కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాకు దగ్గరౌతూ ఉండండి

యెహోవాకు దగ్గరౌతూ ఉండండి

“దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును.”—యాకో. 4:8.

1, 2. (ఎ) సాతాను మనల్ని ఎలా మోసం చేస్తాడు? (బి) దేవునికి దగ్గరవ్వాలంటే మనం ఏమి చేయాలి?

 మానవులను సృష్టించినప్పుడు యెహోవా వాళ్లలో ఓ అవసరాన్ని పెట్టాడు. వాళ్లు ఆయనకు సన్నిహితంగా ఉండాలన్నదే ఆ అవసరం. అయితే, సాతాను మాత్రం యెహోవా అవసరం మనకు లేదని అనుకునేలా చేస్తాడు. కానీ, అది పచ్చి అబద్ధం. ఏదెను తోటలో హవ్వను మోసం చేసినప్పటినుండి సాతాను ఆ అబద్ధాన్ని ప్రచారం చేస్తూనే వచ్చాడు. (ఆది. 3:4-6) చరిత్రంతటిలో చాలామంది ప్రజలు తమకు యెహోవా అవసరం లేదని అనుకున్నారు.

2 సంతోషకరమైన విషయమేమిటంటే, సాతాను ఒడ్డే ఉరుల నుండి మనం తప్పించుకోవచ్చు. “సాతాను తంత్రములను మనము ఎరుగనివారముకాము.” (2 కొరిం. 2:11) తప్పుడు మార్గంలో వెళ్లేలా మనల్ని ప్రేరేపిస్తూ యెహోవా నుండి దూరం చేయాలని సాతాను ప్రయత్నిస్తాడు. ఉద్యోగం, వినోదం, కుటుంబ జీవితం వంటి విషయాల్లో సరైన మార్గాన్ని ఎంపిక చేసుకోవచ్చని మనం ముందటి ఆర్టికల్‌లో చూశాం. సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని, డబ్బును, గర్వాన్ని వాటివాటి స్థానాల్లో ఉంచడం, ‘దేవునికి దగ్గరయ్యేందుకు’ ఎలా సహాయం చేస్తుందో ఈ ఆర్టికల్‌లో చూస్తాం.—యాకో. 4:8.

సాంకేతిక పరిజ్ఞానం

3. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం మంచికైనా చెడుకైనా దారితీయవచ్చని ఎలా చెప్పవచ్చు? ఉదహరించండి.

3 ప్రపంచవ్యాప్తంగా, నేడు అత్యాధునిక ఎలక్ట్రానిక్‌ పరికరాలు సర్వసాధారణమైపోయాయి. సరైన విధంగా ఉపయోగిస్తే అవి ఎన్నో ప్రయోజనాల్ని చేకూరుస్తాయి. సరిగ్గా ఉపయోగించకపోతే అవి మనల్ని యెహోవాకు దూరం చేస్తాయి. ఉదాహరణకు కంప్యూటర్‌ విషయమే తీసుకుందాం. మీరు ప్రస్తుతం చదువుతున్న ఈ పత్రికను రాయడానికి, ప్రచురించడానికి కంప్యూటర్లు ఉపకరించాయి. పరిశోధన చేసేందుకు, ఇతరులతో సంభాషణలు జరిపేందుకు కంప్యూటర్‌ ఎంతో ఉపయోగపడుతుంది. అది ఉల్లాసాన్నిచ్చే వినోదాన్ని కూడా పంచుతుంది. అయితే, మనం కొన్నిసార్లు 24 గంటలూ కంప్యూటర్‌కి అతుక్కుపోయే ప్రమాదముంది. ఎప్పటికప్పుడు వచ్చే అత్యాధునిక పరికరాలు తమ దగ్గర ఉండాల్సిందేనని ప్రజలు అనుకునేలా వ్యాపారస్థులు మభ్యపెడతారు. ఒక టాబ్లెట్‌ కంప్యూటర్‌ కోసం ఓ యువకుడు ఎంతగా పరితపించాడంటే ఆఖరికి దాన్ని కొనడం కోసం రహస్యంగా తన కిడ్నీని అమ్మేశాడు. ఎంత విచారకరం!

4. అతిగా కంప్యూటర్‌ను ఉపయోగించే అలవాటును ఒక క్రైస్తవుడు ఎలా మానుకున్నాడు?

4 సాంకేతిక పరిజ్ఞానాన్ని మితిమీరి వాడడం వల్ల లేదా దుర్వినియోగం చేయడం వల్ల యెహోవాతో ఉన్న దగ్గరి సంబంధాన్ని కోల్పోవడం మరీ దారుణం. ఉదాహరణకు, జాన్‌ అనే 28 ఏళ్ల సహోదరుడు కంప్యూటర్‌ ముందు ఎక్కువ సమయాన్ని గడుపుతూ అధ్యయనానికి అంతంత మాత్రం సమయాన్నే వెచ్చించేవాడు. a జాన్‌ తరచూ అర్థరాత్రి దాటే వరకు ఇంటర్నెట్‌ మీద కూర్చునేవాడు. తాను ఎంత అలసిపోయుంటే చాటింగ్‌ చేయడాన్ని లేదా వీడియోలు చూడడాన్ని ఆపడం అంత కష్టంగా ఉండేదని ఆయన చెప్పాడు. కొన్నిసార్లైతే చెడు వీడియోలను కూడా చూసేవాణ్ణని అన్నాడు. జాన్‌ ఆ అలవాటు నుండి బయటపడడానికి, నిద్రకు ఉపక్రమించే సమయానికల్లా తన కంప్యూటర్‌ దానంతటదే షట్‌డౌన్‌ అయ్యేలా ఏర్పాటు చేసుకున్నాడు.—ఎఫెసీయులు 5:15, 16 చదవండి.

తల్లిదండ్రులారా, సాంకేతిక పరిజ్ఞానాన్ని జాగ్రత్తగా ఉపయోగించడానికి మీ పిల్లలకు సహాయం చేయండి

5, 6. (ఎ) పిల్లల విషయంలో తల్లిదండ్రులకు ఏ బాధ్యతలు ఉన్నాయి? (బి) పిల్లలు మంచి స్నేహితుల్ని ఏర్పరచుకోవడానికి తల్లిదండ్రులు ఏం చేయాలి?

5 తల్లిదండ్రులారా, మీ పిల్లల ప్రతీ కదలికను గమనించాల్సిన అవసరం లేదు కానీ, వాళ్లు కంప్యూటర్‌ను ఎలా వాడుతున్నారో ఓ కంట కనిపెడుతూ ఉండండి. మీ పనులకు అడ్డురాకుండా ఆడుకోమని చెప్పి పిల్లలను ఇంటర్నెట్‌కు వదిలేయకండి. అలా వదిలేస్తే, వాళ్లు అందులో ఉండే అనైతికత, హింసాత్మక ఆటలు, మంత్రతంత్రాలు, చెడు స్నేహాల వంటివాటి బారిన పడే ప్రమాదం ఉంది. అంతేకాదు, ‘అమ్మానాన్నలే ఏమనడం లేదు కాబట్టి అవి సరైనవే’ అని వాళ్లు అనుకోవచ్చు. ఎదుగుతున్న మీ పిల్లలను యెహోవాకు దూరంచేసే వాటన్నిటి నుండి కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యత మీదే. జంతువులు కూడా తమ పిల్లలను ప్రమాదాల బారిన పడకుండా కాపాడతాయి. తన పిల్లలకు ఎవరైనా హాని తలపెడుతున్నప్పుడు తల్లి ఎలుగుబంటి ఏమి చేస్తుందో ఊహించండి.—హోషేయ 13:8 పోల్చండి.

6 మంచి నడవడి ఉన్న క్రైస్తవ యౌవనులతో, పెద్దవాళ్లతో స్నేహం చేయడానికి మీ పిల్లలకు సహాయం చేయండి. మీ పిల్లలతో మీరు సమయం గడపడం ప్రాముఖ్యమని గుర్తుపెట్టుకోండి. కాబట్టి వాళ్లతో కలిసి నవ్వడానికి, ఆడడానికి, పనిచేయడానికి, ‘దేవునికి దగ్గరవ్వడానికి’ సమయం వెచ్చించండి. b

ఆరోగ్యం

7. మనమందరం ఎందుకు ఆరోగ్యంగా ఉండాలనుకుంటాం?

7 మనం ఇతరులను కలిసినప్పుడు “మీ ఆరోగ్యం ఎలా ఉంది?” అని తరచూ అడుగుతుంటాం. మన మొదటి తల్లిదండ్రులైన ఆదాముహవ్వలు సాతానుతో చేతులు కలిపి యెహోవాకు దూరమయ్యారు కాబట్టే మనందరం అనారోగ్యానికి గురౌతున్నాం. ఆరోగ్యం పాడైనప్పుడు యెహోవాను సేవించడం కష్టమౌతుంది. కాబట్టి, మన అనారోగ్యాన్ని ఆసరాగా తీసుకుని సాతాను తన ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటాడు. ఒకవేళ మనం చనిపోతే, దేవుణ్ణి అస్సలు సేవించలేం. (కీర్త. 115:17) అందుకే, ఆరోగ్యంగా ఉండడానికి మనం చేయగలిగినదంతా చేస్తాం. c అలాగే, మనం మన సహోదరసహోదరీల ఆరోగ్యసంక్షేమాల గురించి శ్రద్ధ తీసుకోవాలి.

8, 9. (ఎ) ఆరోగ్యం గురించి మనం అతిగా చింతించకుండా ఎలా ఉండవచ్చు? (బి) సంతోషాన్ని పెంపొందించుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు వస్తాయి?

8 అయితే ఆరోగ్యం గురించి మనం అతిగా చింతించకూడదు. కొంతమంది ఫలానా ఆహార నియమాలను పాటించమని, చికిత్సలను తీసుకోమని లేదా ఫలానా ఉత్పత్తులను వాడమని ఇతరులను ప్రోత్సహించారు. దేవుని రాజ్యసువార్త కన్నా వాటి గురించే అత్యుత్సాహంగా చెప్పడం మొదలుపెట్టారు. అలాంటివాళ్లు తాము ఇతరులకు సహాయం చేస్తున్నామని నమ్ముతుండవచ్చు. అయినా, రాజ్యమందిరంలో లేదా సమావేశాల్లో కలుసుకున్నప్పుడు ఆరోగ్య లేదా సౌందర్య ఉత్పత్తుల గురించి, వాటిని వాడే విధానం గురించి మాట్లాడుకోవడం సబబు కాదు. ఎందుకని?

9 ఆధ్యాత్మిక విషయాలను చర్చించుకోవడానికి, దేవుని ఆత్మఫలంలో భాగమైన సంతోషాన్ని రెట్టింపు చేసుకోవడానికి మనం సమకూడతాం. (గల. 5:22) అలాంటి సందర్భాల్లో, సహోదరసహోదరీలు అడిగినా అడగకపోయినా ఆరోగ్య సలహాలను ఇవ్వడం వల్ల లేదా ఫలానా ఉత్పత్తులను వాడమని సిఫారసు చేయడం వల్ల మన కూటాల, సమావేశాల ఉద్దేశం పక్కదారి పట్టవచ్చు, ఇతరుల సంతోషానికి భంగం వాటిల్లవచ్చు. (రోమా. 14:17) సహోదరసహోదరీలు తమ ఆరోగ్యం గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారనేది వాళ్ల వ్యక్తిగత విషయం. పైగా, ఎవ్వరమూ అనారోగ్యాన్ని పూర్తిగా తీసివేయలేం. గొప్ప గొప్ప డాక్టర్లు కూడా ముసలివాళ్లు అవుతారు, అనారోగ్యం పాలౌతారు, చనిపోతారు. ఆరోగ్యం గురించి అతిగా చింతించడం వల్ల మన ఆయుష్షు ఏమాత్రం పెరగదు. (లూకా 12:25) అయితే, “సంతోషముగల మనస్సు ఆరోగ్యకారణము.”—సామె. 17:22.

10. (ఎ) యెహోవా దృష్టిలో ఏది విలువైనది? (బి) సంపూర్ణ ఆరోగ్యాన్ని మనం ఎప్పుడు పొందుతాం?

10 అలాగే, మనం చక్కగా కనిపించాలని కోరుకోవడం కూడా సరైనదే. కానీ, వృద్ధాప్య ఛాయలను పూర్తిగా తీసివేయడానికి మనం అతిగా కష్టపడాల్సిన పనిలేదు. అవి కొన్నిసార్లు మనలో ఉన్న పరిణతికి, హుందాతనానికి, అంతర్గత సౌందర్యానికి ప్రతీకలుగా ఉంటాయి. అందుకే, “నెరసిన వెండ్రుకలు సొగసైన కిరీటము, అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగి యుండును” అని బైబిలు చెబుతోంది. (సామె. 16:31) యెహోవా పైరూపం కన్నా వ్యక్తిత్వానికే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తాడు. మనం కూడా అలానే ఉండాలి. (1 పేతురు 3:3, 4 చదవండి.) కాబట్టి, మరింత అందంగా కనిపించాలనే ఉద్దేశంతో అనవసరమైన, హానికరమైన సర్జరీలు చేయించుకోవడం లేదా వైద్య చికిత్సలను తీసుకోవడం తెలివైన పనే అంటారా? వయసుతో, ఆరోగ్యంతో నిమిత్తం లేకుండా ‘యెహోవా వల్ల కలిగే ఆనందమే’ మన ముఖాల్లో కనిపించే అసలైన సౌందర్యానికి రహస్యం. (నెహె. 8:10) నూతనలోకంలో మాత్రమే మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని, యౌవన సౌందర్యాన్ని తిరిగి పొందుతాం. (యోబు 33:25; యెష. 33:24) అప్పటివరకు, ప్రస్తుత పరిస్థితులను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ సరైన వివేచనను, విశ్వాసాన్ని చూపిస్తే యెహోవాకు సన్నిహితంగా ఉండగలుగుతాం.—1 తిమో. 4:8.

డబ్బు

11. డబ్బు ఎలా మనకు ఉరిగా మారే అవకాశం ఉంది?

11 డబ్బు సంపాదించడం గానీ నిజాయితీగా వ్యాపారం చేయడం గానీ తప్పుకాదు. (ప్రసం. 7:12; లూకా 19:12, 13) కానీ, “ధనాపేక్ష” మాత్రం మనల్ని ఖచ్చితంగా యెహోవాకు దూరం చేస్తుంది. (1 తిమో. 6:9, 10) “ఐహికవిచారము” వల్ల, నిత్యావసరాల గురించి అతిగా చింతించడం వల్ల మన ఆధ్యాత్మికత దెబ్బతింటుంది. అలాగే “ధనమోసము” లేదా సిరిసంపదలు ఎనలేని సంతోషాన్ని, భద్రతను తీసుకువస్తాయనే అపోహ కూడా మన ఆధ్యాత్మికతను నీరుగారుస్తుంది. (మత్త. 13:22) “ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు” అని యేసు స్పష్టంగా చెప్పాడు.—మత్త. 6:24.

12. డబ్బు సంపాదనకు సంబంధించిన ఎలాంటి ఉరులు ప్రస్తుతం ఉన్నాయి? వాటి విషయంలో మనం ఎలా జాగ్రత్తగా ఉండవచ్చు?

12 డబ్బు విషయంలో సరైన దృక్కోణం ఉండకపోతే అది అనర్థాలకు దారితీస్తుంది. (సామె. 28:20) ఏ మాత్రం కష్టపడకుండా చిటికెలో డబ్బు సంపాదించడానికి కొంతమంది సహోదరులు లాటరీ టికెట్లను కొన్నారు లేదా కొన్నిరకాల మార్కెటింగ్‌ స్కీమ్‌లలో చేరారు, సంఘంలోని వాళ్లను కూడా అందులోకి లాగారు. చిన్న పెట్టుబడికి చాలా పెద్ద మొత్తంలో రాబడి వస్తుందని ఇతరులు చెప్పే కల్లబొల్లి మాటలకు కొంతమంది మోసపోయారు. అత్యాశకు పోతే మొదటికే మోసం వస్తుంది. వాస్తవికంగా ఆలోచించండి. నిజానికి, చిటికెలో ఎక్కువ డబ్బు సంపాదించడం సాధ్యం కాదు.

13. డబ్బు విషయంలో లోకం అభిప్రాయానికి, యెహోవా అభిప్రాయానికి మధ్య ఉన్న తేడా ఏమిటి?

13 మనం యెహోవా ‘రాజ్యాన్ని నీతిని మొదట వెదికితే’ నిత్యావసరాల కోసం మనం చేసే సరైన ప్రయత్నాల్ని యెహోవా ఆశీర్వదిస్తాడు. (మత్త. 6:33; ఎఫె. 4:28) మనం ఓవర్‌టైమ్‌ చేసి రాజ్యమందిరానికి వచ్చి కూటాల్లో నిద్రపోవడం లేదా అక్కడ కూర్చొని డబ్బు గురించి ఆందోళన పడడం ఆయనకు ఇష్టం లేదు. కానీ, లోకంలో చాలామంది మాత్రం డబ్బు ఎక్కువగా సంపాదిస్తే, ముందుముందు నిశ్చింతగా బతకవచ్చని నమ్ముతున్నారు. వాళ్లు తమ పిల్లలను కూడా అదే బాటలో నడిపిస్తున్నారు. అలాంటి ఆలోచనా తీరు సరైనది కాదని యేసు చెప్పాడు. (లూకా 12:15-21 చదవండి.) ఒకవైపు దురాశ కలిగి ఉంటూనే మరోవైపున యెహోవాతో మంచి సంబంధాన్ని కలిగి ఉండవచ్చని అనుకున్న గేహజీని ఈ సందర్భంలో మనం గుర్తుచేసుకోవచ్చు.—2 రాజు. 5:20-27.

14, 15. భద్రత కోసం మనం ఆర్థిక వ్యవస్థ మీద ఎందుకు ఆధారపడకూడదు? ఒక అనుభవం చెప్పండి.

14 కొన్ని గ్రద్దలు వేటాడేప్పుడు తమ కాళ్లతో బరువైన చేపలను పట్టుకుని వాటిని వదలకుండా ఉండడం వల్ల ఆ బరువుకు నీళ్లలో మునిగిపోయాయని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఓ క్రైస్తవుని విషయంలో అలాంటిది జరిగే అవకాశం ఉందా? సంఘపెద్దగా సేవచేస్తున్న మైఖేల్‌ ఇలా అన్నాడు: “సాధారణంగా నేను చాలా పొదుపరిని. స్నానం చేసేటప్పుడు చేతిలో షాంపు కాస్త ఎక్కువ పడినా, దాన్ని తిరిగి బాటిల్‌లోకి పంపిస్తాను.” అలాంటి మైఖేల్‌ స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాడు. సాధ్యమైనంత త్వరగా ఉద్యోగాన్ని వదిలేసి పయినీరు సేవ మొదలుపెట్టాలనే ఆలోచనతో ఆయన అలా చేశాడు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఆయన రకరకాల షేర్లను, స్టాక్‌ మార్కెట్‌ను అధ్యయనం చేయడంలో మునిగిపోయాడు. ఫలానా షేర్ల విలువ వెంటనే పెరగవచ్చనే మార్కెట్‌ విశ్లేషకుల అంచనాలు నమ్మి మైఖేల్‌ తన దగ్గరున్న డబ్బును, అప్పు తెచ్చిన డబ్బును పెట్టి ఆ షేర్లను కొన్నాడు. కానీ, ఆ షేర్ల విలువ ఘోరంగా పతనమైంది. “నా డబ్బును ఎలాగైనా తిరిగి రాబట్టుకోవాలని గట్టిగా అనుకున్నాను. ఆ షేర్లను అమ్మకుండా కొంతకాలం ఉంచితే, మళ్లీ వాటి విలువ పెరగవచ్చని నాకు అనిపించింది” అని మైఖేల్‌ అన్నాడు.

15 ఆయన కొన్ని నెలల పాటు, షేర్ల గురించి తప్ప మరి దేని గురించీ ఆలోచించలేదు. ఆయనకు ఆధ్యాత్మిక విషయాల మీద మనస్సు నిలపడం కష్టమయ్యింది, నిద్ర కూడా సరిగ్గా పట్టేది కాదు. అయితే, ఆ షేర్ల విలువ మాత్రం పెరగలేదు. ఆయన కష్టపడి కూడబెట్టిన సొమ్ము బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది, దాంతో ఆయన తన ఇల్లు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. “నా కుటుంబానికి ఎంతో వ్యథను మిగిల్చాను” అని ఆయన ఒప్పుకున్నాడు. దానివల్ల, ఆయన ఓ ప్రాముఖ్యమైన పాఠం నేర్చుకున్నాడు. “సాతాను వ్యవస్థపై నమ్మకం ఉంచేవాళ్లకు మిగిలేది నిరాశానిస్పృహలేనని నాకు ఇప్పుడు అర్థమైంది” అని ఆయన అన్నాడు. (సామె. 11:28) నిజానికి, మన బ్యాంకు బ్యాలెన్సు మీద, పెట్టుబడుల మీద లేక ప్రస్తుత వ్యవస్థలో డబ్బు గడించే మన సామర్థ్యం మీద ఆశలు పెట్టుకుంటే, “ఈ యుగ సంబంధమైన దేవత” అయిన సాతానును ఆశ్రయించినట్లే. (2 కొరిం. 4:4; 1 తిమో. 6:17) అప్పటినుండి మైఖేల్‌ “సువార్త నిమిత్తము” తన జీవితాన్ని సరళం చేసుకున్నాడు. అలా చేయడం వల్ల ఆయన, ఆయన కుటుంబ సభ్యులు సంతోషాన్ని తిరిగి సంపాదించుకున్నారు, యెహోవాకు మరింత దగ్గరయ్యారు.—మార్కు 10:29, 30 చదవండి.

గర్వం

16. సరైన విషయాల్లో గర్వపడడానికి, మన గురించి మనం అతిగా ఆలోచించుకోవడానికి మధ్య ఉన్న తేడా ఏమిటి?

16 సరైన విషయాల గురించి గర్వపడడం మంచిదే. ఉదాహరణకు, యెహోవాసాక్షులముగా ఉన్నందుకు మనం ఎల్లప్పుడూ గర్వపడాలి. (యిర్మీ. 9:24) మనకు ఆత్మాభిమానం సరైన పాళ్లలో ఉంటే మనం చక్కని నిర్ణయాలు తీసుకుంటాం, నైతికంగా దిగజారకుండా ఉంటాం. కానీ, మన సొంత అభిప్రాయాల గురించి లేదా మన హోదా గురించి అతిగా ఆలోచిస్తే మనం యెహోవాకు దూరం అవుతాం.—కీర్త. 138:6; రోమా. 12:3.

సంఘంలో స్థానాల కోసం ప్రాకులాడే బదులు మీ పరిచర్యను ఆస్వాదించండి

17, 18. (ఎ) బైబిల్లో ప్రస్తావించబడిన వినయస్థుల, గర్విష్ఠుల ఉదాహరణలను పేర్కొనండి. (బి) గర్వం వల్ల యెహోవాకు దూరమయ్యే ప్రమాదాన్ని ఒక సహోదరుడు ఎలా తప్పించుకున్నాడు?

17 గర్విష్ఠుల గురించి, వినయస్థుల గురించి బైబిల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి. రాజైన దావీదు సరైన నిర్దేశం కోసం వినయంగా యెహోవాను ఆశ్రయించాడు, దానికి యెహోవా ఆయనను ఆశీర్వదించాడు. (కీర్త. 131:1-3) కానీ, రాజులైన నెబుకద్నెజరు, బెల్షస్సరు చూపించిన గర్వాన్ని యెహోవా అణచివేశాడు. (దాని. 4:30-37; 5:22-30) నేడు కూడా మన వినయాన్ని పరీక్షించే పరిస్థితులు ఎదురౌతాయి. పరిచర్య సేవకుడైన 32 ఏళ్ల పీటర్‌ ఓ కొత్త సంఘానికి మారాడు. “త్వరలోనే నన్ను ఒక సంఘపెద్దగా నియమిస్తారని అనుకున్నాను కానీ ఏడాది గడిచినా, నా కోరిక నెరవేరలేదు” అని పీటర్‌ అన్నాడు. ఆ సంఘంలోని పెద్దలు తనకు తగినంత గౌరవాన్ని ఇవ్వలేదని పీటర్‌ కోపావేశాలకు లోనయ్యడా? కూటాలకు వెళ్లడం మానేశాడా? గర్వంతో యెహోవాకు, ఆయన ప్రజలకు దూరమయ్యాడా? అలాంటి పరిస్థితిలో మీరుంటే ఏం చేస్తారు?

18 “కోరిక సఫలం కాకపోతే ఏమి చేయాలనే దానికి సంబంధించి మన ప్రచురణల్లో నాకు దొరికిన సమాచారాన్నంతా చదివాను” అని పీటర్‌ అన్నాడు. (సామె. 13:12) “నాకు ఓర్పు, వినయం అవసరమని నెమ్మదిగా అర్థమైంది. నేను యెహోవా చేత మలచబడాల్సి ఉందని గ్రహించాను” అని ఆయన గుర్తుచేసుకున్నాడు. పీటర్‌ తన గురించే ఆలోచించడం మానేసి సంఘంలో, పరిచర్యలో ఇతరులకు సేవ చేయడం గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. కొంతకాలానికే, ఆయన ఎన్నో ప్రగతిదాయక బైబిలు అధ్యయనాలను నిర్వహించసాగాడు. పీటర్‌ ఇంకా ఇలా అన్నాడు: “నేను ఊహించని సమయంలో అంటే ఒకటిన్నర సంవత్సరాల తర్వాత నేను సంఘపెద్దగా నియమించబడినప్పుడు నా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కానీ అప్పటికే నేను నా పరిచర్యను ఎంతగానో ఆస్వాదిస్తున్నాను కాబట్టి అసలు ఆ విషయం గురించి చింతించడం మానేశాను.”—కీర్తన 37:3, 4 చదవండి.

యెహోవాకు సన్నిహితంగా ఉండండి!

19, 20. (ఎ) రోజువారీ పనుల్లో దేనివల్ల కూడా యెహోవాకు దూరమవ్వకుండా ఎలా చూసుకోవచ్చు? (బి) యెహోవాకు సన్నిహితంగా ఉన్న ఎవరిని మనం అనుకరించవచ్చు?

19 ఈ ఆర్టికల్‌లో, ముందటి ఆర్టికల్‌లో చర్చించుకున్న విషయాలకు మన జీవితంలో తగిన స్థానం ఉంది. యెహోవా సేవకులుగా ఉన్నందుకు మనం గర్వపడుతున్నాం. సంతోషకరమైన కుటుంబం, మంచి ఆరోగ్యం దేవుడిచ్చిన వరాలు. ఉద్యోగం, డబ్బు మన అవసరాలు తీర్చే సాధనాలని మనం అర్థంచేసుకున్నాం. వినోదం మనకు ఉల్లాసాన్ని ఇస్తుందని, విజ్ఞానం మనకు ఉపయోగపడుతుందని తెలుసుకున్నాం. అయితే అవన్నీ సరైన సమయంలో, తగిన మోతాదులో, మన ఆరాధనకు అడ్డురాని రీతిలో ఆస్వాదిస్తే మనం యెహోవాకు దూరం కాకుండా ఉండగలుగుతాం.

దేనివల్ల కూడా యెహోవాకు దూరమవ్వకండి!

20 కానీ, మనం యెహోవాకు దూరం అవ్వాలని సాతాను కోరుకుంటాడు. అయినా మీరు, మీ కుటుంబం అలాంటి ప్రమాదం నుండి తప్పించుకోవచ్చు. (సామె. 22:3) యెహోవాకు దగ్గరై ఎల్లప్పుడూ ఆయనకు సన్నిహితంగా ఉండండి. ఈ విషయంలో మనకు సహాయం చేసే ఉదాహరణలు బైబిల్లో చాలా ఉన్నాయి. హనోకు, నోవహు ‘దేవునితో నడిచారు.’ (ఆది. 5:22; 6:9) మోషే “అదృశ్యుడైనవానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధిగలవాడై” నడుచుకున్నాడు. (హెబ్రీ. 11:27) యేసు అన్ని సమయాల్లో తన పరలోక తండ్రికి ఇష్టమైన పనులే చేశాడు కాబట్టి, ఆయనకు దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. (యోహా. 8:29) అలాంటి మాదిరులను అనుకరించండి. “ఎల్లప్పుడును సంతోషముగా ఉండుడి; యెడతెగక ప్రార్థనచేయుడి; ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి.” (1 థెస్స. 5:16-18) దేనివల్ల కూడా యెహోవాకు దూరమవ్వకండి!

a అసలు పేర్లు కావు.

bపిల్లలను బాధ్యతగల వ్యక్తులుగా ఎలా తీర్చిదిద్దాలి?” అనే బ్రోషురును చూడండి.

cమెరుగైన ఆరోగ్యానికి ఐదు చిట్కాలు’ అనే శీర్షికతో వచ్చిన తేజరిల్లు! (ఆంగ్లం) మార్చి 2011 సంచిక చూడండి.