మహిమ పొందకుండా చేసే ప్రతీదానికి దూరంగా ఉండండి
“వినయమనస్కుడు ఘనత [“మహిమ,” NW] నొందును.”—సామె. 29:23.
1, 2. (ఎ) లేఖనాల్లో “ఘనత” లేక “మహిమ” అని అనువదించబడిన పదాలకు మూల భాషలో ఏ అర్థం ఉంది? (బి) ఈ ఆర్టికల్‌లో మనం ఏ ప్రశ్నల్ని పరిశీలిస్తాం?
“మహిమ” అనే మాట వినగానే మీకేమి గుర్తుకొస్తుంది? అద్భుతమైన దేవుని సృష్టి గుర్తుకొస్తుందా? (కీర్త. 19:1) లేక గొప్పగొప్ప పనులు చేసిన వాళ్లకు, అలాగే అంతులేని సిరిసంపదలు, జ్ఞానం ఉన్న వాళ్లకు సమాజం ఇచ్చే ఘనతాగౌరవాలు గుర్తుకొస్తాయా? లేఖనాల్లో “ఘనత” లేక “మహిమ” అని అనువదించబడిన మూల భాషా పదాలకు ‘బరువైన’ అనే అర్థం ఉంది. ప్రాచీన కాలాల్లో, నాణేలను విలువైన లోహాలతో తయారు చేసేవాళ్లు. నాణెం ఎంత ఎక్కువ బరువుంటే దానికి అంత ఎక్కువ విలువ ఉండేది. బరువైన అని అర్థాన్నిచ్చే పదాల్ని ప్రజలు రానురాను అమూల్యమైన వాటిని, గొప్పవాటిని లేదా ఆకట్టుకునేవాటిని సూచించడానికి ఉపయోగించడం మొదలుపెట్టారు.
2 సాధారణంగా మనుష్యులు ఒక వ్యక్తికున్న అధికారాన్ని, హోదాను లేదా పేరుప్రతిష్ఠల్నే గొప్పగా చూస్తారు, కానీ దేవుడు ఏమి చూస్తాడు? మనుష్యులకు దేవుడు ఇచ్చే ఘనత గురించి లేఖనాలు ప్రస్తావిస్తున్నాయి. ఉదాహరణకు సామెతలు 22:4 ఇలా చెబుతోంది: “యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దానివలన కలుగును.” శిష్యుడైన యాకోబు కూడా ఇలా రాశాడు: “ప్రభువు [“యెహోవా,” NW] దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడాయన మిమ్మును హెచ్చించును.” (యాకో. 4:10) ఇంతకీ యెహోవా దేవుడు మానవులకు ఇచ్చే ఘనత ఏమిటి? వేటివల్ల మనం దాన్ని పొందలేకపోవచ్చు? దేవుడు ఇచ్చే ఘనతను పొందేందుకు ఇతరులకు మనమెలా సహాయం చేయవచ్చు?
3-5. యెహోవా మనకు ఎలాంటి మహిమను దయచేస్తాడు?
3 దేవుడు తన కుడిచేతిని పట్టుకొని నిజమైన మహిమను పొందే విధంగా నడిపిస్తాడని కీర్తనకర్త బలంగా నమ్మాడు. (కీర్తన 73:23, 24 చదవండి.) ఇంతకీ ఆ పనిని యెహోవా ఎలా చేస్తాడు? వినయస్థులైన తన సేవకులను పలు విధాలుగా గౌరవించడం ద్వారా యెహోవా వాళ్లకు మహిమను ఇస్తాడు. తన చిత్తం గురించి అర్థంచేసుకునేలా యెహోవా వాళ్లను ఆశీర్వదిస్తాడు. (1 కొరిం. 2:7) తన మాట విని, తనకు లోబడేవాళ్లకు యెహోవా తనతో స్నేహం చేసే గొప్ప గౌరవాన్ని ఇస్తాడు.—యాకో. 4:8.
4 యెహోవా తన సేవకులకు క్రైస్తవ పరిచర్య అనే ఐశ్వర్యాన్ని కూడా అప్పగించాడు. (2 కొరిం. 4:1, 7) ఆ పరిచర్య మనకు మహిమను తీసుకొస్తుంది. తన నామాన్ని ఘనపర్చేలా, ఇతరులకు ప్రయోజనం చేకూర్చేలా తమ సేవా నియామకాల్ని నిర్వర్తించేవాళ్లకు యెహోవా ఇలా వాగ్దానం చేశాడు: “నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును.” (1 సమూ. 2:30) అలాంటి వాళ్లు యెహోవా దృష్టిలో మంచి పేరు సంపాదించుకుంటారు, తోటి క్రైస్తవులు కూడా వాళ్ల గురించి మంచిగా మాట్లాడతారు.—సామె. 11:16; 22:1.
5 ‘యెహోవా కోసం కనిపెట్టుకొని ఉంటూ, ఆయన మార్గాన్ని అనుసరించే’ వాళ్ల భవిష్యత్తు ఎలా ఉంటుంది? బైబిలు ఇలా చెబుతోంది: “భూమిని స్వతంత్రించుకొనునట్లు ఆయన [యెహోవా] నిన్ను హెచ్చించును భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు.” (కీర్త. 37:34) అలాంటి వాళ్లు నిత్య జీవమనే సాటిలేని గౌరవాన్ని పొందుతారు.—కీర్త. 37:29.
“నేను మనుష్యులవలన మహిమ పొందువాడను కాను”
6, 7. చాలామంది యేసుపై ఎందుకు విశ్వాసం ఉంచలేదు?
6 యెహోవా మనకు ఇవ్వాలనుకుంటున్న మహిమను మనం వేటివల్ల పొందలేకపోవచ్చు? ఒక కారణం, దేవునితో స్నేహం చేయని ప్రజల అభిప్రాయాలకు అధిక ప్రాధాన్యతనివ్వడమే. యేసు కాలంలో అధికారంగల స్థానాల్లో ఉన్న కొందరి గురించి అపొస్తలుడైన యోహాను ఏమి రాశాడో గమనించండి: “అయినను అధికారులలో కూడ అనేకులు ఆయన [యేసు] యందు విశ్వాసముంచిరి గాని, సమాజములో నుండి వెలివేయబడుదుమేమోయని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పుకంటె మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి.” (యోహా. 12:42, 43) ఆ అధికారులు పరిసయ్యుల ఆలోచనలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వకుండా ఉంటే ఎంత బాగుండేది!
7 చాలామంది ప్రజలు తనను ఎందుకు అంగీకరించరో, తనపై ఎందుకు విశ్వాసం ఉంచరో యేసు తన పరిచర్య ఆరంభంలోనే స్పష్టం చేశాడు. (యోహాను 5:39-44 చదవండి.) అప్పటికే ఎన్నో శతాబ్దాలుగా ఇశ్రాయేలీయులు మెస్సీయ రాక కోసం ఎదురుచూస్తున్నారు. యేసు బోధించడం ఆరంభించినప్పుడు, కొంతమంది వ్యక్తులు దానియేలు ప్రవచనం ప్రకారం క్రీస్తు రావాల్సిన సమయం అదేనని గుర్తించి ఉంటారు. అప్పటికి కొన్ని నెలల క్రితం బాప్తిస్మమిచ్చు యోహాను ప్రకటనా పని చేస్తున్నప్పుడు, “ఇతడు క్రీస్తయి యుండునేమో?” అని చాలామంది అనుకున్నారు. (లూకా 3:15) ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మెస్సీయ తమ మధ్యలోకి వచ్చి బోధించడం మొదలుపెట్టాడు. అయినా ధర్మశాస్త్ర ప్రావీణ్యులు ఆయనను అంగీకరించలేదు. దానికిగల కారణాన్ని సూటిగా చెబుతూ యేసు ఇలా అన్నాడు: “అద్వితీయ దేవునివలన వచ్చు మెప్పును కోరక యొకనివలన ఒకడు మెప్పుపొందుచున్న మీరు ఏలాగు నమ్మగలరు?”
8, 9. మానవులు ఇచ్చే మహిమ ఏ విధంగా దేవుడిచ్చే మహిమను గుర్తించకుండా చేస్తుందో ఉదాహరణతో చెప్పండి.
8 మానవులు ఇచ్చే మహిమ ఏ విధంగా దేవుడిచ్చే మహిమను గుర్తించకుండా చేస్తుందో అర్థంచేసుకోవడానికి మనం మహిమను వెలుగుతో పోల్చి చూద్దాం. విశ్వం ఎంతో కాంతివంతమైనది. చుట్టూ ఏమాత్రం వెలుతురు లేని రాత్రుల్లో ఆకాశం వైపు చూస్తే, వేలాది నక్షత్రాలు మిలమిల మెరుస్తూ కనిపిస్తాయి. “నక్షత్రముల మహిమ” అద్భుతమైనది. (1 కొరిం. 15:40, 41) అయితే, విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్న రోడ్డు మీద నిలబడి పైకి చూస్తే ఆకాశం ఎలా కనిపిస్తుంది? ఆ వీధి దీపాల వల్ల, సుదూరాన ఉన్న నక్షత్రాలు ప్రసరించే వెలుగు మనకు అసలు కనిపించకపోవచ్చు. అలాగని నక్షత్రాల కన్నా రోడ్డు మీద ఉన్న విద్యుత్ దీపాలు మరింత ప్రకాశవంతంగా, అందంగా ప్రకాశిస్తున్నాయనా? కానేకాదు. కేవలం, ఆ విద్యుత్ దీపాలు మనకు దగ్గరగా ఉన్నందువల్లే ఆ నక్షత్రాల వెలుగును మనం చూడలేకపోతాం, అంతే. రాత్రుల్లో ఆకాశంలోని అద్భుతాలను తిలకించాలంటే, విద్యుత్ దీపాలు లేని ప్రదేశంలో నిలబడి చూడాలి.
9 అలాగే తప్పుడు మహిమ మన మనసుకు దగ్గరగా ఉంటే మనం యెహోవా దయచేసే శాశ్వత మహిమను గుర్తించలేం, దాన్ని పొందడం కోసం ప్రయత్నించలేం. తెలిసినవాళ్లు లేదా కుటుంబ సభ్యులు తమ గురించి ఏమనుకుంటారో అనే భయంతో చాలామంది రాజ్య సందేశాన్ని అంగీకరించరు. అయితే, మానవుల నుండి మహిమను పొందాలనే కోరిక దేవుని సమర్పిత సేవకుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉందా? ఉదాహరణకు, ప్రకటనా పని చేయమని ఒక క్రైస్తవ యువకునికి ఓ క్షేత్రాన్ని అప్పగించారనుకోండి. అక్కడి వాళ్లందరికీ ఈ యువకుడు తెలుసు, కానీ ఈయన ఒక యెహోవాసాక్షి అనే విషయం మాత్రం తెలియదు. అప్పుడు ఆ యువకుడు భయంతో వెనకడుగు వేస్తాడా? మరోవైపున, దేవుని సేవకు సంబంధించిన లక్ష్యాలను చేరుకోవడానికి ప్రయత్నిస్తున్న క్రైస్తవుణ్ణి ఇతరులు గేలి చేస్తుంటే? సరైన ఆధ్యాత్మిక అవగాహన లేని అలాంటివాళ్ల అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకొని ఆ క్రైస్తవుడు తన లక్ష్యాల్ని మార్చుకుంటాడా? ఇంకో సందర్భాన్ని పరిశీలించండి. ఒక క్రైస్తవుడు గంభీరమైన పాపం చేసి ఉండవచ్చు. సంఘంలో తనకున్న సేవాధిక్యతలు పోతాయనో, తన ప్రియమైనవాళ్లను నిరాశపర్చకూడదనో ఆయన దాన్ని కప్పిపుచ్చుతాడా? యెహోవాతో తనకున్న సంబంధాన్ని పునరుద్ధరించుకోవడానికే ప్రాధాన్యతనిస్తే, ఆయన తప్పకుండా “సంఘపు పెద్దలను” ఆశ్రయించి సహాయం కోరతాడు.—యాకోబు 5:14-16 చదవండి.
10. (ఎ) మనం పరువు గురించి ఎందుకు అతిగా చింతించకూడదు? (బి) వినయస్థులకు ఏ అభయం ఉంది?
10 మనం క్రైస్తవ పరిణతిని సాధిస్తున్నా కొన్నిసార్లు తోటి విశ్వాసి ఒకరు మనల్ని సరిదిద్దేందుకు సలహాలు ఇవ్వవచ్చు. అప్పుడు మనం గర్వంతోనో, పరువు కాపాడుకోవాలనో, చేసిన పనిని సమర్థించుకోవాలనో ప్రయత్నించకుండా నిజాయితీగా ఆయన ఇచ్చిన సలహాల్ని పరిగణనలోకి తీసుకుంటే తప్పక ప్రయోజనం ఉంటుంది. మరో సన్నివేశాన్ని చూడండి. మీరు, ఒక తోటి విశ్వాసితో కలిసి ఓ పని చేస్తున్నారనుకోండి. తెలివితేటలు, కష్టం మీవైతే పేరు మాత్రం ఆయనకు దక్కుతుందేమో అనే ఆలోచనతో సరిగ్గా చేయకుండా ఉంటారా? పైన చెప్పినటువంటి పరిస్థితుల్లో మీరు ఉంటే, “వినయమనస్కుడు ఘనతనొందును” అనే అభయాన్ని కలిగి ఉండండి.—సామె. 29:23.
11. ఇతరులు మనల్ని మెచ్చుకున్నప్పుడు మనం లోలోపల ఎలా స్పందించాలి? ఎందుకు?
11 సంఘ పెద్దలు, అలాగే ‘అధ్యక్ష పదవికి’ అర్హులవ్వడానికి కృషిచేసే వాళ్లు మనుష్యులు ఇచ్చే మహిమను కోరుకోకూడదు. (1 తిమో. 3:1; 1 థెస్స. 2:6) ఏదైనా పని చక్కగా చేసినందుకు ఒక సహోదరుణ్ణి ఇతరులు మెచ్చుకున్నప్పుడు ఆయన ఎలా స్పందించాలి? తన గొప్ప కోసం ‘జయసూచకమైన శిలను నిలిపిన’ సౌలులా ఆ సహోదరుడు ప్రవర్తించకపోవచ్చు. (1 సమూ. 15:12) అయితే, యెహోవా కృప వల్లే తాను ఆ పనిని చేయగలిగానని, భవిష్యత్తులో కూడా యెహోవా ఆశీర్వాదం, సహాయం లేకుండా ఏమీ సాధించలేనని ఆ సహోదరుడు గుర్తిస్తాడా? (1 పేతు. 4:11) ఇతరులు మనల్ని పొగిడినప్పుడు లోలోపల మనం ఎలా భావిస్తామనే దాన్నిబట్టి మనం ఎలాంటి మహిమను కోరుకుంటున్నామో తెలుస్తుంది.—సామె. 27:21.
“మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు”
12. కొందరు యూదులు ఎందుకు యేసు మాట వినలేదు?
12 మనకున్న కోరికలు కూడా కొన్నిసార్లు దేవుడు ఇచ్చే మహిమను పొందకుండా చేస్తాయి. చెడు కోరికల వల్ల ప్రజలు సత్యాన్ని అసలు వినకపోవచ్చు. (యోహాను 8:43-47 చదవండి.) కొందరు యూదులు ‘తమ తండ్రియైన అపవాది దురాశలు నెరవేర్చాలని కోరుకుంటున్నందున’ తన మాట వినలేదని యేసు చెప్పాడు.
13, 14. (ఎ) మనుష్యుల స్వరం వినే విషయంలో మెదడుకు ఉన్న సామర్థ్యం గురించి పరిశోధకులు ఏమి కనుగొన్నారు? (బి) మనం ఎవరి మాట వింటామన్నది దేనిపై ఆధారపడి ఉంటుంది?
13 కొన్నిసార్లు మనం ఏది వినాలనుకుంటామో దాన్నే వింటాం. (2 పేతు. 3:5) కొన్ని అనవసరమైన శబ్దాలను పట్టించుకోకుండా ఉండే అద్భుతమైన సామర్థ్యంతో యెహోవా మనల్ని సృష్టించాడు. ఈ క్షణంలో మీరు ఎన్ని శబ్దాలు వినగలుగుతున్నారో ఒకసారి ఆలోచించండి. వాటిలో చాలా శబ్దాల్ని మీరు క్షణం క్రితం వరకు గమనించి ఉండకపోవచ్చు. ఎందుకంటే, వివిధ రకాల శబ్దాలు వినే సామర్థ్యం మెదడుకు ఉన్నా, అప్పటివరకు ఒకే శబ్దాన్ని వినడానికి మీ మెదడు ప్రాధాన్యతను ఇచ్చింది. కానీ, మనుష్యులు మాట్లాడుతుండగా వింటున్నప్పుడు మాత్రం అలా ప్రాధాన్యతలను ఏర్పర్చుకోవడం మన మెదడుకు కష్టమౌతుంది. మనం ఒక సమయంలో ఒక వ్యక్తి చెప్పేది మాత్రమే శ్రద్ధగా వినగలుగుతామని పరిశోధకులు కనుగొన్నారు. అంటే ఒకే సమయంలో ఇద్దరు వ్యక్తులు మనతో మాట్లాడుతుంటే, ఎవరి మాట వినాలన్నది మనమే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. నిజానికి, ఆ సమయంలో మనం ఏ వ్యక్తి మాట వినాలనుకుంటామో ఆ వ్యక్తి మాటే వింటాం. అలాగే, యేసు కాలంలోని యూదులు కూడా తమ తండ్రియైన అపవాది దురాశల్ని నెరవేర్చాలని అప్పటికే కోరుకున్నారు కాబట్టి, వాళ్లు యేసు మాట వినలేదు.
14 ఒక విధంగా “జ్ఞానము,” “బుద్ధిహీనత” మనతో మాట్లాడేందుకు పోటాపోటీగా ప్రయత్నిస్తూనే ఉంటాయని బైబిలు చూపిస్తోంది. (సామె. 9:1-5, 13-17) దేని మాట వినాలో మనమే ఎంచుకోవాలి. మనం దేని మాట వింటాం? మనం ఎవరికి ఇష్టమైన విధంగా ప్రవర్తించాలని కోరుకుంటామన్న దానిమీదే మన ఎంపిక ఆధారపడి ఉంటుంది. మనం యేసు గొర్రెలమైతే ఆయన స్వరం వింటాం, ఆయనను వెంబడిస్తాం. (యోహా. 10:16, 27) తన అనుచరులు ‘సత్యసంబంధులు’ అని యేసు చెప్పాడు. (యోహా. 18:37) వాళ్లు ‘అన్యుల స్వరము ఎరుగరు.’ (యోహా. 10:5) అలాంటి వినయస్థులే యెహోవా ఇచ్చే మహిమను పొందుతారు.—సామె. 3:13, 16; 8:1, 18.
“ఇవి మీకు మహిమకరములైయున్నవి”
15. పౌలు పడిన శ్రమలు ఇతరులకు ఎలా “మహిమకరములైయున్నవి”?
15 మనం పట్టువిడువకుండా యెహోవా చిత్తం చేస్తే ఇతరులు ఆయన దయచేసే మహిమను పొందగలుగుతారు. ఎఫెసు సంఘానికి పౌలు ఇలా రాశాడు: “మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను; ఇవి మీకు మహిమకరములైయున్నవి.” (ఎఫె. 3:13) తాను పడిన శ్రమలు ఎఫెసీయులకు “మహిమకరములైయున్నవి” అని పౌలు ఎందుకు అన్నాడు? శ్రమలు వచ్చినా వాళ్లకు పరిచారం చేయడానికి సంసిద్ధంగా ఉండడం ద్వారా పౌలు, క్రైస్తవులుగా వాళ్లకున్న అవకాశాలు ఎంతో ప్రాముఖ్యమైనవని, వెలకట్టలేనివని ఎఫెసీయులకు చూపించాడు. శ్రమలు వచ్చినప్పుడు ఒకవేళ పౌలు వాళ్లకు పరిచారం చేయడం మానేసి ఉంటే, ఎఫెసీయులకు యెహోవాతో ఉన్న స్నేహం, వాళ్ల పరిచర్య, వాళ్ల నిరీక్షణ నిజంగా అమూల్యమైనవని పౌలు చూపించి ఉండగలిగేవాడా? ఆయన పరిచర్యలో ఓర్పుగా కొనసాగడం ద్వారా క్రైస్తవత్వాన్ని ఉన్నతపర్చాడు, క్రీస్తు శిష్యులుగా ఉండడం కోసం ఎలాంటి త్యాగాలు చేసినా నష్టం లేదని చూపించాడు.
16. పౌలుకు లుస్త్రలో ఎలాంటి శ్రమ ఎదురైంది?
16 పౌలు చూపించిన ఉత్సాహం, ఓర్పు వల్ల ఎలాంటి ఫలితాలు వచ్చాయో ఒకసారి ఆలోచించండి. అపొస్తలుల కార్యములు 14:19, 20 ఇలా నివేదిస్తున్నాయి: “అంతియొకయనుండియు ఈకొనియనుండియు యూదులు వచ్చి, జనసమూహములను తమ పక్షముగా చేసికొని, పౌలుమీద రాళ్లు రువ్వి అతడు చనిపోయెనని అనుకొని [లుస్త్ర] పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి. అయితే శిష్యులు అతనిచుట్టు నిలిచియుండగా అతడు లేచి పట్టణములో ప్రవేశించి, మరునాడు బర్నబాతోకూడ దెర్బేకు బయలుదేరిపోయెను.” ఆ రోజు చావుబ్రతుకుల మధ్య ఉన్న పౌలు మరుసటి రోజే 100 కిలోమీటర్ల ప్రయాణం చేయడం ఎంత కష్టమో ఒకసారి ఊహించండి, అదీ రవాణా సౌకర్యాలు అస్తవ్యస్తంగా ఉన్న ఆ రోజుల్లో.
17, 18. (ఎ) లుస్త్రలో పౌలు పడిన శ్రమల గురించి తిమోతికి తెలుసని ఎలా చెప్పవచ్చు? (బి) పౌలు చూపించిన ఓర్పు తిమోతిపై ఎలాంటి ప్రభావం చూపించింది?
17 పౌలుకు సహాయం చేయడానికి వచ్చిన ‘శిష్యుల్లో’ తిమోతి కూడా ఉన్నాడా? అపొస్తలుల కార్యముల పుస్తకంలో దాని గురించి అంత వివరంగా లేకపోయినా, పౌలుకు తిమోతి సహాయం చేసి ఉంటాడు. తిమోతికి రాసిన రెండవ పత్రికలో పౌలు ఏమి రాశాడో గమనించండి: ‘నీవు నా బోధను, నా ప్రవర్తనను, ... అంతియొకయలో [పట్టణం నుండి వెలివేశారు], ఈకొనియలో [రాళ్లతో కొట్టడానికి ప్రయత్నించారు], లుస్త్రలో [రాళ్లతో కొట్టారు] నాకు కలిగినట్టి హింసలను తెలిసికొనినవాడవై నన్ను వెంబడించితివి. వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను.’—2 తిమో. 3:10, 11; అపొ. 13:49, 50; 14:5, 19.
18 తిమోతికి ఆ సంఘటనలన్నీ తెలుసు. ఆ కష్టాల్లో పౌలు చూపించిన ఓర్పు గురించి కూడా ఆయనకు బాగా తెలుసు. తిమోతి మనసు మీద అవన్నీ చెరగని ముద్ర వేశాయి. పౌలు లుస్త్రకు వచ్చినప్పుడు, తిమోతి “లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరులవలన మంచిపేరు పొంది” మాదిరికరమైన క్రైస్తవుడయ్యాడని తెలుసుకున్నాడు. (అపొ. 16:1, 2) కొంతకాలానికి, తిమోతి బరువైన బాధ్యతల్ని మోసే స్థాయికి ఎదిగాడు.—ఫిలి. 2:19, 20; 1 తిమో. 1:3.
19. మనం ఓర్పుగా నడుచుకుంటే ఇతరులు ఎలా ప్రయోజనం పొందుతారు?
19 మనం కూడా పట్టువిడువకుండా దేవుని చిత్తం చేస్తే ఇతరులపై, ముఖ్యంగా యౌవనస్థులపై పౌలు చూపించినలాంటి ప్రభావమే చూపించవచ్చు. అలా చేస్తే భవిష్యత్తులో వాళ్లు దేవుని దృష్టిలో అమూల్యమైన సేవకులుగా తయారుకావచ్చు. సంఘంలో మనల్ని గమనించే యౌవనులు పరిచర్యలో మాట్లాడే పద్ధతులను, మరితర నైపుణ్యాలను మన నుండి నేర్చుకోవడంతోపాటు, జీవితంలో ఎదురయ్యే కష్టాలతో మనం ఎలా వ్యవహరిస్తామో గమనించి ఎంతో ప్రయోజనం పొందుతారు. నమ్మకమైన సేవకులందరూ ‘నిత్యమైన మహిమతో కూడ రక్షణ పొందేలా’ పౌలు ‘సమస్తము ఓర్చుకున్నాడు.’—2 తిమో. 2:10.
20. దేవుడు దయచేసే మహిమ కోసం మనం ఎందుకు కృషి చేస్తూ ఉండాలి?
20 కాబట్టి, మనమందరం “అద్వితీయ దేవునివలన వచ్చు మెప్పును” లేదా మహిమను పొందడానికే కృషి చేయవద్దా? (యోహా. 5:44; 7:18) తప్పకుండా కృషి చేయాలి! (రోమీయులు 2:6, 7 చదవండి.) యెహోవా దేవుడు ‘మహిమను వెదికేవారికి నిత్యజీవాన్ని ఇస్తాడు.’ అంతేకాక, మనం ‘ఓపికగా సత్క్రియలు చేస్తే’ ఇతరులు నమ్మకంగా కొనసాగాలనే ప్రేరణను పొందుతారు, అది వాళ్లకు శాశ్వత ప్రయోజనాల్ని చేకూరుస్తుంది. కాబట్టి, మహిమ పొందకుండా చేసే ప్రతీదానికి దూరంగా ఉండండి.