కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు నమ్మకమైన గృహనిర్వాహకులు

మీరు నమ్మకమైన గృహనిర్వాహకులు

“మీరు మీ సొత్తు కారు.”​—1 కొరిం. 6:19.

1. బానిసత్వం విషయంలో ప్రజల అభిప్రాయం ఏమిటి?

 “బానిస బ్రతుకు బ్రతకడానికి ఏ ఒక్కరూ ఇష్టపడరు.” సుమారు 2,500 సంవత్సరాల క్రితం ఒక గ్రీకు రచయిత అన్న ఆ మాటలతో నేడు చాలామంది ఏకీభవిస్తారు. బానిసత్వం లేదా దాస్యం అనే మాట వినగానే ఘోరమైన అణచివేత, నిర్బంధసేవ వంటివే గుర్తొస్తాయి. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి దాసులు చేసే సేవ వల్ల వాళ్లకు ఎలాంటి మేలు జరుగదు, కలిగే ప్రయోజనమంతా వాళ్ల యజమానులకే.

2, 3. (ఎ) ఇష్టపూర్వకంగా క్రీస్తుకు దాసులైన వాళ్లు ఏమి పొందుతారు? (బి)  గృహనిర్వాహకత్వానికి సంబంధించి మనం ఏ ప్రశ్నల్ని పరిశీలిస్తాం?

2 తన శిష్యులు అల్పులైన పనివారిగా లేదా దాసులుగా ఉంటారని యేసు చెప్పాడు. నిజ క్రైస్తవులు చేసే దాస్యం వాళ్లను ఏమాత్రం కించపర్చదు లేదా అణచివేయదు. బదులుగా అది వాళ్లకు ఘనతను, గౌరవాన్ని ఇస్తుంది. అంతేగాక దానివల్ల వాళ్లు ఇతరుల నమ్మకాన్ని చూరగొంటారు. ఉదాహరణకు, యేసు తన మరణానికి కొన్ని రోజుల ముందు ఒక “దాసుని” గురించి మాట్లాడాడు. ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన ఒక దాసునికి’ కొన్ని పనులు అప్పగిస్తానని ఆయన చెప్పాడు.​—మత్త. 24:45-47.

3 అలాంటి ఉపమానాన్నే మరో సందర్భంలో చెబుతూ యేసు ఆ దాసుణ్ణి “గృహనిర్వాహకుడు” అని పిలిచాడు. (లూకా 12:42-44 చదవండి.) ఇప్పుడున్న చాలామంది క్రైస్తవులు నమ్మకమైన ఆ గృహనిర్వాహకుని తరగతిలో లేరు. అయినా దేవుని సేవ చేస్తున్న వాళ్లందరూ గృహనిర్వాహకత్వాన్ని కలిగివున్నారని లేఖనాలు చూపిస్తున్నాయి. ఆ గృహనిర్వాహకత్వంలో ఎలాంటి బాధ్యతలు ఉన్నాయి? ఆ బాధ్యతల్ని మనం ఎలా ఎంచాలి? ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడానికి మనం ఇప్పుడు ప్రాచీన కాలాల్లోని గృహనిర్వాహకుల గురించి చూద్దాం.

గృహనిర్వాహకులు​—వాళ్ల బాధ్యతలు

4, 5. ప్రాచీన కాలంలోని గృహనిర్వాహకులు ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించేవాళ్లు? ఉదాహరణలు ఇవ్వండి.

4 ప్రాచీన కాలంలో నమ్మకస్థుడైన ఒక దాసుడు తన యజమాని ఇంటికి, వ్యాపారానికి సంబంధించిన పనులు చూసుకుంటూ గృహనిర్వాహకునిగా ఉండేవాడు. గృహనిర్వాహకులకు కొద్దిపాటి అధికారం ఉండేది, దానితోపాటు యజమానికి చెందిన ఆస్తిపాస్తులను, డబ్బును, ఇతర దాసులను చూసుకునే బాధ్యత ఉండేది. అబ్రాహాముకు చెందిన అపారమైన ఆస్తిని చూసుకున్న ఎలీయెజెరు విషయాన్ని పరిశీలిస్తే మనకు ఆ విషయం అర్థమౌతుంది. తన కుమారుడైన ఇస్సాకుకు భార్యను చూడమని అబ్రాహాము బహుశా ఎలీయెజెరునే మెసొపొతమియ ప్రాంతానికి పంపించి ఉంటాడు. అది ఎంత ప్రాముఖ్యమైన బాధ్యతో కదా!​—ఆది. 13:2; 15:2; 24:2-4.

5 అబ్రాహాము మునిమనుమడైన యోసేపు ఐగుప్తులో పోతీఫరు ఇంటికి గృహనిర్వాహకునిగా ఉన్నాడు. (ఆది. 39:1, 2) కొన్నేళ్ల తర్వాత యోసేపు కూడా తన ఇంటి వ్యవహారాలు చూసుకోవడానికి ఒక ‘గృహనిర్వాహకుణ్ణి’ పెట్టుకున్నాడు. యోసేపు 10 మంది సహోదరులు వచ్చినప్పుడు వాళ్లకు ఆతిథ్యం ఏర్పాటు చేసింది ఆ గృహనిర్వాహకుడే. అలాగే ‘దొంగిలించబడిన’ వెండి గిన్నెకు సంబంధించిన వ్యవహారాన్ని కూడా యోసేపు ఆధ్వర్యంలో అతనే నడిపాడు. వీటన్నిటిని చూస్తే గృహనిర్వాహకులను యజమానులు ఎంతగా నమ్మేవాళ్లో అర్థమౌతుంది.​—ఆది. 43:19-25; 44:1-12.

6. క్రైస్తవ పెద్దలకు ఎలాంటి గృహనిర్వాహకపు బాధ్యతలు ఉన్నాయి?

6 క్రైస్తవ పర్యవేక్షకులు ‘దేవుని గృహనిర్వాహకులుగా’ ఉండాలని కొన్ని శతాబ్దాల తర్వాత అపొస్తలుడైన పౌలు రాశాడు. (తీతు 1:7) “దేవుని మందను” కాయడానికి వాళ్లను దేవుడు నియమించాడు కాబట్టి పర్యవేక్షకులు సంఘానికి నిర్దేశమిస్తూ ముందుండి నడిపిస్తారు. (1 పేతు. 5:1, 2) అయితే వాళ్ల బాధ్యతలు ఒకేలా ఉండవు. ఉదాహరణకు చాలామంది క్రైస్తవ పర్యవేక్షకులు ఒకే సంఘంలో సేవచేస్తారు. ప్రయాణ పర్యవేక్షకులు చాలా సంఘాలకు సేవ చేస్తారు. బ్రాంచి కమిటీ సభ్యులైతే దేశంలోని అన్ని సంఘాలకు సంబంధించిన బాగోగులు చూసుకుంటారు. ఏదేమైనా వాళ్లందరూ తమతమ బాధ్యతల్ని నమ్మకంగా నిర్వర్తించాలని దేవుడు కోరుకుంటాడు, వాళ్లందరూ దేవునికి ‘లెక్క అప్పజెప్పాలి.’​—హెబ్రీ. 13:17.

7. ఒక విధంగా క్రైస్తవులందరూ గృహనిర్వాహకులే అని ఎందుకు చెప్పవచ్చు?

7 అయితే, పర్యవేక్షకులుకాని నమ్మకమైన ఇతర క్రైస్తవుల విషయమేమిటి? క్రైస్తవులందరి గురించి మాట్లాడుతూ అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: ‘దేవుని నానావిధమైన కృపవిషయమై మంచి గృహ నిర్వాహకులైయుండి, ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయండి.’ (1 పేతు. 1:1, 2; 4:10) దేవుని కృప వల్ల మనం ఎన్నో వరాలు, వనరులు, సామర్థ్యాలు, నైపుణ్యాలు పొందాం, వాటిని ఉపయోగించి మనం తోటి విశ్వాసులకు మేలు చేయవచ్చు. కాబట్టి దేవుణ్ణి సేవిస్తున్న వాళ్లందరూ గృహనిర్వాహకులే, అలాంటి గృహనిర్వాహకత్వం వల్ల మనకు ఘనత, బాధ్యత వస్తాయి. అంతేకాక దేవుడు మనల్ని నమ్ముతున్నాడని చెప్పడానికి అది ఒక రుజువు.

మనం దేవుని సొత్తు

8. మనం ఏ ప్రాముఖ్యమైన సూత్రాన్ని గుర్తుంచుకోవాలి?

8 గృహనిర్వాహకులుగా క్రైస్తవులందరూ గుర్తుంచుకోవాల్సిన మూడు సూత్రాలను ఇప్పుడు పరిశీలిద్దాం. మొదటిది: మనమందరం దేవుని సొత్తు, మనం ఆయనకు లెక్క అప్పగించాలి. ‘మీరు మీ సొత్తు కారు, మీరు విలువపెట్టి కొనబడినవారు’ అని పౌలు రాశాడు, అవును క్రీస్తు రక్తంతో దేవుడు మనల్ని కొన్నాడు. (1 కొరిం. 6:19, 20) మనం దేవుని సొత్తు కాబట్టి ఆయన ఆజ్ఞలను పాటించాల్సిన బాధ్యత మనకు ఉంది, ఆ ఆజ్ఞలు ఏమాత్రం భారమైనవి కావు. (రోమా. 14:8; 1 యోహా. 5:3) మనం క్రీస్తుకు కూడా దాసులమే. ప్రాచీన కాలంలోని దాసులకు ఉన్నట్లే మనకు కూడా ఎంతో స్వేచ్ఛ ఉంది, అయితే ఆ స్వేచ్ఛకు కొన్ని హద్దులు ఉన్నాయి. మనం మన బాధ్యతలను దేవునికి ఇష్టమైన విధంగా నిర్వహించాలి. మనకు ఎలాంటి ప్రత్యేక సేవా నియామకాలు ఉన్నా మనం దేవునికి, క్రీస్తుకు దాసులమే.

9. యజమానికి, దాసునికి మధ్య ఉండే సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి యేసు ఏ ఉపమానం చెప్పాడు?

9 యజమానికి, దాసునికి మధ్య ఎలాంటి సంబంధం ఉంటుందో యేసు చెప్పిన మాటల నుండి తెలుసుకోవచ్చు. రోజంతా కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన ఒక దాసుని గురించి యేసు ఒక సందర్భంలో తన శిష్యులకు చెప్పాడు. ఆ దాసుణ్ణి చూసి యజమాని “నీవు ఇప్పుడే వెళ్లి భోజనము చేయుము” అని అంటాడా? అనడు. యేసు ఇలా కొనసాగించాడు: “నేను భోజనము చేయుటకు ఏమైనను సిద్ధపరచి, నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొనువరకు నాకు పరిచారము చేయుము; అటుతరువాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పును.” యేసు ఆ ఉపమానాన్ని ఇలా అన్వయించాడు: “అటువలె మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నియు చేసిన తరువాత​—మేము నిష్‌ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసియున్నామని చెప్పుడి.”​—లూకా 17:7-10.

10. మన సేవను యెహోవా విలువైనదిగా ఎంచుతాడని ఎందుకు చెప్పవచ్చు?

10 అయితే యెహోవా మన సేవను విలువైనదిగా ఎంచుతాడు. ‘మీరు చేసిన కార్యమును, తన నామమునుబట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్థుడు కాడు’ అని బైబిలు భరోసా ఇస్తుంది. (హెబ్రీ. 6:10) మనం చేయలేనివాటిని యెహోవా ఎన్నడూ కోరడు. అలాగే ఫలానా పనులు చేయమని యెహోవా చెప్పేది మన ప్రయోజనం కోసమే, అవి మనం మోయలేని భారంగా ఉండవు. యేసు చెప్పినట్లుగా, ఒక దాసుడు తన సొంత ఇష్టాయిష్టాలను పక్కనబెట్టి తన యజమాని ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యతనిస్తాడు. అలాగే దేవునికి సమర్పించుకునేటప్పుడు మనం కూడా మన సొంత ఇష్టాలకు కాకుండా దేవుడు కోరేవాటికే జీవితంలో మొదటిస్థానం ఇవ్వాలని నిర్ణయించుకుంటాం. కాదంటారా?

యెహోవా మనందరి నుండి ఏమి కోరుతున్నాడు?

11, 12. గృహనిర్వాహకులముగా మనకు ఏ లక్షణం ఉండాలి? ఎలాంటి ప్రవర్తనకు దూరంగా ఉండాలి?

11 రెండవ సూత్రం: గృహనిర్వాహకులమైన మనమందరం ఒకేరకమైన ప్రమాణాల ప్రకారం జీవిస్తాం. క్రైస్తవ సంఘంలో కొన్ని రకాల బాధ్యతలను కొంతమంది మాత్రమే నిర్వహిస్తారు. కానీ ఎక్కువ బాధ్యతల్లో అందరూ పాలుపంచుకుంటారు. ఉదాహరణకు క్రీస్తు శిష్యులముగా, యెహోవాసాక్షులముగా మనం ఒకరినొకరం ప్రేమించుకోవడం చాలా ప్రాముఖ్యం. ప్రేమే నిజ క్రైస్తవుల గుర్తింపు చిహ్నం అని యేసు అన్నాడు. (యోహా. 13:35) మనం తోటి విశ్వాసుల్నే కాక, విశ్వాసులుకాని వాళ్లను కూడా ప్రేమించడానికి కృషి చేస్తాం. మనం అలా ప్రేమించగలం, ప్రేమించాలి కూడా.

12 మనం పద్ధతిగా ప్రవర్తించాలి కూడా. దేవుని వాక్యం నిషేధిస్తున్న ప్రవర్తనకు, జీవన విధానానికి దూరంగా ఉండాలని మనం తప్పకుండా కోరుకుంటాం. ఎందుకంటే పౌలు ఇలా రాశాడు: “జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనముగలవారైనను పురుషసంయోగులైనను దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు.” (1 కొరిం. 6:9, 10) దేవుని ప్రమాణాల ప్రకారం జీవించాలంటే గట్టిగా కృషి చేయాల్సి ఉంటుంది. అయితే అలాంటి కృషి వల్ల మంచి ఆరోగ్యం, ఇతరులతో సత్సంబంధాలు, దేవుని ఆమోదం వంటి ప్రయోజనాలు కలుగుతాయి.​—యెషయా 48:17, 18 చదవండి.

13, 14. క్రైస్తవులందరికీ ఏ బాధ్యత ఉంది? దాన్ని మనం ఎలా దృష్టించాలి?

13 ప్రాచీన గృహనిర్వాహకులు ఎన్నో పనులు చేయాల్సి వచ్చేదని కూడా గుర్తుచేసుకోండి. మనకు కూడా ఇప్పుడు ఎన్నో పనులు ఉన్నాయి. సత్యం గురించిన జ్ఞానం అనే అమూల్యమైన బహుమానాన్ని దేవుడు మనందరికీ ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని మనం ఇతరులతో పంచుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. (మత్త. 28:19, 20) పౌలు ఇలా రాశాడు: “ఈలాగున క్రీస్తు సేవకులమనియు, దేవుని మర్మముల విషయములో గృహనిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మును భావింపవలెను.” (1 కొరిం. 4:1) గృహనిర్వాహకత్వంలో భాగంగా ‘దేవుని మర్మాలను’ లేక బైబిలు సత్యాలను కాపాడాలని, యజమానియైన యేసుక్రీస్తు ఆజ్ఞాపించినట్లుగా వాటిని నమ్మకంగా ఇతరులతో పంచుకోవాలని అపొస్తలుడైన పౌలు అర్థంచేసుకున్నాడు.​—1 కొరిం. 9:16.

14 సత్యాన్ని ఇతరులతో పంచుకోవడం నిజానికి ఒక ప్రేమపూర్వకమైన పని. కానీ క్రైస్తవులందరి పరిస్థితులూ ఒకేలా ఉండవు. పరిచర్యలో అందరూ ఒకేలా సమయం వెచ్చించడం కుదరకపోవచ్చు. యెహోవాకు ఆ విషయం తెలుసు. అయితే మనం దేవుని సేవలో చేయగలిగినదంతా చేయడం ప్రాముఖ్యం. అలా దేవుని మీద, పొరుగువాళ్ల మీద మనకున్న నిస్వార్థమైన ప్రేమ చూపిస్తాం.

మన బాధ్యతల్ని నమ్మకంగా నిర్వర్తిద్దాం

నమ్మకంగా ఉండడం ఎందుకు ప్రాముఖ్యం?

15-17. (ఎ) గృహనిర్వాహకుడు ఎందుకు నమ్మకంగా ఉండాలి? (బి) నమ్మకంగా ఉండకపోతే వచ్చే పర్యవసానాలను యేసు ఎలా ఉదహరించాడు?

15 మూడవ సూత్రం కూడా పైనున్న రెండు సూత్రాలతో దగ్గరి సంబంధం కలిగివున్నదే, అది: మనం నమ్మకమైనవారిగా, ఆధారపడదగిన వారిగా ఉండాలి. ఒక గృహనిర్వాహకునికి ఎన్ని మంచి లక్షణాలు, సామర్థ్యాలు ఉన్నా అతను బాధ్యతాయుతంగా, విశ్వసనీయంగా ఉండకపోతే అవన్నీ వ్యర్థం. ఒక వ్యక్తి సమర్థుడైన, విజయవంతమైన గృహనిర్వాహకునిగా ఉండాలంటే నమ్మకంగా ఉండడం చాలా ప్రాముఖ్యం. “గృహనిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైనవాడై యుండుట అవశ్యము” అని పౌలు రాశాడని గుర్తుచేసుకోండి.​—1 కొరిం. 4:2.

16 నమ్మకంగా ఉంటే మనం తప్పకుండా మంచి ఫలితాలు పొందుతాం. మరోవైపు, మనం నమ్మకంగా ఉండకపోతే చాలా కోల్పోతాం. తలాంతులకు సంబంధించి యేసు చెప్పిన ఉపమానంలో ఈ విషయాన్ని మనం గమనించవచ్చు. తన డబ్బుతో నమ్మకంగా ‘వ్యాపారం’ చేసిన దాసుల్ని యజమాని మెచ్చుకోవడమే కాక మరిన్ని బాధ్యతల్ని కూడా ఇచ్చాడు. అయితే తను ఇచ్చిన డబ్బును సరిగ్గా ఉపయోగించని దాసుణ్ణి యజమాని ‘దుష్టునిగా,’ ‘సోమరిగా,’ ‘పనికిమాలిన వాడిగా’ తీర్పు తీర్చాడు. వాడి దగ్గరున్న తలాంతును లాక్కొని, బయటకు గెంటేశారు.​—మత్తయి 25:14-18, 23, 26, 28-30 చదవండి.

17 నమ్మకంగా ఉండకపోతే కలిగే పర్యవసానాల గురించి మరో సందర్భంలో యేసు ఈ ఉపమానం చెప్పాడు. “ఒక ధనవంతునియొద్ద ఒక గృహనిర్వాహకుడుండెను. వాడతని ఆస్తిని పాడుచేయుచున్నాడని అతనియొద్ద వాని మీద నేరము మోపబడగా అతడు వాని పిలిపించి​—నిన్ను గూర్చి నేను వినుచున్న యీ మాట ఏమిటి? నీ గృహనిర్వాహకత్వపు లెక్క అప్పగించుము; నీవు ఇక మీదట గృహనిర్వాహకుడవై యుండ వల్లకాదని వానితో చెప్పెను.” (లూకా 16:1, 2) ఆ గృహనిర్వాహకుడు తన యజమాని ఆస్తిని దుర్వినియోగం చేయడం వల్ల తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. అది మనకు ఓ గుణపాఠం. తనకిచ్చిన పనిని నమ్మకంగా చేయని అలాంటి దాసునిలా మనం ఎన్నడూ ఉండకూడదు.

ఇతరులతో పోల్చుకోవడం సరైనదేనా?

18. మనం ఇతరులతో ఎందుకు పోల్చుకోకూడదు?

18 “నేను నా గృహనిర్వాహకత్వాన్ని ఎలా ఎంచుతున్నాను?” అనే ప్రశ్నను మనలో ప్రతీ ఒక్కరం వేసుకోవాలి. సాధారణంగా మనల్ని మనం ఇతరులతో పోల్చుకున్నప్పుడు సమస్యలు తలెత్తుతాయి. బైబిలు ఇలా ఉపదేశిస్తోంది: “ప్రతివాడును తాను చేయుపనిని పరీక్షించి చూచుకొనవలెను; అప్పుడు ఇతరునిబట్టి కాక తననుబట్టియే అతనికి అతిశయము కలుగును.” (గల. 6:4) కాబట్టి మనం చేసే సేవను ఇతరుల సేవతో పోల్చుకునే బదులు, మనం చేయగలిగినంత చేయడానికి కృషి చేయాలి. అలాగైతే ఎక్కువ చేస్తున్నామని గర్వంతో ఉప్పొంగిపోము లేదా తక్కువ చేస్తున్నామని కృంగిపోము. మన పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి మన సేవలో హెచ్చుతగ్గులు ఉంటాయని గుర్తుంచుకోవాలి. బహుశా అనారోగ్యం, వయసు పైబడడం లేదా ఇతర బాధ్యతల వల్ల మనం ఇదివరకటిలా చేయలేకపోతుండవచ్చు. మరోవైపున మన పరిస్థితులు గతంలోకన్నా కాస్త మెరుగవ్వడం వల్ల మనం ప్రస్తుతం చేస్తున్న దానికన్నా మరింత ఎక్కువ సేవ చేసే అవకాశం ఉండవచ్చు. అలాంటప్పుడు మన సేవను విస్తృతపర్చుకునే ప్రయత్నాలు మొదలుపెడితే బాగుంటుంది కదా.

19. ఒకానొక సేవా నియామకం రాకపోతే మనం ఎందుకు నిరుత్సాహపడకూడదు?

19 మనకు ప్రస్తుతం ఉన్న సేవా అవకాశాల గురించి లేదా మనం ఆశించే సేవా అవకాశాల గురించి కూడా ఆలోచించుకోవాలి. ఉదాహరణకు ఒక సహోదరుడు సంఘ పెద్దగా సేవచేయాలని, సమావేశాల్లో ప్రసంగాలు ఇవ్వాలని కోరుకుంటుండవచ్చు. వాటికోసం తగిన అర్హతల్ని సంపాదించుకోవడానికి కృషి చేయడం మంచిదే కానీ మనం అనుకున్న సమయంలో అలాంటి అవకాశాలు రాకపోతే మనం నిరుత్సాహపడకూడదు. బహుశా మనకు అర్థంకాని కొన్ని కారణాల వల్ల అలాంటి బాధ్యతలు మనం అనుకున్న సమయం కన్నా చాలా ఆలస్యంగా రావచ్చు. ఇశ్రాయేలీయులను నడిపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని మోషే అనుకున్నా, ఆ పని చేయడం కోసం ఆయన 40 సంవత్సరాలు వేచి చూడాల్సి వచ్చిందని జ్ఞాపకం ఉంచుకోండి. ఆయన అలా వేచి చూడడం వల్లే, మొండిగా ఎదురుతిరిగే స్వభావం ఉన్న జనాంగాన్ని నడిపించడానికి కావాల్సిన లక్షణాలను సంపాదించుకోగలిగాడు.​—అపొ. 7:22-25, 30-34.

20. యోనాతాను అనుభవం నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు?

20 కొన్నిసార్లు మనం కోరుకున్న సేవా నియామకం మనకు ఎన్నటికీ రాకపోవచ్చు. యోనాతాను విషయంలో అదే జరిగింది. ఆయన సౌలు కుమారుడు కాబట్టి ఇశ్రాయేలీయుల మీద రాజయ్యే అవకాశం ఆయనకే ఉంది. కానీ యోనాతానుకన్నా వయసులో ఎంతో చిన్నవాడైన దావీదును దేవుడు రాజుగా ఎంపిక చేశాడు. దానికి యోనాతాను ఎలా స్పందించాడు? ఆయన దేవుని నిర్ణయాన్ని అంగీకరించాడు. తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా దావీదుకు సహాయం చేశాడు. “నీవు ఇశ్రాయేలీయులకు రాజవగుదువు, నేను నీకు సహకారినౌదును” అని యోనాతాను దావీదుతో అన్నాడు. (1 సమూ. 23:17) యోనాతాను నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? తాను రాజుగా ఉండబోననే వాస్తవాన్ని ఆయన అంగీకరించాడు. అంతేకాక తన తండ్రియైన సౌలులా యోనాతాను దావీదు మీద అసూయ పడలేదు. కాబట్టి మనం ఇతరులకున్న సేవా నియామకాలను చూసి అసూయపడే బదులు మనకున్న బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించడానికి కృషి చేయాలి. మనలో ప్రతీ ఒక్కరికి ఉన్న సరైన కోరికను యెహోవా తన నూతనలోకంలో తీరుస్తాడనే నమ్మకాన్ని మనం కలిగి ఉండవచ్చు.

21. మన గృహనిర్వాహకత్వాన్ని మనం ఎలా ఎంచాలి?

21 నమ్మకస్థులైన గృహనిర్వాహకులముగా మనం కష్టాలూ కన్నీళ్లతో నిండిన దాస్యంలో లేము కానీ, ఎంతో గౌరవప్రదమైన స్థానంలో ఉన్నాం. ఎందుకంటే ఈ దుష్ట లోకపు అంత్యదినాల తర్వాత మళ్లీ జరగని సువార్త ప్రకటనా పనిలో పాల్గొనే బాధ్యతను దేవుడు మనకు అప్పగించాడు. ఆ పనిలో పాల్గొంటుండగా మన బాధ్యతల్ని నిర్వర్తించే విషయంలో మనం ఎంతో స్వేచ్ఛను ఆస్వాదిస్తాం. కాబట్టి మనం నమ్మకస్థులైన గృహనిర్వాహకులముగా ఉందాం. అంతేగాక విశ్వంలోనే అత్యున్నత వ్యక్తిని సేవించే అవకాశాన్ని అమూల్యంగా ఎంచుదాం.