కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆనాటి జ్ఞాపకాలు

“మర్చిపోలేనిది” సరైన సమయంలో వచ్చింది

“మర్చిపోలేనిది” సరైన సమయంలో వచ్చింది

“మర్చిపోలేనిది!” చాలామంది “క్రియేషన్‌ డ్రామా” చూసిన తర్వాత అన్న మాటలవి. సరైన సమయంలో వచ్చిన ఆ డ్రామా ప్రేక్షకుల మనస్సు మీద చెరగని ముద్ర వేసింది. హిట్లర్‌ పాలన ఐరోపాలోని దేవుని ప్రజల్ని తీవ్రమైన హింసలకు గురి చేయడానికి కొంతకాలం ముందు “క్రియేషన్‌ డ్రామా” యెహోవా నామానికి స్తుతి కలిగేలా గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చింది. ఇంతకీ ఏమిటా “క్రియేషన్‌ డ్రామా”?

షోప్‌ఫంగ్‌ (క్రియేషన్‌) అనే పుస్తకం నుండి కొత్త డ్రామా పేరు తీసుకున్నారు

1914లో, అమెరికాలో న్యూయార్క్‌ నగరంలోని బ్రూక్లిన్‌లో ఉన్న యెహోవా ప్రజల ప్రధాన కార్యాలయం “ఫోటో డ్రామా ఆఫ్‌ క్రియేషన్‌” విడుదల చేసింది. ఫోటో స్లైడ్లు, చలన చిత్రం ఉన్న పూర్తిస్థాయి కలర్‌, సౌండు డ్రామా అది. దాని నిడివి ఎనిమిది గంటలు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది ఆ “ఫోటో డ్రామా” వీక్షించారు. 1914లో అదే డ్రామా తక్కువ నిడివితో “యురేకా డ్రామా” అనే పేరుతో విడుదలైంది. కానీ 1920వ దశకానికల్లా దాని స్లైడ్లు, ఫిల్మ్‌ రీళ్లు, ప్రొజెక్టర్‌ మొదలైన సామాగ్రి బాగా పాడైపోయాయి. అయినా, “ఫోటో డ్రామా” ప్రదర్శనకు మాత్రం ప్రేక్షకాదరణ ఏ మాత్రం తగ్గలేదు. ఉదాహరణకు, జర్మనీలో ఉన్న లూడ్‌విక్స్‌బుర్క్‌ నివాసులు, “‘ఫోటో డ్రామా’ మళ్లీ ఎప్పుడు చూపిస్తారు?” అని అడిగారు. అప్పుడు సాక్షులు ఏమి చేశారు?

డ్రామాను మళ్లీ ప్రదర్శించడానికి వీలుగా, 1920లలో జర్మనీలో మాగ్డెబర్గ్‌లోని బెతెల్‌కుటుంబ ప్రతినిధులు ఫ్రాన్స్‌లోని పారిస్‌లో ఉన్న ఒక వార్తా సంస్థ నుండి కొన్ని ఫిల్మ్‌ రీళ్లను, అలాగే లీప్‌జిగ్‌, డ్రెస్‌డెన్‌ ప్రాంతాల్లో ఉన్న గ్రాఫిక్స్‌కంపెనీల నుండి కొన్ని స్లైడ్లను కొన్నారు. అలా కొన్న వాటిని ఇంకా పాడవ్వని పాత “ఫోటో డ్రామా” స్లైడ్లతో జతచేశారు.

ఫిల్మ్‌లతో, స్లైడ్లతో ఉన్న డ్రామాకు సంగీత ప్రావీణ్యుడైన సహోదరుడు ఎరిక్‌ ఫ్రాస్ట్‌ సంగీతాన్ని అందించాడు. ఆ డ్రామాకు జోడించిన కథనంలోని కొన్ని వాక్యాలను క్రియేషన్‌ పుస్తకంలో నుండి తీసుకున్నారు. అందుకే, మార్పులు చేర్పులు చేసిన ఆ ఫోటో డ్రామాకు “క్రియేషన్‌ డ్రామా” అనే పేరు పెట్టారు.

కొత్త డ్రామా కూడా సరిగ్గా “ఫొటో డ్రామా” తరహాలోనే ఎనిమిది గంటల నిడివిగలది. దాన్ని చిన్నచిన్న భాగాలుగా వరుసగా కొన్ని రోజుల పాటు ప్రతీరోజు సాయంకాలం చూపించేవాళ్లు. ప్రేక్షకులు ఆద్యంతం ఆసక్తితో తిలకించేలా, సృష్టి దినాల్లో ఏ రోజున ఏమి జరిగిందో ఆ డ్రామా చూపించింది; బైబిలుపరమైన, చారిత్రకపరమైన విషయాలను సమీక్షించింది; అబద్ధమతం మానవులను తప్పుదోవ పట్టించిందని సూచించింది. ఆస్ట్రియా, జర్మనీ, లక్సెంబర్గ్‌, స్విట్జర్లాండ్‌ వంటి దేశాల్లో, అలాగే జర్మనీ భాష మాట్లాడే ప్రజలు ఉన్న వేర్వేరు దేశాల్లో ఆ “క్రియేషన్‌ డ్రామా” చూపించారు.

ఎరిక్‌ ఫ్రాస్ట్‌, అలాగే “క్రియేషన్‌ డ్రామా” కోసం ఆయన అందించిన సంగీతపు నోట్స్‌

ఎరిక్‌ ఫ్రాస్ట్‌ ఇలా వివరించాడు: “డ్రామాను ప్రదర్శిస్తున్నప్పుడు నా తోటివాళ్లను, ముఖ్యంగా మా వాద్యబృందంలో ఉన్న వాళ్లను డ్రామా విరామ సమయంలో ప్రతీ వరుసలో ఉన్న ప్రేక్షకుల దగ్గరకు వెళ్లి మన పుస్తకాలను, చిన్న పుస్తకాలను వాళ్లకు అందివ్వమన్నాను. ఇంటింటి పరిచర్యలో ఇచ్చినవాటి కన్నా మేము ఈ రకంగా ఇచ్చిన సాహిత్యాలే ఎక్కువ.” డ్రామాను చూసేందుకు వచ్చిన వాళ్లలో చాలామంది తమ అడ్రస్సులను ఇచ్చి వెళ్లారని పోలండ్‌లో, ప్రస్తుతం జెక్‌ రిపబ్లిక్‌ అని పిలువబడుతున్న దేశంలో డ్రామా ప్రదర్శనల నిర్వహణను చూసుకున్న యోహాన్నస్‌ రౌట గుర్తుచేసుకున్నాడు. అలా అడ్రస్సులు ఇచ్చి వెళ్లినవాళ్లతో ఆ తర్వాత ఎన్నో చక్కని బైబిలు చర్చలు సాగాయి.

1930లలో పరిస్థితి ఎలా తయారైందంటే, ‘క్రియేషన్‌ డ్రామాను’ ప్రదర్శించినప్పుడల్లా హాళ్లన్నీ జనాలతో కిక్కిరిసిపోయేవి. ఎక్కడ చూసినా యెహోవాసాక్షుల గురించే మాట్లాడుకునేవాళ్లు. 1933 కల్లా, జర్మనీ బ్రాంచి కార్యాలయం ఏర్పాటు చేసిన డ్రామా ప్రదర్శనలను దాదాపు 10 లక్షలమంది వీక్షించారు. కాట్ట క్రౌస్‌ ఇలా గుర్తుచేసుకుంది: “కేవలం డ్రామాను చూసేందుకే, ఆ ప్రదర్శన జరిగిన 5 రోజుల్లో ప్రతీరోజు మేము చెట్ల గుండా, కొండల గుండా, లోయల గుండా 10 కి.మీ. కాలినడకన వెళ్లేవాళ్లం.” ఎల్జ బిల్‌హార్ట్స్‌ అనే సహోదరి ఇలా అంది: “‘క్రియేషన్‌ డ్రామా’ వల్లే నేను సత్యానికి ఆకర్షితురాలినయ్యాను.”

మా అమ్మ ఆ డ్రామా చూసి “ఎంతగా నివ్వెరపోయిందంటే, వెంటనే ఓ బైబిలు కొని ‘purgatory’ (పాపవిమోచన లోకం) అనే పదం కోసం వెదకింది” అని ఆల్‌ఫ్రేట్‌ ఆల్‌మెండింగ గుర్తుచేసుకున్నాడు. బైబిల్లో ఒక్కసారి కూడా ఆ పదం కనిపించకపోవడంతో మా అమ్మ చర్చీకి వెళ్లడం మానేసి, ఆ తర్వాత యెహోవాకు సమర్పించుకొని బాప్తిస్మం తీసుకుంది. “‘క్రియేషన్‌ డ్రామా’ వల్ల ఎంతోమంది ప్రజలు సత్యంలోకి వచ్చారు” అని ఎరిక్‌ ఫ్రాస్ట్‌ గుర్తుచేసుకున్నాడు.—3 యోహా. 1-3.

“క్రియేషన్‌ డ్రామా” తారాస్థాయిలో ప్రదర్శితమౌతున్న కాలంలోనే ఐరోపాలో నాజీ పరిపాలకులు విజృంభించారు. 1933 మొదలుకొని, జర్మనీలో యెహోవాసాక్షుల కార్యకలాపాలను నిషేధించారు. అప్పటినుండి 1945లో రెండవ ప్రపంచయుద్ధం ముగిసేవరకు ఐరోపాలోని యెహోవాసాక్షులు తీవ్రమైన హింసలను ఎదుర్కొన్నారు. ఎరిక్‌ ఫ్రాస్ట్‌ సుమారు ఎనిమిదేళ్ల పాటు జైల్లో ఉన్నాడు. జైలు నుండి విడుదలైన తర్వాత ఆయన జర్మనీలోని వెస్‌బాడెన్‌లో ఉన్న బెతెల్‌ గృహంలో సేవచేశాడు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో విశ్వాస సంబంధమైన పరీక్షలు ఎదుర్కోవడానికి కొంతకాలం ముందు క్రైస్తవులు తమ మనోధైర్యాన్ని కూడగట్టుకునేలా మర్చిపోలేని “క్రియేషన్‌ డ్రామా” సరైన సమయంలో వచ్చింది.—జర్మనీ నుండి సేకరించినవి.