కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జీవిత కథ

60 ఏళ్ల స్నేహ బంధం, కానీ ఇది ఆరంభం మాత్రమే

60 ఏళ్ల స్నేహ బంధం, కానీ ఇది ఆరంభం మాత్రమే

1951 వేసవి కాలంలోని ఓ సాయంత్రాన, 20వ పడిలో ఉన్న నలుగురు యువకులు అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో ఉన్న ఇతాకా ప్రాంతంలో పక్కపక్కనే ఉన్న టెలిఫోను బూత్‌లలో నిలబడి ఎంతో దూరాన ఉన్న మిచిగన్‌, ఐయవా, కాలిఫోర్నియా పట్టణాలకు ఫోన్‌కాల్స్‌ చేసి ఒక శుభవార్త పంచుకున్నారు.

1951 ఫిబ్రవరిలో, గిలియడ్‌ పాఠశాల 17వ తరగతికి హాజరయ్యేందుకు 122 మంది పయినీర్లు న్యూయార్క్‌లోని సౌత్‌ లాన్సింగ్‌కు వచ్చారు. మిషనరీలవ్వబోయే వాళ్లలో, మిచిగన్‌ నుండి వచ్చిన లోవల్‌ టర్నర్‌ మరియు విలియమ్‌ (బిల్‌) కాస్టన్‌, ఐయవా నుండి వచ్చిన రిచర్డ్‌ కెల్సీ, కాలిఫోర్నియా నుండి వచ్చిన రేమన్‌ టెంపల్టన్‌ కూడా ఉన్నారు. ఆ నలుగురు కొన్ని రోజులకే మంచి స్నేహితులయ్యారు.

ఎడమ నుండి కుడికి: రిచర్డ్‌, లోవల్‌, రేమన్‌, బిల్‌ గిలియడ్‌ పాఠశాలలో స్నేహితులయ్యారు

ఐదు నెలల తర్వాత, తరగతి విద్యార్థులతో మాట్లాడేందుకు ప్రపంచ ప్రధాన కార్యాలయం నుండి సహోదరుడు నేథన్‌ నార్‌ వస్తున్నాడని ప్రకటించినప్పుడు ఆ విద్యార్థుల్లో ఆనందం వెల్లివిరిసింది. సాధ్యమైతే ఒకే దేశంలో కలిసి సేవ చేయాలనే కోరికను ఆ నలుగురు సహోదరులు వెలిబుచ్చారు. తమ మిషనరీ నియామకాల గురించి ఆ సందర్శనంలో వాళ్లకు మరిన్ని వివరాలు తెలిశాయి.

సహోదరుడు నేథన్‌ నార్‌ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ మిషనరీ నియామకాలను ప్రకటిస్తున్నప్పుడు అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఆ నలుగురిని మొదటిగా వేదిక మీదకు పిలిచారు. తమను ఒకే చోటికి పంపిస్తున్నారని ప్రకటించగానే అప్పటిదాకా వాళ్ల మనసులో ఉన్న ఆందోళనంతా మటుమాయం అయిపోయింది. ఇంతకీ వాళ్లు ఎక్కడికి నియమించబడ్డారు? వాళ్లని జర్మనీ దేశానికి పంపిస్తున్నారని ప్రకటించగానే తరగతి విద్యార్థులందరూ ఆశ్చర్యంతో చాలాసేపు చప్పట్లు కొట్టారు.

1933 నుండి హిట్లర్‌ పాలన కింద జర్మనీలోని సాక్షులు చూపించిన విశ్వాసం గురించి విన్నప్పుడు ప్రపంచ నలుమూలల ఉన్న యెహోవాసాక్షులు ఆశ్చర్యపోయారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలోని సహోదరుల సహాయార్థం బట్టలను, ఓ ఛారిటబుల్‌ సంస్థ ఇచ్చిన సామాగ్రిని సిద్ధం చేసి పంపించడాన్ని చాలామంది విద్యార్థులు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. జర్మనీలోని సాక్షులు అసాధారణమైన విశ్వాసానికి, పట్టుదలకు, ధైర్యానికి, యెహోవా మీదున్న నమ్మకానికి పేరుగాంచారు. ‘ఆ దేశంలో ఉన్న ప్రియమైన సహోదరసహోదరీలను తెలుసుకునే అవకాశం మాకు దొరుకుతుంది’ అని అప్పుడు తన మనసులో అనుకున్నట్లు లోవల్‌ గుర్తుచేసుకున్నాడు. అందుకే, ఆ రోజు సాయంత్రం వాళ్లు ఉత్సాహంగా ఫోన్లు చేశారు.

జర్మనీ ప్రయాణం

తమ నియామకాల్లో పొందిన సంతోషాల వల్ల, తమకు ఏది మంచిదో యెహోవాకే బాగా తెలుసని వాళ్లు గట్టిగా నమ్మారు

1951, జూలై 27న, న్యూయార్క్‌ ఈస్ట్‌ రివర్‌ ఓడ రేవు నుండి హోమ్‌లాండ్‌ అనే ఓడలో ఆ నలుగురు జర్మనీకి బయలుదేరారు. అది 11 రోజుల ప్రయాణం. గిలియడ్‌ ఉపదేశకునిగా, ఆ తర్వాత పరిపాలక సభ సభ్యునిగా సేవచేసిన సహోదరుడు ఆల్బర్ట్‌ ష్రోడర్‌ వాళ్లకు జర్మన్‌ భాషలో తొలిపలుకులు నేర్పాడు. ఇప్పుడు ఆ ఓడలో చాలామంది జర్మనీ ప్రయాణికులు ఉన్నారు గనుక వాళ్లు ఆ భాషను ఇంకాస్త నేర్చుకోవడానికి అవకాశం ఉన్నట్లు కనిపించింది. కానీ, ఆ ప్రయాణికులు జర్మన్‌ భాషను ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతుండడంతో ఆ నలుగురికి అంతా అయోమయంగా అనిపించింది.

ఆ సహోదరులు సముద్ర ప్రయాణంలో వచ్చిన అనారోగ్య పరిస్థితులను తట్టుకుని చిట్టచివరికి ఆగస్టు 7, మంగళవారం పొద్దున జర్మనీలోని హామ్‌బర్గ్‌కు చేరుకున్నారు. ఆరు సంవత్సరాల క్రితం ముగిసిన యుద్ధం తాలూకు మాయనిమచ్చలు ప్రతీచోట వాళ్లకు కనిపించాయి. అది చూసి వారెంతో బాధపడ్డారు. ఆ తర్వాత వాళ్లు రైలులో ఓ రాత్రంతా ప్రయాణించి బ్రాంచి కార్యాలయం ఉన్న వెస్‌బాడెన్‌ పట్టణానికి వచ్చారు.

పైన: రాజ్య పరిచర్య పాఠశాలను నిర్వహిస్తున్న రేమన్‌

బుధవారం తెల్లవారుజామున, వాళ్లు హాన్స్‌ అనే సహోదరుడిని కలిశారు. ఆయనే వాళ్లకు పరిచయమైన మొదటి జర్మన్‌ సాక్షి. ఆ సహోదరుడు వాళ్లను వాహనంలో రైల్వేస్టేషన్‌ నుండి బెతెల్‌కు తీసుకువచ్చి, ఇంగ్లీషు అస్సలు మాట్లాడని ఓ వృద్ధ సహోదరి దగ్గర వదిలిపెట్టాడు. తన స్వరాన్ని పెంచి మాట్లాడితే వాళ్లకు అర్థమౌతుందనుకుంది కాబోలు ఆ సహోదరి గట్టిగట్టిగా మాట్లాడింది. అలా మాట్లాడి మాట్లాడి ఆ సహోదరికి విసుగువచ్చింది, ఒక్క ముక్క అర్థంకాక వాళ్లకూ విసుగువచ్చింది. చివరకు, బ్రాంచి సేవకుడైన సహోదరుడు ఏరిక్‌ ఫ్రాస్ట్‌ వచ్చి వాళ్లను ఇంగ్లీషులో పలకరించడంతో వాళ్లు ఊపిరి పీల్చుకున్నారు.

ఆగస్టు నెల చివర్లో, ఫ్రాంక్‌ఫర్ట్‌ ఎమ్‌ మెయిన్‌ దగ్గర జరిగిన “స్వచ్ఛమైన ఆరాధన” అనే సమావేశానికి ఆ నలుగురు హాజరయ్యారు. అదే వాళ్ల మొదటి జర్మన్‌ సమావేశం. ఆ సమావేశానికి 47,432 మంది హాజరయ్యారు. అక్కడ 2,373 మంది బాప్తిస్మం తీసుకోవడం చూసి మిషనరీ సేవ చేయాలన్న వాళ్ల ఉత్సాహం, ప్రకటించాలనే వాళ్ల కోరిక రెట్టింపు అయ్యాయి. కానీ ఆ సమావేశం జరిగిన కొద్ది రోజులకే, వాళ్లను బెతెల్‌ సేవకు నియమిస్తున్నట్లు సహోదరుడు నేథన్‌ నార్‌ వాళ్లకు తెలియజేశాడు.

కుడి: వెస్‌బాడెన్‌లోని బెతెల్‌లో అడ్రస్సోగ్రాఫ్‌ మీద పనిచేస్తున్న రిచర్డ్‌

మిషనరీ సేవ చేయాలనే బలమైన కోరిక ఉన్నందువల్లే అమెరికాలోని బెతెల్‌లో సేవచేసే అవకాశాన్ని రేమన్‌ ఒకప్పుడు వదులుకున్నాడు. బిల్‌, రిచర్డ్‌లు కూడా బెతెల్‌ సేవ గురించి ఏనాడూ ఆలోచించలేదు. కానీ, ఆ తర్వాత బెతెల్‌ సేవలో తాము పొందిన సంతోషాల కారణంగా, తమకు ఏది మంచిదో యెహోవాకే బాగా తెలుసనే నమ్మకం వాళ్లలో కుదిరింది. సొంత కోరికల ప్రకారం నడుచుకునే బదులు యెహోవా మార్గనిర్దేశాన్ని అనుసరించడం ఎంత తెలివైన పనో కదా. ఈ విషయం గ్రహించిన వాళ్లు ఎక్కడైనా, ఏ నియామకంలోనైనా యెహోవాను సంతోషంగా సేవిస్తారు.

“ఫెర్‌బోటన్‌!”

ఆ నలుగురు అమెరికన్ల రాకతో చాలామంది జర్మనీ బెతెల్‌ సభ్యులు వాళ్ల నుండి ఇంగ్లీషు మాట్లాడడం నేర్చుకోవచ్చని సంతోషించారు. కానీ, ఉన్నట్టుండి ఓ రోజున డైనింగ్‌ రూమ్‌లో వాళ్ల అంచనాలు తారుమారయ్యాయి. ఎప్పుడూ ఉత్సాహంగా మాట్లాడే సహోదరుడు ఫ్రాస్ట్‌ తనదైన శైలిలో ఏదో గంభీరమైన విషయం గురించి జర్మన్‌ భాషలో చెప్పడం ఆరంభించాడు. ఆయన మాట్లాడినంతసేపు బెతెల్‌ కుటుంబంలోని చాలామంది సభ్యులు తలవంచుకొని మౌనంగా ఉండిపోయారు. కొత్తగా వచ్చిన వీళ్లకి ఆ సహోదరుని మాటలు అర్థంకాకపోయినా ఆయన తమ గురించే మాట్లాడుతున్నాడని కాసేపటికి గ్రహించారు. “ఫెర్‌బోటన్‌!” (“నిషేధించబడింది!”) అని సహోదరుడు ఫ్రాస్ట్‌ పలుమార్లు గట్టిగా అన్నప్పుడు వాళ్లు కొంచెం ఇబ్బందిపడ్డారు. ఆయన అలా గట్టిగా మాట్లాడేంత తప్పు వీళ్లు ఏం చేశారు?

పైన: సహోదరుడు నార్‌ (ఎడమ) సందర్శనంలో సహోదరుడు ఫ్రాస్ట్‌ (కుడి), మరితరులు

భోజనం చేశాక, అందరు తమతమ గదులకు హడావిడిగా వెళ్లిపోయారు. తర్వాత ఓ సహోదరుడు ఆ విషయం గురించి ఇలా వివరించాడు: ‘మీరు మాకు సహాయం చేయాలంటే తప్పనిసరిగా మీకు జర్మన్‌ భాష రావాలి. అందుకే మీరు ఆ భాష నేర్చుకునేంతవరకు మీతో ఇంగ్లీషులో మాట్లాడడం “నిషేధించబడింది!” అని సహోదరుడు ఫ్రాస్ట్‌ అన్నాడు.’

సహోదరుడు ఫ్రాస్ట్‌ చెప్పిన మాటలను బెతెల్‌ కుటుంబ సభ్యులు వెంటనే పాటించారు. దానివల్ల, కొత్తగా వచ్చిన ఆ నలుగురు జర్మన్‌ భాష నేర్చుకోగలిగారు. అంతేకాదు, ప్రేమగల ఓ సహోదరుడు ఇచ్చిన ఉపదేశాన్ని పాటించడం మొదట్లో కొంచెం కష్టమనిపించినా, అది తరచూ మంచి ఫలితాల్నే ఇస్తుందని వాళ్లు తెలుసుకోగలిగారు. సహోదరుడు ఫ్రాస్ట్‌ ఇచ్చిన ఉపదేశం యెహోవా సంస్థ శ్రేయస్సు మీద ఆయనకున్న శ్రద్ధకు, సహోదరుల మీద ఆయనకున్న ప్రేమకు అద్దం పట్టింది. a అందుకే, ఆ నలుగురు ఆయనపై అభిమానం పెంచుకున్నారు.

స్నేహితుల నుండి నేర్చుకోవడం

కుడివైపున: 1952లో విహారయాత్ర కోసం స్విట్జర్లాండ్‌ వెళ్లినప్పుడు

దైవభయం గల స్నేహితులనుండి మనం విలువైన పాఠాలు నేర్చుకోవచ్చు. యెహోవాకు మరింత సన్నిహితం అయ్యేందుకు అవి మనకు సహాయం చేస్తాయి. నమ్మకమైన జర్మన్‌ సహోదరసహోదరీల నుండే కాక, ఆ నలుగురు ఒకరి నుండి ఒకరు ఎంతో నేర్చుకున్నారు. రిచర్డ్‌ ఇలా వివరించాడు: “లోవల్‌ తనకున్న కాస్త జర్మన్‌ భాష పరిజ్ఞానంతో చక్కగా మాట్లాడగలిగేవాడు. కానీ మేము ముగ్గురం మాత్రం నానా తంటాలు పడేవాళ్లం. లోవల్‌ మా అందరిలో పెద్దవాడు కాబట్టి భాషకు సంబంధించి, మరితర విషయాలకు సంబంధించి ఆయన దగ్గరే సలహాలు తీసుకునేవాళ్లం.” రేమన్‌ ఇలా గుర్తుచేసుకున్నాడు: “జర్మనీకి వచ్చి ఓ ఏడాది గడిచిన తర్వాత, మా మొదటి విహారయాత్ర కోసం స్విట్జర్లాండ్‌కు వెళ్లినప్పుడు మేము ఉండడానికి ఓ సహోదరుడు తన కుటీరాన్ని మాకు ఇవ్వడంతో మా ఆనందానికి అవధుల్లేవు. రెండు వారాల పాటు జర్మన్‌ భాషతో కుస్తీ పట్టాల్సిన పనిలేదని అనుకున్నాను కానీ, లోవల్‌ సంగతి మర్చిపోయాను. ప్రతీరోజు ఉదయాన్నే దినవచనాన్ని జర్మన్‌ భాషలో చదివి చర్చించాలని లోవల్‌ పట్టుబట్టాడు. అప్పుడు ఆయనకు ఎదురుచెప్పలేని పరిస్థితి నాది. అయితే, దానివల్ల మేము ఓ విలువైన పాఠం నేర్చుకున్నాం. అదేమిటంటే కొన్నిసార్లు మనకు నచ్చకపోయినా, మన శ్రేయస్సు కోరేవాళ్లు చెప్పేది మనం పాటించాలి. గడిచిన సంవత్సరాలన్నిటిలో ఆ వైఖరి వల్ల మాకు చాలా ప్రయోజనాలు చేకూరాయి, అంతేకాక దైవిక నిర్దేశాలను పాటించడం సులభమైంది.”

ఫిలిప్పీయులు 2:3 చెబుతున్నట్లుగా “వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తనకంటె యోగ్యుడని యెంచుచు,” ఆ నలుగురు స్నేహితులు ఒకరి బలాబలాలను మరొకరు గుర్తించడం నేర్చుకున్నారు. తమ కన్నా బిల్‌ మెరుగ్గా పనులను చేయగలడని మిగతా ముగ్గురి అభిప్రాయం. అందుకే ముగ్గురి సమ్మతితో, బిల్‌కు తరచూ పనులను అప్పజెప్పడం ద్వారా ఆయనకు గౌరవాన్ని ఇచ్చేవాళ్లు. లోవల్‌ ఇలా గుర్తుచేసుకున్నాడు: “సవాలుతో కూడుకున్న పరిస్థితుల్ని చక్కదిద్దడానికి మేము బిల్‌ సహాయాన్నే తీసుకునేవాళ్లం. ఎందుకంటే అలాంటి పరిస్థితుల్ని మాకందరికీ నచ్చే విధంగా చక్కదిద్దడంలో బిల్‌ దిట్ట. మాకు ధైర్యం చాలకనో, సామర్థ్యం లేకనో ఏమో గానీ మేము బిల్‌లాగా నేర్పుగా చేయలేకపోయేవాళ్లం.”

సంతోషకరమైన వివాహబంధాలు

పెళ్లి చేసుకోవాలని ఆ నలుగురు ఒకరి తర్వాత ఒకరు నిర్ణయించుకున్నారు. యెహోవా పట్ల, పరిచర్య పట్ల ఉన్న ప్రేమే వారి స్నేహానికి పునాది. అందుకే, యెహోవా సేవకు మొదటిస్థానం ఇచ్చేవాళ్ల కోసం వెదకడం మొదలుపెట్టారు. తీసుకోవడంలో కన్నా ఇవ్వడంలోనే ఎక్కువ ఆనందం ఉందని, సొంత కోరికలను పక్కన పెట్టి రాజ్యానికి మొదటిస్థానం ఇవ్వాలని పూర్తికాల సేవ వాళ్లకు నేర్పించింది. కాబట్టి, ఇష్టపూర్వకంగా పూర్తికాల సేవ చేపట్టిన సహోదరీలను వాళ్లు ఎంపిక చేసుకున్నారు. దానివల్ల నాలుగు దృఢమైన, సంతోషకరమైన వివాహబంధాలు ఏర్పడ్డాయి.

స్నేహబంధం గానీ, వివాహబంధం గానీ కలకాలం నిలవాలంటే, ఆ బంధంలో యెహోవాకు స్థానం ఉండాలి. (ప్రసం. 4:12) ఆ తర్వాత బిల్‌, రేమన్‌లు తమ భార్యలను కోల్పోయినా, వాళ్లు తమ నమ్మకమైన భార్యల సహచర్యం ద్వారా ఎంతో ఆనందాన్ని, మద్దతును ఆస్వాదించారు. లోవల్‌, రిచర్డ్‌లు తమ భార్యల మద్దతును ఇంకా ఆస్వాదిస్తున్నారు. బిల్‌ మళ్లీ పెళ్లిచేసుకున్నా, పూర్తికాల సేవలో నిలిచి ఉండేలా ఒక పూర్తికాల సేవకురాలినే చేసుకున్నాడు.

తర్వాతి సంవత్సరాల్లో, వాళ్లకు దొరికిన సేవా నియామకాల కారణంగా వాళ్లు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లిపోయారు. ముఖ్యంగా జర్మనీ, ఆస్ట్రియా, లక్సెంబర్గ్‌, కెనడా, అమెరికా దేశాల్లో వాళ్లు సేవచేశారు. అలా వేర్వేరు ప్రాంతాలకు వెళ్లిపోవడం వల్ల, ఆ నలుగురు స్నేహితులు కలిసి అంతకుముందులా తమకు నచ్చినంత సమయం గడిపే వీలు లేకుండా పోయింది. ఒకరి నుండి ఒకరు ఎంతో దూరంగా ఉన్నా, వాళ్లు సంప్రదింపులు జరుపుకున్నారు, తమకు ఆశీర్వాదాలు దొరికినప్పుడు సంతోషించారు, దుఃఖకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఏడ్చారు. (రోమా. 12:15, 16) అలాంటి స్నేహితుల్ని నిర్లక్ష్యం చేయకుండా అమూల్యంగా ఎంచాలి. నిజానికి, అలాంటివాళ్లు యెహోవా ఇచ్చే బహుమానాలు. (సామె. 17:17) ప్రస్తుత ప్రపంచంలో నిజమైన స్నేహితుల్ని కలిగివుండడం చాలా అరుదు! కానీ, ప్రతీ నిజ క్రైస్తవునికి అలాంటి స్నేహితులు ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. యెహోవాసాక్షులముగా మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తోటి విశ్వాసులతో స్నేహం చేస్తాం. అంతకన్నా ముఖ్యంగా యెహోవాతో, యేసుక్రీస్తుతో స్నేహం చేస్తాం.

ఇప్పుడు మనకు ఎదురయ్యేలాంటి కష్టాలే ఆ నలుగురికి ఎదురయ్యాయి. జీవిత భాగస్వామిని పోగొట్టుకోవడం, తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడడం, వృద్ధులౌతున్న తల్లిదండ్రుల్ని చూసుకోవాలనే చింత, పూర్తికాల సేవలో ఉంటూ పిల్లల్ని పెంచడంలోని సవాళ్లు, దేవుని సంస్థలో కొత్త నియామకాల్ని చేపట్టేటప్పుడు వచ్చే ఆందోళన వంటివాటితో వాళ్లు పోరాడారు. ప్రస్తుతం వృద్ధాప్య సమస్యలతో కూడా వాళ్లు పోరాడుతున్నారు. కానీ జీవితంలో వచ్చే ప్రతీ సవాలు ఎదుర్కోవడానికి దగ్గరున్న స్నేహితులు, అలాగే దూరంలో ఉన్న స్నేహితులు యెహోవాను ప్రేమించేవాళ్లకు సహాయం చేస్తారని వాళ్లు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు.

నిత్యం కొనసాగే స్నేహం

లోవల్‌ 18 ఏళ్ల వయసులో, రేమన్‌ 12 ఏళ్ల వయసులో, బిల్‌ 11 ఏళ్ల వయసులో, రిచర్డ్‌ 10 ఏళ్ల వయసులో యెహోవాకు సమర్పించుకున్నారు. 17 నుండి 21 ఏళ్ల మధ్య ప్రాయంలో వాళ్లందరూ పూర్తికాల సేవ చేపట్టారు. “నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము” అని ప్రసంగి 12:2 ప్రోత్సహిస్తున్నట్లుగా వాళ్లు నడుచుకున్నారు.

మీరు యౌవన సహోదరులైతే, పూర్తికాల సేవ చేపట్టమని యెహోవా మీకు ఇస్తున్న ఆహ్వానాన్ని వీలైతే స్వీకరించండి. అలా చేస్తే యెహోవా కృప వల్ల ఆ నలుగురు స్నేహితులు చవిచూసిన ఆనందాలను మీరు కూడా పొందవచ్చు. వాళ్లు ప్రాంతీయ, జిల్లా, జోన్‌ పర్యవేక్షకులుగా సేవచేశారు; బెతెల్‌లో సేవచేశారు; బ్రాంచి కమిటీ సభ్యులుగా పనిచేశారు; రాజ్య పరిచర్య పాఠశాల, పయినీరు పాఠశాలలకు ఉపదేశకులుగా పనిచేశారు; చిన్నా పెద్దా సమావేశాల్లో ప్రసంగాలు ఇచ్చారు. తమ సేవ వల్ల వేలాదిమంది ప్రయోజనం పొందారని తెలుసుకుని వాళ్లు ఎంతో సంతోషించారు. తనను మనస్ఫూర్తిగా సేవించమని యెహోవా ప్రేమతో ఇచ్చిన ఆహ్వానాన్ని యువకులుగా ఉన్నప్పుడే ఆ నలుగురు అంగీకరించారు కాబట్టే అదంతా సాధ్యమైంది.​—కొలొ. 3:23.

ఎడమ నుండి కుడికి: 1984లో సెల్టర్స్‌లోని కొత్త బ్రాంచి భవనాల ప్రతిష్ఠాపన సమయంలో కలుసుకున్న రిచర్డ్‌, బిల్‌, లోవల్‌, రేమన్‌

ఇప్పుడు లోవల్‌, రిచర్డ్‌, రేమన్‌లు జర్మనీలోని సెల్టర్స్‌లో ఉన్న బ్రాంచి కార్యాలయంలో మళ్లీ కలిసి సేవచేస్తున్నారు. విచారకరమైన విషయం ఏమిటంటే, అమెరికాలో ప్రత్యేక పయినీరుగా సేవచేస్తున్న బిల్‌ 2010లో చనిపోయాడు. దాదాపు 60 ఏళ్లుగా కొనసాగిన వాళ్ల ప్రత్యేకమైన స్నేహానికి బిల్‌ మరణంతో అంతరాయం కలిగింది. కానీ, మన దేవుడైన యెహోవా తన స్నేహితులను ఎన్నడూ మరువడు. మరణం వల్ల విడిపోయిన క్రైస్తవ స్నేహితులు దేవుని రాజ్యంలో మళ్లీ కలుసుకుంటారనే నమ్మకాన్ని మనం కలిగివుండవచ్చు.

“ఈ 60 ఏళ్ల స్నేహంలో, మనసును నొప్పించిన సందర్భాలు మన మధ్య తలెత్తినట్లు నాకు గుర్తులేదు”

చనిపోవడానికి కొంతకాలం ముందు బిల్‌ ఇలా రాశాడు: “ఈ 60 ఏళ్ల స్నేహంలో మనసును నొప్పించిన సందర్భాలు మన మధ్య తలెత్తినట్లు నాకు గుర్తులేదు. మన స్నేహం చాలా ప్రత్యేకమైనదని నాకు ఎప్పుడూ అనిపించేది.” దానికి ఆ ముగ్గురు స్నేహితులు రాబోయే నూతన లోకంలో తమ స్నేహం కొనసాగుతుందనే నమ్మకంతో ఈ మాటలు జోడించారు: “మన స్నేహానికి ఇది ఆరంభం మాత్రమే.”

a సహోదరుడు ఫ్రాస్ట్‌ ఉత్తేజకరమైన జీవిత కథను కావలికోట (ఆంగ్లం) ఏప్రిల్‌ 15, 1961 సంచికలోని 244-249 పేజీల్లో చూడవచ్చు.