ఈ లోకం ఎలా అంతమౌతుంది?
“ఆ దినము దొంగవలె మీమీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారుకారు.”—1 థెస్స. 5:4.
1. మనం ఎలా అప్రమత్తంగా ఉండవచ్చు? శ్రమల్ని తట్టుకొని ఎలా నిలబడవచ్చు?
ప్రపంచాన్ని కుదిపివేసే సంఘటనలు త్వరలోనే జరుగుతాయి. బైబిలు ప్రవచనాలు నెరవేరడం చూస్తే ఆ మాట నిజమేనని అర్థమౌతోంది కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి. ఎలా? “అదృశ్యమైనవాటి” మీద దృష్టి నిలపమని అపొస్తలుడైన పౌలు ఉపదేశించాడు. అవును, మనకు పరలోక నిరీక్షణ ఉన్నా, భూనిరీక్షణ ఉన్నా మనమందరం నిత్యజీవ బహుమానాన్ని మనసులో ఉంచుకోవాలి. పౌలు రాసిన ఆ మాటల సందర్భాన్ని పరిశీలిస్తే, నమ్మకంగా జీవించడం వల్ల దొరికే సంతోషకరమైన భవిష్యత్తుపై మనసు పెట్టమని ఆయన తోటి విశ్వాసులను ప్రోత్సహించాడని తెలుస్తోంది. శ్రమల్ని, హింసల్ని తట్టుకొని నిలబడాలంటే వాళ్లు అదృశ్యమైనవాటి మీద మనసు పెట్టాలి.—2 కొరిం. 4:8, 9, 16-18; 5:6.
2. (ఎ) మన నిరీక్షణను బలంగా ఉంచుకోవాలంటే మనం ఏమి చేయాలి? (బి) ఈ ఆర్టికల్లో, తర్వాతి ఆర్టికల్లో మనం వేటి గురించి పరిశీలిస్తాం?
2 పౌలు ఇచ్చిన ఉపదేశంలో ఒక ప్రాముఖ్యమైన సూత్రం ఉంది: మన నిరీక్షణను బలంగా ఉంచుకోవాలంటే, కంటికి కనిపించే విషయాలపై కాక, కనిపించని భవిష్యత్తు సంఘటనలపై మనం మనసు నిలపాలి. (హెబ్రీ. 11:1; 12:1, 2) కాబట్టి, మన నిత్యజీవ నిరీక్షణకు చాలా దగ్గరి సంబంధమున్న పది సంఘటనల గురించి ఈ ఆర్టికల్లో, తర్వాతి ఆర్టికల్లో పరిశీలిస్తాం.
అంతం రావడానికి కాస్త ముందు ఏమి జరుగుతుంది?
3. (ఎ) భవిష్యత్తులో జరిగే ఏ సంఘటన గురించి 1 థెస్సలొనీకయులు 5:2, 3 లో ఉంది? (బి) రాజకీయ నాయకులు ఏమి చేస్తారు? వాళ్లతో ఎవరు చేతులు కలిపే అవకాశం ఉంది?
3 భవిష్యత్తులో జరగనున్న ఒక సంఘటన గురించి పౌలు థెస్సలొనీకయులకు రాసిన పత్రికలో ప్రస్తావించాడు. (1 థెస్సలొనీకయులు 5:2, 3 చదవండి.) ఆయన “ప్రభువు దినము [“యెహోవా దినము,” NW]” గురించి మాట్లాడాడు. ఆ లేఖనంలో “యెహోవా దినము” అనే మాట, అబద్ధమత నాశనంతో మొదలై హార్మెగిద్దోనుతో ముగిసే కాలాన్ని సూచిస్తోంది. యెహోవా దినం మొదలవడానికి కాస్త ముందు ప్రపంచంలోని నాయకులు, ‘నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదు!’ అని చాటుతుంటారు. అది ఒకసారి లేదా అంతకన్నా ఎక్కువసార్లు వెలువడే ప్రకటనై ఉండవచ్చు. ప్రపంచంలో ఉన్న కొన్ని పెద్ద సమస్యలను పరిష్కరించే స్థాయికి చేరుకున్నామని దేశాలు అనుకోవచ్చు. మరి మతనాయకుల విషయమేమిటి? వాళ్లు కూడా ఈ లోకంలో భాగమే కాబట్టి వాళ్లు రాజకీయ నాయకులతో చేతులు కలిపే అవకాశం ఉంది. (ప్రక. 17:1, 2) మతనాయకులు ఒకప్పటి యూదాలోని అబద్ధ ప్రవక్తల్లాగే ప్రవర్తిస్తారు. ఆ ప్రవక్తలు ‘సమాధానములేని సమయమున—సమాధానము సమాధానమని చెప్పుచున్నారు’ అని యెహోవా అన్నాడు.—యిర్మీ. 6:14; 23:16, 17.
4. లోకంలోని ప్రజలకు తెలియని ఏ విషయం మనకు తెలుసు?
4 ‘నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదు!’ అనే ప్రకటన ఎవరు చేసినా, యెహోవా దినం ప్రారంభం కానుందని అది సూచిస్తుంది. అందుకే పౌలు ఇలా అనగలిగాడు: ‘సహోదరులారా, ఆ దినం దొంగవలె మీమీదికి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారుకారు. మీరందరు వెలుగు సంబంధులై ఉన్నారు.’ (1 థెస్స. 5:4, 5) ప్రస్తుత సంఘటనలు లేఖనాల నెరవేర్పుగానే జరుగుతున్నాయనే సంగతి మనకు తెలుసు కానీ లోకంలోని ప్రజలకు తెలియదు. ఇంతకీ ‘నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదు!’ అనే నినాదం గురించిన బైబిలు ప్రవచనం ఎలా నెరవేరుతుంది? మనం వేచి చూడాల్సిందే. కాబట్టి, మనం ‘మత్తులం కాక’ మెలకువగా ఉండాలి.—1 థెస్స. 5:6; జెఫ. 3:8.
తప్పుడు అంచనాలు వేసుకున్న ఒక “రాణి”
5. (ఎ) ‘మహాశ్రమలు’ ఎలా మొదలౌతాయి? (బి) తప్పుడు అంచనాలు వేసుకున్న “రాణి” ఎవరు?
5 ఆ తర్వాత ఏ సంఘటన జరుగుతుంది? పౌలు ఇలా రాశాడు, ‘నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా, వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును.’ “వేశ్య” అని కూడా వర్ణించబడిన ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన “మహా బబులోను” మీద జరిగే దాడే ఆ ‘ఆకస్మిక నాశనంలో’ మొదటి ఘట్టం. (ప్రక. 17:5, 6, 15) క్రైస్తవమత సామ్రాజ్యంతోసహా అబద్ధమతాలన్నిటిపై దాడి జరిగినప్పుడు ‘మహాశ్రమలు’ మొదలౌతాయి. (మత్త. 24:20, 21; 2 థెస్స. 2:8) ఆ సంఘటన చూసి చాలామంది నివ్వెరపోతారు. ఎందుకంటే, అప్పటివరకు ఆ వేశ్య తాను ‘రాణినని, దుఃఖమును చూడనే చూడనని’ అనుకుంటుంది. కానీ, ఒక్కసారిగా ఆమె అంచనాలన్నీ తారుమారైపోతాయి. ఆమె నాశనం “ఒక్క దినముననే” జరిగిందా అన్నట్లు శరవేగంగా జరుగుతుంది.—ప్రక. 18:7, 8.
6. అబద్ధమతం ఎలా నాశనం అవుతుంది?
6 ఆ వేశ్య మీద ‘పది కొమ్ములుగల క్రూరమృగం’ దాడి చేస్తుందని బైబిలు చెబుతోంది. ప్రకటన గ్రంథాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేస్తే, ఐక్యరాజ్య సమితే ఆ క్రూరమృగమని తెలుస్తుంది. ‘ఎర్రని క్రూరమృగానికి’ మద్దతిచ్చే రాజకీయ శక్తులన్నిటినీ ఆ “పది కొమ్ములు” సూచిస్తున్నాయి. a (ప్రక. 17:3, 5, 11, 12) ఆ వేశ్య మీద జరిగే దాడి ఎంత ఘోరంగా ఉంటుంది? ఐక్యరాజ్యసమితిలోని దేశాలు దాని సంపదను దోచుకొని, దాని అసలు రూపాన్ని బయటపెట్టి, దాన్ని భక్షించి, ‘అగ్నిచేత దాన్ని బొత్తిగా కాల్చివేస్తాయి.’ అది ఇక ఎన్నటికీ ఉనికిలోకి రాదు.—ప్రకటన 17:16 చదవండి.
7. ‘క్రూరమృగపు’ దాడి ఎలా మొదలౌతుంది?
7 ఆ దాడి ఎలా మొదలౌతుందో కూడా బైబిలు ప్రవచనం వెల్లడిస్తోంది. ఆ వేశ్యను నాశనం చేయాలనే “తన సంకల్పము కొనసాగించునట్లు” యెహోవా ఏదోవిధంగా రాజకీయ నాయకుల హృదయాల్లో ఆ ఆలోచనను పుట్టిస్తాడు. (ప్రక. 17:17) యుద్ధాలకు కారణమౌతున్న మతాలు ప్రపంచ శాంతికి భంగం కలిగిస్తూ ఉంటాయి కాబట్టి, వాటిని నాశనం చేయడం తమ దేశ ప్రయోజనం కోసమేనని రాజకీయ నాయకులు అనుకుంటారు. నిజానికి, రాజకీయ నాయకులు ఆ దాడికి పాల్పడినప్పుడు తమ సొంత “సంకల్పము” నెరవేర్చుకుంటున్నామని అనుకుంటారు. కానీ, అది నిజం కాదు, అబద్ధమతాల్ని సమూలంగా నాశనం చేయడానికి దేవుడు వాళ్లను ఒక పనిముట్టుగా వాడుకుంటాడంతే. అలా, ఆశ్చర్యకరంగా సాతాను వ్యవస్థలోని ఒక భాగం మరో భాగంపై దాడి చేస్తుంది, దాన్ని ఆపడం సాతాను తరం కాదు.—మత్త. 12:25, 26.
దేవుని ప్రజలపై దాడి
8. “మాగోగు దేశపువాడగు గోగు” చేసే దాడి అంటే ఏమిటి?
8 అబద్ధమతాలన్నీ పూర్తిగా నాశనమైన తర్వాత కూడా, యెహోవా సేవకులు ఏ భయమూ లేకుండా ‘ప్రాకారాలు లేని’ గ్రామాల్లో జీవిస్తున్న వాళ్లలా ఉంటారు. (యెహె. 38:11, 14) మరి నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు కనిపించే యెహోవా సేవకులకు ఏమౌతుంది? “జనములనేకములు” వచ్చి వాళ్ల మీద దాడి చేస్తారు. వాళ్లు సమూలంగా నాశనమైపోతారేమో అన్నంత స్థాయిలో ఆ దాడి జరుగుతుంది. దాన్ని “మాగోగు దేశపువాడగు గోగు” చేసే దాడిగా బైబిలు వర్ణిస్తోంది. (యెహెజ్కేలు 38:2, 15, 16 చదవండి.) దాన్ని మనమెలా దృష్టించాలి?
9. (ఎ) క్రైస్తవులకు ఏది ముఖ్యం? (బి) ఇప్పుడు మన విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి మనం ఏమేమి చేయాలి?
9 దేవుని ప్రజల మీద జరగబోయే దాడి గురించి ముందుగా తెలుసుకున్నందుకు మనం అతిగా ఆందోళనపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, మనకు మన సొంత రక్షణ కాదుగానీ యెహోవా నామం పరిశుద్ధపర్చబడడం, ఆయన సర్వాధిపత్యం నిరూపించబడడమే ముఖ్యం. నిజానికి, ‘నేనే యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకోవాలి’ వంటి మాటల్ని యెహోవా 60 కన్నా ఎక్కువసార్లు అన్నాడు. (యెహె. 6:6, 7) కాబట్టి, ‘తన భక్తులను శోధనలో నుండి ఎలా తప్పించాలో’ యెహోవాకు తెలుసనే నమ్మకాన్ని చూపిస్తూ యెహెజ్కేలు ప్రవచనంలోని ఆ ప్రత్యేకమైన మాటల నెరవేర్పు కోసం మనం అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తాం. (2 పేతు. 2:9) అయితే ఆలోగా, మనం మన విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అప్పుడే మనం ఎలాంటి పరీక్షలు ఎదురైనా యెహోవా పట్ల యథార్థంగా ఉంటాం. దానికోసం మనం ఏమేమి చేయాలి? ప్రార్థన చేయాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, రాజ్య సందేశాన్ని ఇతరులతో పంచుకోవాలి. అవన్నీ చేస్తే, మనం మన నిత్యజీవ నిరీక్షణను “లంగరువలె” నిశ్చలంగా ఉంచుకుంటాం.—హెబ్రీ. 6:19; కీర్త. 25:21.
యెహోవా ఎవరో జనాంగాలు తెలుసుకోవాలి
10, 11. ఏ సంఘటనతో హార్మెగిద్దోను యుద్ధం మొదలౌతుంది? ఆ యుద్ధంలో ఏమి జరుగుతుంది?
10 యెహోవా సేవకులపై దాడి జరిగినప్పుడు ప్రపంచాన్ని కుదిపివేసే ఏ సంఘటన జరుగుతుంది? యెహోవా తన కుమారుడైన యేసును, పరలోక సైన్యాలను ఉపయోగించుకొని తన ప్రజల తరఫున యుద్ధం చేస్తాడు. (ప్రక. 19:11-16) అదే “సర్వాధికారియైన దేవుని మహాదినమున” జరిగే హార్మెగిద్దోను యుద్ధం.—ప్రక. 16:14, 16.
11 ఆ యుద్ధం గురించి యెహోవా యెహెజ్కేలు ద్వారా ఇలా చెప్పాడు: “నా పర్వతములన్నిటిలో అతని [గోగు] మీదికి ఖడ్గము రప్పించెదను, ప్రతివాని ఖడ్గము వాని సహోదరుని మీద పడును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.” భయాభ్రాంతులకు లోనై ఏమి చేయాలో తెలియక సాతాను పక్షాన ఉన్నవాళ్లందరూ ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటారు. అయితే వాళ్లకు మాత్రమే కాదు, సాతానుకు కూడా నాశనం పొంచివుంది. యెహోవా ఇలా చెప్పాడు: ‘అతని [గోగు] మీదను, అతని సైన్యపువారి మీదను, అతనితో కూడిన జనములనేకముల మీదను అగ్నిగంధకములను కురిపించెదను.’ (యెహె. 38:21, 22) దాని ఫలితం ఏమిటి?
12. జనాంగాలు ఏమి చేయాల్సి వస్తుంది?
12 యెహోవా ఆజ్ఞాపించినందువల్లే తాము చిత్తుగా ఓడిపోతున్నామని జనాంగాలు అప్పుడు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎర్ర సముద్రం వరకు ఇశ్రాయేలీయుల్ని తరుముకుంటూ వచ్చిన ఒకప్పటి ఐగుప్తు సైన్యాల్లా సాతాను సైన్యాలు దిక్కు తోచక, “యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడు” అని బహుశా గగ్గోలుపెడతారు. (నిర్గ. 14:25) అవును, ఆ సమయంలో యెహోవా ఎవరో జనాంగాలు బలవంతంగా తెలుసుకోవాల్సి వస్తుంది. (యెహెజ్కేలు 38:23 చదవండి.) ఆ సంఘటనల పరంపరకు మనం ఎంత దూరంలో ఉన్నాం?
ఇంకే ప్రపంచాధిపత్యమూ రాదు
13. ప్రతిమలోని ఐదవ భాగం గురించి మనకేమి తెలుసు?
13 దానియేలు గ్రంథంలోని ఒక ప్రవచనాన్ని పరిశీలిస్తే, కాలగమనంలో మనం ఎక్కడ ఉన్నామో తెలుసుకోవచ్చు. వివిధ లోహాలతో రూపొందిన ఒక ప్రతిమను దానియేలు వర్ణించాడు. (దాని. 2:28, 31-33) గతంలో అలాగే, మన కాలంలో దేవుని ప్రజలపై ఎంతో ప్రభావం చూపించిన వరుస ప్రపంచాధిపత్యాలను ఆ ప్రతిమ సూచించింది. ఆ ప్రపంచాధిపత్యాలు ఇవి: బబులోను, మాదీయ-పారసీక, గ్రీసు, రోము, ఆ తర్వాత మనకాలంలో ఉన్న చివరిదైన మరో ప్రపంచాధిపత్యం. దానియేలు ప్రవచనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, ప్రతిమలో పాదాలూ వేళ్లూ ఉన్న భాగం చివరి ప్రపంచాధిపత్యాన్ని సూచిస్తుందని తెలుసుకుంటాం. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటన్, అమెరికా దేశాలు ఒక ప్రత్యేక భాగస్వామ్యాన్ని ఏర్పర్చుకున్నాయి. అవును, ఆంగ్లో-అమెరికన్ ప్రపంచాధిపత్యమే ఆ ప్రతిమలోని ఐదవ భాగం. ఆ ప్రతిమలోని చివరి భాగం పాదాలే కాబట్టి, దాని తర్వాత ఏ ప్రపంచాధిపత్యమూ ఉనికిలోకి రాదని అది చూపిస్తోంది. ఇనుమూ మట్టీ కలిసివున్న పాదాలు-వేళ్ల భాగం, బలహీన స్థితిలో ఉన్న ఆంగ్లో-అమెరికన్ ప్రపంచాధిపత్యాన్ని సూచిస్తోంది.
14. హార్మెగిద్దోను యుద్ధం మొదలయ్యే సమయానికి ఏ ప్రపంచాధిపత్యం ఏలుతూ ఉంటుంది?
14 యెహోవా సర్వాధిపత్యమనే పర్వతం నుండి 1914లో దేవుని రాజ్యమనే పెద్ద రాయి తీయబడిందని అదే ప్రవచనం సూచిస్తోంది. ఇప్పుడు ఆ రాయి ప్రతిమ పాదాలను ఢీకొట్టే దిశగా దూసుకొస్తోంది. హార్మెగిద్దోను యుద్ధమప్పుడు పాదాలతో సహా పూర్తి ప్రతిమ ముక్కలుచెక్కలై పోతుంది. (దానియేలు 2:44, 45 చదవండి.) కాబట్టి, హార్మెగిద్దోను యుద్ధం మొదలయ్యే సమయానికి ఆంగ్లో-అమెరికన్ ప్రపంచాధిపత్యమే ఏలుతూ ఉంటుంది. ఆ ప్రవచనం పూర్తిగా నెరవేరడాన్ని మనం కళ్లారా చూసినప్పుడు ఎంత అబ్బురపడతామో! b అయితే, యెహోవా సాతానును ఏమి చేస్తాడు?
తన ప్రధాన శత్రువును దేవుడు ఏమి చేస్తాడు?
15. హార్మెగిద్దోను తర్వాత సాతానుకు, అతని దయ్యాలకు ఏమి జరుగుతుంది?
15 మొదటిగా, భూమ్మీదున్న తన సామ్రాజ్యమంతా తుడిచిపెట్టుకుపోవడం సాతాను చూస్తాడు. ఆ తర్వాత దాడి జరిగేది సాతానుమీదే. అప్పుడు ఏమి జరుగుతుందో అపొస్తలుడైన యోహాను రాశాడు. (ప్రకటన 20:1-3 చదవండి.) ‘అగాధపు తాళపుచెవిగల దేవదూత’ అయిన యేసుక్రీస్తు సాతానును, అతని దయ్యాలను అగాధంలోకి పడద్రోసి వెయ్యి సంవత్సరాలపాటు బంధిస్తాడు. (లూకా 8:30, 31; 1 యోహా. 3:8) సర్పం తలను చితకగొట్టడంలో అది మొదటి ఘట్టం. c—ఆది. 3:15.
16. ‘అగాధంలో’ ఉన్నప్పుడు సాతాను పరిస్థితి ఎలా ఉంటుంది?
16 సాతాను, అతని దయ్యాలు పడద్రోయబడే “అగాధము” ఏమిటి? యోహాను ఈ సందర్భంలో ఉపయోగించిన అబిస్సోస్ అనే గ్రీకు పదానికి “అత్యంత లేదా చాలా లోతు” అని అర్థం. ఆ పదం ‘అంతులేని, పరిమితుల్లేని,’ ‘అపరిమితమైన శూన్యం’ అని కూడా అనువదించబడింది. కాబట్టి, ఆ చోటికి యెహోవా, ఆయన నియమించిన ‘అగాధపు తాళపుచెవి గల దూత’ తప్ప ఎవ్వరూ చేరుకోలేరు. “ఇక జనములను మోసపరచకుండునట్లు” సాతాను అందులో చావులాంటి నిష్క్రియాస్థితిలో ఉంటాడు. నిజంగా, ఆ “గర్జించు సింహము” గొంతు పడిపోతుంది.—1 పేతు. 5:8.
శాంతిసమాధానాలకు దారితీసే సంఘటనలు
17, 18. (ఎ) మనం ఇంకా చూడని ఏ భవిష్యత్తు సంఘటనల గురించి ఈ ఆర్టికల్లో పరిశీలించాం? (బి) ఆ సంఘటనలు చోటుచేసుకున్నాక ఎలాంటి పరిస్థితి నెలకొంటుంది?
17 త్వరలోనే ప్రపంచాన్ని కుదిపివేసే ప్రాముఖ్యమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. ‘నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదు!’ అనే ప్రకటన ఎలా వెలువడుతుందో వేచిచూడాల్సిందే. ఆ ప్రకటన వెలువడిన తర్వాత, మహాబబులోను నాశనాన్ని, మాగోగు దేశపు వాడైన గోగు చేసే దాడిని, హార్మెగిద్దోను యుద్ధాన్ని, సాతానూ అతని దయ్యాలూ అగాధంలో పడవేయబడడాన్ని మనం చూస్తాం. ఆ సంఘటనలన్నీ చోటుచేసుకొని దుష్టత్వం అంతమయ్యాక, మనం క్రీస్తు వెయ్యేళ్ల పరిపాలన కింద ఒక కొత్త జీవితంలోకి అడుగుపెడతాం. అప్పుడు భూమ్మీద పూర్తిగా శాంతి నెలకొంటుంది.—కీర్త. 37:10, 11.
18 ఈ ఆర్టికల్లో మనం ఐదు సంఘటనల గురించి పరిశీలించాం. అయితే, మనం దృష్టి నిలపాల్సిన ‘అదృశ్యమైన’ విషయాలు ఇంకా ఉన్నాయి. వాటి గురించి మనం తర్వాతి ఆర్టికల్లో పరిశీలిస్తాం.
a ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది! పుస్తకంలో 251-258 పేజీలు చూడండి.
b దేవుని రాజ్యం “ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును” అని దానియేలు 2:44 లోని ప్రవచనం చెబుతోంది. ప్రతిమలోని వివిధ భాగాలతో సూచించబడిన రాజ్యాల లేదా ప్రపంచ శక్తుల గురించి మాత్రమే ఆ ప్రవచనం మాట్లాడుతోంది. అయితే, ఆ ప్రవచనానికి సమాంతరంగా ఉన్న ఒక ప్రవచనం, “సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులు” యెహోవాతో పోరాడడానికి పోగుచేయబడతారని చూపిస్తోంది. (ప్రక. 16:14; 19:19-21) కాబట్టి, ప్రతిమలోని రాజ్యాలే కాక భూమ్మీదున్న ఇతర మానవ రాజ్యాలు కూడా హార్మెగిద్దోనులో నాశనమౌతాయి.
c వెయ్యేళ్ల పరిపాలన ముగింపులో సాతానును, అతని దయ్యాలను “అగ్ని గంధకములుగల గుండములో” పడవేసినప్పుడు సర్పం తలను చితకగొట్టడం పూర్తౌతుంది.—ప్రక. 20:7-10; మత్త. 25:41.