కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

స్వాతంత్రాన్నిచ్చే దేవుణ్ణి సేవించండి

స్వాతంత్రాన్నిచ్చే దేవుణ్ణి సేవించండి

స్వాతంత్రాన్నిచ్చే దేవుణ్ణి సేవించండి

“మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు.”—1 యోహా. 5:3.

మీరు జవాబివ్వగలరేమో చూడండి:

దేవుని నియమాలు భారమైనవని మనం అనుకునేలా చేయడానికి సాతాను ఎలా ప్రయత్నిస్తాడు?

మనం సహవాసుల్ని ఎంచుకుంటున్నప్పుడు ఎందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి?

స్వాతంత్రాన్నిచ్చే దేవుని పట్ల విశ్వసనీయంగా ఉండేందుకు మనకేది సహాయం చేస్తుంది?

1. యెహోవా తనకున్న స్వాతంత్ర్యాన్ని ఎలా ఉపయోగిస్తాడు? ఆదాముహవ్వలకు ఆయన ఏ స్వేచ్ఛను ఇచ్చాడు?

 యెహోవాకు మాత్రమే సంపూర్ణ స్వాతంత్ర్యం ఉంది. అయినా, ఆయన దాన్ని ఎన్నడూ దుర్వినియోగం చేయడు లేదా దాన్ని ఉపయోగించుకొని, తన సేవకులు చేసే ప్రతీ చిన్న పనిని నిర్దేశించడు. అయితే సొంతగా నిర్ణయాలు తీసుకొని తమకున్న సరైన కోరికల్ని తీర్చుకునే స్వేచ్ఛను వాళ్లకు ఇచ్చాడు. ఉదాహరణకు, యెహోవా ఆదాముహవ్వలకు “మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను” తినకూడదనే ఒకే ఒక్క హద్దును విధించాడు. (ఆది. 2:17) ఒకవైపు సృష్టికర్తకు నచ్చిన విధంగా జీవిస్తూనే మరోవైపు గొప్ప స్వాతంత్ర్యాన్ని కలిగి ఉండే అవకాశం వాళ్లకు దొరికింది.

2. మన మొదటి తల్లిదండ్రులు దేవుడిచ్చిన స్వేచ్ఛను ఎందుకు కోల్పోయారు?

2 యెహోవా మన మొదటి తల్లిదండ్రులైన ఆదాముహవ్వలకు అంత స్వాతంత్ర్యాన్ని లేక స్వేచ్ఛను ఎందుకు ఇచ్చాడు? ఆయన వాళ్లను తన స్వరూపంలో సృష్టించి వాళ్లకు మనస్సాక్షిని ఇచ్చాడు. కాబట్టి, తమ సృష్టికర్త పట్ల వాళ్లకున్న ప్రేమ వాళ్లను సరైన మార్గంలో నడిపిస్తుందని ఆయన ఆశించడం సరైనదే. (ఆది. 1:27; రోమా. 2:15) విచారకరంగా, తమ సృష్టికర్త తమకు ఇచ్చిన స్వేచ్ఛను బట్టి ఆదాముహవ్వలు ఆయనకు కృతజ్ఞత చూపించలేదు. వాళ్లు సాతాను శోధనకు లొంగిపోయి తమది కాని స్వేచ్ఛను అంటే, మంచి చెడులను నిర్ణయించుకునే స్వేచ్ఛను పొందాలనుకున్నారు. దానివల్ల వాళ్లు ఎక్కువ స్వేచ్ఛనేమీ పొందలేదు కానీ, తమను తాము పాపానికి బానిసలుగా అమ్మేసుకున్నారు, అలాగే తమ సంతానాన్ని కూడా అమ్మేశారు. దానివల్ల ఎన్నో దుష్ఫలితాలు వచ్చాయి.—రోమా. 5:12.

3, 4. యెహోవా ప్రమాణాలకు సంబంధించి సాతాను మనల్ని ఎలా మోసం చేస్తాడు?

3 దేవుని సర్వాధిపత్యాన్ని తిరస్కరించేలా సాతాను కొందరు దేవదూతలతో సహా ఇద్దరు పరిపూర్ణ మానవుల్ని మోసగించగలిగాడంటే, మనల్ని కూడా మోసం చేయగలడు. అతడు దాదాపు అప్పుడు ఉపయోగించిన పద్ధతినే ఇప్పుడు కూడా ఉపయోగిస్తున్నాడు. దేవుని ప్రమాణాలు భారమైనవని, మనకు సంతోషం, సరదా అనేవే లేకుండా చేస్తాయని ఆలోచించేలా సాతాను మనల్ని మోసగించడానికి ప్రయత్నిస్తాడు. (1 యోహా. 5:3) మనం తరచూ అలా ఆలోచిస్తే, మనం దాని ప్రభావానికి లోనయ్యే ప్రమాదం ఉంది. గతంలో లైంగిక అనైతికతకు పాల్పడిన 24 ఏళ్ల ఒక సహోదరి ఇలా చెప్పింది, “చెడు స్నేహితుల వల్ల నాకెంతో హాని జరిగింది. ముఖ్యంగా నేను వాళ్ల అభిప్రాయాలకు భిన్నమైన అభిప్రాయాలు కలిగివుండేందుకు భయపడినందువల్ల అలా జరిగింది.” బహుశా మీకు కూడా తోటి వాళ్ల నుండి అలాంటి ఒత్తిడే ఎదురైవుంటుంది.

4 విచారకరంగా, కొన్నిసార్లు క్రైస్తవ సంఘంలోని కొందరి వల్ల కూడా మనపై చెడు ప్రభావం పడే అవకాశం ఉంది. ఒక యువ సహోదరుడు ఇలా అన్నాడు, “సంఘంలో కొంతమంది యువకులు అవిశ్వాసులతో డేటింగ్‌ చేసేవాళ్లు. ఆ యువకులతో నేను ఎంత ఎక్కువగా కలిసి ఉంటే అంత ఎక్కువగా వాళ్లలాగే తయారౌతున్నానని కొంతకాలానికి గ్రహించాను. యెహోవాతో నాకున్న వ్యక్తిగత సంబంధం దెబ్బతినడం మొదలైంది. కూటాల్లో అందించబడే ఆధ్యాత్మిక ఆహారంపై మక్కువ తగ్గింది. పరిచర్యకు కూడా ఎప్పుడో ఒకసారి వెళ్లేవాణ్ణి. వాళ్లతో సహవాసం మానుకోవాలనడానికి అవే సంకేతాలని నాకు అర్థమైంది. దాంతో నేను వాళ్లతో సహవసించడం ఆపేశాను.” మీ సహవాసుల వల్ల మీపై ఎంత ప్రభావం పడుతుందో మీకు తెలుసా? ఇప్పుడు మనకు సహాయకరంగా ఉండే ఒక బైబిలు ఉదాహరణను చూద్దాం.—రోమా. 15:4.

ప్రజల్ని తనతట్టు తిప్పుకున్నాడు

5, 6. అబ్షాలోము ఇతరులను ఎలా మోసం చేశాడు? ఆయన కుట్ర ఫలించిందా?

5 ఇతరులపై చెడు ప్రభావం చూపించినవాళ్ల ఉదాహరణలు బైబిల్లో చాలా ఉన్నాయి. దావీదు రాజు కుమారుడైన అబ్షాలోము అలాంటి వాళ్లలో ఒకడు. అబ్షాలోము చాలా అందగాడు. అయితే కాలం గడుస్తుండగా, సాతానులాగే ఆయన విపరీతమైన దురాశతో తన తండ్రి సింహాసనాన్ని చేజిక్కించుకోవాలని అనుకున్నాడు, నిజానికి ఆయన ఆ సింహాసనాన్ని అధిష్ఠించడానికి అర్హుడు కాడు. a కుయుక్తిగా రాజరికాన్ని చేజిక్కించుకునే ప్రయత్నంలో అబ్షాలోము తన తోటి ఇశ్రాయేలీయులపై తనకు ఎంతో శ్రద్ధ ఉన్నట్లు తెలివిగా నటిస్తూ, వాళ్లకు న్యాయం చేసేవాళ్లు రాజు దగ్గర ఎవ్వరూ లేరని అనుకునేలా చేశాడు. ఏదెను తోటలో ఆదాము హవ్వలతో మాట్లాడిన అపవాదిలాగే, అబ్షాలోము కూడా తానే ప్రజలకు మేలు చేస్తానన్నట్లు మాట్లాడుతూ కన్న తండ్రి మీదే పచ్చి అబద్ధాలు చెప్పాడు.—2 సమూ. 15:1-5.

6 అబ్షాలోము కుయుక్తిగా పన్నిన కుట్ర ఫలించిందా? కొంతమేరకు ఫలించిందనే చెప్పవచ్చు. ఎందుకంటే, ‘అబ్షాలోము ఇశ్రాయేలీయులనందరిని తనతట్టు త్రిప్పుకొనెను’ అని బైబిలు వృత్తాంతం చెబుతోంది. (2 సమూ. 15:6) కానీ చివరికి, అబ్షాలోము తన అహంకారం వల్ల నాశనాన్ని కొనితెచ్చుకున్నాడు. విచారకరంగా అబ్షాలోము, ఆయన పన్నాగాల వల్ల మోసపోయిన వేలాదిమంది ఇతరులు చనిపోయారు.—2 సమూ. 18:7, 14-17.

7. అబ్షాలోముకు సంబంధించిన వృత్తాంతంలో మనకు ఏ పాఠాలు ఉన్నాయి? (14వ పేజీలో ఉన్న చిత్రాన్ని చూడండి.)

7 ఆ ఇశ్రాయేలీయులు అంత సులభంగా ఎందుకు మోసపోయారు? బహుశా, అబ్షాలోము తమకు వాగ్దానం చేసినవాటిని వాళ్లు ఆశించి ఉంటారు. లేదా ఆయన పైరూపాన్ని బట్టి మోసపోయి ఉంటారు. విషయమేదైనా ఒకటి మాత్రం నిజం: వాళ్లు యెహోవా పట్ల, ఆయన నియమించిన రాజు పట్ల విశ్వసనీయంగా లేరు. ఇప్పుడు కూడా యెహోవా సేవకుల్ని సాతాను తనవైపు తిప్పుకోవడానికి అబ్షాలోము లాంటి వ్యక్తుల్ని ఉపయోగించుకుంటున్నాడు. ‘యెహోవా ప్రమాణాలను పాటించడం చాలా కష్టం’ అనీ, ‘యెహోవాను సేవించని ప్రజలు జీవితాన్ని ఎంత సరదాగా గడుపుతున్నారో చూడండి’ అనీ వాళ్లు అనవచ్చు. అవి పచ్చి అబద్ధాలని గ్రహించి మనం దేవుని పట్ల విశ్వసనీయంగా ఉంటామా? యెహోవా “సంపూర్ణమైన నియమము” అంటే క్రీస్తు నియమము మాత్రమే మనకు నిజమైన స్వాతంత్ర్యాన్ని ఇస్తుందని గుర్తిస్తామా? (యాకో. 1:25) అలాగైతే, ఆ నియమాన్ని విలువైనదిగా ఎంచి, క్రైస్తవులముగా మనకున్న స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేయాలనే శోధనకు మనం ఎన్నడూ లొంగిపోకూడదు.—1 పేతురు 2:16 చదవండి.

8. యెహోవా ప్రమాణాలను లెక్కచేయకపోవడం వల్ల దుఃఖం కలుగుతుందని ఏ నిజ జీవిత అనుభవాలు చూపిస్తున్నాయి?

8 సాతాను ప్రత్యేకంగా యౌవనుల మీదే నిఘా వేసి ఉంచాడు. ప్రస్తుతం 30లలో ఉన్న ఒక సహోదరుడు తాను టీనేజీలో ఉన్నప్పుడు ఎలా ఆలోచించాడో చెబుతూ ఇలా రాశాడు, “యెహోవా నైతిక ప్రమాణాలు నా స్వేచ్ఛకు అడ్డుపడుతున్నాయని భావించానేగానీ వాటివల్ల నాకు మేలు జరుగుతుందని అనుకోలేదు.” అందుకే ఆయన లైంగిక అనైతికతకు పాల్పడ్డాడు. కానీ, దానివల్ల ఆయన ఎలాంటి సంతోషాన్నీ పొందలేదు. ఆయన ఇలా అన్నాడు, “ఎన్నో సంవత్సరాల పాటు అపరాధ భావాలతో, పశ్చాత్తాపంతో కుమిలిపోయాను.” మరో సహోదరి కూడా తన టీనేజీ సంవత్సరాల గురించి మాట్లాడుతూ ఇలా రాసింది, ‘అనైతికతకు పాల్పడిన తర్వాత ఎంతో దుఃఖం కలుగుతుంది, అంతేకాక ఎందుకూ పనికిరానివాళ్లమనే భావన మనలో చోటుచేసుకుంటుంది. నేను తప్పు చేసి ఇప్పటికి 19 సంవత్సరాలు గడిచిపోయాయి కానీ, చేదు జ్ఞాపకాలు ఇప్పటికీ నా మనసులో మెదులుతుంటాయి.’ మరో సహోదరి ఇలా రాసింది, “నా చెడు ప్రవర్తన నేనెంతో ప్రియాతిప్రియంగా ఎంచే మావాళ్లను ఎంతగానో కృంగిదీసిందనే ఆలోచన వల్ల నేను చాలా కుమిలిపోయాను, నా ఆధ్యాత్మికత కూడా ఘోరంగా దెబ్బతింది. యెహోవా ఆమోదం లేని బ్రతుకు చాలా దుర్భరంగా ఉంటుంది.” పాపం వల్ల వచ్చే అలాంటి చెడు ఫలితాల గురించి మనం ఆలోచించడం సాతానుకు ఇష్టం లేదు.

9. (ఎ) యెహోవానూ, ఆయన ఇచ్చిన నియమాలనూ సూత్రాలనూ మనమెలా దృష్టిస్తున్నామో తెలుసుకోవాలంటే మనం ఏ ప్రశ్నలు వేసుకోవాలి? (బి) దేవుని గురించి బాగా తెలుసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?

9 విచారకరంగా, పాపభరిత సుఖభోగాల వల్ల తీరని నష్టం కలుగుతుందని సత్యంలో ఉన్న ఎంతోమంది యౌవనులు, వయోజనులు ఎన్నో బాధలుపడ్డ తర్వాతే గ్రహించారు. (గల. 6:7, 8) కాబట్టి మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవాలి, ‘సాతాను కుతంత్రాలు నిజంగా ఎంతో మోసపూరితమైనవని నేను గుర్తిస్తున్నానా? యెహోవాను నా మేలు కోరే, ఎప్పుడూ సత్యమే చెప్పే అతి దగ్గరి స్నేహితునిగా నేను దృష్టిస్తున్నానా? నాకు నిజంగా మేలు చేసేవాటిని, గొప్ప సంతోషాన్ని చేకూర్చే వాటిని యెహోవా తప్పకుండా ఇస్తాడనే విషయాన్ని నేను పూర్తిగా నమ్ముతున్నానా?’ (యెషయా 48:17, 18 చదవండి.) ఆ ప్రశ్నలకు ‘అవును’ అని మనస్ఫూర్తిగా జవాబు చెప్పాలంటే, యెహోవా గురించి మనకు పైపై జ్ఞానం ఉంటే సరిపోదు. కానీ, మనం ఆయన గురించి చాలా ఎక్కువగా తెలుసుకోవాలి, అంతేకాక బైబిల్లో ఉన్న నియమాలనూ సూత్రాలనూ మనపై ప్రేమతోనే ఇచ్చాడని, మనల్ని కట్టి పడేయడానికి కాదని మనం గుర్తించాలి.—కీర్త. 25:14.

వివేకాన్ని చూపించేందుకు, లోబడి ఉండేందుకు సహాయం చేయమని ప్రార్థించండి

10. యౌవనస్థుడైన సొలొమోను రాజును అనుకరించడానికి మనం ఎందుకు కృషి చేయాలి?

10 యౌవనుడిగా ఉన్నప్పుడే సొలొమోను వినయంగా చేసిన ప్రార్థనలో ఇలా అన్నాడు, “నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు.” అలా అన్న తర్వాత, ఆయన వివేకాన్ని చూపించేందుకు, లోబడి ఉండేందుకు సహాయం చేయమని దేవుణ్ణి కోరాడు. (1 రాజు. 3:7-9, 12) సొలొమోను ప్రార్థనలో కోరినట్లే యెహోవా ఆయనకు అనుగ్రహించాడు. యౌవనులమైనా వృద్ధులమైనా మనకు కూడా యెహోవా అలాగే అనుగ్రహిస్తాడు. అయితే యెహోవా సొలొమోనుకు ఇచ్చినట్లు మంచి ఆలోచనా సామర్థ్యాన్ని, వివేకాన్ని అద్భుతరీతిలో ఇవ్వడు. కానీ, పట్టుదలగా తన వాక్యాన్ని చదివితే, పరిశుద్ధాత్మ కోసం ప్రార్థిస్తే, క్రైస్తవ సంఘం ద్వారా తాను చేస్తున్న ఆధ్యాత్మిక ఏర్పాట్లను పూర్తిగా వినియోగించుకుంటే యెహోవా మనల్ని జ్ఞానవంతులుగా తీర్చిదిద్దుతాడు. (యాకో. 1:5) నిజానికి అవన్నీ చేస్తే, తన సేవకుల్లోని యౌవనులకు కూడా, ఈ లోకంలోని ‘జ్ఞానులూ వివేకుల’ కన్నా, తన ఉపదేశాల్ని పట్టించుకోని మరితరుల కన్నా ఎక్కువ వివేకాన్ని యెహోవా దయచేస్తాడు.—లూకా 10:21; కీర్తన 119:98-100 చదవండి.

11-13. (ఎ) కీర్తన 26:4, సామెతలు 13:20, 1 కొరింథీయులు 15:33 నుండి మనం ఏ విలువైన పాఠాలు నేర్చుకోవచ్చు? (బి) ఆ లేఖనాల్లోని సూత్రాలను మనమెలా అన్వయించుకుంటాం?

11 యెహోవా గురించి ఎక్కువగా తెలుసుకునేలా బైబిలు చదువుతూ చదివిన విషయాలు ధ్యానించడం ఎంత ప్రాముఖ్యమో గ్రహించడానికి కొన్ని లేఖనాలను పరిశీలిద్దాం. మనం ఎవరితో సహవసించాలనే దాని గురించి ఇక్కడున్న ప్రతీ లేఖనంలో ఒక ప్రాముఖ్యమైన సూత్రం ఉంది: “పనికిమాలినవారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందుచేయను.” (కీర్త. 26:4) “జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును.” (సామె. 13:20) “దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును.”—1 కొరిం. 15:33.

12 ఆ లేఖనాల్లో మనకు ఏ విలువైన పాఠాలు ఉన్నాయి? (1) మనం సహవాసుల్ని చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు. నైతిక విషయాల్లో, ఆధ్యాత్మిక విషయాల్లో మనల్ని కాపాడాలని ఆయన కోరుకుంటున్నాడు. (2) మన సహవాసుల వల్ల మనం మంచిగా ఉండవచ్చు లేదా చెడ్డగా మారవచ్చు. అది జగమెరిగిన సత్యం. పైనున్న లేఖనాల్లోని మాటల్ని చూస్తే, మనల్ని ఆలోచింపజేయాలని యెహోవా అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగని ఎలా చెప్పవచ్చు? పైనున్న ఏ లేఖనంలోనూ ‘మీరు ఇలా చేయకూడదు’ అనేటువంటి నియమాలు లేవని గమనించండి. ఆ మాటలన్నీ సాధారణ సత్యాలుగా రాయబడ్డాయి. ఒక విధంగా చెప్పాలంటే యెహోవా మనతో ఇలా అంటున్నాడు, ‘ఇవి అక్షర సత్యాలు. మరి మీరేమి చేస్తారు? మీ మనసులో ఏమనుకుంటున్నారు?’

13 ఆ మూడు వచనాలూ సాధారణ సత్యాలుగా పేర్కొనబడ్డాయి కాబట్టి అవి అన్నికాలాల్లోని ప్రజలకు వర్తిస్తాయనీ, వాటిని వివిధ సందర్భాల్లో అన్వయించుకోవచ్చనీ తెలుస్తోంది. ఉదాహరణకు, మనల్ని మనం ఇలాంటి ప్రశ్నలు వేసుకోవచ్చు, నేను “వేషధారులతో” సహవసించకుండా ఎలా జాగ్రత్తపడవచ్చు? ఏ సందర్భాల్లో అలాంటి వ్యక్తులు నాకు తారసపడవచ్చు? (సామె. 3:32; 6:12) యెహోవా కోరుకుంటున్నట్లుగా, నేను సహవసించాల్సిన ‘జ్ఞానవంతులు’ ఎవరు, సహవసించకూడని ‘మూర్ఖులు’ ఎవరు? (కీర్త. 111:10; 112:1; సామె. 1:7) చెడ్డవాళ్లతో సహవసించడం వల్ల నా “మంచి నడవడి” ఎలా దెబ్బతింటుంది? లోకంలో మాత్రమే చెడ్డ సహవాసులు తారసపడతారా? (2 పేతు. 2:1-3) ఆ ప్రశ్నలకు మనం ఏమని జవాబిస్తాం?

14. మీ కుటుంబ ఆరాధనను మరింత ఆసక్తికరంగా ఎలా చేసుకోవచ్చు?

14 కొన్ని లేఖనాల్లోని సూత్రాలను మనమెలా అన్వయించుకోవచ్చో పరిశీలించాం. అదే విధంగా, మనకూ మన కుటుంబానికీ సంబంధించిన విషయాల్లో దేవుని ఆలోచనాతీరును తెలియజేసే ఇతర లేఖనాలను కూడా పరిశీలిస్తే బాగుంటుంది. b తల్లిదండ్రులారా, అలాంటి అంశాల్ని మీ కుటుంబ ఆరాధనలో పరిశీలించవచ్చేమో ఆలోచించండి. మీరలా చేస్తుండగా, దేవునికి మనపట్ల ఉన్న ప్రగాఢమైన ప్రేమ బైబిలు నియమాల్లో, సూత్రాల్లో వ్యక్తమవుతోందని మరింత బాగా అర్థంచేసుకోవడానికి కుటుంబంలోని ప్రతీ వ్యక్తికి సహాయం చేయడమే మీ ధ్యేయమని గుర్తుంచుకోండి. (కీర్త. 119:72) నిజానికి, అలాంటి అధ్యయనం వల్ల కుటుంబ సభ్యులు యెహోవాకు, ఒకరికొకరు మరింత దగ్గరౌతారు.

15. మీరు వివేకాన్ని చూపిస్తున్నారని, లోబడి ఉంటున్నారని ఎలా తెలుసుకోవచ్చు?

15 మీరు వివేకాన్ని చూపిస్తున్నారని, లోబడి ఉంటున్నారని ఎలా తెలుసుకోవచ్చు? మీ ఆలోచనాతీరును పూర్వ కాలాల్లోని నమ్మకస్థుల ఆలోచనాతీరుతో పోల్చి చూసుకుంటే తెలుసుకోవచ్చు. అలాంటి నమ్మకస్థుల్లో దావీదు రాజు ఒకడు. ఆయనిలా అన్నాడు, “నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది.” (కీర్త. 40:8) 119వ కీర్తనను రాసిన వ్యక్తి కూడా అలాంటి భావాల్నే వ్యక్తం చేశాడు, “నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది. దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను.” (కీర్త. 119:97) అలాంటి ప్రేమను అలవర్చుకోవడానికి మీరు ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. క్రమంగా బైబిలు చదవడం వల్ల, ధ్యానించడం వల్ల, ప్రార్థించడం వల్ల అలాంటి ప్రేమ మనలో వృద్ధి చెందుతుంది. అంతేకాక, యెహోవా కోరేవాటిని చేయడం వల్ల ఎన్నో ఆశీర్వాదాలు వస్తాయని మీరు చవిచూసినప్పుడు కూడా అది వృద్ధి చెందుతుంది.—కీర్త. 34:8.

దేవుడిచ్చే స్వాతంత్ర్యం కోసం పోరాడండి

16. నిజమైన స్వాతంత్ర్యం కోసం మనం చేసే పోరాటంలో విజయం సాధించాలంటే మనం ఏమి గుర్తించాలి?

16 చరిత్రంతటిలో, ఎన్నో దేశాలు స్వాతంత్ర్యం కోసం క్రూరంగా యుద్ధాలు చేశాయి. అలాంటప్పుడు, దేవుడిచ్చే స్వాతంత్ర్యం కోసం ఆధ్యాత్మిక పోరాటం చేయడానికి మనం ఎంత సుముఖంగా ఉండాలో కదా! మనం పోరాడాల్సింది సాతానుతో, అతని లోకంతో, అతను పెంచిపోషిస్తున్న విషపూరితమైన ఆలోచనాతీరుతో మాత్రమే కాదని గుర్తించాలి. మోసపూరితమైన మన హృదయంతో పాటు మనలోవున్న ఇతర అపరిపూర్ణతలతో కూడా మనం పోరాడాల్సి ఉంటుంది. (యిర్మీ. 17:9; ఎఫె. 2:3) అయితే, యెహోవా సహాయంతో మనం ఆ పోరాటంలో విజయం సాధించవచ్చు. అంతేకాక, మనం పొందే ప్రతీ విజయం వల్ల, అది చిన్నదే గానీ పెద్దదే గానీ, దాని వల్ల కనీసం రెండు ప్రయోజనాలు చేకూరుతాయి. మొదటిగా, మనం యెహోవా హృదయాన్ని సంతోషపరుస్తాం. (సామె. 27:11) రెండవదిగా, ‘స్వాతంత్ర్యాన్నిచ్చే దేవుని సంపూర్ణమైన నియమానికి’ ఉన్న అలాంటి శక్తిని మనం చవిచూస్తుండగా, నిత్యజీవానికి నడిపించే ‘ఇరుకు మార్గంలో’ నిలిచి ఉండాలనే మన కృత నిశ్చయం మరింత బలపడుతుంది. త్వరలోనే, యెహోవాపట్ల విశ్వసనీయంగా ఉండే ప్రజలు పొందబోయే గొప్ప స్వాతంత్ర్యాన్ని మనం అనుభవిస్తాం.—యాకో. 1:25; మత్త. 7:13, 14.

17. మన అపరిపూర్ణతలను బట్టి మనం ఎందుకు కృంగిపోకూడదు? ఈ విషయంలో యెహోవా మనకు ఎలా సహాయం చేస్తాడు?

17 కొన్ని సందర్భాల్లో మనమందరమూ పొరపాట్లు చేస్తాం. (ప్రసం. 7:20) అలాంటి సమయాల్లో మనం న్యూనతా భావాలతో కృంగిపోకూడదు లేదా మరీ ఎక్కువ నిరుత్సాహానికి లోనుకాకూడదు. ఒకవేళ విశ్వాసంలో తడబడి కిందపడితే, లేచి మళ్లీ ముందుకు సాగండి. దానికోసం, సంఘ పెద్దల సహాయం తీసుకోవాల్సి వచ్చినా సంకోచించకండి. సంఘ పెద్దలు చేసే “విశ్వాససహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు [“యెహోవా,” NW] అతని లేపును; అతడు పాపములు చేసినవాడైతే పాపక్షమాపణ నొందును” అని యాకోబు రాశాడు. (యాకో. 5:15) కాబట్టి, దేవుడు నిజంగా దయ గలవాడనీ, మీలో ఏదో మంచిని చూసే మీరు సంఘంలోకి వచ్చేలా మిమ్మల్ని ఆయన ఆకర్షించాడనీ ఎన్నడూ మరచిపోకండి. (కీర్తన 103:8, 9 చదవండి.) మీరు తనను హృదయపూర్వకంగా ఆరాధించినంతకాలం మీరు ఆయనకు విశ్వసనీయంగానే ఉంటారని ఆయన నమ్ముతాడు.—1 దిన. 28:9.

18. యోహాను 17:15లో ఉన్న యేసు విన్నపానికి తగినట్లు మనం ఎలా నడుచుకోవచ్చు?

18 యేసు ఈ భూమ్మీదున్న చివరి రాత్రి తన 11 మంది నమ్మకమైన అపొస్తలులతో కలిసి ప్రార్థిస్తున్నప్పుడు వాళ్ల గురించి అడుగుతూ మరుపురాని ఈ మాటలు అన్నాడు, “దుష్టుని నుండి వారిని కాపాడుము.” (యోహా. 17:15) యేసు చేసిన ఆ విన్నపం ఆయన అపొస్తలులకు మాత్రమే కాక ఆయన అనుచరులందరికీ వర్తిస్తుంది. కాబట్టి కష్టతరంగా ఉన్న ఈ కాలాల్లో మనల్ని కాపాడడం ద్వారా, యేసు చేసిన ఆ విన్నపానికి యెహోవా జవాబిస్తాడనే నమ్మకాన్ని మనం కలిగివుండవచ్చు. ‘యథార్థవంతులకు యెహోవా కేడెముగా ఉన్నాడు. తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును.’ (సామె. 2:7, 8) అయితే, యథార్థ మార్గంలో నడుస్తున్నప్పుడు సవాళ్లు ఎదురౌతాయి కానీ ఈ మార్గంలో నడిస్తేనే నిత్యజీవాన్ని, నిజమైన స్వాతంత్ర్యాన్ని పొందుతాం. (రోమా. 8:20, 21) కాబట్టి ఇతరుల వల్ల మోసపోకండి, ఆ మార్గం నుండి తొలగిపోకండి.

[అధస్సూచీలు]

a భవిష్యత్తులో దావీదు సింహాసనాన్ని అధిష్ఠించే “సంతానం” గురించి యెహోవా దావీదుకు వాగ్దానం చేసింది అబ్షాలోము పుట్టిన తర్వాతే. కాబట్టి, దావీదు తర్వాతి రాజుగా ఉండేందుకు యెహోవా తనను ఎంచుకోలేదనే విషయం అబ్షాలోము గ్రహించాల్సింది.—2 సమూ. 3:3; 7:12.

b ప్రేమ గురించి పౌలు ఇచ్చిన వివరణ ఉన్న 1 కొరింథీయులు 13:4-8, యెహోవా నియమాలకు లోబడి ఉండడం వల్ల వచ్చే ఆశీర్వాదాల గురించి ఉన్న కీర్తన 19:7-11 వంటివాటిని పరిశీలించవచ్చు.

[అధ్యయన ప్రశ్నలు]

[14వ పేజీలోని చిత్రాలు]

మన కాలంలో ఉన్న అబ్షాలోము లాంటి వ్యక్తుల్ని ఎలా గుర్తుపట్టవచ్చు? వాళ్లకు ఎలా దూరంగా ఉండవచ్చు?