మీకిది తెలుసా?
సా.శ. 70 తర్వాత యెరూషలేము దేవాలయాన్ని మళ్ళీ ఎప్పుడైనా కట్టారా?
‘రాతిమీద రాయి ఒకటైనను నిలిచియుండకుండ’ యెరూషలేము దేవాలయం ‘పడద్రోయబడుతుందని’ యేసు ప్రవచించాడు. ఆ ప్రవచనం సా.శ. 70లో టైటస్ నేతృత్వంలోని రోమా సైన్యం యెరూషలేమును నాశనం చేసినప్పుడు నెరవేరింది. (మత్త. 24:2) ఆ తర్వాతి కాలంలో జూలియన్ చక్రవర్తి ఆ ఆలయాన్ని తిరిగి నిర్మించాలని ప్రణాళిక వేశాడు.
రోముకు జూలియన్ చివరి అన్యమత చక్రవర్తి అని ప్రాచుర్యంలో ఉంది. కాన్స్టంటైన్ సోదరుని కుమారుడైన ఈ జూలియన్, నామమాత్రపు క్రైస్తవ విద్యను అభ్యసించాడు. కానీ, సా.శ. 361లో అతను చక్రవర్తి అయ్యాక, అన్యమతాన్ని సమర్థిస్తూ ఆ క్రైస్తవ విద్యను, కలుషితమైపోయిన ఆనాటి క్రైస్తవత్వాన్ని బాహాటంగా తిరస్కరించాడు. చరిత్ర పుస్తకాలు అతణ్ణి “మతభ్రష్టుడు” అని సంబోధిస్తున్నాయి.
జూలియన్ క్రైస్తవత్వాన్ని అసహ్యించుకున్నాడు. బహుశా అందుకు గల ఒక కారణమేమిటంటే అతను ఆరేళ్ల బాలుడిగా ఉన్నప్పుడు, ఆ మత ప్రతినిధులు తన తండ్రిని, తన రక్తసంబంధీకుల్లోని మగవాళ్లను చంపడాన్ని కళ్లారా చూశాడు. చర్చీ చరిత్రకారుల ప్రకారం జూలియన్ చక్రవర్తి, యేసు అబద్ధ ప్రవక్త అని నిరూపించడానికి యెరూషలేము దేవాలయాన్ని తిరిగి కట్టమని యూదుల్ని ప్రోత్సహించాడు. a
జూలియన్ ఆ ఆలయాన్ని తిరిగి కట్టడానికి ప్రయత్నించాడన్నది వాస్తవమే. జూలియన్ అసలు ఆ పనిని ప్రారంభించాడా, ఒకవేళ ప్రారంభిస్తే అది ఎందుకు ఆగిపోయింది అని చరిత్రకారులు వాదులాడుకుంటున్నారు. ఏదేమైనా ఒకటి మాత్రం స్పష్టం. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా కాకముందే జూలియన్ హతమయ్యాడు, అతని ప్రణాళిక కూడా అతనితో పాటే అంతరించింది.
a యేసు ఆ ఆలయం నాశనం అవుతుందని చెప్పాడే కానీ దాన్ని ఎన్నటికీ తిరిగి కట్టరని చెప్పలేదు. యెరూషలేము దేవాలయం సా.శ. 70లో నాశనమైంది.