కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా నడిపింపుతో నిజమైన స్వాతంత్రాన్ని పొందండి

యెహోవా నడిపింపుతో నిజమైన స్వాతంత్రాన్ని పొందండి

యెహోవా నడిపింపుతో నిజమైన స్వాతంత్రాన్ని పొందండి

‘స్వాతంత్ర్యము నిచ్చు సంపూర్ణమైన నియమములోకి తేరి చూడండి.’—యాకో. 1:25.

మీరు వివరించగలరేమో చూడండి:

నిజమైన స్వాతంత్రాన్నిచ్చే నియమం అంటే ఏమిటి? ఆ నియమం వల్ల ఎవరెవరు ప్రయోజనం పొందుతారు?

నిజమైన స్వాతంత్రాన్ని పొందాలంటే మనం ముఖ్యంగా ఏమి చేయాలి?

జీవమార్గంలో నిలిచివుండే వాళ్లందరూ భవిష్యత్తులో ఏ స్వాతంత్రాన్ని పొందుతారు?

1, 2. (ఎ) లోకంలో ప్రజలకున్న స్వాతంత్ర్యం ఏమౌతోంది? ఎందుకు? (బి) యెహోవా సేవకులు భవిష్యత్తులో ఎలాంటి స్వాతంత్ర్యాన్ని పొందుతారు?

 దురాశ, అక్రమం, హింస వంటివి పెరిగిపోతున్న కాలంలో మనం జీవిస్తున్నాం. (2 తిమో. 3:1-5) అలాంటివి పెరిగిపోవడం చూసి ప్రభుత్వాలు మరిన్ని చట్టాల్ని ప్రవేశపెడుతున్నాయి, పోలీసు బలగాలను పెంచుతున్నాయి, ఎలక్ట్రానిక్‌ నిఘా ఏర్పాట్లు చేస్తున్నాయి. కొన్ని దేశాల్లోని పౌరులు తమ భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసుకోవడానికి ఇళ్లలో అలారమ్‌లను, అదనపు తాళాలను, కాంపౌండు గోడలకు కరెంటు తీగెలను ఏర్పాటు చేసుకుంటున్నారు. చాలామంది రాత్రిపూట బయటకు వెళ్లడానికి ఇష్టపడరు. పిల్లల విషయానికొస్తే, రాత్రే కాదు పగలు కూడా ఎవ్వరి తోడూ లేకుండా వాళ్లను బయట ఆడుకోనివ్వరు. నిజంగా ప్రజల స్వాతంత్ర్యం కనుమరుగౌతోంది, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగేటట్లుంది.

2 యెహోవా నుండి వేరైపోతే, నిజమైన స్వాతంత్ర్యాన్ని పొందవచ్చని ఏదెను తోటలో సాతాను అన్నాడు. అది పచ్చి అబద్ధమని చరిత్రను చూస్తే తెలుస్తోంది. నిజానికి, దేవుడు విధించిన నైతిక, ఆధ్యాత్మిక కట్టుబాట్లను మానవులు ఎంత నిర్లక్ష్యం చేస్తే అంత ఘోరంగా నష్టపోతారు. రోజురోజుకూ ఘోరంగా తయారౌతున్న ఇలాంటి పరిస్థితుల ప్రభావం యెహోవా సేవకులమైన మనపై కూడా పడుతోంది. అయితే పాపానికి, అవినీతికి బానిసలుగా ఉన్న మనం వాటి నుండి విడుదలై, బైబిలు చెబుతున్నట్లుగా “దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము” పొందుతామనే నిరీక్షణ మనకుంది. (రోమా. 8:20, 21) నిజానికి, అలాంటి స్వాతంత్ర్యాన్ని పొందేలా తన సేవకుల్ని సిద్ధం చేయడం యెహోవా ఇప్పటికే మొదలుపెట్టాడు. ఏవిధంగా?

3. యెహోవా తన సేవకులకు ఏ నియమాన్ని ఇచ్చాడు? మనమిప్పుడు ఏ ప్రశ్నలు పరిశీలిస్తాం?

3 అలాంటి స్వాతంత్ర్యాన్ని పొందేలా తన సేవకుల్ని ఎలా సిద్ధం చేస్తున్నాడనే దానికి యాకోబు మాటల్లో జవాబు ఉంది. ఆయన ‘స్వాతంత్ర్యాన్ని సంపూర్ణ నియమం’ గురించి మాట్లాడాడు. (యాకోబు 1:25 చదవండి.) ప్రజలు సాధారణంగా నియమాలను నిర్బంధాలుగా పరిగణిస్తారు కానీ, వాటివల్ల స్వాతంత్ర్యం దొరుకుతుందని అనుకోరు. ఇంతకీ, ‘స్వాతంత్రాన్నిచ్చే సంపూర్ణ నియమం’ అంటే ఏమిటి? ఆ నియమం మనకు ఎలా స్వాతంత్రాన్ని ఇస్తుంది?

మనకు స్వాతంత్రాన్నిచ్చే నియమం

4. ‘స్వాతంత్ర్యాన్నిచ్చే సంపూర్ణ నియమం’ అంటే ఏమిటి? ఆ నియమం వల్ల ఎవరెవరు ప్రయోజనం పొందుతారు?

4 ‘స్వాతంత్ర్యాన్నిచ్చే సంపూర్ణ నియమం’ అంటే మోషే ధర్మశాస్త్రం కాదు. ఎందుకంటే, అది మానవుల పాపాలను బయలుపర్చింది. అంతేకాక అది క్రీస్తులో నెరవేరింది. (మత్త. 5:17; గల. 3:19) ఇంతకీ యాకోబు ఏ నియమం గురించి మాట్లాడుతున్నాడు? ‘విశ్వాస నియమం,’ ‘స్వాతంత్ర్యం పొందిన ప్రజల నియమం’ అని కూడా పిలవబడిన ‘క్రీస్తు నియమాన్ని’ ఉద్దేశించి యాకోబు మాట్లాడాడు. (రోమా. 3:27, NW; యాకో. 2:12, NW; గల. 6:2) కాబట్టి యెహోవా మన నుండి కోరే ప్రతీది ‘సంపూర్ణ నియమమే’ అని చెప్పవచ్చు. ఆ నియమం వల్ల అభిషిక్త క్రైస్తవులు, ‘వేరే గొర్రెలు’ ప్రయోజనం పొందుతారు.—యోహా. 10:16.

5. స్వాతంత్ర్యాన్నిచ్చే నియమం ఎందుకు భారమైనది కాదు?

5 చాలా దేశాల్లోని నియమాలు క్లిష్టంగా, భారంగా ఉంటాయి. కానీ, ‘సంపూర్ణ నియమంలో’ మాత్రం చాలా సరళమైన ఆజ్ఞలు, ప్రాథమిక సూత్రాలు ఉంటాయి. (1 యోహా. 5:3) ‘నా కాడి సుళువైనది, నా భారం తేలికైనది’ అని యేసు అన్నాడు. (మత్త. 11:29, 30) ‘సంపూర్ణ నియమానికి’ ఆంక్షల, జరిమానాల పెద్ద చిట్టా అవసరంలేదు. ఎందుకంటే ఆ నియమానికి ప్రేమే మూలం. అంతేకాక, అది రాతి పలకల మీద కాదు గానీ మనసుల మీద, హృదయాల మీద చెక్కబడింది.—హెబ్రీయులు 8:6, 10 చదవండి.

‘సంపూర్ణ నియమం’ మనకు ఎలా విడుదల కలుగజేస్తుంది?

6, 7. యెహోవా ప్రమాణాల గురించి మనం ఏమి చెప్పవచ్చు? స్వాతంత్ర్యాన్నిచ్చే నియమం ఏమి చేసే స్వేచ్ఛనిస్తుంది?

6 యెహోవా విధించిన హద్దులు మనకు మేలు చేస్తాయి, మనల్ని కాపాడతాయి. ఉదాహరణకు, విశ్వంలోని భౌతిక నియమాల గురించి ఆలోచించండి. అవి ఉండడం వల్ల మనకు స్వేచ్ఛ లేకుండా పోతోందని సాధారణంగా మనలో ఎవ్వరమూ అనుకోము కానీ, అవి మన మనుగడకు ఎంతో అవసరమని గుర్తిస్తాం. అలాగే, యెహోవా విధించిన నైతిక, ఆధ్యాత్మిక ప్రమాణాలన్నీ మన మేలు కోసమే. అవి క్రీస్తు ‘సంపూర్ణ నియమంలో’ కనిపిస్తాయి.

7 స్వాతంత్ర్యాన్నిచ్చే నియమం మనల్ని కాపాడుతుంది. అంతేకాక, మనకు హాని కలిగించే వాటికి దూరంగా ఉంటూనే మనకున్న సరైన కోరికల్ని తీర్చుకోవడానికి, ఇతరుల హక్కులకూ స్వేచ్ఛకూ భంగం కలిగించకుండా ఉండడానికి సహాయం చేస్తుంది. కాబట్టి మనం యెహోవా వ్యక్తిత్వానికి, ఆయన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నవాటిని కోరుకుంటేనే నిజమైన స్వాతంత్ర్యాన్ని అంటే, మనం కోరుకున్న వాటిని చేసే స్వాతంత్ర్యాన్ని పొందుతాం. మరో మాటలో చెప్పాలంటే, యెహోవా ప్రేమించే వాటిని ప్రేమించడం, ఆయన ద్వేషించే వాటిని ద్వేషించడం నేర్చుకోవాలి. స్వాతంత్ర్యాన్నిచ్చే నియమం సహాయంతో మనం అలా చేయగలుగుతాం.—ఆమో. 5:15.

8, 9. స్వాతంత్ర్యాన్నిచ్చే నియమానికి నమ్మకంగా లోబడి ఉండేవాళ్లు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారు? ఉదాహరణతో చెప్పండి.

8 మనం అపరిపూర్ణులం కాబట్టి తప్పుడు కోరికల్ని అణచివేసుకోవడానికి తంటాలుపడుతుంటాం. అయితే, స్వాతంత్ర్యాన్నిచ్చే నియమానికి నమ్మకంగా లోబడి ఉంటే ఇప్పుడు కూడా దానివల్ల వచ్చే స్వేచ్ఛను పొందుతాం. ఉదాహరణకు, జేయ్‌ అనే బైబిలు విద్యార్థి అనుభవాన్ని పరిశీలించండి. ఆయనకు పొగతాగే అలవాటు ఉండేది. అయితే అది దేవునికి ఇష్టంలేని అలవాటని బైబిలు అధ్యయనం మొదలుపెట్టిన కొత్తలో ఆయన తెలుసుకున్నాడు. కాబట్టి ఆయన ఒక నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు ఆయన తన శరీరాశకు లోబడ్డాడా లేక యెహోవా దేవునికా? పొగతాగాలనే కోరిక బలంగా ఉన్నా ఆయన జ్ఞానయుక్తంగా దేవుణ్ణి ఆరాధించాలనే నిర్ణయించుకున్నాడు. ఆ అలవాటును మానేసిన తర్వాత ఆయనకు ఎలా అనిపించింది? “నేను అద్భుతమైన స్వాతంత్ర్యాన్ని, ఎంతో సంతోషాన్ని పొందాను” అని ఆయన అన్నాడు.

9 లోకం ఇచ్చే స్వాతంత్ర్యం ప్రజలు ‘శరీరాన్ని అనుసరించి’ నడుచుకునేలా చేసి వాళ్లను బానిసలుగా చేసుకుంటుంది కానీ, యెహోవా ఇచ్చే స్వాతంత్ర్యం ‘ఆత్మను అనుసరించి’ నడుచుకునేలా చేసి మనకు విడుదలను, ‘జీవాన్ని, సమాధానాన్ని’ ఇస్తుందని జేయ్‌ గ్రహించాడు. (రోమా. 8:5, 6) పొగతాగడానికి బానిసైన జేయ్‌ ఆ అలవాటును ఎలా మానుకోగలిగాడు? సొంత శక్తితో కాదుగానీ యెహోవా సహాయంతోనే మానుకోగలిగాడు. “నేను క్రమంగా బైబిలు చదివాను, పరిశుద్ధాత్మ సహాయం కోసం ప్రార్థించాను, క్రైస్తవ సంఘం ఇష్టపూర్వకంగా, ప్రేమగా ఇచ్చిన సహాయాన్ని స్వీకరించాను” అని ఆయన అన్నాడు. నిజమైన స్వాతంత్ర్యాన్ని పొందడానికి ప్రయత్నిస్తుండగా, జేయ్‌కి సహాయం చేసిన విషయాలే మనకు కూడా సహాయం చేస్తాయి. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

దేవుని వాక్యంలోకి ‘తేరి చూడండి’

10. దేవుని నియమంలోకి ‘తేరి చూడడం’ అంటే ఏమిటి?

10 యాకోబు 1:25లోని కొంత భాగం ఇలా ఉంది, “స్వాతంత్ర్యము నిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలుకడగా ఉండువాడు . . . క్రియను చేయువాడైయుండి తన క్రియలో ధన్యుడగును.” ‘తేరి చూడడం’ అని అనువదించబడిన గ్రీకు పదానికి, దేన్నైనా ‘చూడడానికి వంగడం’ అనే అర్థం ఉంది. ఆ పదం ఏకాగ్రతతో ప్రయత్నించడాన్ని సూచిస్తుంది. స్వాతంత్ర్యాన్నిచ్చే నియమానికి తగిన విధంగా మన మనసుల్ని, హృదయాల్ని మలుచుకోవాలంటే మనం శ్రద్ధగా బైబిలు అధ్యయనం చేయాలి, చదివిన వాటిని జాగ్రత్తగా ధ్యానించాలి.—1 తిమో. 4:15.

11, 12. (ఎ) సత్యాన్ని మన జీవిత విధానంగా మలచుకోవాల్సిన అవసరం ఉందని యేసు ఎలా నొక్కిచెప్పాడు? (బి) పేరాలో ఇచ్చిన అనుభవం చూపిస్తున్నట్లుగా, యౌవనులు ఏ ప్రమాదానికి దూరంగా ఉండాలి?

11 అయితే మనం దేవుని వాక్యంలోకి తేరి చూడడం మాత్రమే సరిపోదు. మనం ఆ వాక్యాన్ని పాటించడంలో ‘నిలిచి ఉండాలి’ అంటే ఎప్పటికీ పాటిస్తూ ఉండాలి. అలా చేస్తూ సత్యాన్ని మన జీవిత విధానంగా మలచుకోవాలి. యేసు కూడా ఆ ఉద్దేశాన్నే వ్యక్తం చేస్తూ తనపై విశ్వాసం ఉంచిన కొంతమందితో ఇలా అన్నాడు, “మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరు; అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును.” (యోహా. 8:31, 32) ఇక్కడ ‘గ్రహించడం’ అనే పదానికి మెప్పుదలను కూడా కలిగివుండడం అనే అర్థం ఉంది, ఎందుకంటే “ఒక వ్యక్తి తాను ‘గ్రహించిన’ విషయాల్ని విలువైనవిగా లేదా ప్రాముఖ్యమైనవిగా ఎంచుతాడు” అని ఒక రెఫరెన్సు పుస్తకం చెబుతోంది. కాబట్టి, సత్యాన్ని మన జీవిత విధానంగా మలుచుకున్నప్పుడే మనం సత్యాన్ని పూర్తిగా ‘గ్రహిస్తాం.’ అప్పుడు ‘దేవుని వాక్యం’ మనలో “కార్యసిద్ధి” కలుగజేసి, మన పరలోక తండ్రిని సాధ్యమైనంత ఎక్కువగా అనుకరించేలా మన వ్యక్తిత్వాన్ని మలుస్తుంది.—1 థెస్స. 2:13.

12 మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవాలి, “నేను నిజంగా సత్యాన్ని గ్రహించానా? సత్యాన్ని నా జీవిత విధానంగా చేసుకున్నానా? లేక కొన్ని విషయాల్లో లోకం అందించే ‘స్వేచ్ఛ’ కోసం నేనింకా పరితపిస్తున్నానా?” క్రైస్తవ తల్లిదండ్రుల సంరక్షణలో పెరిగిన ఒక సహోదరి తన అనుభవాన్ని చెబుతోంది. ఆమె యౌవనంలో ఉన్నప్పుడు యెహోవా ఉన్నాడని నమ్మింది కానీ, ఆయన గురించి ఎన్నడూ నిజంగా తెలుసుకోలేదు. ఆమె ఇలా రాసింది, “యెహోవా ద్వేషించే వాటిని ద్వేషించడం నేను ఏనాడూ నేర్చుకోలేదు. నేను చేసే పనుల్ని ఆయన పట్టించుకుంటాడని కూడా నేను ఎన్నడూ నమ్మలేదు. కష్టాలొచ్చినప్పుడు నేను ఆయన సహాయం తీసుకోవాలని కూడా నేర్చుకోలేదు. నా సొంత తెలివితేటలపై ఆధారపడ్డాను. అది నిజంగా తెలివి తక్కువ పని అని ఇప్పుడు నాకు అనిపిస్తోంది. ఎందుకంటే, నిజానికి నాకు అప్పుడు ఏమీ తెలియదు.” సంతోషకరంగా ఆ సహోదరి, తర్వాత తన ఆలోచన తప్పని గుర్తించి, జీవితంలో పెద్ద మార్పులు చేసుకుంది. ఆమె క్రమ పయినీరు సేవ కూడా మొదలుపెట్టింది.

పరిశుద్ధాత్మ సహాయంతో స్వాతంత్ర్యం పొందవచ్చు

13. మనం స్వాతంత్ర్యం పొందడానికి దేవుని పరిశుద్ధాత్మ ఎలా సహాయం చేస్తుంది?

13 ‘ప్రభువు [“యెహోవా,” NW] ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది’ అని 2 కొరింథీయులు 3:17 చెబుతోంది. మనం స్వాతంత్ర్యం పొందడానికి పరిశుద్ధాత్మ ఎలా సహాయం చేస్తుంది? పరిశుద్ధాత్మ మనకు ఎన్నో రకాలుగా సహాయం చేయడమే కాక, స్వాతంత్ర్యాన్ని పొందడానికి అవసరమైన “ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము” వంటి ప్రాముఖ్యమైన లక్షణాల్ని మనలో కలిగిస్తుంది. (గల. 5:22, 23) ఆ లక్షణాలు లేకుండా, ముఖ్యంగా ప్రేమ లేకుండా ఏ సమాజమూ నిజమైన స్వాతంత్ర్యాన్ని పొందలేదు. ఆ వాస్తవం నేటి ప్రపంచంలో కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఆసక్తికరంగా, ఆత్మ ఫలంలోని వివిధ లక్షణాల గురించి చెప్పిన తర్వాత అపొస్తలుడైన పౌలు ఇంకా ఇలా అన్నాడు, “ఇట్టివాటికి విరోధమైన నియమమేదియు లేదు.” ఆయన ఏ ఉద్దేశంతో అలా చెప్పాడు? దేవుని ఆత్మ ఫలంలోని లక్షణాలు మనలో వృద్ధి చెందకుండా ఏ నియమమూ ఆటంకపర్చలేదు. (గల. 5:18) పైగా, అలాంటి విరోధమైన నియమం వల్ల ఒరిగేదేమీ లేదు. మనం ఆత్మఫలంలోని లక్షణాలను అలవర్చుకుంటూ వాటిని ఎల్లప్పుడూ చూపించాలన్నదే దేవుని చిత్తం.

14. లోకంలోని స్ఫూర్తికి లొంగిపోయే వాళ్లను అది ఎలా బానిసలుగా చేసుకుంటుంది?

14 లోకంలోని స్ఫూర్తికి దాసోహమైన ప్రజలు, శారీరక కోరికల్ని తీర్చుకోవడానికే ప్రాముఖ్యతనిచ్చే ప్రజలు తమకు స్వాతంత్ర్యం ఉందని అనుకుంటారు. (2 పేతురు 2:18, 19 చదవండి.) కానీ, అది నిజం కాదు. వాళ్ల హానికరమైన కోరికలను అణచివేయడానికి, వాళ్ల ప్రవర్తనను సరిదిద్దడానికి పుట్టెడు నియమనిబంధనలు అవసరమౌతాయి. ‘ధర్మశాస్త్రము ధర్మవిరోధులకును, అవిధేయులకును నియమింపబడెనుగాని, నీతిమంతునికి నియమింపబడలేదు’ అని పౌలు అన్నాడు. (1 తిమో. 1:8-10) వాళ్లు ‘శరీర కోరికల్ని’ తీర్చుకోవడానికి మొగ్గుచూపుతూ పాపమనే క్రూర యజమానికి కూడా బానిసలుగా ఉంటున్నారు. (ఎఫె. 2:1-3) ఒక విధంగా చెప్పాలంటే వాళ్లు తేనె ఉన్న గిన్నెలోకి నేరుగా పాకే పురుగుల్లాంటివాళ్లు. ఆ పురుగుల్లాగే వాళ్లు తమ కోరికల చేత ఈడ్వబడి చిక్కుకుపోతారు.—యాకో. 1:14, 15.

క్రైస్తవ సంఘంలో స్వాతంత్ర్యం

15, 16. సంఘంతో మన సహవాసం ఎంత ప్రాముఖ్యమైనది? మనం సంఘంలో ఎలాంటి స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తాం?

15 యెహోవా మనల్ని ఆకర్షించినందువల్లే మనం క్రైస్తవ సంఘంలోకి వచ్చాం కానీ, సభ్యత్వం కోసం దరఖాస్తు పెట్టుకొని రాలేదు. (యోహా. 6:44) మరి యెహోవా మనల్ని ఎందుకు ఆకర్షించాడు? మనం నీతిమంతులమనీ, దైవభయంగల వాళ్లమనీ యెహోవా మనల్ని ఆకర్షించాడా? “కానే కాదు!” అని మనకు అనిపించవచ్చు. మరైతే, దేవుడు మనలో ఏమి చూశాడు? స్వాతంత్ర్యాన్నిచ్చే నియమానికి లోబడే హృదయాన్ని, తాను చెప్పినట్లు వినే హృదయాన్ని యెహోవా మనలో చూశాడు. సంఘంలోకి వచ్చాక ఆధ్యాత్మిక ఆహారాన్ని ఇచ్చి పోషించడం ద్వారా, ఒకప్పటి అబద్ధమత నమ్మకాల నుండీ మూఢనమ్మకాల నుండీ స్వాతంత్ర్యాన్ని ఇవ్వడం ద్వారా, క్రీస్తులాంటి వ్యక్తిత్వాన్ని ఎలా అలవర్చుకోవాలో బోధించడం ద్వారా యెహోవా మన హృదయాన్ని కాపాడాడు. (ఎఫెసీయులు 4:22-24 చదవండి.) దానివల్ల, ప్రపంచంలో నిజంగా ‘స్వాతంత్ర్యం పొందిన ప్రజలు’ అని పిలవబడగల ఒకే ఒక్క జనాంగంలో భాగమయ్యే గొప్ప అవకాశం మనకు దొరికింది.—యాకో. 2:12, NW.

16 ఒకసారి ఆలోచించండి. యెహోవాను పూర్ణహృదయంతో ప్రేమించే ప్రజల మధ్య ఉన్నప్పుడు మనం భయపడతామా? భయంతో ఊరికే అటూ ఇటూ చూస్తుంటామా? రాజ్యమందిరంలో ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు, మన వస్తువుల్ని ఎవరైనా కొట్టేస్తారనే భయంతో వాటిని గట్టిగా పట్టుకొని ఉంటామా? లేదు! సురక్షితంగా ఉన్నట్లు భావిస్తాం. కానీ, బయట జరిగే ఏదైనా కార్యక్రమానికి హాజరైతే మనం అలా భావిస్తామా? భావించకపోవచ్చు. ప్రస్తుతం దేవుని ప్రజల మధ్య మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం భవిష్యత్తులో మనం పొందబోయే గొప్ప స్వాతంత్ర్యానికి మచ్చుతునక మాత్రమే.

“దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము”

17. మానవులు స్వాతంత్ర్యాన్ని పొందడానికి, ‘దేవుని కుమారుల ప్రత్యక్షతకు’ సంబంధమేమిటి?

17 భూమ్మీదున్న తన సేవకులకు భవిష్యత్తులో యెహోవా ఇవ్వబోయే స్వాతంత్ర్యం గురించి మాట్లాడుతూ పౌలు ఇలా అన్నాడు, “దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది.” ఆ తర్వాత ఆయన ఇంకా ఇలా అన్నాడు, “సృష్టి, నాశనమునకు లోనయిన దాస్యములో నుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందును.” (రోమా. 8:19-21) “సృష్టి” అనే మాట ఈ భూమ్మీద నిరంతరం జీవించాలని ఎదురుచూస్తూ, దేవుని ఆత్మాభిషిక్త కుమారుల “ప్రత్యక్షత” వల్ల ప్రయోజనం పొందే మానవులను సూచిస్తోంది. పునరుత్థానం చేయబడి పరలోకానికి వెళ్లిన ఆ “కుమారులు” క్రీస్తుతో కలిసి భూమ్మీదున్న దుష్టత్వాన్ని నిర్మూలం చేసి, ‘గొప్ప సమూహాన్ని’ నూతనలోకంలోకి నడిపించినప్పుడు ఆ ప్రత్యక్షత మొదలౌతుంది.—ప్రక. 7:9, 14.

18. దేవునికి విధేయత చూపించే మానవులు ఏ విధంగా మరింత స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తారు? చివరకు వాళ్లు ఎలాంటి స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తారు?

18 విడుదల పొందిన మానవులు పూర్తిగా కొత్త స్వాతంత్ర్యాన్ని అంటే సాతాను, అతని దయ్యాల ప్రభావం నుండి స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తారు. (ప్రక. 20:1-3) అప్పుడు ఎంత ఉపశమనం పొందుతామో కదా! ఆ తర్వాత, క్రీస్తుతో కలిసి పరిపాలించే 1,44,000 మంది రాజులు, యాజకులు విమోచన క్రయధన బలి ప్రయోజనాలను మానవులకు అన్వయిస్తారు. ఆదామువల్ల వచ్చిన పాపం, అపరిపూర్ణత పూర్తిగా తొలగిపోయే వరకు వాళ్లు ఆ ప్రయోజనాలను క్రమక్రమంగా అన్వయిస్తూ మానవులకు స్వాతంత్ర్యాన్ని కలుగజేస్తారు. (ప్రక. 5:9, 10) పరీక్షలు వచ్చినప్పటికీ నమ్మకంగా ఉండడం వల్ల, మన విషయంలో యెహోవా ఉద్దేశించిన పరిపూర్ణ స్వాతంత్ర్యాన్ని అంటే, ‘దేవుని పిల్లలు పొందే మహిమగల స్వాతంత్ర్యాన్ని’ అనుభవిస్తాం. ఒక్కసారి ఆలోచించండి! మన శరీరం పరిపూర్ణతకు చేరుకొని, మన వ్యక్తిత్వం పూర్తిగా దేవుని స్వరూపానికి తగినట్లుగా మారిపోతుంది కాబట్టి, దేవుని దృష్టిలో సరైనది చేయడానికి మనం తంటాలుపడాల్సిన అవసరం ఇక ఉండదు.

19. నిజమైన స్వాతంత్ర్యాన్నిచ్చే మార్గంలో నిలిచి ఉండడానికి మనం ఏమి చేస్తూ ఉండాలి?

19 ‘దేవుని పిల్లలు పొందబోయే మహిమగల స్వాతంత్ర్యాన్ని’ మనం కోరుకుంటున్నామా? అలాగైతే, ‘స్వాతంత్ర్యాన్నిచ్చే సంపూర్ణ నియమాన్ని’ పాటించేలా మన మనసును, హృదయాన్ని మలచుకోవాలి. లేఖనాలను శ్రద్ధగా అధ్యయనం చేయాలి. సత్యాన్ని సొంతం చేసుకొని దానికి అనుగుణంగా జీవించాలి. పరిశుద్ధాత్మ కోసం ప్రార్థించాలి. క్రైస్తవ సంఘం అందించే సహాయాన్ని వినియోగించుకోవాలి, యెహోవా ఇస్తున్న ఆధ్యాత్మిక ఆహారాన్ని పూర్తిగా ఆస్వాదించాలి. దేవుని మార్గాలు అనవసరమైన కట్టుబాట్లను విధిస్తాయని ఆలోచించేలా సాతాను హవ్వను మోసం చేసినట్లే మనల్ని మోసం చేయకుండా చూసుకోవాలి. అపవాది చాలా తెలివిగా ప్రవర్తించవచ్చు కానీ, మనం అతని ‘కుతంత్రములను ఎరుగనివారము కాము’ కాబట్టి, అతని చేతుల్లో ‘మోసపోకుండా’ జాగ్రత్తపడవచ్చు. దాని గురించే మనం తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.—2 కొరిం. 2:11.

[అధ్యయన ప్రశ్నలు]

[9వ పేజీలోని చిత్రాలు]

కొన్ని విషయాల్లో లోకం అందించే ‘స్వేచ్ఛ’ కోసం నేనింకా పరితపిస్తున్నానా?

[9వ పేజీలోని చిత్రాలు]

సత్యాన్ని నా జీవిత విధానంగా మలచుకున్నానా?