కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు ఎలాంటి స్ఫూర్తి చూపిస్తారు?

మీరు ఎలాంటి స్ఫూర్తి చూపిస్తారు?

‘ప్రభువైన యేసుక్రీస్తు కృప మీరు చూపించే స్ఫూర్తికి తోడై ఉండునుగాక.’—ఫిలే. 25, NW.

1. తోటి క్రైస్తవులకు రాసిన పత్రికల్లో పౌలు ఏ ఆశను వ్యక్తం చేశాడు?

 అపొస్తలుడైన పౌలు తోటి క్రైస్తవులకు రాసిన పత్రికల్లో, సంఘం చూపించే స్ఫూర్తిని దేవుడు, క్రీస్తు మెచ్చుకోవాలనే ఆశను పదేపదే వ్యక్తం చేశాడు. ఉదాహరణకు, ఆయన గలతీయులకు ఇలా రాశాడు: ‘సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీరు చూపించే స్ఫూర్తికి తోడై ఉండునుగాక, ఆమేన్‌.’ (గల. 6:18, NW) ‘మీరు చూపించే స్ఫూర్తి’ అని అన్నప్పుడు ఆయన ఉద్దేశం ఏమిటి?

2, 3. (ఎ) కొన్నిసార్లు ‘స్ఫూర్తి’ అనే పదాన్ని పౌలు ఏ ఉద్దేశంతో ఉపయోగించాడు? (బి) మనం చూపించే స్ఫూర్తికి సంబంధించి ఏ ప్రశ్నలు వేసుకోవాలి?

2 పౌలు ఆ లేఖనంలో ఉపయోగించిన ‘స్ఫూర్తి’ అనే పదం మన ఆలోచనా విధానాన్ని లేదా వైఖరిని సూచిస్తుంది. దాన్నిబట్టే మన మాటలూ చేతలూ ఉంటాయి. ఉదాహరణకు, కొందరు ఎంతో మృదువుగా, అర్థంచేసుకునేవారిగా, సౌమ్యులుగా, ఉదార స్వభావులుగా, క్షమించేవారిగా ఉండవచ్చు. అలాంటి ‘సాధువైన, మృదువైన’ స్వభావాన్ని, ‘శాంతగుణాన్ని’ కలిగివుండే వాళ్ల గురించి బైబిలు మెప్పుకోలుగా మాట్లాడుతోంది. (1 పేతు. 3:4; సామె. 17:27) మరోవైపున ఇంకొందరికి వెటకారం ఎక్కువుండవచ్చు, డబ్బు పిచ్చి లేదా స్వేచ్ఛా వైఖరి ఉండవచ్చు, ఇట్టే నొచ్చుకునే స్వభావం ఉండవచ్చు. అంతకన్నా ఘోరంగా మరికొందరు అపవిత్రులుగా, అవిధేయులుగా ఉండవచ్చు లేదా వాళ్లకు తిరుగుబాటు ధోరణి ఉండవచ్చు.

3 పైనున్న ముఖ్య వచనంలోని మాటల్ని ఉపయోగించినప్పుడు నిజానికి, యెహోవాకు ఇష్టమైన స్ఫూర్తిని చూపిస్తూ క్రీస్తు వ్యక్తిత్వాన్ని అలవర్చుకోమని పౌలు సంఘంలోని సహోదరులను ప్రోత్సహించాడు. (2 తిమో. 4:22; కొలొస్సయులు 3:9-12 చదవండి.) కాబట్టి మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవాలి: ‘నేను ఎలాంటి స్ఫూర్తి చూపిస్తాను? దేవునికి ఇష్టమైన స్ఫూర్తిని నేను మరింత బాగా ఎలా చూపించవచ్చు? సంఘం చూపించే చక్కని స్ఫూర్తికి తోడ్పడే విధంగా నేను ఇంకొన్ని విషయాల్లో మెరుగవ్వగలనా?’ ఉదాహరణకు, ప్రొద్దుతిరుగుడు పూల (సన్‌ఫ్లవర్స్‌) తోటలో ఉండే ప్రతీ పువ్వు మొత్తం తోటంతా అందంగా కనిపించేలా చేస్తుంది. మరి మనం కూడా ఆ ‘పువ్వుల్లా’ సంఘం చూపించే మంచి స్ఫూర్తికి దోహదపడుతున్నామా? అందుకోసం మనమందరం కృషి చేయాలి. దేవునికి ఇష్టమైన స్ఫూర్తిని చూపించడానికి మనం ఏమి చేయవచ్చో ఇప్పుడు పరిశీలిద్దాం.

లోకం చూపించే స్ఫూర్తికి దూరంగా ఉండండి

4. “లౌకికాత్మ” లేక లోకం చూపించే స్ఫూర్తి అంటే ఏమిటి?

4 “మనము లౌకికాత్మను కాక దేవుని యొద్దనుండి వచ్చు ఆత్మను పొందియున్నాము” అని బైబిలు చెబుతోంది. (1 కొరిం. 2:12) “లౌకికాత్మ” లేక లోకం చూపించే స్ఫూర్తి అంటే ఏమిటి? ఈ స్ఫూర్తి, అలాగే పౌలు ఎఫెసీయులు 2:2లో వివరించిన స్ఫూర్తి ఒక్కటే. ఆ లేఖనంలో ఇలా ఉంది: “మీరు వాటిని చేయుచు, వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, యీ ప్రపంచ ధర్మముచొప్పున మునుపు నడుచుకొంటిరి.” ఈ వచనం ప్రస్తావిస్తున్న ‘వాయువు’ లోకంలోని స్ఫూర్తిని లేదా ఆలోచనా తీరును సూచిస్తోంది. అది వాయువులా ప్రస్తుతం మన చుట్టూ వ్యాపించి ఉంది. ‘నేను ఏమి చేయాలో నాకు ఒకరు చెప్పనక్కర్లేదు’ అనీ, ‘నీ హక్కుల కోసం పోరాడు’ అనీ చెప్పే నేటి ప్రజల వైఖరిలో అది స్పష్టంగా కనిపిస్తోంది. ఆ ప్రజలే సాతాను ప్రపంచంలోని ‘అవిధేయులు.’

5. ఇశ్రాయేలు సమాజంలో కొంతమంది ఏ చెడ్డ స్ఫూర్తి చూపించారు?

5 అలాంటి వైఖరులు కొత్తేమీ కాదు. మోషే కాలంలో ఇశ్రాయేలు సమాజానికి నాయకత్వం వహిస్తున్నవాళ్ల మీద కోరహు తిరుగుబాటు చేశాడు. ముఖ్యంగా యాజకులుగా సేవచేస్తున్న అహరోనును, ఆయన కుమారులను కోరహు నిందించాడు. కోరహు బహుశా వాళ్ల అపరిపూర్ణతల మీదే దృష్టి నిలిపి ఉంటాడు. లేదా మోషే తన సొంతవాళ్లకే సేవావకాశాల్ని కల్పిస్తున్నాడని కోరహు వాదించి ఉంటాడు. కారణం ఏదైనా, కోరహు తన ముందు జరుగుతున్న వాటిని మానవ దృక్కోణం నుండి చూడడం మొదలుపెట్టి యెహోవా నియమించిన వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడాడు. “మీతో మాకిక పనిలేదు . . . సంఘము మీద మిమ్మును మీరేల హెచ్చించుకొనుచున్నారు?” అని ఏమాత్రం గౌరవం లేకుండా మాట్లాడాడు. (సంఖ్యా. 16:3) ఆయనలాగే దాతాను, అబీరాము కూడా మోషే తమపై ‘ప్రభుత్వం చేస్తున్నాడు’ అంటూ ఆరోపించారు. మోషే పిలిచినప్పుడు, “మేము రాము” అని వాళ్లు తలబిరుసుగా అన్నారు. (సంఖ్యా. 16:12-14) వాళ్లు చూపించిన స్ఫూర్తి యెహోవాకు అస్సలు నచ్చలేదు. దాంతో ఆయన తిరుగుబాటు చేసినవాళ్లందరినీ శిక్షించాడు.—సంఖ్యా. 16:28-35.

6. మొదటి శతాబ్దంలో కొందరు తమకు చెడ్డ వైఖరి ఉందని ఎలా చూపించారు? ఎందుకు వాళ్లు అలాంటి వైఖరి చూపించి ఉంటారు?

6 మొదటి శతాబ్దంలో కూడా కొంతమంది “ప్రభుత్వమును నిరాకరించుచు” సంఘంలో నాయకత్వం వహిస్తున్న వాళ్లను విమర్శించారు. (యూదా 8) బహుశా వాళ్లు తమకున్న సేవావకాశాలతో తృప్తి చెందకుండా, దేవుడు ఇచ్చిన బాధ్యతల్ని చిత్తశుద్ధితో నిర్వహిస్తున్న పెద్దలకు వ్యతిరేకంగా మాట్లాడేలా ఇతరులను ఉసిగొల్పడానికి ప్రయత్నించివుంటారు.—3 యోహాను 9, 10 చదవండి.

7. మనం ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి?

7 అలాంటి స్ఫూర్తికి క్రైస్తవ సంఘంలో ఏమాత్రం చోటు లేదు. అందుకే మనం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మోషే కాలంలో, అపొస్తలుడైన యోహాను కాలంలో నాయకత్వం వహించిన వాళ్లలాగే ఇప్పటి సంఘాల్లోని పెద్దలు కూడా అపరిపూర్ణులే. కొన్నిసార్లు సంఘ పెద్దలు చేసే పొరపాట్ల వల్ల మనం నొచ్చుకునే అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో సంఘంలోని వాళ్లు లోకంలోని స్ఫూర్తికి అనుగుణంగా ప్రవర్తించడం సమంజసం కాదు. అలా ప్రవర్తించేవాళ్లు, తమకు “న్యాయం” జరగాలని లేదా “ఆ సహోదరుడు సంఘపెద్దగా ఉండేందుకు అర్హుడు కాడు!” అని కోపోద్రేకాన్ని వ్యక్తం చేస్తారు. కొన్నిసార్లు యెహోవా చిన్నచిన్న పొరపాట్లను పట్టించుకోకపోవచ్చు. మనం కూడా యెహోవాకున్న వైఖరి చూపిస్తే బాగుంటుంది కదా. గంభీరమైన తప్పులు చేసిన కొంతమంది, సంఘ పెద్దల్లో లోపాలున్నాయని భావించి, ఆధ్యాత్మిక సహాయం అందించడానికి ఏర్పాటైన పెద్దల కమిటీ ముందు హాజరుకావడానికి నిరాకరించారు. అలాంటివాళ్లు తమకు నచ్చని కొన్ని లక్షణాలు డాక్టరుకు ఉన్నాయనే ఉద్దేశంతో ఆయనిచ్చే చికిత్సను తిరస్కరించిన రోగులతో సమానం.

8. సంఘంలో నాయకత్వం వహిస్తున్న వాళ్ల పట్ల సరైన వైఖరి కలిగి ఉండడానికి ఏ లేఖనాలు మనకు సహాయం చేస్తాయి?

8 యేసు తన “కుడిచేత ఏడు నక్షత్రములు పట్టుకొని” ఉన్నాడనే విషయాన్ని మనం గుర్తుంచుకుంటే అలాంటి స్ఫూర్తికి దూరంగా ఉండగలుగుతాం. ఆ “నక్షత్రములు” అభిషిక్త పెద్దలను, అలాగే నేటి సంఘాల్లో ఉన్న పెద్దలందరినీ సూచిస్తున్నాయి. తన చేతుల్లో ఉన్న ఆ ‘నక్షత్రాలను’ తనకు నచ్చిన విధంగా యేసు నిర్దేశించగలడు. (ప్రక. 1:16, 19, 20) సంఘ శిరస్సైన యేసుకు పెద్దల సభలన్నిటి మీద పూర్తి అధికారం ఉంది. కాబట్టి పెద్దల సభలో ఎవర్నైనా ఒకరిని నిజంగా సరిదిద్దాల్సి వస్తే, ‘అగ్ని జ్వాలల్లాంటి కళ్లున్న’ ఆయన తాను అనుకున్న సమయంలో తనదైన పద్ధతిలో సరిదిద్దుతాడు. (ప్రక. 1:14) ఈలోగా మనం పరిశుద్ధాత్మ చేత నియమించబడిన వాళ్లపట్ల సరైన గౌరవాన్ని కలిగి ఉండేటట్లు చూసుకుందాం. ఎందుకంటే, పౌలు ఇలా రాశాడు: “మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసినవారివలె మీ ఆత్మలను కాయుచున్నారు; వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్‌ప్రయోజనము గనుక దుఃఖముతో కాక, ఆనందముతో చేయునట్లు వారి మాట విని, వారికి లోబడియుండుడి.”—హెబ్రీ. 13:17.

యేసు పాత్ర గురించి ధ్యానిస్తే మనం పెద్దలు ఇచ్చే ఉపదేశాలను ఎలా ఎంచుతాం?

9. (ఎ) పెద్దలు సరిదిద్దినప్పుడు లేదా హెచ్చరించినప్పుడు ఒక క్రైస్తవునికి ఏ పరీక్ష ఎదురుకావచ్చు? (బి) పెద్దలు సరిదిద్దినప్పుడు ఎలా స్పందించడం ఉత్తమం?

9 ఒక క్రైస్తవుణ్ణి సంఘ పెద్దలు సరిదిద్దినప్పుడు లేదా ఆయన సంఘంలో ప్రత్యేకమైన బాధ్యతలు కోల్పోయినప్పుడు ఆయన స్ఫూర్తికి పరీక్ష ఎదురౌతుంది. హింసతో నిండిన వీడియో గేములు ఆడడం గురించి ఒక యౌవన సహోదరుణ్ణి సంఘ పెద్దలు నేర్పుగా హెచ్చరించారు. విచారకరంగా, ఆయన ఆ హెచ్చరికను పెడచెవినబెట్టాడు. కొంతకాలానికి ఆయన లేఖనాలు పేర్కొంటున్న అర్హతలను కోల్పోయాడు కాబట్టి ఆయనను పరిచర్య సేవకునిగా తీసేశారు. (కీర్త. 11:5; 1 తిమో. 3:8-10) దాంతో, పెద్దలు తన విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నారని ఆయన ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. అంతేకాక సంఘ పెద్దల్ని విమర్శిస్తూ బ్రాంచి కార్యాలయానికి అదేపనిగా ఉత్తరాలు రాశాడు, అలా చేయమని ఇతరులను కూడా ఉసిగొల్పాడు. అయితే, మన పనుల్ని సమర్థించుకునేందుకు సంఘ సమాధానానికి భంగం కలిగిస్తే ఏ మాత్రం ప్రయోజనం ఉండదు. పెద్దలు ఇచ్చిన దిద్దుబాటు వల్లే, మనకు తెలియని బలహీనతల్ని మనం గుర్తించగలిగామని గ్రహించి దాన్ని స్వీకరించడం ఎంత మంచిదో కదా!—విలాపవాక్యములు 3:28, 29 చదవండి.

10. (ఎ) మంచి స్ఫూర్తి గురించి, చెడ్డ స్ఫూర్తి గురించి మనం యాకోబు 3:16-18 నుండి ఏమి నేర్చుకోవచ్చో వివరించండి. (బి) ‘పైనుండి వచ్చే జ్ఞానాన్ని’ చూపిస్తే ఏ ఫలితం వస్తుంది?

10 సంఘంలో మంచి స్ఫూర్తిని లేదా చెడ్డ స్ఫూర్తిని చూపించేందుకు ఏవి దోహదపడతాయో యాకోబు 3:16-18 వచనాలు చక్కగా వివరిస్తున్నాయి. ఆ వచనాలు ఇలా చెబుతున్నాయి: “మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచకార్యమును ఉండును. అయితే పైనుండివచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణయైనను లేనిదియునై యున్నది. నీతిఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును.” మనం ‘పైనుండి వచ్చే జ్ఞానానికి’ తగినట్లు ప్రవర్తిస్తే, మంచి లక్షణాలను చూపిస్తూ సహోదరుల మధ్య మంచి స్ఫూర్తి నెలకొనేందుకు తోడ్పడతాం.

సంఘంలో గౌరవపూర్వకమైన స్ఫూర్తిని చూపించండి

11. (ఎ) మనకు సరైన స్ఫూర్తి ఉంటే దేనికి దూరంగా ఉంటాం? (బి) దావీదు ఉదాహరణ నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

11 ‘దేవుని సంఘాన్ని’ కాసే పనిని యెహోవా పెద్దలకు అప్పగించాడని మనం మనసులో ఉంచుకోవాలి. (అపొ. 20:28; 1 పేతు. 5:2) అందుకే, మనం పెద్దలమైనా కాకపోయినా దేవుని ఏర్పాటును గౌరవించడమే జ్ఞానయుక్తమని గుర్తిస్తాం. మనకు సరైన స్ఫూర్తి ఉంటే మన స్థానం గురించి అనవసరంగా చింతించం. దావీదు వల్ల తన రాజరికానికి ముప్పు ఉందని అపోహపడిన సౌలు “దావీదు మీద విషపు చూపు నిలిపెను.” (1 సమూ. 18:9) సౌలులో చెడ్డ వైఖరి పెరిగింది, చివరకు దావీదును చంపాలని కూడా అనుకున్నాడు. సౌలులా స్థానం కోసం ప్రాకులాడే బదులు దావీదులాంటి వైఖరి చూపించడం ఎంత మంచిదో కదా! యౌవనుడైన దావీదు ఎంతో అన్యాయాన్ని ఎదుర్కొన్నా, దేవుడు నియమించిన అధికారం పట్ల గౌరవాన్ని చూపిస్తూ వచ్చాడు.—1 సమూయేలు 26:23 చదవండి.

12. సంఘ సమాధానానికి ఏది దోహదపడుతుంది?

12 ఒక విషయంపై భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు మనకు చిరాకు కలగవచ్చు. సంఘ పెద్దల మధ్య కూడా కొన్నిసార్లు అలా జరగవచ్చు. “ఘనత విషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి,” “మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు” అనే ఉపదేశాలను పాటించడం మనకు సహాయకరంగా ఉండవచ్చు. (రోమా. 12:10, 16) మనం అనుకున్నదే సరైనదని మంకుపట్టు పట్టే బదులు, ఒక పరిస్థితిని వేర్వేరు కోణాల్లో చూడవచ్చనే విషయాన్ని మనం గుర్తించాలి. ఇతరుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తే, మనం సంఘ సమాధానానికి తోడ్పడవచ్చు.—ఫిలి. 4:5.

13. సొంత అభిప్రాయాల విషయంలో మన వైఖరి ఎలా ఉండాలి? బైబిల్లోని ఏ ఉదాహరణ మనకు ఈ విషయంలో సహాయకరంగా ఉంటుంది?

13 సంఘంలో ఫలానా విషయంలో మార్పు అవసరమని మనకు అనిపిస్తే, దానిగురించి చెప్పడం తప్పా? కాదు. మొదటి శతాబ్దంలో, ఒక అంశం గురించి పెద్ద వివాదం రేగింది. “ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరి కొందరును యెరూషలేమునకు అపొస్తలుల యొద్దకును పెద్దలయొద్దకును వెళ్లవలెను” అని సహోదరులు నిర్ణయించారు. (అపొ. 15:2) ఆ విషయంలో పౌలు బర్నబాలకు ఏదో ఒక అభిప్రాయం ఉండే ఉంటుంది. అంతేకాక, ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో వాళ్లకు కాస్తోకూస్తో తెలిసే ఉంటుంది. అయినా, వాళ్లు తమతమ అభిప్రాయాలు చెప్పాక, పరిశుద్ధాత్మ సహాయంతో పరిపాలక సభ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు వాళ్లు తమ వ్యక్తిగత అభిప్రాయాల్ని పక్కనబెట్టేశారు. ఆ నిర్ణయం గురించిన లేఖలు సంఘాలకు చేరినప్పుడు, ఆయా సంఘాల్లోని సహోదరులు ‘ఆదరణ పొందారు,’ ‘విశ్వాసంలో స్థిరపడ్డారు.’ (అపొ. 15:31; 16:4, 5) ఇప్పుడు కూడా ఫలానా సమస్యను మనం బాధ్యతగల సహోదరుల దృష్టికి తీసుకువెళ్లాక, వాళ్లు దాని గురించి జాగ్రత్తగా ఆలోచిస్తారనే నమ్మకంతో దాన్ని వాళ్లకు వదిలేయడం మంచిది.

తోటి క్రైస్తవులతో వ్యవహరించేటప్పుడు మంచి స్ఫూర్తిని చూపించండి

14. ఇతరులతో వ్యవహరించేటప్పుడు మనం ఎలా మంచి స్ఫూర్తిని చూపించవచ్చు?

14 ఇతరులతో వ్యవహరించేటప్పుడు మంచి స్ఫూర్తిని చూపించడానికి మనకు ఎన్నో అవకాశాలు దొరుకుతాయి. మన మనసును నొప్పించే వాళ్లను క్షమించే స్వభావం మనకుంటే సంఘానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. దేవుని వాక్యం మనకిలా చెబుతోంది: “ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనినయెడల ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి, ప్రభువు [“యెహోవా,” NW] మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి.” (కొలొ. 3:13) ఇతరుల మీద కోపం రావడానికి మనకు కొన్నిసార్లు సరైన కారణాలు ఉండే అవకాశం ఉందని ఈ లేఖనాన్ని బట్టి అర్థమౌతోంది. అయితే, ఇతరుల పొరపాట్ల గురించి అదే పనిగా ఆలోచిస్తూ సంఘ సమాధానానికి భంగం కలిగించే బదులు, యెహోవాలాగే మనం ఇతరులను క్షమిస్తూ ఆయన సేవలో కలిసి ముందుకు సాగడానికి ప్రయత్నించాలి.

15. (ఎ) క్షమించే విషయంలో మనం యోబు నుండి ఏమి నేర్చుకోవచ్చు? (బి) మంచి స్ఫూర్తిని చూపించడానికి మనకు ప్రార్థన ఎలా సహాయం చేస్తుంది?

15 ఇతరులను క్షమించే విషయంలో మనం యోబు నుండి ఎంతో నేర్చుకోవచ్చు. కష్టాల్లో ఆయనను ఓదార్చాల్సిన ముగ్గురు స్నేహితులు ఆయనతో నిర్దయగా మాట్లాడారు. అయినా యోబు వాళ్లను క్షమించాడు. ఎలా? “యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన” చేశాడు. (యోబు 16:2; 42:10) ఇతరుల కోసం ప్రార్థిస్తే వాళ్ల విషయంలో మన వైఖరి మారవచ్చు. మన క్రైస్తవ సహోదర సహోదరీలందరి కోసం ప్రార్థించడం ద్వారా మనం క్రీస్తు చూపించినలాంటి స్ఫూర్తిని పెంపొందించుకోగలుగుతాం. (యోహా. 13:34, 35) అంతేకాక మనం పరిశుద్ధాత్మ కోసం కూడా ప్రార్థించాలి. (లూకా 11:13) ఇతరులతో వ్యవహరించేటప్పుడు మనం నిజమైన క్రైస్తవ లక్షణాలను చూపించడానికి పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తుంది.—గలతీయులు 5:22, 23 చదవండి.

దేవుని సంస్థలో మంచి స్ఫూర్తి ఉండేందుకు మీ వంతు కృషి చేయండి

16, 17. మీరు ఎలాంటి స్ఫూర్తిని చూపించాలనే కృత నిశ్చయంతో ఉన్నారు?

16 ప్రతీ ఒక్కరు సంఘంలో మంచి స్ఫూర్తిని పెంపొందించడాన్ని తమ లక్ష్యంగా చేసుకుంటే ఎంత చక్కని ఫలితాలు వస్తాయో కదా! ఈ విషయాలన్నీ పరిశీలించాక, చక్కని స్ఫూర్తి చూపించే విషయంలో మనం ఇంకాస్త మెరుగవ్వాలని మనకు అనిపిస్తుండవచ్చు. అలాగైతే దేవుని వాక్యం సహాయంతో మనం ఏయే రంగాల్లో మెరుగవ్వాలో పరిశీలించుకోవాలి. (హెబ్రీ. 4:12) పౌలు తన చర్యలు సంఘంపై ప్రభావం చూపించగలవనే విషయాన్ని మనసులో పెట్టుకొని ప్రవర్తించాడు. అందుకే ఆయన ఇలా అన్నాడు: “నాయందు నాకు ఏ దోషమును కానరాదు; అయినను ఇందువలన నీతిమంతుడనుగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే.”—1 కొరిం. 4:4.

17 మన గురించి లేదా సంఘంలో మన స్థానం గురించి అతిగా చింతించకుండా, పైనుండి వచ్చే జ్ఞానానికి అనుగుణంగా ప్రవర్తించడానికి కృషి చేస్తే మనం సంఘంలో మంచి స్ఫూర్తిని నెలకొల్పడానికి దోహదపడవచ్చు. క్షమించే స్వభావాన్ని కలిగివుంటూ తోటి ఆరాధకుల గురించి సానుకూలంగా ఆలోచిస్తే, వాళ్లతో సమాధానంగా ఉండగలుగుతాం. (ఫిలి. 4:8) మనం అవన్నీ చేస్తూ ఉంటే యెహోవా, యేసుక్రీస్తు మనం చూపించే స్ఫూర్తిని తప్పక ఇష్టపడతారనే నమ్మకాన్ని కలిగివుండవచ్చు.—ఫిలే. 25.