కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మనం ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు

మనం ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు

మనం ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు

‘నా మీదికి యుద్ధం రేగినను, నేను ధైర్యం విడువకుందును.’—కీర్త. 27:3.

ఈ కింది వచనాల ఆధారంగా, ధైర్యాన్ని పెంపొందించుకోవడానికి మనకు ఏవి సహాయం చేస్తాయో వివరించండి:

కీర్తన 27:1

కీర్తన 27:4

కీర్తన 27:11

1. మనం 27వ కీర్తనను పరిశీలిస్తే ఏ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోగలుగుతాం?

 లోకంలోని పరిస్థితులు ఇంత దిగజారిపోతున్నా ప్రకటనాపని మాత్రం ఎందుకంత ఎక్కువగా జరుగుతోంది? లోకంలో ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నా, మనమెందుకు ప్రకటనాపని కోసం మన సమయాన్ని, శక్తిని వెచ్చిస్తున్నాం? భవిష్యత్తు ఎలా ఉంటుందోనని చాలామంది భయపడుతున్నా మనం ఎలా ధైర్యంగా ఉండవచ్చు? వాటికి జవాబులు తెలుసుకోవడానికి, దావీదు రాజు దైవప్రేరణతో పాడిన పాట ఉన్న 27వ కీర్తనను పరిశీలిద్దాం.

2. విపరీతమైన భయం వల్ల ఏమి జరుగుతుంది? కానీ మనం ఏ నమ్మకం కలిగివుండవచ్చు?

2 దావీదు ఆ కీర్తనను ఈ మాటలతో మొదలుపెట్టాడు, “యెహోవా నాకు వెలుగును రక్షణయునైయున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును?” (కీర్త. 27:1) వెరపు లేదా విపరీతమైన భయం వల్ల ఒక వ్యక్తి నిస్సహాయుడైపోతాడు. కానీ యెహోవా మీద నమ్మకం ఉంచడం వల్ల ఒక వ్యక్తి దేనికీ భయపడకుండా ధైర్యంగా ఉండగలుగుతాడు. (1 పేతు. 3:14) యెహోవాను మన ఆశ్రయ దుర్గంగా చేసుకుంటే “కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా” ఉంటాం. (సామె. 1:33; 3:25) అలాగని ఎందుకు చెప్పవచ్చు?

‘యెహోవా నాకు వెలుగు, రక్షణ’

3. ‘యెహోవా మనకు వెలుగు’ అనే మాటకు అర్థమేమిటి? అయితే మనం ఏమి చేయాలి?

3 “యెహోవా నాకు వెలుగు” అనే మాట, యెహోవా మనల్ని అజ్ఞానం నుండి, ఆధ్యాత్మిక అంధకారం నుండి విడిపిస్తాడని చూపిస్తోంది. (కీర్త. 27:1) వెలుగు సాధారణంగా మన దారిలో ఎదురయ్యే ప్రమాదాల్ని లేదా అడ్డంకుల్ని గుర్తించడానికి సహాయం చేస్తుంది కానీ వాటిని తీసివేయదు. కాబట్టి మనకు కనిపిస్తున్న దాన్నిబట్టి మనం సరైన చర్య తీసుకోవాలి. అలాగే, ప్రపంచంలో ఆయా సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో యెహోవా మనకు తెలియజేస్తున్నాడు. ఈ విధానంలో మనకు ఎదురవగల ప్రమాదాల గురించి ఆయన మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఎల్లప్పుడూ ఉపయోగపడే బైబిలు సూత్రాలు ఆయన మనకు ఇస్తున్నాడు, కానీ నేర్చుకున్న వాటికి అనుగుణంగా చర్య తీసుకోవాల్సింది మనమే. మనం అలా చేస్తే మన శత్రువుల కన్నా, మన బోధకుల కన్నా ఎక్కువ జ్ఞానయుక్తంగా వ్యవహరించవచ్చు.—కీర్తన 119:98, 99, 130.

4. (ఎ) ‘యెహోవా నాకు రక్షణ’ అని దావీదు పూర్తి నమ్మకంతో ఎందుకు చెప్పగలిగాడు? (బి) ప్రత్యేకించి ఎప్పుడు యెహోవా మనకు రక్షణగా ఉంటాడు?

4 కీర్తన 27:1లోని దావీదు మాటలు, గతంలో యెహోవా తనను ఎలా విడిపించాడో లేదా కాపాడాడో ఆయన గుర్తుతెచ్చుకొని ఉంటాడని చూపిస్తున్నాయి. ఉదాహరణకు, ‘సింహం నుండి, ఎలుగుబంటి నుండి’ యెహోవా ఆయనను రక్షించాడు. బలాఢ్యుడైన గొల్యాతును జయించడానికి కూడా యెహోవా ఆయనకు సహాయం చేశాడు. ఆ తర్వాత, సౌలు రాజు ఈటెతో దావీదును పొడిచి చంపడానికి ప్రయత్నించిన ప్రతీసారి యెహోవా ఆయనను తప్పించాడు. (1 సమూ. 17:37, 49, 50; 18:11, 12; 19:10) అందుకే, ‘యెహోవా నాకు రక్షణ’ అని దావీదు పూర్తి నమ్మకంతో చెప్పగలిగాడు. యెహోవా దావీదుకు రక్షణగా ఉన్నట్లే తన సేవకులందరికీ రక్షణగా ఉంటాడు. ఎలా? రాబోయే “మహాశ్రమల” నుండి తన ఆరాధకులను తప్పించడం ద్వారా యెహోవా వాళ్లకు రక్షణగా ఉంటాడు.—ప్రక. 7:14; 2 పేతు. 2:9.

యెహోవా సహాయం చేసిన సందర్భాలను గుర్తుచేసుకోండి

5, 6. (ఎ) ఇప్పటివరకు యెహోవా మీకు సహాయం చేసిన సందర్భాలను గుర్తుచేసుకుంటే ఏ ప్రయోజనం పొందుతారు? (బి) పూర్వం యెహోవా తన సేవకులకు సహాయం చేసినదాన్ని గుర్తుచేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి?

5 ధైర్యాన్ని పెంపొందించుకోవడానికి సహాయం చేసే ప్రాముఖ్యమైన ఒక అంశం కీర్తన 27:2, 3లో ఉంది. (చదవండి.) ప్రమాదకరమైన పరిస్థితుల నుండి యెహోవా తనను ఎలా తప్పించాడో దావీదు గుర్తుచేసుకున్నాడు. (1 సమూ. 17:34-37) దానివల్ల, అత్యంత దారుణమైన పరిస్థితుల్ని కూడా ధైర్యంగా ఎదుర్కోగలిగాడు. ఇప్పటి వరకు యెహోవా మీకు సహాయం చేసిన సందర్భాలు గుర్తున్నాయా? ఉదాహరణకు, మిమ్మల్ని కలచివేస్తున్న సమస్య గురించి ప్రార్థించడం వల్ల దాని నుండి బయటపడడానికి కావాల్సిన వివేచనను లేదా దాన్ని ఎదుర్కోవడానికి కావాల్సిన బలాన్ని యెహోవా మీకు ఇచ్చినట్లు మీరు గ్రహించారా? లేదా సంతోషంగా యెహోవా సేవ చేయడానికి ఎదురైన అడ్డంకులు ఎలా తొలగించబడ్డాయో, ఆయన సేవలో మరింత ఎక్కువ చేయడానికి “గొప్ప ద్వారము” ఎలా తెరవబడిందో మీకు గుర్తుందా? (1 కొరిం. 16:9, అధస్సూచి) అలాంటి సందర్భాలను గుర్తుచేసుకోవడం వల్ల మీకు ఏ ప్రయోజనం కలుగుతుంది? ఇప్పటి వరకు ఎదురైన వాటికన్నా పెద్ద అడ్డంకులు, దారుణమైన పరిస్థితులు ఎదురైనప్పుడు వాటి నుండి బయటపడడానికి లేదా వాటిని ఓర్చుకోవడానికి కూడా యెహోవా సహాయం చేయగలడనే నమ్మకం కలుగుతుంది.—రోమా. 5:3-5.

6 అనుకున్నది ఏదైనా సాధించగల ఒక ప్రభుత్వం యెహోవాసాక్షుల సంస్థను సమూలనాశనం చేయడానికి పన్నాగాలు పన్నితే ఎలా? ఆధునిక కాలాల్లో అలా చేయడానికి చాలామంది ప్రయత్నించి విఫలమయ్యారు. గతంలో తన సేవకులకు యెహోవా ఎలా సహాయం చేశాడో గుర్తుచేసుకుంటే భవిష్యత్తును ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం.—దాని. 3:28.

స్వచ్ఛారాధన పట్ల ఇష్టాన్ని పెంచుకోండి

7, 8. (ఎ) కీర్తన 27:4 ప్రకారం దావీదు యెహోవాను ఏమి అడిగాడు? (బి)  యెహోవా గొప్ప ఆధ్యాత్మిక ఆలయం ఏది? అక్కడ మనం ఎలా ఆరాధన చేస్తాం?

7 సత్యారాధన పట్ల ఇష్టాన్ని పెంచుకోవడం వల్ల కూడా ధైర్యాన్ని వృద్ధిచేసుకోగలుగుతాం. (కీర్తన 27:4 చదవండి.) దావీదు కాలం వరకు ప్రజలు ఒక గుడారంలో యెహోవాను ఆరాధిస్తూ వచ్చారు. ఆ గుడారాన్నే ‘యెహోవా మందిరముగా’ పరిగణించేవాళ్లు. కానీ తన కుమారుడైన సొలొమోను యెహోవా కోసం పెద్ద ఆలయాన్ని నిర్మించేలా దావీదు ఏర్పాట్లు చేశాడు. అయితే, యెహోవాకు అంగీకృతమైన విధంగా ఆరాధించాలంటే ఆయన ఆశీర్వాదం ఉన్న పెద్ద ఆలయం ఇకపై అవసరం లేదని కొన్ని శతాబ్దాల తర్వాత యేసు తెలియజేశాడు. (యోహా. 4:21-23) సా.శ. 29లో యేసు బాప్తిస్మం తీసుకొని యెహోవా చిత్తం చేయడానికి తనను తాను సమర్పించుకున్నప్పుడు గొప్ప ఆధ్యాత్మిక ఆలయం ఉనికిలోకి వచ్చిందని అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో 8 నుండి 10 అధ్యాయాల్లో సూచించాడు. (హెబ్రీ. 10:10) మనం యేసు విమోచన క్రయధన బలిపై విశ్వాసం ఉంచడం ద్వారా, తాను అంగీకరించే విధంగా తనను సమీపించేలా యెహోవా ఈ గొప్ప ఆధ్యాత్మిక ఆలయాన్ని ఏర్పాటు చేశాడు. అయితే మనం ఆ ఆలయంలో ఎలా ఆరాధిస్తాం? “విశ్వాసవిషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో” ప్రార్థించడం ద్వారా, నిర్భయంగా మన నిరీక్షణను ఇతరులతో పంచుకోవడం ద్వారా, కుటుంబ ఆరాధన సమయంలో, సంఘకూటాల్లో తోటి విశ్వాసులపై ప్రేమ చూపిస్తూ వాళ్లను పురికొల్పుతూ ప్రోత్సహించడం ద్వారా మనం ఆ ఆలయంలో ఆరాధన చేస్తాం. (హెబ్రీ. 10:22-25) సత్యారాధనా ఏర్పాటు పట్ల ఇష్టాన్ని పెంచుకుంటే ఈ అపాయకరమైన అంత్యదినాల్లో మనం బలాన్ని పొందుతాం.

8 ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయులైన యెహోవా సేవకులు పరిచర్యలో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు, కొత్త భాషలు నేర్చుకుంటున్నారు, రాజ్యప్రచారకుల అవసరం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్తున్నారు. అలా చేయడం ద్వారా కీర్తనకర్తలాగే వాళ్లు కూడా యెహోవాను ఒక వరం అడగాలనుకుంటున్నట్లు చూపిస్తున్నారు. యెహోవా ప్రసన్నతను రుచిచూడాలని, ఏమి జరిగినా సరే ఆయన పవిత్ర సేవలో భాగం వహించాలని వాళ్లు కోరుకుంటున్నారు.—కీర్తన 27:6 చదవండి.

దేవుడు సహాయం చేస్తాడనే నమ్మకాన్ని కలిగివుండండి

9, 10. కీర్తన 27:10లో మనకు ఏ వాగ్దానం ఉంది?

9 “నా తలిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును” అని చెప్పడం ద్వారా యెహోవా తనకు సహాయం చేస్తాడనే గొప్ప నమ్మకాన్ని దావీదు వ్యక్తం చేశాడు. (కీర్త. 27:10) 1 సమూయేలు 22వ అధ్యాయంలో ప్రస్తావించబడిన సంఘటనలను బట్టి చూస్తే దావీదు తల్లిదండ్రులు ఆయనను వదిలేయలేదని అర్థమౌతోంది. కానీ సత్యం కారణంగా నేడు అనేకమంది తమ కుటుంబాల నుండి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న చాలామంది క్రైస్తవ సంఘపు నీడలో ఆదరణను, కాపుదలను పొందారు.

10 తన సేవకుల్ని ఎవరు విడిచిపెట్టినా చేరదీయడానికి యెహోవా సిద్ధంగా ఉన్నాడు కాబట్టి, వాళ్లకు వేరే విధాలైన కష్టాలు వచ్చినప్పుడు కూడా ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు. ఉదాహరణకు, కుటుంబ సభ్యుల కనీస అవసరాలను ఎలా తీర్చాలనే ఆందోళన మనలో కలిగినప్పుడు, మనకు యెహోవా ఖచ్చితంగా సహాయం చేస్తాడని నమ్మవచ్చు. (హెబ్రీ. 13:5, 6) యెహోవా తన యథార్థ సేవకులందరి పరిస్థితులను, అవసరాలను అర్థం చేసుకుంటాడు.

11. యెహోవా మీద మనకున్న నమ్మకం ఇతరులపై ఎలాంటి ప్రభావం చూపించవచ్చు? ఒక ఉదాహరణ చెప్పండి.

11 లైబీరియాకు చెందిన విక్టోరియా అనే బైబిలు విద్యార్థి విషయమే తీసుకోండి. ఆమె ఒక వ్యక్తితో సహజీవనం చేస్తుండేది, ఆమెకు ముగ్గురు పిల్లలు. ఆమె బాప్తిస్మం తీసుకోవడానికి ప్రగతి సాధిస్తుండగా ఆ వ్యక్తి ఆమెను, పిల్లల్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. దాంతో ఆమెకు ఇల్లు లేకుండా అయిపోయింది, ఉద్యోగం కూడా లేదు. అయినా సరే, ఆమె ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించి బాప్తిస్మం తీసుకుంది. అయితే ఒకరోజు, 13 ఏళ్ల తన కూతురికి ఒక పర్సు దొరికింది, అందులో చాలా డబ్బుంది. తమలో దురాశ తలెత్తవచ్చనే ఉద్దేశంతో వాళ్లు దాన్ని లెక్కపెట్టకూడదని అనుకున్నారు. తర్వాత, ఆ పర్సు ఒక సైనికుడిదని తెలుసుకొని దాన్ని ఆయనకు ఇచ్చేశారు. యెహోవాసాక్షుల్లాగే ప్రజలందరూ నిజాయితీగా ఉంటే ప్రపంచమంతా ఎంతో మెరుగ్గా, మరింత శాంతిగా ఉంటుందని ఆయన వాళ్లతో అన్నాడు. అప్పుడు విక్టోరియా, యెహోవా వాగ్దానం చేసిన నూతనలోకం గురించి బైబిలు నుండి ఆయనకు వివరించింది. ఆమె యథార్థతకు మెచ్చి, ఆ డబ్బులో నుండి కొంత తీసి ఆమెకు బహుమానంగా ఇచ్చాడు. అలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులు నిజాయితీకి మారుపేరుగా నిలుస్తున్నారు. ఎందుకంటే, యెహోవా తమ అవసరాలను తీరుస్తాడనే పూర్తి నమ్మకం వాళ్లకుంది.

12. ఆర్థికంగా నష్టపోవాల్సి వచ్చినా మనం యెహోవా సేవలో కొనసాగితే ఏమి నిరూపిస్తాం? ఒక ఉదాహరణ చెప్పండి.

12 సియెర్రా లియోన్‌కు చెందిన థామస్‌ ఉదాహరణ చూద్దాం. ఆయన బాప్తిస్మం తీసుకొనని ప్రచారకుడు. ఆయన తనకు ఎదురైన పరిస్థితిని బట్టి ఎలా భావించివుంటాడో ఒక్కసారి ఆలోచించండి. ఆయన ఒక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేయడం ప్రారంభించాడు, కానీ దాదాపు ఒక సంవత్సరం వరకు స్కూలు యాజమాన్యం ఆయనకు జీతం ఇవ్వలేదు. తనకు రావాల్సిన మొత్తాన్ని పొందాలంటే ఆయన స్కూల్‌ అడ్మినిస్ట్రేటర్‌తో మాట్లాడాలి. ప్రీస్టుగా కూడా పనిచేసే ఆ అడ్మినిస్ట్రేటర్‌ థామస్‌తో మాట్లాడుతూ యెహోవాసాక్షుల నమ్మకాలను పాఠశాల అంగీకరించదని అన్నాడు. ఉద్యోగం కావాలో, బైబిలు నమ్మకాలు కావాలో తేల్చుకోమని అతను థామస్‌తో చెప్పాడు. థామస్‌ ఆ ఉద్యోగాన్ని, దాదాపు సంవత్సరం జీతాన్ని వదులుకొని రేడియోలు, మొబైల్‌ ఫోన్లు రిపేరు చేసే పని చూసుకున్నాడు. ఇలాంటి ఎన్నో ఉదాహరణలు చూపిస్తున్నట్లుగా మనం యెహోవా మీద నమ్మకం ఉంచితే మనకు కావాల్సినవి దొరకవేమోనని భయపడాల్సిన అవసరం లేదు. యెహోవా సమస్తాన్ని సృష్టించాడు, తన ప్రజల్ని సంరక్షిస్తూ వచ్చాడు కాబట్టి మన విషయంలో కూడా శ్రద్ధ కలిగివుంటాడని మనకు తెలుసు.

13. పేదరికం ఎక్కువగా ఉన్న దేశాల్లో రాజ్య ప్రకటనాపని ఎలా జరుగుతోంది?

13 పేదరికం ఎక్కువగా ఉన్న చాలాదేశాల్లో సహోదర సహోదరీలు ఎంతో చురుగ్గా రాజ్య ప్రకటనాపని చేస్తున్నారు. ఎందుకు? ఒక బ్రాంచి కార్యాలయం ఇలా నివేదించింది, “బైబిలు అధ్యయనాలు అంగీకరించే చాలామంది గృహస్థులు నిరుద్యోగులు, కాబట్టి అధ్యయనం చేయడానికి వాళ్లకు పగటిపూట ఎక్కువ సమయం ఉంటుంది. సహోదరులకు కూడా ప్రకటించడానికి ఎక్కువ సమయం ఉంటుంది. ప్రజలు, ముఖ్యంగా పేదరికం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని వాళ్లు తమ చుట్టూవున్న పరిస్థితుల్ని కళ్లారా చూస్తున్నారు కాబట్టి మనం అంత్యదినాల్లో జీవిస్తున్నామని వాళ్లకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.” ఓ సహోదరుడు ఒక దేశంలో 12కన్నా ఎక్కువ సంవత్సరాలుగా మిషనరీ సేవ చేస్తున్నాడు. అక్కడ సగటున ప్రతీ ప్రచారకుడు లేదా ప్రచారకురాలు 3 కన్నా ఎక్కువ బైబిలు అధ్యయనాలు నిర్వహిస్తున్నారు. అక్కడి పరిస్థితి గురించి ఆ మిషనరీ సహోదరుడు ఇలా రాశాడు, “చాలామంది ప్రచారకుల జీవితం సరళంగా ఉంటుంది, వాళ్ల సమయాన్ని హరించేవి అంతగా ఉండవు కాబట్టి సాధారణంగా ప్రకటనాపనికి, బైబిలు అధ్యయనాలు చేయడానికి వాళ్లు ఎక్కువ సమయం వెచ్చిస్తారు.”

14. గొప్పసమూహాన్ని యెహోవా ఏయే విధాలుగా కాపాడతాడు?

14 ఒక గుంపుగా తన ప్రజలకు ఆధ్యాత్మికంగానూ శారీరకంగానూ సహాయం చేస్తానని, వాళ్లను కాపాడతానని, విడిపిస్తానని యెహోవా వాగ్దానం చేశాడు, మనం ఆయనపై నమ్మకం ఉంచుతాం. (కీర్త. 37:28; 91:1-3) కాబట్టి “మహాశ్రమలను” తప్పించుకునే గొప్ప సమూహంలో నిజంగానే ఎక్కువమంది ఉంటారని చెప్పవచ్చు. (ప్రక. 7:9, 14) అంత్యదినాల్లో మిగిలివున్న ఈ సమయమంతటిలో ఆ సమూహం ఒక గుంపుగా ఉనికిలో లేకుండా పోయే పరిస్థితిని యెహోవా రానివ్వడు. శ్రమలను సహించడానికి, యెహోవాతో తమకున్న సంబంధాన్ని కాపాడుకోవడానికి అవసరమైన వాటన్నిటినీ యెహోవా వాళ్లకు అనుగ్రహిస్తాడు. మహాశ్రమల చివరి ఘట్టం అంతటిలో యెహోవా తన ప్రజలను కాపాడతాడు.

“యెహోవా, నీ మార్గమును నాకు బోధింపుము”

15, 16. యెహోవా ఇచ్చే ఉపదేశాన్ని పాటిస్తే మనమెలా ప్రయోజనం పొందుతాం? ఒక ఉదాహరణ చెప్పండి.

15 ధైర్యంగా ఉండాలంటే మనకు ఎల్లవేళలా దేవుని మార్గాల గురించిన ఉపదేశాలు అవసరమౌతాయి. దావీదు చేసిన ఈ మనవిని బట్టి మనకు ఆ విషయం తెలుస్తోంది, “యెహోవా, నీ మార్గమును నాకు బోధింపుము. నాకొరకు పొంచియున్నవారిని చూచి సరాళమైన మార్గమున నన్ను నడిపింపుము.” (కీర్త. 27:11) ఈ ప్రార్థనకు అనుగుణంగా చర్య తీసుకోవాలంటే బైబిలు ఆధారంగా యెహోవా సంస్థ ఇచ్చే ఎలాంటి నిర్దేశాన్నైనా జాగ్రత్తగా విని, దాన్ని వెంటనే మన జీవితాల్లో పాటించాలి. అనవసరమైన అప్పుల నుండి బయటపడిన చాలామంది, జీవితాన్ని సరళం చేసుకోవాలని సంస్థ ఇచ్చిన జ్ఞానయుక్తమైన సలహాలను పాటించడం వల్ల ఇటీవల ఆర్థిక సంక్షోభం సమయంలో ప్రయోజనం పొందామని చెప్పగలుగుతారు. అలా జీవితాన్ని సరళం చేసుకున్నవాళ్లు ఇకపై స్తోమతకు మించిన వస్తువుల కోసం డబ్బులు చెల్లించడానికి కష్టపడనవసరం లేదు కాబట్టి వాళ్లు పరిచర్యలో ఎక్కువ సమయాన్ని వెచ్చించగలుగుతున్నారు. ప్రతీ ఒక్కరూ తమనుతాము ఇలా ప్రశ్నించుకోవాలి, ‘బైబిల్లో, నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని తరగతి ఇచ్చే ప్రచురణల్లో చదివిన ప్రతీ విషయాన్ని నేను వెంటనే పాటిస్తానా? ఒకవేళ కొన్ని త్యాగాలు చేయాల్సివచ్చినా సరే నేనలా చేస్తానా?’—మత్త. 24:45.

16 మనం నీతి మార్గంలో నడవడానికి యెహోవా ఇచ్చే ఉపదేశాన్ని, నిర్దేశాన్ని పాటిస్తే మనం భయపడాల్సిన అవసరమే ఉండదు. అమెరికాలో క్రమపయినీరుగా సేవచేస్తున్న ఒక సహోదరుడు తన కుటుంబమంతా పూర్తికాల సేవ చేసేందుకు సహాయపడే ఉద్యోగం కోసం తన కంపెనీలో దరఖాస్తు పెట్టుకున్నాడు. కానీ ఆయనకు ఆ ఉద్యోగానికి తగిన అర్హతలు లేవని, కాలేజీ డిగ్రీ లేకుండా ఆ హోదాకు చేరుకోవడం అసాధ్యమని సూపర్‌వైజర్‌ చెప్పాడు. ఒకవేళ మీకే అలా జరిగితే, ఉన్నత విద్య అభ్యసించకుండా పూర్తికాల సేవ ఎందుకు చేపట్టానా అని మీరు విచారిస్తారా? రెండు వారాల తర్వాత ఆ సూపర్‌వైజర్‌ను ఉద్యోగంలో నుండి తీసేశారు, ఆ కంపెనీలో పనిచేసే ఒక మేనేజరు ఈ సహోదరుణ్ణి పిలిచి అసలు తన లక్ష్యాలు ఏమిటో చెప్పమని అడిగాడు. దాంతో ఆ సహోదరుడు తాను, తన భార్య యెహోవాసాక్షులమని, పూర్తికాల పరిచారకులమని వివరించి ఆ సేవలోనే కొనసాగాలనుకుంటున్నామని చెప్పాడు. ఆ సహోదరుడు మరోమాట మాట్లాడేలోగా ఆ మేనేజరు, “నువ్వు అందరిలాంటి వాడివి కాదని నాకు తెలుసు. మా నాన్నగారు చనిపోవడానికి కొన్ని రోజుల ముందు మీ తోటి విశ్వాసులు ప్రతీరోజు వచ్చి బైబిలు చదివి వినిపించేవాళ్లు. జీవితంలో ఎప్పుడైనా ఒక యెహోవాసాక్షికి సహాయం చేసే అవకాశం వస్తే చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాను” అని చెప్పాడు. ఆ తర్వాతి రోజు, పాత సూపర్‌వైజర్‌ ఇవ్వనన్న ఉద్యోగమే ఈ సహోదరునికి దొరికింది. మనం రాజ్య సంబంధమైన విషయాలకు మొదటిస్థానం ఇస్తే, కనీస అవసరాలకు లోటు రాకుండా చూసుకుంటానని తాను చేసిన వాగ్దానాన్ని యెహోవా నిలబెట్టుకుంటాడు.—మత్త. 6:33.

నమ్మకం, నిరీక్షణ ప్రాముఖ్యం

17. భవిష్యత్తును పూర్తి నమ్మకంతో ఎదుర్కోవడానికి మనకేది సహాయం చేస్తుంది?

17 నమ్మకం, నిరీక్షణ ఎంత అవసరమో నొక్కిచెబుతూ దావీదు ఇలా అన్నాడు, “సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేనియెడల నేనేమవుదును?” (కీర్త. 27:13) నిజానికి, యెహోవా మనకు నిరీక్షణ ఇవ్వకపోయుంటే, 27వ కీర్తనలోని విషయాలు మనకు తెలియకపోయుంటే మన జీవితం ఎలా ఉండేదో ఆలోచించండి. కాబట్టి, హార్‌మెగిద్దోనుకు నడిపించే సంఘటనలను మనం ఎదుర్కొంటుండగా బలం కోసం, విడుదల కోసం పూర్తి నమ్మకంతో యెహోవాను వేడుకుంటూ ఉందాం.—కీర్తన 27:14 చదవండి.

[అధ్యయన ప్రశ్నలు]

[23వ పేజీలోని చిత్రం]

యెహోవా గతంలో తనను విడుదల చేసిన సందర్భాలను గుర్తుచేసుకోవడం వల్ల దావీదు బలం పొందాడు

[25వ పేజీలోని చిత్రం]

ఆర్థిక సంక్షోభం సంభవించినప్పుడు, మీరు పరిచర్య మరింత ఎక్కువగా చేస్తారా?