సంతాపపడాల్సిన పరిస్థితి రాకుండా యెహోవా సేవ చేయండి
‘వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికొరకై వేగిరపడుచున్నాను.’—ఫిలి. 3:13.
1-3. (ఎ) సంతాపపడడం అంటే ఏమిటి? అది మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? (బి) అపొస్తలుడైన పౌలు నుండి మనమేమి నేర్చుకోవచ్చు?
“‘అలా చేసి ఉంటే బాగుండేది!’ మనం మాట్లాడే, రాసే మాటలన్నిటిలో విచారకరమైన మాట అదే” అని జే.జి. విటీయర్ అనే కవి రాశాడు. కొన్నిసార్లు ఏదైనా ఒక పని చేసి, ఆ తర్వాత దాన్ని వేరేలా చేసి ఉంటే బాగుండేది అని చింతించే సందర్భాల గురించి ఆయన మాట్లాడాడు. “సంతాపం” అనే మాట, గతంలో చేసిన లేదా చేయకుండా వదిలేసిన దాని విషయంలో కలిగే మానసిక క్షోభను, మనోవ్యథను సూచిస్తుంది. అంతేకాక, దానికి “మళ్లీ ఏడవడం” అనే అర్థం కూడా ఉంది. కాలాన్ని వెనక్కి తిప్పగలిగితే ఫలానా పనిని వేరే విధంగా చేస్తామని మనందరికీ అనిపిస్తుండవచ్చు. అలాంటి సందర్భాలు మీకు ఎన్ని ఎదురయ్యాయి?
2 కొంతమంది తమ జీవితాల్లో దుఃఖాన్ని మిగిల్చిన తప్పుల్ని చేశారు, గంభీరమైన పాపాల్ని కూడా చేశారు. మరికొందరు, మరీ చెడ్డ పనులు చేయలేదు కానీ తాము తీసుకున్న కొన్ని నిర్ణయాలు సరైనవేనా అని చింతిస్తున్నారు. ఇంకొంతమంది గతం గురించిన బాధను అధిగమించి ప్రస్తుతం తమ జీవితాల్ని వెళ్లదీస్తున్నారు. మరితరులు మాత్రం, ‘అయ్యో, అప్పుడు అలా చేసి ఉంటే బాగుండేదే’ అన్న సంతాపంతోనే బ్రతుకుతున్నారు. (కీర్త. 51:3) మీ విషయమేమిటి? కనీసం ఇప్పటి నుండైనా, సంతాపపడాల్సిన పరిస్థితి రాకుండా యెహోవా సేవ చేయాలని మీరు కోరుకుంటున్నారా? అలా చేయడానికి మనకు సహాయం చేసే నిజ జీవిత అనుభవం ఏదైనా ఉందా? ఉంది, అపొస్తలుడైన పౌలు జీవితమే అందుకు ఓ ఉదాహరణ.
3 పౌలు తన జీవితంలో ఘోరమైన తప్పులు చేశాడు, అలాగే జ్ఞానయుక్తమైన నిర్ణయాలు కూడా తీసుకున్నాడు. గతంలో చేసినవాటి గురించి ఆయన ఆ తర్వాత ఎంతగానో బాధపడ్డాడు. అయినా, దేవుణ్ణి నమ్మకంగా సేవిస్తూ తన జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు. గతం గురించి విచారిస్తూ కూర్చోకుండా దేవుని సేవ చేసే విషయంలో ఆయన మాదిరి నుండి మనమేమి నేర్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.
పౌలును బాధపెట్టిన గతం
4. అపొస్తలుడైన పౌలు గతం ఎలా ఉండేది?
4 పరిసయ్యుడిగా ఉన్నప్పుడు తాను చేసిన ఎన్నో పనుల గురించి పౌలు ఆ తర్వాత బాధపడ్డాడు. ఉదాహరణకు, ఆయన దగ్గరుండి మరీ క్రీస్తు శిష్యుల్ని క్రూరమైన హింసలపాలు చేశాడు. స్తెఫను హతమైన వెంటనే, ‘సౌలు [ఆ తర్వాత పౌలు అని పిలువబడ్డాడు] ఇంటింట జొచ్చి, పురుషులను స్త్రీలను ఈడ్చుకొనిపోయి, చెరసాలలో వేయించి సంఘమును పాడుచేయుచుండెను’ అని బైబిలు చెబుతోంది. (అపొ. 8:3) ‘పాడుచేయడం’ అని అనువదించబడిన గ్రీకు పదం, “ఇతరుల్ని హింసించడంలో [సౌలు] చూపించిన ఉత్సాహాన్ని, రౌద్రాన్ని వ్యక్తంచేసే శక్తివంతమైన పదం” అని ఆల్బర్ట్ బార్న్స్ అనే విద్వాంసుడు అన్నాడు. “సౌలు ఓ క్రూర మృగంలా చర్చీతో వ్యవహరించాడు” అని కూడా బార్న్స్ అన్నాడు. క్రైస్తవత్వాన్ని తుడిచిపెట్టడం దేవుడిచ్చిన బాధ్యత అని నిష్ఠగల యూదుడైన సౌలు భావించాడు. కాబట్టి, ఆయన క్రూరాతిక్రూరంగా, ‘పురుషులను స్త్రీలను బెదిరించడం, హత్య చేయడం తనకు ప్రాణాధారమైనట్టు’ వ్యవహరిస్తూ వాళ్లను నాశనం చేయడానికి ప్రయత్నించాడు.—అపొ. 9:1, 2; 22:4. a
5. క్రైస్తవుల్ని హింసించిన సౌలు ఆ తర్వాత యేసు గురించి ప్రకటించేలా ఎలా మారాడో వివరించండి.
5 సౌలు దమస్కుకు వెళ్లి యేసు శిష్యుల ఇళ్లలో జొచ్చి, వాళ్లను యెరూషలేముకు లాక్కొచ్చి సమాజమందిరపు ఆగ్రహానికి గురిచేయాలని ఉద్దేశించాడు. అయితే ఆయన అనుకున్నది జరగలేదు. ఎందుకంటే, క్రైస్తవ సంఘ శిరస్సు ఆయనను ఆపాడు. (ఎఫె. 5:23) సౌలు దమస్కుకు వెళ్తున్నప్పుడు, యేసు ఆయనను అడ్డుకున్నాడు. అప్పుడు కనిపించిన గొప్ప వెలుగు వల్ల సౌలు చూపు కోల్పోయాడు. ఆ సంఘటన జరిగాక, దమస్కుకు వెళ్లమని, అక్కడ ఫలానా వ్యక్తి వచ్చి కలుస్తాడని సౌలుకు యేసు చెప్పాడు. ఆ తర్వాత ఏమి జరిగిందో మనకు తెలుసు.—అపొ. 9:3-22.
6, 7. తన వేదనకరమైన గతాన్ని పౌలు మర్చిపోలేదని ఎలా చెప్పవచ్చు?
6 పౌలు క్రైస్తవునిగా మారిన వెంటనే తన జీవన విధానాన్ని మార్చుకున్నాడు. అప్పటివరకు క్రైస్తవత్వానికి బద్ధశత్రువుగా ఉన్న ఆయన ఉత్సాహంగా క్రైస్తవత్వాన్ని వ్యాప్తి చేయడం మొదలుపెట్టాడు. ఆయన తన గురించి ఆ తర్వాత ఇలా రాశాడు: ‘పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితంగా హింసించి నాశనం చేయుచుంటినని నా నడవడినిగూర్చి మీరు వింటిరి.’ (గల. 1:13) ఆ తర్వాత కొరింథీయులకు, ఫిలిప్పీయులకు, తిమోతికి పత్రికలు రాస్తున్నప్పుడు కూడా ఆయన మళ్లీ తన గతం గురించి బాధపడుతూ మాట్లాడాడు. (1 కొరింథీయులు 15:9 చదవండి; ఫిలి. 3:6; 1 తిమో. 1:13) పౌలు ఏదో గొప్ప కోసం అలా రాయలేదు, లేదా అలాంటివేవీ జరగలేదన్నట్లు ప్రవర్తించడానికి ప్రయత్నించలేదు. తాను ఘోరమైన తప్పులు చేశానని పౌలుకు స్పష్టంగా తెలుసు.—అపొ. 26:9-11.
7 “హింసించే క్రూరమైన పనిలో” సౌలు పాత్ర గురించి ఫ్రెడ్రిక్ డబ్ల్యూ. ఫార్రర్ అనే బైబిలు విద్వాంసుడు ప్రస్తావించాడు. పౌలు జీవితంలోని విచారకరమైన ఈ ఘట్టం ఎంత భయంకరమైనదో ఆలోచించినప్పుడు మాత్రమే, “ఆయన పశ్చాత్తాపంతో ఎంత వేదన అనుభవించాడో, శత్రువుల నిందలకు ఎంతగా బలయ్యాడో అర్థంచేసుకోగలుగుతాం” అని ఫార్రర్ రాశాడు. బహుశా పౌలు సంఘాల్ని సందర్శించినప్పుడు మొట్టమొదటిసారిగా కలిసిన సహోదరులు, ‘ఓ నువ్వేనా మమ్మల్ని హింసించిన పౌలువు!’ అని ఆయనతో అనివుంటారు.—అపొ. 9:21.
8. యెహోవా, యేసుక్రీస్తు తన మీద చూపించిన కనికరాన్ని బట్టి, ప్రేమను బట్టి పౌలు ఎలా భావించాడు? మనం దాని నుండి ఏమి నేర్చుకోవచ్చు?
8 అయితే, కేవలం దేవుని కృప వల్లే తాను పరిచర్య చేయగలుగుతున్నానని పౌలు గుర్తించాడు. తాను రాసిన 14 పత్రికల్లో, దేవుని కృప గురించి పౌలు సుమారు 90సార్లు ప్రస్తావించాడు. ఏ ఇతర బైబిలు రచయితా దేవుని కృప గురించి అన్నిసార్లు ప్రస్తావించలేదు. (1 కొరింథీయులు 15:10 చదవండి.) తనతో దేవుడు చాలా కనికరంతో వ్యవహరించినందుకు పౌలు ఎంతో కృతజ్ఞత చూపించాడు. అంతేకాక, దేవుడు తనపై చూపించిన కృపను వ్యర్థం చేసుకోకూడదని బలంగా నిశ్చయించుకున్నాడు. అందుకే, ఆయన ఇతర అపొస్తలుల కన్నా ‘ఎక్కువగా ప్రయాసపడ్డాడు.’ మన పాపాలను ఒప్పుకొని, మన జీవిత విధానాన్ని మార్చుకుంటే, యేసు విమోచన క్రయధన బలి ఆధారంగా ఎంత పెద్ద పాపాల్నైనా యెహోవా క్షమిస్తాడని చెప్పడానికి పౌలు జీవితమే ఓ మంచి ఉదాహరణ. విమోచన క్రయధనం వల్ల వ్యక్తిగతంగా తమకు ప్రయోజనాలు కలుగుతాయనే నమ్మకం కుదరని వ్యక్తులకు ఇది ఓ చక్కని పాఠం. (1 తిమోతి 1:15, 16 చదవండి.) తాను క్రీస్తు శిష్యుల్ని ఎంతగానో హింసించినా, ‘దేవుని కుమారుడు నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకున్నాడు’ అని పౌలు రాయగలిగాడు. (గల. 2:20; అపొ. 9:5)అవును, తన జీవితంలో సంతాపపడాల్సిన పరిస్థితి మళ్లీ రాకుండా దేవుని సేవ చేయడం ఎలాగో పౌలు గ్రహించాడు. మీరు నేర్చుకున్నది కూడా అదేనా?
గతంలో చేసినవాటిని బట్టి మీరు కూడా సంతాపపడుతున్నారా?
9, 10. (ఎ) యెహోవా ప్రజల్లో కొంతమందికి ఎందుకు సంతాపపడాల్సిన పరిస్థితి వచ్చింది? (బి) గతం గురించి బాధపడుతూ కూర్చోవడం ఎందుకు సరైనది కాదు?
9 మీకు బాధను మిగిల్చిన పనులేమైనా మీరు గతంలో చేశారా? అనవసరమైన వాటి కోసం మీ విలువైన సమయాన్ని, శక్తిని వృథా చేశారా? ఇతరులకు హాని కలిగేలా ప్రవర్తించారా? ఇలాంటి లేదా మరితర కారణాలను బట్టి మీరు ఇప్పుడు సంతాపపడుతుండవచ్చు. అయితే, దాని విషయంలో మీరిప్పుడు ఏమి చేయవచ్చు?
10 చాలామంది ప్రజలు అదేపనిగా బాధపడుతుంటారు. నిజానికి దానివల్ల, మనం నిరాశానిస్పృహలకు లోనౌతాం, చిత్రవధకు గురౌతాం. అది చెప్పలేనంత ఆందోళనకు గురిచేస్తుంది. నిజానికి అలా బాధపడితే సమస్య పరిష్కారం అవుతుందా? కానేకాదు! ఒకసారి ఆలోచించండి, స్టాండు వేసివున్న సైకిలు ఎక్కి మన శక్తినంతా ఉపయోగించి ఎంతసేపు తొక్కినా మనం ఎక్కడికీ వెళ్లం. అలాగే సమస్య గురించి అదే పనిగా ఆలోచిస్తూ కూర్చునే బదులు దాని పరిష్కారానికి ఏమైనా చేస్తేనే ఫలితం ఉంటుంది. మీ మాటల వల్ల ఇతరులు గాయపడి ఉంటే క్షమాపణ అడగండి, అలా చేస్తే వాళ్లతో తిరిగి సత్సంబంధాలు నెలకొల్పుకోవచ్చు. సమస్యకు కారణాలు ఏవైనా, అవి మళ్లీ ఉత్పన్నం కాకుండా చూసుకుంటే భవిష్యత్తులో అలాంటి సమస్య మళ్లీ తలెత్తదు. అయినా, కొన్నిసార్లు మీరు చేసిన తప్పుల వల్ల వచ్చిన ఫలితాల్ని అనుభవించడం మినహా మీరు చేసేదేమి ఉండదు. కానీ, వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే దేవుని సేవలో మీరు చేయగలిగినదంతా చేయలేరు. పైగా, దానివల్ల ప్రయోజనమేమీ ఉండదు!
11. (ఎ) యెహోవా కనికరాన్ని, కృపను మనమెలా పొందవచ్చు? (బి) గతంలో చేసిన తప్పుల గురించి బాధపడకుండా మనశ్శాంతిగా ఉండాలంటే ఏ సూత్రాన్ని పాటించాలి?
11 కొంతమంది గతంలో చేసిన తప్పుల గురించి ఆలోచించీ ఆలోచించీ తాము దేవుని దృష్టిలో ఎందుకూ పనికిరానివాళ్లమని అనుకునేంతగా కృంగిపోతారు. గతంలో గంభీరమైన పాపం చేయడం వల్ల లేదా ప్రస్తుతం తరచూ తప్పిపోతుండడం వల్ల తాము దేవుని కనికరాన్ని పొందడానికి అర్హులం కాదని వాళ్లు అనుకుంటారు. అయితే వాస్తవమేమిటంటే ఒక వ్యక్తి గతంలో ఎలాంటి తప్పు చేసినా పశ్చాత్తాపపడి, మారుమనస్సు పొంది, దేవుని క్షమాపణను వేడుకోవచ్చు. (అపొ. 3:20) యెహోవా తన కనికరాన్ని, కృపను ఇతరుల మీద చూపించినట్లే అలాంటివాళ్ల మీద కూడా చూపిస్తాడు. వినయంగా, నిజాయితీగా ఉండి, మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడేవాళ్ల మీద యెహోవా దయ చూపిస్తాడు. యోబు విషయంలో దేవుడు అలాగే చేశాడు. యోబు ఇలా అన్నాడు: ‘నేను ధూళిలోను, బూడిదెలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను.’ (యోబు 42:6) మనశ్శాంతిని పొందడానికి దేవుడు ఇచ్చిన ఈ సూత్రాన్ని మనమందరం పాటించాలి: “అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును.” (సామె. 28:13; యాకో. 5:14-16) కాబట్టి, మనం దేవుని ముందు మన పాపాన్ని ఒప్పుకోవాలి, ఆయన క్షమాపణ కోరాలి, తప్పు దిద్దుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలి. (2 కొరిం. 7:10, 11) మనం అవన్నీ చేస్తే, ‘బహుగా క్షమించే’ యెహోవా కనికరాన్ని పొందవచ్చు.—యెష. 55:7.
12. (ఎ) దావీదు ఉదాహరణ చూపిస్తున్నట్లుగా, అపరాధ భావాల్ని తీసేసుకోవడానికి సరైన పద్ధతి ఏమిటి? (బి) యెహోవా ఏ భావంలో సంతాపపడ్డాడు? ఆ విషయం తెలుసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏమిటి? (బాక్సు చూడండి.)
12 ప్రార్థనకు ఎంతో శక్తి ఉంది, ప్రార్థన ద్వారా మనం యెహోవా సహాయాన్ని పొందవచ్చు. విశ్వాసంతో దావీదు తన భావాల్ని యెహోవా ముందు కుమ్మరించి చేసిన ప్రార్థన మనకోసం కీర్తనల్లో చక్కగా పొందుపర్చబడింది. (కీర్తన 32:1-5 చదవండి.) అపరాధ భావాల్ని అణచిపెట్టుకోవడం వల్ల నీరసించిపోయానని దావీదు ఒప్పుకున్నాడు. ఆయన తన తప్పు వల్ల మానసిక, శారీరక క్షోభను అనుభవించాడు, తన పాపాన్ని ఒప్పుకోనందువల్ల ఆనందాన్ని కూడా కోల్పోయాడు. మరి దావీదు ఎలా క్షమాపణను, మనశ్శాంతిని పొందాడు? కేవలం దేవుని ముందు తన పాపాన్ని ఒప్పుకోవడం ద్వారానే. దావీదు ప్రార్థనలకు యెహోవా జవాబిచ్చాడు, మనశ్శాంతిని దయచేశాడు, మంచి పనులు చేసేలా బలపర్చాడు. అలాగే, మీరు కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే, యెహోవా మీ విన్నపాలను తప్పకుండా వింటాడనే నమ్మకాన్ని మీరు కలిగి ఉండవచ్చు. గతంలో చేసిన తప్పులు మిమ్మల్ని వేదిస్తుంటే, వాటిని సరిదిద్దుకోవడానికి మీరు చేయగలిగినదంతా చేయండి, యెహోవా మిమ్మల్ని క్షమించాడని బలంగా నమ్మండి.—కీర్త. 86:5.
భవిష్యత్తు మీద దృష్టి నిలపండి
13, 14. (ఎ) మనం ఇప్పుడు ముఖ్యంగా దేని గురించి ఆలోచించాలి? (బి) మన ప్రస్తుత పరిస్థితిని పరిశీలించుకోవడానికి ఏ ప్రశ్నలు వేసుకోవాలి?
13 గతం నుండి మనం పాఠాలు నేర్చుకోవచ్చు. అలాగని గతం గురించే ఆలోచిస్తూ కూర్చోకుండా ప్రస్తుతం గురించి, భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ప్రయోజనం ఉంటుంది. మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవాలి: ‘ఇప్పుడు నేను తీసుకునే నిర్ణయాల విషయంలో ముందుముందు బాధపడే పరిస్థితి వస్తుందా? మరోలా చేసి ఉంటే బాగుండేదని అప్పుడు అనిపిస్తుందా? భవిష్యత్తులో సంతాపపడే పరిస్థితి రాకుండా నేనిప్పుడు నమ్మకంగా యెహోవా సేవ చేస్తున్నానా?’
14 మహాశ్రమలు సమీపిస్తుండగా, మనం ఇలాంటి ఆలోచనలతో సతమతం కాకుండా చూసుకోవాలి: ‘దేవుని సేవలో నేను ఇంకా ఎక్కువ చేయాల్సిందా? అవకాశం ఉన్నప్పుడు నేను పయినీరు సేవ ఎందుకు చేయలేదు? నేను ఎందుకు పరిచర్య సేవకునిగా సేవ చేసేందుకు అర్హతలు సంపాదించుకోలేకపోయాను? నూతన వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవడానికి నేను నిజంగా కృషి చేశానా? నూతన లోకంలో ఉండేందుకు కావాల్సిన అర్హతలు నాకున్నాయా?’ అలాంటి ప్రశ్నల గురించి కేవలం ఆందోళనపడుతూ కూర్చునే బదులు, వాటిని ఉపయోగించుకొని మనల్ని మనం పరిశీలించుకోవాలి, యెహోవా సేవలో మనం చేయగలిగినదంతా చేయాలి. లేదంటే, భవిష్యత్తులో ఇంకా ఎక్కువ బాధపడేలా చేసే జీవితాన్ని మనమిప్పుడు గడిపే ప్రమాదం ఉంది.—2 తిమో. 2:15.
పవిత్ర సేవ విషయంలో ఎన్నడూ సంతాపపడకండి
15, 16. (ఎ) తమ జీవితంలో దేవుని సేవకు మొదటి స్థానం ఇవ్వడానికి చాలామంది క్రైస్తవులు ఎలాంటి త్యాగాలు చేశారు? (బి) రాజ్య సంబంధమైన విషయాల కోసం చేసిన త్యాగాల గురించి మనం ఎందుకు చింతించకూడదు?
15 పూర్తికాల సేవ చేయడానికి త్యాగాలు చేసినవాళ్ల విషయమేమిటి? బహుశా మీరు రాజ్య సంబంధమైన విషయాల కోసం మీ జీవితాన్ని సరళం చేసుకోవడానికి, పరిచర్యలో ఎక్కువ సమయం వెచ్చించడానికి మంచి ఉద్యోగాన్ని లేదా లాభాలు గడించే వ్యాపారాన్ని వదులుకొని ఉండవచ్చు. లేదా పూర్తికాల సేవకోసం అవివాహితులుగానే జీవిస్తుండవచ్చు. ఒకవేళ పెళ్లైనా కొన్ని రకాలైన పూర్తికాల సేవలో ఉండేందుకు అంటే బెతెల్ సేవలో, అంతర్జాతీయ నిర్మాణ పనిలో, ప్రయాణ సేవలో, మిషనరీ సేవలో ఉండేందుకు వీలుగా పిల్లలు వద్దని నిర్ణయించుకొని ఉండవచ్చు. యెహోవా సేవ చేస్తూ మీ వయసు పైబడుతున్న కొద్దీ, అలాంటి నిర్ణయాలు తీసుకున్నందుకు మీరు సంతాపపడాలా? అనవసరంగా అలాంటి త్యాగాలు చేశామని లేదా ఆ త్యాగాలు చేయడానికి ఇంకొంతకాలం ఆగివుంటే బాగుండేదని చింతించాలా? అస్సలు అవసరం లేదు!
16 యెహోవా మీద మీకున్న ప్రేమను బట్టి, ఆయన గురించి ఇతరులకు తెలియజేయాలనే మీ బలమైన కోరికను బట్టి మీరు ఆ త్యాగాలు చేశారు. మరో విధమైన నిర్ణయాలు తీసుకొని ఉంటే జీవితం ఇంకా బాగుండేదని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. మీ విషయంలో మీకు సరైనదని అనిపించిన దాన్నే మీరు చేశారు కాబట్టి మీరు పూర్తి సంతృప్తితో ఉండవచ్చు. యెహోవాను సేవించడానికి మీ శక్తియుక్తుల్ని మొత్తం ధారపోశారనే వాస్తవాన్ని బట్టి మీరు సంతోషించవచ్చు. మీరు గడిపిన స్వయంత్యాగపూరిత జీవితాన్ని యెహోవా మర్చిపోడు. రాబోయే వాస్తవమైన జీవితంలో, మీరు ఊహించలేనన్ని ఆశీర్వాదాల్ని ఆయన మీకు ఇస్తాడు.—కీర్త. 145:16; 1 తిమో. 6:18, 19.
సంతాపపడాల్సిన పరిస్థితి రాకుండా యెహోవా సేవ ఎలా చేయవచ్చు?
17, 18. (ఎ) సంతాపపడాల్సిన పరిస్థితి రాకుండా దేవుని సేవచేయడానికి పౌలుకు ఏ సూత్రం సహాయం చేసింది? (బి) గతం విషయంలో, ప్రస్తుతం విషయంలో, భవిష్యత్తు విషయంలో మీ దృఢ నిశ్చయం ఏమిటి?
17 మరింత సంతాపపడాల్సిన పరిస్థితి రాకుండా యెహోవా సేవచేసేందుకు సహాయం చేసిన ఏ సూత్రాన్ని పౌలు నేర్చుకున్నాడు? పౌలు రాసిన మాటలు జే.బి. ఫిలిప్స్ అనువాదంలో ఇలా ఉన్నాయి: ‘గతాన్ని వదిలేసి భవిష్యత్తును చూస్తూ, చేతులు చాచి నా గమ్యం వైపు అడుగులు వేస్తున్నాను.’ (ఫిలిప్పీయులు 3:13, 14 చదవండి.) తాను యూదా మతంలో ఉన్నప్పుడు చేసిన తప్పుల గురించి పౌలు బాధపడుతూ కూర్చోలేదు. బదులుగా, భవిష్యత్తులో నిత్యజీవ బహుమానాన్ని పొందేందుకు అర్హత సాధించడానికి ఆయన శాయశక్తులా కృషిచేశాడు.
18 పౌలు చెప్పిన మాటల్లో ఉన్న సూత్రాన్ని మనమందరం పాటించవచ్చు. మనం మార్చలేని గతం గురించి బాధపడుతూ కూర్చునే బదులు భవిష్యత్తు మీద దృష్టి నిలపాలి. గతంలో మనం చేసిన తప్పుల్ని మనం పూర్తిగా మర్చిపోలేకపోవచ్చు. అలాగని పదేపదే గతాన్ని తవ్వుకుంటూ బాధపడాల్సిన అవసరం లేదు. గతాన్ని వదిలేసి ప్రస్తుతం శాయశక్తులా దేవుని సేవ చేస్తూ మనం పొందబోయే గొప్ప భవిష్యత్తు మీద దృష్టి నిలుపుదాం.
a సౌలు స్త్రీలను కూడా హింసించాడని లేఖనాలు పదేపదే ప్రస్తావించడాన్ని చూస్తే, స్త్రీలు ఇప్పటిలాగే మొదటి శతాబ్దంలో కూడా క్రైస్తవత్వాన్ని వ్యాప్తి చేయడంలో గొప్ప పాత్ర పోషించారని అర్థమౌతోంది.—కీర్త. 68:11.