కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

రాజ్య పౌరుల్లా ప్రవర్తించండి!

రాజ్య పౌరుల్లా ప్రవర్తించండి!

రాజ్య పౌరుల్లా ప్రవర్తించండి!

“సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి.”—ఫిలి. 1:27, 28.

మీరెలా జవాబు ఇస్తారో చూడండి:

రాజ్య పౌరులుగా ఉండే అవకాశం ఎవరెవరికి ఉంది?

రాజ్య భాషకు, చరిత్రకు, చట్టాలకు సంబంధించి మనం ఏమి చేయాలి?

దేవుని ప్రమాణాల్ని ప్రేమిస్తున్నామని రాజ్య పౌరులు ఎలా చూపిస్తారు?

1, 2. పౌలు రాసిన మాటలు ఫిలిప్పీ సంఘానికి ఎందుకు చాలా ప్రత్యేకమైనవి?

 “సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి” అని అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘంలో ఉన్న వాళ్లను ప్రోత్సహించాడు. (ఫిలిప్పీయులు 1:27, 28 చదవండి.) “ప్రవర్తించుడి” అనే మాటకు పౌలు ఉపయోగించిన గ్రీకు పదాన్ని “పౌరుల్లా ప్రవర్తించండి” అని కూడా అనువదించవచ్చు. పౌలు రాసిన ఆ మాటలు ఫిలిప్పీ సంఘానికి చాలా ప్రత్యేకమైనవి. ఎందుకంటే, అప్పట్లో కేవలం కొన్ని నగరాల్లోని ప్రజలకు మాత్రమే రోమా పౌరసత్వాన్ని పొందే అవకాశం దొరికింది, అలాంటి నగరాల్లో ఫిలిప్పీ కూడా ఒకటని తెలుస్తోంది. ఫిలిప్పీలో, అలాగే రోమా సామ్రాజ్యం అంతటా ఉన్న రోమా పౌరులు తమ పౌరసత్వాన్ని బట్టి గర్వపడే వాళ్లు, వాళ్లకు రోమా చట్టం ప్రత్యేకమైన హక్కుల్ని కల్పించింది.

2 అయితే, అలా గర్వపడేందుకు ఫిలిప్పీ సంఘంలోని క్రైస్తవులకు మాత్రం ఇంకా మంచి కారణం ఉంది. అభిషిక్త క్రైస్తవులుగా వాళ్ల పౌరసత్వం “పరలోకమునందున్నది” అని పౌలు వాళ్లకు గుర్తుచేశాడు. (ఫిలి. 3:20) వాళ్లు ఏదో ఒక మానవ ప్రభుత్వానికి కాదుగానీ దేవుని రాజ్యానికి పౌరులుగా ఉన్నారు. దానివల్ల, వాళ్లు ఇతరులు పొందని సంరక్షణను, ప్రయోజనాల్ని పొందారు.—ఎఫె. 2:19-22.

3. (ఎ) రాజ్య పౌరులుగా ఉండే అవకాశం ఎవరెవరికి ఉంది? (బి) మనం ఇప్పుడు ఏమి పరిశీలిస్తాం?

3 ‘రాజ్య పౌరుల్లా ప్రవర్తించండి’ అని పౌలు ఇచ్చిన సలహా ముఖ్యంగా క్రీస్తుతోపాటు పరలోకంలో పరిపాలించబోయే వాళ్లకు వర్తిస్తుంది. (ఫిలి. 3:20) కానీ ఆ సలహాను, ఈ భూమ్మీద దేవుని రాజ్య పరిపాలన కింద జీవించే వాళ్లకు కూడా అన్వయించవచ్చు. ఎందుకు? ఎందుకంటే, సమర్పిత క్రైస్తవులందరూ ఒకే రాజైన యెహోవాను సేవిస్తారు, ఒకే విధమైన ప్రమాణాల ప్రకారం జీవిస్తారు. (ఎఫె. 4:4-6) నేటి ప్రజలు సంపన్న దేశాల్లో పౌరసత్వం సంపాదించుకోవడానికి ఎన్నో పాట్లు పడుతున్నారు. అలాంటప్పుడు, రాజ్య పౌరులుగా ఉండే అవకాశాన్ని మనం ఇంకెంత అమూల్యమైనదిగా ఎంచాలో కదా! ఆ అరుదైన అవకాశం పట్ల మన కృతజ్ఞతను పెంచుకోవడం కోసం మనం ఇప్పుడు, దేవుని రాజ్య పౌరులుగా ఉండడాన్ని మానవ ప్రభుత్వ పౌరులుగా ఉండడంతో పోల్చి చూద్దాం. ఆ తర్వాత, రాజ్య పౌరులుగా కొనసాగేందుకు మనం తప్పక చేయాల్సిన మూడు పనుల గురించి పరిశీలిద్దాం.

పౌరసత్వానికి కావాల్సిన అర్హతలు

4. స్వచ్ఛమైన భాష అంటే ఏమిటి? మనం ఆ భాషను ఎలా మాట్లాడతాం?

4 భాష నేర్చుకోవాలి. వేరే దేశంలో పౌరసత్వం కోసం దరఖాస్తు పెట్టుకునే సభ్యులు ఆ దేశ ముఖ్య భాష నేర్చుకొని ఉండాలని కొన్ని ప్రభుత్వాలు కోరతాయి. పౌరసత్వం పొందిన తర్వాత కూడా ప్రజలు ఆ కొత్త భాషను పూర్తిగా నేర్చుకోవడానికి కొన్నేళ్ల పాటు కష్టపడాల్సి రావచ్చు. వాళ్లు వ్యాకరణ నియమాలను ఇట్టే నేర్చుకోవచ్చేమో కానీ పదాలను సరిగ్గా ఉచ్చరించడానికి కొంత సమయం పట్టవచ్చు. అలాగే, దేవుని రాజ్య పౌరసత్వం పొందాలనుకునే వాళ్లకు “పవిత్రమైన పెదవులు” ఉండాలి, అంటే స్వచ్ఛమైన భాష నేర్చుకోవాలి. (జెఫన్యా 3:9 చదవండి.) ఇంతకీ స్వచ్ఛమైన భాష అంటే ఏమిటి? దేవుని గురించి, ఆయన సంకల్పాల గురించి బైబిల్లో ఉన్న సత్యమే ఆ భాష. దేవుని నియమాలకు, సూత్రాలకు తగిన విధంగా ప్రవర్తించినప్పుడు మనం ఆ భాషను మాట్లాడతాం. దేవుని రాజ్యంలో పౌరులుగా ఉండాలనుకునే వాళ్లు బైబిలు ప్రాథమిక బోధల్ని ఇట్టే నేర్చేసుకొని బాప్తిస్మం తీసుకోవచ్చు. కానీ, బాప్తిస్మం తర్వాత కూడా ఆ భాషను మరింత బాగా మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ఏ విధంగా? మనం నేర్చుకున్న బైబిలు సూత్రాలను సాధ్యమైనంత ఎక్కువగా ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి.

5. యెహోవా భూమ్మీద ఉపయోగించుకుంటున్న సంస్థ చరిత్ర గురించి మనం ఎందుకు వీలైనంత ఎక్కువగా తెలుసుకోవాలి?

5 చరిత్ర తెలుసుకోవాలి. ఒక మానవ ప్రభుత్వం కింద పౌరునిగా ఉండాలనుకునే వ్యక్తి ఆ ప్రభుత్వ చరిత్ర గురించి తెలుసుకోవాలి. అలాగే, రాజ్య పౌరులుగా ఉండాలని కోరుకునే వాళ్లు దేవుని రాజ్యం గురించి వీలైనంత ఎక్కువగా నేర్చుకోవాలి. ఈ విషయంలో, ప్రాచీన ఇశ్రాయేలులోని కోరహు కుమారులు మనకెలా ఆదర్శంగా ఉన్నారో గమనించండి. యెరూషలేమును, అక్కడి ఆరాధనా స్థలాన్ని చూసి వాళ్లు చాలా సంతోషించేవాళ్లు. అంతేకాక ఆ నగర చరిత్ర గురించి ఇతరులకు ఎంతో సంతోషంగా చెప్పేవాళ్లు. రాళ్లను, సున్నాన్ని చూసి కాదుగానీ ఆ నగరం, ఆరాధనా స్థలం వేటికి ప్రతీకగా ఉన్నాయనే దాన్నిబట్టే వాళ్లు ఎంతో సంతోషించేవాళ్లు. యెరూషలేములోనే స్వచ్ఛారాధన జరిగేది కాబట్టి ఆ పట్టణాన్ని ‘మహా రాజైన యెహోవా పట్టణంగా’ ఎంచేవాళ్లు. అక్కడే యెహోవా ధర్మశాస్త్రం బోధించబడేది. యెరూషలేము రాజు పరిపాలన కిందవున్న ప్రజలకే యెహోవా తన కృప చూపించేవాడు. (కీర్తన 48:1, 2, 9, 12, 13 చదవండి.) యెహోవా భూమ్మీద ఉపయోగిస్తున్న సంస్థ చరిత్ర గురించి తెలుసుకొని, దాన్ని ఇతరులకు చెప్పాలనే కోరిక మీకు కూడా ఉందా? దేవుని సంస్థ గురించి, తన ప్రజలకు ఆయన సహాయం చేసే విధానం గురించి మీరు ఎంత ఎక్కువగా తెలుసుకుంటే దేవుని రాజ్యం నిజమైన ప్రభుత్వమని మీకు అంత ఎక్కువగా అనిపిస్తుంది. అంతేకాక, రాజ్య సువార్త ప్రకటించాలనే మీ తపన సహజంగానే మరింత పెరుగుతుంది.—యిర్మీ. 9:24; లూకా 4:43.

6. రాజ్య నియమాల గురించి, సూత్రాల గురించి మనం తెలుసుకోవాలని యెహోవా కోరడం ఎందుకు సరైనది?

6 చట్టాల్ని తెలుసుకోవాలి. పౌరులు తమ దేశ చట్టాల్ని తెలుసుకొని వాటికి లోబడాలని మానవ ప్రభుత్వాలు కోరతాయి. కాబట్టి, రాజ్య పౌరులందరూ రాజ్య నియమాలను, సూత్రాలను నేర్చుకుని వాటికి లోబడాలని యెహోవా కోరడం సరైనదే. (యెష. 2:3; యోహా. 15:10; 1 యోహా. 5:3) మానవ చట్టాలు తప్పుల తడకల్లా ఉంటాయి, కొన్నిసార్లు అవి పౌరులకు పూర్తిగా న్యాయం చేయలేవు. దానికి భిన్నంగా, “యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది” లేదా పరిపూర్ణమైనది. (కీర్త. 19:7) ‘దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందిస్తూ’ మనం దాన్ని ప్రతీరోజు చదువుతామా? (కీర్త. 1:1, 2) దేవుని చట్టాలు లేక నియమాలు తెలుసుకోవాలంటే మనమే ఆయన వాక్యాన్ని సొంతగా అధ్యయనం చేయాలి. అంతేకానీ వేరేవాళ్లు మనకోసం అధ్యయనం చేసి పెట్టరు.

రాజ్య పౌరులు దేవుని ప్రమాణాల్ని ప్రేమిస్తారు

7. రాజ్య పౌరులు ఏ ఉన్నతమైన ప్రమాణాన్ని పాటిస్తారు?

7 ఎప్పటికీ రాజ్య పౌరులుగా ఉండాలంటే మనం దేవుని ప్రమాణాల్ని తెలుసుకోవడమే కాదు వాటిని ప్రేమించాలి కూడా. మానవ ప్రభుత్వాల కింద ఉండే చాలామంది పౌరులు తాము నివసిస్తున్న దేశ చట్టాలతో, ప్రమాణాలతో సమ్మతిస్తున్నామని చెప్పుకుంటారు. కానీ, ఏదైనా ఒక చట్టాన్ని పాటించడం కష్టంగా ఉంటే లేదా ఎవరూ చూడకపోతే వాళ్లు దాన్ని ఉల్లంఘిస్తారు. అలాంటివాళ్లు సాధారణంగా ‘మనుష్యులను సంతోషపెట్టాలని’ చూస్తుంటారు. (కొలొ. 3:22) కానీ, రాజ్య పౌరులు ఎంతో ఉన్నతమైన ప్రమాణాన్ని పాటిస్తారు. ఎవ్వరు చూసినా చూడకపోయినా మనం దేవుని నియమాలకు సంతోషంగా లోబడుతూనే ఉంటాం. ఎందుకంటే, మనం మన ‘శాసనకర్తను’ ప్రేమిస్తాం.—యెష. 33:22; లూకా 10:27 చదవండి.

8, 9. మీరు నిజంగా దేవుని నియమాల్ని ప్రేమిస్తున్నారో లేదో ఎలా తెలుసుకోవచ్చు?

8 మీరు నిజంగా దేవుని నియమాల్ని ప్రేమిస్తున్నారో లేదో ఎలా తెలుసుకోవచ్చు? వ్యక్తిగత విషయాలని మీరనుకునేవాటి గురించి మీకు ఎవరైనా సలహా ఇస్తే మీరెలా స్పందిస్తారో పరిశీలించుకోండి. ఉదాహరణకు మీ దుస్తుల గురించి, మీరు తయారయ్యే తీరు గురించి ఒకసారి ఆలోచించండి. మీరు రాజ్య పౌరులు కావడానికి ముందు మరీ వదులుగా లేదా మరీ బిగుతుగా ఉండే దుస్తుల్ని ఇష్టపడి ఉండవచ్చు. దేవునిపై మీ ప్రేమ పెరిగే కొద్దీ, ఆయనకు ఘనత తీసుకొచ్చే విధంగా ఉండే దుస్తుల్ని ధరించడం నేర్చుకున్నారు. (1 తిమో. 2:9, 10; 1 పేతు. 3:3, 4) ప్రస్తుతం మీరు వేసుకునే దుస్తులు పొందికగా, పద్ధతిగా ఉన్నాయని మీరనుకుంటుండవచ్చు. కానీ, మీరు వేసుకునే దుస్తుల వల్ల సంఘంలో కొంతమంది ప్రచారకులు చాలా ఇబ్బంది పడుతున్నారని ఒక సంఘ పెద్ద మీకు చెబితే మీరెలా స్పందిస్తారు? మిమ్మల్ని మీరు సమర్థించుకుంటారా? ఆయనపై కోపగించుకుంటారా? మొండిగా ఆయనతో వాదిస్తారా? రాజ్య పౌరులందరూ క్రీస్తును అనుకరించాలనేది దేవుని రాజ్య నియమాల్లో ప్రధానమైనది. (1 పేతు. 2:21) యేసు ఉంచిన మాదిరి గురించి అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దానియందు అతనిని సంతోషపరచవలెను. క్రీస్తుకూడ తన్ను తాను సంతోషపరచుకొనలేదు.” (రోమా. 15:2, 3) సంఘ సమాధానాన్ని కాపాడాలని కోరుకునే పరిణతి గల ఒక క్రైస్తవుడు ఇతరుల మనస్సాక్షికి ఇబ్బంది కలిగించడు. సంఘ పెద్దలు ఆ విషయంలో తనకు సలహా ఇచ్చినప్పుడు, ఏ మాత్రం కోపం తెచ్చుకోకుండా తన ఇష్టాయిష్టాల్ని పక్కనబెడతాడు.—రోమా. 14:19-21.

9 మనం ఆలోచించాల్సిన మరో రెండు ప్రాముఖ్యమైన విషయాలు: (1) లైంగిక సంబంధం విషయంలో మన వైఖరి, (2) పెళ్లి విషయంలో మన వైఖరి. ఇంకా దేవుని రాజ్య పౌరులుగా తయారవ్వని వ్యక్తులు స్వలింగ సంపర్కం తప్పు కాదనుకోవచ్చు, అశ్లీల చిత్రాలు చూడడం ఒక సరదా అనుకోవచ్చు, వ్యభిచారమూ విడాకులూ అనేవి పూర్తిగా వ్యక్తిగత విషయాలని భావించవచ్చు. దానికి భిన్నంగా, ఇప్పటికే దేవుని రాజ్య పౌరులుగా మారినవాళ్లు, నేటి కోసమే జీవించేలా చేసే అలాంటి స్వార్థపూరితమైన వైఖరులను వదిలేశారు. ఒకప్పుడు అనైతికమైన జీవితాన్ని గడిపిన చాలామంది క్రైస్తవులు ఇప్పుడు లైంగిక సంబంధాన్ని, పెళ్లిని దేవుడు ఇచ్చిన బహుమానాలుగా ఎంచుతున్నారు. యెహోవా ఏర్పరచిన ఉన్నతమైన ప్రమాణాల్ని వాళ్లు ఎంతో విలువైనవిగా ఎంచుతున్నారు. అంతేకాక, అనైతిక జీవితాన్ని గడిపే వ్యక్తులు రాజ్య పౌరసత్వానికి అనర్హులనే విషయాన్ని వాళ్లు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నారు. (1 కొరిం. 6:9-11) హృదయం మోసపూరితమైనది అనే విషయాన్ని వాళ్లు గుర్తిస్తారు. (యిర్మీ. 17:9) కాబట్టి, తాము ఎల్లప్పుడూ ఉన్నతమైన నైతిక ప్రమాణాలను పాటించేలా తమకు ఎవరైనా నిర్దిష్టమైన హెచ్చరికలు ఇచ్చినప్పుడు వాళ్లు కృతజ్ఞత చూపిస్తారు.

రాజ్యపౌరులు హెచ్చరికలను లక్ష్యపెడతారు

10, 11. దేవుని రాజ్యం సమయానుకూలమైన ఎలాంటి హెచ్చరికల్ని ఇస్తోంది? అలాంటి హెచ్చరికల గురించి మీకేమనిపిస్తోంది?

10 సాధారణంగా ఆహారం, మందులు ఇతరత్రా విషయాల్లో మానవ ప్రభుత్వాలు పౌరుల్ని అప్రమత్తం చేస్తాయి. అన్ని ఆహార పదార్థాలూ, మందులూ మనకు హాని చేయవు. కానీ, ఒకానొక పదార్థం వల్ల పౌరుల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని తెలిస్తే, వాళ్లను కాపాడేందుకు ప్రభుత్వం కొన్ని సముచితమైన హెచ్చరికల్ని జారీ చేస్తుంది. ఒకవేళ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఏమైనా జరిగితే, ఆ అపరాధం ప్రభుత్వానిదే అవుతుంది. దేవుని రాజ్యం కూడా నిర్దిష్టమైన నైతిక, ఆధ్యాత్మిక ప్రమాదాల గురించి ఎప్పటికప్పుడు హెచ్చరికల్ని జారీ చేస్తుంది. ఉదాహరణకు, ఇంటర్నెట్‌ విషయమే తీసుకోండి. దానివల్ల సమాచార, విద్య, వినోద రంగాల్లో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. దేవుని సంస్థ కూడా దాన్ని ఉపయోగించుకుంటూ ఎన్నో మంచి పనులు చేస్తోంది. అయితే, దానిలో ఉండే చాలా వెబ్‌సైట్ల వల్ల నైతిక, ఆధ్యాత్మిక ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అశ్లీలతను ప్రోత్సహించే వెబ్‌సైట్ల వల్ల రాజ్య పౌరుల ఆధ్యాత్మిక ఆరోగ్యానికి ఖచ్చితంగా ముప్పు వాటిల్లుతుంది. అందుకే నమ్మకమైన దాసుని తరగతి గత కొన్ని దశాబ్దాలుగా అలాంటి వెబ్‌సైట్ల గురించి హెచ్చరిస్తూనే ఉన్నాడు. మన ఆధ్యాత్మిక ఆరోగ్యానికి సంబంధించిన ఆ హెచ్చరికలు అందుకుంటున్నందుకు మనం ఎంత కృతజ్ఞులమో కదా!

11 ఇటీవలి సంవత్సరాల్లో, సోషల్‌ నెట్‌వర్కింగ్‌ వెబ్‌సైట్లు ప్రాచుర్యంలోకి వచ్చాయి. వాటిని జాగ్రత్తగా వాడితే ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. కానీ, అలాంటి వాటివల్ల ఎంతో హాని కూడా జరిగే ప్రమాదం ఉంది. వాటివల్ల ఒక వ్యక్తి చెడు సహవాసాల బారిన పడే అవకాశం ఉంది. (1 కొరిం. 15:33) అందుకే అలాంటి సైట్లను ఉపయోగించే విషయంలో దేవుని సంస్థ సముచితమైన హెచ్చరికల్ని జారీ చేస్తోంది. ఈ మధ్యకాలంలో సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్ల ఉపయోగం గురించి నమ్మకమైన దాసుడు ప్రచురించిన సమాచారాన్నంతా మీరు చదివారా? ఆ సమాచారాన్ని చదవకుండా అలాంటి సైట్లను ఉపయోగించడం ఎంత అవివేకమో కదా! a అలా చేయడం, మందుల సీసా మీదున్న సూచనలు చదవకుండా తీవ్ర ప్రభావం చూపే మందులు వేసుకోవడంతో సమానం!

12. హెచ్చరికల్ని నిర్లక్ష్యం చేయడం ఎందుకు తెలివితక్కువ పని?

12 నమ్మకమైన దాసుడు ఇచ్చే హెచ్చరికల్ని పట్టించుకోని వాళ్లు తమకు తాము హాని కొనితెచ్చుకుంటారు, తమ ప్రియమైనవాళ్లకు కూడా హాని తలపెడతారు. కొంతమంది అశ్లీల చిత్రాలు చూసే అలవాటుకు బానిసలయ్యారు లేదా లైంగిక అనైతికతకు పాల్పడ్డారు. అంతేకాక, తాము చేసే పనుల్ని యెహోవా చూడడం లేదని తమను తాము మోసగించుకున్నారు. మనం చేసే పనుల్ని యెహోవాకు కనిపించకుండా దాచవచ్చని అనుకోవడం ఎంత తెలివితక్కువ ఆలోచనో కదా! (సామె. 15:3; హెబ్రీయులు 4:13 చదవండి.) దేవుడు అలాంటి వ్యక్తులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ల దగ్గరకు తన భూసంబంధ ప్రతినిధుల్ని పంపిస్తున్నాడు. (గల. 6:1) అయితే, ఒక వ్యక్తి కొన్ని రకాల తప్పుల్ని చేసినప్పుడు సాధారణంగా మానవ ప్రభుత్వాలు ఆ వ్యక్తి పౌరసత్వాన్ని రద్దు చేసే అవకాశం ఉంది. అలాగే, ఏ మాత్రం పశ్చాత్తాపం లేకుండా తన ప్రమాణాల్ని ఉల్లంఘించేవాళ్ల రాజ్య పౌరసత్వాన్ని యెహోవా రద్దు చేస్తాడు. b (1 కొరిం. 5:11-13) అయితే యెహోవా కనికరంగల దేవుడు. కాబట్టి, పశ్చాత్తాపపడి తమ ప్రవర్తనను మార్చుకునే వాళ్లు మళ్లీ యెహోవా దృష్టిలో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకొని రాజ్యపౌరులుగా కొనసాగే అవకాశం ఉంటుంది. (2 కొరిం. 2:5-8) మనల్ని ఎంతగానో ప్రేమించే అలాంటి రాజును సేవించడం మనకు దొరికిన గొప్ప వరం!

రాజ్యపౌరులు విద్యకు ప్రాధాన్యతనిస్తారు

13. విద్యను అమూల్యంగా ఎంచుతున్నామని రాజ్య పౌరులు ఎలా చూపిస్తారు?

13 తమ దేశంలోని పౌరులకు విద్యను అందించడానికి చాలా ప్రభుత్వాలు ఎంతగానో పాటుపడతాయి. అక్షరాస్యతను పెంచడానికి, వృత్తి విద్యా కోర్సుల్ని నేర్పించడానికి పాఠశాలల్ని స్థాపిస్తాయి. రాజ్యపౌరులు కూడా అలాంటి పాఠశాలల్ని వినియోగించుకుంటూ చదవడం, రాయడం శ్రద్ధగా నేర్చుకుంటారు, వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడతారు. అయితే, దేవుని రాజ్య పౌరులు ప్రభుత్వాలు అందించే విద్యకన్నా తాము పొందుతున్న ఆధ్యాత్మిక విద్యను ఎంతో ఉన్నతంగా ఎంచుతారు. క్రైస్తవ సంఘం ద్వారా యెహోవా దేవుడు ఆధ్యాత్మిక విద్యను అందిస్తున్నాడు. తల్లిదండ్రులు క్రమంగా తమ పిల్లలకు చదివి వినిపించాలని యెహోవా ప్రోత్సహిస్తున్నాడు. నమ్మకమైన దాసుడు ప్రతీ నెల బైబిలు సమాచారాన్ని కావలికోట పత్రిక ద్వారా సమృద్ధిగా అందిస్తున్నాడు. మీరు క్రమంగా రోజుకు ఒకట్రెండు పేజీలు చదివినా, రాజ్య సంబంధమైన విద్యను అందించడానికి యెహోవా ఉపయోగించుకుంటున్న మాధ్యమమైన కావలికోట పత్రికను ఎప్పటికప్పుడు పూర్తి చేయగలుగుతారు.

14. (ఎ) మనకు ఏ శిక్షణ దొరుకుతోంది? (బి) కుటుంబ ఆరాధనకు సంబంధించి దాసుని తరగతి ఇచ్చిన సలహాల్లో వేటిని ఆచరణలో పెట్టి మీరు ప్రయోజనం పొందారు?

14 ప్రతీవారం రాజ్య పౌరులకు సంఘ కూటాల్లో శిక్షణ దొరుకుతోంది. ఉదాహరణకు, గత ఆరు దశాబ్దాలుగా దైవపరిపాలనా పరిచర్య పాఠశాల వల్ల విద్యార్థులు దేవుని వాక్యాన్ని సమర్థవంతంగా బోధించగలుగుతున్నారు. మీరు ఆ పాఠశాలలో చేరారా? కుటుంబాలు ప్రతీవారం కుటుంబ ఆరాధన చేసుకునేలా ఈ మధ్యకాలంలో నమ్మకమైన దాసుడు ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేశాడు. కుటుంబ సభ్యుల మధ్యవున్న అనుబంధం బలపడేందుకు ఈ ఏర్పాటు సహాయపడుతుంది. దాసుని తరగతి మన సాహిత్యాల్లో ప్రచురించిన సలహాల్ని మీరు ఆచరణలో పెట్టారా? c

15. మనకున్న అత్యంత గొప్ప అవకాశం ఏమిటి?

15 మానవ ప్రభుత్వాల కింద ఉండే పౌరులు వివిధ పార్టీలకు మద్దతిస్తూ ర్యాలీల్లో పాల్గొంటారు, ఆఖరికి ప్రతి ఇంటికీ వెళ్తారు. అయితే, రాజ్య పౌరులు అంతకన్నా భారీ ఎత్తున దేవుని రాజ్యానికి ఉత్సాహంగా మద్దతిస్తూ వీధుల్లో, ఇంటింటా ప్రకటిస్తారు. నిజానికి, ముందటి అధ్యయన ఆర్టికల్‌లో ప్రస్తావించినట్లుగా, యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తున్న కావలికోట పత్రిక ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో పంపిణీ చేయబడుతోంది. దేవుని రాజ్యం గురించి ఇతరులకు చెప్పే గొప్ప అవకాశం మనకుంది. మీరు ప్రకటనా పనిలో ఉత్సాహంగా పాల్గొంటున్నారా?—మత్త. 28:19, 20.

16. దేవుని రాజ్యంలో మంచి పౌరులుగా ఉంటామని ఎలా నిరూపించవచ్చు?

16 త్వరలో, దేవుని రాజ్య ప్రభుత్వం మాత్రమే ఈ భూమిని ఏలుతుంది. ప్రజల రోజువారీ జీవితాలకు సంబంధించిన వాటన్నిటినీ అంటే ఆధ్యాత్మిక సంబంధమైనవే కాక, పౌరసంబంధమైన విషయాల్ని కూడా ఆ ప్రభుత్వం చూసుకుంటుంది. మీరు దేవుని రాజ్యంలో మంచి పౌరులుగా ఉంటారా? అలా ఉంటామని నిరూపించుకోవాల్సిన సమయం ఇదే. ప్రతీరోజు యెహోవాకు మహిమ తీసుకువచ్చే నిర్ణయాలు తీసుకుంటూ ఆయన రాజ్యానికి చెందిన మంచి పౌరుల్లా ప్రవర్తిస్తున్నామని మీరు నిరూపించుకోండి.—1 కొరిం. 10:31.

[అధస్సూచీలు]

c కావలికోట ఆగస్టు 15, 2011, 6-7 పేజీలు; మన రాజ్య పరిచర్య, జనవరి 2011, 3-6 పేజీలు చూడండి.

[అధ్యయన ప్రశ్నలు]

[14వ పేజీలోని బ్లర్బ్‌]

ఇంటర్నెట్‌ విషయంలో బైబిలు ఆధారిత హెచ్చరికల్ని మీరు లక్ష్యపెడతారా?

[12వ పేజీలోని చిత్రం]

కోరహు కుమారుల్లా, మీరు సంతోషంగా స్వచ్ఛారాధన చేస్తూ దాని చరిత్రను ఆనందంగా ఇతరులకు తెలియజేస్తారా?

[15వ పేజీలోని చిత్రం]

కుటుంబ ఆరాధన మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని మంచి రాజ్యపౌరులుగా తీర్చిదిద్దుతుంది