కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు జ్ఞాపకమున్నాయా?

మీకు జ్ఞాపకమున్నాయా?

మీరు ఇటీవలి కావలికోట సంచికలను చదివి ఆనందించారా? ఈ కింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరేమో చూడండి:

బైబిలు ఉపయోగించే విషయంలో ఎలాంటి తప్పుడు పద్ధతి ప్రాచుర్యంలో ఉంది? అయితే ఈ విషయంలో క్రైస్తవులు ఎలా ఉండాలి?

ప్రజలు కళ్లు మూసుకొని బైబిల్లో ఏదో ఒక పుస్తకం తెరుస్తారు, తెరిచీతెరవగానే కంటికి కనిపించే మొదటి వాక్యంలో తమకు కావాల్సిన నిర్దేశం దొరుకుతుందని నమ్ముతారు. అయితే నిజక్రైస్తవులు అలాంటి మూఢనమ్మకాలను పాటించరు. కానీ, వాళ్లు ఖచ్చితమైన జ్ఞానం కోసం, దేవుని నిర్దేశం కోసం బైబిలును అధ్యయనం చేస్తారు.—12/15, 3వ పేజీ.

దేవుని గృహనిర్వాహకులుగా క్రైస్తవులందరూ ఏ సూత్రాలను గుర్తుంచుకోవాలి? (1 పేతు. 4:10)

క్రైస్తవులమైన మనందరం దేవుని సొత్తు కాబట్టి ఆయనకు లెక్క అప్పగించాలి; ఒకేరకమైన ప్రమాణాల ప్రకారం జీవించాలి; నమ్మకమైనవారిగా, ఆధారపడదగిన వారిగా ఉండాలి.—12/15, 10-12 పేజీలు.

గతించిపోయే “లోకము” ఏమిటి?

ఇక్కడ, గతించిపోయే “లోకము” భూమి కాదుగానీ దేవుని ఇష్టప్రకారం జీవించని మానవజాతి. (1 యోహా. 2:17) ఈ భూమి నిలిచి ఉంటుంది, అలాగే నమ్మకమైన మానవులు రక్షింపబడతారు.—1/1, 5-7 పేజీలు.

హేబెలు ‘మృతినొందినా’ ఎలా ‘మాట్లాడుతున్నాడు’? (హెబ్రీ. 11:4)

ఆయన విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు. మనం ఆయన విశ్వాసం నుండి నేర్చుకొని, ఆయనను ఆదర్శంగా తీసుకోవచ్చు. ఆయన ఆదర్శం ఈనాటికీ సజీవంగా ఉంది, విశ్వాసానికి సాటిలేని ప్రమాణంగా నిలిచింది.—1/1, 12వ పేజీ.

దేవుని నుండి దూరం అవ్వకూడదంటే మనం ఏయే రంగాల్లో జాగ్రత్త వహించాలి?

ఉద్యోగం, సరదాలు, వినోదం, సంఘం బహిష్కరించిన కుటుంబ సభ్యులతో మన అనుబంధాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే తీరు, ఆరోగ్యం గురించిన చింత, డబ్బు విషయంలో మన వైఖరి, గర్వంతో సొంత అభిప్రాయాల గురించి లేదా మన హోదా గురించి అతిగా ఆలోచించడం.—1/15, 12-21 పేజీలు.

మోషే చూపించిన వినయం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

మోషే తన అధికారాన్ని చూసుకొని గర్వంతో తన మీద తాను నమ్మకం పెట్టుకోకుండా దేవుని మీద ఆధారపడ్డాడు. మనం కూడా మన అధికారాన్ని, శక్తిసామర్థ్యాల్ని చూసుకొని గర్వించకూడదు. కానీ, యెహోవా మీద నమ్మకం పెట్టుకోవాలి. (సామె. 3:5, 6)—4/1, 5వ పేజీ.

ఇశ్రాయేలీయులు “హృదయ సంబంధమైన సున్నతినొందినవారుకారు” అంటే అర్థమేమిటి? (యిర్మీ. 9:26)

వాళ్లు మొండిగా తిరుగుబాటు చేశారు. తమ హృదయం అలా తయారయ్యేందుకు నడిపించిన ఉద్దేశాల్ని, కోరికల్ని, ఆలోచనల్ని వాళ్లు తీసేసుకోవాలి. ఎందుకంటే, అవి దేవునికి నచ్చలేదు. (యిర్మీ. 5:23, 24)—3/15, 9-10 పేజీలు.

దేవుని సంస్థలోని భూసంబంధ భాగంలో ఏమేమి ఉన్నాయి?

పరిపాలక సభ, బ్రాంచి కమిటీలు, ప్రయాణ పర్యవేక్షకులు, పెద్దల సభలు, సంఘాలు, ప్రచారకులు.—4/15, 29వ పేజీ.

ఇశ్రాయేలీయులు నేరస్థులకు మరణశిక్ష విధించడానికి మ్రానుమీద వేలాడదీసేవాళ్లా?

లేదు. ప్రాచీన కాలంలో వేరే జనాంగాలు అలా చేసేవాళ్లు కానీ ఇశ్రాయేలీయులు కాదు. కనీసం హెబ్రీ లేఖనాలు రాయబడిన కాలంలో, ఇశ్రాయేలులో నేరస్థులను మొదట రాళ్లతో కొట్టి చంపేవాళ్లు. (లేవీ. 20:2, 27) ఆ తర్వాత, ఇతరులకు ఓ హెచ్చరికగా ఉండేందుకు ఆ నేరస్థుల శవాల్ని మ్రాను మీద వేలాడదీసేవాళ్లు.—5/15, 13వ పేజీ.