సరఫరా వంటి కనీస సదుపాయాలు ఎప్పుడూ ఉంటాయి కాబట్టి వాటి గురించి అసలు ఆలోచించం. కానీ ఇక్కడైతే అవి ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు ఉండవో చెప్పలేం.” అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పేదరికం, అసౌకర్యమైన రవాణా విధానాలు, నిరక్షరాస్యత వంటివి కూడా సర్వసాధారణం. ఆస్ట్రియా నుండి వచ్చిన ఈనెస్ స్థానిక ప్రజల మంచి లక్షణాలపైనే దృష్టినిలపడం వల్ల అలాంటి పరిస్థితుల్ని తాళుకోగలుగుతోంది. ఆమె ఇలా చెబుతోంది, “వాళ్లు అతిథిప్రియులు, సౌమ్యులు, వినయస్థులు, ఇతరులకు సహాయం చేయడానికి ముందుంటారు. అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్లకు దేవుని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనే ఆసక్తి ఎంతో ఉంది.”‘పట్టజాలనంత విస్తారమైన దీవెనలు’
ఎన్నో త్యాగాలు చేసి ఈక్వెడార్‌లో సేవచేస్తున్న ఈ యౌవనస్థులందరూ, తాము ఊహించే దానికన్నా “అత్యధికముగా” యెహోవా ఇస్తాడని గ్రహించారు. (ఎఫె. 3:20) నిజానికి, “పట్టజాలనంత విస్తారముగా దీవెనలు” పొందామని వాళ్లు భావిస్తున్నారు. (మలా. 3:10) తమ పరిచర్య గురించి వాళ్లు ఏమనుకుంటున్నారో చూడండి:
బ్రూనో: “నేను ఈక్వెడార్‌కు వచ్చినప్పుడు అద్భుతమైన అమెజాన్ నది పరిసర ప్రాంతంలో నా సేవ ప్రారంభించాను. ఆ తర్వాత ఈక్వెడార్ బ్రాంచి విస్తరణ పనిలో సహాయం చేశాను. ఇప్పుడు నేను బెతెల్‌లో సేవచేస్తున్నాను. అంతకుముందు నేను ఇటలీలో ఉన్నప్పుడు యెహోవా సేవకే మొదటిస్థానం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను, ఆయన సేవలో జీవితం బోర్ కొట్టించేదిగా ఉండకుండా, వివిధ రకాల కార్యకలాపాలతో నిండివుండాలన్న నా కోరికను ఆయన నిజంగా తీరుస్తున్నాడని చెప్పవచ్చు.”
బో: “నేనిక్కడ ఆధ్యాత్మిక కార్యకలాపాలకే నా సమయాన్నంతటినీ వెచ్చించగలుగుతున్నందుకు యెహోవాకు ఇంకా ఎక్కువ దగ్గరయ్యాను. అంతేగాక, సుందరమైన ప్రదేశాలకు వెళ్లే గొప్ప అవకాశం కూడా దొరికింది. అలాంటి ప్రదేశాలకు వెళ్లాలని నేను ఎప్పుడూ కోరుకునేవాణ్ణి.”
ఆన్నా: “అవివాహితురాలిగా ఉన్న నేను మిషనరీ జీవితాన్ని ఆనందించడం సాధ్యమౌతుందని అస్సలు అనుకోలేదు. కానీ అది సాధ్యమేనని నాకు ఇప్పుడు అర్థమైంది. యెహోవా దీవెనల వల్ల నేను శిష్యులను చేసే పనిలో, రాజ్యమందిరాల నిర్మాణ పనిలో, కొత్త స్నేహితుల్ని సంపాదించుకోవడంలో ఎంతో ఆనందిస్తున్నాను.”
ఎల్కా: “నా స్వదేశమైన ఆస్ట్రియాలో ఉన్నప్పుడు కనీసం ఒక్క బైబిలు అధ్యయనమైనా దయచేయమని యెహోవాను ఎంతో వేడుకొనేదాన్ని. కానీ ఇక్కడైతే నాకు 15 బైబిలు అధ్యయనాలు ఉన్నాయి! ప్రగతి సాధిస్తున్న విద్యార్థుల ముఖాల్లో కనిపించే సంతోషాన్ని చూస్తే నాకెంతో సంతృప్తిగా ఉంటుంది.”
జోయెల్: “యెహోవా సేవ చేయడానికి కొత్త ప్రదేశానికి రావడం గొప్ప అనుభూతినిస్తుంది! ఆయనపై ఎక్కువగా ఆధారపడడం నేర్చుకుంటాం. మన ప్రయత్నాలను ఆయన ఆశీర్వదించడాన్ని చూడడం ఉత్తేజకరంగా ఉంటుంది. అమెరికా నుండి వచ్చిన మొదటి సంవత్సరంలో నేను సేవ చేస్తున్న గ్రూపులో ఆరుగురు ఉండేవాళ్లు, ఇప్పుడు 21 మంది ఉన్నారు. జ్ఞాపకార్థ ఆచరణకు 110 మంది హాజరయ్యారు.”
మీ విషయం ఏమిటి?
యువ సహోదర సహోదరీల్లారా, రాజ్యప్రచారకుల అవసరం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లి సేవ చేసేందుకు మీ పరిస్థితులు అనుకూలిస్తాయేమో ఆలోచించండి. అయితే అలాంటి పెద్ద నిర్ణయం తీసుకోవాలంటే చాలా జాగ్రత్తగా ఆలోచించి ప్రణాళిక వేసుకోవాలి. అన్నింటికన్నా ముఖ్యంగా యెహోవాపై, పొరుగువాళ్లపై లోతైన ప్రేమ ఉండాలి. మీకు అలాంటి ప్రేమ ఉండి మీరు వెళ్లగలిగే స్థితిలో ఉంటే గనుక, విదేశాల్లో సేవ చేయడం గురించి యెహోవాకు పట్టుదలగా ప్రార్థించండి. అంతేగాక మీ క్రైస్తవ తల్లిదండ్రులతో, సంఘ పెద్దలతో మీ కోరిక గురించి మాట్లాడండి. అప్పుడు మీరు కూడా సంతృప్తినిచ్చే పవిత్ర సేవలోని ఈ రంగంలో సేవ చేయాలని నిర్ణయించుకోగలుగుతారు.
[3వ పేజీలోని బ్లర్బ్]
“నేను ఈ విషయం గురించి ఎన్నోసార్లు యెహోవాకు ప్రార్థించి పరిణతి గల సహోదర సహోదరీలతో ఎంతోసేపు మాట్లాడడం వల్ల, ఇష్టపూర్వకంగా ముందుకు వచ్చేవాళ్లను యెహోవా ఆశీర్వదిస్తాడని గ్రహించాను.”—అమెరికా నుండి వచ్చిన కేలా
[6వ పేజీలోని బాక్సు/చిత్రం]
విదేశాల్లో సేవ చేయడానికి ఎలా సిద్ధపడవచ్చు?
• మంచి వ్యక్తిగత అధ్యయన అలవాట్లను పెంపొందించుకోండి
• మన రాజ్య పరిచర్య ఆగస్టు 2011 సంచికలోని 4-6 పేజీలను చదవండి
• ఇప్పటికే విదేశాల్లో సేవ చేసిన వాళ్లతో మాట్లాడండి
• ఆ దేశ సంస్కృతి గురించి, దాని చరిత్ర గురించి తెలుసుకోండి
• ముందుగానే ఆ దేశ భాష కొంత నేర్చుకోండి
[6వ పేజీలోని బాక్సు/చిత్రం]
విదేశాల్లో సేవ చేసే కొంతమంది తమ ఆర్థిక అవసరాలను ఎలా తీర్చుకుంటారంటే . . .
• ప్రతీ సంవత్సరం స్వదేశానికి వెళ్లి కొన్ని నెలలపాటు పనిచేసి తిరిగి వస్తారు
• తమ ఇంటిని అద్దెకు ఇస్తారు
• తమ వ్యాపారాన్ని లీజుకు ఇస్తారు
• ఇంటర్నెట్ ద్వారా ఏదైనా పని చేస్తారు
[4, 5 పేజీల్లోని చిత్రాలు]
1 జర్మనీ నుండి వచ్చిన యాక్లీన్
2 ఇటలీ నుండి వచ్చిన బ్రూనో
3 కెనడా నుండి వచ్చిన బో
4 ఐర్లాండ్ నుండి వచ్చిన షేబోన్
5 అమెరికా నుండి వచ్చిన జోయెల్
6 అమెరికా నుండి వచ్చిన జోనథన్
7 ఎస్టోనియా నుండి వచ్చిన ఆన్నా
8 ఆస్ట్రియా నుండి వచ్చిన ఎల్కా
9 కెనడా నుండి వచ్చిన షాంటెల్
10 ఆస్ట్రియా నుండి వచ్చిన ఈనెస్