కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా ఇచ్చే క్రమశిక్షణ మిమ్మల్ని మలచనివ్వండి

యెహోవా ఇచ్చే క్రమశిక్షణ మిమ్మల్ని మలచనివ్వండి

“నీ ఆలోచనచేత నన్ను నడిపించెదవు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు.”—కీర్త. 73:24.

1, 2. (ఎ) యెహోవాతో దగ్గరి సంబంధం కలిగి ఉండాలంటే ఏమి చేయడం ప్రాముఖ్యం? (బి) దేవుని క్రమశిక్షణకు ప్రజలు స్పందించిన తీరు గురించి చెప్పే లేఖనాలను పరిశీలించడం వల్ల మనం ఎలా ప్రయోజనం పొందుతాం?

 “నాకైతే దేవుని పొందు [దగ్గరవ్వడం,” NW] ధన్యకరము . . . నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చియున్నాను.” (కీర్త. 73:28) కీర్తనకర్త ఇక్కడ దేవుని మీద నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. ఇంతకీ ఆయన ఏ పరిస్థితుల వల్ల ఆ చక్కని నిర్ధారణకు రాగలిగాడు? దుష్టులు క్షేమంగా ఉండడం చూసి మొదట్లో కీర్తనకర్త నొచ్చుకున్నాడు. ఆయనిలా విలపించాడు: “నా హృదయమును నేను శుద్ధిచేసికొని యుండుట వ్యర్థమే. నా చేతులు కడుగుకొని నిర్మలుడనై యుండుట వ్యర్థమే.” (కీర్త. 73:2, 3, 13, 21) అయితే, ఆయన ‘దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయినప్పుడు’ అక్కడి వాతావరణాన్ని బట్టి తన ఆలోచనను మార్చుకోగలిగాడు, దేవునితో తనకున్న దగ్గరితనాన్ని నిలబెట్టుకోగలిగాడు. (కీర్త. 73:16-18) ఈ సందర్భం, దైవభక్తిగల ఆ కీర్తనకర్తకు ఓ ప్రాముఖ్యమైన పాఠాన్ని నేర్పించింది: యెహోవాతో దగ్గరి సంబంధాన్ని కలిగి ఉండాలంటే, ఆయన ప్రజల మధ్య ఉంటూ, ఆయనిచ్చే ఉపదేశాల్ని స్వీకరిస్తూ, వాటిని అన్వయించుకోవాలి.—కీర్త. 73:24.

2 సజీవుడైన సత్య దేవునితో సన్నిహిత సంబంధం కలిగివుండాలన్నదే మన అభిలాష కూడా. అది తీరాలంటే మనం యెహోవా ఇచ్చే ఉపదేశాన్ని, క్రమశిక్షణను స్వీకరించాలి. అప్పుడే మనం యెహోవాకు ఇష్టమైన వ్యక్తులుగా తయారౌతాం. గతంలో దేవుడు కనికరంతో ఆయా వ్యక్తులకు, ఆయా జనాంగాలకు తన క్రమశిక్షణను పొందే అవకాశాల్ని ఇచ్చాడు. వాళ్లు స్పందించిన తీరు గురించి బైబిల్లో, “మనకు బోధ కలుగు నిమిత్తము,” “యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను.” (రోమా. 15:4; 1 కొరిం. 10:11) వాటిని నిశితంగా పరిశీలించినప్పుడు, యెహోవా వ్యక్తిత్వం గురించి మన అవగాహన రెట్టింపౌతుంది, అలాగే ఆయనిచ్చే క్రమశిక్షణ నుండి ఎలా ప్రయోజనం పొందవచ్చో తెలుస్తుంది.

మన కుమ్మరి తన అధికారాన్ని ఎలా ఉపయోగిస్తాడు?

3. ప్రజల మీద యెహోవాకున్న అధికారాన్ని యెషయా 64:8, యిర్మీయా 18:1-6 ఎలా వర్ణిస్తున్నాయి? (ఆర్టికల్‌ ప్రారంభ చిత్రాన్ని చూడండి.)

3 ఆయా వ్యక్తుల మీద, జనాంగాల మీద యెహోవాకున్న అధికారాన్ని ఓ ఉపమానంతో వర్ణిస్తూ యెషయా 64:8 ఇలా చెబుతోంది: “యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను. నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతిపనియై యున్నాము.” జిగటమట్టిని తనకు నచ్చినట్లు మలిచి, తాననుకున్న రూపాన్నిచ్చే పూర్తి అధికారం ఓ కుమ్మరికి ఉంటుంది. కానీ, ఆ విషయంలో జిగటమట్టికి ఏమాత్రం అధికారం ఉండదు. దేవుని విషయంలో, మనుష్యుల విషయంలో కూడా అదే వర్తిస్తుంది. ఎలాగైతే జిగటమన్ను తనకు రూపాన్ని ఇచ్చే కుమ్మరితో విభేదించలేదో, అలాగే మనిషి కూడా ఏ రకంగానూ యెహోవాతో విభేదించలేడు.—యిర్మీయా 18:1-6 చదవండి.

4. యెహోవా ఆయా వ్యక్తుల్ని, జనాంగాల్ని తనకిష్టమొచ్చినట్లు ఎలా పడితే అలా మలిచేస్తాడా? వివరించండి.

4 కుమ్మరి జిగటమట్టిని మలిచినట్లే, తాను ప్రజల్ని మలచగలనని యెహోవా ప్రాచీన ఇశ్రాయేలీయులతో వ్యవహరించిన తీరులో చూపించాడు. అయితే మానవ కుమ్మరికి, గొప్ప కుమ్మరియైన యెహోవాకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. కుమ్మరి ఓ మట్టి ముద్దతో తాను చేయగలిగిన ఏ పాత్రనైనా చేస్తాడు. అయితే, యెహోవా ఆయా వ్యక్తుల్ని, జనాంగాల్ని తనకిష్టమొచ్చినట్లు మంచిగా, చెడ్డగా ఎలా పడితే అలా మలిచేస్తాడా? కానేకాదని బైబిలు చెబుతోంది. దేన్నైనా ఎంచుకునే స్వేచ్ఛను యెహోవా మనుష్యులకు వరంగా ఇచ్చాడు. ఆ వరాన్ని ఉపయోగించుకునే అవకాశాన్ని మనుష్యులకు ఇవ్వకుండా ఆయన తన అధికారాన్ని చెలాయించడు. సృష్టికర్తయైన యెహోవా తమను మలచాలో వద్దో మనుష్యులే నిర్ణయించుకోవాలి.—యిర్మీయా 18:7-10 చదవండి.

5. తమను మలచడాన్ని మనుష్యులు నిరాకరించినప్పుడు యెహోవా వాళ్లమీద తన అధికారాన్ని ఎలా ఉపయోగిస్తాడు?

5 గొప్ప కుమ్మరియైన యెహోవా తమను మలచడాన్ని మనుష్యులు మొండిగా నిరాకరిస్తే ఎలా? అప్పుడు యెహోవా తన అధికారాన్ని ఎలా ఉపయోగిస్తాడు? తాను అనుకున్న పాత్ర చేయడానికి జిగటమట్టి పనికిరాకపోతే, కుమ్మరి ఆ మట్టి ముద్దను ఏమి చేస్తాడో ఆలోచించండి. ఆయన దానితో వేరే పాత్ర చేయొచ్చు లేదా ఊరికే దాన్ని పడేయొచ్చు. అయితే, మట్టిముద్ద పనికిరావట్లేదంటే సాధారణంగా ఆ పొరపాటు కుమ్మరిదే అవుతుంది. కానీ, మన కుమ్మరియైన యెహోవా విషయంలో అది వర్తించదు. (ద్వితీ. 32:4) యెహోవా మలుస్తున్నప్పుడు ఓ వ్యక్తి స్పందించకపోతే, తప్పు ఆ వ్యక్తిదే అవుతుంది. తాను మలుస్తున్నప్పుడు మనుష్యులు స్పందించే తీరును బట్టి యెహోవా తన అధికారాన్ని ఉపయోగించే పద్ధతిని మార్చుకుంటాడు. చక్కగా స్పందించేవాళ్లను ఉపయోగపడే పాత్రల్లా తీర్చిదిద్దుతాడు. ఉదాహరణకు అభిషిక్తులు ‘కరుణా పాత్రలు.’ దేవుడు వాళ్లను ‘ఘనమైన పాత్రలుగా’ మలిచాడు. అయితే, దేవుణ్ణి మొండిగా నిరాకరించేవాళ్లేమో ‘నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములుగా’ మిగిలిపోతారు.—రోమా. 9:19-23.

6, 7. యెహోవా ఇచ్చిన ఉపదేశానికి దావీదు స్పందించిన తీరుకూ, సౌలు స్పందించిన తీరుకూ తేడా ఏమిటి?

 6 యెహోవా ప్రజల్ని మలచడానికి ఉపయోగించే ఓ పద్ధతి ఉపదేశించడం లేదా క్రమశిక్షణ ఇవ్వడం. ఇశ్రాయేలును పరిపాలించిన మొదటి ఇద్దరు రాజులైన సౌలు, దావీదుల ఉదాహరణలను పరిశీలిస్తే, యెహోవా తాను మలిచేవాళ్ల మీద తన అధికారాన్ని ఎలా ఉపయోగిస్తాడో తెలుస్తుంది. దావీదు రాజు బత్షెబతో వ్యభిచారం చేసినందువల్ల ఆయనకు, ఇతరులకు ఎంతో నష్టం వాటిల్లింది. దావీదు రాజే అయినా, యెహోవా నిక్కచ్చిగా ఆయనకు క్రమశిక్షణ ఇచ్చాడు. యెహోవా తన ప్రవక్తయైన నాతానును పంపించి దావీదును ఖండించాడు. (2 సమూ. 12:1-12) దానికి దావీదు ఎలా స్పందించాడు? ఆయన తన తప్పు తెలుసుకొని ఎంతో కుమిలిపోయాడు, పశ్చాత్తాపపడ్డాడు. దానివల్ల ఆయన దేవుని కనికరాన్ని పొందాడు.—2 సమూయేలు 12:13 చదవండి.

 7 దావీదుకు ముందు పరిపాలించిన సౌలు రాజు మాత్రం యెహోవా ఉపదేశానికి సరిగ్గా స్పందించలేదు. అమాలేకీయులను, వాళ్ల పశుసంపదను సర్వనాశనం చేయమని యెహోవా సమూయేలు ప్రవక్త ద్వారా సౌలుకు ఖండితంగా ఆజ్ఞాపించాడు. సౌలు ఆ ఆజ్ఞకు లోబడలేదు. రాజైన అగగును, పశువుల్లో క్రొవ్వినవాటిని ఆయన చంపకుండా వదిలేశాడు. ఎందుకు? తనకు ఘనత రావాలనే స్వార్థం కూడా ఏ మూలనో ఆయనకు ఉంది. (1 సమూ. 15:1-3, 7-9, 12) ఉపదేశాన్ని పొందినప్పుడు, సౌలు గొప్ప కుమ్మరియైన యెహోవా తనను మలిచేలా తన హృదయాన్ని మెత్తబర్చుకోవాల్సింది. కానీ యెహోవా, తనను మలచడాన్ని సౌలు నిరాకరించాడు. సౌలు తన ప్రవర్తనను సమర్థించుకున్నాడు. ఆ పశువుల్ని బలిగా అర్పించవచ్చు కాబట్టి తాను చేసినదాంట్లో తప్పేమీ లేదన్నట్లు మాట్లాడాడు, సమూయేలు ఇచ్చిన ఉపదేశాన్ని చులకనగా చూశాడు. అప్పుడు యెహోవా, సౌలును రాజుగా నిరాకరించాడు. ఆ తర్వాత సౌలు సత్యదేవునితో తనకున్న సంబంధాన్ని మళ్లీ ఎన్నడూ పునరుద్ధరించుకోలేదు.—1 సమూయేలు 15:13-15, 20-23 చదవండి.

సమూయేలు ఇచ్చిన ఉపదేశాన్ని సౌలు చులకనగా చూశాడు, తిరస్కరించాడు, యెహోవా చేతిలో మలచ బడేందుకు నిరాకరించాడు. ( 7వ పేరా చూడండి)

దావీదు తన తప్పు తెలుసుకొని కుమిలిపోయాడు, ఉపదేశాన్ని స్వీకరించాడు, యెహోవా చేతిలో మలచ బడేందుకు ఇష్టపడ్డాడు. మరి మీరు? ( 6వ పేరా చూడండి)

దేవుడు పక్షపాతి కాడు

8. యెహోవా మలుస్తున్నప్పుడు ఇశ్రాయేలు జనాంగం స్పందించిన తీరు నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు?

8 యెహోవా తాను మలుస్తున్నప్పుడు స్పందించే అవకాశాన్ని ఆయా వ్యక్తులకే కాక జనాంగాలకు కూడా ఇస్తాడు. సా.శ.పూ. 1513లో ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వం నుండి విడుదలయ్యాక, దేవునితో ఓ ప్రత్యేక నిబంధనలోకి ప్రవేశించారు. యెహోవా ఇశ్రాయేలు జనాంగాన్ని తన నిబంధనా ప్రజలుగా ఎంచుకున్నాడు. ఒకవిధంగా గొప్ప కుమ్మరియైన యెహోవా తన చేతులతో స్వయంగా చక్రం మీద వేసి మలిచే గొప్ప అవకాశాన్ని వాళ్లకు కల్పించాడు. అయినా వాళ్లు యెహోవా దృష్టిలో చెడ్డ పనులు చేశారు, ఆఖరికి చుట్టుపక్కల జనాంగాల దేవతలను ఆరాధించడం కూడా మొదలుపెట్టారు. వాళ్లు తమ తప్పును తెలుసుకునేలా చేయడానికి యెహోవా తన ప్రవక్తల్ని పదేపదే పంపిస్తూ వచ్చాడు. అయినా ఇశ్రాయేలు జనాంగం యెహోవా మాట వినలేదు. (యిర్మీ. 35:12-15) వాళ్ల మొండి ప్రవర్తన వల్ల యెహోవా వాళ్లను కఠినంగా శిక్షించాల్సి వచ్చింది. ఇశ్రాయేలు జనాంగం నాశనానికి అర్హమైన పాత్రలా మారిపోయింది. అందుకే యెహోవా ఇశ్రాయేలు పదిగోత్రాల ఉత్తర రాజ్యాన్ని అష్షూరీయులకు, రెండుగోత్రాల దక్షిణ రాజ్యాన్ని బబులోనీయులకు అప్పగించాడు. దానిలో మనకు ఎంత శక్తివంతమైన పాఠం ఉందో కదా! యెహోవా మలుస్తున్నప్పుడు మనం సరిగ్గా స్పందిస్తేనే ప్రయోజనం పొందుతాం.

9, 10. యెహోవా ఇచ్చిన హెచ్చరికకు నీనెవె వాసులు ఎలా స్పందించారు?

9 యెహోవా తన హెచ్చరికలకు స్పందించే అవకాశాన్ని, అష్షూరు రాజధానియైన నీనెవె వాసులకు కూడా ఇచ్చాడు. ఆయన యోనాకు ఇలా చెప్పాడు: “నీనెవె పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నీనెవె మహా పట్టణమునకు పోయి, దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము.” నీనెవె నాశనం కావాల్సిన పరిస్థితి వచ్చింది.—యోనా 1:1, 2; 3:1-4.

10 అయితే యోనా నాశనవార్తను ప్రకటించినప్పుడు, “నీనెవె పట్టణపువారు దేవునియందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి, ఘనులేమి అల్పులేమి అందరును గోనెపట్ట కట్టుకొనిరి.” వాళ్ల రాజు కూడా “తన సింహాసనము మీదనుండి దిగి, తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదెలో కూర్చుండెను.” యెహోవా తమను మలచడానికి చేసిన ప్రయత్నాలకు నీనెవె వాసులు చక్కగా స్పందించి, పశ్చాత్తాపపడ్డారు. అందువల్ల, యెహోవా వాళ్లను నాశనం చేయలేదు.—యోనా 3:5-10.

11. ఇశ్రాయేలీయులతో, నీనెవె వాసులతో యెహోవా వ్యవహరించిన తీరులో ఆయనకున్న ఏ లక్షణం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది?

11 ఇశ్రాయేలీయులు తాను ఎంపిక చేసుకున్న ప్రజలైనప్పటికీ, యెహోవా వాళ్లను శిక్షించకుండా వదిలేయలేదు. మరోవైపున, నీనెవె వాసులు యెహోవా నిబంధనా ప్రజలు కారు. అయినా, యెహోవా వాళ్లకు తన తీర్పును ప్రకటింపజేశాడు, తన చేతులతో మలచడానికి అనువుగా మెత్తబడినప్పుడు వాళ్లపై కనికరం చూపించాడు. ఈ రెండు ఉదాహరణలను బట్టి చూస్తే, యెహోవా “నరులముఖమును లక్ష్యపెట్టనివాడు” అని స్పష్టంగా తెలుస్తుంది కదా!—ద్వితీ. 10:17.

యెహోవా పరిస్థితుల్ని అర్థంచేసుకుంటాడు, తగిన విధంగా మార్చుకుంటాడు

12, 13. (ఎ) తాను మలుస్తున్నప్పుడు ప్రజలు స్పందించడాన్ని బట్టి యెహోవా తన నిర్ణయాన్ని ఎందుకు మార్చుకుంటాడు? (బి) సౌలు విషయంలో యెహోవా ‘పశ్చాత్తాపపడ్డాడు’ అంటే అర్థమేమిటి? (సి) నీనెవె విషయంలో యెహోవా ‘పశ్చాత్తాపపడ్డాడు’ అంటే అర్థమేమిటి?

12 యెహోవా మనల్ని మలచడానికి సుముఖంగా ఉన్నాడంటేనే, ఆయన పరిస్థితుల్ని అర్థంచేసుకుంటాడని, దానికి తగిన విధంగా మార్చుకుంటాడని తెలుస్తోంది. ప్రజల విషయంలో తన న్యాయమైన తీర్పును అమలుచేయాలని నిశ్చయించుకున్నప్పటికీ, వాళ్లు స్పందించిన తీరును బట్టి తన నిర్ణయాన్ని మార్చుకున్న సందర్భాల్ని గమనిస్తే అది స్పష్టమౌతుంది. ఇశ్రాయేలీయుల మొదటి రాజు గురించి చెబుతూ, ‘సౌలును రాజుగా ఎంచుకున్నందుకు యెహోవా పశ్చాత్తాపపడ్డాడు’ అని లేఖనాలు చూపిస్తున్నాయి. (1 సమూ. 15:11) నీనెవె వాసులు పశ్చాత్తాపపడి, మారుమనస్సు చూపించినప్పుడు జరిగిన దాని గురించి బైబిలు ఇలా చెబుతోంది: “దేవుడు . . . పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట యిచ్చిన కీడుచేయక మానెను.”—యోనా 3:10.

13 నిజానికి, ‘పశ్చాత్తాపపడ్డాడు’ అని అనువదించిన హెబ్రీ పదం ‘మనసును లేదా ఉద్దేశాన్ని మార్చుకోవడానికి’ సంబంధించినది. ఒకప్పుడు సౌలును రాజుగా ఎంచుకున్న యెహోవా ఇప్పుడు తన ఉద్దేశం మార్చుకొని ఆయనను అధికారం నుండి తొలగించాడు. ఆయనను రాజుగా ఎంచుకునే విషయంలో యెహోవా పొరబడ్డాడని కాదుగానీ సౌలు అవిశ్వాసంతో ప్రవర్తించి అవిధేయుడైనందుకే యెహోవా ఉద్దేశం మారింది. నీనెవె వాసుల విషయంలో కూడా యెహోవా పశ్చాత్తాపపడ్డాడు, అంటే వాళ్ల విషయంలో తన ఉద్దేశాన్ని మార్చుకున్నాడు. మన గొప్ప కుమ్మరియైన యెహోవా పరిస్థితిని అర్థంచేసుకుంటాడని; తగిన విధంగా తన ఆలోచనను మార్చుకుంటాడని; కరుణావాత్సల్యాలు చూపిస్తాడని; తప్పిదస్థులు తగిన మార్పులు చేసుకున్నప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని తెలుసుకోవడం మనకు ఎంత ఊరటను ఇస్తుంది!

యెహోవా ఇచ్చే క్రమశిక్షణను తిరస్కరించకుండా ఉందాం

14. (ఎ) యెహోవా ఇప్పుడు మనల్ని ఎలా మలుస్తున్నాడు? (బి) యెహోవా మలుస్తున్నప్పుడు మనమెలా స్పందించాలి?

14 నేడు యెహోవా ముఖ్యంగా తన వాక్యమైన బైబిలు ద్వారా, తన సంస్థ ద్వారా మనల్ని మలుస్తున్నాడు. (2 తిమో. 3:16, 17) యెహోవా అలా ఇచ్చే ఉపదేశాన్ని, క్రమశిక్షణను మనం స్వీకరించవద్దా? మనం బాప్తిస్మం తీసుకొని ఎంతకాలమైనా, ఎన్ని బాధ్యతలు చేపట్టినా యెహోవా ఇచ్చే ఉపదేశానికి స్పందిస్తూ, ఆయన మనల్ని ఘనమైన పాత్రలుగా మలచడానికి మనం అనువుగా ఉండాలి.

15, 16. (ఎ) యెహోవా మనకు క్రమశిక్షణ ఇచ్చే క్రమంలో మనం సేవావకాశాల్ని కోల్పోతే ఎలాంటి ప్రతికూల భావాలు మెదులుతాయి? ఓ అనుభవం చెప్పండి. (బి) క్రమశిక్షణ వల్ల కలిగే నిస్పృహ నుండి మనమెలా బయటపడవచ్చు?

15 యెహోవా కొన్నిసార్లు, ఉపదేశం లేదా దిద్దుబాటు రూపంలో క్రమశిక్షణ ఇవ్వొచ్చు. మరికొన్నిసార్లు, మనం తప్పు చేసినందుకు యెహోవా మనకు క్రమశిక్షణ ఇవ్వొచ్చు. సంఘంలో సేవాధిక్యతల్ని కోల్పోవడం కూడా ఈ కోవకే వస్తుంది. అంతకుముందు సంఘపెద్దగా సేవచేసిన డెన్నస్‌ a అనుభవాన్ని పరిశీలించండి. వ్యాపారానికి సంబంధించి ఆయన ఓ తప్పటడుగు వేశాడు, దానివల్ల పెద్దలు ఆయనను గద్దించారు. ఆయన ఇక సంఘపెద్దగా కొనసాగబోడని సంఘంలో ప్రకటన వెలువడిన రాత్రి డెన్నస్‌కు ఎలా అనిపించింది? ఆయనిలా అంటున్నాడు: “ఘోరంగా విఫలమయ్యానని భావించాను. గత 30 ఏళ్లలో నేను చాలా బాధ్యతలు చేపట్టాను. క్రమ పయినీరు సేవచేశాను, బెతెల్‌లో సేవచేశాను, పరిచర్య సేవకునిగా, ఆ తర్వాత సంఘపెద్దగా సేవచేశాను. జిల్లా సమావేశంలో అప్పుడే మొదటిసారిగా ప్రసంగం కూడా ఇచ్చాను. ఒక్కసారిగా అంతా పోయింది. అవమానభారంతో తలకొట్టేసినట్టు అనిపించడమే కాక సంస్థలో ఇక నాకు చోటే లేదని భావించాను.”

16 ఈ పరిస్థితికి దారితీసిన తప్పును సరిదిద్దుకోవడానికి డెన్నస్‌ మార్పులు చేసుకోవాల్సి వచ్చింది. కానీ, ఆ నిస్పృహ నుండి డెన్నస్‌ ఎలా బయటపడ్డాడు? ఆయన ఇలా వివరించాడు: “నేను ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో బాగా పాల్గొనాలని నిర్ణయించుకున్నాను. అలాగే, తోటి సహోదరులు ఇచ్చిన మద్దతు, ప్రచురణలు ఇచ్చిన ప్రోత్సాహం కూడా నాకు చాలా సహాయం చేశాయి. ఆగస్టు 15, 2009 కావలికోట సంచికలో, ‘మీకు ఒకప్పుడు సేవాధిక్యతలు ఉండేవా? మళ్లీ చేపట్టగలరా?’ అనే శీర్షికతో వచ్చిన ఆర్టికల్‌, నా ప్రార్థనలకు జవాబిచ్చేందుకు యెహోవా రాసిన ఉత్తరంలా అనిపించింది. ‘అదనపు బాధ్యతలు లేని ఈ సమయంలో యెహోవాతో మీకున్న సంబంధాన్ని బలపర్చుకోవడానికి కృషి చేయండి’ అనే సలహా నాకు చాలా నచ్చింది.” ఆ క్రమశిక్షణ నుండి డెన్నస్‌ ఎలా ప్రయోజనం పొందాడు? కొన్నేళ్ల తర్వాత ఆయన ఇలా అంటున్నాడు: “పరిచర్య సేవకునిగా సేవ చేసే అవకాశాన్నిచ్చి యెహోవా నన్ను మళ్లీ ఆశీర్వదించాడు.”

17. పాపి మారడానికి బహిష్కరణ ఏర్పాటు ఎలా తోడ్పడుతుంది? ఓ అనుభవం చెప్పండి.

17 బహిష్కరణ కూడా యెహోవా ఇచ్చే క్రమశిక్షణలో భాగమే. చెడు ప్రభావం నుండి సంఘాన్ని కాపాడడానికి, పాపి తన తప్పు తెలుసుకొని మారడానికి ఈ ఏర్పాటు తోడ్పడుతుంది. (1 కొరిం. 5:6, 7, 11) ఓ అనుభవాన్ని పరిశీలించండి. సంఘం నుండి రాబర్ట్‌ని బహిష్కరించి అప్పటికి దాదాపు 16 ఏళ్లు గడిచాయి. ఆ కాలమంతటిలో, పాపులతో సహవాసం చేయకూడదని, కనీసం పలకరించకూడదని దేవుని వాక్యం ఇస్తున్న నిర్దేశాన్ని ఆయన తల్లిదండ్రులు, తోబుట్టువులు నిక్కచ్చిగా, నమ్మకంగా పాటించారు. కొన్నేళ్ల క్రితం రాబర్ట్‌ని సంఘంలోకి తిరిగి చేర్చుకున్నారు, ఇప్పుడు ఆయన ఆధ్యాత్మికంగా మంచి ప్రగతి సాధిస్తున్నాడు. అన్ని సంవత్సరాల తర్వాత యెహోవా దగ్గరికి, ఆయన ప్రజల దగ్గరికి తిరిగి రావడానికి ఏది పురికొల్పిందని అడిగినప్పుడు, ఆయన తన కుటుంబ సభ్యుల దృఢ నిశ్చయత వల్లే తాను మారానని చెప్పాడు. “నా కుటుంబం నాతో ఏమాత్రం సహవసించినా, కనీసం నన్ను పలకరించినా, నేను తృప్తి పడి ఉండేవాణ్ణి. దేవుని దగ్గరకు తిరిగి రావాలన్న ప్రేరణ కూడా నాలో కలిగి ఉండేది కాదు.”

18. మహాగొప్ప కుమ్మరియైన యెహోవా చేతిలో మనం ఎలాంటి మట్టిముద్దగా ఉండాలి?

18 మనకు అంతటి క్రమశిక్షణ అవసరం కాకపోవచ్చు కానీ, మహాగొప్ప కుమ్మరియైన యెహోవా చేతిలో మనం ఎలాంటి మట్టిముద్దగా ఉంటాం? ఆయన క్రమశిక్షణ ఇచ్చినప్పుడు మనమెలా స్పందిస్తాం? మనం దావీదులా ఉంటామా లేక సౌలులానా? స్వయాన మన పరలోక తండ్రే గొప్ప కుమ్మరి. “తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించువారిని గద్దించును” అని ఎన్నడూ మర్చిపోకండి. ‘యెహోవా శిక్షను తృణీకరించకండి, ఆయన గద్దింపునకు విసుకకండి.’—సామె. 3:11, 12.

a అసలు పేర్లు కావు.