యెహోవా జ్ఞాపికలు నమ్మదగినవి
“యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును.”—కీర్త. 19:7.
1. మనం ఏయే విషయాల గురించి మళ్లీమళ్లీ చర్చిస్తుంటాం? దానివల్ల ఎలా ప్రయోజనం పొందుతున్నాం?
కావలికోట అధ్యయనానికి సిద్ధపడుతున్నప్పుడు, ‘ఈ విషయం ఇంతకుముందు కూడా వచ్చిందే!’ అని మీరెప్పుడైనా అనుకున్నారా? గత కొన్నేళ్లుగా మీరు క్రైస్తవ సంఘంతో సహవసిస్తుంటే, పలు విషయాలు మళ్లీమళ్లీ చర్చకు రావడం బహుశా గమనించే ఉంటారు. దేవుని రాజ్యం, విమోచన క్రయధనం, శిష్యుల్ని చేసే పని వంటివాటి గురించి; అలాగే ప్రేమ, విశ్వాసం వంటి లక్షణాల గురించి మనం క్రమంగా చర్చిస్తూ ఉంటాం. ఈ విషయాలను మళ్లీమళ్లీ చర్చించుకోవడం వల్ల మనం విశ్వాసంలో స్థిరంగా ఉండడంతో పాటు, ‘వినేవాళ్లుగా మాత్రమే ఉండకుండా, వాక్య ప్రకారం ప్రవర్తించే వాళ్లుగా ఉండగలుగుతున్నాం.’—యాకో. 1:22.
2. (ఎ) దేవుని జ్ఞాపికలు తరచుగా వేటిని సూచిస్తాయి? (బి) మనుష్యుల నియమాలకు, దేవుని నియమాలకు మధ్య ఉన్న తేడా ఏమిటి?
2 “శాసనము” లేదా జ్ఞాపికలు అని అనువదించిన గ్రీకు పదం తరచుగా, దేవుడు తన ప్రజలకు ఇచ్చే నియమాలను, ఆజ్ఞలను సూచిస్తుంది. తరచూ సవరించాల్సి వచ్చే మనుష్యుల నియమాల్లా కాక యెహోవా నియమాలు, శాసనాలు ఎల్లప్పుడూ నమ్మదగినవిగా ఉంటాయి. కొన్ని నియమాలను యెహోవా ఫలానా సమయం కోసమో, సందర్భం కోసమో ఇచ్చినా, అవి ఏనాటికీ తప్పయిపోవు లేదా ఉపయోగపడకుండా పోవు. కీర్తనకర్త ఇలా అన్నాడు: “నీ శాసనములు శాశ్వతమైన నీతిగలవి.”—కీర్త. 119:144.
3, 4. (ఎ) యెహోవా ఇచ్చే జ్ఞాపికల్లో ఏవి కూడా ఉన్నాయి? (బి) వాటిని పాటిస్తే ఇశ్రాయేలీయులు ఎలాంటి ప్రయోజనం పొందుతారని దేవుడు చెప్పాడు?
3 యెహోవా ఇచ్చే జ్ఞాపికల్లో కొన్నిసార్లు హెచ్చరికా సందేశాలు కూడా ఉంటాయని మీరు గమనించే ఉంటారు. ఇశ్రాయేలీయులకు క్రమంగా దేవుని ప్రవక్తల నుండి హెచ్చరికలు అందాయి. ఉదాహరణకు, వాగ్దాన దేశంలోకి అడుగుపెట్టడానికి కొంతకాలం ముందు, మోషే ఇలా హెచ్చరించాడు: ‘మీ హృదయం మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరించకుండ మీరు జాగ్రత్తపడండి. లేనియెడల యెహోవా మీమీద కోపపడును.’ (ద్వితీ. 11:16, 17) దేవుడు తన ప్రజలకు సహాయం చేయడానికి ఎన్నో జ్ఞాపికలు ఇచ్చాడని బైబిలు వెల్లడిస్తోంది.
4 తనకు భయపడాలని, తన మాట వినాలని, తన నామాన్ని పరిశుద్ధపర్చాలని యెహోవా ఇశ్రాయేలీయులకు ఎన్నో ఇతర సందర్భాల్లో కూడా ఉపదేశమిచ్చాడు. (ద్వితీ. 4:29-31; 5:28, 29) తానిచ్చే జ్ఞాపికల్ని పాటిస్తే, వాళ్లు తప్పకుండా ఆశీర్వాదాలు పొందుతారని యెహోవా చెప్పాడు.—లేవీ. 26:3-6; ద్వితీ. 28:1-4.
దేవుడు ఇచ్చిన జ్ఞాపికలకు ఇశ్రాయేలీయులు ఎలా స్పందించారు?
5. రాజైన హిజ్కియా తరఫున యెహోవా ఎందుకు పోరాడాడు?
5 ఇశ్రాయేలు చరిత్రలో దేవుడు అన్నివేళలా తన మాట నిలబెట్టుకున్నాడు. ఉదాహరణకు, అష్షూరు రాజైన సన్హెరీబు యూదా మీదికి దండెత్తి వచ్చి, హిజ్కియా రాజును పడగొడతానని బెదిరించినప్పుడు యెహోవా కలుగజేసుకొని తన దూతను పంపించాడు. ఆ దేవదూత ఒకే ఒక్క రాత్రిలో, “అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలులనందరిని” చంపేశాడు. దాంతో అష్షూరు రాజు “సిగ్గునొందినవాడై తన దేశమునకు తిరిగిపోయెను.” (2 దిన. 32:21; 2 రాజు. 19:35) ఇంతకీ రాజైన హిజ్కియా తరఫున యెహోవా ఎందుకు పోరాడాడు? ఎందుకంటే హిజ్కియా, ‘యెహోవాను హత్తుకొని, ఆయనను వెంబడించుటలో వెనుకతీయక ఆయన ఆజ్ఞలన్నిటిని గైకొనుచుండెను.’—2 రాజు. 18:1, 5, 6.
6. యోషీయా రాజు యెహోవా మీద ఎలా నమ్మకం ఉంచాడు?
6 యెహోవా ఆజ్ఞలకు లోబడిన మరో వ్యక్తి రాజైన యోషీయా. ఎనిమిదేళ్ల లేతప్రాయం నుండే ‘అతడు యెహోవా దృష్టికి నీతి ననుసరించుచు, కుడికైనను ఎడమకైనను తొలగలేదు.’ (2 దిన. 34:1, 2) యోషీయా దేశంలో ఉన్న విగ్రహాలన్నిటినీ నిర్మూలించి, సత్యారాధనను పునరుద్ధరించడం ద్వారా యెహోవా మీద తనకున్న నమ్మకాన్ని చూపించాడు. అలా చేసి, యోషీయా తనకు మాత్రమే కాక, మొత్తం జనాంగానికి ఆశీర్వాదాలు తీసుకువచ్చాడు.—2 దినవృత్తాంతములు 34:31-33 చదవండి.
7. ఇశ్రాయేలీయులు యెహోవా జ్ఞాపికల్ని పట్టించుకోనప్పుడు ఏమి జరిగింది?
7 విచారకరంగా, దేవుని ప్రజలు ఆయనిచ్చిన జ్ఞాపికలపై అన్నివేళలా పూర్తి నమ్మకం ఉంచలేదు. ఎన్నో శతాబ్దాలపాటు వాళ్లు విధేయతకు, అవిధేయతకు మధ్య ఊగిసలాడారు. అపొస్తలుడైన పౌలు మాటల్లో చెప్పాలంటే, తమ విశ్వాసం బలహీనపడినప్పుడు వాళ్లు, “గాలికి కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపో[యారు].” (ఎఫె. 4:13, 14) యెహోవా ముందే చెప్పినట్లు, వాళ్లు ఆయన జ్ఞాపికల మీద నమ్మకం ఉంచనప్పుడు చేదు పర్యవసానాలను చవిచూశారు.—లేవీ. 26:23-25; యిర్మీ. 5:23-25.
8. ఇశ్రాయేలీయుల ఉదాహరణ నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు?
8 ఇశ్రాయేలీయుల ఉదాహరణ నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? వాళ్లలాగే, ఆధునిక కాల దేవుని సేవకులకు కూడా ఉపదేశం, క్రమశిక్షణ అందుతోంది. (2 పేతు. 1:12) దేవుని ప్రేరేపిత వాక్యాన్ని చదివిన ప్రతీసారి అది మనకు ఓ జ్ఞాపికలా పనిచేస్తుంది. మనకు స్వేచ్ఛాచిత్తం ఉంది కాబట్టి, యెహోవా నిర్దేశాల్ని పాటించాలో లేక మన దృష్టికి మంచిగా అనిపించింది చేయాలో మనమే నిర్ణయించుకోవచ్చు. (సామె. 14:12) యెహోవా ఇచ్చే జ్ఞాపికల్ని మనమెందుకు నమ్మవచ్చో, వాటిని పాటించడం వల్ల మనమెలా ప్రయోజనం పొందవచ్చో ఇప్పుడు పరిశీలిద్దాం.
దేవునికి లోబడండి, జీవించండి
9. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు, వాళ్ల వెన్నంటే ఉన్నానని యెహోవా ఎలా చూపించాడు?
9 ఇశ్రాయేలీయులు “ఘోరమైన మహారణ్యము” గుండా 40 ఏళ్లు సంచరించినప్పుడు, వాళ్లను ఆయన ఎలా నడిపిస్తాడో, ఎలా కాపాడతాడో, ఎలా చూసుకుంటాడో వంటి వివరాల్ని యెహోవా పూసగుచ్చినట్లు ముందే చెప్పలేదు. కానీ తనపై, తన ఉపదేశాలపై నమ్మకం ఉంచవచ్చని పదేపదే నిరూపించాడు. వాళ్లకు మార్గనిర్దేశం ఇవ్వడానికి పగలు మేఘస్తంభాన్ని, రాత్రిలో వెలుగు ఇవ్వడానికి అగ్నిస్తంభాన్ని ఉపయోగిస్తూ ఆ ఘోరమైన అరణ్యంలో వాళ్ల వెన్నంటే ఉన్నానని యెహోవా చూపించాడు. (ద్వితీ. 1:19; నిర్గ. 40:36-38) వాళ్ల కనీస అవసరాలు కూడా తీర్చాడు. “వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు.” నిజానికి, వాళ్లకు “ఏమియు తక్కువ” కాలేదు.—నెహె. 9:19-21.
10. యెహోవా నేడు తన ప్రజల్ని ఎలా నిర్దేశిస్తున్నాడు?
10 నేడు దేవుని సేవకులు, నీతియుక్తమైన నూతనలోకం ముంగిట ఉన్నారు. రాబోయే మహాశ్రమలను తప్పించుకొని, జీవించడానికి కావాల్సిన వాటిని యెహోవా ఇస్తాడని మనం నమ్ముతున్నామా? (మత్త. 24:21, 22; కీర్త. 119:40, 41) నిజమే, మనల్ని నూతనలోకంలోకి నడిపించడానికి యెహోవా ఇప్పుడు ఓ మేఘస్తంభాన్నో, అగ్నిస్తంభాన్నో ఇవ్వట్లేదు. కానీ, తన సంస్థ ఉపయోగిస్తూ మనం అప్రమత్తంగా ఉండేలా సహాయం చేస్తున్నాడు. ఉదాహరణకు బైబిలు అధ్యయనం చేస్తూ, కుటుంబ ఆరాధన జరుపుకుంటూ, కూటాలకు క్రమంగా హాజరౌతూ, పరిచర్యలో క్రమంగా పాల్గొంటూ మనం మన ఆధ్యాత్మికతను పెంచుకోవాలని సంస్థ ఈ మధ్యకాలంలో ఎక్కువగా నొక్కిచెబుతోంది. ఆ ఉపదేశాల్ని పాటించడం కోసం మనం తగిన మార్పులు చేసుకున్నామా? అలా చేస్తే, మనం నూతనలోకంలోకి అడుగుపెట్టేందుకు కావాల్సిన విశ్వాసాన్ని పెంపొందించుకోగలుగుతాం.
11. దేవుడు మనపై ఏయే విధాలుగా శ్రద్ధ చూపిస్తున్నాడు?
11 సంస్థ ఇస్తున్న నిర్దేశాలు మనల్ని ఆధ్యాత్మికంగా అప్రమత్తంగా ఉంచడంతోపాటు, రోజువారీ జీవితానికి సంబంధించిన విషయాల్లో కూడా మనకు సహాయం చేస్తాయి. ఆ నిర్దేశాల్లో, వస్తుసంపదల విషయంలో సరైన వైఖరితో ఉంటూ, జీవితాన్ని సరళంగా ఉంచుకుంటూ చింతల్ని తగ్గించుకోమనే సలహా కూడా ఉంది. దుస్తులు, కనిపించే తీరు విషయంలో, ఎలాంటి వినోదాన్ని ఎంచుకోవాలో, ఎంతవరకు చదువు అభ్యసించాలో వంటి విషయాల్లో సంస్థ ఇస్తున్న నిర్దేశాల నుండి మనం ప్రయోజనం పొందాం. మన ఇంటిని, వాహనాలను, రాజ్యమందిరాలను సురక్షితంగా ఎలా ఉంచుకోవాలి, ప్రమాదం జరిగితే ఏమి చేయాలి అనే విషయాల్లో సంస్థ ఇచ్చిన భద్రతాపరమైన జ్ఞాపికల గురించి కూడా ఆలోచించండి. అలాంటివి, మన శ్రేయస్సు విషయంలో దేవునికున్న శ్రద్ధకు తార్కాణాలు.
జ్ఞాపికల వల్ల తొలి క్రైస్తవులు విశ్వాసంలో నిలదొక్కుకున్నారు
12. (ఎ) యేసు తన శిష్యులతో పదేపదే ఏ విషయం గురించి మాట్లాడాడు? (బి) యేసు వినయంతో చేసిన ఏ పని పేతురు మీద చెరగని ముద్ర వేసింది? అది మనకు ఏ ప్రేరణను ఇస్తుంది?
12 మొదటి శతాబ్దంలో, దేవుని ప్రజలకు క్రమంగా జ్ఞాపికలు అందాయి. వినయం అలవర్చుకోవడం గురించి యేసు తన శిష్యులతో పదేపదే మాట్లాడాడు. అయితే ఆయన తన శిష్యులకు వినయంగా ఉండడమంటే ఏమిటో చెప్పి ఊరుకోలేదు కానీ, దాన్ని చేతల్లో కూడా చూపించాడు. మానవునిగా ఈ భూమ్మీద ఉన్న చివరి రోజున యేసు, పస్కా ఆచరించడానికి తన అపొస్తలులను ఒక చోట సమకూర్చాడు. అపొస్తలులు భోజనం చేస్తుండగా యేసు లేచి, వాళ్ల పాదాలు కడిగి ఓ దాసుడు చేసే పనిని చేశాడు. (యోహా. 13:1-17) యేసు వినయంతో చేసిన ఆ పని ఆయన శిష్యుల మీద చెరగని ముద్ర వేసింది. ఆ రోజు యేసుతో కలిసి భోజనం చేసిన అపొస్తలుడైన పేతురు, దాదాపు 30 ఏళ్ల తర్వాత తన తోటి విశ్వాసులకు వినయం గురించి ఉపదేశమిచ్చాడు. (1 పేతు. 5:5) యేసును ఆదర్శంగా తీసుకుంటే, మనమందరం ఒకరితో ఒకరం వినయంగా వ్యవహరించాలనే ప్రేరణను పొందుతాం.—ఫిలి. 2:5-8.
13. ఏ ప్రాముఖ్యమైన లక్షణం పెంపొందించుకోమని యేసు తన శిష్యులకు పదేపదే గుర్తుచేసేవాడు?
13 బలమైన విశ్వాసం కలిగి ఉండడం కూడా ప్రాముఖ్యమని యేసు తన శిష్యులతో పదేపదే చెప్పేవాడు. దయ్యం పట్టిన ఓ బాలుని నుండి దయ్యాన్ని వెళ్లగొట్టడానికి విఫలయత్నం చేసిన తర్వాత శిష్యులు యేసును ఇలా అడిగారు: “మేమెందుచేత దానిని వెళ్లగొట్టలేక పోతిమి?” దానికి యేసు, “మీ అల్పవిశ్వాసము చేతనే; మీకు ఆవగింజంత విశ్వాసముండినయెడల . . . మీకు అసాధ్యమైనది ఏదియు నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను” అని జవాబిచ్చాడు. (మత్త. 17:14-20) విశ్వాసం ప్రాముఖ్యమైన లక్షణం అనే విషయాన్ని శిష్యులకు యేసు తన పరిచర్యంతటిలో బోధిస్తూనే వచ్చాడు. (మత్తయి 21:18-22 చదవండి.) సమావేశాల ద్వారా, క్రైస్తవ కూటాల ద్వారా లభిస్తున్న ప్రోత్సాహకరమైన ఉపదేశాల్ని ఉపయోగించుకుంటూ మనం మన విశ్వాసాన్ని బలపర్చుకుంటున్నామా? అవి సంతోషకరమైన సందర్భాలు మాత్రమే కాదు, యెహోవా మీద మనకున్న నమ్మకాన్ని ప్రదర్శించే అవకాశాలు కూడా.
14. నేడు మనం క్రీస్తు చూపించినలాంటి ప్రేమను అలవర్చుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?
14 ఒకరిపట్ల ఒకరం ప్రేమ చూపించుకోవడానికి సహాయం చేసే జ్ఞాపికలు క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో కోకొల్లలుగా ఉన్నాయి. “నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెను” అనే ఆజ్ఞ రెండవ గొప్ప ఆజ్ఞ అని యేసు అన్నాడు. (మత్త. 22:39) ప్రేమ చూపించడం ‘ప్రాముఖ్యమైన ఆజ్ఞ’ అని యేసు సహోదరుడైన యాకోబు కూడా అన్నాడు. (యాకో. 2:8) అపొస్తలుడైన యోహాను ఇలా రాశాడు: “ప్రియులారా, మొదటనుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనేగాని క్రొత్త ఆజ్ఞను నేను మీకు వ్రాయుటలేదు.” (1 యోహా. 2:7, 8) యోహాను ఇక్కడ “పూర్వపు ఆజ్ఞ” అని దేన్ని ఉద్దేశించి అన్నాడు? ఆయన ప్రేమ చూపించడం గురించే మాట్లాడాడు. “మొదట నుండి” అంటే దశాబ్దాల పూర్వమే యేసు దాన్ని ఇచ్చాడనే భావంలో యోహాను దాన్ని “పూర్వపు ఆజ్ఞ” అని సంబోధించాడు. అయితే, తమకు ఎదురవ్వబోయే కొత్త పరిస్థితుల్లో శిష్యులు స్వయంత్యాగపూరిత ప్రేమ చూపించాలి కాబట్టి అది “క్రొత్త ఆజ్ఞ” కూడా. ఈ లోకంలో చాలామంది చూపించే స్వార్థపూరిత స్ఫూర్తికి దూరంగా ఉండేందుకు సహాయపడే హెచ్చరికల్ని అందుకుంటున్నందుకు మనమెంతో కృతజ్ఞులం. అందుకే, మనం నిస్వార్థమైన ప్రేమ చూపిస్తాం.
15. భూమ్మీద ఉన్నప్పుడు యేసు ప్రాథమిక కర్తవ్యం ఏమిటి?
15 యేసు ప్రజల మీద వ్యక్తిగత శ్రద్ధ చూపించాడు. రోగులను, కుంటివాళ్లను, గుడ్డివాళ్లను స్వస్థపర్చినప్పుడు, అలాగే చనిపోయినవాళ్లను పునరుత్థానం చేసినప్పుడు యేసుకు ప్రజల మీదున్న ప్రేమ కొట్టొచ్చినట్లు కనిపించింది. అయితే, యేసు ప్రాథమిక కర్తవ్యం ప్రజల్ని శారీరకంగా స్వస్థపర్చడం కాదు. ఆయన చేసిన ప్రకటనాపని, బోధనాపని ప్రజల జీవితాల్లో మరింత గొప్ప ప్రభావం చూపించాయి. ఎలా? మొదటి శతాబ్దంలో యేసు వల్ల స్వస్థత పొందిన వాళ్లు, పునరుత్థానమైన వాళ్లు మళ్లీ ముసలివాళ్లై చనిపోయారు కానీ, ఆయన ప్రకటించిన సందేశానికి సానుకూలంగా స్పందించిన వాళ్లు నిత్యజీవం పొందే అవకాశం సొంతం చేసుకున్నారు.—యోహా. 11:25, 26.
16. నేడు రాజ్య ప్రకటనా పని, శిష్యుల్ని చేసే పని ఎంత విస్తృతంగా జరుగుతోంది?
16 మొదటి శతాబ్దంలో యేసు ప్రారంభించిన ప్రకటనా పని ఇప్పుడు మరింత విస్తృత స్థాయిలో జరుగుతోంది. “మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి” అని యేసు తన శిష్యులకు ఆజ్ఞాపించాడు. (మత్త. 28:19) అవును, వాళ్లు తమ పనిని నిర్వర్తించారు, నిజానికి మనం కూడా నిర్వర్తిస్తున్నాం. సుమారు 78 లక్షలమంది యెహోవాసాక్షులు 230 కన్నా ఎక్కువ దేశాల్లో దేవుని రాజ్యం గురించి ఉత్సాహంగా ప్రకటిస్తున్నారు, లక్షలమందితో బైబిలు అధ్యయనాల్ని క్రమంగా నిర్వహిస్తున్నారు. మనం అంత్యదినాల్లో ఉన్నామనడానికి ఈ ప్రకటనా పనే ఓ రుజువు.
నేడు యెహోవాపై నమ్మకం ఉంచండి
17. పౌలు, పేతురు ఏ ఉపదేశం ఇచ్చారు?
17 తొలి క్రైస్తవులు విశ్వాసంలో స్థిరంగా నిలబడేందుకు జ్ఞాపికలు సహాయం చేశాయని స్పష్టమౌతోంది. రోములో ఖైదీగా ఉన్న అపొస్తలుడైన పౌలు, “నీవు నావలన వినిన హితవాక్యప్రమాణమును గైకొనుము” అని తిమోతికి చెప్పినప్పుడు, తిమోతి ఎంత ప్రోత్సాహాన్ని పొందివుంటాడో ఊహించండి. (2 తిమో. 1:13) ఓర్పు, సహోదర ప్రేమ, ఆశానిగ్రహం వంటి లక్షణాలు అలవర్చుకోమని తన తోటి విశ్వాసుల్ని ప్రోత్సహించిన తర్వాత అపొస్తలుడైన పేతురు ఇలా అన్నాడు: “మీరు ఈ సంగతులను తెలిసికొని మీరంగీకరించిన సత్యమందు స్థిరపరచబడియున్నను, వీటినిగూర్చి ఎల్లప్పుడును మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను.”—2 పేతు. 1:5-8, 12.
18. తొలి క్రైస్తవులు తమకు అందిన జ్ఞాపికల్ని ఎలా పరిగణించారు?
18 నిశ్చయంగా పౌలు, పేతురు రాసిన పత్రికలు “పరిశుద్ధ ప్రవక్తలచేత పూర్వమందు పలుకబడిన మాటలను” తెలియజేశాయి. (2 పేతు. 3:2) అలాంటి నిర్దేశాన్ని అందుకున్నందుకు మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు కోపగించుకున్నారా? లేదు, ఎందుకంటే దేవునికి వాళ్ల మీద ఉన్న ప్రేమకు అది రుజువు. అంతేకాక, అది “మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి” పొందేలా వాళ్లకు తోడ్పడింది.—2 పేతు. 3:18.
19, 20. మనం యెహోవా జ్ఞాపికల మీద ఎందుకు నమ్మకం ఉంచాలి? అలా చేస్తే మనమెలా ప్రయోజనం పొందుతాం?
19 ఖచ్చితంగా నెరవేరే దేవునివాక్యంలో ఉన్న జ్ఞాపికల మీద నమ్మకం ఉంచడానికి నేడు మనకు ఎన్నో కారణాలు ఉన్నాయి. (యెహోషువ 23:14 చదవండి.) గడిచిన వేల సంవత్సరాల్లో అపరిపూర్ణ మానవులతో యెహోవా ఎలా వ్యవహరించాడో బైబిలు చెబుతోంది. ఆ చరిత్ర అంతా మన ప్రయోజనం కోసమే బైబిల్లో నమోదైంది. (రోమా. 15:4; 1 కొరిం. 10:11) బైబిలు ప్రవచనాలు నెరవేరడాన్ని మనం చూశాం. ప్రవచనాలు ఓ విధంగా దేవుడు మనకు ముందుగానే ఇచ్చిన జ్ఞాపికలు. ఉదాహరణకు, “అంత్యదినములలో” జరుగుతుందని దేవుడు ప్రవచించినట్లుగానే, లక్షలమంది ప్రజలు యెహోవా సత్యారాధన కోసం తండోపతండాలుగా తరలివచ్చారు. (యెష. 2:2, 3) దిగజారుతున్న లోక పరిస్థితులు కూడా బైబిలు ప్రవచన నెరవేర్పే. అంతేకాక, పైన చెప్పుకున్నట్లు ప్రపంచవ్యాప్తంగా విస్తృత స్థాయిలో కొనసాగుతున్న ప్రకటనా పని కూడా యేసు మాటల నెరవేర్పే.—మత్త. 24:14.
20 మనం తనను నమ్మవచ్చని మన సృష్టికర్త ఇప్పటికే లెక్కలేనన్ని సార్లు నిరూపించుకున్నాడు. దాన్నుండి మనం ప్రయోజనం పొందుతున్నామా? ఆయనిచ్చే జ్ఞాపికల మీద మనం నమ్మకం ఉంచాలి. రోస్సెలిన్ అనే సహోదరి అదే చేసింది. ఆమె ఇలా అంటోంది: “నేను యెహోవా మీద పూర్తి నమ్మకం ఉంచడం మొదలుపెట్టినప్పుడు, ఆయన ప్రేమగల హస్తం నన్ను ఎలా కాపాడుతుందో, బలపర్చుతుందో మరింత స్పష్టంగా చూడడం ప్రారంభించాను.” ఆమెలాగే మనం కూడా యెహోవా జ్ఞాపికలను పాటిస్తూ, ప్రయోజనం పొందుతూ ఉందాం.