కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆనాటి జ్ఞాపకాలు

రాజు ఎంతో సంతోషించాడు!

రాజు ఎంతో సంతోషించాడు!

అది 1936వ సంవత్సరం, ఆగస్టు నెల. స్వాజీలాండ్‌లోని రాజనగరు దగ్గర. రాబర్ట్‌, జార్జ్‌ నిజ్బట్‌ అనే సహోదరులు సౌండ్‌ కారులో నుండి సహోదరుడు జె.ఎఫ్‌. రూథర్‌ఫర్డ్‌ ప్రసంగాలను, ఆ తర్వాత సంగీతాన్ని వినిపించారు. అవి విని రాజైన సోభూజ-II ఎంతో సంతోషించాడు. అప్పుడు జరిగినదాని గురించి చెబుతూ జార్జ్‌ ఇలా అన్నాడు: ‘ఆ రాజు రికార్డ్‌ ప్లేయర్‌ను, ప్రసంగ రికార్డ్‌లను, లౌడ్‌స్పీకర్‌లను కొనాలనుకుంటున్నానని చెప్పి మమ్మల్ని ఇరకాటంలో పడేశాడు.’

‘క్షమించండి, ఆ వస్తువులు అమ్మడానికి కాదు’ అని రాబర్ట్‌ బదులిచ్చాడు. అవి వేరేవాళ్లవి కాబట్టి వాటిని అమ్మడం కుదరదని సహోదరులు చెప్పారు. అయితే, ఆ వస్తువులు ఎవరివో చెప్పమని రాజు అడిగాడు.

‘అవన్నీ వేరే రాజువి’ అని రాబర్ట్‌ జవాబిచ్చాడు. దానికి, ‘ఆ రాజు ఎవరు?’ అని సోభూజ అడిగాడు. ‘దేవుని రాజ్యానికి రాజైన యేసుక్రీస్తు’ అని రాబర్ట్‌ చెప్పాడు.

దానికి సోభూజ అమితమైన గౌరవంతో ఇలా అన్నాడు: ‘యేసుక్రీస్తా? ఆయన ఒక గొప్ప రాజు, ఆయనకు చెందిన ఏ వస్తువూ నాకు వద్దు.’

ఆ సందర్భం గురించి రాబర్ట్‌ ఇలా రాశాడు: ‘ఆ రాజు స్వభావాన్ని చూసి నేను ఎంతో ఆశ్చర్యపోయాను. ఆయన చాలా చక్కగా ఇంగ్లీషు మాట్లాడాడు. అసలు ఏమాత్రం గొప్పలు చెప్పుకోలేదు, గర్వాన్ని చూపించలేదు. ఆయన ముక్కుసూటి మనిషే అయినా స్నేహశీలి. ఆయన ఆఫీసులో కూర్చుని దాదాపు 45 నిమిషాల పాటు ఇద్దరం మాట్లాడుకున్నాం. ఆ సమయంలో జార్జ్‌ బయట ఉండి సంగీత రికార్డ్‌లను వినిపించసాగాడు.’

రాబర్ట్‌ ఇంకా ఇలా రాశాడు: ‘ఆ తర్వాత అదే రోజు, మేము స్వాజీ నేషనల్‌ స్కూల్‌కు వెళ్లాం. అక్కడ మాకు అత్యంత ఆసక్తికరమైన అనుభవం ఎదురైంది. మేము ఆ స్కూల్‌ ప్రిన్సిపల్‌ను కలిసి ఆయనకు సాక్ష్యమిచ్చాం. ఆయన చాలా చక్కగా విన్నాడు. మా దగ్గరున్న రికార్డ్‌ ప్లేయర్‌ గురించి చెప్పి, రికార్డింగ్‌లను స్కూల్‌లో వినిపిస్తామని అడిగినప్పుడు, ఆయన సంతోషంగా దాన్ని అంగీకరించి, సుమారు 100 మంది విద్యార్థులను స్కూల్‌ బయట ఉన్న గడ్డిలో కూర్చోబెట్టాడు. ఆ హైస్కూల్లోని బాలురకు వ్యవసాయం, తోటపని, వడ్రంగి పని, భవన నిర్మాణ పని, ఇంగ్లీషు, గణితం వంటివి నేర్పిస్తున్నారని మాకు తెలిసింది. బాలికలకు నర్సింగ్‌ విద్యను, ఇంటిపని, మరితర వృత్తులను నేర్పిస్తున్నారని విన్నాం. ఆ హైస్కూల్‌ను సోభూజ రాజు నాయనమ్మ స్థాపించింది.’

1936లో స్వాజీలాండ్‌లో ఓ బహిరంగ ప్రసంగానికి హాజరైన హైస్కూల్‌ విద్యార్థులు

సోభూజ రాజు 1933 నాటికే, తన రాజనగరుకు విచ్చేసిన పయినీర్లు చెప్పే విషయాల పట్ల ఎంతో ఆసక్తి కనబర్చాడు. ఓ సందర్భంలోనైతే రాజు తన వ్యక్తిగత అంగరక్షకులైన వందమంది యోధులను సమావేశపర్చి రాజ్య సందేశపు రికార్డింగ్‌లను వినమని ఆదేశించాడు. చందా కట్టి మన ప్రచురణలు తీసుకున్నాడు. కొంతకాలానికే, ఆ రాజు దాదాపు మన సాహిత్యాన్నంతా సమకూర్చుకున్నాడు! రెండవ ప్రపంచయుద్ధ కాలంలో, బ్రిటిష్‌ ప్రభుత్వం మన సాహిత్యాన్ని నిషేధించినప్పుడు కూడా ఆయన మన ప్రచురణలను భద్రంగా దాచుకున్నాడు.

రాజైన సోభూజ-II, లోబాంబలో ఉన్న తన రాజనగరుకు యెహోవాసాక్షులను సాదరంగా ఆహ్వానిస్తూ వచ్చాడు. మన సహోదరులు ఇచ్చే బైబిలు ప్రసంగాలను వినడానికి రమ్మని రాజు అక్కడి చర్చీ నాయకులను కూడా పిలిచేవాడు. హెల్వీ మషాజీ అనే స్థానిక యెహోవాసాక్షి మత్తయి 23వ అధ్యాయం చర్చిస్తున్నప్పుడు అక్కడకు విచ్చేసిన చర్చీ నాయకుల్లో కొందరు కోపంతో ఊగిపోతూ ఆయనను ఆపడానికి ప్రయత్నించారు. అప్పుడు రాజు మధ్యలో కలుగజేసుకుని, తన చర్చను కొనసాగించమని ఆ సహోదరునికి చెప్పాడు. అంతేకాక, సహోదరుడు చెబుతున్న బైబిలు లేఖనాలన్నీ రాసుకోమని ప్రేక్షకులకు చెప్పాడు.

ఇంకో సందర్భంలో, ఓ పయినీరు సహోదరుడు ఇచ్చిన ప్రసంగాన్ని విన్న నలుగురు చర్చీ నాయకులు తమ మనసు మార్చుకుని ఇలా అన్నారు: ‘ఇప్పటి నుండి మేము యెహోవాసాక్షులం! చర్చీ నాయకులం కాదు.’ ఆ తర్వాత ఆ నలుగురు, రాజు దగ్గరున్నటువంటి పుస్తకాలు తమకు కావాలని పయినీరును అడిగారు.

సోభూజ రాజు 1930వ దశకం నుండి 1982లో తను చనిపోయేంతవరకు యెహోవాసాక్షుల పట్ల చాలా గౌరవంగా వ్యవహరించాడు, వాళ్లు స్వాజీ దేశ ఆచారాలను ఆచరించనందుకు వాళ్లను ఇతరులు హింసించకుండా చూశాడు. అందుకే యెహోవాసాక్షులు ఆ రాజు పట్ల ఎంతో కృతజ్ఞతను చూపించారు, ఆయన చనిపోయినప్పుడు వాళ్లు ఏడ్చారు.

స్వాజీలాండ్‌లో 2013 ఆరంభంకల్లా 3,000 కన్నా ఎక్కువమంది రాజ్య ప్రచారకులు ఉన్నారు. 10 లక్షల పైచిలుకు జనాభా ఉన్న ఆ దేశంలో ప్రతీ 384 మందికి 1 రాజ్య ప్రచారకుడు ఉన్నాడు. 90 సంఘాల్లో 260 కన్నా ఎక్కువమంది పయినీర్లుగా సేవచేస్తున్నారు. 2012లో జ్ఞాపకార్థ ఆచరణకు 7,496 మంది హాజరయ్యారు. దీన్నిబట్టి చూస్తే అక్కడ, రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి జరగవచ్చని తెలుస్తోంది. 1930వ దశకంలో మన సహోదరులు రాజ్య సందేశంతో స్వాజీలాండ్‌కు వెళ్లి గట్టి పునాది వేయడం వల్లే ఇదంతా సాధ్యమౌతోంది.—దక్షిణ ఆఫ్రికా నుండి సేకరించినవి.