కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జీవితంలో అసలైన విజయాన్ని సొంతం చేసుకోండి

జీవితంలో అసలైన విజయాన్ని సొంతం చేసుకోండి

“నీ మార్గమును వర్ధిల్లజేసికొని చక్కగా ప్రవర్తించెదవు.”​—యెహో. 1:8.

1, 2. (ఎ) చాలామంది ప్రజలు దేన్ని విజయంగా కొలుస్తారు? (బి) మీరు దేన్ని విజయంగా కొలుస్తారో ఎలా తెలుసుకోవచ్చు?

 జీవితంలో అసలైన విజయాన్ని సొంతం చేసుకోవడం అంటే ఏమిటి? ఒకసారి మీరు ఆ ప్రశ్నను పదిమందికి వేసి చూడండి. వాళ్లు పది రకాలుగా జవాబిస్తారు. ఉదాహరణకు ఆర్థిక, ఉద్యోగ లేదా విద్య వంటి రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తే జీవితంలో విజయం సాధించినట్లేనని చాలామంది చెబుతారు. కొంతమందేమో తమ కుటుంబంతో, స్నేహితులతో, సహోద్యోగులతో సత్సంబంధాలు కలిగి ఉంటే విజయం సాధించినట్లేనని అంటారు. కొంతమంది దేవుని సేవకులైతే సంఘంలో బాధ్యతలు వస్తే లేదా పరిచర్యలో మంచి ఫలితాలు సాధిస్తే విజయం సాధించినట్లేనని అనుకుంటారు.

2 మీరు దేన్ని విజయంగా కొలుస్తారో తెలుసుకోవడానికి ఓ పని చేసి చూడండి. మీ దృష్టిలో విజయం సాధించారని మీరు అనుకుంటున్న, మీరు ఎంతగానో అభిమానిస్తున్న, గౌరవిస్తున్న కొంతమంది వ్యక్తుల పేర్లను ఓ పేపరు మీద రాయండి. వాళ్లందరిలోనూ ఉన్న లక్షణం ఏమిటి? వాళ్లు ధనవంతులా? మంచి పేరుప్రతిష్ఠలు సంపాదించిన వ్యక్తులా? ప్రముఖులా? ఆ ప్రశ్నలకు వచ్చే జవాబును బట్టి మీ హృదయంలో విజయానికి మీరిచ్చే నిర్వచనం ఏమిటో తెలుస్తుంది. అంతేకాదు జీవితంలో మీ నిర్ణయాల్ని, మీ లక్ష్యాల్ని ఏది ఎక్కువగా ప్రభావితం చేస్తుందో కూడా తెలుస్తుంది.​—లూకా 6:45.

3. (ఎ) విజయం సాధించడానికి ఏమి చేయమని దేవుడు యెహోషువకు చెప్పాడు? (బి) మనమిప్పుడు ఏమి పరిశీలిస్తాం?

3 అయితే యెహోవా దృష్టిలో మనం విజయం సాధించామా లేదా అన్నదే ముఖ్యం. ఎందుకంటే మన జీవితాలు యెహోవా అనుగ్రహం మీదే ఆధారపడి ఉన్నాయి. ఇశ్రాయేలీయుల్ని వాగ్దాన దేశంలోకి నడిపించే బరువైన బాధ్యతను యెహోషువకు అప్పగిస్తున్నప్పుడు, “దివారాత్రము” ధర్మశాస్త్రాన్ని చదివి దానిలో ఉన్న విషయాల్ని జాగ్రత్తగా పాటించమని యెహోవా ఆయనకు చెప్పాడు. అలాచేస్తే, “నీ మార్గమును వర్ధిల్లజేసికొని చక్కగా ప్రవర్తించెదవు” అని యెహోవా ఆయనకు అభయమిచ్చాడు. (యెహో. 1:7, 8) యెహోషువ నిజంగానే వర్ధిల్లాడని లేదా విజయం సాధించాడని మనకు తెలుసు. మరి మన విషయమేమిటి? విజయాన్ని యెహోవా కొలిచినట్లే మనమూ కొలవాలంటే ఏమి చేయాలి? దానికోసం మనమిప్పుడు బైబిలు ప్రస్తావిస్తున్న ఇద్దరు వ్యక్తుల జీవితాల్ని పరిశీలిద్దాం.

సొలొమోను విజయం సాధించాడా?

4. సొలొమోను విజయం సాధించాడని ఎందుకు చెప్పవచ్చు?

4 సొలొమోను తన జీవితంలో చాలా విషయాల్లో విజయం సాధించాడు. అలాగని ఎందుకు చెప్పవచ్చు? ఎందుకంటే, ఎన్నో సంవత్సరాలు ఆయన యెహోవాకు భయపడుతూ విధేయంగా నడుచుకున్నాడు. దానివల్ల యెహోవా ఆయనను గొప్పగా ఆశీర్వదించాడు. ఏదైనా కోరిక కోరుకోమని యెహోవా సొలొమోనును అడిగినప్పుడు ఆయన దేవుని ప్రజల్ని నడిపించడానికి కావాల్సిన జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకున్నాడని ఒకసారి గుర్తుచేసుకోండి. అప్పుడు దేవుడు ఆయనకు జ్ఞానాన్నే కాక సిరిసంపదల్ని కూడా దయచేశాడు. (1 రాజులు 3:10-14 చదవండి.) “సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పుదేశస్థుల జ్ఞానము కంటెను ఐగుప్తీయుల జ్ఞానమంతటికంటెను అధికమై యుండెను.” ఆయన పేరుప్రఖ్యాతులు సుదూర దేశాల వరకు వ్యాపించాయి. (1 రాజు. 4:30, 31) ఆయన ఆస్తిపాస్తుల విషయానికొస్తే, ప్రతీ సంవత్సరం ఆయనకు కేవలం బంగారమే దాదాపు 25 టన్నుల వరకు ఆదాయంగా వచ్చేది. (2 దిన. 9:13) చాకచక్యంగా వ్యవహారాలు నెరపడంలో, నిర్మాణ రంగంలో, వ్యాపార విషయాల్లో సొలొమోను దిట్ట. అవును, యెహోవా దృష్టిలో యథార్థంగా నడిచినంతకాలం సొలొమోను విజయం సాధిస్తూనే ఉన్నాడు.​—2 దిన. 9:22-24.

5. దేవుని దృష్టిలో విజయం సాధించడం గురించి సొలొమోను ఏమన్నాడు?

5 అయితే డబ్బు, పలుకుబడి ఉన్నవాళ్లకే విజయం, సంతోషం సొంతమౌతాయని సొలొమోను ఎన్నడూ అనుకోలేదు. ప్రసంగి పుస్తకంలో ఆయన రాసిన మాటల్ని బట్టి ఆ విషయం స్పష్టమౌతుంది. ఆయన ఇలా రాశాడు: “కావున సంతోషముగా నుండుటకంటెను, తమ బ్రదుకును సుఖముగా వెళ్లబుచ్చుటకంటెను శ్రేష్ఠమైనదేదియు నరులకు లేదని నేను తెలిసికొంటిని. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమువలన సుఖమనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలిసికొంటిని.” (ప్రసం. 3:12, 13) అంతేకాక, దేవునితో మంచి సంబంధాన్ని కలిగివుండి ఆయన అనుగ్రహం పొందిన వ్యక్తులే అలాంటి ఆనందాల్ని ఆస్వాదిస్తారని సొలొమోను గుర్తించాడు. అందుకే ఆయన ఇలా అన్నాడు: “ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే; దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి.”​—ప్రసం. 12:13.

6. అసలైన విజయం అంటే ఏమిటో అర్థంచేసుకోవడానికి సొలొమోను ఉదాహరణ మనకెలా సహాయం చేస్తుంది?

6 ఎన్నో సంవత్సరాలు సొలొమోను దైవభయంతో నడుచుకున్నాడు. ఆయన “తన తండ్రియైన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు” జీవించాడని బైబిలు చెబుతోంది. (1 రాజు. 3:3) అది అసలైన విజయం కాదంటారా? దేవుని నిర్దేశంతో సొలొమోను సత్యారాధన కోసం గొప్ప ఆలయాన్ని నిర్మించాడు, మూడు బైబిలు పుస్తకాల్ని రాశాడు. ఆయన చేసినటువంటి గొప్ప పనులు మనం చేయలేకపోవచ్చు. అయితే, దేవుని పట్ల నమ్మకంగా నడుచుకున్నంతకాలం ఆయన ఉంచిన చక్కని మాదిరిని చూస్తే అసలైన విజయమంటే ఏమిటో గ్రహించగలుగుతాం, అంతేకాక దాన్ని సాధించడానికి మనం ఏమి చేయాలో తెలుసుకోగలుగుతాం. నేటి ప్రపంచం విజయ సోపానాలుగా ఎంచుతున్న డబ్బు, జ్ఞానం, పేరుప్రఖ్యాతులు, అధికారం వంటివన్నీ వ్యర్థమేనని సొలొమోను దైవప్రేరణతో రాశాడని గుర్తుంచుకోండి. నిజానికి, వాటి వెంట పరుగులు తీస్తే మనం ‘గాలి కోసం ప్రయాసపడినట్లే.’ డబ్బు పిచ్చి ఉన్నవాళ్లకు ఎంత సంపాదించినా సరిపోదనే విషయాన్ని మీరు గమనించే ఉంటారు. సంపాదించినవి ఏమైపోతాయో అని వాళ్లు ఆందోళన పడుతుంటారు. నిజానికి అవన్నీ ఏదో ఒక రోజు పరులపాలౌతాయి.​—ప్రసంగి 2:8-11, 17; 5:10-12 చదవండి.

7, 8. సొలొమోను ఎలా తప్పిపోయాడు? దానివల్ల వచ్చిన ఫలితమేమిటి?

7 అయితే, చివరకు సొలొమోను సత్యారాధన నుండి వైదొలిగాడు. బైబిలు ఇలా చెబుతోంది: ‘సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలతట్టు త్రిప్పగా అతని తండ్రియైన దావీదు హృదయమువలె అతని హృదయము దేవుడైన యెహోవాయెడల యథార్థము కాకపోయెను. సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను.’​—1 రాజు. 11:4-6.

8 సొలొమోను ప్రవర్తన యెహోవాకు కోపం తెప్పించింది. అందుకే యెహోవా సొలొమోనుతో ఇలా అన్నాడు: “నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపక పోవుట నేను కనుగొనుచున్నాను గనుక యీ రాజ్యము నీకుండకుండ నిశ్చయముగా తీసివేసి నీ దాసునికిచ్చెదను.” (1 రాజు. 11:11) ఎంత విచారకరం! సొలొమోను ఎన్నో విషయాల్లో విజయం సాధించినప్పటికీ, చివరకు యెహోవాను నిరాశపర్చాడు. జీవితంలోని ప్రాముఖ్యమైన రంగంలో అంటే, దేవునికి నమ్మకంగా ఉండే విషయంలో సొలొమోను తప్పిపోయాడు. కాబట్టి, మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవచ్చు: ‘నేను విజయం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు, సొలొమోను జీవితం నుండి నేర్చుకున్న పాఠాన్ని మనసులో ఉంచుకుంటానా?’

జీవితంలో అసలైన విజయం

9. లోకం దృష్టిలో పౌలు విజయం సాధించాడా? వివరించండి.

9 రాజైన సొలొమోను జీవితంతో పోలిస్తే అపొస్తలుడైన పౌలు జీవితం చాలా భిన్నమైనది. పౌలు సొలొమోనులా దంతపు సింహాసనాల మీద కూర్చోలేదు, రాజుల విందుల్లో పాల్గొనలేదు. బదులుగా చాలా సందర్భాల్లో ఆయన ఆకలిదప్పుల్ని, చలిని, దిగంబరత్వాన్ని అనుభవించాడు. (2 కొరిం. 11:24-27) యేసును మెస్సీయగా అంగీకరించాక పౌలు యూదా మతంలో గౌరవనీయమైన హోదాలను వదులుకున్నాడు. యూదా మతనాయకులు ఆయనను ద్వేషించారు కూడా. ఆయనను చెరసాలలో వేశారు, కొరడాలతో, కర్రలతో, రాళ్లతో కొట్టారు. తాను, తన తోటి క్రైస్తవులు దూషణను, హింసను, అవమానాన్ని ఎదుర్కొన్నామని చెబుతూ, “లోకమునకు మురికిగాను, అందరికి పెంటగాను ఇప్పటివరకు ఎంచబడియున్నాము” అని పౌలు అన్నాడు.​—1 కొరిం. 4:11-13.

మానవ దృక్కోణంలో చూస్తే, సౌలు బంగారు భవిష్యత్తుకు బాటలు ఏర్పడినట్లు కనిపించింది

10. పౌలు సువర్ణావకాశాన్ని కాలదన్నాడని ఆయన సమకాలీనులకు ఎందుకు అనిపించి ఉండవచ్చు?

10 పౌలుగా మారిన సౌలు యువకునిగా ఉన్నప్పుడు ఆయన భవిష్యత్తుకు బంగారు బాటలు ఏర్పడినట్లు అనిపించింది. బహుశా ఓ ప్రముఖ కుటుంబంలో పుట్టిన పౌలు అందరి మన్ననలు అందుకున్న గమలియేలు దగ్గర విద్యాభ్యాసం చేశాడు. ఆయన ఆ తర్వాత ఇలా రాశాడు: “నా సమానవయస్కులైన అనేకులకంటె యూదుల మతములో ఆధిక్యతనొందితిని.” (గల. 1:14) హెబ్రీ, గ్రీకు భాషల్ని అనర్గళంగా మాట్లాడే సౌలుకు రోమా పౌరసత్వం ఉండేది. అది ప్రజలు ఎంతగానో కోరుకునే విశేషమైన హోదాల్ని, హక్కుల్ని ఆయనకు కల్పించింది. ఆయన ఆ దారిలో అలాగే కొనసాగివుంటే, బహుశా గొప్ప పేరుప్రతిష్ఠలు సంపాదించుకొని, మంచి ఆర్థిక భద్రతను అనుభవించి ఉండేవాడు. కానీ ప్రజల దృష్టిలో, బహుశా తన బంధువుల దృష్టిలో కూడా వెర్రిగా కనిపించే జీవన విధానాన్ని ఆయన ఎంచుకున్నాడు. ఎందుకు?

11. పౌలు వేటిని అమూల్యంగా ఎంచాడు? ఎలాంటి స్థిరనిశ్చయాన్ని కనబర్చాడు? ఎందుకు?

11 పౌలు యెహోవాను ప్రేమించాడు. అంతేకాక ఆయన డబ్బు, పలుకుబడి కన్నా యెహోవా అనుగ్రహాన్నే ఎక్కువగా కోరుకున్నాడు. పౌలు సత్యం గురించిన ఖచ్చితమైన జ్ఞానాన్ని సంపాదించుకోవడం వల్ల, ప్రపంచం అసలేమాత్రం పట్టించుకోని విమోచన క్రయధనాన్ని, క్రైస్తవ పరిచర్యను, పరలోకంలో జీవించే అవకాశాన్ని చాలా అమూల్యంగా ఎంచాడు. ఓ వివాదాంశం పరిష్కరించబడాల్సి ఉందనే విషయాన్ని కూడా పౌలు గ్రహించాడు. మానవుల్ని దేవునికి దూరం చేయగలనని సాతాను వాదించిన విషయాన్ని ఆయన అర్థంచేసుకొని ఉంటాడు. (యోబు 1:9-11; 2:3-5) నానాకష్టాలు వచ్చినా దేవుని పట్ల నమ్మకంగా ఉంటూ, సత్యారాధనలో కొనసాగాలనే స్థిరనిశ్చయాన్ని పౌలు కనబర్చాడు. అయితే, విజయం వెంట పరుగులు తీసే ప్రజలున్న నేటి ప్రపంచంలో అలాంటి లక్ష్యం మచ్చుకైనా కనిపించదు.

పౌలు అసలైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు

12. మీరు ఎందుకు దేవునిపై నమ్మకం పెట్టుకోవాలని అనుకుంటున్నారు?

12 పౌలుకు ఉన్నటువంటి స్థిరనిశ్చయమే మీకూ ఉందా? యెహోవా పట్ల నమ్మకంగా జీవించడం కొన్నిసార్లు కష్టమనిపించినా, అలా జీవించడం వల్ల ఆయన ఆశీర్వాదాన్ని, అనుగ్రహాన్ని పొందుతామని, అదే జీవితంలో అసలైన విజయమని మనకు తెలుసు. (సామె. 10:22) దానివల్ల మనం ఇప్పుడే కాక భవిష్యత్తులో కూడా ఎన్నో ప్రయోజనాల్ని పొందుతాం. (మార్కు 10:29, 30 చదవండి.) కాబట్టి మనం “అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయచేయు దేవునియందే” నమ్మకం ఉంచాలి. అప్పుడు మనం “వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము, రాబోవు కాలమునకు మంచి పునాది” వేసుకుంటాం. (1 తిమో. 6:17-19) ఇప్పటి నుండి వంద, వెయ్యి, అలా ఎన్నో సంవత్సరాలు గడిచాక కూడా, ఒకసారి గతం గురించి ఆలోచిస్తే ‘నేను జీవితంలో అసలైన విజయాన్ని సొంతం చేసుకున్నాను!’ అని మీరు తప్పక అనుకుంటారు.

మీ ధనం ఎక్కడ ఉంది?

13. ధనసంపదల గురించి యేసు ఏ ఉపదేశమిచ్చాడు?

13 ధనసంపదల గురించి యేసు ఇలా చెప్పాడు: “భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు, తుప్పును తినివేయును, దొంగలు కన్నమువేసి దొంగిలెదరు. పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి; అచ్చట చిమ్మెటయైనను, తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలరు. నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును.”​—మత్త. 6:19-21.

14. ‘భూమ్మీద ధనాన్ని’ సంపాదించుకోవడానికి ప్రాకులాడడం ఎందుకు మూర్ఖత్వం?

14 ‘భూమిమీద ధనము’ అనే మాట ఒక వ్యక్తికున్న డబ్బును మాత్రమే సూచించదు. సొలొమోను ప్రస్తావించినవన్నీ అంటే హోదా, పేరుప్రతిష్ఠలు, అధికారం వంటివి కూడా అందులో భాగమే. నేటి ప్రపంచం వాటన్నిటినీ విజయ సోపానాలుగా ఎంచుతోంది. ప్రసంగి పుస్తకంలో సొలొమోను పేర్కొన్న విషయాన్నే అంటే, ధనసంపదలు శాశ్వతం కాదనే విషయాన్నే యేసు మళ్లీ చెప్పాడు. నిజానికి సిరిసంపదలు తరిగిపోతాయని, ఇట్టే మాయమైపోతాయని బహుశా మీకు కూడా తెలుసు. సిరిసంపదల గురించి ప్రొఫెసర్‌ ఎఫ్‌. డేల్‌ బ్రూనర్‌ ఇలా రాశాడు: ‘పేరుప్రతిష్ఠలు శాశ్వతం కావనేది జగమెరిగిన సత్యం. నిన్నటిదాకా ప్రపంచాన్ని ఉర్రూతలూపిన వ్యక్తి ఇవాళ కనుమరుగైపోతాడు. నేడు కాసులతో కళకళలాడే సంస్థలు రేపు దివాలా తీస్తాయి. [యేసుకు] ప్రజలపై ప్రేమ ఉంది కాబట్టే, ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో తెలియని కీర్తిప్రతిష్ఠల వల్ల వచ్చే తలనొప్పులకు దూరంగా ఉండమని ఆయన ప్రజలకు చెప్పాడు. తన శిష్యులు నిరాశలో కూరుకుపోకూడదని యేసు కోరుకున్నాడు. ఒక వ్యక్తిని ఉన్నత శిఖరాల మీద కూర్చోబెట్టిన లోకమే అతణ్ణి అట్టడుగు స్థాయికి నెట్టేస్తుంది.’ ఆయన చేసిన వ్యాఖ్యలతో చాలామంది ఏకీభవించినా, వాళ్లలో ఎంతమంది ఆ మాటల్లో దాగివున్న వాస్తవాన్ని మనసులో పెట్టుకొని జీవిస్తారు? ఇంతకీ మీరేమి చేస్తారు?

15. మనం ఎలాంటి విజయం కోసం పాటుపడాలి?

15 విజయం కోసం ప్రయాసపడడం తప్పని, అలాంటి ప్రయత్నాల్ని మానుకోవాలని కొంతమంది మతనాయకులు ప్రచారం చేశారు. కానీ, యేసు మాత్రం సరైన విజయం సాధించేందుకు ప్రయత్నించమని అంటే, ‘పరలోకంలో ధనం’ కూర్చుకోవడం కోసం గట్టిగా కృషి చేయమని చెప్పాడు. యెహోవా దృష్టిలో విజయం సాధించడానికి కృషిచేయాలని మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలి. అవును, ఎలాంటి వాటికోసం పాటుపడాలో నిర్ణయించుకునే అవకాశం మన చేతుల్లోనే ఉందని యేసు మాటల్ని బట్టి అర్థమౌతోంది. నిజానికి, మన హృదయంలో ఉన్న దాన్నిబట్టి, మనం అమూల్యంగా ఎంచేవాటిని బట్టి మన కృషి ఉంటుంది.

16. మనం ఏ నమ్మకాన్ని కలిగి ఉండవచ్చు?

16 యెహోవాకు నచ్చే పనులు చేయాలనే కోరిక మనకు ఉంటే, మనకు అవసరమైన వాటిని ఆయన అనుగ్రహిస్తాడనే నమ్మకాన్ని మనం కలిగి ఉండవచ్చు. అపొస్తలుడైన పౌలులాగే మనం కూడా కొన్నిసార్లు ఆకలిదప్పులతో ఉండే పరిస్థితి రావచ్చు. (1 కొరిం. 4:11) అయినా మనం యేసు ఇచ్చిన ఈ జ్ఞానయుక్తమైన సలహాపై పూర్తి నమ్మకం పెట్టుకోవచ్చు: “ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించుకొందుమో అని చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.”​—మత్త. 6:31-33.

దేవుని దృష్టిలో విజయం సాధించండి

17, 18. (ఎ) అసలైన విజయం వేటిపై ఆధారపడి ఉంటుంది? (బి) అది వేటిపై ఆధారపడి ఉండదు?

17 దేవుని దృష్టిలో అసలైన విజయం అనేది ఈ లోకంలో మనం సాధించేవాటిపై, మన హోదాపై ఆధారపడి ఉండదు. అంతేకాక, సంఘంలో మనకున్న బాధ్యతలపై కూడా అది ఆధారపడి ఉండదు. నిజానికి, అలాంటి బాధ్యతలు యెహోవాకు విధేయత చూపిస్తూ ఆయనకు నమ్మకంగా ఉండడం వల్ల వచ్చే ఆశీర్వాదాలు. దేవుడు ఇలా చెబుతున్నాడు: “గృహనిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైనవాడై యుండుట అవశ్యము.” (1 కొరిం. 4:2) మనం అంతం వరకు నమ్మకంగా కొనసాగడం కూడా ప్రాముఖ్యం. ఎందుకంటే, “అంతమువరకును సహించిన వాడు రక్షింపబడును” అని యేసు అన్నాడు. (మత్త. 10:22) రక్షణ పొందడం కన్నా మనం సాధించే అసలైన విజయం ఇంకేదైనా ఉంటుందంటారా?

18 ఇప్పటి వరకు మనం చూసినట్లుగా మనం దేవునికి నమ్మకంగా ఉండాలంటే మనకు పలుకుబడి, విద్య, ఆర్థిక స్థోమత లేదా సమాజంలో హోదా వంటివి ఉండనవసరం లేదు. అంతేకాదు, అలా నమ్మకంగా ఉండడం మన తెలివితేటల మీద, మన సామర్థ్యాల మీద కూడా ఆధారపడి ఉండదు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మనం దేవుని పట్ల నమ్మకంగా ఉండవచ్చు. మొదటి శతాబ్దంలోని దేవుని ప్రజల్లో సంపన్నులతో పాటు పేదవాళ్లు కూడా ఉండేవాళ్లు. “మేలుచేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యముగలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై యుండవలెనని” సంపన్నులకు పౌలు ఇచ్చిన సలహా సముచితమైనదే. “వాస్తవమైన జీవమును” సంపాదించుకునే అవకాశం అటు పేదవాళ్లకు, ఇటు సంపన్నులకు దొరికింది. (1 తిమో. 6:17-19) ఈరోజుల్లో కూడా అది నిజం. మనందరికీ ఒకే రకమైన అవకాశం, ఒకే విధమైన బాధ్యత ఉన్నాయి. అవేమిటంటే మనమందరం నమ్మకంగా కొనసాగాలి, “సత్క్రియలు అను ధనము” గలవారిగా ఉండాలి. మనమలా ఉంటే మన దేవుని దృష్టిలో విజయం సాధిస్తాం, ఆయనకు నచ్చిన పనులు చేశామనే సంతోషాన్ని పొందుతాం.​—సామె. 27:11.

19. విజయం సాధించడానికి సంబంధించి మీరు ఏ కృత నిశ్చయంతో ఉన్నారు?

19 పరిస్థితులన్నీ మన చేతుల్లో ఉండవు కానీ, వాటితో ఎలా వ్యవహరిస్తామన్నది మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా యెహోవా పట్ల నమ్మకంగా ఉండండి. అప్పుడు మీరు ఖచ్చితంగా తగిన ప్రతిఫలం పొందుతారు. యెహోవా మిమ్మల్ని ఇప్పుడూ ఎల్లప్పుడూ మెండుగా ఆశీర్వదిస్తాడనే నమ్మకాన్ని కలిగి ఉండండి. అభిషిక్తులతో యేసు చెప్పిన ఈ మాటల్ని ఎన్నడూ మర్చిపోకండి: “మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీటమిచ్చెదను.” (ప్రక. 2:10) అసలైన విజయం అంటే అదే!