కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సంఘ పెద్దలారా, ‘అలసిన వారికి’ ఊరటనిస్తారా?

సంఘ పెద్దలారా, ‘అలసిన వారికి’ ఊరటనిస్తారా?

ముప్పైయవ పడిలో ఉన్న రెబెకా a అనే అవివాహిత సహోదరి కాస్త కంగారుగా ఉంది. సంఘ పెద్దలు తన ఇంటికి వస్తారని ఆమె ఎదురుచూస్తోంది. వాళ్లు ఆమెతో ఏమి మాట్లాడతారు? నిజమే, ఆమె కొన్ని కూటాలకు హాజరు కాలేకపోయింది. ఆమెది వృద్ధులను చూసుకునే ఉద్యోగం కావడం వల్ల, రోజంతా పనిచేసి ఇంటికి చేరుకునే సరికి బాగా అలసిపోయింది. దానికి తోడు, ఆమె వాళ్ల అమ్మ ఆరోగ్యం గురించి కూడా తీవ్రంగా ఆందోళనపడుతోంది.

ఒకవేళ మీరే రెబెకాను సందర్శించడానికి వెళ్తుంటే, “అలసియున్న” ఆమెను మీరెలా ప్రోత్సహిస్తారు? (యిర్మీ. 31:24) అసలు, ఓ ప్రోత్సాహకరమైన కాపరి సందర్శనాన్ని చేసేందుకు మీరు ఎలా సిద్ధపడతారు?

మీ సహోదరుల పరిస్థితులేంటో ఆలోచించండి

ఉద్యోగం వల్ల, సంఘ బాధ్యతల వల్ల కొన్నిసార్లు మనమందరం అలసిపోతుంటాం. ఉదాహరణకు, ఒకానొక సందర్భంలో, తాను అర్థంచేసుకోలేని ఓ దర్శనాన్ని చూసినప్పుడు దానియేలు ప్రవక్త ‘మూర్ఛిల్లాడు’ లేదా సొమ్మసిల్లాడు. (దాని. 8:27) గబ్రియేలు దూత వచ్చి ఆయనకు సహాయం చేశాడు. ఆ దర్శనానికి ఉన్న అర్థాన్ని దానియేలుకు చెప్పి, ఆయన ప్రార్థనలు యెహోవా విన్నాడని, ఆయన ఇప్పటికీ దేవునికి “బహు ప్రియుడు” అని ఆ దేవదూత భరోసా ఇచ్చాడు. (దాని. 9:21-23) ఆ తర్వాత మరో సందర్భంలో కూడా ఇంకో దేవదూత మాట్లాడిన ఇంపైన మాటలు అలసిన ప్రవక్తను బలపర్చాయి.—దాని. 10:18, 19.

కాపరి సందర్శనానికి వెళ్లే ముందు, ఆ సహోదరుల పరిస్థితుల గురించి ఆలోచించండి

అదేవిధంగా, అలసిపోయిన లేదా నిరుత్సాహానికి లోనైన తోటి విశ్వాసిని సందర్శించే ముందు, కాస్త సమయం తీసుకొని ఆయన పరిస్థితుల గురించి ఆలోచించండి. అసలు ఆయనకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఆ సమస్యలు ఆయన్ని ఏవిధంగా పీల్చి పిప్పి చేస్తున్నాయి? ఆయన ఎలాంటి మంచి లక్షణాలు చూపిస్తాడు? “నేను సహోదరుల బలాల మీదే దృష్టి పెడతాను” అని 20 కన్నా ఎక్కువ సంవత్సరాలుగా సంఘపెద్దగా సేవచేస్తున్న రిచర్డ్‌ అన్నాడు. ఆయన ఇంకా ఇలా అన్నాడు: “సందర్శనకు వెళ్లే ముందు వాళ్ల పరిస్థితుల గురించి జాగ్రత్తగా ఆలోచించినప్పుడు, వాళ్ల అవసరాలకు తగిన ప్రోత్సాహాన్ని ఇచ్చే మార్గాలను తెలుసుకోవడం సుళువౌతుంది.” మరో పెద్ద కూడా మీతోపాటు వస్తుంటే, మీరు సందర్శించబోయే సహోదరుల పరిస్థితి గురించి ఇద్దరూ కలిసి చర్చించుకోవడం సముచితం.

స్నేహపూరిత వాతావరణం కల్పించండి

వ్యక్తిగత భావాలను ఇతరులతో చెప్పుకోవడం ఇబ్బందిగానే ఉంటుందని మీరూ ఒప్పుకుంటారు. ఉదాహరణకు, ఇంటికి వచ్చిన పెద్దలతో మాట్లాడడానికి ఆ సహోదరుడు ఇబ్బందిపడవచ్చు. అయితే మీతో మాట్లాడే చక్కని వాతావరణాన్ని మీరెలా కల్పించవచ్చు? మీ చిరునవ్వు, భరోసా ఇచ్చే మాటలే ఆ వాతావరణాన్ని కల్పిస్తాయి. 40 ఏళ్లకు పైగా సంఘపెద్దగా సేవచేస్తున్న మైఖేల్‌, తరచూ కాపరి సందర్శనాన్ని ఇలాంటి మాటలతో ఆరంభిస్తాడు: ‘మీకు తెలుసా? సహోదరుల ఇంటికి వెళ్లి, వాళ్లతో పరిచయం పెంచుకోవడం సంఘపెద్దలకు దొరికే ఓ విశేషమైన అవకాశం. అందుకే, మిమ్మల్ని సందర్శించే ఈ రోజు కోసం మేము ఎంతో ఆశగా ఎదురుచూశాం.’

మీరు సందర్శనం కోసం వెళ్లినప్పుడు, ఆరంభంలోనే మనస్ఫూర్తిగా ప్రార్థన చేసి, మాట్లాడడం మొదలుపెట్టవచ్చు. అందుకే, అపొస్తలుడైన పౌలు కూడా తోటి సహోదరుల విశ్వాసం, ప్రేమ, ఓర్పు గురించి తన ప్రార్థనల్లో ప్రస్తావించాడు. (1 థెస్స. 1:2, 3) మీ సహోదరుని మంచి లక్షణాలను మెచ్చుకున్నప్పుడు, మంచి ఫలితాలు తెచ్చే చక్కని సంభాషణ జరిగేలా మీ హృదయాన్ని, ఆ సహోదరుని హృదయాన్ని మీరు సిద్ధపరుస్తారు. మీ మాటలు వాళ్లకు ఉపశమనాన్ని కూడా ఇస్తాయి. జేమ్స్‌ అనే అనుభవం గల పెద్ద ఇలా అన్నాడు: “మనం సాధించిన మంచి ఫలితాల గురించి కొన్నిసార్లు మర్చిపోతుంటాం. అయితే, వాటి గురించి మనకెవరైనా గుర్తుచేసినప్పుడు, మనసు ఎంతో హాయిగా ఉంటుంది.”

‘ఆత్మసంబంధమైన కృపావరాన్ని’ ఇవ్వండి

కనీసం ఒక్క వచనాన్నైనా చూపిస్తూ వాళ్లతో ఒక లేఖన విషయాన్ని పంచుకుంటే మీరు కూడా పౌలులాగే వాళ్లకు ‘ఆత్మసంబంధమైన కృపావరాన్ని’ ఇవ్వగలుగుతారు. (రోమా. 1:12) ఉదాహరణకు, కృంగిపోయిన ఓ సహోదరుడు తానెందుకూ పనికిరానని అనుకుంటుండవచ్చు. ఆయన, “పొగ తగులుచున్న సిద్దెవలెనైతిని” అని పలికిన కీర్తనకర్తలా భావిస్తుండవచ్చు. (కీర్త. 119:83, 176) ఆ పదబంధాన్ని కొద్దిగా వివరించిన తర్వాత, ఆ సహోదరుడు దేవుని “కట్టడలను” మరచిపోలేదని మీరు నమ్ముతున్నట్లు ఆయనకు చూపించండి.

అలాగే, ‘పోగొట్టుకున్న నాణెము’ గురించిన ఉపమానం, సంఘానికి దూరమైన లేదా ఆధ్యాత్మికంగా బలహీనమైన ఓ సహోదరి మనసును స్పృశించగలదేమో ఆలోచించండి. (లూకా 15:8-10) పోగొట్టుకున్న ఆ నాణెం, వెండి నాణేలతో కూర్చిన అమూల్యమైన హారంలోనిది అయ్యుండొచ్చు. ఆ ఉపమానాన్ని చర్చించి, క్రైస్తవ సంఘంలో ఆమె ఎంతో విలువైన వ్యక్తని అర్థంచేసుకోవడానికి ఆమెకు సహాయం చేయవచ్చు. ఆ చర్చ ముగింపులో, యెహోవా ఆమెను తన మందలోని చిన్ని గొర్రెపిల్లలా ఎంతో శ్రద్ధగా చూసుకుంటాడని నొక్కిచెప్పవచ్చు.

సాధారణంగా, బైబిలు విషయాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి సహోదరసహోదరీలు ఇష్టపడతారు. కాబట్టి, మొత్తం మీరే మాట్లాడకండి! వాళ్ల పరిస్థితికి వర్తించే ఓ లేఖనాన్ని చదివి వినిపించిన తర్వాత, అందులోని ముఖ్యమైన ఓ పదం గురించి లేదా పదబంధం గురించి వాళ్ల అభిప్రాయాన్ని చెప్పమనండి. ఉదాహరణకు, 2 కొరింథీయులు 4:16 చదివిన తర్వాత మీరు ఇలా అడగవచ్చు: ‘యెహోవా మిమ్మల్ని ఎలా నూతనపరుస్తున్నాడో మీరు స్వయంగా రుచి చూశారా?’ ఇలా చేసినప్పుడు నిజంగా “ఒకరి విశ్వాసముచేత ఒకరము” ఆదరణ పొందుతాం.—రోమా. 1:11.

సాధారణంగా, బైబిలు విషయాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి సహోదరసహోదరీలు ఇష్టపడతారు

వాళ్లలాంటి పరిస్థితుల్నే ఎదుర్కొన్న పూర్వకాల వ్యక్తుల గురించి మాట్లాడడం ద్వారా కూడా మీరు వాళ్లకు సేదదీర్పును ఇవ్వవచ్చు. నిరాశానిస్పృహల్లో కూరుకుపోయిన సహోదరసహోదరీలకు హన్నా, ఎపఫ్రొదితు వంటివాళ్ల గురించి చెప్పడం ద్వారా సాంత్వనను ఇవ్వవచ్చు. వాళ్లిద్దరూ కొన్ని సందర్భాల్లో తీవ్రమైన నిరాశానిస్పృహలకు లోనైనా దేవుని దృష్టిలో విలువైన వారిగానే నిలిచారు. (1 సమూ. 1:9-11, 20; ఫిలి. 2:25-30) పరిస్థితి అనుకూలిస్తే, కొన్ని చక్కని బైబిలు ఉదాహరణల్ని ఉపయోగించగలరేమో ఆలోచించండి.

కాపరి సందర్శనం తర్వాత కూడా వాళ్ల బాగోగులు తెలుసుకుంటూ ఉండండి

సందర్శనం తర్వాత కూడా సహోదరసహోదరీల బాగోగుల గురించి పట్టించుకుంటూ వాళ్లపట్ల నిజమైన శ్రద్ధను కనబర్చవచ్చు. (అపొ. 15:36) కాపరి సందర్శనాన్ని ముగించేముందు, మీతో కలిసి పరిచర్యలో పాల్గొనడానికి వాళ్లకు ఎప్పుడు వీలౌతుందో కనుక్కోవచ్చు. బర్నాడ్‌ అనే అనుభవం గల పెద్ద తాను అంతకుముందు సందర్శించిన సహోదరసహోదరీలను మళ్లీ కలిసినప్పుడు, “మీకు ఆ సలహా ఉపయోగపడిందా?” అని అడిగి వాళ్లకు తానిచ్చిన సలహాను నేర్పుగా గుర్తుచేస్తాడు. అలాంటి వ్యక్తిగత శ్రద్ధ చూపించినప్పుడు, ఇంకా ఏమైనా సహాయం అవసరమేమో తెలుసుకోగలుగుతారు.

మునుపెన్నటికన్నా ఎక్కువగా ఇప్పుడు మనం మన సహోదరసహోదరీల పట్ల శ్రద్ధ చూపించాలి, వాళ్లను అర్థంచేసుకోవాలి, వాళ్లను ప్రేమించాలి. (1 థెస్స. 5:11) కాబట్టి, కాపరి సందర్శనం కోసం సహోదరుల ఇంటికి వెళ్లే ముందు, సమయం తీసుకొని వాళ్ల పరిస్థితి గురించి ఆలోచించండి; దాన్ని ప్రార్థనలో పెట్టండి; సరైన లేఖనాలను ఎంచుకోండి. అప్పుడు ‘అలసిన వారికి’ ఊరటనిచ్చే సముచితమైన మాటలు మీకు తడతాయి.

a అసలు పేర్లు కావు.