మీకు జ్ఞాపకమున్నాయా?
మీరు ఇటీవలి కావలికోట సంచికలను జాగ్రత్తగా చదివారా? అయితే, ఈ కింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరేమో చూడండి:
అదుపుతప్పి మాట్లాడడం అనే అగ్నిని మనం ఎలా ఆర్పేయవచ్చు?
మనం ముందుగా మన హృదయాన్ని పరిశీలించుకోవాలి. మన సహోదరునికి దురుద్దేశాలను అంటగట్టే బదులు, మనం ఆయన గురించి ఎందుకలా చెడుగా ఆలోచిస్తున్నామో పరిశీలించుకోవాలి. మనం అతనికన్నా మెరుగ్గా ఉన్నామని చూపించుకోవడానికే అలా విమర్శిస్తున్నామా? విమర్శించినప్పుడు సాధారణంగా పరిస్థితులు మరీ దారుణంగా తయారౌతాయి.—8/15, 21వ పేజీ.
లోకాంతం మనుష్యుల వల్ల వస్తుందా?
దేవుడు భూమిని, మనుషుల చేతుల్లో నాశనం కానివ్వడు. యెహోవా భూమిని ఊరికే సృష్టించలేదు కానీ ‘నివాస స్థలంగా’ ఉండడానికి చేశాడని బైబిలు మనకు చెబుతోంది. (యెషయా 45:18) మనుష్యులు భూమిని పూర్తిగా నాశనం చేస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకోడు కానీ ఆయన “భూమిని నాశనం చేసే వాళ్లను నాశనం” చేస్తాడు.—ప్రకటన 11:18, పరిశుద్ధ బైబల్: తెలుగు ఈజీ-టు-రీడ్ వర్షన్.—07/01, 4వ పేజీ.
యెహోవా దినం రావడానికి ముందు ఎలాంటి సంఘటనలు జరుగుతాయి?
‘నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదు!’ అని ప్రకటన వెలువడుతుంది. దేశాలు మహాబబులోనుపై దాడి చేసి దాన్ని నాశనం చేస్తాయి. తర్వాత దేవుని ప్రజలపై దాడి జరుగుతుంది. అప్పుడు హార్‌మెగిద్దోను యుద్ధం జరుగుతుంది, దాని తర్వాత సాతాను, వాడి దయ్యాలు అగాధంలో పడవేయబడతాయి.—9/15, 4వ పేజీ.
అంతం ఎప్పుడు వస్తుందో తెలియకపోవడం వల్ల మనం పొందే కొన్ని ప్రయోజనాలు ఏమిటి?
అంతం ఎప్పుడు వస్తుందో తెలియకపోవడం వల్ల మన హృదయంలో నిజంగా ఏముందో తెలుస్తుంది. యెహోవా హృదయాన్ని సంతోషపెట్టే అవకాశం దొరుకుతుంది. త్యాగపూరిత జీవితాన్ని గడపాలనే ప్రేరణను మనం పొందుతాం, ఇంకా దేవుని మీద, ఆయన వాక్యం మీద మరింత ఎక్కువగా ఆధారపడతాం. అంతేకాక, ప్రస్తుతం మనకు వచ్చే కష్టాలు మన వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుస్తాయి.—9/15, 24-25 పేజీలు.
దేవుని నియమాలు మనల్ని ఎలా కాపాడతాయి?
వివాహేతర సంబంధాలను బైబిలు ఖండిస్తోంది. (హెబ్రీయులు 13:4) దంపతులు ఈ ఆజ్ఞను పాటించినప్పుడు సురక్షితంగా ఉన్నామన్న భావన వాళ్లలో కలుగుతుంది, అంతేకాదు పిల్లలు ఎదగడానికి అనువైన వాతావరణం నెలకొంటుంది. ఆ ఆజ్ఞను పాటించకపోతే రోగాలు, విడాకులు, హింస, మానసిక క్షోభ వంటి సమస్యలు పీడిస్తాయి. తల్లి లేదా తండ్రి లేని కుటుంబాలు ఏర్పడతాయి.—సామెతలు 5:1-9 చదవండి.—07/01, 16వ పేజీ.
ప్రకటన 1:16, 20 వచనాలు వర్ణిస్తున్నట్లుగా యేసు కుడిచేతిలో ఉన్న “ఏడు నక్షత్రములు” ఎవరిని సూచిస్తున్నాయి?
ఆ “నక్షత్రములు” ఆత్మాభిషిక్త పెద్దలను, అలాగే నేటి సంఘాల్లో ఉన్న పెద్దలందరినీ సూచిస్తున్నాయి.—10/15, 14వ పేజీ.
దయ్యాల ప్రభావం నుండి విడుదల అవ్వాలంటే ఏమి చేయాలి?
యెహోవా ఆశీర్వాదం పొందాలనుకునే వాళ్లనందరినీ లేఖనాలు ఇలా ప్రోత్సహిస్తున్నాయి: “దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును. దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును.” (యాకోబు 4:7, 8) మీరు దయ్యాల ప్రభావం నుండి బయటపడాలనుకుంటే యెహోవా దేవుడు మీకు సహాయం చేయగలడు, చేస్తాడు కూడా.—10/01, 28వ పేజీ.
యిషయా 50:4, 5 వచనాల్లో ఉన్నట్లుగా యేసు ఎలా వినయాన్ని చూపించాడు?
“శిష్యునికి తగిన నోరు” కలిగివున్న వ్యక్తిగా ఆయన ‘వినకుండ తొలగిపోలేదు’ అని ఆ వచనాలు చెబుతున్నాయి. యేసు వినయం చూపిస్తూ తన తండ్రి బోధించిన విషయాల్ని చాలా శ్రద్ధగా విన్నాడు. యెహోవా చెప్పిన విషయాల్ని యేసు ఎంతో ఆత్రంగా, ఇష్టంగా నేర్చుకున్నాడు. పాపులైన మానవుల మీద కనికరం చూపించడం ద్వారా యెహోవా ఎలా వినయాన్ని కనబర్చాడో కూడా యేసు గమనించాడు.—11/15, 11వ పేజీ.
నిజమైన సంతోషానికి మూలం ఏమిటి?
మనం కావాలనుకున్నవన్నీ సమకూర్చుకున్నంత మాత్రాన లేదా సౌకర్యవంతమైన జీవితం గడుపుతున్నంత మాత్రాన నిజమైన సంతోషం దొరకదు. యేసే స్వయంగా ఇలా చెప్పాడు: “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము.” ఉన్నంతలో ఇతరులకు ఇవ్వడం ద్వారా, ఇతరులకు ప్రోత్సాహం కలిగే విధంగా ఉండడం ద్వారా మనం సంతోషాన్ని, సంతృప్తిని పొందవచ్చు.—అపొస్తలుల కార్యములు 20:35.—10/01, 32వ పేజీ.