కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తల్లిదండ్రులారా—మీ పిల్లలకు శైశవదశ నుండే శిక్షణ ఇవ్వండి

తల్లిదండ్రులారా—మీ పిల్లలకు శైశవదశ నుండే శిక్షణ ఇవ్వండి

“కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన యిచ్చు బహుమానమే” అని బైబిలు చెబుతోంది. (కీర్త. 127:3) కాబట్టి, క్రైస్తవ తల్లిదండ్రులు అప్పుడే పుట్టిన తమ పసికందును చూసి ఆనందంతో ఎంతగానో మురిసిపోతారు.

శిశువు పుట్టినప్పుడు సంతోషంతో పాటు బరువైన బాధ్యతలు కూడా వస్తాయి. పసికందు ఆరోగ్యంగా ఎదగాలంటే, క్రమంగా మంచి పోషకాహారం అందాలి. అలాగే, పిల్లలు సత్యారాధనలో స్థిరంగా నిలబడాలంటే వాళ్లకు ఆధ్యాత్మిక పోషణ, దైవిక సూత్రాలను పెంపొందించడానికి ప్రయాసపడే తల్లిదండ్రుల దిశానిర్దేశాలు అవసరం. (సామె. 1:8) ఇంతకీ అలాంటి శిక్షణ ఎప్పటి నుండి మొదలుపెట్టాలి? దానికోసం ఏమేమి చేయాలి?

తల్లిదండ్రులకు ఉపదేశం అవసరం

దాను వంశస్థుడైన మానోహ విషయమే తీసుకోండి. ఆయన ప్రాచీన ఇశ్రాయేలులో జొర్యా అనే పట్టణంలో నివసించేవాడు. అప్పటివరకు గొడ్రాలిగా ఉన్న మానోహ భార్య ఓ మగశిశువుకు జన్మనిస్తుందని యెహోవా దూత ఆయనకు చెప్పాడు. (న్యాయా. 13:2, 3) విశ్వాసంగల మానోహ దంపతులు దేవదూత మాటలకు నిశ్చయంగా ఉప్పొంగిపోయి ఉంటారు. అయినా, వాళ్ల ముందున్న బరువైన బాధ్యత గురించి వాళ్లు ఎంతో ఆందోళన పడ్డారు. అందుకే మానోహ యెహోవాను ఇలా వేడుకున్నాడు: “నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరల మాయొద్దకు వచ్చి, పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయుము.” (న్యాయా. 13:8) మానోహ, ఆయన భార్య తమ పిల్లవాడి పెంపకం గురించి ఆలోచించారు. నిస్సందేహంగా, వాళ్లు తమ కుమారుడైన సమ్సోనుకు దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించే ఉంటారు. వాళ్ల ప్రయత్నాలకు మంచి ఫలితం కూడా వచ్చిందని తెలుస్తోంది. “యెహోవా ఆత్మ . . . [సమ్సోనును] రేపుటకు మొదలుపెట్టెను.” తత్ఫలితంగా, ఇశ్రాయేలు న్యాయాధిపతిగా సమ్సోను ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు.—న్యాయా. 13:25; 14:5, 6; 15:14, 15.

పుట్టబోయే శిశువు పెంపకానికి అవసరమైన నిర్దేశం కోసం మానోహ ప్రార్థించాడు

పిల్లలకు ఎప్పటి నుండి శిక్షణ ఇవ్వాలి? తిమోతి తల్లియైన యునీకే, అమ్మమ్మ లోయి అతనికి “పరిశుద్ధలేఖనములను బాల్యము నుండి [“శైశవ దశ నుండి,” NW]” బోధించారు. (2 తిమో. 1:3-5; 3:14, 15) అవును, తిమోతికి శైశవదశ నుండే లేఖనాల నుండి శిక్షణను ఇచ్చారు.

తమ పిల్లలకు “శైశవ దశ నుండి” శిక్షణ ఇచ్చేలా తల్లిదండ్రులు యెహోవా నిర్దేశం కోసం ప్రార్థించాలి, ముందుగానే చక్కని ప్రణాళిక వేసుకోవాలి. “శ్రద్ధగలవారి యోచనలు లాభకరములు” అని సామెతలు 21:5 చెబుతోంది. శిశువు పుట్టకముందే తల్లిదండ్రులు ఖచ్చితంగా వాడి పెంపకం గురించి జాగ్రత్తగా సిద్ధపడతారు. బహుశా తల్లిదండ్రులు తమ శిశువుకు అవసరమైనవాటిని కూడా ముందుగానే రాసి పెట్టుకుంటారు. అయితే, వాళ్లు ఆధ్యాత్మిక కార్యకలాపాల గురించి కూడా ముందుగానే ప్రణాళిక వేసుకోవడం ప్రాముఖ్యం. తమ బాబు/పాప పసికందుగా ఉన్నప్పటి నుండే శిక్షణ ఇవ్వడాన్ని తల్లిదండ్రులు లక్ష్యంగా పెట్టుకోవాలి.

అర్లీ చైల్డ్‌హుడ్‌ కౌంట్స్‌—అ ప్రోగ్రామింగ్‌ గైడ్‌ ఆన్‌ అర్లీ చైల్డ్‌హుడ్‌ కేర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ అనే పుస్తకం ఇలా పేర్కొంటోంది: “శిశువు పుట్టిన తర్వాతి కొన్ని నెలలు, ఆ శిశువు మెదడు ఎదుగుదలకు సంబంధించి ఎంతో ప్రాముఖ్యమైన నెలలు. ఆ నెలల్లో, నేర్చుకోవడానికి తోడ్పడే నాడీకణాల మధ్య ఉండే సంధుల సంఖ్య ఇరవై రెట్లు అధికమౌతుంది.” శిశువు మానసిక ఎదుగుదలకు సంబంధించిన ఆ కొద్ది కాలాన్ని తల్లిదండ్రులు చక్కగా ఉపయోగించుకొని ఆ పసికందు మనసులో ఆధ్యాత్మిక విషయాల్ని నాటడాన్ని మొదలుపెట్టడం ఎంత జ్ఞానయుక్తం!

క్రమపయినీరుగా సేవచేస్తున్న ఓ సహోదరి తన పాప గురించి ఇలా అంది: “కేవలం ఓ నెల నిండిన వెంటనే మా పాపను నాతో పాటు పరిచర్యకు తీసుకెళ్లడం మొదలుపెట్టాను. ఏమి జరుగుతుందో తనకు అర్థంకాకపోయినా, ఆ తొలి అనుభవం తన మీద చక్కని ప్రభావం చూపించిందనే నేను నమ్ముతున్నాను. తనకు రెండేళ్లు వచ్చేసరికి, ప్రకటనా పనిలో ఆత్మవిశ్వాసంతో ఇతరులకు కరపత్రాలు అందించడం మొదలుపెట్టింది.”

శైశవ దశలో శిక్షణ ఇస్తే మంచి ఫలితం ఉంటుంది. ఏదేమైనా, తమ పిల్లలకు ఆధ్యాత్మిక ఉపదేశాన్ని ఇవ్వడం తల్లిదండ్రులకు కాస్త సవాలుతో కూడుకున్న పనే.

‘సమయాన్ని సద్వినియోగం చేసుకోండి’

పిల్లవాడి అల్లరి లేదా వాడి ఏకాగ్రతా లోపం తల్లిదండ్రులకు పెద్ద సవాలు. చిన్నపిల్లల అవధానం ఇట్టే ఒకదాని మీద నుండి మరో దానికి మళ్లుతుంది. పైగా, అన్నిటి గురించి తెలుసుకోవాలనే కుతూహలం, ఉబలాటం వాళ్లలో పెల్లుబుకుతుంటుంది. నేర్పిస్తున్న విషయం మీద పిల్లవాడి ఏకాగ్రతను నిలిపేందుకు తల్లిదండ్రులు ఏమి చేయవచ్చు?

మోషే ఏమి చెప్పాడో గమనించండి. ద్వితీయోపదేశకాండము 6:6, 7లో ఇలా ఉంది: “నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను; సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను.” ఇక్కడ ‘అభ్యసింపజేయడం’ అనే పదం, చెప్పిన విషయాన్నే మళ్లీమళ్లీ చెబుతూ నేర్పించడం అనే అర్థాన్నిస్తుంది. చిన్నపిల్లలు, క్రమంగా నీళ్లు అవసరమయ్యే లేతమొక్కల్లాంటి వాళ్లు. మళ్లీమళ్లీ చెప్పడం వల్ల పెద్దవాళ్లే ప్రాముఖ్యమైన విషయాల్ని గుర్తుంచుకుంటారంటే, మరి పిల్లలు గుర్తుంచుకోలేరా?

దేవుని గురించిన సత్యాలు పిల్లలకు బోధించాలంటే వాళ్లతో సమయం వెచ్చించాలి. ఈ ఉరుకులుపరుగుల ప్రపంచంలో, పిల్లల కోసం కాస్త సమయం వెచ్చించడం నిజంగా ఓ సవాలే. అయినా, “సమయమును పోనియ్యక” ప్రాముఖ్యమైన క్రైస్తవ కార్యకలాపాల కోసం దాన్ని “సద్వినియోగము” చేసుకోవాలని అపొస్తలుడైన పౌలు సిఫారసు చేశాడు. (ఎఫె. 5:15, 16) ఈ సలహాను ఎలా పాటించవచ్చు? తన పాపకు శిక్షణ ఇవ్వడం, సంఘ బాధ్యతల్ని చూసుకోవడం, ఉద్యోగం చేయడం ఇలా ఆ మూడింటిలో చక్కని సమతుల్యతను చూపించడం ఓ క్రైస్తవ పెద్దకు సవాలుగానే అనిపించింది. పైగా ఆయన భార్య ఓ క్రమ పయినీరు. మరి వాళ్లు తమ పాపకు శిక్షణ ఇచ్చేందుకు సమయాన్ని ఎలా వెచ్చించగలిగారు? ఆ తండ్రి ఇలా అంటున్నాడు: “ప్రతీరోజు ఉదయాన్నే నేను పనికి వెళ్లే ముందు, మేమిద్దరం కలిసి మా పాపకు నా బైబిలు కథల పుస్తకం నుండి గానీ, ప్రతీరోజు లేఖనాల్ని పరిశోధిద్దాం నుండి గానీ చదివి వినిపిస్తాం. రాత్రేమో తను పడుకునేలోపు ఏదోకటి చదివి వినిపిస్తాం. పరిచర్యకు కూడా మాతోపాటు తనను తీసుకెళ్తాం. తన జీవితంలోని ఈ తొలినాళ్లని మేము వృథా చేయదలచుకోవడం లేదు.”

‘కుమారులు బాణముల వంటివాళ్లు’

పిల్లల్ని బాధ్యతాయుతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దాలని మనం తప్పక కోరుకుంటాం. అయితే, మన పిల్లలకు క్రమశిక్షణ ఇస్తున్నప్పుడు, వాళ్ల హృదయాల్లో దేవునిపై ప్రేమను పెంపొందించాలన్నదే మన ప్రాథమిక లక్ష్యం.—మార్కు 12:28-30.

“యౌవనకాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములవంటివారు” అని కీర్తన 127:4 చెబుతోంది. ఆ లేఖనం పిల్లల్ని, లక్ష్యానికి గురిపెట్టి కొట్టాల్సిన బాణాలతో పోలుస్తోంది. విలుకాడు ఒకసారి బాణాన్ని విల్లు నుండి వదిలాడంటే, దాన్ని వెనక్కి తీసుకోవడం ఎన్నటికీ సాధ్యం కాదు. అలాగే, తల్లిదండ్రుల చేతుల్లో పిల్లలనే ‘బాణాలు’ చాలా కొద్దికాలంపాటే ఉంటాయి. తల్లిదండ్రులు ఆ కొద్దికాలాన్ని, పిల్లల మనసుల్లో హృదయాల్లో దైవిక సూత్రాల్ని నాటడానికి ఉపయోగించుకోవాలి.

తన ఆధ్యాత్మిక పిల్లల గురించి అపొస్తలుడైన యోహాను ఇలా రాశాడు: “నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుటకంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు.” (3 యోహా. 4) తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ‘సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నప్పుడు’ అలాంటి సంతోషాన్నే వ్యక్తం చేయగలుగుతారు.