యెహోవా, యేసు చూపించే దీర్ఘశాంతం నుండి నేర్చుకోండి
“మన ప్రభువుయొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని యెంచుకొనుడి.”—2 పేతు. 3:15.
1. నమ్మకంగా సేవచేస్తున్న కొంతమంది ఎలా భావిస్తున్నారు?
ఎన్నో దశాబ్దాలుగా సవాళ్లను ఎదుర్కొంటూ నమ్మకంగా యెహోవా సేవచేస్తున్న ఒక సహోదరి “నేను చనిపోయేలోపు అంతం వస్తుందా?” అని వినయంగా అడిగింది. చాలా సంవత్సరాలుగా యెహోవా సేవచేస్తున్న వాళ్లలో కొందరు అలాగే భావిస్తున్నారు. దేవుడు మన సమస్యలను తీసివేసి ‘సమస్తాన్ని నూతమైనవిగా’ చేసే రోజు కోసం మనం ఆశగా ఎదురుచూస్తున్నాం. (ప్రక. 21:5) సాతాను వ్యవస్థ నాశనమయ్యే రోజు చాలా దగ్గర్లో ఉందని నమ్మడానికి ఎన్నో కారణాలున్నా, ఆ రోజు కోసం ఓపికగా ఎదురుచూడడం మనకు కష్టమనిపించవచ్చు.
2. దేవుడు చూపించే ఓర్పుకు సంబంధించి మనం ఏ ప్రశ్నలను పరిశీలిస్తాం?
2 మనకు దీర్ఘశాంతం లేదా ఓర్పు ఉండాలని బైబిలు చెబుతోంది. మనం కూడా పూర్వకాలంలోని దేవుని సేవకుల్లా ఆయన వాగ్దానాల నెరవేర్పును చూడాలంటే, అవి నెరవేరేవరకు అచంచలమైన విశ్వాసంతో ఓపికగా ఎదురుచూడాలి. (హెబ్రీయులు 6:11, 12 చదవండి.) నిజానికి, యెహోవా కూడా దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. ఆయన తలచుకుంటే ఏ సమయంలోనైనా దుష్టత్వాన్ని అంతం చేయగలడు, కానీ సరైన సమయం కోసం వేచి చూస్తున్నాడు. (రోమా. 9:20-24) ఇంతకీ ఆయన ఎందుకంత ఓర్పు చూపిస్తున్నాడు? దేవునిలా ఓర్పు చూపించే విషయంలో యేసు మనకెలా ఆదర్శంగా ఉన్నాడు? మనం కూడా అలాంటి ఓర్పు చూపిస్తే ఎలాంటి ప్రయోజనాలు పొందుతాం? ఆ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటే, యెహోవా ఆలస్యం చేస్తున్నాడని అనిపించినా మనం మరింత ఓర్పు చూపించడం నేర్చుకుంటాం, మన విశ్వాసాన్ని దృఢపర్చుకుంటాం.
యెహోవా ఎందుకు ఓర్పు చూపిస్తున్నాడు?
3, 4. (ఎ) భూమిపట్ల తన సంకల్పాన్ని నెరవేర్చే విషయంలో యెహోవా ఎందుకు ఓర్పు చూపిస్తూ వచ్చాడు? (బి) ఏదెనులో తిరుగుబాటు జరిగినప్పుడు యెహోవా ఏమి చేశాడు?
3 ఓర్పు చూపించడానికి యెహోవాకు మంచి కారణముంది. విశ్వం మీద సర్వాధికారాలు యెహోవాకే ఉన్నా ఏదెను తోటలో జరిగిన తిరుగుబాటు వల్ల సర్వాధిపత్యానికి సంబంధించి కొన్ని ప్రాముఖ్యమైన ప్రశ్నలు తలెత్తాయి. ఆ ప్రశ్నలకు పూర్తిగా జవాబులు రావడానికి సమయం పడుతుందని యెహోవాకు తెలుసు కాబట్టి ఆయన ఓర్పు చూపిస్తూనే ఉన్నాడు. పరలోకంలో, అలాగే భూమ్మీద ఉన్న వ్యక్తులు చేసే పనులేమిటో, వాళ్ల మనస్తత్వాలు ఎలాంటివో బాగా తెలిసిన యెహోవా మన శ్రేయస్సు కోసం తగిన చర్యలు తీసుకుంటున్నాడు.—హెబ్రీ. 4:13.
4 ఆదాముహవ్వల పిల్లలతో భూమిని నింపాలన్నది యెహోవా సంకల్పం. సాతాను హవ్వను మోసం చేసినప్పుడు, ఆ తర్వాత ఆదాము దేవునికి అవిధేయత చూపించినప్పుడు యెహోవా తన సంకల్పాన్ని విడిచిపెట్టలేదు. ఆ సమయంలో యెహోవా ఆందోళన పడలేదు, ఆవేశంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోలేదు, మానవజాతి మీద ఆశలు కూడా వదులుకోలేదు. కానీ మనుష్యుల విషయంలో, భూమి విషయంలో తను అనుకున్నదాన్ని పూర్తిచేయడానికి ఆయన ఒక ఏర్పాటు చేశాడు. (యెష. 55:11) తన సంకల్పాన్ని నెరవేర్చడానికి, తన సర్వాధిపత్యాన్ని నిరూపించుకోవడానికి యెహోవా ఎంతో ఆత్మనిగ్రహాన్ని, ఓర్పును చూపించాడు. తన సంకల్పానికి సంబంధించిన కొన్ని అంశాలు ఉత్తమ రీతిలో నెరవేరేవరకు వేల సంవత్సరాలపాటు ఆయన ఆ లక్షణాల్ని చూపిస్తూ వచ్చాడు.
5. యెహోవా ఓర్పు చూపిస్తున్నందువల్ల ఏ ఆశీర్వాదాలకు మార్గం ఏర్పడింది?
5 ఎక్కువమంది ప్రజలు నిత్యజీవం పొందాలనే ఉద్దేశం తనకు ఉండడం వల్ల కూడా యెహోవా ఓర్పు చూపిస్తున్నాడు. ఒక ‘గొప్పసమూహాన్ని’ రక్షించడానికి ఆయన ఇప్పుడు ఏర్పాట్లు చేస్తున్నాడు. (ప్రక. 7:9, 14; 14:6) యెహోవా మన ద్వారా ప్రజలకు రాజ్య సందేశాన్ని చేరవేస్తూ తన రాజ్యం గురించి, తన నీతి ప్రమాణాల గురించి నేర్చుకోమని వాళ్లను ఆహ్వానిస్తున్నాడు. మానవులకు రాజ్య సందేశానికి మించిన వార్త మరొకటి ఉండదు, అవును నిజంగానే అది ‘సువార్త!’ (మత్త. 24:14) యెహోవా ఆకర్షించే ప్రతీ ఒక్కరు, నీతిని ప్రేమించే నిజమైన స్నేహితులు ఉన్న ప్రపంచవ్యాప్త సంఘంలో భాగమౌతారు. (యోహా. 6:44-47) ప్రేమగల దేవుడైన యెహోవా తన ఆమోదం పొందడానికి అలాంటి వాళ్లకు సహాయం చేస్తాడు. అయితే యెహోవా గొప్ప సమూహాన్ని సమకూర్చడమే కాక, తన పరలోక ప్రభుత్వం కోసం కూడా కొంతమంది మనుష్యులను ఎంపిక చేసుకుంటున్నాడు. అంకితభావం గల ఈ వ్యక్తులు పరలోకానికి వెళ్లిన తర్వాత, భూమ్మీద విధేయతగల మనుష్యులు పరిపూర్ణతకు చేరుకోవడానికి, శాశ్వత జీవితాన్ని సొంతం చేసుకోవడానికి సహాయం చేస్తారు. యెహోవా ఒకవైపు ఓపికగా ఎదురుచూస్తున్నా, మరోవైపున మన క్షేమం కోసం తన సంకల్పాన్ని నెరవేర్చే దిశలో పనిచేస్తూనే ఉన్నాడు.
6. (ఎ) నోవహు కాలంలో యెహోవా ఏవిధంగా ఓర్పు చూపించాడు? (బి) మనకాలంలో యెహోవా ఎలా ఓర్పు చూపిస్తున్నాడు?
6 జలప్రళయానికి ముందున్న చెడ్డ ప్రజలతో యెహోవా వ్యవహరించిన తీరును గమనిస్తే, తీవ్రమైన కోపం తెప్పించే పరిస్థితుల్లో కూడా ఆయన దీర్ఘశాంతం చూపిస్తాడని తెలుస్తుంది. ఆ కాలంలో నీతినియమాల్లేని క్రూరమైన ప్రజలతో భూమంతా నిండిపోయింది. దిగజారిపోయిన మనుష్యుల పరిస్థితిని చూసి యెహోవా ‘హృదయంలో నొచ్చుకున్నాడు.’ (ఆది. 6:2-8) ఆయన అలాంటి పరిస్థితిని చూస్తూ ఊరుకునే వ్యక్తి కాదు కాబట్టి అవిధేయులైన ప్రజల మీదికి జలప్రళయం రప్పించాలనుకున్నాడు. “దేవుని దీర్ఘశాంతము ఇంక కనిపెట్టుచుండినప్పుడు” ఆయన నోవహును, అతని కుటుంబాన్ని రక్షించడానికి ఏర్పాట్లు చేశాడు. (1 పేతు. 3:19, 20) తను తీసుకున్న నిర్ణయం గురించి యెహోవా సకాలంలో నోవహుకు చెప్పి, ఓడను నిర్మించే పని అప్పగించాడు. (ఆది. 6:14-22) అంతేకాక, నోవహు అక్కడున్న వాళ్లకు రాబోయే ఉపద్రవం గురించి చెబుతూ ‘నీతిని ప్రకటించాడు.’ (2 పేతు. 2:5) మన కాలం కూడా నోవహు కాలంలాగే ఉంటుందని యేసు చెప్పాడు. ఈ దుష్ట వ్యవస్థను ఎప్పుడు నాశనం చేయాలో యెహోవా నిర్ణయించుకున్నాడు. ‘ఆ దినము, ఆ గడియ’ ఎప్పుడు వస్తుందో మనుష్యులెవ్వరికీ తెలియదు. (మత్త. 24:36) ప్రజలను హెచ్చరిస్తూ, రక్షణను ఎలా పొందవచ్చో తెలియజేసే పనిని దేవుడు మనకు ఇప్పుడు అప్పగించాడు.
7. యెహోవా తన వాగ్దానాల్ని నెరవేర్చే విషయంలో జాప్యం చేస్తున్నాడా? వివరించండి.
7 యెహోవా ఓర్పు చూపిస్తున్నాడంటే ఆయన కాలయాపన చేస్తున్నాడని కాదు. కాబట్టి, మన గురించి ఆయన ఏమీ పట్టనట్టు ఉన్నాడని ఎన్నడూ పొరబడకూడదు! నిజానికి, ఈ దుష్ట వ్యవస్థలో మనకు వయసు పైబడుతుండగా, ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుండగా ఆ విషయాన్ని గుర్తుంచుకోవడం మనకు కష్టంగానే ఉండవచ్చు. దానివల్ల మనం కొన్నిసార్లు నిరుత్సాహానికి గురయ్యే అవకాశముంది లేదా దేవుడు తన వాగ్దానాల్ని నెరవేర్చే విషయంలో జాప్యం చేస్తున్నాడని అనుకునే ప్రమాదం ఉంది. (హెబ్రీ. 10:36) ఆయన మంచి కారణాలతోనే ఓర్పు చూపిస్తున్నాడని, మిగిలి ఉన్న సమయాన్ని తన సేవకుల ప్రయోజనార్థమే ఉపయోగిస్తున్నాడని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. (2 పేతు. 2:3; 3:9) అయితే, దేవుడు చూపించేలాంటి ఓర్పును యేసు ఎలా చూపించాడో ఇప్పుడు పరిశీలిద్దాం.
ఓర్పు చూపించే విషయంలో యేసు ఎలా ఆదర్శంగా ఉన్నాడు?
8. ఎలాంటి పరిస్థితుల్లో యేసు ఓర్పు చూపించాడు?
8 యేసు యుగయుగాల నుండి దేవుని చిత్తాన్ని మనస్ఫూర్తిగా చేస్తూనే ఉన్నాడు. సాతాను తిరుగుబాటు చేసినప్పుడు, యెహోవా తన ఏకైక కుమారుణ్ణి భూమ్మీదికి మెస్సీయగా పంపించాలని నిర్ణయించుకున్నాడు. యేసు ఆ సమయం వచ్చేంతవరకు వేల సంవత్సరాల పాటు వేచి ఉండాల్సి వచ్చింది. (గలతీయులు 4:4 చదవండి.) ఆ సమయమంతటిలో ఆయన ఖాళీగా లేడు కానీ, తండ్రి తనకు అప్పగించిన పనిలో పూర్తిగా నిమగ్నమైపోయాడు. ఆ తర్వాత ఆయన భూమ్మీదికి వచ్చాడు, దేవుడు ముందే చెప్పినట్లు తను సాతాను చేతుల్లో చనిపోవాలని యేసుకు తెలుసు. (ఆది. 3:15; మత్త. 16:21) ఆయన ఎంతో వేదనను అనుభవించాల్సి వచ్చినా ఓపికగా దేవుని చిత్తానికే లోబడ్డాడు. ఆయన అసమానమైన విశ్వసనీయతను చూపించాడు. ఆయన తన గురించి, తన స్థానం గురించి ఎక్కువగా చింతించలేదు. ఆయన ఉదాహరణ నుండి మనం చాలా నేర్చుకోవచ్చు.—హెబ్రీ. 5:8, 9.
9, 10. (ఎ) యెహోవా నిర్ణయించిన సమయం కోసం వేచి చూస్తున్న యేసు ఏమి చేస్తున్నాడు? (బి) యెహోవా కాలపట్టికను మనం ఏ దృష్టితో చూడాలి?
9 పునరుత్థానం తర్వాత యేసు పరలోకంలో, భూమ్మీద అధికారం పొందాడు. (మత్త. 28:18) యెహోవా సంకల్పాన్ని, యెహోవా నిర్ణయించిన సమయంలోనే పూర్తిచేయడానికి యేసు తన అధికారాన్ని ఉపయోగిస్తాడు. 1914లో తన శత్రువులు తన పాదాలకు పీఠంగా చేయబడేవరకు యేసు యెహోవా దేవుని కుడిపార్శ్వాన ఓపికగా వేచివున్నాడు. (కీర్త. 110:1, 2; హెబ్రీ. 10:12, 13) త్వరలోనే ఆయన సాతాను వ్యవస్థను అంతమొందిస్తాడు. ఈలోపు, యేసు ఓపికగా ప్రజల్ని నిర్దేశిస్తూ వాళ్లను “జీవజలముల” వద్దకు నడిపిస్తున్నాడు.—ప్రక. 7:17.
10 యేసు ఉదాహరణను పరిశీలించాక, యెహోవా కాలపట్టికను ఏ దృష్టితో చూడాలో మనకు అర్థమైంది. తండ్రి అడిగిన ప్రతీదాన్ని చేయడానికి యేసుకు ఎంతో ఆతురత ఉన్నా, తండ్రి నిర్ణయించిన సమయం వచ్చేంతవరకు ఆయన ఇష్టపూర్వకంగా వేచివున్నాడు. సాతాను వ్యవస్థ అంతమయ్యే సమయం కోసం మనం వేచి చూస్తుండగా దేవుడు చూపించేలాంటి ఓర్పును మనం చూపించాలి. మనం నిరుత్సాహంతో వెనకడుగు వేయకుండా దేవుడు పరిస్థితుల్ని చక్కదిద్దే వరకు ఓపికగా ఎదురుచూడాలి. మరైతే, అలాంటి ఓర్పు మనకెలా వస్తుంది?
దేవుడు చూపించేలాంటి ఓర్పును మనమెలా పెంపొందించుకోవచ్చు?
11. (ఎ) విశ్వాసానికి, ఓర్పుకు సంబంధం ఏమిటి? (బి) మనం గట్టి విశ్వాసంతో ఉండడానికి ఏ బలమైన కారణాలున్నాయి?
11 అపరిపూర్ణ మానవులు కూడా ఎలా ఓర్పు కనబర్చవచ్చో క్రీస్తుకు ముందున్న ప్రవక్తలు, మరితర నమ్మకమైన సేవకులు చూపించారు. వాళ్ల విశ్వాసానికి, వాళ్లు చూపించిన ఓర్పుకు నేరుగా సంబంధముంది. (యాకోబు 5:10, 11 చదవండి.) యెహోవా చెప్పినవాటిని వాళ్లు నిజంగా నమ్మి ఉండకపోతే అంటే, ఆయన మాట మీద విశ్వాసం చూపించి ఉండకపోతే, ఆయన వాగ్దానాల నెరవేర్పు కోసం వాళ్లు ఓపికగా వేచివుండేవాళ్లా? భయాందోళనలకు గురిచేసే, విశ్వాసాన్ని పరీక్షించే సవాళ్లు పదేపదే ఎదురైనా, దేవుని వాగ్దానాలు ఎప్పటికైనా నెరవేరుతాయనే నమ్మకంతో వాటిని వాళ్లు అధిగమించారు. (హెబ్రీ. 11:13, 35-40) యేసు మన విశ్వాసాన్ని సంపూర్ణం చేస్తున్నాడు, అందుకే మనం గట్టి విశ్వాసంతో ఉండడానికి ఇంకెన్నో బలమైన కారణాలున్నాయి. (హెబ్రీ. 12:1, 2) మనం అలాంటి విశ్వాసాన్ని కలిగివుండడానికి దోహదపడే విధంగా ఆయన ప్రవచనాన్ని నెరవేర్చాడు, దేవుని సంకల్పాలను మనకు బయలుపర్చాడు.
12. మన విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి మనమేమి చేయవచ్చు?
12 ఓర్పును ఇంకా ఎక్కువగా అలవర్చుకుంటూ మన విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి మనం ఏమి చేయాలి? దేవుని ఉపదేశాలను పాటించాలి. ఉదాహరణకు, జీవితంలో దేవుని రాజ్యానికి మొదటిస్థానం ఎందుకు ఇవ్వాలో ఆలోచించండి. మత్తయి 6:33లోని సలహాను పాటించడానికి మీరు మరింత ఎక్కువగా కృషి చేయగలరా? దానికోసం, పరిచర్యలో మీరు ఇంకెక్కువ సమయాన్ని వెచ్చించడంతో పాటు, మీ జీవన శైలిలో కొన్ని సర్దుబాట్లు కూడా చేసుకోవాల్సి రావచ్చు. ఇప్పటివరకు యెహోవా మీ ప్రయత్నాలను ఎలా ఆశీర్వదించాడో గుర్తుంచుకోండి. మీరు కొత్త బైబిలు అధ్యయనం మొదలుపెట్టేందుకు ఆయన సహాయం చేసివుండవచ్చు, లేదా ‘మీ తలంపులకు కావలిగా ఉండే దేవుని సమాధానాన్ని’ మీరు పొందేందుకు ఆయన మీకు సహాయం చేసివుండవచ్చు. (ఫిలిప్పీయులు 4:7 చదవండి.) యెహోవా నిర్దేశాలను పాటించడం వల్ల పొందిన ప్రయోజనాల మీద దృష్టి పెడితే, ఓర్పుగా ఉండడం ఎంత అవసరమో మీరు ఇంకా బాగా అర్థంచేసుకుంటారు.—కీర్త. 34:8.
13. ఓర్పును పెంచుకుంటూ విశ్వాసాన్ని బలపర్చుకునే విధానాన్ని ఏ ప్రక్రియతో పోల్చవచ్చు?
13 ఓర్పును పెంచుకుంటూ మన విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి చేయాల్సిన పనుల్ని మనం విత్తడం, సేద్యం చేయడం, పంట కోయడం అనే పనులతో పోల్చవచ్చు. విస్తారంగా పంట కోసిన ప్రతీసారి, రాబోయే కాలంలో కూడా అలాగే పండించగలననే నమ్మకం రైతుకు కుదురుతుంది. అయితే, కోతకాలం కోసం పడిగాపులు కాయాల్సి వస్తుందని ఆయన మళ్లీ పంట వేయడం ఎందుకులే అనుకుంటాడా? అస్సలు అనుకోడు కానీ, మునుపటి కన్నా ఎక్కువ నేలను సేద్యం చేయాలని ఆలోచిస్తాడు. పంట చేతికి వస్తుందని బలంగా నమ్ముతాడు. అలాగే, యెహోవా ఉపదేశాల గురించి నేర్చుకుంటూ, వాటిని పాటిస్తూ, ప్రయోజనాలు పొందుతూ ఉంటే ఆయనమీద మనకున్న నమ్మకం బలపడుతుంది. మన విశ్వాసం కూడా బలపడుతుంది, మనం పొందబోయే ఆశీర్వాదాల కోసం ఓపికగా ఎదురుచూడగలుగుతాం.—యాకోబు 5:7, 8 చదవండి.
14, 15. మనుష్యులు పడుతున్న బాధలను మనం ఏ దృష్టితో చూడాలి?
14 లోకం విషయంలో, మన పరిస్థితుల విషయంలో మన వైఖరి ఎలా ఉండాలో ఆలోచించడం ద్వారా కూడా మనం ఓర్పును పెంచుకోవచ్చు. ప్రతీ విషయాన్ని యెహోవా దృష్టి నుండి చూడడానికి ప్రయత్నించండి. ఉదాహరణకు, మనుష్యులు బాధలు పడుతుంటే ఆయనకు ఎలా ఉంటుందో ఆలోచించండి. మొదటి నుండి మనుష్యులు పడుతున్న బాధలను చూసి ఆయన ఎంతో బాధపడుతున్నాడు, అయినా ఆయన దుఃఖంలో మునిగిపోకుండా, మన శ్రేయస్సు కోసం పనిచేశాడు. ‘అపవాది క్రియల్ని లయపరచడానికి,’ మనుష్యులకు అతను తలపెట్టిన కీడునంతటినీ తీసివేయడానికి యెహోవా తన అద్వితీయ కుమారుణ్ణి పంపించాడు. (1 యోహా. 3:8) ఇప్పుడు మనం పడే బాధలు కొంతకాలం వరకే ఉంటాయి కానీ దేవుడు వాటిని శాశ్వతంగా తీసివేస్తాడు. కాబట్టి, సాతాను దుష్ట పరిపాలనను చూసి ఆందోళనపడే బదులు, అంతం విషయంలో సహనం కోల్పోయే బదులు భవిష్యత్తులో శాశ్వతంగా ఉండే విషయాలమీద మనం విశ్వాసం ఉంచాలి. యెహోవా దుష్టత్వాన్ని ఎంతోకాలం కొనసాగనివ్వడు, ఆయన సరైన సమయంలో దాన్ని అంతమొందిస్తాడు.—యెష. 46:13; నహూ. 1:9.
15 ఈ విధానపు అంత్యదినాల్లో పరిస్థితులు మరీ కష్టంగా ఉన్నాయి కాబట్టి మన విశ్వాసాన్ని పరీక్షించే ప్రత్యేకమైన సవాళ్లు మనకు ఎదురౌతాయి. హింసలకు గురౌతున్నప్పుడు లేదా మన ప్రియమైనవాళ్లు బాధలు పడుతున్నప్పుడు మనం కోపావేశాలకు లోనవ్వకుండా యెహోవా మీద పూర్తి నమ్మకం ఉంచాలని తీర్మానించుకోవాలి. మనం అపరిపూర్ణులం కాబట్టి అదంత సులువు కాదు. యేసు ఏమి చేశాడో గుర్తుచేసుకోండి. ఆయన చేసిన దాని గురించి మత్తయి 26:39లో ఉంది.—చదవండి.
16. మిగిలివున్న ఈ సమయంలో మనం ఏమి చేయకూడదు?
16 ‘అంతం వచ్చినప్పుడు చూద్దాంలే’ అనే వైఖరి ఉంటే, మనం దేవుడు చూపించేలాంటి ఓర్పును చూపించలేం. అలాంటి వైఖరి ఉంటే అంతం ఇప్పట్లో రాదనిపించవచ్చు. దానివల్ల ఒక వ్యక్తి, యెహోవా వాగ్దానాలు నెరవేరకపోతే ఎలా అనే ఆలోచనతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడం మొదలుపెట్టే అవకాశం ఉంది. ఇంకో మాటలో చెప్పాలంటే అతడు, ‘యెహోవా తన మాట నిలబెట్టుకుంటాడో లేదో చూద్దాం’ అని అనుకుంటాడు. దాంతో, అతడు ఈ లోకంలో పేరుప్రతిష్ఠలు సంపాదించుకోవాలని తాపత్రయపడే ప్రమాదముంది, దేవుని రాజ్యానికి మొదటిస్థానం ఇవ్వకుండా ఆర్థిక భద్రతను చేకూర్చుకోవడానికి ప్రయత్నించే అవకాశముంది, సౌకర్యవంతమైన జీవితం కోసం ఉన్నత చదువుల మీద నమ్మకం పెట్టుకునే ప్రమాదం ఉంది. నిజానికి అవన్నీ విశ్వాసం లేదని చూపించే పనులు కావా? “విశ్వాసము చేతను, ఓర్పుచేతను” దేవుని వాగ్దానాలను పొందిన నమ్మకమైన స్త్రీపురుషులను ఆదర్శంగా తీసుకోమని పౌలు ప్రోత్సహించాడని గుర్తుంచుకోండి. (హెబ్రీ. 6:11, 12) యెహోవా సంకల్పం నెరవేర్చాల్సిన సమయం వస్తే ఆయన ఒక్క క్షణం కూడా ఈ దుష్ట వ్యవస్థను కొనసాగనివ్వడు. (హబ. 2:3) ఈలోగా మనం, యెహోవాను మొక్కుబడిగా సేవించకుండా, అప్రమత్తంగా ఉంటూ మనకు ఎంతో సంతృప్తినిచ్చే సువార్త పనిని శ్రద్ధగా చేద్దాం.—లూకా 21:36.
ఓర్పు చూపిస్తే మనం ఎలాంటి ఆశీర్వాదాలు పొందుతాం?
17, 18. (ఎ) మనం ఓర్పు చూపిస్తూ ఏమి నిరూపించుకునే అవకాశాన్ని యెహోవా ఇస్తున్నాడు? (బి) ఇప్పుడు ఓర్పును చూపిస్తే మనం ఎలాంటి ఆశీర్వాదాల్ని పొందుతాం?
17 మనం కొత్తగా యెహోవా సేవ చేయడం మొదలుపెట్టినా, లేదా ఎంతోకాలం నుండి అలా చేస్తున్నా మనం నిరంతరం ఆయన సేవ చేయాలనుకుంటాం. అంతం రావడానికి ఎంత సమయం మిగిలివున్నా, మనం రక్షణ పొందేంతవరకు ఓపికగా ఎదురుచూడాలంటే మనకు దీర్ఘశాంతం అవసరం. ఆయన మీద మనకు పూర్తి విశ్వాసం ఉందని, అవసరమైతే ఎన్ని బాధలు పడడానికైనా మనం సిద్ధమేనని నిరూపించుకునే అవకాశాన్ని యెహోవా ఇప్పుడు మనకు ఇస్తున్నాడు. (1 పేతు. 4:13, 14) రక్షణ పొందడానికి అవసరమైన ఓర్పు కలిగివుండడానికి యెహోవా మనకు శిక్షణ కూడా ఇస్తున్నాడు.—1 పేతు. 5:10.
18 యేసుకు పరలోకంలో, భూమ్మీద సర్వాధికారముంది. కాబట్టి, మనం నమ్మకంగా ఉంటే ఆయన సంరక్షణ నుండి మనల్ని ఎవ్వరూ బయటికి లాగలేరు. (యోహా. 10:28, 29) భవిష్యత్తుకు, చివరికి చావుకు కూడా భయపడాల్సిన పని లేదు. అంతం వరకు సహించేవాళ్లకే రక్షణ దొరుకుతుంది. కాబట్టి మనం లోకం చేతుల్లో మోసపోకుండా ఉండాలి, లోక ప్రభావంతో యెహోవాపై నమ్మకం తగ్గకుండా చూసుకోవాలి. మన విశ్వాసాన్ని బలపర్చుకోవాలని, దేవుడు ఓర్పుతో అనుమతిస్తున్న ఈ సమయాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించుకోవాలని మనం తీర్మానించుకోవాలి.—మత్త. 24:13; 2 పేతురు 3:17, 18 చదవండి.