కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘నేను మీతో ఉన్నాను’

‘నేను మీతో ఉన్నాను’

‘నేను మీతో ఉన్నాను’

“చాలామంది నలుదిశల సంచరించినందున తెలివి [“నిజమైన జ్ఞానం,” NW] అధికమగును.”—దాని. 12:4.

మీరెలా జవాబిస్తారో చూడండి:

ఆధునిక కాలంలో, “నిజమైన జ్ఞానం” ఎలా అందరికీ అందుబాటులోకి వచ్చింది?

“చాలామంది” సత్యం గురించిన జ్ఞానాన్ని ఎలా సంపాదించుకున్నారు?

ఖచ్చితమైన జ్ఞానం ఏయే విధాలుగా ‘అధికమైంది’?

1, 2. (ఎ) నేడు యేసు తన శిష్యులకు తోడుగా ఉన్నాడని, భవిష్యత్తులో కూడా తోడుగా ఉంటాడని మనకెలా తెలుసు? (బి) లేఖనాలను జాగ్రత్తగా పరిశీలించడం వల్ల ఏ ఫలితం ఉంటుందని దానియేలు 12:4 చూపిస్తోంది?

 పరదైసులో మీ జీవితం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. మీరు రాత్రంతా కంటి నిండా నిద్రపోయి ఉదయాన్నే హుషారుగా లేచారు. ఆ రోజు ఉండే పనులన్నీ చకాచకా చేసేయాలనే ఆతురత మీలో ఉంది. నొప్పీ బాధా ఏవీ లేవు, పైగా ఒకప్పుడున్న అనారోగ్య సమస్యలు కూడా లేవు. మీ కళ్లు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం వంటి జ్ఞానేంద్రియాలు ఏ లోపం లేకుండా లక్షణంగా పనిచేస్తున్నాయి. మీకు కొండంత బలం ఉంది, మీ మనసుకు ఎంతో ఆనందాన్నిచ్చే పని మీకుంది. మీకు చాలామంది స్నేహితులు ఉన్నారు, ఎలాంటి కష్టాలూ లేవు. నిజానికి దేవుని రాజ్యంలో అలాంటి దీవెనలే మీ సొంతమౌతాయి. దేవుని రాజ్యానికి రాజైన క్రీస్తుయేసు ఆ రాజ్య పౌరులందర్నీ ఆశీర్వదించి వాళ్లకు యెహోవా గురించిన జ్ఞానాన్ని నేర్పిస్తాడు.

2 భవిష్యత్తులో భూవ్యాప్తంగా జరిగే ఆ విద్యా కార్యక్రమంలో తన నమ్మకమైన సేవకులకు యెహోవా తోడుగా ఉంటాడు. ఎన్నో శతాబ్దాలుగా దేవుడు, ఆయన కుమారుడు నమ్మకమైన సేవకులకు అండగా ఉంటున్నారు. యేసు తన నమ్మకమైన శిష్యులకు తోడుగా ఉంటానని పరలోకానికి ఆరోహణమయ్యే ముందు వాళ్లకు అభయమిచ్చాడు. (మత్తయి 28:19, 20 చదవండి.) యేసు ఇచ్చిన ఆ అభయంపై మనకున్న విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి మనం 2,500 కన్నా ఎక్కువ సంవత్సరాల క్రితం ప్రాచీన బబులోనులో దానియేలు రాసిన ప్రవచనంలోని ఒక్క వాక్యాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. మనం జీవిస్తున్న ఈ “అంత్యకాలము” గురించి దానియేలు ప్రవక్త ఇలా రాశాడు, “చాలామంది నలుదిశల సంచరించినందున తెలివి [“నిజమైన జ్ఞానం,” NW] అధికమగును.” (దాని. 12:4) ‘సంచరించడం’ అని అనువదించబడిన హెబ్రీ క్రియాపదానికి జాగ్రత్తగా పరిశీలించడం అనే అర్థం ఉంది. అలా సంచరించడం వల్ల, అంటే జాగ్రత్తగా పరిశీలించడం వల్ల ఎన్ని అద్భుతమైన ఆశీర్వాదాలు ఉంటాయో కదా! లేఖనాలను జాగ్రత్తగా పరిశీలించేవాళ్లు దేవుని వాక్యం గురించిన నిజమైన లేదా ఖచ్చితమైన జ్ఞానాన్ని పొందుతారు. చాలామంది “నిజమైన జ్ఞానం” సంపాదించుకుంటారని కూడా ఆ ప్రవచనం చెబుతోంది. అంతేకాక, ఆ జ్ఞానం అధికంగా ఉంటుంది. చాలామంది సంపాదించుకునేందుకు వీలుగా ఆ జ్ఞానం వ్యాప్తి చెందుతుంది, అందరికీ అందుబాటులో ఉంటుంది. ఆ ప్రవచనం ఎలా నెరవేరిందో పరిశీలిస్తుండగా నేడు యేసు తన శిష్యులకు తోడుగా ఉన్నాడని, యెహోవా తన వాగ్దానాలన్నిటినీ నెరవేర్చగలడని తెలుసుకుంటాం.

“నిజమైన జ్ఞానం” అందరికీ తెలుస్తుంది

3. అపొస్తలులు మరణించిన తర్వాత “నిజమైన జ్ఞానం” విషయంలో ఏమి జరిగింది?

3 బైబిలు ముందే చెప్పినట్లు, అపొస్తలులు మరణించిన తర్వాత నిజ క్రైస్తవుల మధ్య నుండి మతభ్రష్టత్వం పుట్టుకొచ్చి, కార్చిచ్చులా వ్యాపించింది. (అపొ. 20:28-30; 2 థెస్స. 2:1-3) ఆ తర్వాత ఎన్నో శతాబ్దాల వరకు “నిజమైన జ్ఞానం,” బైబిలు గురించి ఏమాత్రం తెలియని వాళ్ల మధ్యే కాక క్రైస్తవులమని చెప్పుకునే వాళ్ల మధ్య కూడా లేకుండా పోయింది. అబద్ధ క్రైస్తవ మతనాయకులు లేఖనాలను నమ్ముతున్నామని చెప్పుకుంటూనే దేవుణ్ణి అగౌరవపర్చే అబద్ధాలను అంటే ‘దయ్యాల బోధలను’ బోధించారు. (1 తిమో. 4:1) సామాన్య ప్రజలకు దేవుని గురించిన సత్యాలు అందలేదు. దేవుడు త్రిత్వమని, ఆత్మ చనిపోదని, కొన్ని ఆత్మలు నరకాగ్నిలో నిత్యం కాల్చబడతాయని మతభ్రష్టులు బోధించారు, అలాంటి అబద్ధాలు ఇంకెన్నో బోధించారు.

4. కొంతమంది క్రైస్తవులు 1870లలో “నిజమైన జ్ఞానం” కోసం పరిశోధించడం ఎలా మొదలుపెట్టారు?

4 అయితే ‘అంత్యదినాలు’ మొదలవడానికి దాదాపు నాలుగు దశాబ్దాల ముందు అంటే, 1870లలో అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఉన్న కొంతమంది యథార్థ క్రైస్తవులు బైబిలును శ్రద్ధగా అధ్యయనం చేయడానికి, ‘నిజమైన జ్ఞానాన్ని’ వెదకడానికి సమకూడేవాళ్లు. (2 తిమో. 3:1) వాళ్లను ‘బైబిలు విద్యార్థులు’ అనేవాళ్లు. అయితే వీళ్లు, ఎవరికైతే జ్ఞానం మరుగుచేయబడుతుందని యేసు చెప్పాడో ఆ ‘జ్ఞానుల, వివేకుల’ కోవకు చెందినవాళ్లు కాదు. (మత్త. 11:25) కానీ, వీళ్లు దేవుడు చెప్పింది చేయాలనే యథార్థమైన కోరిక ఉన్న వినయస్థులు. వీళ్లు లేఖనాలను జాగ్రత్తగా, ప్రార్థనాపూర్వకంగా చదివారు, చర్చించుకున్నారు, ధ్యానించారు. అంతేకాక, బైబిలు వృత్తాంతాలను ఒకదానితో ఒకటి పోల్చి చూశారు, తమలాగే లేఖనాలను పరిశోధించిన ఇతరులు రాసిన సమాచారాన్ని పరిశీలించారు. అలా వీళ్లు, ఎన్నో శతాబ్దాలుగా మరుగున పడిపోయిన సత్యాలను మెల్లమెల్లగా గ్రహిస్తూ వచ్చారు.

5. ది ఓల్డ్‌ థియాలజీ అనేపేరుతో ఉన్న కరపత్రాలను ఏ ఉద్దేశంతో ప్రచురించారు?

5 బైబిలు విద్యార్థులు తాము నేర్చుకుంటున్న విషయాలను బట్టి ఎంతో సంతోషించినా వాటిని బట్టి వాళ్లు గర్వంతో ఉప్పొంగిపోలేదు లేదా కొత్త విషయాలను ప్రకటిస్తున్నందుకు తమకు పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నించలేదు. (1 కొరిం. 8:1) కానీ, వీళ్లు ది ఓ థియాలజీ (పురాతన దైవిక విషయాలు) అనే పేరుతో వరుసగా కొన్ని కరపత్రాలను ప్రచురించారు. బైబిల్లో ఉన్న లేఖన సత్యాలను ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే వీళ్లు వాటిని ప్రచురించారు. “మనుష్యులు కల్పించిన అబద్ధ సాంప్రదాయాలన్నిటినీ వదిలేసి మన ప్రభువు, ఆయన అపొస్తలులు నేర్పించిన పురాతన దైవిక విషయాల్ని పూర్తిగా గ్రహించేలా బైబిలు అధ్యయనం చేయడానికి తోడ్పడే మరింత సమాచారాన్ని” మొదటి కరపత్రం అందించింది.—ది ఓల్డ్‌ థియాలజీ, నం. 1, ఏప్రిల్‌ 1889, 32వ పేజీ.

6, 7. (ఎ) 1870 దశకం నుండి ఏ సత్యాలు గ్రహించడానికి యెహోవా మనకు సహాయం చేస్తున్నాడు? (బి) మీరు నేర్చుకున్న సత్యాల్లో ప్రత్యేకించి వేటిని మీరు అమూల్యమైనవిగా ఎంచుతున్నారు?

6 వందకన్నా ఎక్కువ సంవత్సరాల క్రితం నుండి ఇప్పటి వరకు ఎన్ని అద్భుతమైన సత్యాలు వెలుగులోకి వచ్చాయో కదా! a అవి మత పండితులు వాదోపవాదాలు చేసుకోవడానికి మాత్రమే పనికొచ్చే నిస్తేజమైన, తత్వసంబంధమైన విషయాలు కావు. కానీ, అబద్ధ ఆచారాల నుండి మనల్ని విడుదల చేసి మన జీవితానికి అర్థాన్నిచ్చే, మనలో నిరీక్షణనూ సంతోషాన్నీ నింపే అద్భుతమైన సత్యాలు. మనం యెహోవా దేవుని గురించి అంటే ఆయన ప్రేమగల వ్యక్తిత్వం గురించి, ఆయన సంకల్పాల గురించి తెలుసుకోవడానికి అవి సహాయం చేస్తాయి. అంతేకాక యేసు పాత్ర ఏమిటో స్పష్టం చేస్తాయి, ఆయన ఎందుకు జీవించాడో ఎందుకు మరణించాడో, ప్రస్తుతం ఆయన ఏమి చేస్తున్నాడో వివరిస్తాయి. అలాగే అవి దేవుడు దుష్టత్వాన్ని ఎందుకు అనుమతిస్తున్నాడో, మనం ఎందుకు చనిపోతున్నామో, మనం ఎలా ప్రార్థించాలో, మనం నిజమైన సంతోషాన్ని పొందాలంటే ఏమి చేయాలో తెలియజేస్తాయి.

7 వేల సంవత్సరాలపాటు ‘మరుగున’ ఉండిపోయి, ఈ అంత్యదినాల్లో నెరవేరుతూ ఉన్న ప్రవచనాల అర్థాన్ని ఇప్పుడు మనం గ్రహించగలుగుతున్నాం. (దాని. 12:9) ఆ ప్రవచనాలు బైబిలంతటిలో ప్రత్యేకించి, సువార్త పుస్తకాల్లో, ప్రకటన గ్రంథంలో మనకు కనిపిస్తాయి. మనం కళ్లతో చూడలేని సంఘటనలను అంటే యేసు రాజవ్వడం, పరలోకంలో యుద్ధం జరగడం, సాతాను భూమ్మీదికి పడద్రోయబడడం వంటి సంఘటనలను అర్థంచేసుకోవడానికి కూడా యెహోవా మనకు సహాయం చేశాడు. (ప్రక. 12:7-12) అంతేకాదు, మన కళ్లతో చూడగలిగే వాటిని అర్థంచేసుకోవడానికి అంటే యుద్ధాలు, భూకంపాలు, తెగుళ్లు, కరువులు వంటివి ఎందుకు వస్తున్నాయో, ప్రస్తుత పరిస్థితుల్ని ‘అపాయకరంగా’ మారుస్తున్న భక్తిహీన ప్రజలు ఎందుకున్నారో అర్థంచేసుకోవడానికి సహితం యెహోవా మనకు సహాయం చేశాడు.—2 తిమో. 3:1-5; లూకా 21:10, 11.

8. మనం చూసినవాటిని బట్టి, విన్నవాటిని బట్టి ఎవరికి ఘనతనిస్తాం?

8 “మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి; అనేకమంది ప్రవక్తలును రాజులును, మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు, వినగోరి వినకయు ఉండిరని మీతో చెప్పుచున్నాను” అని యేసు తన శిష్యులకు చెప్పిన మాటల్ని అర్థంచేసుకోవడం మనకు అంత కష్టమేమీకాదు. (లూకా 10:23, 24) అలాంటి వాటిని చూడడానికి, వినడానికి మనకు సహాయం చేసినందుకు యెహోవాకే ఘనతనిస్తాం. యేసు అనుచరుల్ని “సర్వసత్యములోనికి” నడిపించేందుకు దేవుడు ‘ఆదరణకర్త’ అయిన తన పరిశుద్ధాత్మను మనకు ఇచ్చినందుకు మనం ఆయనకు ఎంత కృతజ్ఞులమో కదా! (యోహాను 16:7, 13 చదవండి.) కాబట్టి, ‘నిజమైన జ్ఞానాన్ని’ ఎల్లప్పుడూ అమూల్యమైనదిగా ఎంచుతూ నిస్వార్థంగా దాన్ని ఇతరులకు తెలియజేస్తూ ఉందాం.

‘చాలామంది నిజమైన జ్ఞానాన్ని’ సంపాదించుకుంటారు

9. వాచ్‌టవర్‌ 1881 ఏప్రిల్‌ సంచిక ఏమని పిలుపునిచ్చింది?

9 పూర్తికాల ప్రచార పని కోసం వెయ్యిమంది ముందుకు రావాలని వాచ్‌టవర్‌ 1881 ఏప్రిల్‌ సంచిక పిలుపునిచ్చింది. అప్పటికి దాని మొదటి సంచిక ప్రచురించబడి రెండు సంవత్సరాలు కూడా గడవలేదు. ఆ ఆర్టికల్‌లో ఇలా ఉంది, ‘ప్రభువు పని చేసేందుకు తమకున్న సమయంలో సగం లేదా అంతకన్నా ఎక్కువ సమయాన్ని వెచ్చించగలిగేవాళ్ల కోసం మా దగ్గర ఉన్న సలహా ఏమిటంటే, మీకు వీలైన చోట్లకు అంటే పెద్ద పట్టణాలకు గానీ చిన్న పట్టణాలకు గానీ వెళ్లి కల్‌పోర్చర్లుగా లేదా సువార్తికులుగా సేవ చేస్తూ ప్రతీ స్థలంలో పట్టుదల గల క్రైస్తవుల కోసం వెదకండి. వాళ్లకు జ్ఞానానుసారమైన ఆసక్తి ఉండకపోవచ్చు కానీ దేవుని విషయాల పట్ల ఉత్సాహం ఉండవచ్చు. అలాంటి వాళ్లకు మన తండ్రి ఆశీస్సుల వల్ల వచ్చే సంపదల గురించి, ఆయన వాక్యంలోని రమ్యమైన విషయాల గురించి తెలియజేయండి.’

10. పూర్తికాల ప్రచారకులు కావాలని ఇవ్వబడిన పిలుపుకు ప్రజలు ఎలా స్పందించారు?

10 నిజక్రైస్తవులు చేయాల్సిన ముఖ్యమైన పని సువార్త ప్రకటించడమేనని బైబిలు విద్యార్థులు గుర్తించినట్లు ఆ పిలుపును బట్టి అర్థమైంది. ప్రజలు స్పందిస్తారనే ఆశతోనే 1,000 మంది పూర్తికాల ప్రచారకులు కావాలనే పిలుపు ఇచ్చారు. ఎందుకంటే, ఆ రోజుల్లో బైబిలు విద్యార్థుల కూటాలకు కేవలం కొన్ని వందలమంది మాత్రమే హాజరయ్యేవాళ్లు. అయితే, ఒక కరపత్రాన్ని గానీ ఒక పత్రికను గానీ చదివిన తర్వాత చాలామంది సత్యాన్ని గ్రహించి వెంటనే ఆ పిలుపుకు స్పందించారు. ఉదాహరణకు, 1882లో ఇంగ్లాండ్‌లోని లండన్‌కు చెందిన ఒక పాఠకుడు బైబిలు విద్యార్థులు ప్రచురించిన వాచ్‌టవర్‌ సంచికను, ఒక చిన్న పుస్తకాన్ని చదివిన తర్వాత ఇలా రాశాడు, “దేవుడు ఉద్దేశించిన ఈ ఆశీర్వాదకరమైన పనిని పూర్తి చేయడానికి ఎలా ప్రకటించాలో, ఏమి ప్రకటించాలో దయచేసి నాకు తెలియజేయండి.”

11, 12. (ఎ) అప్పటి కల్‌పోర్చర్లలాగే మనకూ ఏ లక్ష్యముంది? (బి) కల్‌పోర్చర్లు “తరగతుల్ని” లేదా సంఘాల్ని ఎలా స్థాపించేవాళ్లు?

11 అయితే 1885కల్లా దాదాపు 300 మంది బైబిలు విద్యార్థులు కల్‌పోర్చర్‌ పనిలో ఉన్నారు. ఆ పూర్తికాల సేవకుల లక్ష్యం ప్రజల్ని యేసుక్రీస్తు శిష్యులుగా తయారు చేయడమే. ఇప్పుడు మన లక్ష్యం కూడా అదే. అయితే, వాళ్లు ఉపయోగించిన పద్ధతులు వేరు. సాధారణంగా ఇప్పుడు మనం ఒక్కో వ్యక్తితో విడిగా బైబిలు అధ్యయనం చేస్తాం. ఆ తర్వాత ఆ విద్యార్థిని అప్పటికే స్థాపించబడి ఉన్న సంఘంతో సహవసించేందుకు ఆహ్వానిస్తాం. కానీ అప్పట్లోనైతే, కల్‌పోర్చర్లు పుస్తకాలను ఇచ్చి, ఆ తర్వాత ఆసక్తిగల వాళ్లను ఒక దగ్గర సమకూర్చి ఒక గుంపుగా లేఖనాలను అధ్యయనం చేసేవాళ్లు. ఒక్కో వ్యక్తితో బైబిలు అధ్యయనం చేసే బదులు వాళ్లు ‘తరగతుల్ని’ లేదా సంఘాల్ని స్థాపించేవాళ్లు.

12 ఉదాహరణకు 1907లో ఓ కల్‌పోర్చర్ల గుంపు, అప్పటికే మిల్లీనియల్‌ డాన్‌ b పుస్తకాలను కలిగివున్న ప్రజల కోసం వెదకడానికి ఒకానొక పట్టణంలో ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. దానిగురించి వాచ్‌టవర్‌ పత్రిక ఇలా నివేదించింది, “[ఆసక్తిగల] ఆ ప్రజల్లోని ఒకరింట్లో చిన్న కూటం కోసం అందరినీ సమకూర్చారు. ఓ కల్‌పోర్చర్‌ ఒక ఆదివారం అంతా ఆ ప్రజలతో దేవుని సంకల్పం గురించి చర్చించాడు. క్రమంగా కూటాలు జరుపుకుంటూ ఉండమని వాళ్లను ఆ తర్వాతి ఆదివారం ప్రోత్సహించాడు.” అయితే 1911లో సహోదరులు ఆ పద్ధతిని సవరించారు. 58 మంది ప్రత్యేక ప్రయాణ పరిచారకులు అమెరికా, కెనడా ప్రాంతాలన్నిటిలో బహిరంగ ప్రసంగాలు ఇస్తూ వెళ్లారు. ప్రసంగాలు వినడానికి వచ్చిన ఆసక్తిగల ప్రజల పేర్లను, అడ్రస్‌లను తీసుకొని, కొత్త “తరగతులు” స్థాపించేలా కొంతమంది ఇళ్లలో ఆయా గుంపులుగా సమకూడడానికి ఆ సహోదరులు ఏర్పాట్లు చేసేవాళ్లు. 1914కల్లా ప్రపంచవ్యాప్తంగా 1,200 బైబిలు విద్యార్థుల సంఘాలు ఏర్పడ్డాయి.

13. ఈరోజు “నిజమైన జ్ఞానం” ఎంతోమందికి చేరిందనే దానికి సంబంధించి మిమ్మల్ని ఏది ఆకట్టుకుంటోంది?

13 ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు 1,09,400 సంఘాలు ఉన్నాయి, దాదాపు 8,95,800 మంది సహోదర సహోదరీలు పయినీర్లుగా సేవచేస్తున్నారు. ఇప్పుడు సుమారు 80 లక్షలమంది ‘నిజమైన జ్ఞానాన్ని’ అంగీకరించి, తమ జీవితాల్లో దాన్ని అన్వయించుకుంటున్నారు. (యెషయా 60:22 చదవండి.) c ఆ అభివృద్ధి మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఎందుకంటే తన శిష్యులు తన నామం నిమిత్తం ‘మనుష్యులందరిచేత ద్వేషింపబడతారని,’ హింసల పాలౌతారని, చెరసాలలో వేయబడతారని, చివరికి చంపబడతారని యేసు చెప్పాడు. (లూకా 21:12-17) సాతాను, అతని దయ్యాలు, ఇతర ప్రజలు ఎంత వ్యతిరేకించినా యెహోవా ప్రజలు శిష్యుల్ని చేసే పనిని నిర్వర్తించే విషయంలో గొప్ప విజయాన్ని సాధిస్తూనే ఉన్నారు. ఇప్పుడు వాళ్లు “లోకమందంతట” అంటే ఉష్ణమండల ప్రాంతాల నుండి శీతల ప్రదేశాల వరకు, పర్వత ప్రాంతాల్లో, ఎడారుల్లో, నగరాల్లో, చివరకు మారుమూల గ్రామాల్లో కూడా ప్రకటిస్తున్నారు. (మత్త. 24:14) దేవుని సహాయం లేకపోతే ఇదంతా సాధ్యమై ఉండేదా?

‘నిజమైన జ్ఞానం అధికమౌతుంది’

14. ముద్రిత రూపంలో ఉన్న సమాచారం వల్ల “నిజమైన జ్ఞానం” చాలామందికి అందుబాటులోకి వచ్చిందని ఎలా చెప్పవచ్చు?

14 సువార్తను ప్రకటిస్తున్న ఎంతోమంది వల్ల “నిజమైన జ్ఞానం” అధికమైంది, అంటే చాలామందికి అందుబాటులోకి వచ్చేసింది. అంతేకాక, ముద్రిత రూపంలో ఉన్న సమాచారం వల్ల కూడా అది అధికమైంది. 1879 జూలైలో బైబిలు విద్యార్థులు జాయన్స్‌ వాచ్‌టవర్‌ అండ్‌ హెరాల్డ్‌ ఆఫ్‌ క్రైస్ట్స్‌ ప్రెజెన్స్‌ అనే పేరుతో ఈ పత్రిక మొదటి సంచికను ప్రచురించారు. ఒక వ్యాపార సంస్థ సహాయంతో 6,000 ప్రతుల్ని ముద్రించారు, అప్పుడు అది కేవలం ఆంగ్ల భాషలోనే ముద్రితమైంది. ఇరవై ఏడేళ్ల ఛార్లెస్‌ తేజ్‌ రస్సెల్‌ అప్పట్లో ఆ పత్రికకు సంపాదకీయునిగా ఉండేందుకు ఎంపికయ్యారు. పరిణతిగల ఐదుగురు బైబిలు విద్యార్థులు క్రమంగా అందించిన ఆర్థిక మద్దతుతో ఆ పత్రిక నడిచేది. ఇప్పుడు కావలికోట పత్రికను 195 భాషల్లో ప్రచురిస్తున్నారు. భూవ్యాప్తంగా అత్యధిక సంచికలు వెలువడుతున్న పత్రిక ఇదే. ప్రతీ నెల 4,21,82,000 ప్రతులు వెలువడుతున్నాయి. దాని సహ పత్రిక అయిన తేజరిల్లు! 84 భాషల్లో 4,10,42,000 ప్రతులు ముద్రించబడుతూ దాని తర్వాతి స్థానంలో ఉంది. అదనంగా, ప్రతీ సంవత్సరం దాదాపు ఒక కోటి పుస్తకాలు, బైబిళ్లు ముద్రిస్తున్నారు.

15. మన ముద్రణా పనికి ఆర్థిక మద్దతు ఎలా దొరుకుతోంది?

15 కనీవినీ ఎరుగని స్థాయిలో జరుగుతున్న ఈ పనికి స్వచ్ఛంద విరాళాల వల్లే ఆర్థిక మద్దతు దొరుకుతోంది. (మత్తయి 10:8 చదవండి.) ముద్రణా యంత్రాలకు, పేపరుకు, సిరాకు, మరితరమైన వాటికి ఎంత ఖర్చు అవుతుందో తెలిసిన ముద్రణా పరిశ్రమల వాళ్లు స్వచ్ఛంద విరాళాలతోనే మన ముద్రణా పనంతా జరుగుతోందనే విషయాన్ని బట్టి నివ్వెరపోతున్నారు. అంతర్జాతీయంగా ఉన్న మన ముద్రణాలయాల కోసం కొనుగోళ్లు జరుపుతున్న సహోదరుల్లో ఒకాయన ఇలా అన్నాడు, “మన ముద్రణా కార్యాలయాలను సందర్శించే వ్యాపారస్థులు మన దగ్గర ఉన్న అధునాతన సాంకేతిక పరికరాలకు, అధిక ఉత్పాదన సదుపాయాలకు స్వచ్ఛంద విరాళాల వల్లే ఆర్థిక మద్దతు లభిస్తోందని తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు. బెతెల్‌లో ఎంతోమంది యువకులు సంతోషంగా పనిచేయడం చూసి కూడా వాళ్లు అంతే ఆశ్చర్యపోతున్నారు.”

దేవుని గూర్చిన జ్ఞానంతో భూమి నిండుతుంది

16. “నిజమైన జ్ఞానం” ఎందుకు అందరికీ తెలియజేయబడుతోంది?

16 “నిజమైన జ్ఞానం” అధికమవ్వడం వల్ల ఒక మంచి ఉద్దేశం నెరవేరుతోంది. “మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెను” అన్నది దేవుని కోరిక. (1 తిమో. 2:3, 4) తనను సరైన విధంగా ఆరాధించేలా, ఆశీర్వాదాలు పొందేలా ప్రజలు సత్యాన్ని తెలుసుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు. ‘నిజమైన జ్ఞానాన్ని’ అందరికీ తెలియజేయడం ద్వారా నమ్మకమైన అభిషిక్త క్రైస్తవుల శేషాన్ని యెహోవా సమకూర్చాడు. ‘ప్రతి జనములోనుండి, ప్రతి వంశములోనుండి, ప్రజలలోనుండి, ఆయా భాషలు మాటలాడువారిలోనుండి’ ఈ భూమ్మీద నిరంతరం జీవించే నిరీక్షణ ఉన్న ఒక ‘గొప్ప సమూహాన్ని’ కూడా ఆయన సమకూరుస్తున్నాడు.—ప్రక. 7:9.

17. సత్యారాధన విస్తరించడాన్ని చూస్తే ఏమి రుజువౌతోంది?

17 గత 130 కన్నా ఎక్కువ సంవత్సరాలుగా సత్యారాధన విస్తరించడాన్ని చూస్తే యెహోవా దేవుడు, ఆయన నియమిత రాజైన యేసుక్రీస్తు ఈ భూమ్మీదున్న నిజ క్రైస్తవులను నిర్దేశిస్తూ, కాపాడుతూ, వ్యవస్థీకరిస్తూ, బోధిస్తూ వాళ్లకు తోడుగా ఉంటున్నారనే విషయం రుజువౌతోంది. అంతేకాక, సత్యారాధనలో వాళ్ల ప్రగతిని చూస్తే భవిష్యత్తుకు సంబంధించి యెహోవా చేసిన వాగ్దానాలు తప్పకుండా నెరవేరుతాయనే విషయం కూడా రుజువౌతోంది. ఆ సమయంలో “సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి యుండును.” (యెష. 11:9) అప్పుడు మానవులు ఎంత గొప్ప ఆశీర్వాదాలు అనుభవిస్తారో కదా!

[అధస్సూచీలు]

a జెహోవస్‌ విట్‌నెసెస్‌—ఫెయిత్‌ ఇన్‌ యాక్షన్‌, పార్ట్‌ 1: అవుట్‌ ఆఫ్‌ డార్క్‌నెస్‌, జెహోవస్‌ విట్‌నెసెస్‌— ఫెయిత్‌ ఇన్‌ యాక్షన్‌, పార్ట్‌ 2: లెట్‌ ద లైట్‌ షైన్‌ అనే డీవీడీలను చూసి మరింత ప్రయోజనం పొందండి.

b దీనికి స్టడీస్‌ ఇన్‌ ద స్క్రిప్చర్స్‌ అనే పేరు కూడా ఉంది.

[అధ్యయన ప్రశ్నలు]

[6వ పేజీలోని చిత్రం]

వినయస్థులైన తొలి బైబిలు విద్యార్థులకు దేవుని చిత్తం చేయాలనే యథార్థమైన కోరిక ఉండేది

[7వ పేజీలోని చిత్రం]

తన గురించిన “నిజమైన జ్ఞానం” వ్యాప్తి చేయడానికి మీరు చేసే ప్రయత్నాలను యెహోవా విలువైనవిగా ఎంచుతాడు