కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సత్యారాధనలో ఐక్యమైన “యాత్రికులు”

సత్యారాధనలో ఐక్యమైన “యాత్రికులు”

“పరదేశులు మీకు వ్యవసాయకులును, మీ ద్రాక్షతోట కాపరులును అగుదురు. మీరు యెహోవాకు యాజకులనబడుదురు.”​—యెష. 61:5, 6.

1. కొందరు ప్రజలు పరాయి దేశస్థుల్ని ఎలా చూస్తారు? అయితే అది ఎందుకు సరైనది కాదు?

 ‘పరదేశుల్ని’ లేదా ఇతర దేశాల నుండి వచ్చిన ప్రజల్ని కొంతమంది ఇష్టపడరని, పరదేశుల కన్నా తామే మెరుగైన వాళ్లమని వాళ్లు అనుకుంటారని ముందటి ఆర్టికల్‌లో చూశాం. కానీ అలా ఆలోచించడం సరైనది కాదు. పైగా, వాస్తవాలు తెలియని వాళ్లే అలాంటి వైఖరి చూపిస్తారు. ద రేసెస్‌ ఆఫ్‌ మ్యాన్‌కైండ్‌ అనే పుస్తకం ఇలా చెబుతోంది: “భూమ్మీదున్న మనుష్యులందరూ బైబిలు చెబుతున్నట్లు ‘సహోదరసహోదరీలు’ అనే ఒకే ఒక్క జాతికి చెందినవాళ్లు.” సాధారణంగా సహోదర సహోదరీలు ఒకేలా ఉండరు, అయినా వాళ్లు తోబుట్టువులే.

2, 3. యెహోవా పరదేశుల్ని ఎలా దృష్టిస్తాడు?

2 మనం ఏ దేశంలో నివసిస్తున్నప్పటికీ మన మధ్య పరాయి దేశస్థులు ఉంటారు. యెహోవా నిబంధన ప్రజలైన ప్రాచీన ఇశ్రాయేలీయుల మధ్య కూడా పరదేశులు ఉండేవాళ్లు. ఇశ్రాయేలీయులకు ఉన్నన్ని హక్కులు ఆ పరదేశులకు లేకపోయినా వాళ్లను గౌరవించాలని, వాళ్లతో న్యాయంగా వ్యవహరించాలని ధర్మశాస్త్రం నిర్దేశించింది. అది మనకు ఎంత చక్కని పాఠమో కదా! నిజక్రైస్తవులు పక్షపాతం, వివక్ష చూపించకూడదు. ఎందుకు? అపొస్తలుడైన పేతురు ఇలా అన్నాడు: “దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి యున్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.”​—అపొ. 10:34, 35.

3 పరదేశులు ఇశ్రాయేలీయులతో కలిసి ఉన్నందువల్ల ఎన్నో ప్రయోజనాలు పొందారు. దాన్నిబట్టి, పరదేశుల్ని యెహోవా ఎలా దృష్టిస్తాడో అర్థంచేసుకోవచ్చు. ఎన్నో ఏళ్ల తర్వాత, ఆ విషయం గురించే మాట్లాడుతూ అపొస్తలుడైన పౌలు ఇలా అన్నాడు: “దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే.”​—రోమా. 3:29; యోవే. 2:32.

4. ‘దేవుని ఇశ్రాయేలులో’ పరదేశులు లేరని ఎందుకు చెప్పవచ్చు?

4 అయితే, సహజ ఇశ్రాయేలు స్థానంలో అభిషిక్త క్రైస్తవుల సంఘం కొత్త నిబంధన ద్వారా యెహోవాతో ఒక ప్రత్యేకమైన సంబంధంలోకి అడుగుపెట్టింది. అందుకే, బైబిలు వాళ్లను “దేవుని ఇశ్రాయేలు” అని పిలుస్తోంది. (గల. 6:16) పౌలు వివరించినట్లుగా ఈ కొత్త జనాంగంలో “గ్రీసుదేశస్థుడని యూదుడని భేదము లేదు; సున్నతి పొందుటయని సున్నతి పొందక పోవుటయని భేదము లేదు; పరదేశియని సిథియనుడని దాసుడని స్వతంత్రుడని లేదుగాని, క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై యున్నాడు.” (కొలొ. 3:11) కాబట్టి, ఆ భావంలో క్రైస్తవ సంఘంలో పరదేశులు ఎవ్వరూ లేరు.

5, 6. (ఎ) యెషయా 61:​5, 6లోని ప్రవచనం విషయంలో ఏ ప్రశ్న తలెత్తవచ్చు? (బి) ఆ లేఖనంలోని ‘యెహోవా యాజకులు,’ ‘పరదేశులు’ ఎవరు? (సి) ఆ రెండు గుంపుల ప్రజలు ఏ పనిని కలిసి చేస్తారు?

5 అయితే, క్రైస్తవ సంఘంలో ప్రస్తుతం నెరవేరుతున్న యెషయా 61వ అధ్యాయంలోని ప్రవచనం మాటేమిటని కొంతమంది ప్రశ్నిస్తారు. ఆ అధ్యాయంలోని 6వ వచనం ‘యెహోవాకు యాజకులుగా’ సేవచేసే వాళ్ల గురించి ప్రస్తావిస్తోంది. అయితే, ఆ ‘యాజకులకు’ సహకరిస్తూ వాళ్లతో కలిసి పనిచేసే ‘పరదేశుల’ గురించి 5వ వచనం ప్రస్తావిస్తోంది. మరి దాన్ని మనమెలా అర్థంచేసుకోవాలి?

6 ఈ లేఖనంలో ‘యెహోవా యాజకులు’ అనే మాట అభిషిక్త క్రైస్తవులకు వర్తిస్తుందని మనకు తెలుసు. వాళ్లు ‘మొదటి పునరుత్థానంలో పాలుగలిగి, దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేస్తారు.’ (ప్రక. 20:6) అయితే, భూనిరీక్షణ గల నమ్మకమైన క్రైస్తవులు చాలామంది ఉన్నారు. పరలోకంలో సేవ చేయబోయే వాళ్లతో సహవసిస్తూ వాళ్లతో కలిసి పనిచేస్తున్నప్పటికీ ఈ నమ్మకమైన క్రైస్తవులు ఒకరకంగా పరదేశులే. వాళ్లు ‘యెహోవా యాజకులకు’ సంతోషంగా మద్దతును ఇస్తూ, వాళ్లతో కలిసి పనిచేయడం ద్వారా ‘వ్యవసాయకులుగా, ద్రాక్షతోట కాపరులుగా’ సేవచేస్తారు. నిజానికి, ఎల్లప్పుడూ దేవుణ్ణి సేవించాలని కోరుకునే సహృదయుల్ని కనుగొని వాళ్లను ప్రేమతో సంరక్షించే పనిని అభిషిక్తులు, ‘వేరేగొర్రెలు’ కలిసి నిర్వర్తిస్తారు.​—యోహా. 10:16.

అబ్రాహాములాంటి “యాత్రికులు”

7. ఏ విధంగా ఇప్పటి క్రైస్తవులు అబ్రాహాములా, మరితర ప్రాచీనకాల సేవకుల్లా ఉన్నారు?

7 ఈ లోకంలో నిజక్రైస్తవులు పరదేశులని, యాత్రికులని ముందటి ఆర్టికల్‌లో చూశాం. ఒక విధంగా వాళ్లు అబ్రాహాములా, మరితర ప్రాచీనకాల విశ్వాసుల్లా ఉన్నారు. ఆ ప్రాచీన సేవకులు ‘భూమ్మీద పరదేశులుగా, యాత్రికులుగా’ జీవించారని బైబిలు చెబుతోంది. (హెబ్రీ. 11:13) మనకు ఏ నిరీక్షణ ఉన్నా, అబ్రాహాములా దేవునితో స్నేహం చేసే అవకాశం మనలో ప్రతీ ఒక్కరికి ఉంది. “అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను” అని యాకోబు రాశాడు.​—యాకో. 2:23.

8. అబ్రాహాముకు దేవుడు ఏ వాగ్దానం చేశాడు? అబ్రాహాము ఆ వాగ్దాన నెరవేర్పు విషయంలో ఎలా భావించాడు?

8 అబ్రాహాము ద్వారా, ఆయన సంతానం ద్వారా ఏ ఒక్క జనాంగమో కాదుగానీ భూమ్మీది జనాంగాలన్నీ ఆశీర్వదించబడతాయని దేవుడు వాగ్దానం చేశాడు. (ఆదికాండము 22:15-18 చదవండి.) ఆ వాగ్దాన నెరవేర్పు ఎంతో దూరంలో ఉన్నా, అది నెరవేరుతుందని అబ్రాహాము గట్టిగా నమ్మాడు. సగం జీవితానికి పైగా ఆయన తన కుటుంబంతో కలిసి ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి సంచరించడంలోనే గడిపాడు. ఆ సంవత్సరాలన్నిటిలో ఆయన యెహోవాతో తనకున్న స్నేహాన్ని నిలబెట్టుకున్నాడు.

9, 10. (ఎ) మనం ఏయే విషయాల్లో అబ్రాహామును అనుకరించవచ్చు? (బి) మనం ఇతరులకు ఏ ఆహ్వానాన్ని ఇస్తున్నాం?

9 తన నిరీక్షణ నిజమవ్వడం కోసం ఎన్ని సంవత్సరాలు వేచి చూడాలో అబ్రాహాముకు తెలియకపోయినా యెహోవా పట్ల ఆయనకున్న ప్రేమ, భక్తి చెక్కుచెదరలేదు. ఏదో ఒక దేశంలో శాశ్వత నివాసం ఏర్పర్చుకోవాలని కోరుకోకుండా ఆయన దేవుడు చేసిన వాగ్దానంపై మనసు నిలిపాడు. (హెబ్రీ. 11:14, 15) ఆస్తిపాస్తులు, గొప్ప హోదా, పెద్ద ఉద్యోగం వంటివాటి గురించి అతిగా చింతించకుండా, అబ్రాహాములా సరళమైన జీవితాన్ని గడపడం ఎంత జ్ఞానయుక్తమో కదా! త్వరలోనే నాశనం కానున్న ఈ లోకంలో గొప్ప జీవితం కోసం ప్రాకులాడడం ఎందుకు? శాశ్వతంగా ఉండని వాటిపై మమకారం పెంచుకోవడం ఎందుకు? అబ్రాహాము ఉత్తమమైన భవిష్యత్తు కోసం ఎదురుచూశాడు, మనం కూడా అదే చేస్తున్నాం. అంతేకాక, మన నిరీక్షణ నిజమయ్యేంత వరకు ఓపిగ్గా కనిపెట్టుకొని ఉండాలని మనం కోరుకుంటున్నాం.​—రోమీయులు 8:25 చదవండి.

అబ్రాహాములా మీరు కూడా దేవుని వాగ్దానాల నెరవేర్పు కోసం ఎదురుచూస్తారా?

10 అబ్రాహాము సంతానం ద్వారా ఆశీర్వాదాలు పొందమని అన్ని జనాంగాల ప్రజలను యెహోవా ఇంకా ఆహ్వానిస్తూనే ఉన్నాడు. ‘యెహోవాకు యాజకులైన’ అభిషిక్తులు, ‘పరదేశులైన’ వేరేగొర్రెలు ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 600 కన్నా ఎక్కువ భాషల్లో ఆ ఆహ్వానాన్ని అందిస్తున్నారు.

అన్ని దేశాల ప్రజలపై ప్రేమ చూపించండి

11. పరదేశుల గురించి సొలొమోను ఏమి కోరుకున్నాడు?

11 యెహోవా అబ్రాహాముతో చేసిన వాగ్దానానికి అనుగుణంగా యెహోవాను అన్ని జనాంగాల ప్రజలు స్తుతిస్తారని అర్థం చేసుకున్న సొలొమోను, సా.శ.పూ. 1026లో ఆలయ ప్రతిష్ఠాపనప్పుడు యెహోవాకు హృదయపూర్వకంగా ఇలా ప్రార్థించాడు: ‘మరియు ఇశ్రాయేలీయులగు నీ జనుల సంబంధులు కాని పరదేశులు నీ నామమునుబట్టి దూరదేశమునుండి వచ్చి నీ ఘనమైన నామమునుగూర్చియు, నీ బాహుబలమునుగూర్చియు, నీవు చాపిన బాహువు ప్రసిద్ధిని గూర్చియు విందురు. వారు వచ్చి యీ మందిరముతట్టు తిరిగి ప్రార్థన చేసినయెడల ఆకాశమను నీ నివాసస్థలమందు నీవు విని, పరదేశులు నిన్ను వేడుకొను దాని ప్రకారము సమస్తము ననుగ్రహించుము, అప్పుడు లోకములోని జనులందరును నీ నామమును ఎరిగి, ఇశ్రాయేలీయులగు నీ జనులవలెనే నీయందు భయభక్తులు కలిగి ఉందురు.’​—1 రాజు. 8:41-43.

12. యెహోవాసాక్షులు ఏ దేశంలో ఉన్నా ఒక విధంగా పరదేశులేనని ఎందుకు చెప్పవచ్చు?

12 వేరే దేశం నుండి వచ్చి తమ దేశాన్ని సందర్శించే వ్యక్తుల్ని లేదా తమ దేశంలో నివసించే వ్యక్తుల్ని ప్రజలు పరదేశులు అంటారు. ఒక విధంగా యెహోవాసాక్షులు కూడా పరదేశులే. ఎందుకంటే వాళ్లు ఏ దేశంలో ఉన్నా ప్రాథమికంగా క్రీస్తు పరిపాలనలోని దేవుని రాజ్యానికే పౌరులుగా ఉంటారు. యెహోవాసాక్షులు వింత ప్రజలని కొంతమంది అనుకున్నా, వాళ్లు మాత్రం రాజకీయ వ్యవహారాల్లో తటస్థంగా ఉంటారు.

యెహోవా దృష్టిలో ఎవ్వరూ పరదేశులు కారు

13. (ఎ) ‘పరదేశి’ అనే మాట కేవలం ప్రజలు ఇతరుల్ని దృష్టించే విధానం మీదే ఆధారపడి ఉంటుందని ఎందుకు చెప్పవచ్చు? (బి) యెహోవా ఆది సంకల్పంలో స్వదేశీయులు విదేశీయులు అనే తారతమ్యం ఉందా? వివరించండి.

13 సాధారణంగా విదేశీయులను వాళ్ల వేషభాషల్ని, రంగును, వస్త్రధారణను చూసి గుర్తుపట్టవచ్చు. వాళ్ల ఆచారాలు, అలవాట్లు కూడా భిన్నంగా ఉంటాయి. అయితే ప్రాముఖ్యమైన వాటి విషయానికి వస్తే వాళ్లకు, స్థానికులకు పెద్ద వ్యత్యాసం ఉండదు. కాబట్టి నిజానికి, విదేశీయుడు లేదా పరదేశి అంటే కొన్ని విషయాల్లో భిన్నంగా ఉండే వ్యక్తి మాత్రమే. మనకూ పరదేశులకూ మధ్య ఉన్న తేడాలను పక్కనబెట్టడం నేర్చుకుంటే, మనం వాళ్లను “పరదేశులుగా” చూడం. ఒకవేళ భూమ్మీదున్న వాళ్లందరూ ఒకే ప్రభుత్వం లేదా ఒకే దేశం కింద ఉంటే, విదేశీయులు లేదా పరదేశులు అనేవాళ్లు ఎవ్వరూ ఉండరు. నిజానికి, మానవులందరూ ఒకే పరిపాలన కింద జీవించే ఒకే కుటుంబంలా ఐక్యంగా ఉండాలన్నదే యెహోవా ఆది సంకల్పం. భూవ్యాప్తంగా ఉన్న అన్ని జనాంగాలు అలా ఐక్యంగా ఉండడం ఇప్పుడు సాధ్యమౌతుందా?

14, 15. యెహోవాసాక్షులు ఒక గుంపుగా ఏమి సాధించారు?

14 ప్రస్తుత ప్రపంచంలో స్వార్థం, జాతీయ భావం విస్తృతంగా ఉన్నా, దేశాభిమానాన్ని పక్కనబెట్టి ఆలోచించే ప్రజలు కొంతమంది ఉన్నారని తెలుసుకోవడం ఊరటనిస్తుంది. ఓ టీవీ నెట్‌వర్క్‌ వ్యవస్థాపకుడైన టెడ్‌ టర్నర్‌ వివిధ దేశాలకు చెందిన ఎంతోమంది ప్రతిభావంతులతో కలిసి పనిచేసిన తర్వాత ఇలా అన్నాడు: “దేశదేశాల నుండి వచ్చిన ప్రజలతో కలిసి పనిచేయడం ఓ గొప్ప అనుభవం. దానివల్ల, నేను వేరే దేశాలకు చెందిన ప్రజల్ని ‘విదేశీయులుగా’ చూడడం మానేసి, భూమ్మీద ఉన్న తోటి పౌరులుగా చూడడం మొదలుపెట్టాను. ‘విదేశీ’ అనే మాటను ఉపయోగించడం ఇతరులను అవమానపర్చడంతో సమానమని భావించిన నేను, మా ఛానల్‌ ప్రసారాల్లో గానీ, ఉద్యోగుల సంభాషణల్లో గానీ ఆ పదాన్ని ఉపయోగించకూడదని ఒక నియమం విధించాను. ఆ పదానికి బదులు ‘అంతర్జాతీయ’ అనే పదాన్ని వాడమని చెప్పాను.”

15 ప్రపంచమంతటా ఉన్న యెహోవాసాక్షులు ఒక గుంపుగా దేవుని ఆలోచనా తీరును అలవర్చుకున్నారు. వాళ్లు ప్రజల్ని యెహోవా దృక్కోణం నుండి చూడడం నేర్చుకున్నందువల్ల ఇతరుల విషయంలో తమ అభిప్రాయాల్ని, ఆలోచనా విధానాన్ని మార్చుకున్నారు. వాళ్లు వేరే దేశాల ప్రజల మీద అపనమ్మకం లేదా ద్వేషం పెంచుకునే బదులు, ఆ ప్రజల విభిన్నమైన సంస్కృతుల్ని, సామర్థ్యాల్ని గుర్తించి వాటిని ప్రశంసించడం నేర్చుకున్నారు. యెహోవాసాక్షులమైన మనం సాధించిన ఈ గొప్ప విజయం గురించి ఆలోచించారా? ఇతరులతో వ్యవహరించే విషయంలో అది మీకు ఎలా సహాయం చేసిందో గుర్తించారా?

పరదేశులే ఉండని ప్రపంచం

16, 17. ప్రకటన 16:14-16, దానియేలు 2:44 నెరవేరినప్పుడు మీకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి?

16 త్వరలోనే ఈ దేశాలన్నీ దేవుని పరిపాలనకు వ్యతిరేకంగా యేసుక్రీస్తుతో, ఆయన పరలోక సైన్యాలతో పోరాడతాయి. బైబిలు ఆ యుద్ధాన్ని “హార్‌మెగిద్దోను” అని పిలుస్తోంది. (ప్రక. 16:14-16; 19:11-16) దేవుని సంకల్పానికి విరుద్ధంగా పోరాడే మానవ ప్రభుత్వాలకు ఏమి సంభవిస్తుందో చెబుతూ ప్రవక్తయైన దానియేలు 2,500 కన్నా ఎక్కువ సంవత్సరాల క్రితం ఇలా రాశాడు: “ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును.”​—దాని. 2:44.

17 ఆ ప్రవచనం నెరవేరినప్పుడు స్వయంగా మీకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఊహించగలరా? విదేశీయులు స్వదేశీయులు అనే తేడాను సృష్టించే దేశాల సరిహద్దులు చెరిగిపోతాయి. అప్పుడు ప్రజల రూపంలో, ఆకారంలో ఏ తారతమ్యాలున్నా అవి దేవుని సృష్టిలో ఉన్న మనోహరమైన వైవిధ్యానికి అద్దం పడతాయి. ఆ ఉత్తేజకరమైన భవిష్యత్తును మనసులో ఉంచుకుంటే, మనం మన సృష్టికర్తయైన యెహోవా దేవుణ్ణి సాధ్యమైనంత ఎక్కువగా స్తుతిస్తాం, ఘనపరుస్తాం.

దేశ సరిహద్దులనే అడ్డుగోడలు, ‘పరదేశులు’ అసలేమాత్రం ఉండని ప్రపంచం కోసం మీరు ఎదురుచూస్తున్నారా?

18. స్వదేశీయులు, విదేశీయులు అనే తారతమ్యాన్ని చెరిపేసుకోవచ్చని ఈ మధ్యకాలంలో జరిగిన ఏ సంఘటనలు చూపిస్తున్నాయి?

18 భూవ్యాప్తంగా అలాంటి గొప్ప మార్పు జరుగుతుందంటే నమ్మడం కష్టమా? కానే కాదు! అలాంటి మార్పు ఖచ్చితంగా జరుగుతుందని మనం పూర్తిగా నమ్మవచ్చు. ఇప్పటికే యెహోవాసాక్షుల మధ్య స్వదేశీయులు, విదేశీయులు అనే భేదాలు సమసిపోయాయి. తమ మధ్య ఉన్న ప్రజలు ఏ దేశానికి చెందినవాళ్లనే విషయాన్ని వాళ్లు అస్సలు పట్టించుకోరు. ఉదాహరణకు, ఈ మధ్యకాలంలో వాళ్లకు చెందిన ఎన్నో చిన్నచిన్న బ్రాంచి కార్యాలయాలను పెద్ద బ్రాంచీలలో విలీనం చేశారు. పర్యవేక్షణను సులభతరం చేయడం కోసం, రాజ్య సువార్త ప్రకటనా పనిని మరింత సమర్థవంతంగా చేయడం కోసం అలా చేశారు. (మత్త. 24:14) విలీనం తర్వాత, చట్టపరమైన నియమాలు అనుమతించిన మేరకు ఆయా దేశాలకు చెందిన సహోదరసహోదరీలు అందరూ కలిసి పనిచేయడం మొదలుపెట్టారు. మానవులు ఏర్పర్చిన దేశ సరిహద్దుల్ని యెహోవా నియమిత రాజైన యేసుక్రీస్తు చెరిపేస్తున్నాడని, త్వరలోనే ఆయన తన విజయ పరంపరను ముగిస్తాడని చెప్పేందుకు అది మరో రుజువు.​—ప్రక. 6:2.

19. సత్యమనే స్వచ్ఛమైన భాష వల్ల ఏమి సాధ్యమైంది?

19 యెహోవాసాక్షులకు “పవిత్రమైన పెదవులు” ఉన్నాయి, అంటే వాళ్లు ఏ దేశంలో నివసిస్తున్నా ఏ భాష మాట్లాడుతున్నా వాళ్లందరూ సత్యమనే ఒకే ‘స్వచ్ఛమైన భాషను’ మాట్లాడతారు. దానివల్ల వాళ్ల మధ్య చెక్కుచెదరని ఐకమత్యం ఉంది. (జెఫన్యా 3:9 చదవండి.) యెహోవాసాక్షులు ఈ దుష్టలోకంలో జీవిస్తున్నప్పటికీ దానిలో భాగంగా ఉండకుండా ఒక చక్కని అంతర్జాతీయ కుటుంబంగా జీవిస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఐక్య కుటుంబం, అసలు విదేశీయులే ఉండని నూతనలోకానికి ఓ ఛాయ మాత్రమే. “భూమ్మీదున్న మనుష్యులందరూ బైబిలు చెబుతున్నట్లు ‘సహోదరసహోదరీలు’ అనే ఒకే ఒక్క జాతికి చెందినవాళ్లు” అని మొదటి పేరాలో పేర్కొన్న పుస్తకంలోని మాటలు సత్యమని అప్పుడు నూతనలోకంలో జీవించే వాళ్లందరూ సంతోషంగా ఒప్పుకుంటారు.