కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము”

“నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము”

“నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము.”​—కీర్త. 143:10.

1, 2. దేవుని చిత్తానుసారంగా నడుచుకోవడం వల్ల మనం ఎలా ప్రయోజనం పొందవచ్చు? ఈ విషయంలో రాజైన దావీదు మాదిరి మనకెలా సహాయం చేస్తుంది?

 మీరు ఒక కొండ ప్రాంతంలో నడుస్తున్నట్లు ఊహించుకోండి. మార్గం మధ్యలో మీకు రెండు దారులు కనిపించాయి. దాంతో, ఏ దారిలో వెళ్లాలనే సంశయం మీకు వచ్చింది. అప్పుడు మీరు సమీపంలో ఉన్న పెద్ద రాయి ఎక్కి ఆ రెండు దారులు ఎటు వెళ్తున్నాయో కొంత ఎత్తులో నుండి చూస్తారు. మన జీవితంలో ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అలాంటిదే చేయాల్సివుంటుంది. మనం విషయాలను ఎత్తులో నుండి చూస్తే అంటే, యెహోవా దృక్కోణం నుండి చూస్తే ఆయనకు నచ్చిన ‘త్రోవలో నడవగలుగుతాం.’​—యెష. 30:21.

2 ఈ విషయంలో ఇశ్రాయేలు రాజైన దావీదు మంచి మాదిరి ఉంచాడు. ఆయన తన జీవితంలో చాలామట్టుకు దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నాడు. ఇప్పుడు మనం, యెహోవాను యథార్థ హృదయంతో సేవించిన దావీదు జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను పరిశీలించి, ఆయన నుండి ఏమి నేర్చుకోవచ్చో చూద్దాం.​—1 రాజు. 11:4.

దావీదు దేవుని నామాన్ని ఘనపర్చాడు

3, 4. (ఎ) దావీదు గొల్యాతుతో పోరాడేందుకు ఎలా ముందుకు వెళ్లగలిగాడు? (బి) దావీదు దేవుని నామాన్ని ఎలా ఎంచాడు?

3 దావీదు ఫిలిష్తీయుల శూరుడైన గొల్యాతుతో పోరాడిన సందర్భాన్ని పరిశీలించండి. “ఆరుమూళ్ల జేనెడు” లేదా దాదాపు తొమ్మిదిన్నర అడుగుల ఎత్తుండి, ఆయుధాలు ధరించి ఉన్న గొల్యాతును దావీదు ఎలా సవాలు చేయగలిగాడు? (1 సమూ. 17:4) ధైర్యం, దేవునిపై విశ్వాసం ఉండడం వల్ల ఆయన ఆ పని చేయగలిగాడు. ముఖ్యంగా యెహోవాపై, ఆయన నామంపై ఉన్న గౌరవం వల్ల దావీదు బలాఢ్యుడైన గొల్యాతుతో పోరాడడానికి సిద్ధమయ్యాడు. దావీదు ఆగ్రహంతో ఇలా అన్నాడు: “జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు?”​—1 సమూ. 17:26.

4 యౌవనుడైన దావీదు గొల్యాతుతో ఇలా అన్నాడు: “నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకధిపతియగు యెహోవా పేరట నేను నీమీదికి వచ్చుచున్నాను.” (1 సమూ. 17:45) దావీదు సత్యదేవుడైన యెహోవా మీద ఆధారపడి ఫిలిష్తీయుల శూరుడైన గొల్యాతును ఒకే ఒక్క రాయితో నేలకూల్చాడు. ఆ ఒక్క సందర్భంలోనే కాదు, దావీదు తన జీవితమంతా యెహోవాపై నమ్మకం ఉంచాడు, ఆయన నామాన్ని ఘనపర్చాడు. నిజానికి, ‘యెహోవా పరిశుద్ధ నామాన్ని బట్టి అతిశయించమని’ దావీదు తోటి ఇశ్రాయేలీయులను కోరాడు.​—1 దినవృత్తాంతములు 16:8-10 చదవండి.

5. నేటి ప్రజలు ఏవిధంగా గొల్యాతులా యెహోవాను అగౌరవపరుస్తున్నారు?

5 యెహోవా మీ దేవుడు అని చెప్పడానికి మీరు గర్వపడుతున్నారా? (యిర్మీ. 9:24) మీ పొరుగువాళ్లు, సహోద్యోగులు, తోటి విద్యార్థులు లేక మీ బంధువులు యెహోవా గురించి, యెహోవాసాక్షుల గురించి చెడుగా, కించపర్చే విధంగా మాట్లాడితే మీరు ఎలా స్పందిస్తారు? ఇతరులు యెహోవా నామాన్ని నిందిస్తున్నప్పుడు, ఆయన సహాయం చేస్తాడనే నమ్మకంతో మీరు ధైర్యంగా మాట్లాడతారా? ‘మౌనంగా ఉండాల్సిన’ సందర్భాలు కొన్ని ఉంటాయి కానీ యెహోవాసాక్షులమని, క్రీస్తు శిష్యులమని చెప్పుకోవడానికి మాత్రం మనం అస్సలు సిగ్గుపడకూడదు. (ప్రసం. 3:1, 7; మార్కు 8:38) అలా నిందించే వాళ్లతో మనం మర్యాదగా, నేర్పుగా వ్యవహరించాలి. అయితే, ‘ఆ ఫిలిష్తీయుని మాటలు విని బహు భీతులైన’ ఇశ్రాయేలీయుల్లా మనం ఉండకూడదు. (1 సమూ. 17:11) బదులుగా, యెహోవా నామాన్ని పరిశుద్ధపర్చాలనే ఉద్దేశంతో మనం ధైర్యంగా వ్యవహరించాలి. యెహోవా ఎలాంటి దేవుడో ప్రజలు తెలుసుకునేలా సహాయం చేయాలనేది మన కోరిక. అందుకే, దేవునికి సన్నిహితమవ్వడం ఎంత ప్రాముఖ్యమో బైబిలును ఉపయోగించి ఇతరులకు తెలియజేస్తాం.​—యాకో. 4:8.

6. ఏ ఉద్దేశంతో దావీదు గొల్యాతుతో పోరాడాడు? మన ముఖ్య ఉద్దేశం ఏమై ఉండాలి?

6 దావీదు గొల్యాతుతో పోరాడిన సందర్భం నుండి మనం మరో ప్రాముఖ్యమైన పాఠం నేర్చుకోవచ్చు. సైనికుల దగ్గరికి వచ్చి దావీదు ఇలా అడిగాడు: “వాని చంపి ఇశ్రాయేలీయులనుండి యీ నింద తొలగించిన వానికి బహుమతి యేమి?” దానికి జవాబుగా వాళ్లు దావీదుతో ఇలా అన్నారు: ‘వానిని [గొల్యాతును] చంపినవానికి రాజు బహుగా ఐశ్వర్యము కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లిచేయును.’ (1 సమూ. 17:25-27) అయితే, దావీదు ఐశ్వర్యం పొందడం గురించి కాదుగానీ అంతకన్నా గొప్ప దాని గురించి ఆలోచించాడు. ఆయన దేవుని నామాన్ని ఘనపర్చాలనుకున్నాడు. (1 సమూయేలు 17:46, 47 చదవండి.) మన విషయమేమిటి? ఈ లోకంలో ఎంతో డబ్బు, గొప్ప హోదా సంపాదించుకొని పేరుప్రతిష్ఠలు తెచ్చుకోవడానికే మనం ప్రయత్నిస్తామా? మనం దావీదులా ఉండాలని కోరుకుంటాం. ఆయన ఇలా పాడాడు: “నాతో కూడి యెహోవాను ఘనపరచుడి. మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము.” (కీర్త. 34:3) మనం మన పేరుప్రఖ్యాతుల కోసం పాటు పడకుండా దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఆయనపై నమ్మకం చూపిద్దాం.​—మత్త. 6:9, 10.

7. సువార్తను ఇష్టపడని వాళ్లు తారసపడుతున్నా, మనం మన పరిచర్యను కొనసాగించడానికి అవసరమైన విశ్వాసాన్ని ఎలా పెంపొందించుకోవచ్చు?

7 గొల్యాతుతో పోరాడడానికి దావీదుకు యెహోవా దేవునిపై పూర్తి నమ్మకం అవసరమైంది. దావీదు చిన్నప్పుడే దేవుని మీద దృఢమైన విశ్వాసం పెంచుకున్నాడు. కాపరిగా ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడడం ద్వారా దావీదు తన విశ్వాసాన్ని బలపర్చుకున్నాడు. (1 సమూ. 17:34-37) పరిచర్యలో కొనసాగాలంటే మనకు కూడా బలమైన విశ్వాసం అవసరం. ముఖ్యంగా, సువార్తను ఇష్టపడని వాళ్లు మనకు తారసపడుతున్నప్పుడు అలాంటి విశ్వాసం అవసరం. రోజువారీ కార్యకలాపాల్లో దేవుని మీద ఆధారపడుతూ మనం అలాంటి విశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు. ఉదాహరణకు, మనం బస్సుల్లో లేదా రైళ్లలో ప్రయాణం చేస్తున్నప్పుడు పక్కన కూర్చున్న ఇతర ప్రయాణికులతో బైబిలు సత్యం గురించి మాట్లాడవచ్చు. అంతేకాదు, మనం ఇంటింటి పరిచర్య చేస్తున్నప్పుడు దారిన వెళ్లేవాళ్లతో కూడా మాట్లాడడానికి ప్రయత్నించాలి.​—అపొ. 20:20, 21.

దావీదు యెహోవా చిత్తాన్ని పూర్తిగా మనసులో ఉంచుకున్నాడు

సౌలును చంపే అవకాశం దొరికినా దావీదు ఆయనను ఎందుకు చంపలేదు?

8, 9. సౌలుతో వ్యవహరిస్తున్నప్పుడు తాను యెహోవా చిత్తాన్ని మనసులో ఉంచుకున్నానని దావీదు ఎలా చూపించాడు?

8 ఇశ్రాయేలు మొదటి రాజైన సౌలు పట్ల దావీదు ప్రవర్తించిన తీరులో కూడా యెహోవాపై దావీదుకున్న నమ్మకం స్పష్టంగా కనిపిస్తుంది. అసూయతో రగిలిపోయిన సౌలు దావీదును చంపడానికి మూడుసార్లు ఈటెను విసిరాడు, కానీ దావీదు ప్రతీసారి తప్పించుకున్నాడు. ఆ తర్వాత సౌలు మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఆయన ప్రయత్నించలేదు. చివరికి, దావీదు సౌలు నుండి దూరంగా పారిపోయాడు. (1 సమూ. 18:7-11; 19:10) అప్పుడు సౌలు 3,000 మందిని ఎంపిక చేసుకొని అరణ్యంలో ఉన్న దావీదును పట్టుకోవడానికి బయలుదేరాడు. (1 సమూ. 24:2) అలా సౌలు దావీదును వెంటాడుతూ దావీదు, ఆయన అనుచరులు దాక్కొని ఉన్న గుహలోకి అనుకోకుండా వెళ్లాడు. కావాలనుకుంటే దావీదు అప్పుడు సౌలును చంపగలిగేవాడే. పైగా, సౌలు స్థానంలో దావీదును రాజుగా చేయాలనేది దేవుని నిర్ణయం కూడా. (1 సమూ. 16:1, 13) సౌలును చంపమని దావీదు అనుచరులు కూడా ఆయనకు సలహా ఇచ్చారు. కానీ దావీదు ఇలా అన్నాడు: “ఇతడు యెహోవాచేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవాచేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను.” (1 సమూయేలు 24:4-7 చదవండి.) అప్పటికి సౌలు ఇంకా దేవుని అభిషిక్తుడైన రాజే. యెహోవా సౌలును రాజుగా తీసేయలేదు కాబట్టి, సౌలు రాజరికాన్ని దావీదు లాక్కోవాలనుకోలేదు. దావీదు సౌలును చంపకుండా, ఆయన వస్త్రపుచెంగును మాత్రమే కోశాడు. అలా, సౌలుకు హాని తలపెట్టాలనే ఉద్దేశం తనకు లేదని దావీదు చూపించాడు.​—1 సమూ. 24:11.

9 సౌలును చివరిసారి చూసినప్పుడు కూడా దావీదు ఆయన పట్ల గౌరవం చూపించాడు. అప్పుడు దావీదు, అబీషైలు సౌలుదండు ఉన్న చోటికి వచ్చారు. ఆ సమయంలో సౌలు నిద్రపోతున్నాడు. దేవుడు సౌలును దావీదు చేతికి అప్పగించాడని అనుకున్న అబీషై సౌలును ఈటెతో పొడిచి చంపుదామని దావీదుతో అన్నాడు. కానీ, దావీదు అందుకు అంగీకరించలేదు. (1 సమూ. 26:8-11) దావీదు దేవుని నిర్దేశం కోసం ప్రార్థించేవాడు కాబట్టి, సౌలును చంపమని అబీషై కోరినా దావీదు మాత్రం యెహోవా చిత్తానికి విరుద్ధంగా ప్రవర్తించలేదు.

10. మనకు ఎలాంటి ఒత్తిడి ఎదురుకావచ్చు? దానికి లొంగిపోకుండా ఉండేందుకు మనకు ఏది సహాయం చేస్తుంది?

10 కొన్నిసార్లు మన సహవాసులు యెహోవా చిత్తాన్ని చేసే విషయంలో మనకు సహకరించాల్సిందిపోయి మానవ ఆలోచనలకు అనుగుణంగా నడిచేలా మన మీద ఒత్తిడి తీసుకురావచ్చు. అబీషైలాగే వాళ్లు ఏదైనా ఒక విషయంలో దేవుని చిత్తాన్ని పట్టించుకోకుండా ఫలానా పని చేయమని మనల్ని ప్రోత్సహించవచ్చు. మనం అలాంటి ఒత్తిడికి లొంగిపోకుండా ఉండాలంటే ఫలానా విషయంలో యెహోవా అభిప్రాయం ఏంటో మనకు స్పష్టంగా తెలిసివుండాలి. అలాగే ఆయన మార్గాలను అంటిపెట్టుకుని ఉండాలనే పట్టుదల మనకు ఉండాలి.

11. దేవుని చిత్తాన్ని పూర్తిగా మనసులో ఉంచుకునే విషయంలో మీరు దావీదు నుండి ఏమి నేర్చుకున్నారు?

11 “నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము” అని దావీదు యెహోవాకు ప్రార్థించాడు. (కీర్తన 143:5, 8, 10 చదవండి.) దావీదు తన సొంత ఆలోచనల మీద ఆధారపడే బదులు లేదా ఇతరుల ఒత్తిడికి లొంగిపోయే బదులు ఆయా పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో నేర్పించమని దేవుణ్ణి అడిగాడు. ఆయన యెహోవా ‘క్రియలన్నిటిని ధ్యానించాడు,’ మనస్ఫూర్తిగా ‘దేవుని చేతి పనిని యోచించాడు.’ మనం కూడా లేఖనాలను పరిశోధించడం ద్వారా, మానవులతో యెహోవా వ్యవహారాలకు సంబంధించిన బైబిలు వృత్తాంతాలను ధ్యానించడం ద్వారా దేవుని చిత్తాన్ని గ్రహించగలుగుతాం.

నియమాల వెనక ఉన్న సూత్రాల్ని దావీదు గ్రహించాడు

12, 13. దావీదు తన ముగ్గురు అనుచరులు తెచ్చిన నీళ్లను ఎందుకు పారబోశాడు?

12 దావీదు ధర్మశాస్త్రంలోని నియమాల వెనక ఉన్న సూత్రాలను గ్రహించాడు, వాటి ప్రకారం జీవించాలనే కోరికను చూపించాడు. అలా ఆయన మనకు ఆదర్శంగా ఉన్నాడు. దావీదు ‘బేత్లెహేము ఊరి గవిని దగ్గరున్న బావి నీళ్లు’ తాగాలనే కోరికను వ్యక్తం చేసినప్పుడు ఏమి జరిగిందో పరిశీలించండి. దావీదు అనుచరుల్లో ముగ్గురు తమ ప్రాణాలకు తెగించి మరీ ఫిలిష్తీయుల స్వాధీనంలో ఉన్న బేత్లెహేముకు వెళ్లి మంచినీళ్లు తెచ్చారు. ‘అయితే దావీదు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సులేక యెహోవాకు అర్పితముగా వాటిని పారబోశాడు.’ ఎందుకు? దావీదు ఇలా వివరించాడు: “నేను ఈలాగు చేయకుండ నా దేవుడు నన్ను కాచునుగాక; ప్రాణమునకు తెగించి యీ నీళ్లు తెచ్చిన యీ మనుష్యుల రక్తమును నేను త్రాగుదునా?”​—1 దిన. 11:15-19.

తన అనుచరులు తెచ్చిన నీళ్లను దావీదు తాగకపోవడం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

13 ధర్మశాస్త్రం ప్రకారం రక్తాన్ని యెహోవాకు అర్పించాలని, దాన్ని తినకూడదని దావీదుకు తెలుసు. ఎందుకు అలా చేయాలో కూడా దావీదు అర్థంచేసుకున్నాడు. “రక్తము దేహమునకు ప్రాణము” అని దావీదుకు తెలుసు. అయితే వాళ్లు తెచ్చింది రక్తం కాదు నీళ్లు కదా, మరి దావీదు ఆ నీళ్లు తాగడానికి ఎందుకు నిరాకరించాడు? ధర్మశాస్త్రంలో యెహోవా ఇచ్చిన నియమం వెనక ఉన్న సూత్రాన్ని దావీదు గ్రహించాడు. దావీదు దృష్టిలో ఆ నీళ్లు ఆ ముగ్గురి రక్తంతో సమానం. అందుకే, ఆ నీళ్లను తాగడానికి దావీదుకు మనసు రాక వాటిని నేలమీద పారబోశాడు.​—లేవీ. 17:11; ద్వితీ. 12:23, 24.

14. యెహోవా ఉద్దేశాన్ని దావీదు ఎలా తెలుసుకోగలిగాడు?

14 దావీదు దేవుని ధర్మశాస్త్రాన్ని ఆకళింపు చేసుకున్నాడు. ఆయన ఇలా పాడాడు: “నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది.” (కీర్త. 40:8) దావీదు దేవుని ధర్మశాస్త్రాన్ని చదివాడు, లోతుగా ధ్యానించాడు. యెహోవా ఆజ్ఞలను పాటించడం వల్ల ప్రయోజనం ఉంటుందని నమ్మాడు. ధర్మశాస్త్రంలోని నియమాల్నే కాక వాటి వెనుకున్న ఉద్దేశాన్ని అర్థంచేసుకుని జీవించడానికి కృషి చేశాడు. మనం కూడా బైబిల్లో చదివిన వాటిని ధ్యానిస్తూ వాటిని హృదయంలో పదిలపర్చుకోవాలి. అలాచేస్తే ఫలానా విషయంలో యెహోవాను ఎలా సంతోషపర్చవచ్చో తెలుసుకోవచ్చు.

15. సొలొమోను ఏ విధంగా దేవుని ధర్మశాస్త్రాన్ని పెడచెవినబెట్టాడు?

15 దావీదు కుమారుడైన సొలొమోను కూడా యెహోవా దేవుని అనుగ్రహాన్ని ఎంతగానో పొందాడు. అయితే, కొంతకాలానికి సొలొమోను దేవుని ధర్మశాస్త్రం పట్ల గౌరవాన్ని కోల్పోయాడు. ఇశ్రాయేలీయుల రాజు “అనేక స్త్రీలను వివాహము చేసికొనకూడదు” అని దేవుడు ఇచ్చిన ఆజ్ఞను సొలొమోను పెడచెవినబెట్టాడు. (ద్వితీ. 17:17) నిజానికి ఆయన చాలామంది అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. ఆయన వృద్ధుడైనప్పుడు, ‘అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలతట్టు త్రిప్పారు.’ సొలొమోను తన పనులను ఎలా సమర్థించుకున్నా ఆయనైతే, “యెహోవా దృష్టికి చెడు నడత నడచి తన తండ్రియైన దావీదు అనుసరించినట్లు యథార్థహృదయముతో యెహోవాను అనుసరింపలేదు.” (1 రాజు. 11:1-6) దేవుని వాక్యంలోని నియమాలకు, సూత్రాలకు కట్టుబడి ఉండడం ఎంత ప్రాముఖ్యమో కదా! ముఖ్యంగా, పెళ్లి చేసుకునే విషయంలో అలా ఉండడం ఎంతో కీలకం.

16. “ప్రభువునందు మాత్రమే పెండ్లిచేసికొనవలెను” అనే ఆజ్ఞ వెనకున్న ఉద్దేశాన్ని గ్రహించే క్రైస్తవులు ఏమి చేస్తారు?

16 ఒక అవిశ్వాసి మిమ్మల్ని ఇష్టపడుతున్నానని చెబితే మీరెలా స్పందిస్తారు? మీరు దావీదులా దేవుని ఉద్దేశాన్ని పరిగణనలోకి తీసుకుంటారా? లేక సొలొమోనులా ప్రవర్తిస్తారా? సత్యారాధకులు “ప్రభువునందు మాత్రమే పెండ్లిచేసికొనవలెను” అని బైబిలు చెబుతోంది. (1 కొరిం. 7:39) ఒక క్రైస్తవుడు పెళ్లి చేసుకోవాలనుకుంటే తోటి యెహోవాసాక్షినే పెళ్లి చేసుకోవాలి. దేవుడు ఆ ఆజ్ఞను ఎందుకు ఇచ్చాడో అర్థంచేసుకుంటే, మనం అవిశ్వాసులను పెళ్లిచేసుకోకుండా ఉండడమే కాక వాళ్లనుండి వచ్చే ప్రేమ/పెళ్లి ప్రతిపాదనలను కూడా తిరస్కరిస్తాం.

17. అశ్లీల చిత్రాలను చూసే ఉచ్చు నుండి మనం ఎలా తప్పించుకోవచ్చు?

17 దేవుని నిర్దేశం కోసం ప్రార్థించిన దావీదు ఉదాహరణ, అశ్లీల చిత్రాలను చూడాలనే శోధనను ఎదిరించేందుకు కూడా సహాయం చేస్తుంది. ఈ లేఖనాలను చదివి, వాటిలో ఉన్న సూత్రాల గురించి ధ్యానించి, అశ్లీల చిత్రాల విషయంలో యెహోవా ఉద్దేశం ఏమిటో అర్థంచేసుకోవడానికి ప్రయత్నించండి. (కీర్తన 119:37; మత్తయి 5:28, 29; కొలొస్సయులు 3:5 చదవండి.) దేవుని ఉన్నతమైన ప్రమాణాలను ధ్యానిస్తే మనం అశ్లీల చిత్రాలను చూసే ఉచ్చులో పడకుండా తప్పించుకోవచ్చు.

అన్ని సమయాల్లో దేవుని ఉద్దేశాన్ని మనసులో ఉంచుకోండి

18, 19. (ఎ) అపరిపూర్ణుడైనప్పటికీ దావీదు ఎలా దేవుని అనుగ్రహాన్ని పొందగలిగాడు? (బి) మీ కృతనిశ్చయం ఏమిటి?

18 చాలా విషయాల్లో దావీదు ఆదర్శంగా ఉన్నా, ఆయన కొన్ని ఘోరమైన పాపాలు చేశాడు. (2 సమూ. 11:2-4, 14, 15, 22-27; 1 దిన. 21:1, 7) అయినా పాపం చేసిన ప్రతీసారి దావీదు పశ్చాత్తాపం చూపించాడు. ఆయన దేవుని దృష్టిలో ‘యథార్థ హృదయంతో నడుచుకున్నాడు.’ (1 రాజు. 9:4) అలాగని ఎందుకు చెప్పవచ్చు? ఎందుకంటే, ఆయన జీవితమంతా యెహోవా చిత్తానుసారంగా నడుచుకోవడానికే తాపత్రయపడ్డాడు.

19 మనం అపరిపూర్ణులమైనా దేవుని అనుగ్రహాన్ని ఎల్లప్పుడూ పొందవచ్చు. దానికోసం మనం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదవాలి, చదివిన వాటిని బాగా ధ్యానించాలి, అలా నేర్చుకున్న వాటికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇవన్నీ చేస్తే కీర్తనకర్తలాగే మనం కూడా వినయంగా దేవునికి ఇలా విన్నవించుకుంటాం: “నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము.”