హృదయంలో పుట్టే ఆలోచనల విషయంలో జాగ్రత్త!
“హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికలది” అని బైబిలు చెబుతోంది. (యిర్మీ. 17:9) ఫలానా పని చేయాలని మన హృదయం గట్టిగా కోరుకుంటే, ఆ పని చేయడం కోసం మనకు ఎన్నో కారణాలు కనిపిస్తాయి, కాదంటారా?
“దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధసాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును” అని బైబిలు హెచ్చరిస్తోంది. (మత్త. 15:19) మన హృదయం మనల్ని తప్పుదోవ పట్టించడమే కాకుండా దేవుని ఇష్టానికి విరుద్ధమైన పనులను సమర్థిస్తుంది కూడా. కొన్నిసార్లు, తెలివితక్కువ పని చేసిన తర్వాత కానీ మనం చేసింది ఏంటో మనకు తెలిసిరాదు. అయితే, తప్పుడు పని చేయకముందే మన హృదయంలో పుట్టే ఆలోచనలను మనమెలా పసిగట్టవచ్చు?
హృదయంలో పుట్టే ఆలోచనల్ని ఎలా తెలుసుకోవచ్చు?
ప్రతీరోజు బైబిలు చదివి, ధ్యానించండి.
“దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు” చొచ్చుకుపోతుంది అని అపొస్తలుడైన పౌలు రాశాడు. బైబిల్లో ఉన్న దేవుని సందేశానికి “హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించే” శక్తి ఉంది. (హెబ్రీ. 4:12) దేవుని వాక్య వెలుగులో మనల్ని మనం పరిశీలించుకోవడం ద్వారా మన హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. కాబట్టి దేవుని వాక్యాన్ని ప్రతీరోజు చదవడం, ధ్యానించడం ఎంతో ప్రాముఖ్యం. అప్పుడే మనం యెహోవా తలంపుల్ని, ఉద్దేశాల్ని గ్రహిస్తాం.
లేఖన సలహాలను స్వీకరించి, అందులోని సూత్రాలను అన్వయించుకుంటే మన తలంపుల గురించి ‘సాక్ష్యమిచ్చే’ మనస్సాక్షి మీద చక్కని ప్రభావం పడుతుంది. (రోమా. 9:2,3) మనస్సాక్షి ఇచ్చే హెచ్చరికలు వింటే మనం తప్పుడు ప్రవర్తనను సమర్థించం. ‘మనకు బుద్ధి కలిగించే’ ఉదాహరణలు బైబిల్లో ఎన్నో ఉన్నాయి. (1 కొరిం. 10:11) వాటినుండి నేర్చుకుంటే మనం తప్పుడు మార్గంలో వెళ్లం. మనలో ప్రతీ ఒక్కరం ఏమి చేయాలి?
మీ హృదయంలో పుట్టే ఆలోచనల్ని గుర్తించడానికి సహాయం చేయమని దేవునికి ప్రార్థించండి.
యెహోవా ‘హృదయాలను పరిశోధించే’ దేవుడు. (1 దిన. 29:17) ఆయన “మన హృదయముకంటె అధికుడై, సమస్తమును ఎరిగియున్నాడు.” (1 యోహా. 3:19, 20) ఆయన్ని ఎవ్వరూ మోసం చేయలేరు. మన చింతలను, భావాలను, కోరికలను యెహోవా ముందు కుమ్మరిస్తే మన హృదయాలోచనల్ని గుర్తించడానికి ఆయన మనకు సహాయం చేస్తాడు. “శుద్ధ హృదయము కలుగజేయము” అని కూడా మనం యెహోవాను వేడుకోవచ్చు. (కీర్త. 51:10) మన హృదయాలోచనల్ని గుర్తించడానికి ప్రార్థన తప్పక సహాయం చేస్తుందని మర్చిపోవద్దు.
క్రైస్తవ కూటాల్లో శ్రద్ధగా వినండి.
క్రైస్తవ కూటాల్లో చెప్పే విషయాల్ని శ్రద్ధగా వినడం ద్వారా మన అంతరంగం లేదా హృదయం ఎలా ఉందో నిజాయితీగా పరిశీలించుకోవచ్చు. ప్రతీ కూటంలో మనకు కొత్త సమాచారం లభించకపోయినా వాటికి హాజరవ్వడం ద్వారా బైబిలు సూత్రాలను మరింత బాగా అర్థం చేసుకుంటాం, మన హృదయాలోచనల్ని పరిశీలించుకునేందుకు తోడ్పడే విలువైన జ్ఞాపికలు అందుకుంటాం. కూటాల్లో సహోదరసహోదరీలు ఇచ్చే అమూల్యమైన వ్యాఖ్యానాలు కూడా మన అంతరంగాన్ని మరింతగా తీర్చిదిద్దుతాయి. (సామె. 27:17) తోటి క్రైస్తవులతో క్రమంగా సహవసించకుండా వాళ్లకు దూరంగా ఉండడం మనకే ముప్పు. అది ‘స్వేచ్ఛానుసారంగా నడవడానికి’ దారితీస్తుంది. (సామె. 18:1) కాబట్టి మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవాలి: ‘నేను అన్ని కూటాలకు వెళ్తున్నానా? వాటినుండి ప్రయోజనం పొందుతున్నానా?’—హెబ్రీ. 10:24, 25.
మన హృదయం మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తుంది?
జీవితంలోని చాలా విషయాల్లో హృదయం మనల్ని తప్పుదోవ పట్టిస్తుంది. అలాంటి నాలుగు విషయాల్ని ఇప్పుడు పరిశీలిద్దాం, అవి: వస్తుసంపదల కోసం ప్రయాసపడడం, మద్యపానీయాలను సేవించడం, స్నేహితులను ఎంచుకోవడం, వినోదం.
వస్తుసంపదల కోసం ప్రయాసపడడం.
మన అవసరాలను తీర్చుకోవాలని కోరుకోవడం తప్పు కాదు. కానీ, వస్తుసంపదల కోసం ప్రాకులాడడం మాత్రం తప్పని హెచ్చరిస్తూ యేసు ఒక ఉపమానం చెప్పాడు. తన ధాన్యపు కొట్లు నిండుగా ఉన్న ఒక ధనవంతుని గురించి యేసు ఆ ఉపమానంలో వివరించాడు. ఆ సంవత్సరం సమృద్ధిగా పండిన పంటను నిలువచేయడానికి ఆ ధనవంతునికి స్థలం సరిపోలేదు. దాంతో, ఉన్న కొట్లను పడగొట్టి మరింత పెద్ద కొట్లను కట్టించాలని ఆయన నిర్ణయించుకుంటాడు. ఆయనిలా అనుకుంటాడు: “నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో—ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడియున్నది; సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును.” అయితే, అదే రాత్రి తన ప్రాణాలు పోవచ్చనే వాస్తవాన్ని ఆ ధనవంతుడు పట్టించుకోలేదు.—లూకా 12:16-20.
మనకు వయసు మళ్లుతుండగా, వృద్ధాప్యంలో హాయిగా బ్రతకడానికి కావాల్సిన వాటిని సమకూర్చుకోవడం కోసం మనం బహుశా అతిగా చింతిస్తుండవచ్చు. అందుకోసం కూటాలు జరిగే సాయంకాలాల్లో ఓవర్‌టైం చేసినా, కొన్ని క్రైస్తవ బాధ్యతలను నిర్లక్ష్యం చేసినా ఫర్వాలేదని మనం అనుకోవచ్చు. కానీ, మనం అలాంటి ఆలోచనా విధానానికి దూరంగా ఉండాలి. మీరు యువతీయువకులైతే, పూర్తికాల సేవ చేయడం కన్నా శ్రేష్ఠమైన జీవితం ఇంకొకటి లేదని మీరు గుర్తించి ఉండవచ్చు. కానీ ముందు ఆర్థికంగా స్థిరపడిన తర్వాతే ఆ సేవ చేద్దాంలే అనుకుంటూ వాయిదా వేస్తారా? దేవుని దృష్టిలో ధనవంతులు
కావడానికి మనం చేయగలిగినదంతా చేయవద్దా? మనం రేపు బ్రతికి ఉంటామో లేదో ఎవరికి తెలుసు?మద్యపానీయాలను సేవించడం.
‘ద్రాక్షారసము [“అతిగా,” NW] త్రాగువారితో సహవాసము చేయకుము’ అని సామెతలు 23:20 చెబుతోంది. మద్యపానీయాలంటే ఎంతో ఇష్టం ఉన్న వ్యక్తికి వాటిని రోజూ త్రాగడం తప్పేమీ కాదని అనిపించవచ్చు. కేవలం సేదదీరడానికే తాగుతున్నాను కానీ మత్తు కోసం కాదని ఆ వ్యక్తి అనవచ్చు. మందు తాగితే తప్ప సేదదీరలేమని మనకు అనిపిస్తుంటే గనుక, ఆలస్యం చేయకుండా మన హృదయాలోచన ఎలా ఉందో పరిశీలించుకోవాల్సిందే.
స్నేహితులను ఎంచుకోవడం.
అవిశ్వాసులకు పూర్తిగా దూరంగా ఉండడం సాధ్యం కాదు. పాఠశాలలో, ఉద్యోగ స్థలంలో, పరిచర్యలో మనం వాళ్లను కలుస్తూనే ఉంటాం. కానీ వాళ్లతో రాసుకుపూసుకు తిరగడం, సన్నిహిత స్నేహం ఏర్పర్చుకోవడం మాత్రం ప్రమాదానికే దారితీస్తుంది. వాళ్లలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి వాళ్లతో చనువుగా ఉన్నా ఫర్వాలేదని మిమ్మల్ని మీరు సమర్థించుకుంటారా? “మోసపోకుడి, దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును” అని బైబిలు హెచ్చరిస్తోంది. (1 కొరిం. 15:33) స్వచ్ఛమైన నీరు కొంచెం కలుషితమైనా అవి మురికి నీళ్లు అయిపోతాయి. అలాగే దైవభక్తి లేనివాళ్లతో స్నేహం చేస్తే, అది మన ఆధ్యాత్మికతను కలుషితం చేస్తుంది. అంతేకాక మన అభిప్రాయాల్లో, వస్త్రధారణలో, మాట తీరులో, ప్రవర్తనలో లోక పోకడలు కనిపిస్తాయి.
వినోదం.
ఆధునిక పరిజ్ఞానం ఎంతగా పెరిగిపోయిందంటే, మనం చిటికేస్తే చాలు మనకు కావాల్సిన వినోదం మన ముందుకొచ్చి వాలుతుంది. అయితే అందులో చాలావరకు క్రైస్తవులకు తగనివే ఉంటాయి. ‘ఏ విధమైన అపవిత్రత పేరైనా ఎత్తకూడదు’ అని పౌలు రాశాడు. (ఎఫె. 5:3) అయితే మన హృదయం అపవిత్రమైన వినోదాన్ని కోరుకుంటుంటే అప్పుడెలా? ప్రతీ ఒక్కరికి కొద్దో గొప్పో వినోదం కావాలని, ఎలాంటి వినోదాన్ని ఎంపిక చేసుకోవాలనేది వ్యక్తిగత విషయమని మనం అనుకోవచ్చు. కానీ మనం పౌలు ఇచ్చిన ఉపదేశాన్ని పాటించాలి, ఎలాంటి చెత్త వినోదాన్ని చూడకుండా, వినకుండా ఉండాలి.
మనం మార్పులు చేసుకోవడం
ఒకవేళ మనం ఇప్పటికే మోసపూరిత హృదయంలోని తలంపులకు బానిసలై ఉంటే లేదా తప్పుడు పనులను సమర్థించుకోవడం మనకు అలవాటై ఉంటే మనం తగిన మార్పులు చేసుకోవచ్చు. (ఎఫె. 4:22-24) అలాంటి మార్పులు చేసుకున్న ఇద్దరి అనుభవాలు పరిశీలించండి.
మైఖేల్ a వస్తుపరమైన విషయాల గురించి తన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. ఆయనిలా చెబుతున్నాడు: “నేను, నా భార్య, మా అబ్బాయి అధునాతన-అత్యుత్తమ పరికరాలూ సౌకర్యాలూ ఉండడమే జీవితమనుకునే ప్రజలున్న దేశంలో నివసిస్తున్నాం. వస్తుసంపదల మోజులో చిక్కుకోకుండానే ఈ లోకంలోని సౌఖ్యాలను సొంతం చేసుకోవచ్చనే ఆలోచనతో నేను వాటి సంపాదనలో పడ్డాను. అయితే అది అంతులేని గొయ్యి అని కొంతకాలానికే అర్థంచేసుకున్నాను. నా దృక్పథం గురించి, నా హృదయాలోచనల గురించి యెహోవాకు ప్రార్థించాను. ఒక కుటుంబంగా యెహోవాను మరింత ఎక్కువగా సేవించాలనే కోరికను ప్రార్థనలో తెలియజేశాను. మేము మా జీవితాల్ని సరళం చేసుకుని ప్రచారకుల అవసరం ఎక్కువ ఉన్న ప్రాంతానికి వెళ్లాం. కొంతకాలానికే పయినీరు సేవ మొదలుపెట్టాం. కొన్ని వస్తువులే ఉన్నా ఎంతో సంతృప్తిగా, సంతోషంగా జీవించవచ్చని మేము అర్థంచేసుకున్నాం.”
ఇప్పుడు ఎడ్విన్ అనుభవాన్ని చూద్దాం. మనల్ని మనం నిజాయితీగా పరిశీలించుకోవడం ద్వారా చెడు స్నేహాలకు ముగింపు పలకవచ్చని ఆయన అనుభవం చూపిస్తోంది. ఆయనిలా చెబుతున్నాడు: “నా పనిలో భాగంగా నేను చాలామంది విదేశీ వ్యాపారులతో సమయం గడపాల్సి వచ్చేది. వాళ్ల పార్టీల్లో అతిగా మద్యం సేవిస్తారని నాకు తెలుసు. కానీ, ఆ పార్టీలకు వెళ్లడం నాకు చాలా ఉత్తేజాన్నిచ్చేది. చాలాసార్లు నేను మద్యాన్ని అతిగా సేవించేవాణ్ణి, ఆ తర్వాత బాధపడేవాణ్ణి. దాంతో నేను నా హృదయాన్ని నిజాయితీగా పరిశీలించుకున్నాను. దేవుని వాక్యంలోని ఉపదేశం వల్ల, సంఘ పెద్దలు ఇచ్చిన సలహాల వల్ల నాకు కనువిప్పు కలిగింది. అప్పటిదాకా నేను యెహోవాను ప్రేమించనివాళ్ల సహవాసాన్ని కోరుకున్నానని నాకు అర్థమైంది. ఇప్పుడు నేను చాలావరకు నా వ్యవహారాలను ఫోను ద్వారానే నడుపుతున్నాను, వ్యాపారులను నేరుగా కలవడం చాలామట్టుకు తగ్గించాను.”
మనల్ని మనం నిజాయితీగా పరిశీలించుకొని, మన హృదయాలోచనలు ఎలా ఉన్నాయో గుర్తించాలి. మనం అలా చేస్తుండగా, దేవునికి “హృదయ రహస్యములు” తెలుసని గుర్తుంచుకొని ప్రార్థనలో ఆయన సహాయం కోసం వేడుకోవాలి. (కీర్త. 44:21) దేవుడు మనకు తన వాక్యాన్ని కూడా ఇచ్చాడు, అది ఓ అద్దంలా పనిచేస్తుంది. (యాకో. 1:22-25) క్రైస్తవ ప్రచురణల్లో, కూటాల్లో మనకు దొరికే సలహాలు, జ్ఞాపికలు కూడా మనకు ఎంతగానో సహాయం చేస్తాయి. ఈ ఏర్పాట్లన్నిటినీ ఉపయోగించుకుంటే మనం మన హృదయాన్ని కాపాడుకోగలం, ఎల్లప్పుడూ నీతి మార్గంలో నడవగలం.
a అసలు పేర్లు కావు.