అవునంటే అవును అన్నట్లుగా జీవించండి
“మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని యుండవలెను.”—మత్త. 5:37.
1. ఒట్టేయడం గురించి యేసు ఏమి చెప్పాడు? ఎందుకు?
నిజక్రైస్తవులు సాధారణంగా ఒట్టు వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్లు ‘మీ మాట అవునంటే అవునని ఉండవలెను’ అని యేసు చెప్పిన మాటకు లోబడతారు. ఒక వ్యక్తి తను ఇచ్చిన మాట మీద నిలబడాలనే ఉద్దేశంతో యేసు అలా అన్నాడు. యేసు ఆ మాటలు చెప్పడానికి ముందు, “ఎంతమాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు” అని ఆజ్ఞాపించాడు. ఫలాని పని చేయాలనే ఉద్దేశం ఏ మాత్రం లేకపోయినా అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ ఒట్టేసే ప్రజల అలవాటును ఖండిస్తూ యేసు ఆ ఆజ్ఞ ఇచ్చాడు. అలాంటి ప్రజలు తమ ఉద్దేశాన్ని అవును/కాదు అని మామూలుగా చెప్పకుండా వాటికి ‘మించి’ చెప్పడం ద్వారా తాము ఏమాత్రం నమ్మకస్థులం కామని చూపించుకుంటారు, ఆ విధంగా వాళ్లు “దుష్టుని” ప్రభావం కింద ఉంటారు.—మత్తయి 5:33-37 చదవండి.
2. కొన్ని పరిస్థితుల్లో ఒట్టు వేయడం తప్పు కాదని ఎందుకు చెప్పవచ్చు?
2 కొన్ని పరిస్థితుల్లో ఒట్టు వేయడం తప్పా? కాదు. మనం ముందటి ఆర్టికల్‌లో చూసినట్లుగా యెహోవా దేవుడు, ఆయన యథార్థ సేవకుడైన అబ్రాహాము కొన్ని ప్రాముఖ్యమైన సందర్భాల్లో ప్రమాణాలు చేశారు. అలాగే కొన్ని వివాదాలు పరిష్కరించుకోవడానికి ప్రమాణం చేయాలని దేవుని ధర్మశాస్త్రం నిర్దేశించింది. (నిర్గ. 22:10, 11; సంఖ్యా. 5:21, 22) కాబట్టి కోర్టులో సాక్ష్యం చెబుతున్నప్పుడు మనం చెప్పేది సత్యమేనని కొన్నిసార్లు ప్రమాణం చేయాల్సిరావచ్చు. మరికొన్ని అరుదైన సందర్భాల్లో ఒక క్రైస్తవుడు తన ఉద్దేశాల గురించి ఇతరులకు భరోసా ఇచ్చేందుకు లేదా ఫలానా సమస్య పరిష్కారానికి తోడ్పడేందుకు ఒట్టేయాల్సిరావచ్చు. ఒట్టేయమని యూదుల న్యాయసభలో ప్రధాన యాజకుడు యేసును అడిగినప్పుడు ఆయన ఆ ఒట్టును తిరస్కరించకుండా సత్యవంతంగా ప్రతిస్పందించాడు. (మత్త. 26:63, 64) నిజానికి, ఎవ్వరికీ ఒట్టు వేయాల్సిన అవసరం యేసుకు లేకపోయినా, తను చెప్పేది నిజమని ఒప్పించడానికి తరచూ ఆయన “నిశ్చయముగా చెప్పుచున్నాను” అనే మాట ఉపయోగించాడు. (యోహా. 1:51; 13:16, 20, 21, 38) ఇప్పుడు మనం అవునంటే అవును అన్నట్లుగా జీవించే విషయంలో యేసు, పౌలు, మరితరులు మనకు ఎలా ఆదర్శంగా ఉన్నారో పరిశీలిద్దాం.
యేసు అత్యుత్తమ మాదిరి
3. యేసు ప్రార్థనలో దేవునికి ఏమని మాటిచ్చాడు? దానికి యెహోవా ఎలా స్పందించాడు?
3 “దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నాను.” (హెబ్రీ. 10:7) ప్రాముఖ్యమైన ఆ మాటలతో యేసు, వాగ్దాన సంతానానికి సంబంధించిన ప్రవచనాలన్నిటినీ నెరవేర్చడానికి తనను తాను దేవునికి సమర్పించుకున్నాడు. సాతాను ఆ సంతానాన్ని ‘మడిమె మీద కొడతాడు’ అనేది కూడా ఆ ప్రవచనాల్లో ఒకటి. (ఆది. 3:15) అంత బరువైన బాధ్యతను మోయడానికి ఏ ఇతర మానవుడూ ముందుకు రాలేదు. యేసు బాప్తిస్మం తీసుకున్నప్పుడు యెహోవా పరలోకం నుండి మాట్లాడి తన కుమారుని మీద తనకున్న సంపూర్ణ నమ్మకాన్ని వ్యక్తం చేశాడు, కానీ ఇచ్చిన మాటను నిలబెట్టుకునేలా ప్రమాణం చేయమని మాత్రం ఆయన యేసును అడగలేదు.—లూకా 3:21, 22.
4. యేసు ఎంతమేరకు ‘అవునంటే అవును అన్నట్లుగా’ జీవించాడు?
4 ‘అవునంటే అవును అన్నట్లుగా’ జీవించడం ద్వారా యేసు ఎల్లప్పుడూ తను ప్రకటించిన దానికి అనుగుణంగా ప్రవర్తించాడు. రాజ్య సువార్త ప్రకటించే పనిని, తాను ఆకర్షించిన వాళ్లను శిష్యులుగా చేసే పనిని దేవుడు యేసుకు అప్పగించాడు, ఎన్ని అవాంతరాలు వచ్చినా యేసు ఆ పనిని ఆపలేదు. (యోహా. 6:44) యేసు ఎంత సత్యవంతుడో బైబిలు చెబుతున్న ఈ సుపరిచితమైన మాటల్లో తెలుస్తోంది: “దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే యున్నవి.” (2 కొరిం. 1:20) నిజంగా తన తండ్రికి ఇచ్చిన మాటకు తగ్గట్లు జీవించిన యేసు మనకు అత్యుత్తమ మాదిరి. యేసును అనుకరించడానికి తీవ్రంగా కృషి చేసిన ఒక వ్యక్తి గురించి మనమిప్పుడు చూద్దాం.
పౌలు—ఇచ్చిన మాటకు కట్టుబడిన వ్యక్తి
5. అపొస్తలుడైన పౌలు మనకు ఎలా ఆదర్శంగా ఉన్నాడు?
5 ‘ప్రభువా, నేనేమి చేయాలి?’ (అపొ. 22:10) మనస్ఫూర్తిగా అన్న ఆ మాటలతో, సౌలు అనబడిన పౌలు మహిమాన్విత ప్రభువైన యేసు ఇచ్చిన నిర్దేశానికి స్పందించాడు. యేసు ఒక దర్శనంలో పౌలుకు కనబడి తన శిష్యులను హింసించడం ఆపమని చెప్పినప్పుడు పౌలు ఆ మాటలు అన్నాడు. ఆ సంఘటన తర్వాత పౌలు గతంలో చేసిన తప్పుల విషయంలో వినయంగా పశ్చాత్తాపపడి, బాప్తిస్మం పొందాడు. యేసు తన గురించి అన్య జనాంగాలకు సాక్ష్యమివ్వమని ఇచ్చిన ప్రత్యేక నియామకాన్ని కూడా పౌలు స్వీకరించాడు. అప్పటినుండి పౌలు యేసును “ప్రభువా” అని పిలుస్తూ, చివరివరకు ఆ పిలుపుకు తగినట్లుగా జీవించడానికి కృషి చేశాడు. (అపొ. 22:6-16; 2 కొరిం. 4:5, 6; 2 తిమో. 4:8) యేసు భూమ్మీద ఉన్నప్పుడు కొంతమంది గురించి ఒకసారి ఇలా అన్నాడు, “నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక—ప్రభువా ప్రభువా, అని నన్ను పిలుచుట ఎందుకు?” అయితే పౌలు మాత్రం ఆ కోవకు చెందినవాడు కాడు. (లూకా 6:46) అవును, తనను ప్రభువుగా అంగీకరించే వాళ్లందరూ అపొస్తలుడైన పౌలులాగే మాటమీద నిలబడాలని యేసు కోరుకుంటాడు.
6, 7. (ఎ) కొరింథు సంఘం విషయంలో పౌలు తన ప్రయాణ ప్రణాళికను ఎందుకు మార్చుకున్నాడు? ఈ విషయంలో పౌలును విమర్శించిన వాళ్ల వాదన పసలేనిదని ఎందుకు చెప్పవచ్చు? (బి) మన మీద నాయకులుగా ఉండడానికి దేవుడు నియమించిన వాళ్లను మనమెలా చూడాలి?
6 పౌలు ఉత్సాహంగా రాజ్య సందేశాన్ని వ్యాప్తిచేస్తూ ఆసియా మైనరు, ఐరోపా ప్రాంతాలన్నిటిలో సంఘాలు స్థాపించాడు, వాటిని బలపర్చడానికి అనేకసార్లు సందర్శించాడు. తాను రాసిన మాటలు నిజమని క్రైస్తవుల్ని నమ్మించడానికి పౌలు కొన్ని సందర్భాల్లో ఒట్టేశాడు. (గల. 1:20) ఇచ్చిన మాటను పౌలు నిలబెట్టుకోలేదని కొరింథులోని కొందరు ఆరోపించినప్పుడు తనను తాను సమర్థించుకుంటూ పౌలు ఇలా రాశాడు: ‘దేవుడు నమ్మదగినవాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు.’ (2 కొరిం. 1:18) పౌలు ఆ మాటల్ని రాసే సమయానికి ఎఫెసు నుండి బయలుదేరి మాసిదోనియ గుండా కొరింథుకు ప్రయాణం చేస్తున్నాడు. నిజానికి, మాసిదోనియకు వెళ్లడానికి ముందే కొరింథుకు రావాలన్నది ఆయన అసలు ఉద్దేశం. (2 కొరిం. 1:15, 16) కానీ ప్రస్తుతం ప్రయాణ పర్యవేక్షకుల విషయంలో జరుగుతున్నట్లే పౌలు విషయంలో కూడా జరిగింది. కొన్నిసార్లు ప్రాంతీయ, జిల్లా పర్యవేక్షకుల ప్రయాణ ప్రణాళికలు మారే అవకాశం ఉంది. ఏవో చిన్నచిన్న కారణాల వల్ల లేదా స్వార్థం వల్ల కాదుగానీ కొన్ని అత్యవసర పరిస్థితుల్లోనే అలాంటి మార్పులు జరుగుతాయి. ఇక పౌలు విషయానికొస్తే ఆయన కొరింథు సంఘ శ్రేయస్సు కోసమే ఆ సంఘ సందర్శనాన్ని వాయిదా వేసుకున్నాడు. అలాగని ఎందుకు చెప్పవచ్చు?
7 పౌలు తన అసలు ప్రయాణ ప్రణాళికలను నిర్ణయించుకున్న కొంతకాలానికి, కొరింథు సంఘంలో గొడవలు జరుగుతున్నాయని, సహోదరులు జారత్వాన్ని చూసీచూడనట్లుగా ఉంటున్నారని పౌలుకు తెలిసింది. (1 కొరిం. 1:11; 5:1) ఆ పరిస్థితిని సరిచేయడానికి పౌలు తాను రాసిన మొదటి పత్రికలో వాళ్లను తీవ్రంగా మందలించాడు. ఆ తర్వాత ఎఫెసు నుండి నేరుగా కొరింథుకు వెళ్లడానికి బదులుగా తన సలహాను అక్కడి సహోదరులు పాటించేలా తగిన సమయం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు, అలా అయితే వాళ్లు తన సందర్శనం నుండి మరింత ప్రోత్సాహం పొందుతారని ఆయన అనుకున్నాడు. తన సందర్శనాన్ని వాయిదా వేయడానికి అసలు కారణం అదేనని వాళ్లకు భరోసా ఇస్తూ పౌలు తన రెండవ పత్రికలో ఇలా రాశాడు: “మీయందు కనికరము కలిగినందున నేను మరల కొరింథునకు రాలేదు. నా ప్రాణముతోడు ఇందుకు దేవునిని సాక్షిగా పెట్టుచున్నాను.” (2 కొరిం. 1:23) అయితే మనం మాత్రం పౌలును విమర్శించిన వాళ్లలా ఎన్నడూ ఉండకూడదు, బదులుగా మన మీద నాయకులుగా ఉండడానికి దేవుడు నియమించిన వాళ్ల పట్ల నిండైన గౌరవం చూపిద్దాం. అంతేగాక, క్రీస్తును అనుకరించిన పౌలు మాదిరిని మనమందరం అనుకరిద్దాం.—1 కొరిం. 11:1; హెబ్రీ. 13:7.
మాటకు కట్టుబడిన మరికొందరు
8. రిబ్కా మనకు ఎలా ఆదర్శంగా ఉంది?
8 ‘నేను వెళ్లెదను.’ (ఆది. 24:58) అబ్రాహాము కుమారుడైన ఇస్సాకును పెళ్లి చేసుకోవడానికి, సొంత ఇంటిని విడిచి పరిచయంలేని వ్యక్తితో కలిసి 800 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించడానికి సిద్ధపడిన రిబ్కా తన తల్లితో, అన్నయ్యతో చెప్పిన మాటలవి. (ఆది. 24:50-58) రిబ్కా ‘అవునంటే అవును అన్నట్లుగా’ జీవించింది. ఇస్సాకుకు నమ్మకమైన, దైవభయంగల భార్యనని నిరూపించుకుంది. జీవితమంతా ఆమె వాగ్దాన దేశంలో పరదేశిలా గుడారాల్లో నివసించింది. రిబ్కా చూపించిన విశ్వాసం కారణంగా వాగ్దాన సంతానమైన యేసుక్రీస్తు పూర్వీకుల్లో ఒకరిగా ఉండే ఆశీర్వాదాన్ని దేవుడు ఆమెకు ఇచ్చాడు.—హెబ్రీ. 11:9, 13.
9. రూతు తన మాటకు ఎలా కట్టుబడింది?
9 “నీ ప్రజలయొద్దకు నీతో కూడ వచ్చెదము.” (రూతు 1:10) తమ అత్తయైన నయోమి మోయాబు నుండి బేత్లెహేముకు వెళ్తున్నప్పుడు మోయాబుకు చెందిన విధవరాళ్లైన ఆమె ఇద్దరు కోడళ్లు రూతు, ఓర్పా చెప్పిన మాటలవి. చివరికి నయోమి బలవంతంతో ఓర్పా తన దేశానికి తిరిగివెళ్లింది. కానీ రూతు మాత్రం పైన చెప్పిన మాటకు కట్టుబడివుంది. (రూతు 1:16, 17 చదవండి.) ఆమె తన కుటుంబాన్ని, మోయాబీయుల అబద్ధమతాన్ని శాశ్వతంగా వదిలేసి నమ్మకంగా నయోమితోనే ఉండిపోయింది. తనను యథార్థంగా ఆరాధించినందుకు యెహోవా ఆమెను ఆశీర్వదించాడు, క్రీస్తు పూర్వీకుల జాబితాలో మత్తయి ప్రస్తావించిన ఐదుగురు స్త్రీలలో ఆమె ఒకరు.—మత్త. 1:1, 3, 5, 6, 16.
10. యెషయా మనకు ఎలా చక్కని మాదిరిగా ఉన్నాడు?
10 “నేనున్నాను నన్ను పంపుము.” (యెష. 6:8) ఈ మాటలు చెప్పడానికి ముందు యెషయా, ఇశ్రాయేలులోని ఆలయానికి పైగా యెహోవా దేవుడు సింహాసనాసీనుడై ఉండడాన్ని ఒక మహిమాన్విత దర్శనంలో చూశాడు. ఆ అద్భుతమైన దృశ్యాన్ని చూస్తుండగా, “నేను ఎవని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవును?” అని యెహోవా అడగడం యెషయా విన్నాడు. దారి తప్పిన ఇశ్రాయేలీయులకు దేవుని సందేశాన్ని ప్రకటించేందుకు యెహోవా ప్రవక్తగా ఉండమనే ఆహ్వానం ఆ మాటల్లో ఉంది. ఆ ఆహ్వానానికి స్పందించి తానిచ్చిన మాటకు యెషయా జీవితాంతం కట్టుబడి ఉన్నాడు. 46 కన్నా ఎక్కువ సంవత్సరాలు ఆయన శక్తివంతమైన తీర్పు సందేశాలను, సత్యారాధన పునఃస్థాపన గురించిన అద్భుత వాగ్దానాలను ప్రకటిస్తూ నమ్మకమైన ప్రవక్తగా సేవ చేశాడు.
11. (ఎ) ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఎందుకు ప్రాముఖ్యం? (బి) మాట తప్పిన ఏ వ్యక్తుల చెడ్డ ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి?
11 పైన చెప్పిన ఉదాహరణలను యెహోవా తన వాక్యంలో ఎందుకు రాయించాడు? మనం అవునంటే అవును అన్నట్లుగా జీవించడం ఎంత ప్రాముఖ్యం? “మాట తప్పువారు మరణమునకు తగినవారు” అని బైబిలు స్పష్టంగా హెచ్చరిస్తోంది. (రోమా. 1:31, 32) ఐగుప్తు రాజైన ఫరో, యూదా రాజైన సిద్కియా, అననీయ, సప్పీరా వంటి వాళ్లు మాట మీద నిలబడని చెడ్డ వ్యక్తులని బైబిలు చూపిస్తోంది. మాట తప్పడం వల్ల వాళ్లు తగిన మూల్యాన్నే చెల్లించారు, వాళ్లు మనకు ఒక హెచ్చరికగా ఉన్నారు.—నిర్గ. 9:27, 28, 34, 35; యెహె. 17:13-15, 19, 20; అపొ. 5:1-10.
12. మాటకు కట్టుబడి ఉండాలంటే మనం ఏమి చేయాలి?
12 ఈ ‘అంత్యదినాల్లో పైకి భక్తిగలవాళ్లలా ఉండి దాని శక్తిని ఆశ్రయించనివాళ్లు,’ మాట తప్పేవాళ్లు మన చుట్టూ ఎక్కువగా ఉన్నారు. (2 తిమో. 3:1-5) అలాంటి వాళ్లకు మనం సాధ్యమైనంత దూరంగా ఉండాలి, ఇచ్చిన మాటకు కట్టుబడివుండడానికి కృషిచేసే వాళ్లతో క్రమంగా సహవసించాలి.—హెబ్రీ. 10:24, 25.
మనం చేసే అత్యంత ప్రాముఖ్యమైన ప్రమాణం
13. యేసుక్రీస్తును అనుసరించేవాళ్లు చేసే అత్యంత ప్రాముఖ్యమైన ప్రమాణం ఏమిటి?
13 దేవునికి చేసుకునే సమర్పణే ఒక వ్యక్తి చేయగల అత్యంత ప్రాముఖ్యమైన ప్రమాణం. తమను తాము ఉపేక్షించుకుని క్రీస్తు శిష్యులు అవ్వాలనుకునే వాళ్లు తమ ఉద్దేశాలను వెల్లడిచేయడానికి“అవును” అని చెప్పే అవకాశం మూడు సందర్భాల్లో దొరుకుతుంది. (మత్త. 16:24) బాప్తిస్మం పొందని ప్రచారకునిగా అవ్వాలని కోరుకునే ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఇద్దరు పెద్దలు ఆయన్ని “మీరు ఒక యెహోవాసాక్షిగా ఉండాలని నిజంగా కోరుకుంటున్నారా?” అని అడుగుతారు. ఆ తర్వాత అదే వ్యక్తి మరింత ఆధ్యాత్మిక పురోగతి సాధించి, బాప్తిస్మం పొందాలనే కోరికను వ్యక్తం చేసినప్పుడు పెద్దలు ఆ వ్యక్తిని “ప్రార్థనలో మిమ్మల్ని మీరు యెహోవాకు సమర్పించుకున్నారా?” అని అడుగుతారు. చివరిగా బాప్తిస్మం పొందే రోజున అభ్యర్థులందరినీ “యేసుక్రీస్తు బలి ఆధారంగా మీరు మీ పాపముల విషయంలో పశ్చాత్తాపపడి, యెహోవా చిత్తం చేయడానికి మిమ్మల్ని మీరు యెహోవాకు సమర్పించుకున్నారా?” అని అడుగుతారు. అలా సాక్షులందరి సమక్షంలో వీళ్లు అవును అని చెప్పి ఎల్లప్పుడూ దేవుని సేవ చేస్తామని బహిరంగంగా ఒప్పుకుంటారు.
14. మనల్ని మనం ఎప్పటికప్పుడు పరిశీలించుకోవడానికి ఎలాంటి ప్రశ్నలు వేసుకోవాలి?
14 మీరు కొత్తగా బాప్తిస్మం తీసుకున్నా లేదా కొన్ని దశాబ్దాలుగా దేవుని సేవ చేస్తున్నా మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఇలాంటి ప్రశ్నలు వేసుకోవాలి: ‘యేసుక్రీస్తు అడుగుజాడల్లో నడుస్తూ, నేను దేవునికి చేసిన అత్యంత ప్రాముఖ్యమైన ప్రమాణాన్ని నిలబెట్టుకుంటున్నానా? ప్రకటనా పనికి, శిష్యులను చేసే పనికి నా జీవితంలో ప్రముఖ స్థానం ఇస్తూ యేసుకు లోబడి జీవిస్తున్నానా?’—2 కొరింథీయులు 13:5 చదవండి.
15. మీరు ప్రాముఖ్యమైన ఏ ఇతర విషయాల్లో మాటకు కట్టుబడి ఉండాలి?
15 మనం యెహోవాకు సమర్పించుకున్నప్పుడు చేసిన ప్రమాణానికి తగ్గట్లుగా జీవించాలంటే మనం ప్రాముఖ్యమైన ఇతర విషయాల్లో కూడా నమ్మకంగా ఉండాలి. ఉదాహరణకు: మీకు పెళ్లి అయిందా? అయితే మీ వివాహ భాగస్వామిని ప్రేమించి, సంరక్షిస్తానని మీరు చేసిన విలువైన ప్రమాణాన్ని ఎల్లప్పుడూ నిలబెట్టుకోండి. మీరు ఒక వ్యాపార ఒప్పందంపై సంతకం చేశారా? లేదా దేవుని సంస్థలో ఒక సేవా నియామకం చేపట్టడానికి దరఖాస్తు నింపారా? అలాగైతే మీరు ఇచ్చిన మాటకు కట్టుబడివుండండి. పేదవాళ్లు ఎవరైనా మిమ్మల్ని భోజనానికి ఆహ్వానిస్తే, వస్తానని వాళ్లకు మాటిచ్చారా? ఆ తర్వాత వేరేవాళ్లు మిమ్మల్ని అంతకంటే గొప్ప విందుకు ఆహ్వానించినా సరే ముందుగా మాటిచ్చిన వాళ్ల దగ్గరకే వెళ్లండి. పునర్దర్శనం చేస్తానని ఇంటింటి పరిచర్యలో కలిసిన వాళ్లకు మాటిచ్చారా? ఆరునూరైనా వెళ్లండి. అప్పుడు యెహోవా మీ పరిచర్యను ఆశీర్వదిస్తాడు.—లూకా 16:10 చదవండి.
మన ప్రధాన యాజకుడూ, రాజూ అయిన క్రీస్తు నుండి ప్రయోజనం పొందండి
16. మనం ఒకవేళ ఇచ్చిన మాట తప్పితే ఏమి చేయాలి?
16 ‘అనేక విషయాల్లో’ ముఖ్యంగా, మాట్లాడే విషయంలో “మనమందరము తప్పిపోవుచున్నాము” అని బైబిలు చెబుతోంది. (యాకో. 3:2) మనం ఒకానొక సందర్భంలో మాట తప్పామని గ్రహించినప్పుడు ఏమి చేయాలి? “దేనినైనను యోచింపక, చేసెదనని” మాట ఇచ్చి దాన్ని నిలబెట్టుకోకుండా పాపం చేసే వాళ్లకోసం ధర్మశాస్త్రంలో యెహోవా కనికరంతో కూడిన ఒక ఏర్పాటు చేశాడు. (లేవీ. 5:4-7, 11) అలాంటి తప్పులు చేసే క్రైస్తవుల కోసం కూడా ఒక ప్రేమపూర్వక ఏర్పాటు ఉంది. మనం చేసిన ఫలానా తప్పును యెహోవా ఎదుట ఒప్పుకుంటే కనికరంతో ఆయన మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ద్వారా దాన్ని క్షమిస్తాడు. (1 యోహా. 2:1, 2) అయితే దేవుని అనుగ్రహాన్ని పొందాలంటే మనం చేసిన తప్పును మళ్లీ చేయకుండా, పశ్చాత్తాపానికి తగిన క్రియలు చేయాలి. మనం అనాలోచితంగా అన్న మాటల వల్ల ఇతరులకు అయిన గాయాన్ని మాన్పడానికి చేయగలిగినదంతా చేయాలి. (సామె. 6:2, 3) అసలు, మనకు వీలుగాని పనులు చేస్తామని మాట ఇచ్చే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించడం చాలా మంచిది.—ప్రసంగి 5:2 చదవండి.
17, 18. అవునంటే అవును అన్నట్లుగా జీవించడానికి ఎల్లప్పుడూ కృషి చేసే వాళ్లకు ఎలాంటి గొప్ప భవిష్యత్తు వేచి ఉంది?
17 అవునంటే అవును అన్నట్లుగా జీవించడానికి ఎల్లప్పుడూ కృషి చేసే యెహోవా ఆరాధకులకు ఎంతో గొప్ప భవిష్యత్తు వేచి ఉంది. 1,44,000 మంది అభిషిక్తులు పరలోకంలో అమర్త్యమైన జీవాన్ని పొంది “క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు.” (ప్రక. 20:6) కోట్లాదిమంది ఇతరులు భూపరదైసు మీద క్రీస్తు రాజ్యం ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు పొందుతారు. ఆ రాజ్యపాలనలో వాళ్లు క్రమక్రమంగా శారీరక, మానసిక పరిపూర్ణతకు చేరుకుంటారు.—ప్రక. 21:3-5.
18 వెయ్యేళ్ల పరిపాలన ముగింపులో వచ్చే చివరి పరీక్షలో నమ్మకస్థులుగా నిరూపించుకున్నాక మనం ఇంకెన్నడూ ఎవ్వరి మాటనూ శంకించాల్సిన అవసరం రాదు. (ప్రక. 20:7-10) వాళ్లలో ప్రతీ ఒక్కరి మాట అవును అంటే అవునుగా, కాదు అంటే కాదుగా ఉంటుంది. అప్పుడు జీవించే వాళ్లంతా ప్రేమగల ‘సత్యదేవుడైన’ యెహోవా తండ్రిని పరిపూర్ణంగా అనుకరిస్తారు.—కీర్త. 31:5.