కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పిల్లలు కావాలనే కోరికతో నేను, నా భార్య సత్యం తెలియకముందు ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌ (IVF) ప్రక్రియను ఆశ్రయించాం. ఫలదీకరణమైన అండాలలో కొన్నిటినే అప్పుడు ఉపయోగించాం, మిగతా వాటిని అతి శీతల వాతావరణంలో భద్రపర్చాం. మరి వాటిని అలాగే భద్రపర్చి ఉంచాలా? లేక పడేయవచ్చా?

ఇది నైతిక విలువలకు సంబంధించిన ఒక పెద్ద సమస్య. ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌ (IVF) లేదా టెస్ట్‌ ట్యూబ్‌ ప్రక్రియను ఆశ్రయించే దంపతులకు ఈ సమస్య ఎదురౌతుంది. అయితే ఏమి చేయాలో దంపతులే నిర్ణయించుకోవాలి, ఈ విషయంలో వాళ్లు యెహోవాకు లెక్క అప్పచెప్పాలి. అయితే, కృత్రిమ గర్భధారణకు ఉపకరించే ఈ ప్రక్రియ గురించి తెలుసుకోవడం కొంత సహాయకరంగా ఉంటుంది.

1978లో మొట్టమొదటిసారిగా ఇంగ్లాండ్‌కు చెందిన ఒక స్త్రీ టెస్ట్‌ ట్యూబ్‌ శిశువుకు జన్మనిచ్చింది. ఆమె అండవాహికలు (ఫెల్లోపియన్‌ ట్యూబ్స్‌) కుచించుకుపోయి, భర్త శుక్రకణాలు ఆమె అండాన్ని చేరుకోకపోవడం వల్ల ఆమె గర్భం దాల్చలేకపోయింది. దాంతో డాక్టర్లు, పరిపక్వం చెందిన ఒక అండాన్ని ఆమె నుండి సేకరించి, ఒక చిన్న గాజు పాత్రలో ఉంచి భర్త శుక్రకణంతో ఫలదీకరణం చెందించారు. దానివల్ల ఏర్పడిన పిండానికి పోషకాలను అందించి వృద్ధిచేసి, దాన్ని తల్లి గర్భాశయంలోకి ప్రవేశపెట్టారు. కొంతకాలానికి ఆమె ఓ ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ ప్రక్రియ జరిగే పద్ధతిలో స్వల్పమైన తేడాలు ఉన్నా, ఈ ప్రక్రియంతటినీ కలిపి ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌ (గాజు పాత్రలో ఫలదీకరణం) అంటారు.

ఈ ప్రక్రియ అన్ని దేశాల్లో ఒకే రకంగా జరగకపోయినా దానిలో ప్రాథమికంగా జరిగేది మాత్రం ఇది: భార్య అండాశయం ఎక్కువ అండాలు తయారు చేసేలా ఆమెకు కొన్ని వారాలపాటు మందులు ఇస్తారు. హస్తప్రయోగం ద్వారా శుక్ర కణాలు ఇవ్వమని భర్తకు సూచిస్తారు. ప్రయోగశాలలో వాటిని శుభ్రపరచి అండాలతో కలుపుతారు. దాంతో ఒకటికన్నా ఎక్కువ అండాలు ఫలదీకరణం చెంది, కణ విభజన మొదలై, అవి మానవ పిండాలుగా ఎదుగుతాయి. ఒక రోజు లేదా కొన్ని రోజుల తర్వాత ఆ పిండాలను నిశితంగా పరిశీలిస్తారు. అప్పుడు ఏ పిండాలు లోపాలతో ఉన్నాయో, ఏవి ఆరోగ్యంగా ఉండి గర్భాశయంలో ఎదగగల సామర్థ్యంతో ఉన్నాయో తెలుస్తుంది. అలాంటి వాటిలో రెండు లేదా మూడు మంచి పిండాలను తీసి ఇంచుమించు మూడవ రోజున తల్లి గర్భంలోకి ప్రవేశపెడతారు, దానివల్ల ఆమె గర్భం ధరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకటి లేదా ఎక్కువ పిండాలు తల్లి గర్భాశయపు గోడకు అతుక్కుంటే ఆమె గర్భవతి అయినట్లే. తగిన సమయంలో ఆమె బిడ్డను కంటుంది.

అయితే తల్లి గర్భంలోకి ప్రవేశపెట్టబడని పిండాల విషయమేమిటి? అలాగే లోపాలున్న లేదా అంతగా ఆరోగ్యంగా లేని పిండాల సంగతేమిటి? వాటిని సంరక్షించకపోతే కొంతకాలానికి అవి నశించిపోతాయి. అందుకే వాటిని అతి తక్కువ ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో ఉన్న నత్రజనిలో భద్రపరుస్తారు. ఎందుకు? ఎందుకంటే మొదటి ప్రయత్నంలో గర్భం రాకపోతే మిగతా అండాలను ఉపయోగించి తక్కువ ఖర్చుతో మళ్లీ గర్భధారణకు ప్రయత్నించవచ్చు. అయితే ఇలాంటి సందర్భాల్లోనే నైతిక విలువలకు సంబంధించిన ప్రశ్నలు తలెత్తుతాయి. పైన పేర్కొన్న ప్రశ్న అడిగిన దంపతుల్లాగే చాలామంది, మిగిలిన అండాలను ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. వాళ్లు తమకు ఇక సంతానం వద్దని అనుకుంటుండవచ్చు. అలాగే మళ్లీ పిల్లల కోసం ప్రయత్నించడానికి ఆ భార్యాభర్తల వయస్సు, వాళ్ల ఆర్థిక స్థితి సహకరించకపోవచ్చు. ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలు పుడతారేమోనని వాళ్లు భయపడుతుండవచ్చు. a లేక భార్యాభర్తల్లో ఒకరు లేదా ఇద్దరూ చనిపోయి ఉండవచ్చు. లేదా వాళ్లు విడిపోయి వేరేవాళ్లను పెళ్లి చేసుకొనివుండవచ్చు. ఇలాంటి ఎన్నో కారణాల వల్ల దంపతులు, ఆ అండాలను భద్రపర్చడానికయ్యే డబ్బును సంవత్సరాల తరబడి చెల్లిస్తూనే ఉంటారు.

మిగిలిన పిండాలను ఏమి చేయాలో తెలియక చాలామంది తీవ్రంగా సతమతమౌతున్నారని పిండోత్పత్తి శాస్త్ర నిపుణుడు ఒకాయన 2008లో ద న్యూయార్క్‌ టైమ్స్‌ వార్తాపత్రికలో పేర్కొన్నాడు. ఆ ఆర్టికల్‌లో ఇంకా ఇలా ఉంది: “భద్రపర్చబడిన పిండాలు దేశం మొత్తం మీద ఇప్పుడు కనీసం 4,00,000 దాకా ఉన్నాయి. వాటి సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది . . . సరైన ఉష్ణోగ్రత వద్ద భద్రపర్చబడిన పిండాలు సుమారు ఒక దశాబ్దం లేదా అంత కంటే ఎక్కువ కాలం వరకు పనికొస్తాయి. కానీ శీతల వాతావరణం నుండి తీసిన తర్వాత వాటిలో చాలామట్టుకు చనిపోతాయి.” (ఇటాలిక్కులు మావి.) అలాంటి పిండాల మనుగడ ప్రశ్నార్థకంగా ఉంది కాబట్టే కొంతమంది క్రైస్తవులు ఆ విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఎందుకు?

ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌ ప్రక్రియలో ఉన్న చిక్కులను ఎదుర్కొంటున్న క్రైస్తవులు ఏమి చేయాలో నిర్ణయించుకోవడానికి మరో రకమైన వైద్య సంబంధమైన పరిస్థితిలో ఉండే చిక్కుల గురించి ఆలోచించవచ్చు. ఉదాహరణకు, ఆరోగ్యం విషమించిన తమ ప్రియమైన వ్యక్తి వెంటిలేటర్‌ వంటి యంత్రాల సహాయంతో బ్రతుకుతున్న సందర్భాల్లో ఒక క్రైస్తవుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు. నిజ క్రైస్తవులు వైద్య సహాయం విషయంలో అస్సలు నిర్లక్ష్యం వహించరు. నిర్గమకాండము 20:13, కీర్తన 36:9 వచనాల్లో ఉన్నట్లుగా వాళ్లు జీవాన్ని ఎంతో విలువైనదిగా ఎంచుతారు. తేజరిల్లు! (ఆంగ్లం) మే 8, 1974 సంచికలో ఇలా ఉంది: ‘జీవం పవిత్రమైనదనే దేవుని అభిప్రాయంపై ఉన్న గౌరవాన్ని బట్టి, తమ మనస్సాక్షిని బట్టి, అలాగే ప్రభుత్వ చట్టాలకు చూపే విధేయతను బట్టి, బైబిలు ప్రమాణాల ప్రకారం జీవించాలని కోరుకునే వాళ్లు కారుణ్య మరణాలకు (positive euthanasia) ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మతించరు.’ కారుణ్య మరణం అంటే ఉద్దేశపూర్వకంగా ఒక రోగి ప్రాణాన్ని తీయడమే. అయితే కొన్ని పరిస్థితుల్లో ప్రియమైన వ్యక్తిని ప్రాణాలతో ఉంచేందుకు అలా యంత్రాల సహాయం తీసుకోవడం తప్ప వేరే మార్గం ఉండకపోవచ్చు. అటువంటప్పుడు ఆ వ్యక్తిని అలా యంత్రాల సహాయంతో బ్రతికించడాన్ని కొనసాగించాలా వద్దా అనేది కుటుంబ సభ్యులే నిర్ణయించుకోవాలి.

నిజమే, ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌ ప్రక్రియను ఆశ్రయించి, ప్రస్తుతం కొన్ని పిండాలను భద్రపర్చిన వాళ్ల పరిస్థితి పైన చెప్పినలాంటిది కాకపోవచ్చు. అలాంటి వాళ్ల ఎదుటున్న ఒక మార్గం ఏమిటంటే, వాళ్లు అతి శీతల వాతావరణం వద్ద ద్రవపు నత్రజనిలో భద్రపర్చిన ఆ పిండాలను బయటకు తీసుకురావడం. అలా చేస్తే అతి శీతల వాతావరణంలో లేని కారణంగా ఆ పిండాలు కొంత సమయం గడిచాక పాడైపోయి, తమలో ఉన్న సామర్థ్యాన్ని కోల్పోతాయి. అయితే ఇలా చేయాలో వద్దో దంపతులే నిర్ణయించుకోవాలి.​—గల. 6:7.

పిల్లలను కనడం కోసం ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌ ప్రక్రియను అంగీకరించిన కొంతమంది దంపతులు, మిగిలిన పిండాలను భద్రపర్చాలని, ముందుముందు పిల్లలను కనడానికి వాటిని ఉపయోగించాలని నిర్ణయించుకోవచ్చు. మరోవైపున కృత్రిమ వాతావరణంలో భద్రపర్చినప్పుడు మాత్రమే సామర్థ్యం కలిగివుండే ఆ పిండాలను అలా భద్రపర్చడం అనవసరమని మరికొంతమంది దంపతులు నిర్ణయించుకోవచ్చు. ఈ విషయంలో దంపతులు తమ బైబిలు శిక్షిత మనస్సాక్షిని ఉపయోగించి ఏ నిర్ణయం తీసుకున్నా, దానికి వాళ్లు దేవుని ముందు బాధ్యత వహించాల్సి ఉంటుంది. వాళ్లు తమ మనస్సాక్షి గాయపడకుండా చూసుకోవాలి, అలాగే ఇతరుల మనస్సాక్షిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.​—1 తిమో. 1:19.

ఈ విషయంలో దంపతులు తమ బైబిలు శిక్షిత మనస్సాక్షిని ఉపయోగించి ఏ నిర్ణయం తీసుకున్నా, దానికి వాళ్లు దేవుని ముందు బాధ్యత వహించాల్సి ఉంటుంది

చాలామంది దంపతులు, “భద్రపర్చిన తమ పిండాలను ఏం చేయాలనే విషయంలో గందరగోళానికి లోనయ్యారు, అది వాళ్లపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది” అని ప్రత్యుత్పత్తి శాస్త్ర నిపుణుడు ఒకాయన పేర్కొన్నాడు. ఆయన ఇలా ముగించాడు: “ఈ విషయంలో సరైన నిర్ణయమంటూ ఏదీ లేదని చాలామంది దంపతులు అనుకుంటున్నారు.”

కాబట్టి, ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌ ప్రక్రియ గురించి ఆలోచిస్తున్న నిజ క్రైస్తవులు దానివల్ల ఉత్పన్నమయ్యే సమస్యల గురించి కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. “బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానములేనివారు యోచింపక ఆపదలో పడుదురు” అని బైబిలు సలహా ఇస్తోంది.​—సామె. 22:3.

బైబిలు అధ్యయనం చేస్తున్న ఓ పెళ్లికాని జంట బాప్తిస్మం పొందాలనుకున్నారు. అయితే, తానుంటున్న దేశంలో అతడు చట్టబద్ధమైన పౌరుడు కాకపోవడం వల్ల అక్కడి ప్రభుత్వం అతని పెళ్లిని అంగీకరించదు. వాళ్లిద్దరూ చట్టపరంగా పెళ్లి చేసుకోవడం కుదరదు. వాళ్లిద్దరూ డిక్లరేషన్‌ ప్లెడ్జింగ్‌ ఫెయిత్‌ఫుల్‌నెస్‌ పత్రం మీద సంతకాలు చేసి బాప్తిస్మం తీసుకోవచ్చా?

ఆ సమస్యకు అది ఒక పరిష్కారంగా కనిపించవచ్చు, కానీ లేఖనాధారంగా అది సరైన పరిష్కారం కాదు. ఎందుకో అర్థంచేసుకోవడం కోసం మనం డిక్లరేషన్‌ ప్లెడ్జింగ్‌ ఫెయిత్‌ఫుల్‌నెస్‌ ప్రమాణపత్రం అసలు ఉద్దేశం ఏమిటో చూద్దాం. అసలు దాన్ని ఎందుకు తయారుచేశారో, దాన్ని ఎలాంటి పరిస్థితుల్లో, ఏయే ప్రాంతాల్లో ఉపయోగిస్తారో పరిశీలిద్దాం.

పెళ్లి చేసుకోవాలనుకుంటున్న స్త్రీపురుషులు లిఖితపూర్వకంగా ఉన్న ఈ దస్తావేజుపై సాక్షుల సమక్షంలో సంతకాలు పెడతారు. అయితే కింద ఉన్న కొన్ని పరిస్థితుల కారణంగా పెళ్లి చేసుకోవడం సాధ్యం కానప్పుడు వాళ్లు ఆ దస్త్రంపై సంతకం పెడతారు. తాము ఒకరిపట్ల ఒకరు నమ్మకంగా ఉంటామని, సాధ్యమైనప్పుడు తమ వివాహాన్ని చట్టబద్ధంగా నమోదు చేసుకుంటామని వాళ్లు ఈ ప్రమాణ పత్రంలో వాగ్దానం చేస్తారు. ఒకరికొకరం నమ్మకంగా ఉంటామని దేవుని ఎదుట, సాక్షుల ఎదుట వాగ్దానం చేసిన వ్యక్తులుగానే సంఘం ఆ జంటను దృష్టిస్తుంది. అలా, ప్రభుత్వ అధికారులు వాళ్ల పెళ్లిని ధ్రువీకరించినట్టుగా క్రైస్తవ సంఘం భావించి వాళ్లతో వ్యవహరిస్తుంది.

ఇంతకీ డిక్లరేషన్‌ ప్లెడ్జింగ్‌ ఫెయిత్‌ఫుల్‌నెస్‌ ప్రమాణపత్రాన్ని ఎందుకు ఉపయోగిస్తారు? ఎప్పుడు ఉపయోగిస్తారు? వివాహ ఏర్పాటు చేసింది యెహోవాయే. ఆయన దాన్ని ఎంతో గౌరవిస్తాడు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ఇలా అన్నాడు: “దేవుడు జతపరచినవారిని మనుష్యుడు వేరుపరచకూడదు.” (మత్త. 19:5, 6; ఆది. 2:22-24) యేసు ఇంకా ఇలా అన్నాడు: “వ్యభిచారము [లైంగిక అనైతికత] నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లిచేసికొనువాడు వ్యభిచారము చేయుచున్నాడు.” (మత్త. 19:9) కాబట్టి విడాకులు తీసుకోవడానికి లేఖనాధారమైన ఒకే ఒక్క కారణం లైంగిక అనైతికత. ఉదాహరణకు, ఒకవేళ భర్త వేరే స్త్రీతో వ్యభిచారానికి పాల్పడితే అతనికి విడాకులు ఇవ్వాలా వద్దా అని అతని భార్య నిర్ణయించుకోవచ్చు. అతనికి విడాకులు ఇచ్చిన తర్వాత, ఆమె ఇంకొకర్ని పెళ్లి చేసుకోవచ్చు.

అయితే కొన్ని దేశాల్లో, ముఖ్యంగా గత కాలాల్లో, విడాకుల విషయంలో బైబిలు ఇచ్చిన స్పష్టమైన ఆ ప్రమాణాన్ని ఆయా దేశాల్లోని ప్రముఖ చర్చీలు అంగీకరించలేదు. బదులుగా, ఏ కారణం వల్ల కూడా విడాకులు తీసుకోరాదని వాళ్లు బోధించారు. అలా చర్చీ అజమాయిషీ ఎక్కువగా ఉన్న కొన్ని దేశాల్లో అక్కడి చట్టాలు, యేసు చెప్పిన సరైన కారణాన్ని బట్టి కూడా విడాకులు తీసుకునే ఏర్పాటును కల్పించడం లేదు. మరికొన్ని దేశాల్లో విడాకుల ఏర్పాటు ఉన్నా, దానికి చాలా పెద్ద తతంగం ఉంటుంది. పైగా చాలా కష్టంతో, ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. విడాకులు తీసుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టవచ్చు. అదంతా చూస్తుంటే, దేవుడు ఆమోదిస్తున్న దాన్ని చర్చీ నాయకులు లేదా ప్రభుత్వాలు ‘అడ్డగిస్తున్నట్లే’ ఉంది.—అపొ. 11:17.

ఉదాహరణకు, ఒక ఒక వివాహిత జంట విడాకులు తీసుకోవడం సాధ్యంకాని దేశంలో లేదా దాన్ని పొందడం చాలా కష్టంగా, బహుశా విడాకులు మంజూరు అవ్వడానికి ఎన్నో ఏళ్లు పట్టే పరిస్థితులు ఉన్న దేశంలో నివసిస్తుండవచ్చు. వాళ్లు తమ పాత వివాహాన్ని చట్టపరంగా రద్దు చేసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేసి, దేవుని దృష్టిలో పెళ్లి చేసుకోవడానికి అర్హులైతే వాళ్లు డిక్లరేషన్‌ ప్లెడ్జింగ్‌ ఫెయిత్‌ఫుల్‌నెస్‌ ప్రమాణ పత్రం మీద సంతకాలు చేయవచ్చు. అటువంటి దేశాల్లో క్రైస్తవ సంఘం దయతో చేసిన ఏర్పాటు అది. అయితే చాలా దేశాల్లో విడాకులు తీసుకోవడం కొంచెం ఖర్చుతో, కష్టంతో కూడుకున్న వ్యవహారమే అయినా ఆయా దేశాల్లో విడాకుల ఏర్పాటు ఉండవచ్చు. అటువంటి చోట్ల ఈ ఏర్పాటు వర్తించదు.

డిక్లరేషన్‌ ప్లెడ్జింగ్‌ ఫెయిత్‌ఫుల్‌నెస్‌ ప్రమాణ పత్రం అసలు ఉద్దేశం ఏమిటో తెలియని కొంతమంది విడాకులు పొందే ఏర్పాటు ఉన్న దేశాల్లోనే జీవిస్తున్నా, విడాకులు పొందడంలో ఉన్న చిక్కులను, ఇబ్బందులను తప్పించుకోవడానికి ఆ ప్రమాణ పత్రం మీద సంతకం చేస్తామని అడిగారు.

పై ప్రశ్నలో ఉన్న సందర్భాన్ని చూస్తే, అనైతికంగా జీవిస్తున్న దంపతులు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. లేఖనాధారంగా చూస్తే వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవడానికి అర్హులే. పైగా ఆ ఇద్దరిలో ఏ ఒక్కరు కూడా తమ మాజీ భర్తకు గానీ భార్యకు గానీ బద్ధులై లేరు. అయితే, అతడు చట్టబద్ధంగా ఆ దేశ పౌరుడు కాడు. అలాంటి వ్యక్తి వివాహాన్ని అక్కడి ప్రభుత్వాలు అంగీకరించవు. (కొన్ని దేశాల్లో, పెళ్లిచేసుకునే వాళ్లలో ఒక్కరు లేదా ఇద్దరూ చట్టబద్ధంగా ఆ దేశ పౌరులు కానప్పటికీ అక్కడి అధికారులు వాళ్ల వివాహాన్ని ఆమోదిస్తారు.) ప్రశ్న లేవనెత్తిన వ్యక్తులు నివసిస్తున్న దేశంలో విడాకులు తీసుకునే ఏర్పాటు ఉంది. కాబట్టి, డిక్లరేషన్‌ ప్లెడ్జింగ్‌ ఫెయిత్‌ఫుల్‌నెస్‌ ప్రమాణపత్రంపై సంతకం చేసే ఏర్పాటు వీళ్లకు వర్తించదు. పైగా వాళ్లిద్దరిలో ఏ ఒక్కరు కూడా విడాకులు తీసుకోవాల్సిన అవసరంలో ఉండి వాటికోసం దరఖాస్తు పెట్టుకొని అవి మంజూరవ్వక సతమతమవుతున్న వాళ్లు కారు. పెళ్లి చేసుకునే స్వేచ్ఛ వాళ్లకు ఉంది. అయితే, అతడు ఆ దేశ చట్టబద్ధమైన పౌరుడు కాదు కాబట్టి వాళ్లిద్దరి ముందు ఏయే అవకాశాలు ఉండవచ్చు? పౌరసత్వం అడ్డంకి కాని వేరే దేశానికి వెళ్లి వాళ్లు పెళ్లి చేసుకోవచ్చు. లేదా ప్రస్తుతం ఉన్న దేశంలోనే చట్టబద్ధంగా పౌరసత్వం పొందడానికి అతడు తగిన చర్యలు తీసుకున్నట్లైతే వాళ్లిద్దరూ ఆ దేశంలోనే పెళ్లి చేసుకోవచ్చు.

అవును, ఆ అవివాహిత జంట దేవుని ప్రమాణాలకు, కైసరు నియమాలకు అనుగుణంగా తమ జీవితాల్ని మలుచుకోవచ్చు. (మార్కు 12:17; రోమా. 13:1) వాళ్లు అలా చేస్తారని ఆశిద్దాం. అప్పుడు వాళ్లు బాప్తిస్మం తీసుకోవడానికి అర్హులు అవుతారు.​—హెబ్రీ. 13:4.

a పిండం ఎదుగుదల సరిగా లేకపోతే లేదా ఒకేసారి ఎక్కువ పిండాలు ఎదుగుతుంటే అప్పుడెలా? ఎదుగుతున్న పిండాన్ని కావాలని చంపేస్తే అది గర్భస్రావమే. ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌ ప్రక్రియవల్ల ఒకేసారి ఎక్కువమంది (ఇద్దరు, ముగ్గురు లేదా ఎక్కువ) పిల్లలను గర్భం ధరించడం సర్వసాధారణం. దానివల్ల నెలలు నిండకముందే పిల్లలు పుట్టడం, ఆ సమయంలో తల్లికి అధికంగా రక్తస్రావం అవడం వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. అలాగే ఎక్కువ పిండాలను గర్భంలో మోస్తున్న తల్లికి, ఆ పిండాల్లో అత్యుత్తమమైన దాన్ని ఉంచుకుని మిగిలిన వాటిని చంపాలనే ఒత్తిడి ఎదురుకావచ్చు. అలా చేయడం ఉద్దేశపూర్వకంగా గర్భస్రావం చేయించుకోవడమే అవుతుంది, అది నరహత్యతో సమానం.​—నిర్గ. 21:22, 23; కీర్త. 139:16.