కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“నా కల నెరవేరింది”

“నా కల నెరవేరింది”

“నా కల నెరవేరింది”

పదిహేనేళ్ల క్రితం ఎమీల్య క్రమ పయినీరుగా సేవ చేసేది. అయితే, ఆమె పూర్తికాల సేవ ఆపేయాల్సి వచ్చింది. తన జీవితంలో పూర్తికాల సేవ చేసిన సంవత్సరాల్లో పొందిన సంతోషం గురించి ఇటీవల ఆమె తరచూ ఆలోచించి, పరిచర్యలో మళ్లీ ఎక్కువగా పాల్గొనాలని కోరుకుంది.

ఎమీల్య ఉద్యోగానికే ఎక్కువ సమయం వెచ్చించాల్సి వచ్చేది, దాంతో ఆమెకు సంతోషం కరువైంది. “నేను తక్కువ గంటలు పని చేయగలిగితే బావుండు” అంటూ ఒకసారి ఆమె తన తోటి ఉద్యోగస్థుల ముందు ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె పైఅధికారి ఈ విషయం గురించి విని, అది నిజమో కాదో తెలుసుకోవడానికి ఆమె దగ్గరికి వచ్చింది. నిజమేనని ఎమీల్య ఆమెకు చెప్పింది. అయితే, కంపెనీ పాలసీ ప్రకారం అక్కడి ఉద్యోగస్థులెవ్వరూ తక్కువ గంటలు పనిచేసే వీల్లేదు కాబట్టి అలా పని చేయాలంటే డైరెక్టర్‌ ఆమోదం తీసుకోవాలి. అందుకే ఆమె డైరెక్టర్‌తో మాట్లాడడానికి కావాల్సిన ధైర్యం కోసం, ప్రశాంతత కోసం యెహోవాకు ప్రార్థించి డైరెక్టర్‌ను కలవడానికి సిద్ధపడింది.

డైరెక్టర్‌ దగ్గరికి వెళ్లినప్పుడు, తక్కువ గంటలు పని చేయడానికి తనను అనుమతించాలని ఎమీల్య నేర్పుగా, ధైర్యంగా ఆయనను కోరింది. తక్కువ గంటలు మాత్రమే పని చేసి మిగతా గంటల్ని వేరేవాళ్లకు సహాయం చేయడానికి ఉపయోగిస్తానని చెబుతూ ఆమె ఇలా వివరించింది: “నేనొక యెహోవాసాక్షిని, నేను ప్రజలకు ఆధ్యాత్మిక విషయాల్లో సహాయం చేస్తాను. ఈ రోజుల్లో చాలామందికి మంచేదో చెడేదో తెలియడం లేదు. వాళ్లకు సరైన విలువలు, ప్రమాణాలు అవసరం. ఈ విషయంలో నేను వాళ్లకు అందజేసే బైబిలు జ్ఞానం వాళ్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పనివేళల తర్వాత నాకుండే ఆధ్యాత్మిక కార్యకలాపాల్ని బట్టి కంపెనీలో నా పని నాణ్యత తగ్గడం నాకిష్టం లేదు, కానీ ప్రజలకు సహాయం చేయడానికి నాకు మరింత సమయం కావాలి. అందుకే నేను తక్కువ గంటలు పని చేయాలనుకుంటున్నాను.”

డైరెక్టర్‌ జాగ్రత్తగా విని, తాను ఒకప్పుడు సమాజ సేవ చేయాలనుకున్నానని చెప్పాడు. ఆ తర్వాత ఆయన, “నువ్వు చెప్తున్న కారణాలను బట్టి, నువ్వు అడిగిన దానికి సమ్మతించాల్సిందేనని నాకు అనిపిస్తోంది. కానీ తక్కువ గంటలు పని చేస్తే జీతం కూడా తక్కువే వస్తుందని నీకు తెలుసా?” అని ఆమెను అడిగాడు. దానికి ఎమీల్య, తనకు తెలుసని, అవసరమైతే ఖర్చులు కూడా తగ్గించుకుంటానని చెప్పింది. ఆమె ఇంకా ఇలా అంది: “నిజంగా ప్రజలకు అవసరమైన సహాయం చేయాలన్నదే జీవితంలో నాకున్న ముఖ్యమైన లక్ష్యం.” డైరెక్టర్‌ ఆమెతో ఇలా అన్నాడు: “వేరేవాళ్ల కోసం నిస్వార్థంగా సమయం వెచ్చించే వాళ్లను నేను అభిమానిస్తాను.”

అప్పటివరకు ఆ కంపెనీలో పనిచేసిన వాళ్లెవరికీ అలాంటి మినహాయింపు దొరకలేదు. వారానికి నాలుగు రోజులు మాత్రమే పని చేయడానికి ఎమీల్యకు అనుమతి దొరికింది. ఆమెను ఆశ్చర్యంలో ముంచెత్తిన విషయమేమిటంటే, కంపెనీ ఆమె జీతాన్ని పెంచడంతో ఆమెకు ముందు వచ్చినంత జీతమే ఇప్పుడూ వస్తోంది. “నా కల నెరవేరింది, ఇప్పుడు నేను మళ్లీ క్రమ పయినీరు సేవ చేయవచ్చు” అని ఆమె అంటోంది.

పయినీరు సేవ మొదలుపెట్టడానికి మీ పరిస్థితుల్లో మార్పు చేసుకోవడం గురించి ఆలోచించారా? ఒకవేళ మీరు పయినీరు సేవను ఆపేసి ఉంటే, ఇప్పుడు మళ్లీ మొదలుపెట్టడానికి పరిస్థితుల్లో సర్దుబాట్లు చేసుకోవడం గురించి ఆలోచించారా?

[32వ పేజీలోని బ్లర్బ్‌]

డైరెక్టర్‌ ఆమెతో ఇలా అన్నాడు: “వేరేవాళ్ల కోసం నిస్వార్థంగా సమయం వెచ్చించే వాళ్లను నేను అభిమానిస్తాను”