కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జీవిత కథ

యెహోవా నాకు తన చిత్తం చేయడం నేర్పించాడు

యెహోవా నాకు తన చిత్తం చేయడం నేర్పించాడు

మాక్స్‌ లాయిడ్‌ చెప్పినది

నేను, నా తోటి మిషనరీ 1955లో దక్షిణ అమెరికాలోని పరాగ్వేలో మిషనరీ సేవ చేస్తున్నప్పుడు ఒక రాత్రి, మేము ఉంటున్న ఇంటి చుట్టూ ఒక అల్లరి మూక చేరి, “మా దేవుడు రక్తదాహం ఉన్న దేవుడు, ఆయనకు గ్రింగోల (విదేశీయుల) రక్తం కావాలి” అంటూ కోపంగా అరవడం మొదలుపెట్టారు. ఇంతకీ గ్రింగోలమైన మేము అక్కడ ఎందుకున్నాం?

నేను ఆస్ట్రేలియాలో పెరిగాను, అక్కడే యెహోవా నాకు తన చిత్తం చేయడాన్ని నేర్పించడం మొదలుపెట్టాడు. 1938లో ఒక యెహోవాసాక్షి మా నాన్నగారికి శత్రువులు (ఆంగ్లం) అనే పుస్తకాన్ని ఇచ్చింది. అప్పటికే, బైబిల్లోని కొన్ని భాగాలు కట్టుకథలని చెబుతున్న స్థానిక మతగురువుల వల్ల మా అమ్మానాన్నలు అసంతృప్తితో ఉన్నారు. దాదాపు ఒక సంవత్సరం తర్వాత, మా అమ్మానాన్నలు యెహోవాకు సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకున్నారు. అప్పటి నుండి మా కుటుంబమంతా యెహోవా చిత్తం చేయడానికే ప్రాముఖ్యతనివ్వడం మొదలుపెట్టింది. ఆ తర్వాత, నాకన్నా ఐదు సంవత్సరాలు పెద్దదైన మా అక్క లెస్లీ బాప్తిస్మం తీసుకుంది, నాకు తొమ్మిదేళ్లు ఉన్నప్పుడు 1940లో నేను బాప్తిస్మం తీసుకున్నాను.

రెండవ ప్రపంచ యుద్ధం మొదలైన వెంటనే, ఆస్ట్రేలియాలో యెహోవాసాక్షుల బైబిలు ప్రచురణలు ముద్రించడం, పంచిపెట్టడం నిషేధించబడింది. కాబట్టి చిన్న వయసు నుండే కేవలం బైబిలు ఉపయోగించి నా విశ్వాసం గురించి వివరించడం నేర్చుకున్నాను. నేను ఎందుకు జెండా వందనం చేయనో, దేశాలు చేస్తున్న యుద్ధ ప్రయత్నాలకు ఎందుకు మద్దతు ఇవ్వనో చూపించడానికి రోజూ నా బైబిలును స్కూలుకు తీసుకువెళ్లేవాణ్ణి.—నిర్గ. 20:4, 5; మత్త. 4:10; యోహా. 17:16; 1 యోహా. 5:21.

స్కూల్లో చాలామంది నాతో ఉండడానికి ఇష్టపడేవాళ్లు కాదు, ఎందుకంటే నేను “జర్మన్‌ గూఢచారిని” అని వాళ్లు అనుకునేవాళ్లు. అప్పట్లో స్కూల్లో సినిమాలు చూపించేవాళ్లు. సినిమా మొదలవడానికి ముందు అందరూ లేచి నిలబడి ఆ దేశ జాతీయ గీతం పాడాలనే నియమం ఉండేది. నేనేమో అలాగే కూర్చుని ఉండేవాణ్ణి కాబట్టి, ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు కలిసి నా జుట్టు పట్టుకుని నన్ను నిలబెట్టడానికి ప్రయత్నించేవాళ్లు. నేను బైబిలు ఆధారిత నమ్మకాలకు అంటిపెట్టుకుని ఉన్నందుకు చివరికి నన్ను స్కూల్లో నుండి తీసేశారు. అయితే, నేను ఇంట్లోనే ఉండి కరెస్పాండెన్స్‌ విద్యను అభ్యసించాను.

పయినీరు సేవ చేయాలనే లక్ష్యాన్ని సాధించాను

నాకు 14 ఏళ్లు వచ్చేసరికి పయినీరుగా పూర్తికాల సేవ మొదలుపెట్టాలనే లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాను. ముందుగా ఉద్యోగాన్ని వెతుక్కుని పని చేయడం మొదలుపెట్టాలని మా అమ్మానాన్నలు చెప్పడంతో నేను చాలా నిరాశచెందాను. నేను ఇంట్లో ఉంటున్నందుకు, భోంచేస్తున్నందుకు డబ్బు కట్టాలని వాళ్లు పట్టుబట్టారు, అయితే నాకు 18 ఏళ్లు వచ్చాక నేను పయినీరు సేవ మొదలుపెట్టవచ్చని వాళ్లన్నారు. దాంతో నేను సంపాదిస్తున్న డబ్బు గురించి ఇంట్లో తరచూ చర్చలు జరుగుతుండేవి. పయినీరు సేవ కోసం దాన్ని దాచుకుంటానని నేను అడిగేవాణ్ణి, కానీ డబ్బంతా వాళ్లే తీసేసుకునేవాళ్లు.

నేను పయినీరు సేవ మొదలుపెట్టే సమయం వచ్చినప్పుడు, అప్పటి వరకు నేను ఇచ్చిన డబ్బంతా బ్యాంకులో వేశామని మా అమ్మానాన్నలు నాకు వివరించారు. బట్టలు కొనుక్కోవడం కోసం, పయినీరు సేవలో అవసరమయ్యే ఇతర ఖర్చుల కోసం వాళ్లు ఆ డబ్బంతా తిరిగి నాకే ఇచ్చేశారు. అలా వాళ్లు, నా అవసరాలు నేనే చూసుకోవాలనీ ఇతరుల మీద ఆధారపడకూడదనీ నాకు నేర్పించారు. వాళ్లు అలా నేర్పించడం వల్ల నేనెంతో ప్రయోజనం పొందాననే చెప్పవచ్చు.

నేను, మా అక్క లెస్లీ పెరిగి పెద్దవాళ్లమవుతుండగా, తరచూ పయినీర్లు వచ్చి మా ఇంట్లో ఉండేవాళ్లు, వాళ్లతో కలిసి పరిచర్యకు వెళ్లడానికి మేమెంతో ఇష్టపడేవాళ్లం. వారాంతాలు ఇంటింటి పరిచర్య చేస్తూ, వీధి సాక్ష్యమిస్తూ, బైబిలు అధ్యయనాలు నిర్వహిస్తూ గడిపేవాళ్లం. నెలకు 60 గంటలు పరిచర్య చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకోమని అప్పట్లో ప్రచారకులను ప్రోత్సహించేవాళ్లు. అమ్మ దాదాపు ఎప్పుడూ ఆ లక్ష్యాన్ని చేరుకునేది, అలా ఆమె నాకూ మా అక్కకూ చక్కని మాదిరి ఉంచింది.

టాస్మేనియాలో పయినీరు సేవ

మొదటిగా, నన్ను ఆస్ట్రేలియాకు చెందిన టాస్మేనియా అనే ద్వీపంలో పయినీరుగా నియమించారు. మా అక్కాబావలు అప్పటికే అక్కడ సేవ చేస్తున్నారు. అయితే, నేను వెళ్లిన కొంతకాలానికే వాళ్లు గిలియడ్‌ పాఠశాల 15వ తరగతికి హాజరవడానికి అక్కడి నుండి వెళ్లిపోయారు. నేను బిడియస్థుడిగా ఉండేవాడిని, పైగా అంతకు ముందెప్పుడూ ఇల్లు వదిలి దూరంగా ఉండలేదు. నేను మూడు నెలల కన్నా ఎక్కువ కాలం అక్కడ ఉండలేనని కొందరు అనుకున్నారు. అయితే, సంవత్సరం గడిచే లోపే అంటే 1950లో, నన్ను కంపెనీ సర్వెంట్‌గా నియమించారు, ఇప్పుడు కంపెనీ సర్వెంట్‌నే పెద్దల సభ సమన్వయకర్త అంటున్నారు. ఆ తర్వాత, నన్ను ప్రత్యేక పయినీరుగా నియమించారు, యౌవనస్థుడైన మరో సహోదరునితో కలిసి నేను ఆ సేవలో కొనసాగాను.

రాగి గనులున్న ఒక మారుమూల పట్టణానికి మమ్మల్ని పంపించారు, అప్పటికి అక్కడ సాక్షులెవరూ లేరు. మేము బస్సులో అక్కడికి చేరుకునే సరికి మధ్యాహ్నం అయ్యింది. ఆ రాత్రికి మేము ఒక పాత హోటల్‌లో ఉన్నాం. తర్వాతి రోజు మేము ఇంటింటి పరిచర్యకు వెళ్లినప్పుడు, ఆ ప్రాంతంలో గది అద్దెకు దొరుకుతుందేమో చెప్పమని గృహస్థులను అడిగాం. సాయంకాలం కావస్తుండగా, ప్రెస్బిటేరియన్‌ చర్చిపక్కనున్న మతగురువు ఇంట్లో ఒక గది ఖాళీగా ఉందనీ, మేము దాని కోసం ఆ డీకన్‌తో మాట్లాడవచ్చనీ ఒక వ్యక్తి చెప్పాడు. ఆ డీకన్‌ మాతో స్నేహపూర్వకంగా మాట్లాడి మాకు గది ఇచ్చాడు. ప్రకటనాపనికి వెళ్లడానికి ప్రతీరోజు మతగురువు ఇంట్లో నుండి బయటికి రావడం మాకే కాస్త వింతగా అనిపించేది.

ఆ ప్రాంతంలో చాలామంది సత్యం గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపించేవాళ్లు. గృహస్థులతో చక్కని చర్చలు జరిగేవి, దానివల్ల మేము ఎన్నో బైబిలు అధ్యయనాలు మొదలుపెట్టగలిగాం. మా పని గురించి, మతగురువు ఇంట్లో యెహోవాసాక్షులు ఉంటున్నారనే విషయం గురించి రాజధానిలో ఉన్న చర్చి అధికారులకు తెలిసే సరికి మమ్మల్ని వెంటనే ఇంట్లో నుండి పంపించేయమని వాళ్లు డీకన్‌కు ఆజ్ఞాపించారు. దాంతో మాకు మళ్లీ తలదాచుకోవడానికి చోటు లేకుండా పోయింది.

తర్వాతి రోజు మధ్యాహ్నం వరకు ప్రకటనాపని చేసిన తర్వాత, ఆ రాత్రి గడపడానికి చోటు కోసం వెదికాం. స్టేడియంలోని గ్రాండ్‌స్టాండ్‌ (పైకప్పు ఉన్న ప్రేక్షకుల సీట్లు) తప్ప గత్యంతరం లేదనుకుని, మా సూట్‌కేసులు అక్కడే దాచి, ప్రకటనాపనిని తిరిగి కొనసాగించాం. అలా నెమ్మదిగా సాయంకాలమై చీకటి పడుతున్నా మరికొన్ని ఇళ్లు చేసి ఆ వీధి ముగించేద్దాం అనుకున్నాం. ఒక గృహస్థునికి ప్రకటిస్తుండగా, ఆయన తన స్థలంలో ఉన్న రెండు గదుల చిన్న ఇంట్లో మేము ఉండవచ్చని చెప్పాడు.

ప్రయాణ సేవ, గిలియడ్‌ పాఠశాల

అక్కడ దాదాపు ఎనిమిది నెలలపాటు సేవ చేసిన తర్వాత, ప్రయాణ పర్యవేక్షకుడిగా సేవ చేయమని ఆహ్వానిస్తూ నాకు ఆస్ట్రేలియా బ్రాంచి కార్యాలయం నుండి ఒక ఉత్తరం వచ్చింది. దాంతో నేను చాలా ఆశ్చర్యపోయాను, ఎందుకంటే అప్పటికి నాకు ఇరవై ఏళ్లే. కొన్ని వారాలపాటు శిక్షణ పొందిన తర్వాత, ప్రయాణ సేవ చేస్తూ సంఘాలను ప్రోత్సహించడం మొదలుపెట్టాను. నేను వెళ్లిన సంఘాల్లో చాలామంది వయసులో నా కన్నా పెద్దవాళ్లే అయినా, చిన్నవాడినని నన్ను చిన్నచూపు చూడకుండా, నేను చేస్తున్న పనిని ఎంతో గౌరవించేవాళ్లు.

ఒక సంఘం నుండి మరో సంఘానికి వెళ్లడానికి ఒక వారం ట్రామ్‌కారులో వెళితే, మరో వారం బస్సులో, ఆ తర్వాతి వారం కారులో అలా వివిధ రకాలుగా ప్రయాణించేవాణ్ణి. ఒక్కోసారైతే మోటర్‌సైకిల్‌ మీద వెనక కూర్చొని ఒక చేత్తో సూట్‌కేసు మరో చేత్తో పరిచర్యకు తీసుకువెళ్లే బ్యాగు పట్టుకుని బ్యాలెన్స్‌ చేసుకుంటూ వెళ్లాల్సి వచ్చేది. తోటి సాక్షుల ఇళ్లలో ఉండడం నిజంగా సంతోషాన్నిచ్చేది. కంపెనీ సర్వెంట్‌గా సేవ చేస్తున్న ఒక సహోదరుడు తన ఇంటి నిర్మాణం ఇంకా పూర్తి కాకపోయినా నన్ను తన ఇంట్లో ఉంచుకోవాలని చాలా ఇష్టపడ్డాడు. ఆ వారమంతా బాత్‌టబ్‌లోనే నా పడక. అయితే వసతి ఏర్పాట్లు అస్తవ్యస్తంగా ఉన్నా ఆ వారం మేమిద్దరం ఆధ్యాత్మికంగా ఎంతో ఆనందాన్ని పొందాం.

1953లో గిలియడ్‌ పాఠశాల 22వ తరగతికి హాజరవడానికి నాకు దరఖాస్తు అందడంతో నేను మరోసారి ఆశ్చర్యపోయాను. నాకు ఎంతో సంతోషమనిపించినా, ఒక పక్క వ్యాకులత ఉండనే ఉంది. ఎందుకంటే 1950లో జూలై 30న మా అక్కాబావలు గిలియడ్‌ పాఠశాల నుండి పట్టభద్రులై పాకిస్థాన్‌కు మిషనరీలుగా వెళ్లి సంవత్సరం కూడా గడవక ముందే మా అక్కకు జబ్బుచేసింది, దాంతో ఆమె అక్కడే చనిపోయింది. అలా జరిగి ఎంతోకాలం కాకముందే, నేను కూడా మా అమ్మానాన్నలకు దూరంగా ఎక్కడికో వెళ్లిపోతే వాళ్లు బాధపడతారేమో అనుకున్నాను. కానీ వాళ్లు, “యెహోవా ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్లి ఆయన సేవ చెయ్యి” అన్నారు. అలా వెళ్లిపోయిన తర్వాత నేను మా నాన్నగారిని మళ్లీ ఎప్పుడూ చూడలేదు. ఆయన 1957లో చనిపోయారు.

కొంతకాలానికే మరో ఐదుగురు ఆస్ట్రేలియన్లతో కలిసి నేను ఓడలో న్యూయార్క్‌ నగరానికి బయలుదేరాను, అది ఆరు వారాల ప్రయాణం. ప్రయాణంలో మేము బైబిలు చదువుతూ అధ్యయనం చేస్తూ గడిపాం. అంతేకాక తోటి ప్రయాణికులకు సాక్ష్యమిచ్చాం. న్యూయార్క్‌లో గిలియడ్‌ పాఠశాల నిర్వహించబడే సౌత్‌ లాన్సింగ్‌కు వెళ్లకముందు మేము యాంకీ స్టేడియంలో అంతర్జాతీయ సమావేశానికి హాజరయ్యాం. ఆ సమావేశం 1953 జూలైలో జరిగింది. ఎన్నడూ లేనంతగా 1,65,829 మంది ఆ సమావేశానికి వచ్చారు.

గిలియడ్‌ పాఠశాలలోని మా తరగతిలో భూమి నలుమూలల నుండి వచ్చిన 120 మంది విద్యార్థులు ఉన్నారు. మా సేవా నియామకాల గురించి స్నాతకోత్సవం జరిగే రోజు వరకు మాకు చెప్పలేదు. ఆ రోజు మమ్మల్ని ఏయే దేశాలకు నియమించారో చెప్పిన వెంటనే, ఆ దేశాలకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి మేము గిలియడ్‌ లైబ్రరీకి పరుగులు తీశాం. నేను సేవ చేయాల్సిన పరాగ్వే దేశంలో ఎన్నో రాజకీయ విప్లవాలు జరిగాయని తెలుసుకున్నాను. నేను పరాగ్వేకు వెళ్లిన కొంతకాలానికే ఒకరోజు ఉదయం, ‘రాత్రి జరిగిన “వేడుక” ఏమిటి?’ అని నేను నా తోటి మిషనరీలను అడిగాను. వాళ్లు చిరునవ్వుతో, “నువ్వు ఇక్కడికి వచ్చాక జరుగుతున్న మొదటి విప్లవం! ఒకసారి బయటకు చూడు” అన్నారు. ఇంకేముంది, ఎటు చూసినా సైనికులే!

మరచిపోలేని ఒక అనుభవం

ఒక సందర్భంలో నేను మా ప్రయాణ పర్యవేక్షకుడితో కలిసి మారుమూల ప్రాంతంలో ఉన్న ఒక సంఘాన్ని సందర్శించి, కార్యనిర్వహణలోనున్న నూతనలోక సంస్థ (ఆంగ్లం) అనే వీడియో చూపించడానికి వెళ్లాను. మేము ముందుగా రైల్లో, ఆ తర్వాత గుర్రపు బండిలో, చివరకు ఎడ్ల బండిలో అలా దాదాపు ఎనిమిది, తొమ్మిది గంటల ప్రయాణం చేశాం. మాతోపాటు ఒక జెనరేటర్‌ను, ప్రొజెక్టర్‌ను తీసుకెళ్లాం. ఆఖరికి మేము వెళ్లాల్సిన ప్రాంతానికి చేరుకుని, మరుసటి రోజంతా మేము వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లి ఆ రాత్రి వీడియో చూడడానికి రమ్మని ప్రజల్ని ఆహ్వానించాం. అది చూడడానికి దాదాపు 15 మంది వచ్చారు.

వీడియో మొదలైన దాదాపు 20 నిమిషాలకే, త్వరగా ఇంటి లోపలికి వెళ్లమని మాకు చెప్పారు. మేము వెంటనే ప్రొజెక్టర్‌ తీసుకొని ఇంట్లోకి వెళ్లిపోయాం. ఆ తర్వాతే, నేను మొదట్లో ప్రస్తావించినట్లుగా, ఒక అల్లరి మూక తుపాకులు పేలుస్తూ, “మా దేవుడు రక్తదాహం ఉన్న దేవుడు, ఆయనకు గ్రింగోల (విదేశీయుల) రక్తం కావాలి” అని నినాదాలు చేస్తూ అరవడం మొదలుపెట్టారు. నిజానికి అక్కడున్నది ఇద్దరు గ్రింగోలే, వాళ్లల్లో నేనొకణ్ణి. వీడియో చూడడానికి వచ్చిన వాళ్లు ఆ అల్లరిమూకను ఇంట్లోకి రాకుండా ఆపారు. కానీ, వాళ్లు తెల్లవారుజామున దాదాపు మూడు గంటలకు మళ్లీ వచ్చి తుపాకులు పేలుస్తూ, పట్టణానికి తిరిగి వెళ్తున్నప్పుడు దారిలో చూసుకుంటామని బెదిరించి వెళ్లారు.

అక్కడి సహోదరులు ఆ ప్రాంతంలోని షెరీఫ్‌ను (శాంతిభద్రతలను పరిరక్షించే అధికారిని) సంప్రదించారు. దాంతో ఆ రోజు మధ్యాహ్నం ఆయన మమ్మల్ని పట్టణానికి తీసుకువెళ్లడానికి రెండు గుర్రాలతో మా దగ్గరికి వచ్చాడు. మేము బయలుదేరాక, దారిలో గుబురుగా ఉన్న పొదల్లాంటివి వచ్చిన ప్రతీసారి ఎవరైనా ఉన్నారేమో చూడడానికి ఆయన తన తుపాకీ తీసుకొని ముందుకు వెళ్లి వచ్చేవాడు. అలా మేము క్షేమంగా అక్కడి నుండి బయటపడ్డాం. ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్లడానికి గుర్రం ఎంతగా ఉపయోగపడుతుందో నేను అప్పుడే చూశాను. ఆ తర్వాత నేనూ ఒక గుర్రం కొనుక్కున్నాను.

పరాగ్వేకు కొత్త మిషనరీలు వచ్చారు

చర్చీ నాయకుల నుండి ఎంత వ్యతిరేకత ఉన్నా మా ప్రకటనాపని వల్ల మంచి ఫలితాలు వచ్చాయి. 1955లో పరాగ్వేకు ఐదుగురు కొత్త మిషనరీలు వచ్చారు. గిలియడ్‌ పాఠశాల 25వ తరగతి నుండి పట్టభద్రురాలైన కెనడా దేశస్థురాలు ఎల్సీ స్వాన్సన్‌ వాళ్లలో ఒకరు. ఆమె అక్కడ నుండి వేరే ప్రాంతానికి వెళ్లకముందు కొంతకాలంపాటు మేము బ్రాంచి కార్యాలయంలో ఉన్నాము. ఆమె తల్లిదండ్రులు సత్యంలో లేరు కాబట్టి వాళ్ల సహాయం లేకుండానే ఆమె తన జీవితాన్ని యెహోవా సేవకు అంకితం చేసుకుంది. 1957 డిసెంబరు 31న ఎల్సీ, నేను పెళ్లి చేసుకున్నాం. ఆ తర్వాత మేమిద్దరం పరాగ్వేలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న మిషనరీ గృహంలో నివసించసాగాం.

అక్కడ నీటి సరఫరా లేదు కానీ, మా ఇంటి పెరట్లో ఒక బావి ఉండేది. మాకు బాత్రూమ్‌, వాషింగ్‌ మెషిన్‌, ఫ్రిజ్‌ వగైరా ఏమీ లేవు. మేము ఏ రోజు భోజనం ఆ రోజు కొనుక్కొని తినేవాళ్లం. కానీ ఆ సంవత్సరాల్లో మా జీవితం సరళంగా ఉండడం వల్ల, సంఘంలోని సహోదర సహోదరీలతో ఉన్న ప్రేమానుబంధాల వల్ల మా వివాహ జీవితం సంతోషంగా సాగింది.

1963లో మా అమ్మను చూడడానికి మేము ఆస్ట్రేలియాకు వెళ్లాం. పది సంవత్సరాల తర్వాత మా అమ్మ నన్ను చూసింది. బహుశా నన్ను చూడడం వల్ల సంతోషం పట్టలేకేమో ఆమెకు గుండె పోటు వచ్చింది. మేము పరాగ్వేకు తిరిగి వెళ్లాల్సిన సమయం వచ్చినప్పుడు, మా జీవితాల్లో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ‘ఏదైనా ఒక ఆసుపత్రిలో అమ్మను చేర్పించి, ఎవరైనా అమ్మను చూసుకుంటారులే అనే ఆశతో మాకెంతో ఇష్టమైన మా సేవా నియామకంలో కొనసాగాలా?’ అనేది నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నేను, ఎల్సీ ఎంతగానో ప్రార్థించాక అమ్మను చూసుకోవడానికి ఆమె దగ్గరే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాం. 1966లో అమ్మ చనిపోయేంతవరకు మేము ఆమెను చూసుకుంటూ పూర్తికాల సేవలో కొనసాగాం.

ఆస్ట్రేలియాలో చాలా సంవత్సరాల పాటు ప్రాంతీయ పర్యవేక్షకుడిగా, జిల్లా పర్యవేక్షకుడిగా సేవ చేస్తూ రాజ్య పరిచర్య పాఠశాలల్లో సంఘ పెద్దలకు బోధించే గొప్ప అవకాశాన్ని పొందాను. ఆ తర్వాత మా జీవితంలో మరో మార్పు వచ్చింది. ఆస్ట్రేలియా బ్రాంచి కార్యాలయంలో బ్రాంచి కమిటీ సభ్యునిగా సేవ చేసే నియామకాన్ని అందుకున్నాను. కొంతకాలానికి, కొత్త బ్రాంచి కార్యాలయాన్ని నిర్మించాల్సిన సమయం వచ్చినప్పుడు నన్ను నిర్మాణ కమిటీ ఛైర్మన్‌గా నియమించారు. అనుభవంగల, మంచి సహకారం అందించే ఎంతోమంది పనివాళ్ల తోడ్పాటుతో ఒక అందమైన బ్రాంచి కార్యాలయాన్ని నిర్మించగలిగాం.

ఆ తర్వాత నన్ను బ్రాంచి కార్యాలయంలోని సర్వీస్‌ డిపార్ట్‌మెంట్‌కు నియమించారు. ఆ డిపార్ట్‌మెంట్‌ ఒక దేశంలో జరిగే ప్రకటనాపనికి సంబంధించిన కార్యకలాపాలన్నిటినీ చూసుకుంటుంది. ప్రపంచంలోని వివిధ బ్రాంచి కార్యాలయాలను సందర్శిస్తూ అక్కడి సహోదరులకు సహాయాన్ని, ప్రోత్సాహాన్ని అందించే జోన్‌ పర్యవేక్షకునిగా సేవ చేసే గొప్ప అవకాశం కూడా నాకు దొరికింది. కొన్ని దేశాలను సందర్శించినప్పుడు, యెహోవాకు లోబడి ఉన్నందువల్ల ఎన్నో ఏళ్లపాటు, దశాబ్దాల పాటు జైళ్లలో, నిర్బంధ శిబిరాల్లో గడిపిన నమ్మకస్థులైన సహోదరులను కలిశాను. ప్రత్యేకంగా అప్పుడు నా విశ్వాసం ఎంతగానో బలపడింది.

ప్రస్తుతం మా సేవా నియామకం

మేము 2001లో జోన్‌ సందర్శనం ముగించుకొని ఎంతో అలసిపోయి తిరిగివచ్చాక ఒక ఉత్తరాన్ని అందుకున్నాం. కొత్తగా ఏర్పడిన అమెరికా బ్రాంచి కార్యాలయంలో బ్రాంచి కమిటీ సభ్యునిగా సేవ చేయడానికి న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌కు రమ్మనే ఆహ్వానం ఆ ఉత్తరంలో ఉంది. మేమిద్దరం కలిసి ఆ ఆహ్వానం గురించి బాగా ఆలోచించుకున్నాక సంతోషంగా ఆ నియామకాన్ని స్వీకరించాం. ఇప్పటికి 11 కన్నా ఎక్కువ సంవత్సరాలుగా మేము బ్రూక్లిన్‌లోనే సేవ చేస్తున్నాం.

యెహోవా కోరినవన్నీ చేయడానికి సిద్ధంగా ఉండే భార్య దొరికినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. మా ఇద్దరికీ ఇప్పుడు 81 ఏళ్లు. అయినా ఇప్పటికీ మా ఆరోగ్యం బాగానే ఉంది. నిరంతరం యెహోవా బోధలు వింటూ ఉండే సమయం కోసం, యెహోవా చిత్తం చేస్తూ ఉండే వాళ్లకు ఆయన ఇచ్చే గొప్ప ఆశీర్వాదాల కోసం మేము ఎదురుచూస్తున్నాం.

[19వ పేజీలోని బ్లర్బ్‌]

ఒక వారం ట్రామ్‌కారులో, మరో వారం బస్సులో, ఆ తర్వాతి వారం కారులో, ఒక్కోసారైతే మోటర్‌సైకిల్‌ మీద వెనక కూర్చొని ఒక చేత్తో సూట్‌కేసు మరో చేత్తో పరిచర్యకు తీసుకువెళ్లే బ్యాగు పట్టుకుని బ్యాలెన్స్‌ చేసుకుంటూ ప్రయాణించేవాణ్ణి

[21వ పేజీలోని బ్లర్బ్‌]

నిరంతరం యెహోవా బోధలు వింటూ ఉండే సమయం కోసం మేము ఎదురుచూస్తున్నాం

[18వ పేజీలోని చిత్రాలు]

ఎడమ: నేను ఆస్ట్రేలియాలో ప్రాంతీయ పర్యవేక్షకుడిగా సేవచేస్తున్నప్పుడు

కుడి: మా అమ్మానాన్నలతో నేను

[20వ పేజీలోని చిత్రం]

మా పెళ్లి రోజు, 1957 డిసెంబరు 31