బైబిలును మూఢనమ్మకాలతో ఉపయోగించకండి
‘దేవుని వాక్యము సజీవమైనది, బలముగలది.’ (హెబ్రీ. 4:12) దేవుని వాక్యానికి మనుష్యుల హృదయాల్ని స్పృశించే, జీవితాల్ని మార్చే శక్తి ఉందని ఆ మాటలతో అపొస్తలుడైన పౌలు నొక్కిచెప్పాడు.
ప్రవచించబడినట్లుగానే అపొస్తలులు చనిపోయిన తర్వాత మతభ్రష్టత్వం వ్యాపించింది. దాంతో బైబిలు సందేశానికున్న శక్తి విషయంలో అపోహలు మొదలయ్యాయి. (2 పేతు. 2:1-3) కొంతకాలానికి, చర్చీ నాయకులు దేవుని వాక్యమైన బైబిలుకు మంత్ర శక్తులు ఉన్నాయని బోధించడం మొదలుపెట్టారు. ప్రొఫెసర్ హ్యరీ వై. గ్యాంబల్ “మంత్రశక్తులు ఉన్నాయనే నమ్మకంతో క్రైస్తవ లేఖనాలను ఉపయోగించడం” గురించి రాశాడు. “పరిశుద్ధ వాక్కులు చెవినబడినా చాలు ఎంతోకొంత మేలు జరుగుతుంది: అన్యుల మంత్రాల్లోని మాటలకే శక్తి ఉంటే, లేఖనాల్లోని దైవవాక్కులకు ఇంకెంత శక్తి ఉండాలి!” అని మూడో శతాబ్దంలో చర్చీ ఫాదరైన ఆరిజెన్ చెప్పినట్టు గ్యాంబల్ నివేదించాడు. నాలుగవ శతాబ్దంలో జీవించిన జాన్ క్రిసోస్టమ్ ఇలా రాశాడు: “దయ్యాలు సువార్త పుస్తకం ఉన్న ఇంటి దరిదాపులకు కూడా రావు.” కొంతమంది, సువార్తల్లోని వాక్యాలను చిన్నచిన్న చుట్టలుగా చేసుకుని శక్తివంతమైన తాయెత్తుల్లాగా మెడలో వేసుకునేవాళ్లని కూడా ఆయన నివేదించాడు. “ఒకవేళ తలనొప్పి వస్తే యోహాను సువార్తను తలగడ కింద పెట్టుకుని పడుకోవచ్చనే అభిప్రాయం” క్యాథలిక్ మతనాయకుడైన అగస్టీన్‌కు ఉండేదని ప్రొఫెసర్ గ్యాంబల్ రాశాడు. అలా, మంత్రశక్తుల్ని పొందాలనే ఉద్దేశంతో బైబిలు లేఖనాలను ఉపయోగించేవాళ్లు. మీరు బైబిల్ని కీడు కలగకుండా కాపాడే ఓ తాయెత్తుగా, అదృష్టాన్ని తెచ్చే ఓ వస్తువుగా ఎంచుతారా?
బైబిలు ఉపయోగించే విషయంలో నేడు మరో తప్పుడు పద్ధతి ప్రాచుర్యంలో ఉంది. అదేంటంటే ప్రజలు కళ్లు మూసుకొని బైబిల్లో ఏదో ఒక పుస్తకం తెరుస్తారు, తెరిచీతెరవగానే కంటికి కనిపించే మొదటి వాక్యంలో తమకు కావాల్సిన నిర్దేశం దొరుకుతుందని నమ్ముతారు. ఉదాహరణకు, అగస్టీన్ ఒక సందర్భంలో తన పొరుగు ఇంట్లో ఉన్న ఓ పిల్లవాడు, “తెరిచి చదువు, తెరిచి చదువు” అని అరవడం విన్నాడు. ఆ మాటల్ని, బైబిలు తెరిచి చదవమనే దైవాజ్ఞగా భావించిన అగస్టీన్ వెంటనే తన బైబిలు తెరిచి కంటికి కనబడిన మొదటి వాక్యాన్ని చదివాడని ప్రొఫెసర్ గ్యాంబల్ నివేదించాడు.
కష్టాలు వచ్చినప్పుడు దేవునికి ప్రార్థించి, బైబిల్లో ఏదో ఒక పుస్తకం తెరిచినప్పుడు తమకు మొదట కనిపించిన వాక్యంలో తమ సమస్యకు పరిష్కారం ఉంటుందని నమ్మే ప్రజల గురించి మీరు వినేవుంటారు. సదుద్దేశంతోనే అయినా క్రైస్తవులు లేఖనాలిచ్చే నిర్దేశం కోసం చూడాల్సిన పద్ధతి అది కాదు.
‘ఆదరణకర్తయైన పరిశుద్ధాత్మను’ పంపిస్తానని యేసు తన శిష్యులకు అభయం ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ “సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును” అని కూడా ఆయన అన్నాడు. (యోహా. 14:26) అయితే బైబిల్లో ఏదో ఒక పేజీ తెరిచి కంటికి కనిపించే వాక్యంలో నిర్దేశం వెదికేవాళ్లకు లేఖన పరిజ్ఞానం ఉండదు కాబట్టి వాళ్లకు పరిశుద్ధాత్మ ఎలా జ్ఞాపకం చేస్తుంది?
నేడు చాలామంది ప్రజలు బైబిలును ఉపయోగించడంలో పైన చెప్పినటువంటి మూఢనమ్మకాల్ని పాటిస్తున్నారు. అయితే, అలాంటి పద్ధతులను దేవుని వాక్యం ఖండిస్తోంది. (లేవీ. 19:26; ద్వితీ. 18:9-12; అపొ. 19:19) ‘దేవుని వాక్యము సజీవమైనది, బలముగలదే’ అయినా దాన్ని ఉపయోగించడంలో మనం నైపుణ్యం సంపాదించాలి. బైబిలును ఉపయోగించే విషయంలో మూఢనమ్మకాలను పాటించడం వల్ల కాదు గానీ, బైబిల్లోని ఖచ్చితమైన జ్ఞానాన్ని సంపాదించుకోవడం వల్లే ప్రజల జీవితాలు మెరుగౌతాయి. అలాంటి జ్ఞానాన్ని సంపాదించుకోవడం వల్ల చాలామంది ప్రజలు నైతిక విలువలను పెంపొందించుకున్నారు, హానికరమైన నడవడిని వదిలేశారు, కుటుంబ బాంధవ్యాలను బలపర్చుకున్నారు, బైబిలు గ్రంథకర్తయైన యెహోవాతో మంచి సంబంధాన్ని ఏర్పర్చుకున్నారు.