కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సాతాను ఉరుల విషయంలో జాగ్రత్త!

సాతాను ఉరుల విషయంలో జాగ్రత్త!

సాతాను ఉరుల విషయంలో జాగ్రత్త!

‘సాతాను ఉరిలోనుండి తప్పించుకోండి.’—2 తిమో. 2:24-26.

మీరెలా జవాబు ఇస్తారో చూడండి:

అకారణంగా ఇతరులను విమర్శించే స్వభావం మీకుంటే, మీ గురించి మీరు ఏమి పరిశీలించుకోవాలి?

భయానికి, ఇతరుల ఒత్తిడికి లొంగిపోయే విషయంలో పిలాతు, పేతురు నుండి మీరేమి నేర్చుకోవచ్చు?

తీవ్రమైన అపరాధ భావాలతో కృంగిపోవడం అనే ఉరిని ఎలా తప్పించుకోవచ్చు?

1, 2. అపవాది ఉపయోగించే ఏ ఉచ్చుల గురించి ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం?

 యెహోవా సేవకుల్ని పట్టుకోవడానికి సాతాను ఎప్పుడూ మాటేసి ఉంటాడు. పరాక్రమంగల వేటగాడు జంతువుల్ని పట్టుకున్న వెంటనే చంపేసినట్లు సాతాను తాను పట్టుకున్న వాళ్లను వెంటనే చంపడు. కానీ, వాళ్లను ప్రాణాలతోనే ఉంచి తన చేతుల్లో కీలుబొమ్మల్లా ఆడిస్తాడు.—2 తిమోతి 2:24-26 చదవండి.

2 జంతువును ప్రాణాలతో పట్టుకోవడానికి, ఒక వేటగాడు ఏదో ఒక విధమైన ఉచ్చును ఉపయోగిస్తాడు. తాను అమర్చిన ఉచ్చుకు జంతువు చిక్కేలా అతను జంతువును దాని నివాసం నుండి బయటికి రప్పిస్తాడు. లేదా మాటుగా ఒక ఉచ్చు బిగించి, జంతువు దానికి తెలియకుండానే అందులో చిక్కుకునేలా ఏర్పాటు చేస్తాడు. దేవుని సేవకుల్ని ప్రాణాలతో పట్టుకోవడానికి అపవాది కూడా అలాంటి ఉచ్చుల్నే ఉపయోగిస్తాడు. మనం ఆ ఉచ్చులో చిక్కుకోకూడదంటే అప్రమత్తంగా ఉండాలి, మనల్ని పట్టుకోవడానికి సాతాను ఏర్పాటు చేసిన ఉరికి లేదా ఉచ్చుకు సంబంధించిన ప్రమాద సూచికల్ని పసిగట్టి తగిన చర్య తీసుకోవాలి. సాతాను ఇప్పటివరకు ఉపయోగించి కొంతమేరకు విజయం సాధించిన ఉచ్చుల్లో మూడిటి నుండి అంటే, (1) అదుపుతప్పి మాట్లాడడం, (2) భయానికి, తోటివారి ఒత్తిడికి లొంగిపోవడం, (3) తీవ్రమైన అపరాధ భావాలతో కృంగిపోవడం వంటి వాటినుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవచ్చో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం. సాతాను ఉపయోగించే మరో రెండు ఉచ్చుల గురించి తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.

అదుపుతప్పి మాట్లాడడం అనే అగ్నిని ఆర్పేయండి

3, 4. మనం నాలుకను అదుపులో ఉంచుకోకపోతే ఏమి జరగవచ్చు? ఒక ఉదాహరణ ఇవ్వండి.

3 దాక్కొని ఉన్న జంతువును పట్టుకోవడానికి ఒక వేటగాడు సాధారణంగా అడవిలో నిప్పు అంటిస్తాడు. జంతువు ఆ మంటల నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అతను దాన్ని పట్టుకుంటాడు. ఒక విధంగా చెప్పాలంటే, సాతాను కూడా క్రైస్తవ సంఘానికి నిప్పు అంటించడానికి ప్రయత్నిస్తాడు. ఒకవేళ అతని ప్రయత్నం ఫలిస్తే, సంఘంలోని సభ్యులను సురక్షితమైన ఆ చోటు నుండి బయటకు రప్పించి నేరుగా తన చెప్పుచేతల్లోకి తెచ్చుకుంటాడు. ఇంతకీ, మనకు తెలియకుండానే సాతానుకు సహకరించి మనం ఎలా అతని ఉరిలో పడే ప్రమాదం ఉంది?

4 నాలుకను శిష్యుడైన యాకోబు అగ్నితో పోల్చాడు. (యాకోబు 3:6-8 చదవండి.) మనం నాలుకను అదుపులో ఉంచుకోకపోతే, అది సంఘంలో కార్చిచ్చు పెట్టే ప్రమాదం ఉంది. ఎలా? ఈ సన్నివేశాన్ని గమనించండి: ఒకానొక సహోదరిని క్రమ పయినీరుగా నియమించినట్లు సంఘ కూటంలో ప్రకటన చేశారు. కూటం తర్వాత, ఇద్దరు సహోదరీలు ఆ ప్రకటన గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఆ కొత్త పయినీరు చేసే సేవ ఫలించాలని ఆశిస్తూ ఒక సహోదరి సంతోషాన్ని వ్యక్తం చేసింది. మరో సహోదరి మాత్రం, ఆ కొత్త పయినీరు సంఘంలో ప్రాధాన్యతను కోరుకుంటుందంటూ ఆమె ఉద్దేశాల్ని శంకించింది. మీరు ఆ ఇద్దరు సహోదరీల్లో ఎవరితో స్నేహం చేయాలనుకుంటారు? ఆ ఇద్దరిలో ఎవరు తమ మాటలతో సంఘంలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారో గుర్తుపట్టడం పెద్ద కష్టమేమీ కాదు.

5. అదుపుతప్పి మాట్లాడడం అనే అగ్నిని ఆర్పాలంటే, మనం ఏమి పరిశీలించుకోవాలి?

5 అదుపుతప్పి మాట్లాడడం అనే అగ్నిని మనమెలా ఆర్పవచ్చు? యేసు ఇలా చెప్పాడు: “హృదయమందు నిండియుండు దానినిబట్టి నోరు మాటలాడును.” (మత్త. 12:34) కాబట్టి, మనం ముందుగా మన హృదయాన్ని పరిశీలించుకోవాలి. సంఘ శాంతిని దెబ్బతీసే విధంగా మాట్లాడేటట్లు చేసే చెడ్డ ఆలోచనల్ని మనం అణచివేసుకుంటామా? ఉదాహరణకు, ఒకానొక సహోదరుడు సంఘంలో సేవా నియామకాలకు అర్హుడవ్వడానికి ప్రయత్నిస్తున్నాడని అనుకుందాం. ఆయన మంచి ఉద్దేశాలతోనే అలా కృషి చేస్తున్నాడని మనం నమ్ముతామా? లేక స్వార్థంతో అలా ప్రయత్నిస్తున్నాడని ఆయన ఉద్దేశాల్ని శంకిస్తామా? ఒకవేళ ఇతరుల ఉద్దేశాల్ని తప్పుబట్టే స్వభావం మనకుంటే, దేవుణ్ణి నమ్మకంగా సేవించిన యోబు ఉద్దేశాల్ని అపవాది తప్పుబట్టాడనే విషయాన్ని గుర్తుంచుకోవడం మంచిది. (యోబు 1:9-11) మన సహోదరునికి దురుద్దేశాలను అంటగట్టే బదులు, మనం ఆయన గురించి ఎందుకలా చెడుగా ఆలోచిస్తున్నామో పరిశీలించుకోవాలి. మనమలా అనుకోవడానికి అసలు మన దగ్గర సరైన కారణాలున్నాయా? లేక ఈ అంత్యదినాల్లో అంతటా వ్యాపించి ఉన్న ద్వేషం వల్ల మన హృదయం విషపూరితమైపోయిందా?—2 తిమో. 3:1-4.

6, 7. (ఎ) ఏ కారణాల వల్ల మనం ఇతరులను విమర్శించే అవకాశం ఉంది? (బి) మనల్ని ఎవరైనా దూషిస్తే మనం ఎలా స్పందించాలి?

6 ఇంకా ఏయే కారణాల వల్ల మనం ఇతరులను విమర్శించే అవకాశం ఉందో పరిశీలించండి. ఒక కారణం ఏమిటంటే, మనం సాధించినవే గొప్పగా కనబడాలనే కోరిక మనలో ఉండవచ్చు. మరో విధంగా చెప్పాలంటే, మనమే అందరికన్నా ఎత్తుగా ఉన్నామని చూపించుకోవడానికి ఇతరులను కిందికి నెట్టడానికి మనం ప్రయత్నిస్తుండవచ్చు. లేదా మనం చేయాల్సిన మంచిపనులు చేయనందుకు సాకులు చెప్పడానికి ప్రయత్నిస్తుండవచ్చు. అహంకారానికి, అసూయకు లేదా అభద్రతా భావానికి చోటిస్తే పర్యవసానాలు దారుణంగా ఉంటాయి.

7 కొన్నిసార్లు ఫలానా వ్యక్తిని సరైన కారణాలతోనే విమర్శిస్తున్నామని మనల్ని మనం సమర్థించుకునే అవకాశం ఉంది. బహుశా ఆ వ్యక్తి గతంలో మన గురించి చెడుగా మాట్లాడివుంటాడు. ఒకవేళ మీకు అలాంటి పరిస్థితి ఎదురైతే, పగ తీర్చుకోవడం సరైనది కాదు. మీరు అలా పగతీర్చుకుంటే, అగ్నికి ఆజ్యం పోసినట్లే. అప్పుడు మీరు దేవునికి నచ్చినట్లు కాక సాతానుకు నచ్చినట్లు ప్రవర్తిస్తారు. (2 తిమో. 2:24-26) మనం యేసును ఆదర్శంగా తీసుకోవాలి. ఇతరులు దూషించినప్పుడు ఆయన “బదులు దూషింపలేదు.” కానీ, ‘న్యాయంగా తీర్పుతీర్చే దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు.’ (1 పేతు. 2:21-23) యెహోవా తనదైన రీతిలో, తాననుకున్న సమయంలో చర్య తీసుకుంటాడనే నమ్మకాన్ని యేసు చూపించాడు. మనం కూడా దేవునిపై అలాంటి నమ్మకాన్నే చూపించాలి. మనం మన నాలుకను సంఘ శ్రేయస్సు కోసం ఉపయోగిస్తే, సంఘంలో ‘ఐక్యతకు’ తోడ్పడే ‘సమాధానాన్ని’ కాపాడతాం.—ఎఫెసీయులు 4:1-3 చదవండి.

ఉచ్చులాంటి భయాన్ని, ఇతరుల ఒత్తిడిని తప్పించుకోండి

8, 9. పిలాతు యేసుకు ఎందుకు మరణశిక్ష విధించాడు?

8 ఉచ్చులో చిక్కుకున్న జంతువు మునుపటంత స్వేచ్ఛగా కదల్లేదు. అలాగే భయానికి, అలాంటి మరితర రకాలైన ఒత్తిడికి లొంగిపోయే వ్యక్తి తన జీవితాన్ని అంతకుముందులా పూర్తిగా నిర్దేశించుకోలేడు. (సామెతలు 29:25 చదవండి.) ఇతరుల ఒత్తిడికి, భయానికి లొంగిపోయిన ఇద్దరు భిన్నమైన వ్యక్తుల ఉదాహరణలను ఇప్పుడు మనం పరిశీలిద్దాం, అంతేకాక వాళ్లిద్దరి అనుభవం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చో కూడా చూద్దాం.

9 యేసు నిర్దోషి అని రోమా అధిపతియైన పొంతి పిలాతుకు తెలుసు. అంతేకాదు, యేసుకు హాని చేయాలనే ఆలోచన కూడా బహుశా పిలాతుకు వచ్చివుండదు. నిజానికి, యేసు “మరణమునకు తగిన నేరమేమియు” చేయలేదని పిలాతు అన్నాడు. అయినా చివరికి, పిలాతు యేసుకు మరణశిక్ష విధించాడు. ఎందుకు? కేకలు వేస్తున్న ప్రజల ఒత్తిడికి పిలాతు లొంగిపోయాడు. (లూకా 23:15, 21-25) “నీవు ఇతని విడుదల చేసితివా, కైసరునకు స్నేహితుడవు కావు” అంటూ వ్యతిరేకులు గట్టిగా కేకలు వేశారు. అలా పిలాతు తమకు నచ్చిన నిర్ణయం తీసుకునేలా వాళ్లు ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చారు. (యోహా. 19:12) క్రీస్తుకు మద్దతిస్తే తన అధికారం, బహుశా తన ప్రాణం కూడా పోతుందని పిలాతు భయపడి ఉంటాడు. దానివల్ల అతను అపవాది అభీష్టాన్ని నెరవేర్చాడు.

10. యేసు ఎవరో తనకు తెలియదని పేతురు ఎందుకు అన్నాడు?

10 యేసుకు అత్యంత సన్నిహితుల్లో అపొస్తలుడైన పేతురు ఒకడు. యేసే మెస్సీయ అని ఆయన బాహాటంగా ఒప్పుకున్నాడు. (మత్త. 16:16) కొంతమంది శిష్యులు ఒక సందర్భంలో యేసు చెప్పిన మాటల్ని తప్పుగా అర్థంచేసుకొని ఆయనను వదిలి వెళ్లిపోయినప్పుడు కూడా పేతురు నమ్మకంగా యేసుతోనే ఉన్నాడు. (యోహా. 6:66-69) అంతేకాక, యేసును బంధించడానికి శత్రువులు వచ్చినప్పుడు, పేతురు యేసు తరఫున పోరాడడానికి కత్తి తీశాడు. (యోహా. 18:10, 11) అయినా, ఆ తర్వాత పేతురు భయానికి లొంగిపోయి, యేసుక్రీస్తు ఎవరో కూడా తనకు తెలియదన్నాడు. అపొస్తలుడైన పేతురు తాత్కాలికంగా మనుష్యుల భయమనే ఉరిలో చిక్కుకొని, ధైర్యంగా ప్రవర్తించలేకపోయాడు.—మత్త. 26:74, 75.

11. ఎలాంటి వాటికి దూరంగా ఉండేందుకు మనం పోరాడాలి?

11 మనం క్రైస్తవులం కాబట్టి దేవునికి ఇష్టంలేని పనులు చేయాలనే ఒత్తిడికి లొంగిపోకుండా ఉండేందుకు కృషిచేయాలి. మనం ఉద్యోగస్థలంలో అవినీతికి పాల్పడేలా యజమానులు ఒత్తిడి తీసుకురావచ్చు లేదా లైంగిక అనైతికతకు పాల్పడేలా మరితరులు ఒత్తిడి తీసుకురావచ్చు. విద్యార్థుల విషయానికొస్తే పరీక్షల్లో కాపీ కొట్టేలా, అశ్లీల చిత్రాలు చూసేలా, పొగత్రాగేలా, డ్రగ్స్‌ తీసుకునేలా, మితిమీరి మద్యాన్ని సేవించేలా లేదా లైంగిక దుష్ప్రవర్తనకు పాల్పడేలా తోటివాళ్లు ఒత్తిడి తీసుకురావచ్చు. కాబట్టి యెహోవాకు ఇష్టంలేని పనులు చేసేందుకు కారణమయ్యే భయానికి, ఇతరుల ఒత్తిడికి లొంగిపోకుండా ఉండాలంటే మనం ఏమి చేయాలి?

12. పిలాతు, పేతురు ఉదాహరణల నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

12 పిలాతు, పేతురు ఉదాహరణల నుండి మనమేమి నేర్చుకోవచ్చో ఇప్పుడు పరిశీలిద్దాం. యేసుక్రీస్తు గురించి పిలాతుకు అంతగా తెలియదు. అయినా యేసు నిర్దోషి అని, గొప్ప వ్యక్తి అని పిలాతుకు తెలుసు. కానీ పిలాతుకు వినయం లేదు, సత్యదేవుని మీద ప్రేమ కూడా లేదు. అపవాది ఉరిలో అతను చాలా సులభంగా చిక్కుకున్నాడు. మరోవైపున పేతురుకేమో ఖచ్చితమైన జ్ఞానం ఉంది, దేవునిపై ప్రేమ కూడా ఉంది. కానీ కొన్ని సందర్భాల్లో ఆయన గొప్పలు పోయాడు, భయానికీ ఇతరుల ఒత్తిడికీ లొంగిపోయాడు. సైనికులు వచ్చి యేసును బంధించడానికి ముందు పేతురు ధీమాగా ఇలా అన్నాడు, “అందరు అభ్యంతరపడినను నేను అభ్యంతరపడను.” (మార్కు 14:29) పేతురు యెహోవాపై పూర్తి నమ్మకం పెట్టుకున్న కీర్తనకర్త లాంటి స్వభావాన్ని చూపించివుంటే, తనకు వచ్చిన పరీక్షల్ని ఆయన మరింత సమర్థంగా ఎదుర్కొని ఉండగలిగేవాడు. కీర్తనకర్త ఇలా పాడాడు: “యెహోవా నా పక్షముననున్నాడు; నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు?” (కీర్త. 118:6) భూమ్మీద తాను గడిపిన చివరి రాత్రి యేసు పేతురును, మరో ఇద్దరు అపొస్తలులను వెంటబెట్టుకొని గెత్సేమనే తోటలోని ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్లాడు. పేతురు, ఆయన సహచరులు ఆ సమయంలో మెలకువగా ఉండాల్సింది పోయి నిద్రలోకి జారుకున్నారు. యేసు వాళ్లను నిద్రలేపి ఇలా అన్నాడు: “మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి.” (మార్కు 14:38) కానీ, పేతురు మళ్లీ నిద్రపోయాడు. ఆ తర్వాత మనుష్యుల భయానికి, ఒత్తిడికి లొంగిపోయాడు.

13. తప్పు చేయమని ఇతరులు ఒత్తిడి చేస్తే మనం దాన్ని ఎలా ఎదిరించవచ్చు?

13 పిలాతు, పేతురు ఉదాహరణల నుండి మనం మరో ప్రాముఖ్యమైన పాఠం నేర్చుకోవచ్చు. ఇతరుల నుండి వచ్చే ఒత్తిడిని సమర్థవంతగా ఎదుర్కోవాలంటే మనకు ఖచ్చితమైన జ్ఞానం, వినయం, అణకువ, దేవుని మీద ప్రేమ, దైవ భయం వంటివి ఉండాలి, అలాగే మనుష్యులకు భయపడడం మానేయాలి. మనం ఖచ్చితమైన జ్ఞానం ఆధారంగా విశ్వాసాన్ని పెంపొందించుకుంటే, దృఢ నిశ్చయంతో ధైర్యంగా మన నమ్మకాల గురించి మాట్లాడగలుగుతాం. దానివల్ల మనం ఇతరుల ఒత్తిడిని, భయాన్ని ఎదిరించగలుగుతాం. అయితే, మనకు సొంత శక్తి విషయంలో మితిమీరిన అంచనాలు ఉండకూడదు. బదులుగా, ఇతరుల ఒత్తిడిని ఎదిరించడానికి మనకు దేవుని శక్తి అవసరమని వినయంగా గుర్తించాలి. మనం యెహోవా పరిశుద్ధాత్మ కోసం ప్రార్థించాలి. ఆయన మీద ప్రేమతో మనం ఆయన నామం గురించి, ఆయన ప్రమాణాల గురించి ధైర్యంగా మాట్లాడాలి. అంతేకాక, పరీక్షలు ఎదురవ్వకముందే మనం వాటికోసం సిద్ధపడాలి. ఉదాహరణకు మన పిల్లలు క్రమంగా ప్రార్థిస్తూ, రాబోయే సవాళ్ల కోసం ముందుగానే సిద్ధపడితే, తప్పు చేసేలా తోటివాళ్లు తీసుకొచ్చే ఒత్తిడిని మరింత సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు.—2 కొరిం. 13:7.  a

తీవ్రమైన అపరాధ భావాలతో కృంగిపోవడం అనే ఉరిని తప్పించుకోండి

14. గతంలో చేసిన తప్పుల విషయంలో మనమేమి అనుకోవాలని సాతాను కోరుకుంటున్నాడు?

14 కొన్నిసార్లు, ఒక జంతువును పట్టుకోవడానికి అది ఎక్కువగా తిరిగే ప్రదేశంలో ఒక బరువైన మొద్దును లేదా రాయిని పైన వేలాడదీసి ఉంచుతారు. అప్రమత్తంగా లేని జంతువు అటుగా వచ్చి దారికి అడ్డంగా ఉన్న తీగను తన్నినప్పుడు పైనుండి మొద్దు లేదా రాయి ఒక్కసారిగా దానిమీద పడి దాన్ని నలగ్గొడుతుంది. తీవ్రమైన అపరాధ భావాలతో కృంగిపోవడాన్ని, నలగగొట్టే అలాంటి బరువైన రాయితో లేదా మొద్దుతో పోల్చవచ్చు. గతంలో చేసిన ఒకానొక తప్పు గురించి ఆలోచిస్తున్నప్పుడు, మనం ‘బహుగా నలిగిపోయినట్లు’ భావించవచ్చు. (కీర్తన 38:3-5, 8 చదవండి.) యెహోవా కనికరాన్ని పొందడం, ఆయన ప్రమాణాలను పాటించడం మన వల్ల కాదని మనం అనుకోవాలని సాతాను కోరుకుంటున్నాడు.

15, 16. తీవ్రమైన అపరాధ భావాలతో కృంగిపోవడం అనే ఉరిని మీరెలా తప్పించుకోవచ్చు?

15 మరి మనం ఈ ప్రమాదం నుండి ఎలా తప్పించుకోవచ్చు? మీరు ఒకవేళ గంభీరమైన పాపం చేస్తే, యెహోవాతో మళ్లీ స్నేహం చేయడానికి వెంటనే చర్య తీసుకోండి. సంఘ పెద్దలను సంప్రదించి సహాయం చేయమని కోరండి. (యాకో. 5:14-16) మీ తప్పును సరిదిద్దుకోవడానికి చేయగలిగినదంతా చేయండి. (2 కొరిం. 7:11) ఒకవేళ పెద్దలు మీకు క్రమశిక్షణను ఇస్తే నిరుత్సాహపడకండి. క్రమశిక్షణ అనేది యెహోవాకు మీమీద ఉన్న ప్రేమకు నిదర్శనం. (హెబ్రీ. 12:4-6) పాపానికి దారితీసిన వాటికి దూరంగా ఉండాలనే కృతనిశ్చయాన్ని కలిగివుంటూ ఆ దిశగా పనిచేయండి. మీరు పశ్చాత్తాపపడి మారుమనస్సు పొందిన తర్వాత, యేసుక్రీస్తు విమోచన క్రయధన బలి నిజంగా మీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేయగలదనే గట్టి నమ్మకాన్ని కలిగివుండండి.—1 యోహా. 4:9, 14.

16 ఇప్పటికే క్షమాపణ దొరికిన పాపాల విషయంలో కొంతమంది వ్యక్తులు ఇంకా అపరాధ భావాలతో సతమతమౌతుంటారు. మీ పరిస్థితి కూడా అదేనా? అలాగైతే, తన కుమారుని పక్కన ఉండాల్సిన సమయంలో ఆయనను వదిలి వెళ్లిన పేతురును, ఇతర అపొస్తలులను యెహోవా క్షమించాడనే విషయాన్ని గుర్తుంచుకోండి. అంతేకాక, నీచాతినీచమైన లైంగిక అనైతికతకు పాల్పడి కొరింథు సంఘంలో నుండి బహిష్కరించబడిన ఒక వ్యక్తి పశ్చాత్తాపం చూపించినప్పుడు, అతణ్ణి కూడా యెహోవా క్షమించాడు. (1 కొరిం. 5:1-5; 2 కొరిం. 2:6-8) గంభీరమైన పాపాలు చేసి, ఆ తర్వాత పశ్చాత్తాపపడినవాళ్లను యెహోవా క్షమించాడని చూపించే ఉదాహరణలెన్నో ఆయన వాక్యంలో ఉన్నాయి.—2 దిన. 33:2, 10-13; 1 కొరిం. 6:9-11.

17. విమోచన క్రయధన బలి మనకోసం ఏమి చేయగలదు?

17 మీరు నిజమైన పశ్చాత్తాపాన్ని చూపించి యెహోవా కనికరం మీకు అవసరమని గుర్తిస్తే గతంలో మీరు చేసిన తప్పుల్ని ఆయన క్షమిస్తాడు, మర్చిపోతాడు. యేసు విమోచన క్రయధన బలి మీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేయలేదని ఎన్నడూ అనుకోకండి. ఒకవేళ మీరు గనుక అలా అనుకుంటుంటే సాతాను ఒడ్డిన ఒక ఉరిలో మీరు చిక్కుకున్నట్లే. మీరేమి అనుకోవాలని సాతాను కోరుకున్నా, విమోచన క్రయధనం పశ్చాత్తాపపడేవాళ్ల పాపాలకు ప్రాయశ్చిత్తం చేయగలదని గుర్తుంచుకోండి. (సామె. 24:16) విమోచన క్రయధన బలిపై విశ్వాసం ఉంచితే మీరు మోస్తున్న తీవ్రమైన అపరాధ భావాలనే పెద్ద బరువును దించేసుకోవచ్చు, అంతేకాక దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణాత్మతో ఆరాధించడానికి కావాల్సిన బలాన్ని పొందవచ్చు.—మత్త. 22:37.

సాతాను తంత్రాలు మనకు తెలియనివి కావు

18. సాతాను ఉరుల్లో చిక్కుకోకుండా మనమెలా తప్పించుకోవచ్చు?

18 తాను ఒడ్డిన ఉచ్చుల్లో మనం దేనికి చిక్కామన్నది కాదుగానీ, మనం తన చేతికి చిక్కామా లేదా అన్నదే సాతానుకు కావాల్సింది. సాతాను తంత్రాలు మనకు తెలియనివి కావు కాబట్టి, అతని చేతికి చిక్కకుండా మనం తప్పించుకోవచ్చు. (2 కొరిం. 2:10, 11) మనకు ఎదురయ్యే పరీక్షలతో పోరాడడానికి కావాల్సిన జ్ఞానం కోసం మనం ప్రార్థిస్తే, సాతాను ఉరుల్లో లేదా ఉచ్చుల్లో మనం చిక్కుకోం. “మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు” అని యాకోబు రాశాడు. (యాకో. 1:5) క్రమంగా వ్యక్తిగత అధ్యయనం చేస్తూ, దేవుని వాక్యంలోని విషయాల్ని పాటించడం ద్వారా మన ప్రార్థనలకు తగిన విధంగా నడుచుకోవాలి. నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు ఇచ్చే బైబిలు అధ్యయన ఉపకరణాల సహాయంతో సాతాను ఒడ్డిన ఉచ్చులేమిటో మనం తెలుసుకోవచ్చు, వాటిలో చిక్కుకోకుండా తప్పించుకోవచ్చు.

19, 20. మనం చెడ్డవాటిని ఎందుకు అసహ్యించుకోవాలి?

19 ప్రార్థన వల్ల, బైబిలు అధ్యయనం వల్ల మంచి విషయాల మీద మన ప్రేమ పెరుగుతుంది. అయితే మనం చెడ్డవాటిని అసహ్యించుకోవడం కూడా చాలా ప్రాముఖ్యం. (కీర్త. 97:10) స్వార్థపూరితమైన కోరికలకు దాసోహమవడం వల్ల ఎలాంటి పర్యవసానాలు వస్తాయో ఆలోచిస్తే, మనం వాటికి దూరంగా ఉండగలుగుతాం. (యాకో. 1:14, 15) చెడ్డవాటిని అసహ్యించుకుంటూ మంచివాటిని నిజంగా ప్రేమిస్తే, మనం తన ఉచ్చుకు చిక్కేలా సాతాను వేసే ఎరలు మనల్ని ప్రలోభపెట్టలేవు, చిక్కులో పడేయలేవు.

20 మనం సాతాను చేతికి చిక్కకుండా యెహోవా సహాయం చేస్తున్నందుకు ఆయనకు ఎంత కృతజ్ఞులమో కదా! తన పరిశుద్ధాత్మను, తన వాక్యాన్ని, తన సంస్థను ఉపయోగిస్తూ యెహోవా మనల్ని “దుష్టుని నుండి” తప్పిస్తాడు. (మత్త. 6:13) దేవుని సేవకుల్ని ప్రాణాలతో పట్టుకోవడానికి సాతాను ఇప్పటివరకు సమర్థవంతంగా ప్రయోగించిన మరో రెండు ఉరుల గురించి, వాటి నుండి తప్పించుకోవడం గురించి మనం తర్వాతి ఆర్టికల్‌లో చూస్తాం.

[అధస్సూచి]

a కావలికోట జనవరి 15, 2012 సంచికలోని 16-20 పేజీల్లో, “సవాళ్లను అధిగమించేందుకు మీ పిల్లలకు సహాయం చేయండి” అనే శీర్షికతో వచ్చిన ఆర్టికలను తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి చర్చిస్తే బాగుంటుంది. ఆ సమాచారాన్ని కుటుంబ ఆరాధనలో పరిశీలించవచ్చు.

[అధ్యయన ప్రశ్నలు]

[21వ పేజీలోని చిత్రం]

అదుపుతప్పి మాట్లాడితే సంఘంలో కార్చిచ్చు అంటుకొని సమస్యలు తలెత్తవచ్చు

[24వ పేజీలోని చిత్రం]

మీరు మోస్తున్న తీవ్రమైన అపరాధ భావాలనే పెద్ద బరువును దించేసుకోవచ్చు