కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు మెక్సికోలో

తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు మెక్సికోలో

క్రైస్తవ పరిచర్యను మరింతగా చేయడానికి వీలుగా ఎంతోమంది యువతీయువకులు తమ జీవితాల్ని సరళం చేసుకోవడం చూస్తుంటే చాలా సంతోషం కలుగుతోంది. (మత్త. 6:22) ఇంతకీ వాళ్లు ఎలాంటి మార్పులు చేసుకుంటున్నారు? ఎలాంటి ఆటంకాల్ని ఎదుర్కొంటున్నారు? వాటికి జవాబులు తెలుసుకోవడం కోసం, ప్రస్తుతం మెక్సికోలో సేవచేస్తున్న కొందరిని మనమిప్పుడు పరిచయం చేసుకుందాం.

“మేము ఓ మార్పు చేసుకోవాల్సిందేనని గ్రహించాం”

డస్టిన్‌, జేసా

అమెరికాకు చెందిన డస్టిన్‌, జేసా 2007 జనవరిలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికే, వాళ్లు ఓ పెద్ద పడవను కొనుక్కొని ఏడాది పొడవునా దానిలోనే జీవించాలనే తమ చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్నారు. వాళ్లు తమ పడవలో అమెరికాలోని ఓరిగన్‌లో ఉన్న ఆస్టోరియా సమీప ప్రాంతానికి వెళ్లారు. అది పసిఫిక్‌ మహా సముద్రానికి దగ్గర్లో ఉన్న రమణీయమైన ప్రదేశం. మంచుతో కప్పుకుపోయిన కొండలు, చెట్లతో నిండిన గుట్టలు ఉన్న అందమైన ప్రాంతం అది. డస్టిన్‌ దాని గురించి ఇలా అన్నాడు: “ఎటుచూసినా కమనీయమైన దృశ్యాలే.” యెహోవాపై ఆధారపడుతూ నిరాడంబర జీవితాన్ని గడుపుతున్నామని డస్టిన్‌, జేసా అనుకున్నారు. ‘26 అడుగుల పడవలో జీవితాన్ని వెల్లబుచ్చుతున్నాం, పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేస్తున్నాం, వేరే భాషా సంఘానికి హాజరౌతున్నాం, అప్పుడప్పుడు సహాయ పయినీరు సేవ కూడా చేస్తున్నాం’ అని వాళ్లు అనుకున్నారు. కానీ, తమను తాము మోసగించుకుంటున్నామని వాళ్లు కొంతకాలానికి గుర్తించారు. డస్టిన్‌ ఇలా అన్నాడు: “సంఘానికి మద్దతు ఇవ్వాల్సింది పోయి, ఎక్కువ సమయం మా పడవకు మరమ్మతులు చేసుకోవడంలోనే మునిగిపోయేవాళ్లం. మా జీవితంలో యెహోవా సేవకు మొదటి స్థానం ఇవ్వాలంటే మేము ఓ మార్పు చేసుకోవాల్సిందేనని గ్రహించాం.”

డస్టిన్‌ మాటలకు జోడిస్తూ జేసా ఇలా అంది: “పెళ్లికి ముందు నేను మెక్సికోలో ఆంగ్ల భాషా సంఘంతో సహవసించేదాన్ని. అక్కడ నా సేవ ఎంతో ఆనందంగా సాగేది. మళ్లీ అక్కడికి వెళ్లాలనే ఆరాటం నాలో ఎప్పుడూ ఉండేది.” వేరే దేశానికి వెళ్లి సేవచేయాలనే తమ కోరికను బలపర్చుకోవడానికి డస్టిన్‌, జేసాలు తమ కుటుంబ ఆరాధనలో, ‘కోతపని’ విస్తారంగా ఉన్న చోటకు వెళ్లి ఆనందంగా సేవచేసిన సహోదర సహోదరీల అనుభవాల్ని చదవడం మొదలుపెట్టారు. (యోహా. 4:35) “మేము కూడా అలాంటి ఆనందాన్ని సొంతం చేసుకోవాలనుకున్నాం” అని డస్టిన్‌ అన్నాడు. మెక్సికోలో కొత్తగా ఏర్పడిన గుంపుకు సహాయం అవసరమని స్నేహితుల ద్వారా తెలుసుకున్నప్పుడు డస్టిన్‌, జేసాలు అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వాళ్లు తమ ఉద్యోగాల్ని వదిలేసి, పడవను అమ్మేసి మెక్సికోలో సేవచేసేందుకు వెళ్లారు.

“మా జీవితంలో అత్యద్భుతమైన సంఘటన”

డస్టిన్‌, జేసాలు అక్కడికి వెళ్లాక టెకోమాన్‌ అనే పట్టణంలో స్థిరపడ్డారు. అది కూడా పసిఫిక్‌ మహా సముద్రానికి సమీప ప్రాంతమే, కానీ ఆస్టోరియాకు దక్షిణాన 4,345 కి.మీ. దూరంలో ఉంది. అక్కడి పరిస్థితి గురించి డస్టిన్‌ ఇలా అన్నాడు: “ఇది చల్లని గాలి వీస్తూ, కనువిందు చేసే కొండ ప్రాంతం కాదు. ఇక్కడ భరించలేనంత వేడి ఉంటుంది, ఎటుచూసినా విరగ్గాసిన నిమ్మచెట్లే కనిపిస్తాయి.” అక్కడికి వెళ్లిన కొత్తలో వాళ్లకు ఉద్యోగాలు దొరకలేదు. సరిపోయేన్ని డబ్బులు లేక వారాల తరబడి ప్రతీరోజు రెండు పూటలా అన్నము, చిక్కుళ్లు మాత్రమే తినేవాళ్లు. జేసా ఇలా అంది: “ఆ తిండి తినడం మావల్ల కాదనిపించే సమయానికి మా బైబిలు విద్యార్థులు మామిడి పళ్లు, అరటి పళ్లు, బొప్పాయి పళ్లు, సంచులకొద్దీ నిమ్మకాయలు ఇవ్వడం మొదలుపెట్టారు.” కొంతకాలానికి, ఆన్‌లైన్‌లో భాష నేర్పించే తైవాన్‌ సంబంధిత పాఠశాలలో వాళ్లిద్దరికి ఉద్యోగాలు దొరికాయి. ఆ ఉద్యోగంలో వాళ్లు సంపాదించే డబ్బుతో ఏ లోటూ లేకుండా వాళ్ల అవసరాలన్నీ తీరుతున్నాయి.

ఈ కొత్త జీవితం గురించి డస్టిన్‌, జేసాలకు ఏమనిపిస్తోంది? వాళ్లు ఇలా అంటున్నారు: “మేము ఇక్కడికి రావడమే మా జీవితంలో అత్యద్భుతమైన సంఘటన. యెహోవాతో మాకున్న స్నేహం, అలాగే మా ఇద్దరి మధ్య ఉన్న బంధం మేము ఊహించనంత బలపడింది. ప్రతీరోజు మేమిద్దరం ఎన్నో పనుల్ని కలిసి చేస్తాం. కలిసి పరిచర్యకు వెళ్తాం, బైబిలు విద్యార్థులకు ఎలా సహాయం చేయాలో మాట్లాడుకుంటాం, కలిసి కూటాలకు సిద్ధపడతాం. అంతేకాదు, గతంలో మాకున్న ఒత్తిళ్లేవీ ఇప్పుడు లేవు.” వాళ్లింకా ఇలా అన్నారు: “కీర్తన 34:8లో ఉన్న ‘యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి’ అనే మాటల్లోని సత్యాన్ని మేము ఇంతకు ముందెన్నడూ లేనంతగా అర్థంచేసుకోగలిగాం!”

వేలాదిమంది ఇష్టపూర్వకంగా ఎందుకు వస్తున్నారు?

ఇప్పటికీ రాజ్యప్రచారకుల అవసరం ఎక్కువగా ఉన్న మెక్సికోలోని ఆయా ప్రాంతాల్లో సేవచేయడానికి 2,900 కన్నా ఎక్కువమంది సహోదర సహోదరీలు ముందుకు వచ్చారు. వాళ్లలో పెళ్లైన వాళ్లు, పెళ్లికాని వాళ్లు ఉన్నారు. వాళ్లలో చాలామంది 20వ, 30వ పడిలో ఉన్నవాళ్లే. సవాళ్లతో కూడుకున్న ఈ పనిని ఆ సాక్షులంతా ఎందుకు చేపట్టారు? వాళ్లలో కొందరిని ఈ ప్రశ్న అడిగినప్పుడు మూడు ముఖ్యమైన కారణాలను పేర్కొన్నారు. ఏంటవి?

లెటీస్యా, ఎర్మీలో

యెహోవాపట్ల, పొరుగువాళ్ల పట్ల ప్రేమను చూపించాలని . . . 18 ఏళ్ల వయసులో బాప్తిస్మం తీసుకున్న లెటీస్యా ఇలా అంటోంది: “యెహోవాకు సమర్పించుకోవడం అంటే నేను ఆయనను నా పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో సేవించడమేనని అర్థంచేసుకున్నాను. కాబట్టి, నేను యెహోవాను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానని చూపించేందుకు వీలైనంత ఎక్కువ సమయాన్ని, శక్తిని ఆయన సేవలోనే వెచ్చించాలనుకున్నాను.” (మార్కు 12:30) ప్రస్తుతం లెటీస్యా భర్తయైన ఎర్మీలో తనకు దాదాపు 22 ఏళ్లున్నప్పుడు రాజ్యప్రచారకుల అవసరం ఎక్కువగా ఉన్నచోట సేవచేసేందుకు వెళ్లాడు. ఆయన ఇలా అన్నాడు: “ఆధ్యాత్మిక అవసరాన్ని తీర్చుకునేలా పొరుగువాళ్లకు సహాయం చేయడమే వాళ్లమీద ఉన్న ప్రేమను చూపించడానికి శ్రేష్ఠమైన మార్గమని నేను గ్రహించాను.” (మార్కు 12:31) అందుకే ఆయన సంపన్న నగరమైన మాన్‌టెర్రేలో బ్యాంకు ఉద్యోగాన్ని, సౌకర్యవంతమైన జీవితాన్ని వదిలేసి ఓ చిన్న పట్టణానికి మారాడు.

ఎస్లీ

నిజమైన, శాశ్వతమైన సంతోషాన్ని చవిచూడాలని . . . బాప్తిస్మం తీసుకున్న కొంతకాలానికే లెటీస్యా ఓ అనుభవంగల పయినీరు సహోదరితో కలిసి ఒక మారుమూల ప్రాంతానికి వెళ్లి అక్కడ నెలపాటు ప్రకటనా పనిలో పాల్గొంది. లెటీస్యా ఇలా గుర్తుచేసుకుంటోంది: “నేను చాలా ఆశ్చర్యపోయాను. రాజ్య సందేశానికి ప్రజలు ఎంతో చక్కగా స్పందించడం చూసినప్పుడు నాకెంతో సంతోషం కలిగింది. ఆ నెల ముగిసే సమయానికి, ‘నేను నా జీవితంలో చేయాలనుకున్నది సరిగ్గా ఇదే!’ అని నాకనిపించింది.” సుమారు 22 ఏళ్ల వయసులో ఉన్న ఎస్లీ అనే ఒంటరి సహోదరి కూడా ఇందులో ఉన్న సంతోషాన్ని చూసే ఇలాంటి సేవకు ఆకర్షితురాలైంది. ఆమె పాఠశాలలో చదువుకుంటున్న రోజుల్లో, అవసరం ఎక్కువున్న చోట సేవచేసిన ఎంతోమంది ఉత్సాహవంతులైన సాక్షుల్ని కలిసింది. ఆమె ఇలా అంటోంది: “ఆనందంతో వెలిగిపోతున్న ఆ సహోదర సహోదరీల ముఖాలు చూసినప్పుడు నా జీవితం కూడా అలాగే ఉండాలనే ఆశ కలిగింది.” చాలామంది సహోదరీలు ఎస్లీలాగే స్పందించారు. నిజానికి, 680 కన్నా ఎక్కువమంది ఒంటరి సహోదరీలు మెక్సికోలో అవసరం ఎక్కువున్న ప్రాంతాల్లో సేవచేస్తున్నారు. యౌవనులకైనా, వృద్ధులకైనా వాళ్లు ఎంత చక్కని ఆదర్శం!

ఒక లక్ష్యంతో సంతృప్తిగా జీవించాలని . . . పాఠశాల విద్య ముగించుకున్న తర్వాత ఎస్లీకి ఓ యూనివర్సిటీ వాళ్లు స్కాలర్‌షిప్‌ ఇవ్వజూపారు. ఆ స్కాలర్‌షిప్‌ని అంగీకరించి, డిగ్రీ పట్టా పుచ్చుకొని, మంచి ఉద్యోగం సంపాదించి, కారు కొనుక్కొని విహారయాత్రలతో అందరిలా జీవితాన్ని అనుభవించమని సహపాఠీలు ఆమెను ప్రోత్సహించారు. కానీ, ఆమె వాళ్ల సలహాను పాటించలేదు. ఎస్లీ ఇలా చెబుతోంది: “సంఘంలోని కొంతమంది స్నేహితులు వాటి కోసం ప్రయాసపడి ఆధ్యాత్మిక లక్ష్యాల్ని పక్కనబెట్టడం నేను గమనించాను. వాళ్లు లోక విషయాల్లో అంతకంతకూ మునిగిపోయి సమస్యల్లో చిక్కుకొని విలవిలలాడడం కూడా నేను చూశాను. నేను నా యౌవనాన్ని పూర్తిగా యెహోవా సేవకే అంకితం చేయాలనుకుంటున్నాను.”

రాకెల్‌, ఫిలిప్‌

ఎస్లీ చిన్నచిన్న కోర్సుల్ని చేసింది. దానివల్ల, ఆమె పయినీరు సేవచేస్తూ తన ఖర్చుల్ని తానే భరించుకోగలిగేలా ఓ పని కూడా సంపాదించుకోగలిగింది. ఆ తర్వాత రాజ్య ప్రచారకుల అవసరం చాలా ఎక్కువున్న చోటకు వెళ్లింది. అంతేకాదు ఓటోమీ, ట్లాపనెకో ప్రజలు మాట్లాడే స్థానిక భాషల్ని కూడా నేర్చుకోవడం మొదలుపెట్టింది. మారుమూల ప్రాంతాల్లో సేవచేస్తూ గడిపిన మూడు సంవత్సరాల గురించి ఆమె ఇలా అంటోంది: “అవసరం ఎక్కువున్న చోట సేవ చేసినందుకు నాకు ఎంతో సంతృప్తిగా ఉంది, నా జీవితానికి నిజమైన అర్థం చేకూరింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఆ సేవ యెహోవాతో నాకున్న స్నేహాన్ని బలపర్చింది.” ప్రస్తుతం 30వ పడిలో ఉన్న ఫిలిప్‌, రాకెల్‌ దంపతులు అమెరికా నుండి వచ్చారు. వాళ్లు ఇలా ఒప్పుకుంటున్నారు: “ప్రపంచం ఎంత వేగంగా మారిపోతోందంటే, చాలామంది తమ జీవితాలు అస్థిరంగా మారిపోతున్నాయని అభిప్రాయపడుతున్నారు. కానీ, బైబిలు సందేశానికి ఇంకా ఎంతోమంది స్పందిస్తున్న ప్రాంతాల్లో సేవచేయడం వల్ల మా జీవితానికి నిజమైన అర్థం చేకూరుతుందని అనిపిస్తోంది, అది చాలా సంతృప్తిని ఇస్తోంది.”

ఇలాంటి సేవలో వచ్చే సవాళ్లను ఎలా ఎదుర్కోవచ్చు?

వెరోనిక

రాజ్య ప్రచారకుల అవసరం ఎక్కువున్న చోట సేవచేయడంలో కూడా సవాళ్లు ఉంటాయనే విషయాన్ని కాదనలేం. మన ఖర్చులకు డబ్బు సంపాదించుకోవడం కూడా ఒక సవాలే. దానికోసం మీరు అక్కడి పరిస్థితులతో సర్దుకుపోవాల్సి ఉంటుంది. పయినీరు సేవలో ఎంతో అనుభవం ఉన్న వెరోనిక ఇలా అంటోంది: “నేను ఓ ప్రాంతంలో సేవచేసినప్పుడు, తక్కువ ఖర్చుతో కూడుకున్న చిరుతిండ్లు తయారు చేసి అమ్మేదాన్ని. మరో ప్రాంతంలో, బట్టలు అమ్మేదాన్ని, హేయిర్‌ కట్టింగ్‌ చేసేదాన్ని. ప్రస్తుతం నేను ఓ ఇంటిని శుభ్రం చేసే పనికి కుదిరాను, అలాగే కొత్తగా తల్లిదండ్రులైన వాళ్లకు చంటిపిల్లలతో వ్యవహరించడం గురించి క్లాసులు కూడా నిర్వహిస్తున్నాను.”

మారుమూల ప్రాంతాల్లో స్థానికుల మధ్య నివసిస్తూ కొత్త సంస్కృతీ సంప్రదాయాలకు అలవాటుపడడం కూడా ఓ సవాలే. నావాటల్‌ భాషా క్షేత్రంలో పనిచేసిన ఫిలిప్‌, రాకెల్‌లు ఆ సవాల్నే ఎదుర్కొన్నారు. “ఇక్కడి సంస్కృతి చాలా భిన్నంగా ఉంటుంది” అని ఫిలిప్‌ అన్నాడు. మరి వాళ్లెలా సర్దుకుపోగలిగారు? ఫిలిప్‌ ఇలా అన్నాడు: “మేము నావాటల్‌ ప్రజల మంచి లక్షణాలపై అంటే, వాళ్ల కుటుంబాల్లో ఉండే అన్యోన్యత, వాళ్ల నిజాయితీ, ఉదార స్వభావం వంటివాటిపై దృష్టి నిలిపాం.” ఫిలిప్‌ చెప్పినదానికి జోడిస్తూ రాకెల్‌ ఇలా అంది: “ఇక్కడ నివసిస్తూ, స్థానిక సహోదర సహోదరీలతో కలిసి సేవచేయడం వల్ల మేము ఎంతో నేర్చుకున్నాం.”

మీరెలా సిద్ధపడవచ్చు?

మీరు రాజ్య ప్రచారకుల అవసరం ఎక్కువగా ఉన్న మారుమూల ప్రాంతాల్లో సేవచేయాలని అనుకుంటుంటే, దానికోసం మీరెలా సిద్ధపడవచ్చు? అలాంటి సేవలో అనుభవమున్న సహోదర సహోదరీలు ఈ సలహాను ఇస్తున్నారు: ‘వెళ్లడానికి ముందు, మీరు మీ జీవన శైలిని సరళం చేసుకుంటూ, ఉన్నవాటితో తృప్తిపడడం నేర్చుకోండి.’ (ఫిలి. 4:11, 12) ఇంకా ఏమి చేయవచ్చు? లెటీస్యా ఇలా అంటోంది: “ఎక్కువ కాలం ఒకే చోట ఉండాల్సి వచ్చే ఉద్యోగాల్ని వద్దనుకున్నాను. ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడికంటే అక్కడికి వెళ్లగలిగే స్థితిలో ఉండాలనుకున్నాను.” ఎర్మీలో ఇలా అంటున్నాడు: “వంట చేయడం, బట్టలు ఉతకడం, ఇస్త్రీ చేయడం నేర్చుకున్నాను.” వెరోనిక ఇలా అంటోంది: “నేను మా కుటుంబంతో కలిసి ఉన్న రోజుల్లో ఇంటి పనుల్లో సహాయం చేసేదాన్ని. అలాగే, తక్కువ ఖర్చుతో కూడుకున్నవే అయినా కడుపునింపే వంటకాలు నేర్చుకున్నాను. పొదుపు చేయడం కూడా నేర్చుకున్నాను.”

అమీల్య, లెవీ

అమెరికాకు చెందిన లెవీ, అమీల్యలకు వివాహమై ఎనిమిదేళ్లు అవుతోంది. మెక్సికోలో సేవచేసేందుకు అవసరమైన వాటి గురించి నిర్దిష్టంగా ప్రార్థించడం తమకు ఎలా సహాయం చేసిందో వాళ్లు చెప్పారు. లెవీ ఇలా అన్నాడు: “ఓ ఏడాది పాటు వేరే దేశంలో సేవచేయడానికి ఎంత ఖర్చౌతుందో లెక్కచూసుకొని, సరిగ్గా అంత డబ్బు సంపాదించుకోవడానికి సహాయం చేయమని యెహోవాకు ప్రార్థించాం.” ప్రార్థనలో అడిగినంత మొత్తాన్ని వాళ్లు కొన్ని నెలల్లోనే పొదుపుచేయగలిగారు, ఆలస్యం చేయకుండా మెక్సికోకు వెళ్లారు. లెవీ ఇంకా ఇలా అన్నాడు: “మా నిర్దిష్టమైన ప్రార్థనకు యెహోవా జవాబిచ్చాడు. ఇక మా వంతు మేము చేయాలి.” అమీల్యా ఇలా అంది: “మెక్సికోలో మేము ఒక్క సంవత్సరమే ఉంటామనుకున్నాం కానీ, ఇక్కడికి వచ్చి ఏడు సంవత్సరాలు గడిచిపోయాయి. వెనక్కి వెళ్లిపోయే ఆలోచనే లేదు! ఇక్కడ ఉండడం వల్ల యెహోవా సహాయాన్ని నేరుగా రుచిచూస్తున్నాం. ప్రతీరోజు ఆయన మంచితనానికి నిదర్శనాలను చూస్తున్నాం.”

ఆడమ్‌, జెన్నిఫర్‌

అమెరికాకు చెందిన ఆడమ్‌, జెన్నిఫర్‌లు ఇప్పుడు మెక్సికోలో ఆంగ్ల భాషా క్షేత్రంలో సేవచేస్తున్నారు. ప్రార్థన తమకు ఎంతగానో సహాయం చేసిందని వాళ్లు అంటున్నారు. వాళ్లు ఈ సలహా ఇస్తున్నారు: “అనువైన పరిస్థితుల కోసం వేచి చూడకండి. వేరే దేశంలో సేవచేయాలనే మీ కోరిక గురించి ప్రార్థించండి, దానికి తగిన చర్యలు తీసుకోండి. జీవన శైలిని సరళం చేసుకోండి, మీరు సేవ చేయాలనుకుంటున్న దేశంలోని బ్రాంచి కార్యాలయానికి ఉత్తరం రాయండి, ఖర్చుల లెక్కచూసుకోండి, వెళ్లిపోండి!” a అలా చేస్తే, ఆధ్యాత్మిక సిరిసంపదలతో కూడిన ఉత్తేజకరమైన జీవితం మీకోసం ఎదురు చూస్తుంటుంది.

a మరింత సమాచారం కోసం, 2011 ఆగస్టు మన రాజ్య పరిచర్యలోని “మీరు ‘మాసిదోనియకు’ వెళ్లగలరా?” అనే శీర్షిక చూడండి.