ధైర్యంగా ఉండండి, యెహోవా మీకు తోడుగా ఉన్నాడు
‘నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి, మీ దేవుడైన యెహోవా మీకు తోడుగా ఉన్నాడు.’—యెహో. 1:9.
1, 2. (ఎ) శ్రమలను తాళుకోవాలంటే మనకు ఏ లక్షణాలు అవసరం? (బి) విశ్వాసం అంటే ఏమిటి? వివరించండి.
యెహోవా సేవ మనకు ఎంతో సంతోషాన్నిస్తుంది. అయినా, సాధారణంగా మనుష్యులందరికీ వచ్చే కష్టాలు మనకు కూడా వస్తాయి. అంతేకాక, మనం ‘నీతి నిమిత్తం శ్రమలు’ అనుభవించే అవకాశం ఉంది. (1 పేతు. 3:14; 5:8, 9; 1 కొరిం. 10:13) అలాంటి శ్రమల్ని విజయవంతంగా తాళుకోవాలంటే మనకు విశ్వాసం, ధైర్యం అవసరం.
2 ఇంతకీ విశ్వాసం అంటే ఏమిటి? అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునైయున్నది.” (హెబ్రీ. 11:1) “నిజస్వరూపము” అని అనువదించబడిన గ్రీకు పదాన్ని సాధారణంగా వ్యాపార దస్తావేజుల్లో ఉపయోగించేవాళ్లు. ఫలానాది భవిష్యత్తులో ఒక వ్యక్తికి చెందుతుందనే భరోసాను ఇవ్వడానికి ఆ పదాన్ని వాడేవాళ్లు. అలాగే, దేవుడు తన వాగ్దానాలను నెరవేరుస్తాడని విశ్వసించే వాళ్లు తాము నిరీక్షించే వాటిని పొందుతామనే భరోసాను కలిగి ఉండవచ్చు. అవును, మనకు విశ్వాసం ఉంది కాబట్టి బైబిలు వాగ్దానాల నెరవేర్పును ఖచ్చితంగా చూస్తామని, దేవుడు చెప్పేవన్నీ అంటే ప్రస్తుతం మనకు ‘అదృశ్యంగా’ ఉన్నవి కూడా సత్యమేనని మనం నమ్ముతున్నాం.
3, 4. (ఎ) ధైర్యం అంటే ఏమిటి? (బి) మనం విశ్వాసాన్ని, ధైర్యాన్ని ఎలా పెంచుకోవచ్చు?
3 “అడ్డంకులు, ప్రమాదాలు ఎదురైనా నిర్భయంగా మాట్లాడేలా, ప్రవర్తించేలా చేసే ఆధ్యాత్మిక, భావోద్వేగ, నైతిక బలమే ధైర్యం.” (ద న్యూ ఇంటర్ప్రిటర్స్ డిక్షనరీ ఆఫ్ ద బైబిల్) ధైర్యం ఉంటే మనం ఏ మాత్రం భయం, బెరుకు లేకుండా నిబ్బరంగా వ్యవహరిస్తాం.—మార్కు 6:49, 50; 2 తిమో. 1:7.
4 విశ్వాసం, ధైర్యం అనేవి మనకు ఉండాల్సిన ప్రాముఖ్యమైన లక్షణాలు. ఒకవేళ మనకు మరింత విశ్వాసం, ధైర్యం అవసరమని గ్రహిస్తే మనం ఏమి చేయాలి? ఈ లక్షణాలను చూపించడంలో మనకు ఆదర్శంగా నిలిచిన చాలామంది స్త్రీపురుషుల గురించి బైబిలు ప్రస్తావిస్తోంది. అలాంటి కొందరి గురించి పరిశీలిస్తే మనం విశ్వాసాన్ని, ధైర్యాన్ని పెంచుకోవచ్చు.
యెహోవా యెహోషువకు తోడుగా ఉన్నాడు
5. ఇశ్రాయేలీయుల్ని సమర్థవంతంగా నడిపించాలంటే యెహోషువకు ఏమి అవసరం?
5 సుమారు 35 శతాబ్దాల క్రితం జరిగిన ఓ సంఘటన గురించి ఇప్పుడు చూద్దాం. లక్షలమంది ఇశ్రాయేలీయులు యెహోవా శక్తివంతమైన బాహువు వల్ల ఐగుప్తు బానిసత్వం నుండి విడుదలై అప్పటికి నలభై సంవత్సరాలు గడిచాయి. అప్పటి వరకు వాళ్లను నడిపించిన మోషే 120 ఏళ్ల వయసులో నెబో పర్వత శిఖరం మీద నుండి వాగ్దాన దేశాన్ని చూశాడు, ఆ తర్వాత అక్కడే చనిపోయాడు. ఆయన తర్వాత, ‘జ్ఞానాత్మపూర్ణుడైన’ యెహోషువ నాయకుడయ్యాడు. (ద్వితీ. 34:1-9) ఆ సమయానికి ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్లను సమర్థవంతంగా నడిపించాలంటే యెహోషువకు దేవుడిచ్చే జ్ఞానం అవసరం. అంతేకాక, ఆయన యెహోవాపై విశ్వాసం చూపించాలి, నిబ్బరం కలిగి ధైర్యంగా వ్యవహరించాలి.—ద్వితీ. 31:22, 23.
6. (ఎ) ఏ విషయంలో ధైర్యం చూపించమని యెహోషువ 23:6 చెబుతోంది? (బి) అపొస్తలుల కార్యములు 4:18-20; 5:29 నుండి మనం ఏమి నేర్చుకుంటాం?
6 కనాను దేశాన్ని హస్తగతం చేసుకోవడానికి ఎన్నో సంవత్సరాల పాటు చేసిన యుద్ధాల్లో యెహోషువ చూపించిన జ్ఞానాన్ని, ధైర్యాన్ని, విశ్వాసాన్ని చూసి ఇశ్రాయేలీయులు ఎంతో బలాన్ని పొందివుంటారు. ఇశ్రాయేలీయులకు యుద్ధంలో పోరాడడానికే కాదు, దేవునికి లోబడడానికి కూడా ధైర్యం అవసరమైంది. తాను చనిపోవడానికి కొంతకాలం ముందు యెహోషువ ఇశ్రాయేలీయులతో ఇలా అన్నాడు: ‘మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడిన వాటినన్నిటినీ గైకొని అనుసరించుటకు మనస్సు దృఢము చేసికొని, ఎడమకు గాని కుడికి గాని దానినుండి తొలగిపోకూడదు.’ (యెహో. 23:6) యెహోవాకు ఎల్లవేళలా విధేయత చూపించాలంటే మనకు కూడా ధైర్యం అవసరం. కొన్ని సందర్భాల్లో, దేవుని చిత్తానికి వ్యతిరేకమైన పనుల్ని చేయమని మనుష్యులు మనల్ని ఆజ్ఞాపించవచ్చు. (అపొస్తలుల కార్యములు 4:18-20; 5:29 చదవండి.) మనం యెహోవా మీద ఆధారపడితే, ధైర్యంగా వ్యవహరించడానికి ఆయన మనకు సహాయం చేస్తాడు.
మన మార్గాన్ని ఎలా వర్ధిల్లజేసుకోవచ్చు?
7. ధైర్యంగా వ్యవహరించడానికి, తన మార్గాన్ని వర్ధిల్లజేసుకోవడానికి యెహోషువ ఏమి చేయాలని యెహోవా చెప్పాడు?
7 దేవుని చిత్తం చేయడానికి కావాల్సిన ధైర్యాన్ని సంపాదించుకోవాలంటే మనం ఆయన వాక్యాన్ని అధ్యయనం చేయాలి, నేర్చుకున్నవాటిని అన్వయించుకోవాలి. మోషే తర్వాతి నాయకునిగా యెహోషువను నియమిస్తున్నప్పుడు యెహోవా ఆయనకు ఇలా చెప్పాడు: “నీవు నిబ్బరముగలిగి జాగ్రత్తపడి బహు ధైర్యముగానుండి, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. . . . ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్తపడునట్లు దివారాత్రము దాని ధ్యానించినయెడల నీ మార్గమును వర్ధిల్లజేసికొని చక్కగా ప్రవర్తించెదవు.” (యెహో. 1:7, 8) యెహోషువ ఆ ఉపదేశాన్ని పాటించి, ‘తన మార్గాన్ని వర్ధిల్లజేసుకున్నాడు.’ యెహోషువను అనుకరిస్తే, మనం కూడా మరింత ధైర్యంగా ఉండగలుగుతాం, యెహోవా సేవలో వర్ధిల్లగలుగుతాం.
2013 వార్షిక వచనం: నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి, మీ దేవుడైన యెహోవా మీకు తోడుగా ఉన్నాడు.—యెహోషువ 1:9
8. ఏ లేఖనం నుండి 2013 వార్షిక వచనాన్ని తీసుకున్నారు? ఆ లేఖనంలోని మాటలు మీకెలా సహాయం చేస్తాయని మీరనుకుంటున్నారు?
8 యెహోవా ఆ తర్వాత చెప్పిన ఈ మాటలు యెహోషువకు మరింత బలాన్నిచ్చి ఉంటాయి: “నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము, దిగులుపడకుము జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును.” (యెహో. 1:9) యెహోవా మనకు కూడా తోడుగా ఉన్నాడు. కాబట్టి, ఎలాంటి శ్రమలు వచ్చినా మనం ‘దిగులుపడాల్సిన, జడియాల్సిన’ అవసరం లేదు. ‘నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి, మీ దేవుడైన యెహోవా మీకు తోడుగా ఉన్నాడు’ అనే మాటలు గమనార్హం. అందుకే యెహోషువ 1:9లోని ఆ మాటల్నే 2013 వార్షిక వచనంగా ఎంపిక చేశాం. ఆ మాటలు, అలాగే విశ్వాసధైర్యాలు చూపించిన ఇతర వ్యక్తుల మాటలు, పనులు రానున్న నెలల్లో మనల్ని తప్పక బలపరుస్తాయి.
వాళ్లు ధైర్యంగా నిలబడ్డారు
9. రాహాబు ఏయే విధాలుగా విశ్వాసాన్ని, ధైర్యాన్ని చూపించింది?
9 యెహోషువ ఇద్దరు వేగుల వాళ్లను కనాను దేశానికి పంపించినప్పుడు రాహాబు అనే వేశ్య వాళ్లను దాచిపెట్టి, శత్రువుల్ని తప్పుదోవ పట్టించింది. ఆమె విశ్వాసంతో, ధైర్యంతో ప్రవర్తించినందువల్ల యెరికో పట్టణం నాశనమైనప్పుడు ఆమె, ఆమె ఇంటివాళ్లు తమ ప్రాణాల్ని దక్కించుకున్నారు. (హెబ్రీ. 11:30, 31; యాకో. 2:25) యెహోవాను ప్రీతిపర్చడం కోసం రాహాబు ఆ తర్వాత తన పాత జీవితాన్ని వదిలేసింది. మన కాలంలో కూడా క్రైస్తవులుగా మారిన కొంతమంది విశ్వాసాన్ని, ధైర్యాన్ని, నైతిక బలాన్ని చూపించి దేవుణ్ణి సంతోషపెట్టడం కోసం తమ పాత జీవితాల్ని వదిలేశారు.
10. ఎలాంటి పరిస్థితుల్లో రూతు సత్యారాధన పక్షాన నిలబడింది? దానివల్ల ఆమె ఎలాంటి ఆశీర్వాదాల్ని పొందింది?
10 యెహోషువ మరణం తర్వాత, మోయాబీయురాలైన రూతు సత్యారాధన పక్షాన ధైర్యంగా నిలబడింది. చనిపోయిన ఆమె భర్త ఇశ్రాయేలీయుడు కాబట్టి ఆమెకు యెహోవా గురించి ఎంతోకొంత తెలిసే ఉంటుంది. విధవరాలైన ఆమె అత్త నయోమి మోయాబు దేశాన్ని విడిచి ఇశ్రాయేలులోని బేత్లెహేముకు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకుంది. తన ప్రజల దగ్గరికి వెళ్లిపొమ్మని మార్గం మధ్యలో రూతును నయోమి బ్రతిమిలాడింది. కానీ, రూతు ఇలా అంది: ‘నా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టుమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు.’ (రూతు 1:16) రూతు తన మాటకు కట్టుబడింది. కొంతకాలానికి, నయోమికి బంధువైన బోయజు రూతును పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత రూతు ఒక మగ శిశువుకు జన్మనిచ్చింది. అలా ఆమె దావీదుకు, యేసుకు పూర్వీకురాలైంది. అవును విశ్వాసం, ధైర్యం చూపించిన వాళ్లను యెహోవా ఆశీర్వదిస్తాడు.—రూతు 2:12; 4:17-22; మత్త. 1:1-6.
ఎంతోమంది తమ ప్రాణాల్ని పణంగా పెట్టారు
11. యెహోయాదా, యెహోషెబ ఎలా ధైర్యం చూపించారు? దానివల్ల ఏమి సాధ్యమైంది?
11 సొంత శ్రేయస్సు కన్నా యెహోవా సేవ కోసం, తోటి విశ్వాసుల సంక్షేమం కోసం పాటుపడే వాళ్లకు యెహోవా తోడుగా ఉన్నాడని తెలుసుకున్నప్పుడు మన ధైర్యం, విశ్వాసం రెట్టింపు అవుతాయి. ఉదాహరణకు ప్రధానయాజకుడైన యెహోయాదా, ఆయన భార్య యెహోషెబ విషయమే తీసుకోండి. రాజైన అహజ్యా చనిపోయిన తర్వాత ఆయన తల్లియైన అతల్యా యోవాషును తప్ప రాజకుమారులందరినీ చంపించి సింహాసనాన్ని చేజిక్కించుకుంది. కానీ యెహోయాదా, యెహోషెబ తమ ప్రాణాలకు తెగించి అహజ్యా కుమారుడైన యోవాషును కాపాడి ఆరు సంవత్సరాల పాటు అతణ్ణి దాచిపెట్టారు. యెహోయాదా ఏడవ సంవత్సరంలో యోవాషును రాజుగా ప్రకటించి, అతల్యాను చంపించాడు. (2 రాజు. 11:1-16) యెహోయాదా ఆ తర్వాత, ఆలయ మరమ్మతు పనుల్లో రాజైన యోవాషుకు మద్దతిచ్చాడు. యెహోయాదా “ఇశ్రాయేలీయులలో దేవుని దృష్టికిని తన యింటివారి దృష్టికిని మంచివాడై ప్రవర్తించెను” గనుక 130 ఏళ్ల వయసులో చనిపోయినప్పుడు ఆయనను ‘రాజుల దగ్గర పాతిపెట్టారు.’ (2 దిన. 24:15, 16) అంతేకాక యెహోయాదా, ఆయన భార్య పరాక్రమంతో చేసిన ఆ పని వల్ల మెస్సీయ రావాల్సిన దావీదు రాజవంశం కాపాడబడింది.
12. ఎబెద్మెలెకు ఎలా ధైర్యం చూపించాడు?
12 రాజైన సిద్కియా గృహంలో అధికారిగా ఉన్న ఎబెద్మెలెకు తన ప్రాణాలను లెక్కచేయకుండా యిర్మీయాను కాపాడాడు. రాజు యిర్మీయాను యూదా ప్రధానులకు అప్పగించాడు. తిరుగుబాటు చేస్తున్నాడనే నేరం మోపి వాళ్లు యిర్మీయాను చంపేందుకు బురదతో నిండిన గోతిలో పడేశారు. (యిర్మీ. 38:4-6) యిర్మీయాను ద్వేషిస్తున్న ఆ ప్రధానుల వల్ల తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా ఎబెద్మెలెకు యిర్మీయా ప్రవక్త గురించి రాజు దగ్గర విన్నవించుకున్నాడు. సిద్కియా అందుకు సమ్మతించి, 30 మంది మనుష్యులను వెంటబెట్టుకొని వెళ్లి యిర్మీయాను కాపాడమని ఎబెద్మెలెకుకు చెప్పాడు. బబులోనీయులు యెరూషలేమును నాశనం చేసేటప్పుడు ఎబెద్మెలెకు ప్రాణాల్ని కాపాడతానని యెహోవా యిర్మీయా ద్వారా అభయమిచ్చాడు. (యిర్మీ. 39:15-18) తన చిత్తం చేయడానికి ధైర్యం చూపించే వాళ్లను యెహోవా ఆశీర్వదిస్తాడు.
13. ముగ్గురు హెబ్రీయులు ఎలా ధైర్యం చూపించారు? వాళ్ల అనుభవం నుండి మనమెలాంటి ప్రయోజనం పొందవచ్చు?
13 విశ్వాసం, ధైర్యం చూపిస్తే యెహోవా తప్పక ఆశీర్వదిస్తాడని సా.శ.పూ. ఏడవ శతాబ్దంలో యెహోవా సేవకులుగా ఉన్న ముగ్గురు హెబ్రీయులు స్వయంగా తెలుసుకున్నారు. రాజైన నెబుకద్నెజరు బబులోను అధికారులను సమావేశపర్చి ఒక బంగారు ప్రతిమకు మొక్కాలని ఆజ్ఞాపించాడు. అలా చేయనివాళ్లు అగ్ని గుండంలో పడవేయబడతారని కూడా ఆయన చెప్పాడు. అప్పుడు, ఆ ముగ్గురు హెబ్రీయులు గౌరవపూర్వకంగా నెబుకద్నెజరుతో ఇలా అన్నారు: “మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల యీ అగ్నిగుండములోనుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు; మరియు నీ వశమున పడకుండ ఆయన మమ్మును రక్షించును; ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు, నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలిసికొనుము.” (దాని. 3:16-18) ఆ ముగ్గురిని దేవుడు అద్భుతరీతిలో ఎలా కాపాడాడో దానియేలు 3:19-30 వచనాల్లో సవివరంగా ఉంది. వాళ్లకు ఎదురైనటువంటి ప్రాణాపాయ పరిస్థితి మనకు ఎదురుకాకపోయినా, మనం కూడా యథార్థతకు సంబంధించిన పరీక్షల్ని ఎదుర్కొంటాం. అలాంటి సమయాల్లో మనం విశ్వాసం, ధైర్యం చూపిస్తే యెహోవా తప్పక ఆశీర్వదిస్తాడు.
14. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం ప్రకారం దానియేలు ఎలా ధైర్యం చూపించాడు? దాని ఫలితమేమిటి?
14 దానియేలు కూడా విశ్వాసం, ధైర్యం చూపించాడు. “నీయొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవునియొద్దనైనను ఎవడును ఏ మనవియు చేయకూడదు; ఎవడైనను చేసినయెడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును” అనే ఓ ఆజ్ఞను జారీ చేయమని ఒక సందర్భంలో దానియేలు శత్రువులు వచ్చి రాజైన దర్యావేషును అభ్యర్థించారు. శాసనం మీద రాజు సంతకం చేశాడని దానియేలుకు తెలిసినా ఆయన “తన యింటికి వెళ్లి, యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్లూని, తన యింటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడియుండగా తన దేవునికి ప్రార్థనచేయుచు ఆయనను స్తుతించుచువచ్చెను.” (దాని. 6:6-10) అప్పుడు దానియేలును సింహాల గుహలో పడేశారు, కానీ యెహోవా ఆయనను కాపాడాడు.—దాని. 6:16-23.
15. (ఎ) విశ్వాసం, ధైర్యం చూపించడంలో అకుల, ప్రిస్కిల్ల ఎలాంటి మాదిరి ఉంచారు? (బి) యోహాను 13:34లో యేసు చెప్పిన మాటలకు అర్థమేమిటి? అలాంటి ప్రేమను చాలామంది క్రైస్తవులు ఎలా చూపించారు?
15 అకుల, ప్రిస్కిల్లలు కూడా పౌలు కోసం ‘తమ ప్రాణాలను ఇచ్చుటకు తెగించారు,’ అయితే వాళ్లు ఏ సందర్భంలో అలా చేశారో బైబిలు చెప్పడంలేదు. (అపొ. 18:2; రోమా. 16:3, 4) యేసు చెప్పిన ఈ మాటలను వాళ్లు ధైర్యంగా పాటించారు: “మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరి నొకరు ప్రేమింపవలెను.” (యోహా. 13:34) ఇశ్రాయేలీయులు తమను తాము ప్రేమించుకున్నట్లే పొరుగువాళ్లను కూడా ప్రేమించాలని మోషే ధర్మశాస్త్రం చెప్పింది. (లేవీ. 19:18) కానీ, యేసు ఇచ్చింది “కొత్త ఆజ్ఞ.” తన అనుచరులు కూడా ఇతరుల కోసం ప్రాణాలు ఇచ్చేంత ప్రేమను చూపించాలనే ఉద్దేశంతోనే ఆయన దాన్ని కొత్త ఆజ్ఞ అని సంబోధించాడు. తమ తోటి విశ్వాసులు శత్రువుల చేతుల్లో క్రూరమైన హింసలకు లేదా మరణానికి గురికాకుండా వాళ్లను తప్పించడానికి చాలామంది క్రైస్తవులు ‘తమ ప్రాణాలను ఇవ్వడానికి తెగించడం’ ద్వారా ప్రేమ చూపించారు.—1 యోహాను 3:16 చదవండి.
16, 17. (ఎ) మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు విశ్వాస సంబంధమైన ఎలాంటి పరీక్షలు ఎదుర్కొన్నారు? (బి) అలాంటి ఏ పరీక్ష ఆధునిక కాలంలోని క్రైస్తవులకు కూడా ఎదురైంది?
16 యేసును ఆదర్శంగా తీసుకొని మొదటి శతాబ్దపు క్రైస్తవులు ధైర్యంగా యెహోవాను మాత్రమే ఆరాధించారు. (మత్త. 4:8-10) రోమా చక్రవర్తిని ఘనపర్చడానికి గుర్తుగా ధూపం వేయడాన్ని కూడా వాళ్లు తిరస్కరించారు. (చిత్రం చూడండి.) డానియేల్ పి. మన్నిక్స్ ఇలా రాశాడు: “ధూపం వేసే బలిపీఠాన్ని వాళ్లకు అనుకూలంగా క్రీడా ప్రాంగణంలో పెట్టినా, చాలా కొద్దిమంది క్రైస్తవులు మాత్రమే ధూపం వేశారు. ఖైదీగా ఉన్న వ్యక్తి చేయాల్సిందల్లా చిటికెడు సాంబ్రాణి తీసుకొని అగ్నిలో వేయడమే. అలా చేస్తే, ఆ వ్యక్తి బలి అర్పించినట్లుగా ధృవీకరణ పత్రం ఇచ్చి, ఆయనను విడుదల చేసేవాళ్లు. ఆ విధంగా ధూపం వేస్తే చక్రవర్తిని ఆరాధించినట్లు కాదని, కేవలం రోమా సామ్రాజ్యానికి అధిపతిగా ఆయనకున్న దైవిక లక్షణాన్ని గుర్తించడం మాత్రమేనని ఖైదీకి సవివరంగా చెప్పేవాళ్లు. అయినా, అలా విడుదల అయ్యే అవకాశాన్ని దాదాపు క్రైస్తవులెవ్వరూ ఉపయోగించుకోలేదు.”—దోస్ అబౌట్ టు డై.
17 ఆధునిక కాలంలో నాజీ నిర్బంధ శిబిరాల్లో మరణ శిక్ష విధించబడిన క్రైస్తవులకు కూడా అదే పరిస్థితి ఎదురైంది. ‘యెహోవా సేవకులముగా ఉండము’ అని తెలియజేసే దస్తావేజుపై సంతకం చేసి విడుదలయ్యే అవకాశాన్ని అధికారులు పదేపదే వాళ్లకు ఇచ్చారు. అయితే, కొద్దిమంది మాత్రమే అలా సంతకం చేశారు. ఆ మధ్య, రువాండాలో జాతి నిర్మూలన జరుగుతున్న సమయంలో హుటు, టుట్సీల్లోని సాక్షులు ఒకరినొకరు కాపాడుకున్నారు. అలా చేయాలంటే ధైర్యం, విశ్వాసం అవసరం.
యెహోవా మనకు తోడుగా ఉన్నాడని గుర్తుంచుకోండి
18, 19. విశ్వాసం, ధైర్యం చూపించిన ఎవరి ఉదాహరణలు మనం ప్రకటనా పని చేయడానికి సహాయం చేస్తాయి?
18 ఈ భూమ్మీదున్న తన సేవకులకు ఇంతకుముందెన్నడూ ఇవ్వని అవకాశాన్ని అంటే రాజ్య సందేశాన్ని ప్రకటించి, శిష్యులను చేసే అత్యంత గొప్ప పనిలో పాల్గొనే అరుదైన అవకాశాన్ని యెహోవా మనకిచ్చాడు. (మత్త. 24:14; 28:19, 20) ఈ విషయంలో యేసు ఉంచిన అత్యుత్తమ మాదిరిని బట్టి మనమెంతో కృతజ్ఞులం. “ఆయన దేవుని రాజ్యసువార్తను తెలుపుచు, ప్రకటించుచు, ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము” చేశాడు. (లూకా 8:1) రాజ్య సందేశాన్ని ప్రకటించాలంటే, మనకు కూడా ఆయనలాగే విశ్వాసం, ధైర్యం అవసరం. దేవుని సహాయంతో మనం కూడా, జలప్రళయానికి ముందు ‘భక్తిహీన ప్రజలకు నీతిని ప్రకటించిన’ ధైర్యశాలియైన నోవహులా ఉండగలుగుతాం.—2 పేతు. 2:4, 5.
19 ప్రకటనా పని చేయడానికి ప్రార్థన మనకు సహాయం చేస్తుంది. హింసల్ని ఎదుర్కొన్న కొంతమంది శిష్యులు ‘దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించడానికి’ సహాయం చేయమని ప్రార్థించినప్పుడు యెహోవా వాళ్ల ప్రార్థనకు జవాబిచ్చాడు. (అపొస్తలుల కార్యములు 4:29-31 చదవండి.) ఇంటింటి పరిచర్య చేసే విషయంలో మీరు కాస్త భయపడుతుంటే ఎక్కువ విశ్వాసం కోసం, ధైర్యం కోసం మీరు చేసే ప్రార్థనలకు యెహోవా తప్పక జవాబిస్తాడు.—కీర్తన 66:19, 20 చదవండి. a
20. యెహోవా సేవకులమైన మనకు ఎవరెవరు తోడుగా ఉన్నారు?
20 దుష్టత్వంతో, కష్టాలతో నిండిన ఈ లోకం మనల్ని శ్రమలపాలు చేస్తుంది కాబట్టి దేవునికి ఇష్టమైన విధంగా జీవించడం ఓ సవాలే. అయితే మనం ఒంటరిగా లేము. యెహోవా మనకు తోడుగా ఉన్నాడు,సంఘ శిరస్సయిన యేసుక్రీస్తు కూడా మనకు తోడుగా ఉన్నాడు. అంతేకాక ప్రపంచవ్యాప్తంగా 70,00,000కు పైగా ఉన్న తోటి యెహోవాసాక్షులు కూడా మనకు తోడుగా ఉన్నారు. ‘నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి, మీ దేవుడైన యెహోవా మీకు తోడుగా ఉన్నాడు’ అని చెబుతున్న 2013 వార్షిక వచనాన్ని మనసులో ఉంచుకుంటూ విశ్వాసం చూపిద్దాం, రాజ్య సువార్త ప్రకటిద్దాం.—యెహో. 1:9.
a ధైర్యం చూపించిన మరి కొంతమంది ఉదాహరణల కోసం, కావలికోట ఫిబ్రవరి 15, 2012 సంచికలోని, ‘నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి’ అనే ఆర్టికల్ చూడండి.