కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆనాటి జ్ఞాపకాలు

కాసేపు అలా పిల్‌గ్రిమ్‌లతో ప్రయాణిద్దాం

కాసేపు అలా పిల్‌గ్రిమ్‌లతో ప్రయాణిద్దాం

“ఇంటింటికి వెళ్లి మాట్లాడడం నా వల్ల కాదు!” అపరిచితుల దగ్గరికి వెళ్లి మాట్లాడడం గురించి ఎంతమంది కొత్త బైబిలు విద్యార్థులు అలా అనుకుని ఉంటారో కదా! అయితే, ఎంతో అనుభవం గడించిన బహిరంగ ప్రసంగీకుడు, బైబిలు బోధకుడు అయిన ఒక పిల్‌గ్రిమ్‌ అన్న మాటలవి.

చర్చీలను వదిలిపెట్టిన చాలామంది జాయన్స్‌ వాచ్‌టవర్‌ పాఠకులు బైబిలు సత్యాల పట్ల తమలాంటి ఆసక్తిని కనబర్చిన వాళ్లతో సహవసించాలని అభిలషించారు. తమలాంటి అమూల్యమైన విశ్వాసం ఉన్నవాళ్ల కోసం వెదకి, బైబిలు అధ్యయనం చేయడానికి క్రమంగా వాళ్లతో సమకూడమని ఆ పత్రిక పాఠకులను ప్రోత్సహించింది. తమను సందర్శించమని కోరిన గుంపులను సందర్శించడానికి వాచ్‌టవర్‌ సంస్థ 1894 నుండి ప్రయాణ ప్రతినిధులను పంపిస్తూ వచ్చింది. కష్టించే స్వభావం, అపారమైన అనుభవం ఉన్న ఆ ప్రయాణ ప్రతినిధులను ఆ తర్వాత పిల్‌గ్రిమ్‌లు అని పిలిచేవాళ్లు. వినయం, బైబిలు జ్ఞానం, చక్కగా మాట్లాడే, బోధించే సామర్థ్యం, విమోచన క్రయధనం పట్ల విశ్వాసం ఉన్నవాళ్లను ఆ పనికోసం ఎంపిక చేసేవాళ్లు. సాధారణంగా తీరిక లేకుండా సాగే వాళ్ల సందర్శనం ఒకట్రెండు రోజులు మాత్రమే ఉండేది. ఒక పిల్‌గ్రిమ్‌ ఇచ్చే బహిరంగ ప్రసంగానికి ఆహ్వాన పత్రాలను పంచడం ద్వారానే చాలామంది బైబిలు విద్యార్థులు మొదటిసారిగా క్షేత్ర సేవ చేశారు. ఆ తర్వాత పరిపాలక సభ సభ్యునిగా సేవచేసిన హూగో రీమర్‌ అనే పిల్‌గ్రిమ్‌ ఒక స్కూల్లో సాయంకాలం ప్రసంగమిచ్చాక తన ప్రసంగాన్ని వినడానికి విచ్చేసిన వాళ్లు అడిగే ప్రశ్నలకు అర్థరాత్రి దాటేవరకు జవాబులు చెబుతూనే ఉన్నాడు. ఆయన ఎంతో అలసిపోయినప్పటికీ, ఆ కూటం చాలా “చక్కగా” జరిగిందని ఆనందంగా అన్నాడు.

విశ్వాసుల ఇళ్లలో కూటాలు జరిపి ‘విశ్వాస గృహంలో’ చేరిన ప్రజల్ని బలపర్చడమే పిల్‌గ్రిమ్‌ల ముఖ్య ఉద్దేశమని వాచ్‌టవర్‌ పత్రిక వ్యాఖ్యానించింది. ప్రసంగాల కోసం, ప్రశ్నాజవాబుల చర్చ కోసం చుట్టుపక్కల నుండి బైబిలు విద్యార్థులు వచ్చేవాళ్లు. ఆ కూటాలు అయ్యాక అందరూ కలిసి క్రైస్తవ ఆతిథ్యాన్ని ఆస్వాదించేవాళ్లు. ఒకరోజు ఉదయం ప్రసంగం వినడానికి మాడ్‌ ఆబ్బొట్‌ అనే అమ్మాయి హాజరైంది. ఆరోజు కూటం తర్వాత అందరూ ఇంటి వసారాలో ఒక పెద్ద బల్ల చుట్టూ కూర్చున్నారు. “పసందైన విందు! పంది మాంసం, కోడి మాంసం వేపుడు, రకరకాల రొట్టెలు, తియ్యని తిను బండారాలు, కేకులు! అందరూ కడుపునిండా భోంచేశాక, మధ్యాహ్నం సుమారు రెండు గంటలకు మరో ప్రసంగం కోసం మళ్లీ కలుసుకున్నారు” అని ఆమె అంది. ఆ తర్వాత ఆమె ఇలా ఒప్పుకుంది: “అప్పటికే అందరూ కునుకుపాట్లు పడుతున్నారు.” చాలాకాలంపాటు పిల్‌గ్రిమ్‌గా సేవచేసిన బెంజమిన్‌ బార్టన్‌ ఒకసారి ఇలా అన్నాడు: ‘నా ముందు పెట్టిన విందు భోజన పదార్థాలన్నీ తినివుంటే, నా ప్రయాణ సేవ ఎప్పుడో ముగిసి ఉండేది.’ అందుకే, పిల్‌గ్రిమ్‌లకు “సాదాసీదా భోజనాన్ని” పెట్టమని, “సరిపడా నిద్రకు” కావాల్సిన సౌకర్యాన్ని కల్పించమని బ్రూక్లిన్‌లోని ప్రధాన కార్యాలయం సదుద్దేశంగల సహోదరీల కోసం ఒక ఉత్తరం రాయాల్సివచ్చింది.

పిల్‌గ్రిమ్‌లు బోధించే విషయంలో, అలాగే తమ ప్రసంగానికి జీవం పోసేలా చార్టులను, నమూనాలను లేదా తమకు అందుబాటులో ఉన్న దేన్నైనా ఉపయోగించే విషయంలో ఎంతో నైపుణ్యాన్ని సంపాదించుకున్నారు. సహోదరుడు ఆర్‌. హెచ్‌. బార్బర్‌ ఇచ్చే ప్రసంగాలు మనసును కట్టిపడేసేవి. పిత్రు సమానులైన డబ్ల్యు. జే. థాన్‌ “ప్రాచీన కాలాల్లోని ఓ కుటుంబ పెద్దలా” మాట్లాడేవాడు. షీల్డ్‌ టౌట్జీయన్‌ ఒకరోజు కారులో ప్రయాణిస్తూ, ఉన్నట్టుండి “ఆపండి!” అని అరిచాడు. ఒక్క ఉదుటున బయటకు దూకి, దారిపక్కనున్న అడవి పువ్వులను తెంపి, యెహోవా చేసిన సృష్టి గురించి తనతో ప్రయాణిస్తున్నవాళ్లకు అప్పటికప్పుడు చిన్నపాటి ప్రసంగమిచ్చాడు.

పిల్‌గ్రిమ్‌ల సేవ అంత సులభమైనది కాదు. ప్రత్యేకంగా నడి వయసులో ఉన్నవాళ్లు లేదా అది దాటిన వాళ్లు చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చేది. పిల్‌గ్రిమ్‌ల సేవ ముఖ్యోద్దేశం మారినప్పుడు, దానికి తగినట్లుగా మారడం కొంతమందికి పెద్ద సవాలు అనిపించింది. ఆ మార్పు జరిగాక, ఇంటింటికి వెళ్లి ప్రకటించే విషయంలో ముందుండి నడిపించాల్సిన బాధ్యత వాళ్ల మీదికి వచ్చింది. వాచ్‌టవర్‌ మార్చి 15, 1924 సంచిక ఇలా నివేదించింది, ‘దేవుని రాజ్యం గురించి ప్రకటించాలనే’ ఆజ్ఞ నిజ క్రైస్తవులకు ఇవ్వబడిన ‘ముఖ్యమైన ఆజ్ఞల్లో ఒకటి, పిల్‌గ్రిమ్‌లను ఈ ఉద్దేశంతోనే వివిధ ప్రాంతాలకు పంపించారు.’

కొంతమంది పిల్‌గ్రిమ్‌లు ఆ మార్పును బట్టి తీవ్రంగా అసంతృప్తి చెందారని తెలుస్తోంది. ఎందుకంటే, వాళ్లు ప్రయాణ సేవను ఆపేశారు. ఆ మార్పుకు సమ్మతించని ఇంకొంతమందైతే ఏకంగా సొంత గుంపులను కూడా ఏర్పర్చుకున్నారు. ఎంతో అద్భుతంగా ప్రసంగించే ఒక పిల్‌గ్రిమ్‌ ఆ మార్పును చూసి త్రీవ విచారం వ్యక్తం చేస్తూ ఈ మాటలు అన్నాడని రోబీ డి. ఆడ్‌కన్స్‌ గుర్తు చేసుకున్నాడు: “నాకు తెలిసిందల్లా వేదిక నుంచి ప్రసంగించడమే. ఇంటింటికి వెళ్లి మాట్లాడడం నా వల్ల కాదు!” సహోదరుడు ఆడ్‌కన్స్‌ ఆ పిల్‌గ్రిమ్‌ గురించి ఇంకా ఇలా గుర్తుచేసుకున్నాడు: “ఆ పిల్‌గ్రిమ్‌ను నేను మళ్లీ 1924లో ఒహాయోలోని కొలంబస్‌లో జరిగిన సమావేశంలో చూశాను. అతను ఒక చిన్న చెట్టు నీడన ఒంటరిగా నిలబడి, సంతోషంగా ఉన్న వేలమంది సహోదరుల మధ్య అంతా పోగొట్టుకున్నవాడిలా ఎంతో దిగాలుగా కనిపించాడు. ఆ తర్వాత నేను అతణ్ణి మళ్లీ ఎన్నడూ చూడలేదు. ఆ సమావేశం జరిగిన కొంతకాలానికే ఆయన మన సంస్థను వదిలి వెళ్లిపోయాడు,” మరోవైపున “చాలామంది సహోదరులు ఎంతో ఆనందంగా పుస్తకాలను చేత పట్టుకుని, తమతమ కార్ల వైపు నడుచుకుంటూ వెళ్లారు.” బహుశా సువార్త ప్రకటించాలనే ఉత్సాహంతో వాళ్లలా వెళ్లి ఉంటారు.​—అపొ. 20:20, 21.

ఇంటింటి ప్రకటనా పనిలో సహోదరులకు శిక్షణ ఇవ్వడానికి పంపించబడిన చాలామంది పిల్‌గ్రిమ్‌లు, శిక్షణ పొందుతున్న వాళ్లలాగే ఆందోళన చెందినప్పటికీ ఆ పనిని చిత్తశుద్ధితో చేశారు. జర్మన్‌ భాష మాట్లాడే మ్యాక్స్‌వెల్‌ జీ. ఫ్రెండ్‌ (ఫ్రెషల్‌) అనే పిల్‌గ్రిమ్‌ ఇంటింటికి వెళ్లి సాక్ష్యం ఇవ్వడం గురించి ఇలా రాశాడు, “పిల్‌గ్రిమ్‌ల సేవలోని ఈ భాగం వల్ల, ఆయా సందర్శనాల్లో పొందే ఆశీర్వాదాలు రెట్టింపు అవుతాయి.” రాజ్య ప్రకటనా పనికి ఇచ్చిన ప్రాముఖ్యతను చాలామంది సహోదరసహోదరీలు మనస్ఫూర్తిగా స్వాగతించారని జాన్‌ ఎ. బోనెట్‌ అనే మరో పిల్‌గ్రిమ్‌ అన్నాడు. ప్రకటనా పనిలో “ముందువరుసలో ఉండాలనే ఉత్సాహాన్ని” చాలామంది సహోదరసహోదరీలు చూపించినట్లు ఆయన గమనించాడు.

గడిచిన సంవత్సరాలన్నిటిలో, ప్రయాణ సేవ చేసిన నమ్మకమైన సహోదరుల వల్ల సంఘాలకు ఎంతో మంచి జరిగింది. ఎంతోకాలంగా సత్యంలో ఉన్న సహోదరుడు నార్మన్‌ లార్సన్‌ ఇలా అన్నాడు, “పిల్‌గ్రిమ్‌లు చేసే సేవ నిస్సందేహంగా ఎంతో అమూల్యమైనది, ఎంతో ప్రయోజనకరమైనది. నేను బాలుడిగా ఉన్నప్పుడే ఆ విషయాన్ని గమనించాను. నేను సరైన మార్గంలో నడిచేందుకు వాళ్లు నాకెంతో సహాయం చేశారు.” నేడు కూడా, అలాంటి స్వయంత్యాగ స్ఫూర్తి చూపించే నమ్మకమైన ప్రయాణ పర్యవేక్షకులు ఎంతో విలువైన సేవ చేస్తున్నారు, “మేము ఇంటింటి పరిచర్యకు వెళ్లగలం!” అని తోటి విశ్వాసులు చెప్పగలిగేలా వాళ్లకు సహాయం చేస్తున్నారు.

[32వ పేజీలోని బ్లర్బ్‌]

పిల్‌గ్రిమ్‌ వచ్చినప్పుడు, ఆ రోజు ఎంతో ఆనందంగా గడిచేది!

[31వ పేజీలోని చిత్రం]

1905లో బెంజమిన్‌ బార్టన్‌ అనే పిల్‌గ్రిమ్‌ ఒకే సందర్శనంలో దాదాపు 170 చోట్లకు వెళ్లాల్సి వచ్చేది

[32వ పేజీలోని చిత్రం]

వాల్టర్‌ జే. థాన్‌ అనే పిల్‌గ్రిమ్‌ తండ్రిలా చూపించిన శ్రద్ధను బట్టి, ఆయనకున్న క్రీస్తులాంటి మనస్తత్వాన్ని బట్టి చాలామంది ఆయనను పితృసమానులుగా భావించేవాళ్లు

[32వ పేజీలోని చిత్రం]

జమైకాలోవున్న 14 చిన్న గుంపులను ప్రోత్సహించడానికి, బలపరచడానికి సుమారు 1902లో జే.ఏ.బ్రోన్‌ అనే సహోదరుణ్ణి అక్కడికి పిల్‌గ్రిమ్‌గా పంపారు

[32వ పేజీలోని చిత్రం]

పిల్‌గ్రిమ్‌ల సేవ వల్ల సహోదరుల విశ్వాసం పెరిగింది, క్రైస్తవ ఐక్యత బలపడింది, సహోదరులు యెహోవా సంస్థకు చేరువయ్యారు