కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

స్థిరంగా ఉంటూ సాతాను ఉచ్చుల్ని తప్పించుకోండి

స్థిరంగా ఉంటూ సాతాను ఉచ్చుల్ని తప్పించుకోండి

స్థిరంగా ఉంటూ సాతాను ఉచ్చుల్ని తప్పించుకోండి

‘అపవాది తంత్రాలను ఎదిరించేందుకు శక్తిమంతులవ్వండి.’—ఎఫె. 6:11.

మీరెలా జవాబు ఇస్తారో చూడండి:

వస్తుసంపదల మోజు అనే ఉచ్చులో చిక్కుకోకుండా యెహోవా సేవకులు ఎలా తప్పించుకోవచ్చు?

వ్యభిచారం అనే గొయ్యిలో పడకుండా క్రైస్తవులు ఎలా తప్పించుకోవచ్చు?

స్థిరంగా ఉంటూ వస్తుసంపదల మోజు, లైంగిక అనైతికత అనే ఉచ్చుల్ని తప్పించుకుంటే ప్రయోజనం పొందుతామని మీరెందుకు నమ్ముతున్నారు?

1, 2. (ఎ) సాతానుకు అభిషిక్తుల మీద, ‘వేరే గొర్రెల’ మీద ఎందుకు జాలి లేదు? (బి) ఈ ఆర్టికల్‌లో మనం సాతాను ఉపయోగించే ఏ ఉచ్చుల గురించి చూస్తాం?

 అపవాదియైన సాతానుకు ప్రజల మీద, మరిముఖ్యంగా యెహోవా సేవకుల మీద జాలి లేదు. నిజానికి సాతాను భూమ్మీద మిగిలివున్న అభిషిక్తులతో యుద్ధం చేస్తున్నాడు. (ప్రక. 12:17) ఆధునిక కాలంలో నమ్మకస్థులైన ఈ క్రైస్తవులు రాజ్య ప్రకటనా పనిని ముందుండి నడిపిస్తూ, సాతాను ఈ ప్రపంచాన్ని ఏలుతున్నాడనే విషయాన్ని బట్టబయలు చేశారు. అభిషిక్తులకు సహకరిస్తున్న ‘వేరే గొర్రెలపై’ కూడా సాతానుకు ప్రేమ లేదు, పైగా వాళ్లలా నిత్యం జీవించే అవకాశాన్ని సాతాను ఎప్పుడో కోల్పోయాడు. (యోహా. 10:16) అందుకే సాతాను కోపోద్రేకంతో ఉన్నాడంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మనకు పరలోక నిరీక్షణ ఉన్నా భూనిరీక్షణ ఉన్నా మన సంక్షేమం గురించి సాతానుకు ఎలాంటి పట్టింపూ లేదు. మనల్ని తన ఊబిలోకి లాగడమే అతని లక్ష్యం.—1 పేతు. 5:8.

2 దానికోసం సాతాను వివిధ రకాల ఉచ్చులను లేదా ఉరులను ఉపయోగిస్తాడు. సాతాను అవిశ్వాసుల ‘మనసులకు గుడ్డితనం’ కలుగజేశాడు కాబట్టి వాళ్లు సువార్తను అంగీకరించరు, అతని ఉచ్చులను పసిగట్టలేరు. అయితే, రాజ్య సందేశాన్ని అంగీకరించిన కొంతమందిని కూడా అతను తన ఉచ్చులో పడేస్తాడు. (2 కొరిం. 4:3, 4) సాతాను ఉపయోగించే మూడు ఉచ్చుల నుండి అంటే, (1) అదుపుతప్పి మాట్లాడడం (2) భయానికి, తోటివారి ఒత్తిడికి లొంగిపోవడం (3) తీవ్రమైన అపరాధ భావాలతో కృంగిపోవడం అనేవాటి నుండి మనమెలా తప్పించుకోవచ్చో ముందటి ఆర్టికల్‌లో చూశాం. ఇప్పుడు సాతాను ఉపయోగించే మరో రెండు ఉచ్చుల నుండి అంటే వస్తుసంపదల మోజు నుండి, వ్యభిచారానికి పాల్పడాలనే శోధన నుండి మనమెలా తప్పించుకోవచ్చో చూద్దాం.

వస్తుసంపదల మోజు మనల్ని అణచివేస్తుంది

3, 4. ఐహికవిచారం ఒక వ్యక్తిని ఎలా వస్తుసంపదల మోజులో పడేస్తుంది?

3 యేసు ఒకానొక ఉపమానంలో ముళ్ల పొదల మధ్య పడిన విత్తనం గురించి మాట్లాడాడు. ఒక వ్యక్తి వాక్యాన్ని అంగీకరిస్తాడేమో కానీ, “ఐహికవిచారమును, ధనమోసమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును” అని యేసు అన్నాడు. (మత్త. 13:22) నిస్సందేహంగా, వస్తుసంపదల మోజును కూడా మన శత్రువైన సాతాను ఉచ్చులా ఉపయోగించుకుంటాడు.

4 యేసు చెప్పినట్లుగా, రెండు విషయాలు కలిసి వాక్యాన్ని అణచివేస్తాయి. వాటిలో మొదటిది, “ఐహికవిచారము.” ఈ “అపాయకరమైన” కాలాల్లో మనకు విచారం కలిగించే విషయాలు ఎన్నో ఉన్నాయి. (2 తిమో. 3:1) అంతకంతకూ పెరుగుతున్న జీవన వ్యయం వల్ల, నిరుద్యోగం వల్ల జీవితావసరాలను తీర్చుకోవడం కష్టమని మీకు అనిపించవచ్చు. భవిష్యత్తు గురించిన విచారం కూడా మిమ్మల్ని అలుముకోవచ్చు. దానివల్ల, ‘నేను రిటైరయ్యాక నా దగ్గర సరిపడా డబ్బు ఉంటుందా?’ అని మీరు ఆందోళన పడవచ్చు. అందుకే, డబ్బు ఉంటే జీవితం సురక్షితంగా ఉంటుందనుకొని కొంతమంది వస్తుసంపదల వెంట పరుగులు తీశారు.

5. ధనాపేక్ష ఏవిధంగా మోసకరమైనది?

5 యేసు ప్రస్తావించిన రెండవ విషయం, “ధనమోసము.” అది ఐహికవిచారముతో కలిసినప్పుడు వాక్యాన్ని అణచివేయగలదు. “ద్రవ్యము ఆశ్రయాస్పదము” అని బైబిలు చెబుతోంది. (ప్రసం. 7:12) కానీ, వస్తుసంపదల కోసం ప్రాకులాడడం అవివేకం. వస్తుసంపదల్ని సంపాదించుకోవడానికి ఎంత ఎక్కువగా పాటుపడితే అంత ఎక్కువగా వాటి మోజులో కూరుకుపోయామని చాలామంది గ్రహించారు. కొంతమందైతే వాటికి దాసులే అయ్యారు.—మత్త. 6:24.

6, 7. (ఎ) మనం ఉద్యోగం చేసే చోట వస్తుసంపదల మోజులో పడిపోయే ప్రమాదం ఉంటుందని ఎలా చెప్పవచ్చు? (బి) ఓవర్‌టైం చేయమని యజమాని కోరినప్పుడు ఒక క్రైస్తవుడు ఏయే విషయాల గురించి ఆలోచించాలి?

6 వస్తుసంపదలను సమకూర్చుకోవాలనే కోరిక మనకు తెలియకుండానే మొదలవ్వచ్చు. ఉదాహరణకు, ఈ సన్నివేశాన్ని ఊహించుకోండి. మీ యజమాని మీ దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు: “నీకు ఓ శుభవార్త! మన కంపెనీకి చాలా పెద్ద కాంట్రాక్టు దక్కింది. దానికోసం రాబోయే కొన్ని నెలల్లో నువ్వు తరచూ ఓవర్‌టైం చేయాల్సి ఉంటుంది. కానీ, నీ కష్టానికి ఖచ్చితంగా పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది.” అప్పుడు మీరు ఏమి చేస్తారు? మీ కుటుంబ అవసరాలు తీర్చడం మీకున్న ముఖ్యమైన బాధ్యతే, కానీ మీకున్న బాధ్యత అదొక్కటే కాదు. (1 తిమో. 5:8) మీరు ఆలోచించాల్సిన విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఓవర్‌టైం కోసం మీరు ఎన్ని గంటలు అదనంగా పనిచేయాల్సి ఉంటుంది? మీ పని వల్ల సంఘ కూటాలకు వెళ్లడం, కుటుంబ ఆరాధన చేయడం, ఇతర ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొనడం వీలౌతుందా?

7 ఆ విషయాన్ని బేరీజు వేసుకునేటప్పుడు మీరు దేని గురించి ముఖ్యంగా ఆలోచిస్తారు? ఓవర్‌టైం చేయడం వల్ల పెరిగే మీ బ్యాంక్‌ బ్యాలెన్స్‌ గురించా? లేక మీ ఆధ్యాత్మికతకు జరిగే హాని గురించా? డబ్బు సంపాదించాలనే తాపత్రయంతో రాజ్య సంబంధమైన విషయాల్ని రెండవ స్థానానికి నెట్టివేస్తారా? దేవునితో మీకూ మీ కుటుంబానికీ ఉన్న సంబంధాన్ని అశ్రద్ధ చేస్తే, వస్తుసంపదల మోజు మిమ్మల్ని ముందుముందు ఎక్కడిదాకా తీసుకెళ్తుందో ఆలోచించారా? ఒకవేళ మీరు ఇప్పటికే అలాంటి పరిస్థితిలో ఉంటే, వస్తుసంపదల మోజు అనే ఉచ్చు మిమ్మల్ని అణచివేయకుండా మీరు స్థిరంగా ఎలా ఉండవచ్చు?—1 తిమోతి 6:9, 10 చదవండి.

8. లేఖనాల్లో ఉన్న ఏ ఉదాహరణల సహాయంతో మన జీవన శైలిని పరిశీలించుకోవచ్చు?

8 వస్తుసంపదల మోజులో చిక్కుకోకూడదంటే, మీ జీవన శైలి ఎలా ఉందో ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలి. ఆధ్యాత్మిక విషయాలంటే లెక్కలేదని తన క్రియల్లో చూపించిన ఏశావులా ఉండాలని మనం ఎన్నడూ కోరుకోం. (ఆది. 25:34; హెబ్రీ. 12:16) అంతేకాక, యేసు ఇచ్చిన ఆహ్వానాన్ని వదులుకున్న ధనవంతుడిలా మనం ఉండకూడదు. అతడు “మిగుల ఆస్తిగలవాడు గనుక” ఉన్నవన్నీ అమ్మి బీదలకిచ్చి తన శిష్యునిగా ఉండమని యేసు చెప్పిన మాటలు “విని వ్యసనపడుచు వెళ్లిపోయెను.” (మత్త. 19:21, 22) వస్తుసంపదలపై మోజు అనే ఉచ్చులో చిక్కుకున్న ఆ ధనవంతుడు, జీవించినవారిలోకెల్లా మహాగొప్ప మనిషిని అనుసరించే గొప్ప అవకాశాన్ని చేజేతులా పోగొట్టుకున్నాడు. కాబట్టి, యేసుక్రీస్తు శిష్యులుగా ఉండే గొప్ప అవకాశాన్ని చేజార్చుకోకుండా జాగ్రత్తపడండి.

9, 10. వస్తుసంబంధమైన విషయాల గురించి బైబిలు ఏమి చెబుతోంది?

9 యేసు ఇచ్చిన ఉపదేశాన్ని పాటిస్తే మనం వస్తుసంపదల గురించి అనవసరంగా చింతించం. ఆయనిలా అన్నాడు, “ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించుకొందుమో అని చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును.”—మత్త. 6:31, 32; లూకా 21:34, 35.

10 ధనమోసంలో చిక్కుకుపోయే బదులు, బైబిలు రచయితయైన ఆగూరులా ఆలోచించడానికి ప్రయత్నించాలి. “పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము” అని ఆయన అన్నాడు. (సామె. 30:8) డబ్బు మనకు భద్రత ఇస్తుందని, కొన్నిసార్లు నిలువునా ముంచేస్తుందని ఆగూరు అర్థంచేసుకున్నాడు. ‘ఐహికవిచారము, ధనమోసము’ మన ఆధ్యాత్మిక పతనానికి దారితీస్తాయని అర్థంచేసుకోండి. వస్తుపరమైన విషయాల గురించి అనవసరంగా ఆందోళన పడితే మీ సమయం వృథా అవుతుంది, మీ శక్తి హరించుకుపోతుంది, రాజ్యానికి సంబంధించిన విషయాల మీద మీ ఆసక్తి తగ్గిపోతుంది లేదా అసలే లేకుండా పోతుంది. కాబట్టి, వస్తుసంపదలపై మోజు అనే ఉచ్చులో చిక్కుకోకూడదని గట్టిగా తీర్మానించుకోండి.—హెబ్రీయులు 13:5 చదవండి.

వ్యభిచారం—పైకి కనిపించని గొయ్యి

11, 12. ఉద్యోగస్థలంలో క్రైస్తవులు వ్యభిచారమనే గొయ్యిలో పడే ప్రమాదం ఎలా ఉంది?

11 వేటగాళ్లు ఏదైనా బలమైన జంతువును పట్టుకోవడానికి అది తరచూ సంచరించే దారిలో ఒక గొయ్యి తవ్వుతారు. సాధారణంగా, ఈ గొయ్యి కనిపించకుండా దానిమీద కట్టెపుల్లల్ని పేర్చి మట్టితో కప్పుతారు. ఇప్పటివరకు చాలామందిని పడేయడానికి సాతాను ఉపయోగించిన కుయుక్తుల్లో ఒకటైన లైంగిక అనైతికత అనే పాపం ఇంచుమించు అలాంటిదే. (సామె. 22:14; 23:27) కొంతమంది క్రైస్తవులు ఆ పాపం చేసే అవకాశం ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లోకి వెళ్లి ఆ గొయ్యిలో పడిపోయారు. కొంతమంది పెళ్లయిన క్రైస్తవులు ఇతరులతో సరసాలాడడం మొదలుపెట్టి, చివరకు వ్యభిచారం చేసే దాకా వెళ్లారు.

12 మీరు ఉద్యోగం చేసే చోట కూడా అలాంటి వాతావరణం ఏర్పడే ప్రమాదం ఉంది. నిజానికి, వ్యభిచారానికి పాల్పడిన ఆడవాళ్లలో సగం కన్నా ఎక్కువమంది, అలాగే వ్యభిచారానికి పాల్పడిన ప్రతీ నలుగురు మగవాళ్లలో దాదాపు ముగ్గురు, తమ సహోద్యోగులతోనే ఆ పాపానికి ఒడిగట్టినట్లు ఒక పరిశోధన వెల్లడించింది. మీ ఉద్యోగ స్థలంలో ఆడవాళ్లు మగవాళ్లు కలిసి పనిచేయాల్సి ఉంటుందా? అలాగైతే అక్కడ మీ వ్యవహారాలు ఎలా ఉంటాయి? వాళ్లతో మరీ చనువుగా ప్రవర్తించకుండా హద్దుల్లో ఉంటూ, కేవలం పనికి సంబంధించిన వ్యవహారాలు మాత్రమే చూసుకుంటున్నారా? ఉదాహరణకు, ఒక క్రైస్తవ సహోదరి తన సహోద్యోగితో తరచూ మాట్లాడుతుండడం వల్ల అతనికి వ్యక్తిగత విషయాల్ని చెప్పుకోవడం మొదలుపెట్టి, ఆఖరికి తన వైవాహిక సమస్యల గురించి చర్చించేంత దూరం వెళ్లవచ్చు. మరోవైపున, ఒక క్రైస్తవ సహోదరునికి సహోద్యోగినితో పరిచయం పెరిగి స్నేహంగా మారినప్పుడు ఆయన, “ఈవిడ నా అభిప్రాయాలను గౌరవిస్తుంది, నేను మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వింటుంది. పైగా నన్ను ఎంతో మెచ్చుకుంటుంది. ఇంట్లో నా భార్య కూడా ఇలాగే ఉంటే ఎంత బావుంటుందో!” అని అనుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న క్రైస్తవులు వ్యభిచారానికి పాల్పడే అవకాశం లేదంటారా, ఆలోచించండి.

13. తప్పు చేయడానికి నడిపించే పరిస్థితులు సంఘంలో కూడా ఎలా చోటుచేసుకునే ప్రమాదం ఉంది?

13 సంఘంలో కూడా అలాంటి వాతావరణం ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ నిజ జీవిత అనుభవాన్ని పరిశీలించండి. కిషోర్‌, ఆయన భార్య కల్పన a క్రమపయినీరు సేవ చేసేవాళ్లు. ‘ఎన్ని బాధ్యతలు ఇచ్చినా చేసేస్తాను’ అనే తత్వం కిషోర్‌ది. అందుకే ఆయన తనకు వచ్చిన ప్రతీ సేవా నియామకాన్ని ఉత్సాహంగా స్వీకరించాడు. ఆయన ఐదుగురు యువకులతో బైబిలు అధ్యయనం చేసేవాడు. వాళ్లలో ముగ్గురు బాప్తిస్మం తీసుకున్నారు. కొత్తగా బాప్తిస్మం తీసుకున్న వీళ్లకు సహాయం అవసరమైంది. సంఘపెద్దగా ఉన్న కిషోర్‌ వివిధ బాధ్యతల్లో బిజీగా ఉండడంతో, వాళ్లకు కావాల్సిన సహాయాన్ని కల్పన తరచూ అందించేది. కొంతకాలంపాటు అలాగే సాగింది. వాళ్లకు భావోద్వేగపరమైన సహాయం అవసరమైనప్పుడు కూడా కల్పనే తగిన సహాయం చేసింది. అలాగే, ఆమె ఒంటరితనంతో బాధపడుతున్నప్పుడు వాళ్లు ఓదార్చేవాళ్లు. అలా ఆమె ప్రమాదకరమైన ఉచ్చులో చిక్కుకుపోయింది. కిషోర్‌ ఇలా చెబుతున్నాడు, “నెలల తరబడి వాళ్లకు సహాయం చేస్తూనే ఉండడంతో నా భార్య ఆధ్యాత్మికంగా, మానసికంగా నీరసించిపోయింది. దానికితోడు, నేను ఆమెను కొంతకాలం పట్టించుకోలేదు కాబట్టి పరిస్థితులు ప్రమాదకరంగా తయారయ్యాయి. బాప్తిస్మం తీసుకున్న నా బైబిలు విద్యార్థుల్లో ఒకరితో ఆమె వ్యభిచారానికి పాల్పడింది. ఆమె నా కళ్ల ముందే ఆధ్యాత్మికంగా బలహీనపడుతున్నా పట్టించుకోలేనంతగా నా బాధ్యతల్లో మునిగిపోయాను.” మీ జీవితంలో అలాంటి విషాదం జరగకుండా ఎలా చూసుకోవచ్చు?

14, 15. పెళ్లైన క్రైస్తవులు వ్యభిచారం అనే గొయ్యిలో పడకూడదంటే ఏమి చేయాలి?

14 వ్యభిచారం అనే గొయ్యిలో పడకూడదంటే, వివాహబంధానికి కట్టుబడి ఉండడమంటే ఏమిటో ఆలోచించాలి. “దేవుడు జతపరచినవారిని మనుష్యుడు వేరుపరచకూడదు” అని యేసు అన్నాడు. (మత్త. 19:6) మీ భార్యకన్నా సంఘ బాధ్యతలే ముఖ్యమని అస్సలు అనుకోకండి. అంతేకాక, మీరు అంత ప్రాముఖ్యంకాని పనుల కోసం చీటికీమాటికీ ఒక్కరే బయటకు వెళ్తుంటే బహుశా మీ వివాహబంధం బీటలువారిందని అర్థం. అది శోధనలకు, చివరికి ఘోరమైన పాపానికి కూడా దారితీయవచ్చు.

15 ఒకవేళ మీరు సంఘంలో పెద్దగా సేవచేస్తుంటే, మంద విషయమేమిటి? అపొస్తలుడైన పేతురు ఇలా రాశాడు, “బలిమిచేత కాక దేవుని చిత్తప్రకారము ఇష్టపూర్వకముగాను, దుర్లాభాపేక్షతో కాక సిద్ధమనస్సుతోను, మీ మధ్యనున్న దేవుని మందను పైవిచారణచేయుచు దానిని కాయుడి.” (1 పేతు. 5:2) కాబట్టి, మీ సంరక్షణలోని మందను అశ్రద్ధ చేయకూడదు. అయితే మీ భార్య కోసం వెచ్చించాల్సిన సమయాన్ని మందను చూసుకోవడానికి ఉపయోగించకండి. ఒకవైపు ఇంట్లో మీ భార్య “అలమటిస్తుంటే,” మరోవైపున మీరు సంఘంలోని మందను పుష్టిగా ఉంచడానికే పాటుపడడం మూర్ఖత్వం, ప్రమాదకరం కూడా. కిషోర్‌ ఇలా అంటున్నాడు, “సొంత కుటుంబ బాగోగులను పట్టించుకోకుండా సేవా నియామకాల కోసం పాటుపడడమే జీవితం కాదు.”

16, 17. (ఎ) పనిస్థలంలో తమతో అతి చనువుగా ప్రవర్తించే అవకాశాన్ని ఎవ్వరికీ ఇవ్వమని పెళ్లైన క్రైస్తవులు ఎలా స్పష్టం చేయవచ్చు? (బి) వ్యభిచారానికి పాల్పడకుండా క్రైస్తవులకు సహాయం చేయడానికి మన ప్రచురణల్లో వచ్చిన సలహాల గురించి చెప్పండి.

16 వ్యభిచారం అనే ఉచ్చులో చిక్కుకోకుండా ఉండేందుకు పెళ్లైన క్రైస్తవులకు సహాయం చేసే సలహాలు ఎన్నో కావలికోట, తేజరిల్లు! (ఆంగ్లం) పత్రికల్లో వచ్చాయి. ఉదాహరణకు, సెప్టెంబరు 15, 2006 కావలికోట సంచికలో వచ్చిన సలహాల సారాంశం ఇది: ‘ఉద్యోగస్థలంలో గానీ వేరే స్థలాల్లో గానీ మరీ చనువుగా ప్రవర్తించేలా చేసే పరిస్థితుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఉదాహరణకు, ఉద్యోగస్థలంలో ఆడమగ కలిసి ఓవర్‌టైం చేసినప్పుడు శోధనకు గురయ్యే అవకాశాలు ఎక్కువ. పనిస్థలంలో మీతో అతి చనువుగా ప్రవర్తించే అవకాశాన్ని మీరు ఎవ్వరికీ ఇవ్వరని పెళ్లైన మీరు మీ మాటల్లో, ప్రవర్తనలో స్పష్టం చేయాలి. మీకు దైవభక్తి ఉంది కాబట్టి ఇతరులతో సరసాలాడడం, రెచ్చగొట్టేలా దుస్తులు వేసుకోవడం వంటివి చేసి ఇతరుల దృష్టిని ఆకర్షించాలని కోరుకోరు. . . . మీ పనిస్థలంలో మీ భార్య/భర్త, పిల్లల ఫోటోలను పెట్టుకోండి. మీకంటూ కొన్ని ప్రాధాన్యతలు ఉన్నాయని అవి మీకూ, చూసేవాళ్లకూ గుర్తుచేస్తాయి. ఇతరులు మీతో హద్దులు దాటి ప్రవర్తించే పరిస్థితుల్ని ఎన్నడూ ప్రోత్సహించకండి, వాటిని అస్సలు సహించకండి.’

17 కావలికోట జూలై 15, 1994 సంచికలో “మీ వివాహాన్ని చిరకాల బంధంగా చేసుకోండి” అనే శీర్షికతో వచ్చిన ఆర్టికల్‌, మీ వివాహ భాగస్వామితో కాక వేరే వ్యక్తితో శృంగార లోకంలో విహరిస్తున్నట్లు ఊహించుకోవడం తప్పని హెచ్చరించింది. అలాంటివి ఊహించుకోవడం వల్ల వ్యభిచారానికి పాల్పడే అవకాశాలు చాలా ఎక్కువని అదే ఆర్టికల్‌లోని “ఒకరి యెడల ఒకరు నమ్మకంగా ఉండండి” అనే ఉపశీర్షిక కింద ఉన్న పేరాలు పేర్కొన్నాయి. (యాకో. 1:14, 15) ఒకవేళ మీరు పెళ్లైన క్రైస్తవులైతే, మీ భర్తతో లేదా భార్యతో కలిసి ఎప్పటికప్పుడు అలాంటి ఆర్టికల్స్‌ను చర్చించుకోవడం మంచిది. వివాహ ఏర్పాటును చేసింది యెహోవాయే, ఆ బంధం పవిత్రమైనది. సమయం తీసుకొని మీ వివాహ జీవితం గురించి మీ భాగస్వామితో చర్చించడం ద్వారా పవిత్రమైన విషయాలను అమూల్యంగా ఎంచుతున్నామని మీరు చూపిస్తారు.—ఆది. 2:21-24.

18, 19. (ఎ) వ్యభిచారానికి పాల్పడితే ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది? (బి) భార్యాభర్తలిద్దరు ఒకరికొకరు నమ్మకంగా కట్టుబడి ఉంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?

18 తప్పు చేయాలనే శోధన మీకు ఎదురైతే, లైంగిక అనైతికతకు పాల్పడడం వల్ల వచ్చే నష్టాల గురించి ఆలోచించండి. (సామె. 7:22, 23; గల. 6:7) అలాంటి అనైతికతకు పాల్పడేవాళ్లు యెహోవాకు కోపం తెప్పిస్తారు, తమ వివాహ భాగస్వామి మనసును గాయపరుస్తారు, తమకు తాము హాని కొనితెచ్చుకుంటారు. (మలాకీ 2:13, 14 చదవండి.) మరోవైపున, పవిత్రమైన ప్రవర్తనతో నడుచుకునేవాళ్లు పొందే ప్రయోజనాల గురించి ఆలోచించండి. వాళ్లకు భవిష్యత్తులో భూమ్మీద నిత్యం జీవించే అవకాశం ఉంటుంది. అంతేకాక వాళ్లు ఇప్పుడు మంచి మనస్సాక్షిని కలిగి ఉంటూ శ్రేష్ఠమైన జీవితాన్ని అనుభవిస్తారు.—సామెతలు 3:1, 2 చదవండి.

19 కీర్తనకర్త ఇలా పాడాడు, “నీ ధర్మశాస్త్రమును ప్రేమించువారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్రిల్లుటకు కారణమేమియులేదు.” (కీర్త. 119:165) కాబట్టి సత్యాన్ని ప్రేమించండి, ఈ చెడ్డ రోజుల్లో “అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా” చూసుకోండి. (ఎఫె. 5:15, 16) సత్యారాధకులమైన మనల్ని పడేయడానికి సాతాను మన దారిపొడుగునా ఉచ్చుల్ని బిగించాడు. అయినా, వాటి నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి కావాల్సిన ఉపాయాలు మన దగ్గర ఉన్నాయి. స్థిరంగా ఉండి, “దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు” మనకు అవసరమైన వాటన్నిటినీ యెహోవా మనకు దయచేశాడు.—ఎఫె. 6:11, 16.

[అధస్సూచి]

a అసలు పేర్లు కావు.

[అధ్యయన ప్రశ్నలు]

[26వ పేజీలోని చిత్రం]

వస్తుసంపదల మోజు ఒక వ్యక్తి ఆధ్యాత్మికతను అణచివేస్తుంది. మీకు అలా జరగకుండా చూసుకోండి

[29వ పేజీలోని చిత్రం]

సరసాలకు చోటిస్తే వ్యభిచారానికి పాల్పడే ప్రమాదం ఉంది