కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఈ లోకంలో ‘యాత్రికులముగా’ ఉందాం

ఈ లోకంలో ‘యాత్రికులముగా’ ఉందాం

‘మీరు పరదేశులును యాత్రికులునై యున్నారు గనుక శరీరాశలను విసర్జించుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.’​—1 పేతు. 2:11, 12.

1, 2. పేతురు ఎవరిని ఉద్దేశించి “ఏర్పరచబడినవారు” అనే మాటను ఉపయోగించాడు? ఆయన వాళ్లను “యాత్రికులు” అని ఎందుకు పిలిచాడు?

 యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణమైన దాదాపు 30 ఏళ్ల తర్వాత అపొస్తలుడైన పేతురు ‘ఏర్పరచబడినవారికి అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియ, బితునియ అనే దేశాల్లో చెదిరి ఉన్న యాత్రికులకు’ ఓ ఉత్తరం రాశాడు. (1 పేతు. 1:1, 2) “ఏర్పరచబడినవారు” అనే పదాన్ని బట్టి చూస్తే, పేతురు తనలా పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన క్రైస్తవులకే ఆ మాటలు రాశాడని తెలుస్తోంది. వాళ్లంతా పరలోకంలో యేసుతో పాటు పరిపాలించేందుకు వీలుగా ‘జీవముతో కూడిన నిరీక్షణ కలుగునట్లు మరల జన్మించిన’ వ్యక్తులే. (1 పేతురు 1:3, 4 చదవండి.) అయితే, వాళ్లు ‘పరదేశులు, యాత్రికులు’ అని పేతురు ఎందుకు అన్నాడు? (1 పేతు. 2:11) పేతురు రాసిన ఆ మాటలు, ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువమంది అభిషిక్తులు మాత్రమే ఉన్న ఈ కాలంలో మనకు ఎలా ప్రయోజనం చేకూరుస్తాయి?

2 “యాత్రికులు” అనే పదం మొదటి శతాబ్దంలోని అభిషిక్తులకు సరిగ్గా సరిపోయింది. ఎందుకంటే అభిషిక్తులు ఈ భూమ్మీద శాశ్వతంగా జీవించరు. ‘చిన్న మందలో’ సభ్యునిగా ఉన్న అపొస్తలుడైన పౌలు దాని గురించి ఇలా వివరించాడు: “మన పౌరస్థితి పరలోకమునందున్నది; అక్కడనుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనియున్నాము.” (లూకా 12:32; ఫిలి. 3:20) అభిషిక్తుల “పౌరస్థితి పరలోకమునందున్నది” కాబట్టి, భూజీవితాన్ని ముగించి వాళ్లు పరలోకానికి వెళ్లినప్పుడు మరింత మెరుగైన జీవాన్ని అంటే అమర్త్యమైన జీవాన్ని పొందుతారు. (ఫిలిప్పీయులు 1:21-23 చదవండి.) అందుకే, సాతాను పరిపాలిస్తున్న ఈ లోకంలో వాళ్లను “యాత్రికులు” అని అనడం సబబే.

3. ‘వేరే గొర్రెల’ విషయంలో ఏ ప్రశ్న ఉత్పన్నమౌతుంది?

3 మరి ‘వేరే గొర్రెల’ విషయమేమిటి? (యోహా. 10:16) వాళ్లకు ఈ భూమ్మీద శాశ్వతంగా జీవించే లేఖనాధారమైన నిరీక్షణ ఉంది. ఈ భూమే వాళ్ల నిత్య ఆవాసం. అయినా, ఒకరకంగా చూస్తే ప్రస్తుతం వాళ్లు కూడా యాత్రికులే. ఎలా?

‘సృష్టి యావత్తు మూలుగుచున్నది’

4. ప్రపంచ నేతలు మానవజాతిని దేని నుండి తప్పించలేకపోతున్నారు?

4 ఈ దుష్ట విధానం ఉన్నంతకాలం, సాతాను తిరుగుబాటు వల్ల వచ్చిన పర్యవసానాలను ప్రతి ఒక్కరూ అనుభవించక తప్పదు. రోమీయులు 8:22లో ఇలా ఉంది: “సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదన పడుచునున్నదని యెరుగుదుము.” ప్రపంచ నేతలు, శాస్త్రవేత్తలు, మానవతావాదులు ఎంత నిజాయితీగా ప్రయత్నించినా ఆ వేదన నుండి మానవజాతిని తప్పించలేకపోతున్నారు.

5. లక్షలాదిమంది 1914 నుండి ఏ నిర్ణయం తీసుకుంటున్నారు? ఎందుకు?

5 అందుకే, 1914 నుండి లక్షలాదిమంది ప్రజలు రాజైన యేసుక్రీస్తు ఆధ్వర్యంలోని దేవుని రాజ్య పౌరులుగా ఉండాలని మనస్ఫూర్తిగా నిర్ణయించుకుంటున్నారు. ఈ దుష్ట లోకంలో భాగంగా ఉండాలనే కోరిక వాళ్లకు లేదు. సాతాను పరిపాలించే ఈ లోకానికి వాళ్లు మద్దతు ఇవ్వరు. బదులుగా వాళ్లు తమ జీవితాల్ని, తమ వనరుల్ని దేవుని సేవ కోసం ఉపయోగిస్తూ దేవుని రాజ్యానికి మద్దతునిస్తారు.​—రోమా. 14:7, 8.

6. యెహోవాసాక్షులు ఒకవిధంగా పరదేశులేనని ఎందుకు చెప్పవచ్చు?

6 ప్రస్తుతం 200 కన్నా ఎక్కువ దేశాల్లో ఉన్న యెహోవాసాక్షులు చట్టాలకు లోబడి జీవిస్తున్నారు. ఏ దేశంలో జీవిస్తున్నా ఒకవిధంగా వాళ్లు పరదేశులే. వాళ్లు రాజకీయ, సామాజిక వ్యవహారాల్లో తటస్థంగా ఉంటారు. తాము ఇప్పటికే దేవుని రాజ్య పౌరులమయ్యామని వాళ్లు భావిస్తున్నారు. ఈ దుష్ట లోకంలో యాత్రికులుగా జీవించే రోజులు త్వరలోనే ముగుస్తాయని తెలుసుకుని వాళ్లు సంతోషిస్తున్నారు.

మనం సాతాను లోకాన్ని కాపాడాలని ప్రయత్నించట్లేదు. దేవుని నూతనలోకం గురించి మనం ప్రకటిస్తున్నాం

7. దేవుని సేవకులు ఎక్కడ, ఎలా శాశ్వత నివాసులౌతారు?

7 క్రీస్తు తన అధికారాన్ని ఉపయోగించి త్వరలోనే సాతాను దుష్ట విధానాన్ని నాశనం చేస్తాడు. పరిపూర్ణమైన క్రీస్తు ప్రభుత్వం ప్రజల పాపాన్ని, బాధను తీసివేస్తుంది. దేవుని సర్వాధిపత్యాన్ని సవాలు చేసిన వాళ్లందరినీ అది నిర్మూలిస్తుంది. నమ్మకమైన దేవుని సేవకులు పరదైసు భూమ్మీద శాశ్వత నివాసులౌతారు. (ప్రకటన 21:1-5 చదవండి.) అప్పుడు సృష్టంతా ‘నాశనమునకు లోనయిన దాస్యములో నుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందే మహిమగల స్వాతంత్ర్యాన్ని’ అనుభవిస్తుంది.​—రోమా. 8:20, 21.

నిజక్రైస్తవులకు ఉండాల్సిన అర్హతలు

8, 9. “శరీరాశలను విసర్జించుడి” అని పేతురు ఎందుకు అన్నాడో వివరించండి.

8 క్రైస్తవులు ఎలా ఉండాలో చెబుతూ పేతురు ఇలా అన్నాడు: ‘ప్రియులారా, మీరు పరదేశులును యాత్రికులునై యున్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.’ (1 పేతు. 2:11, 12) ఆ ఉపదేశాన్ని మొదటిగా ఇచ్చింది అభిషిక్త క్రైస్తవులకే, కానీ అది వేరే గొర్రెలకు కూడా వర్తిస్తుంది.

9 కొన్ని కోరికలను సృష్టికర్త ఉద్దేశించిన రీతిలో తీర్చుకుంటే తప్పులేదు. నిజానికి అవి మన ఆనందానికి తోడ్పడతాయి. ఉదాహరణకు మంచిగా తినడం, త్రాగడం, ఉల్లాసవంతమైన ఆటపాటలతో, మంచి స్నేహితులతో కలిసి సంతోషంగా గడపడం వంటివన్నీ సాధారణమైన కోరికలే. భార్యాభర్తలు లైంగిక కోరికలను తీర్చుకోవడం కూడా సరైనదే, వివాహబంధంలో దాని స్థానం దానికి ఉంటుంది. (1 కొరిం. 7:3-5) అయితే ఈ సందర్భంలో, ‘ఆత్మకు విరోధముగా పోరాడే’ కోరికలను మాత్రమే ఉద్దేశించి పేతురు “శరీరాశలు” అనే మాటను ఉపయోగించాడు. ఆ విషయాన్నే నొక్కిచెబుతూ కొన్ని బైబిలు అనువాదాలు “బలమైన శరీర వాంఛలు” (కింగ్‌జేమ్స్‌ వర్షన్‌) లేదా “పాపపు కోరికలు” (న్యూ ఇంటర్నేషనల్‌వర్షన్‌) అనే పదాలను ఉపయోగించాయి. కాబట్టి, యెహోవా చిత్తానికి విరుద్ధంగా ఉండి, ఆయనతో మనకున్న మంచి సంబంధాన్ని పాడు చేయగల కోరికలను మనం నియంత్రించుకోవాలి. లేకపోతే మనం మన నిత్యజీవ నిరీక్షణను కోల్పోయే ప్రమాదం ఉంది.

10. క్రైస్తవులను తన లోకంలో భాగంగా చేసుకోవడానికి సాతాను ఉపయోగించే కొన్ని పద్ధతులు ఏమిటి?

10 ప్రస్తుత దుష్టలోకంలో ‘యాత్రికులుగా’ ఉండాలన్న నిజక్రైస్తవుల పట్టుదలను నీరుగార్చడమే సాతాను లక్ష్యం. ధన వ్యామోహం, అనైతికత అనే ఉచ్చు, పేరుప్రతిష్ఠల కోసం ప్రాకులాట, అందరికన్నా నేనే ముందు ఉండాలనే స్వార్థం, నరనరాల్లో జీర్ణించుకుపోయిన జాతీయ భావం వంటివన్నీ సాతాను ఒడ్డిన ఉరులేనని మనం గ్రహించాలి. వాటికి దూరంగా ఉండడానికి గట్టిగా కృషి చేయడం ద్వారా మనం సాతాను దుష్టలోకంలో భాగంగా ఉండకూడదని కోరుకుంటున్నట్లు చూపిస్తాం. అలా ఈ లోకంలో మనం యాత్రికులం మాత్రమేనని నిరూపిస్తాం. నీతి నివసించే దేవుని నూతనలోకంలో శాశ్వతంగా జీవించాలని మనం కోరుకుంటున్నాం, దాని కోసమే ప్రయాసపడుతున్నాం.

చక్కని ప్రవర్తన

11, 12. పరదేశుల్ని కొన్నిసార్లు ప్రజలు ఎలా దృష్టిస్తారు? యెహోవాసాక్షుల గురించి ఏమి చెప్పవచ్చు?

11 ‘యాత్రికులైన’ క్రైస్తవులు ఎలా ఉండాలో చెబుతూ 12వ వచనంలో పేతురు ఇంకా ఇలా అన్నాడు: “అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో, ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి, వాటినిబట్టి దర్శనదినమున దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.” యాత్రికులు, పరదేశులు కొన్నిసార్లు దూషణకు గురౌతారు. వాళ్లు తమ ఇరుగుపొరుగు వాళ్లకన్నా భిన్నంగా ఉంటారు కాబట్టి వాళ్లు చెడ్డవాళ్లని ప్రజలు అనుకుంటారు. వాళ్ల మాటలు, చేతలు, దుస్తులు చివరికి వాళ్లు కనిపించే తీరు కూడా ఎంతోకొంత భిన్నంగా ఉంటాయి. అయితే వాళ్లు మంచి పనులు చేసినప్పుడు అంటే చక్కగా ప్రవర్తించినప్పుడు వాళ్ల మీద ప్రజలు వేస్తున్న అభాండాలు నిరాధారమైనవని రుజువౌతాయి.

12 అలాగే ఇతరులతో పోలిస్తే నిజక్రైస్తవులు మాట్లాడే తీరు, వాళ్లు ఎంపికచేసుకునే వినోద కార్యక్రమాలు వంటివి ఎంతో భిన్నంగా ఉంటాయి. అంతేకాక, సమాజంలోని చాలామందితో పోలిస్తే వాళ్ల వస్త్రధారణ, కనిపించే తీరు భిన్నంగా ఉంటాయి. మనం సమాజానికి హాని కలిగించే వ్యక్తులమని కొందరు అపార్థం చేసుకోవడానికి అవి కూడా కారణాలే. అయితే ఇంకొంతమంది మాత్రం యెహోవాసాక్షుల జీవన శైలిని చూసి వాళ్లను ప్రశంసిస్తారు.

13, 14. “జ్ఞానము జ్ఞానమని దాని క్రియలనుబట్టి” ఎలా తీర్పు పొందుతుంది? వివరించండి.

13 అవును, చక్కని ప్రవర్తన విమర్శకుల నోళ్లు మూయిస్తుంది. ఇప్పటివరకు జీవించిన వాళ్లందరిలో దేవునికి పరిపూర్ణ విధేయత చూపించిన యేసును కూడా కొందరు అన్యాయంగా నిందించారు. యేసు “తిండిబోతును, మద్యపానియు, సుంకరులకును పాపులకును స్నేహితుడు” అని కొంతమంది ఆయనను తిట్టారు. అయితే, ఆయన చెడ్డవాడంటూ ప్రత్యర్థులు వేసిన అభాండాలు తప్పని యేసు తన జీవన విధానం ద్వారా నిరూపించాడు. “జ్ఞానము జ్ఞానమని దాని క్రియలనుబట్టి తీర్పుపొందును” అని యేసు అన్నాడు. (మత్త. 11:19) ఆ మాటలు ప్రస్తుతం కూడా వర్తిస్తాయి. ఉదాహరణకు, జర్మనీలోని సెల్టర్స్‌లో ఉన్న బెతెల్‌ గృహంలో సేవచేస్తున్న సహోదరసహోదరీలను స్థానికులు విచిత్రంగా చూడడం మొదలుపెట్టారు. కానీ, ఆ ప్రాంత మేయరు సాక్షుల తరఫున మాట్లాడుతూ ఇలా అన్నాడు: “ఇక్కడ సేవచేస్తున్న సాక్షులకు తమకంటూ సొంత జీవన విధానం ఉంది, కానీ అది సమాజంలోని ఇతరులను ఏమాత్రం ఇబ్బంది పెట్టదు.”

రష్యాకు చెందిన ఈ కుటుంబాన్ని బైబిలు సత్యం ఐక్యం చేసింది

14 రష్యాలోని మాస్కోలో ఉన్న యెహోవాసాక్షుల విషయంలో కూడా ఈ మధ్య అలానే జరిగింది. ఎన్నో తప్పుడు పనులకు పాల్పడ్డారని వాళ్ల మీద అభియోగాలు మోపారు. అయితే ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్‌లో ఉన్న యూరోపియన్‌ కోర్ట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ (ECHR) 2010, జూన్‌లో తీర్పును ఇస్తూ ఈ విధంగా వ్యాఖ్యానించింది: “మతాన్ని అవలంబించడం, స్వేచ్ఛగా కూడుకోవడం వంటివాటిలో యెహోవాసాక్షులకు ఉన్న హక్కు విషయంలో [మాస్కోలోని] అధికారులు జోక్యం చేసుకోవడం న్యాయసమ్మతం కాదు.” ఉదాహరణకు, కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నారని, ఆత్మహత్యలను ప్రేరేపిస్తున్నారని, వైద్య సహాయాన్ని నిరాకరిస్తున్నారని “యెహోవాసాక్షుల మీద మోపిన అభియోగాలను నిరూపించడానికి తగినన్ని రుజువులను స్థానిక కోర్టులు చూపించలేదు. స్థానిక చట్టాలు కఠినంగా ఉండడం వల్ల కోర్టులు యెహోవాసాక్షులపై విధించిన ఆంక్షలు చాలా తీవ్రంగా ఉన్నాయి. న్యాయసమ్మతమైన లక్ష్యాలు సాధిస్తున్నామని వాళ్లు అనుకున్నా, దానికోసం అలా ఆంక్షలు విధించడం మాత్రం సరైనది కాదు” అని కూడా కోర్టు అంది.

లోబడి ఉండాలి

15. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిజక్రైస్తవులు ఏ బైబిలు సూత్రాన్ని పాటిస్తారు?

15 మాస్కోలో అలాగే, ఆయా దేశాల్లో ఉన్న యెహోవాసాక్షులు అపొస్తలుడైన పేతురు చెప్పిన మరో పని కూడా చేస్తారు. “మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడియుండుడి” అని ‘రాజులకు, అధిపతులకు, నాయకులకు లోబడి ఉండుడి’ అని ఆయన ఉపదేశించాడు. (1 పేతు. 2:13, 14) ‘దేవుని వలననే నియమింపబడి ఉన్న అధికారాలకు’ లోబడి ఉండమని పౌలు కూడా ఉపదేశించాడు. నిజక్రైస్తవులు ఈ దుష్టలోకంలో భాగం కాకపోయినా, ఆ సూత్రాన్ని మనసులో ఉంచుకొని ప్రభుత్వాలకు ఇష్టపూర్వకంగా లోబడి ఉంటారు.​—రోమీయులు 13:1, 5-7 చదవండి.

16, 17. (ఎ) మనం ప్రభుత్వ వ్యతిరేకులం కామని ఎందుకు చెప్పవచ్చు? (బి) కొంతమంది రాజకీయ నాయకులు సాక్షుల గురించి ఏమని చెప్పారు?

16 ప్రభుత్వాలను వ్యతిరేకించాలనో లేదా ఇతరుల్ని విమర్శించాలనో యెహోవాసాక్షులు ప్రస్తుత లోకంలో ‘యాత్రికులుగా’ జీవించడం లేదు. ఎవరు అధికారంలో ఉండాలి, మానవుల సమస్యల్ని ఎలా పరిష్కరించాలి వంటి విషయాల్లో ప్రజలకు తమ సొంత అభిప్రాయాలు ఉంటాయని వాళ్లకు తెలుసు. కొన్ని మత గుంపులు రాజకీయాల్లో తలదూరుస్తాయి కానీ యెహోవాసాక్షులు మాత్రం అస్సలు ఆ పని చేయరు. రాజకీయ నాయకుల పరిపాలనా తీరును మార్చడానికి యెహోవాసాక్షులు ఎన్నడూ ప్రయత్నించరు. యెహోవాసాక్షులు ప్రభుత్వానికి ఎదురుతిరుగుతున్నారని లేదా ఎదురుతిరిగేలా ప్రజల్ని ఉసిగొల్పుతున్నారని కొందరు వేసే నిందలు పూర్తిగా నిరాధారమైనవి!

17 “రాజును సన్మానించుడి” అని పేతురు ఇచ్చిన ఉపదేశానికి అనుగుణంగా క్రైస్తవులు ప్రభుత్వ అధికారులకు లోబడుతూ వాళ్లకు తగిన గౌరవమర్యాదల్ని ఇస్తారు. (1 పేతు. 2:17) యెహోవాసాక్షులు సమాజానికి ప్రమాదం తలపెడతారేమో అని భయపడడానికి అసలు ఏ కారణమూ లేదని కొన్నిసార్లు ప్రభుత్వ అధికారులు స్వయంగా ఒప్పుకున్నారు. ఉదాహరణకు, బ్రాడెన్‌బర్గ్‌ రాష్ట్రానికి ఒకప్పుడు మంత్రిగా, ఆ తర్వాత జర్మన్‌ పార్లమెంట్‌ సభ్యునిగా ఉన్న జర్మనీ రాజకీయవేత్త అయిన స్టెఫాన్‌ రైక్‌ ఇలా అన్నాడు: “నిర్బంధ శిబిరాల్లో, జైళ్లలో యెహోవాసాక్షులు చూపించిన ఎన్నో శ్రేష్ఠమైన లక్షణాలు గతంలోలానే నేడు కూడా రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్య దేశ మనుగడకు చాలా అవసరం. నాజీలు ఎంత హింసించినా వాళ్లు విశ్వాసంలో స్థిరంగా నిలబడిన తీరు అలాగే, జైళ్లలో ఉన్న తోటి ఖైదీల పట్ల వాళ్లు చూపించిన కనికరం గమనార్హమైనది. విదేశీయుల పట్ల, రాజకీయ లేదా సైద్ధాంతిక ఆశయాలు కలిగిన వాళ్ల పట్ల హింస పెరుగుతున్న నేపథ్యంలో యెహోవాసాక్షులు కనబర్చిన ఆ లక్షణాలను మన దేశ పౌరులు తప్పనిసరిగా చూపించాలి.”

ప్రేమను చూపించండి

18. (ఎ) మనకు భూవ్యాప్తంగా ఉన్న ‘సహోదరుల పట్ల ప్రేమ’ ఉందని ఎందుకు చెప్పవచ్చు? (బి) సాక్షులుకాని కొంతమంది మన విషయంలో ఏమి గమనించారు?

18 “సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి” అని అపొస్తలుడైన పేతురు ఉపదేశించాడు. (1 పేతు. 2:17) దేవుని మనసును నొప్పించే పనులు చేయాలంటే యెహోవాసాక్షులు భయపడతారు. ఆయన చిత్తాన్ని చేయడానికి అది వారికి మరింత ప్రేరణను ఇస్తుంది. దేవుని మనసును నొప్పించకూడదనే కోరిక ఉన్న ప్రపంచవ్యాప్త సహోదరసహోదరీలతో కలిసి వాళ్లు యెహోవాను సంతోషంగా సేవిస్తున్నారు. అందుకే, యెహోవాసాక్షులకు భూవ్యాప్తంగా ఉన్న ‘సహోదరుల పట్ల ప్రేమ’ ఉంది. స్వార్థంతో నిండిన నేటి సమాజంలో అలాంటి అరుదైన సహోదర ప్రేమను చూసి సాక్షులుకాని ఇతరులు ఆశ్చర్యపోతున్నారు. ఉదాహరణకు, 2009లో జర్మనీలో జరిగిన అంతర్జాతీయ సమావేశానికి వచ్చిన వివిధ దేశాల ప్రతినిధులను యెహోవాసాక్షులు ఆహ్వానిస్తూ చూపించిన ప్రేమాభిమానాలను, సహాయాన్ని చూసి అమెరికా ట్రావెల్‌ ఏజన్సీలో పనిచేస్తున్న ఓ టూర్‌ గైడ్‌ ఆశ్చర్యపోయింది. తాను టూర్‌ గైడ్‌గా పనిచేస్తున్న ఇన్ని సంవత్సరాల్లో ఇలాంటిది ఎన్నడూ చూడలేదని ఆమె చెప్పింది. ఆ తర్వాత మరో యెహోవాసాక్షి ఆమె గురించి ప్రస్తావిస్తూ ఇలా అన్నాడు: “మన గురించి మాట్లాడుతున్నంతసేపూ ఆమె గొంతులో ఎంతో ఆశ్చర్యం, ఉత్సాహం ధ్వనించాయి.” మీరు గతంలో సమావేశానికి హాజరైనప్పుడు, సాక్షులను గమనించిన వాళ్లు మెచ్చుకుంటూ మాట్లాడిన అనుభవం ఏదైనా మీకు ఎదురైందా?

19. మనం ఏమని నిర్ణయించుకోవాలి? ఎందుకు?

19 పైన పేర్కొన్న విధాలుగా, మరితర విధాలుగా యెహోవాసాక్షులు సాతాను దుష్టలోకంలో నిజంగానే ‘యాత్రికులమని’ నిరూపించుకుంటున్నారు. వాళ్లు చివరిదాకా అలాగే కొనసాగాలని సంతోషంగా నిర్ణయించుకున్నారు. నీతి నివసించే దేవుని నూతన లోకంలో త్వరలోనే శాశ్వత నివాసులుగా ఉంటామనే వాళ్ల నిరీక్షణ చాలా బలమైనది. ఆ సమయం కోసం మీరు కూడా వేచి చూస్తున్నారా?