కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా జ్ఞాపికలతో హృదయానందం పొందండి

యెహోవా జ్ఞాపికలతో హృదయానందం పొందండి

“నీ శాసనములు నాకు నిత్యస్వాస్థ్యమని భావించుచున్నాను.”—కీర్త. 119:111.

1. (ఎ) జ్ఞాపికలకు ప్రజలు ఎలా స్పందిస్తారు, ఎందుకు? (బి) అహం వల్ల ఒక వ్యక్తి సలహాలకు ఎలా స్పందించవచ్చు?

 నిర్దేశాలకు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తారు. సాధారణంగా ప్రజలు మంచి హోదాలో ఉన్న వ్యక్తి ఇచ్చే జ్ఞాపికల్ని వినయంగా స్వీకరిస్తారు, కానీ తమ తోటివాళ్లో, తమకంటే తక్కువ స్థాయిలోని వాళ్లో సలహాలు ఇస్తే వెంటనే కొట్టిపారేస్తారు. క్రమశిక్షణకు, మందలింపుకు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తారు. కొందరు దిగులుపడతారు, బాధపడతారు లేదా అవమానానికి గురైనట్లు భావిస్తారు. మరికొందరైతే, ఏదో సాధించాలనే ప్రేరణ పొంది, దానికి కావాల్సిన నమ్మకాన్ని కూడగట్టుకొని కార్యాచరణకు కదంతొక్కుతారు. ఇంతకీ ఎందుకు ఆ వ్యత్యాసం? ఒక కారణం ఏమిటంటే, అహం అడ్డురావడం. నిజానికి, అహంకార స్వభావం వల్ల ఒక వ్యక్తి వివేచన మందగిస్తుంది. దానివల్ల అతను సలహాల్ని కొట్టిపారేస్తాడు, విలువైన ఉపదేశాన్ని చేజార్చుకుంటాడు.—సామె. 16:18.

2. దేవుని వాక్యం నుండి ఇచ్చే సలహాల్ని నిజక్రైస్తవులు ఎందుకు అమూల్యంగా పరిగణిస్తారు?

2 నిజ క్రైస్తవులు మాత్రం ఉపయోగపడే సలహాల్ని విలువైనవిగా ఎంచుతారు, ముఖ్యంగా దేవుని వాక్యం నుండి ఎవరైనా ఇస్తే వాటిని అమూల్యంగా పరిగణిస్తారు. యెహోవా జ్ఞాపికలు మనకు విలువైన అవగాహన ఇస్తూ, మనకు బోధిస్తూ వస్తుసంపదల మోజు, అనైతికత, మాదకద్రవ్యాలు తీసుకోవడం, మితిమీరి తాగడం వంటి ఉరుల్ని తప్పించుకోవడానికి సహాయం చేస్తాయి. (సామె. 20:1; 2 కొరిం. 7:1; 1 థెస్స. 4:3-5; 1 తిమో. 6:6-11) అంతేకాక, యెహోవా ఇచ్చే జ్ఞాపికలకు లోబడడం వల్ల మనం ‘హృదయానందాన్ని’ పొందుతున్నాం.—యెష. 65:14.

3. కీర్తనకర్తలా మనం ఎలాంటి వైఖరిని చూపిస్తే బాగుంటుంది?

3 మన పరలోక తండ్రితో ఉన్న అమూల్యమైన సంబంధాన్ని కాపాడుకోవాలంటే, యెహోవా ఇస్తున్న జ్ఞానయుక్తమైన ఉపదేశాల్ని పాటిస్తూ ఉండాలి. “నీ శాసనములు నాకు హృదయానందకరములు అవి నాకు నిత్యస్వాస్థ్యమని భావించుచున్నాను” అని రాసిన కీర్తనకర్త వైఖరినే మనం కూడా చూపిస్తే ఎంత బాగుంటుందో కదా! (కీర్త. 119:111) కీర్తనకర్తలాగే మనం కూడా యెహోవా శాసనాలను బట్టి ఆనందిస్తామా? లేక అవి భారమైనవని కొన్నిసార్లు అనుకుంటామా? అప్పుడప్పుడు కొన్ని సలహాల్ని బట్టి మనం చిరాకుపడినా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. దేవునికున్న అత్యున్నతమైన జ్ఞానం పట్ల మనం అచంచలమైన నమ్మకాన్ని పెంపొందించుకోవచ్చు. అందుకు తోడ్పడే మూడు విధానాల్ని ఇప్పుడు పరిశీలిద్దాం.

ప్రార్థనతో నమ్మకాన్ని పెంపొందించుకోండి

4. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా దావీదుకున్న ఏ లక్షణం చెక్కుచెదర్లేదు?

4 జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా రాజైన దావీదుకు సృష్టికర్త మీద ఉన్న నమ్మకం చెక్కుచెదర్లేదు. ఆయన ఇలా అన్నాడు: “యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తికొనుచున్నాను. నా దేవా, నీయందు నమ్మిక యుంచియున్నాను.” (కీర్త. 25:1, 2) తన పరలోక తండ్రిపై అంతటి నమ్మకాన్ని దావీదు ఎలా పెంపొందించుకోగలిగాడు?

5, 6. దావీదుకు యెహోవాతో ఉన్న సంబంధం గురించి బైబిలు ఏమి చెబుతోంది?

5 చాలామంది కష్టాలొచ్చినప్పుడు మాత్రమే దేవునికి ప్రార్థిస్తారు. ఒకసారి ఆలోచించండి, డబ్బో మరేదో అవసరమున్నప్పుడు మాత్రమే మీ స్నేహితుడు లేదా బంధువు మీ దగ్గరికొస్తే మీరు ఏమనుకుంటారు? అతని ధోరణి ఏం బాగోలేదని కొంతకాలానికి మీకు అనిపించవచ్చు. అయితే, దావీదు ఆ స్నేహితునిలాంటి వాడు కాదు. తన జీవితాంతం అంటే మంచికాలాల్లో కష్టకాలాల్లో యెహోవా పట్ల దావీదు చూపించిన విశ్వాసాన్ని, ప్రేమను గమనిస్తే యెహోవాతో ఆయనకు ఎంత సన్నిహిత సంబంధం ఉందో తెలుస్తుంది.—కీర్త. 40:8.

6 దావీదు తనకున్న కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ యెహోవాను ఇలా స్తుతించాడు: “యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా, భూమియందంతట నీ నామము ఎంత ప్రభావము గలది.” (కీర్త. 8:1) దావీదుకు తన పరలోక తండ్రితో ఉన్న సన్నిహిత సంబంధం ఆ మాటల్లో ధ్వనించట్లేదా? యెహోవా మహిమాప్రభావాల పట్ల ఉన్న మెప్పుదలతో దావీదు ‘దినమెల్లా’ యెహోవాను ఘనపర్చాడు.—కీర్త. 35:28.

7. ప్రార్థనలో దేవునికి దగ్గరవ్వడం వల్ల మనమెలా ప్రయోజనం పొందుతాం?

7 యెహోవాపై నమ్మకాన్ని పెంపొందించుకోవాలంటే మనం కూడా దావీదులాగే యెహోవాతో క్రమంగా మాట్లాడాలి. బైబిలు ఇలా చెబుతోంది: “దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును.” (యాకో. 4:8) పరిశుద్ధాత్మను పొందాలన్నా మనం ప్రార్థనలో యెహోవాకు దగ్గరవ్వడం చాలా ప్రాముఖ్యం.—1 యోహాను 3:22 చదవండి.

8. ఒకేరకమైన ప్రార్థనలు చేయకుండా ఎందుకు జాగ్రత్తపడాలి?

8 మీరు ప్రార్థించే ప్రతీసారి ఒకే రకమైన వాక్యాల్ని, పదాల్ని మళ్లీమళ్లీ ఉపయోగిస్తారా? మీ పరిస్థితి అదే అయితే, ప్రార్థించే ముందు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో కొన్ని క్షణాలు ఆలోచించండి. ఒక స్నేహితునితో లేదా బంధువుతో మాట్లాడే ప్రతీసారి మనం ఒకేలాంటి పదాల్ని వాడితే అతనికి నచ్చుతుందా? కొంతకాలానికి అతను మనం చెప్పేవి పట్టించుకోకపోవచ్చు. తన యథార్థ సేవకుల ప్రార్థనల్ని యెహోవా ఎన్నడూ తిరస్కరించడన్న మాట వాస్తవమే. అయినా, మనం ఆయనతో సంభాషించే ప్రతీసారి చెప్పిన పదాలనే మళ్లీమళ్లీ చెప్పకుండా జాగ్రత్తపడాలి.

9, 10. (ఎ) మనం వేటి గురించి ప్రార్థించవచ్చు? (బి) మనం ఏం చేస్తే హృదయపూర్వక ప్రార్థనలు చేయగలుగుతాం?

9 దేవునికి దగ్గరవ్వాలంటే మన పైపైన మాత్రమే ప్రార్థిస్తే సరిపోదు. యెహోవా ముందు మన హృదయాన్ని ఎంత ఎక్కువగా కుమ్మరిస్తే అంత ఎక్కువగా ఆయనకు దగ్గరవుతాం, ఆయన మీద నమ్మకం పెంచుకుంటాం. ఇంతకీ వేటిగురించి మనం ప్రార్థించాలి? దేవుని వాక్యం దానికిలా జవాబిస్తోంది: “ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.” (ఫిలి. 4:6) నిజానికి, దేవునితో మనకున్న సంబంధాన్ని, ఆయన సేవకులముగా మన జీవితాల్ని ప్రభావితం చేయగల దేని గురించైనా ప్రార్థించవచ్చు.

10 బైబిల్లో నమోదైన నమ్మకస్థులైన స్త్రీపురుషుల ప్రార్థనలు పరిశీలించడం ప్రయోజనకరంగా ఉంటుంది. (1 సమూ. 1:10, 11; అపొ. 4:24-31) కీర్తనల గ్రంథం, హృదయపూర్వక ప్రార్థనల, యెహోవాకు ఆలపించిన స్తుతిగీతాల సమాహారం. మనుష్యులకు ఉండే దుఃఖం, ఆనందం తదితర భావోద్వేగాలన్నీ ఈ ప్రార్థనల్లో, స్తుతిగీతాల్లో కనిపిస్తాయి. యథార్థమైన దేవుని సేవకులు ఉపయోగించిన అలాంటి మాటలను పరిశీలిస్తే మనం యెహోవాకు అర్థవంతమైన ప్రార్థనలు చేయగలుగుతాం.

దేవుని జ్ఞాపికల్ని ధ్యానించండి

11. దేవుడిచ్చే ఉపదేశాల్ని ఎందుకు ధ్యానించాలి?

11 “యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును” అని దావీదు అన్నాడు. (కీర్త. 19:7) అవును, దేవుని ఆజ్ఞలకు లోబడితే, ‘బుద్ధిహీనులు’ లేదా అనుభవం లేనివాళ్లు కూడా జ్ఞానవంతులు అవుతారు. అయితే, కొన్ని లేఖన ఉపదేశాల నుండి పూర్తి ప్రయోజనం పొందాలంటే వాటిని ధ్యానించడం అవసరం. ముఖ్యంగా స్కూల్లో, ఉద్యోగ స్థలంలో ఒత్తిళ్లు ఎదురైనప్పుడు యథార్థతను నిలబెట్టుకోవడం, రక్తం విషయంలో దేవుని ప్రమాణానికి కట్టుబడి ఉండడం, క్రైస్తవ తటస్థతను కాపాడుకోవడం అలాగే దుస్తులు, కనబడేతీరు వంటి విషయాల్లో బైబిలు సూత్రాలను పాటించాలంటే అలా ధ్యానించడం ప్రాముఖ్యం. అలాంటి విషయాల్లో దేవునికున్న అభిప్రాయమే మనకూ ఉంటే సమస్యల్ని ముందే పసిగట్టగలుగుతాం. అలా, ఫలానా సమస్య నిజంగానే వస్తే ఏంచేయాలో హృదయంలో నిశ్చయించుకోగలుగుతాం. ఆ విధమైన ముందుచూపు, సిద్ధపాటు కలిగి ఉంటే అనవసరమైన వేదనను తప్పించుకోగలుగుతాం.—సామె. 15:28.

12. వేటిని ధ్యానిస్తే మనం యెహోవా జ్ఞాపికల్ని పాటించగలుగుతాం?

12 దేవుడు చేసిన వాగ్దాన నెరవేర్పు కోసం ఎదురు చూస్తుండగా, మనం ఆధ్యాత్మికంగా మెలకువగా ఉన్నామని మన జీవన విధానం ద్వారా చూపిస్తున్నామా? ఉదాహరణకు, మహాబబులోను త్వరలోనే నాశనమౌతుందని మనం నిజంగా నమ్ముతున్నామా? పరదైసు భూమ్మీద నిత్యజీవం వంటి భవిష్యత్తు ఆశీర్వాదాలు నిజమైనవని మనం సత్యం తెలుసుకున్న కొత్తలో ఎంత బలంగా నమ్మామో ఇప్పుడూ అంతే బలంగా నమ్ముతున్నామా? మనం వ్యక్తిగత వ్యవహారాల్లో మునిగిపోకుండా పరిచర్యలో ఇంకా ఉత్సాహంగానే కొనసాగుతున్నామా? పునరుత్థాన నిరీక్షణ, యెహోవా నామం పరిశుద్ధపర్చబడడం, ఆయన సర్వాధిపత్యం నిరూపించబడడం వంటివి మనకు ఇప్పటికీ ప్రాముఖ్యమైనవిగానే ఉన్నాయా? ఈ ప్రశ్నల గురించి ధ్యానిస్తే మనం కీర్తనకర్త చెప్పినట్టు దేవుని ‘శాసనములను నిత్యస్వాస్థ్యంగా’ ఎంచగలుగుతాం.—కీర్త. 119:111.

13. మొదటి శతాబ్దపు క్రైస్తవులు కొన్ని విషయాలను ఎందుకు గ్రహించలేకపోయారు? ఉదాహరణ ఇవ్వండి.

13 బైబిలులో ఉన్న కొన్ని విషయాలు మనకు ఇప్పుడు పూర్తిగా అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే వాటిని స్పష్టం చేయడానికి ఇది సమయం కాదని యెహోవా అనుకొనివుండవచ్చు. తను హింసలు పొంది చనిపోవడం అగత్యమని యేసు తన అపొస్తలులకు చాలాసార్లు చెప్పాడు. (మత్తయి 12:40; 16:21 చదవండి.) కానీ ఆయన చెప్పింది అపొస్తలులకు అర్థంకాలేదు. ఆయన మరణపునరుత్థానాల తర్వాత మానవ శరీరంతో చాలామంది శిష్యులకు కనబడి ‘లేఖనములు గ్రహించునట్లుగా ఆయన వారి మనస్సును తెరచిన’ తర్వాతే అపొస్తలులు ఆయన అంతకుముందు చెప్పినదాన్ని గ్రహించారు. (లూకా 24:44-46; అపొ. 1:3) అలాగే, దేవుని రాజ్యం స్థాపితమయ్యేది పరలోకంలోనే అన్న విషయాన్ని కూడా సా.శ. 33 పెంతెకొస్తు రోజున పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన తర్వాతే క్రీస్తు అనుచరులు గ్రహించారు.—అపొ. 1:6-8.

14. 20వ శతాబ్దం మొదట్లో అంత్యదినాల గురించి తప్పుడు అభిప్రాయాలు ఉన్నా ఎంతోమంది సహోదరులు ఎటువంటి చక్కని ఆదర్శాన్ని ఉంచారు?

14 అదే విధంగా, 20వ శతాబ్దం మొదట్లో నిజక్రైస్తవులకు ‘అంత్యదినాల’ గురించి ఎన్నో తప్పుడు అభిప్రాయాలు ఉండేవి. (2 తిమో. 3:1) ఉదాహరణకు, 1914లో తాము పరలోకానికి వెళ్లడం తథ్యమని కొందరు అనుకున్నారు. వాళ్లు అనుకున్నది వెంటనే జరగకపోవడంతో మరోసారి లేఖనాలను పట్టుదలగా పరిశీలించారు. దాంతో, ముందుగా గొప్ప ప్రకటనాపని జరగాల్సివుందని వాళ్లు అర్థంచేసుకున్నారు. (మార్కు 13:10) కాబట్టి 1922లో, అప్పుడు ప్రకటనాపనికి సారథ్యం వహిస్తున్న జె. ఎఫ్‌. రూథర్‌ఫర్డ్‌ అమెరికాలోని ఒహాయోలో ఉన్న సీడార్‌ పాయింట్‌ వద్ద జరిగిన అంతర్జాతీయ సమావేశానికి హాజరైన ప్రేక్షకులకు తన ప్రసంగంలో ఇలా చెప్పాడు: ‘ఇదిగో, రాజు ఏలుతున్నాడు! మీరు ఆయన బహిరంగ ప్రతినిధులు. కాబట్టి రాజునూ, ఆయన రాజ్యాన్నీ పకటించండి, ప్రకటించండి, ప్రకటించండి.’  అప్పటినుండి “రాజ్య సువార్త” ప్రకటించడం యెహోవా సేవకుల గుర్తింపు చిహ్నంగా మారింది.—మత్త. 4:23; 24:14.

15. దేవుడు తన సేవకులతో వ్యవహరించిన తీరును ధ్యానిస్తే మనమెలా ప్రయోజనం పొందుతాం?

15 యెహోవా గతంలో, నేడు తన ప్రజలతో వ్యవహరించిన తీరు ఎంత అద్భుతంగా ఉందో ధ్యానిస్తే, ఆయన భవిష్యత్తులో తన చిత్తాన్ని, సంకల్పాన్ని నెరవేర్చగలడనే మన నమ్మకం బలపడుతుంది. అదే సమయంలో, యెహోవా జ్ఞాపికల్ని ధ్యానిస్తే భవిష్యత్తులో నెరవేరనున్న ప్రవచనాల్ని మనం అన్నివేళలా గుర్తుపెట్టుకోగలుగుతాం. అలా చేస్తే నిస్సందేహంగా ఆయన వాగ్దానాలపై మన నమ్మకం బలపడుతుంది.

ఆరాధనకు సంబంధించిన వాటిలో పాల్గొంటూ నమ్మకాన్ని పెంపొందించుకోండి

16. పరిచర్యలో చురుగ్గా ఉండడం వల్ల మనకెలాంటి దీవెనలు వస్తాయి?

16 మన దేవుడైన యెహోవా ఎంతో శక్తిగల పనిమంతుడు. “యెహోవా, నీవంటి బలాఢ్యుడెవడు?” అని అడిగాక కీర్తనకర్త ఇలా అన్నాడు: “నీ హస్తము బలమైనది నీ దక్షిణహస్తము ఉన్నతమైనది.” (కీర్త. 89:8, 13) అందుకే, రాజ్య సంబంధమైన పనుల కోసం మనం పడే ప్రయాసాన్ని యెహోవా గుర్తించి ఆశీర్వదిస్తాడు. స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా యెహోవా తన సేవకుల్లో ఎవ్వరినీ ‘పనిచేయకుండా భోజనం’ చేసే సోమరుల్లా ఉండనివ్వడు. (సామె. 31:27) మన సృష్టికర్తను అనుకరిస్తూ మనం ఆయనకు సంబంధించిన పనుల్లో నిమగ్నమౌతాం. పూర్ణహృదయంతో యెహోవాను సేవించడం వల్ల మనం వ్యక్తిగతంగా ఎన్నో దీవెనలు పొందుతాం, యెహోవా కూడా ఎంతో సంతోషంగా మన పరిచర్యను దీవిస్తాడు.—కీర్తన 62:12 చదవండి.

17, 18. యెహోవా నిర్దేశాల్ని పాటించినప్పుడు ఆయనపై మన నమ్మకం ఎలా బలపడుతుంది? ఉదాహరణ ఇవ్వండి.

17 విశ్వాస సంబంధమైన పనులు యెహోవాపై మన నమ్మకాన్ని ఎలా పెంపొందిస్తాయి? ఇశ్రాయేలీయులు వాగ్దానదేశంలోకి ప్రవేశించడం గురించి చెబుతున్న లేఖన వృత్తాంతాన్ని పరిశీలించండి. నిబంధన మందసాన్ని మోస్తున్న యాజకులు యొర్దాను నదిలోకి నేరుగా నడవాలని యెహోవా చెప్పాడు. అయితే ప్రజలు ఆ నది దగ్గరకు వచ్చేసరికి, వర్షాల వల్ల ఆ నదిలోని నీరు ఉరకలెత్తడాన్ని చూశారు. అప్పుడు ఇశ్రాయేలీయులు ఏమి చేశారు? ఆ నది ఒడ్డున గుడారాలు వేసుకొని ఆ నీటి ఉద్ధృతి తగ్గేంత వరకు కొన్ని వారాలపాటు అక్కడే ఉన్నారా? లేదు. యెహోవా మీద పూర్తి నమ్మకముంచి ఆయన నిర్దేశాలను పాటించారు. ఫలితం? ఆ వృత్తాంతం ఇలా చెబుతోంది: ‘యాజకుల కాళ్లు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు . . . ఏకరాశిగా నిలిచెను. యాజకులు యొర్దానుమధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. ఇశ్రాయేలీయులందరు ఆరిన నేలమీద దాటుచు వచ్చిరి.’ (యెహో. 3:12-17) ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నీరు నిలిచిపోవడం చూసినప్పుడు వాళ్ల హృదయాలు ఎంత ఉప్పొంగిపోయి ఉంటాయో ఊహించండి! నిజానికి, యెహోవా నిర్దేశాలపై నమ్మకం ఉంచడం వల్ల ఇశ్రాయేలీయులకు ఆయన మీదున్న విశ్వాసం బలపడింది.

యెహోషువ కాలంలోని యెహోవా ప్రజలు చూపించినలాంటి విశ్వాసాన్ని మీరు చూపిస్తారా? (17, 18 పేరాలు చూడండి)

18 నేడు, యెహోవా తన సేవకుల తరఫున అద్భుతాలు చేయడం లేదు కానీ, విశ్వాసంతో వాళ్లు చేస్తున్న పనులను ఆయన ఇప్పటికీ దీవిస్తూనేవున్నాడు. ప్రపంచవ్యాప్తంగా రాజ్యసువార్త ప్రకటించేలా దేవుని పరిశుద్ధాత్మ వాళ్లను బలపరుస్తోంది. అంతేకాక, యెహోవాకు ప్రప్రథమ సాక్షి అయిన క్రీస్తుయేసు పునరుత్థానం అయ్యాక, “మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి . . . ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నాను” అని చెబుతూ, ఆ పనిలో శిష్యులకు తోడుగా ఉంటానని హామీ ఇచ్చాడు. (మత్త. 28:19, 20) ఒకప్పుడు సిగ్గు, బిడియం గల తాము దేవుని పరిశుద్ధాత్మ సహాయంతో ఇప్పుడు పరిచర్యలో కొత్తవాళ్లతో ధైర్యంగా మాట్లాడగలుగుతున్నామని చాలామంది సాక్షులు అంటారు.—కీర్తన 119:46; 2 కొరింథీయులు 4:7 చదవండి.

19. పరిమితులున్నా మనం ఏ నమ్మకంతో ఉండవచ్చు?

19 అనారోగ్యం, వృద్ధాప్యం కారణంగా కొంతమంది సహోదరసహోదరీలకు శారీరక పరిమితులున్నాయి. అయినా, “కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు” ప్రతీ నిజక్రైస్తవుని పరిస్థితిని అర్థం చేసుకుంటాడనే నమ్మకంతో వాళ్లు ఉండవచ్చు. (2 కొరిం. 1:3) రాజ్యసంబంధ పనుల కోసం మనం చేసే ప్రయత్నాలన్నిటినీ యెహోవా గుర్తుంచుకుంటాడు. మన పరిస్థితులు అనుమతించిన మేరకు మనం చేయగలిగినదంతా చేస్తూ, క్రీస్తు విమోచన క్రయధన బలిపై మనకున్న విశ్వాసం మీదే మన రక్షణ ఆధారపడి ఉందని మనం గుర్తుంచుకోవాలి.—హెబ్రీ. 10:39.

20, 21. యెహోవాపై మన నమ్మకాన్ని చూపించే కొన్ని మార్గాలు ఏమిటి?

20 సాధ్యమైనంత మేరకు మనం ఆరాధనలో మన సమయాన్ని, శక్తిని, వనరుల్ని పూర్తిగా ఉపయోగించాలి. అవును, మనం పూర్ణ హృదయంతో ‘సువార్తికుని పనిచేయాలి.’ (2 తిమో. 4:5) ఆ పనివల్ల ఇతరులు “సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానాన్ని” పొందుతారు కాబట్టి మనమా పనిని సంతోషంగా చేస్తాం. (1 తిమో. 2:4) యెహోవాను ఘనపర్చడం, స్తుతించడం మనల్ని ఆధ్యాత్మికంగా ఐశ్వర్యవంతుల్ని చేస్తుంది. (సామె. 10:22) అంతేకాక, దానివల్ల మన సృష్టికర్త మీద సడలని నమ్మకం ఏర్పడుతుంది.—రోమా. 8:35-39.

21 మనం చర్చించినట్లుగా, సరైన నిర్దేశాల కోసం యెహోవాపై ఆధారపడడం దానంతటదే రాదు కానీ, మనమే దాన్ని అలవర్చుకోవడానికి కృషిచేయాలి. కాబట్టి, ఏదేమైనా ప్రార్థన చేస్తూ యెహోవాపై ఆధారపడండి. గతంలో యెహోవా తన చిత్తాన్ని ఎలా నెరవేర్చాడో, భవిష్యత్తులో ఎలా నెరవేరుస్తాడో ధ్యానించండి. ఆరాధనకు సంబంధించిన వాటిలో పాల్గొంటూ, యెహోవాపై నమ్మకాన్ని పెంపొందించుకుంటూ ఉండండి. అవును, యెహోవా జ్ఞాపికలు శాశ్వతకాలం ఉంటాయి. వాటిని పాటిస్తే మీరూ శాశ్వతకాలం ఉంటారు!