కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు రూపాంతరం పొందారా?

మీరు రూపాంతరం పొందారా?

“మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.”—రోమా. 12:2.

1, 2. మనం పెరిగిన తీరు, మన చుట్టూవున్న పరిస్థితులు మనపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి?

 మనం పెరిగిన తీరు, మన చుట్టూవున్న పరిస్థితులు మనందరిపై ఎంతో ప్రభావం చూపిస్తాయి. మనం దుస్తులు వేసుకునే తీరు, మన ఆహారపు అలవాట్లు, మన ప్రవర్తన అలా అన్నీ ఓ నిర్దిష్టమైన విధంగా ఉండవచ్చు. ఎందుకు? ఓ విధంగా, చుట్టూవున్న ప్రజలు, మన పరిస్థితులే దానికి కారణం.

2 అయితే, మన ఆహారపు అలవాట్లు, దుస్తులు వేసుకునే తీరు వంటివాటి కన్నా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఉదాహరణకు మనం పెరిగిన తీరును బట్టి, కొన్ని విషయాలు సరైనవేనని, వాటిలో తప్పేమీ లేదనుకుంటాం; కొన్నేమో తప్పని, వాటిని చేయకూడదని అనుకుంటాం. అలాంటి చాలా విషయాలు వ్యక్తిగతమైనవి, వ్యక్తులను బట్టి అవి మారుతుంటాయి. కొన్నిసార్లు మనస్సాక్షి ఆధారంగా కూడా నిర్ణయాలు తీసుకుంటాం. “ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను” తరచుగా చేస్తారని బైబిలు చెబుతోంది. (రోమా. 2:14) అయితే, ఫలాని విషయంలో దేవుని నియమం ఏమీ లేదనే కారణంతో మనం చిన్నప్పటినుండి పాటించిన దాన్ని, మన ప్రాంతంలోని ప్రజలు పాటించే దాన్ని గుడ్డిగా అనుసరించవచ్చా?

3. క్రైస్తవులమైన మనం ప్రజలు సామాన్యంగా పాటించే పద్ధతుల్ని, ప్రమాణాల్ని అనుసరించకపోవడానికి ఏ రెండు కారణాలు ఉన్నాయి?

3 క్రైస్తవులముగా మనం అలా అనుసరించకపోవడానికి కనీసం రెండు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. మొదటిగా, “ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును అయినను తుదకు అది మరణమునకు చేరును” అని బైబిలు గుర్తుచేస్తోంది. (సామె. 16:25) మనం అపరిపూర్ణులం కాబట్టి, వేసే ప్రతీ అడుగును చక్కగా నిర్దేశించుకునే సామర్థ్యం మనకు లేదు. (సామె. 28:26; యిర్మీ. 10:23) రెండవదిగా, సాతాను “ఈ యుగ సంబంధమైన దేవత” అని బైబిలు చెబుతోంది, అతనే ఈ లోక పోకడల్ని, ప్రమాణాల్ని నియంత్రిస్తున్నాడు. (2 కొరిం. 4:4; 1 యోహా. 5:19) కాబట్టి, యెహోవా ఆమోదం, ఆశీర్వాదం పొందాలంటే రోమీయులు 12:2 వచనంలోని ఉపదేశాన్ని మనం పాటించాలి.—చదవండి.

4. ఈ ఆర్టికల్‌లో మనమేమి పరిశీలిస్తాం?

4 రోమీయులు 12:2లో, మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. (1) మనం ఎందుకు “రూపాంతరము” పొందాలి? (2) మనం ఏయే విషయాల్లో రూపాంతరం పొందాలి? (3) మనం ఎలా రూపాంతరం పొందవచ్చు? ఇప్పుడు ఈ ప్రశ్నలను పరిశీలిద్దాం.

ఎందుకు “రూపాంతరము” పొందాలి?

5. రోమీయులు 12:2లోని మాటల్ని పౌలు ప్రత్యేకంగా ఎవరిని ఉద్దేశించి రాశాడు?

5 అపొస్తలుడైన పౌలు అవిశ్వాసులనో, సాధారణ ప్రజానీకాన్నో ఉద్దేశించి కాదుగానీ తన తోటి అభిషిక్త క్రైస్తవులను ఉద్దేశించే రోమీయులకు పత్రిక రాశాడు. (రోమా. 1:1-7) ‘ఈ లోక మర్యాదను అనుసరించవద్దని,’ రూపాంతరం పొందమని పౌలు వాళ్లను ప్రోత్సహించాడు. దాదాపు సా.శ. 56 నాటికి రోమా సామ్రాజ్యానికి ప్రతీకగా ఉన్న ప్రమాణాలు, పద్ధతులు, మర్యాదలు, పోకడలను ఉద్దేశించే “ఈ లోక మర్యాద” అనే మాటను పౌలు ఉపయోగించాడు. “అనుసరింపక” అని పౌలు వాడిన పదాన్ని బట్టి చూస్తే అప్పటికింకా వాళ్లలో కొంతమంది లోక మర్యాదలను అనుసరిస్తున్నారని తెలుస్తోంది. అయితే, అక్కడున్న సహోదరసహోదరీలపై అది ఏయే రకాలుగా ప్రభావం చూపించింది?

6, 7. పౌలు రోజుల్లో రోములోని సామాజిక, మతపరమైన పరిస్థితులు క్రైస్తవులకు ఎలా ఓ సవాలుగా నిలిచాయి?

6 నేడు, రోమును సందర్శించే పర్యాటకులకు సాధారణంగా అక్కడి దేవాలయపు శిథిలాలు, సమాధులు, స్మారక చిహ్నాలు, క్రీడా ప్రాంగణాలు, రంగస్థలాలు మొదలైనవి కనిపిస్తాయి. అందులో కొన్ని, మొదటి శతాబ్దం నాటివి. అవి మనకు ప్రాచీన రోములోని సామాజిక, మతపరమైన విషయాలకు సంబంధించి లోతైన అవగాహనను ఇస్తాయి. అంతేకాక, చరిత్ర పుస్తకాలు చూపిస్తున్నట్లుగా రోములో హింసాత్మకమైన క్రీడలు, గుర్రపు రథాల పోటీలు, కొన్నిసార్లు అనైతికమైన నాటికలూ సంగీత కచేరీలూ జరిగేవి. రోము గొప్ప వాణిజ్య కేంద్రం కూడా. అందుకే, అక్కడ డబ్బు సంపాదించుకోవడానికి చాలా అవకాశాలు ఉండేవి.—రోమా. 6:21; 1 పేతు. 4:3, 4.

7 ఎన్నో దేవాలయాలు ఉన్నా, ఎందరో దేవతలను పూజించినా రోములోని ప్రజలు తమ ఆరాధ్యదైవాలతో నిజమైన, వ్యక్తిగత సంబంధాన్ని పెంపొందించుకోలేదు. వాళ్ల దృష్టిలో మతం అంటే కేవలం జన్మదినాలు, పెళ్లి వేడుకలు, అంత్యక్రియలు వంటి వాటికి సంబంధించిన ఆచారాలే. అవన్నీ వాళ్ల సామాజిక జీవనంలో భాగంగా ఉండేవి. రోములోని క్రైస్తవులకు అవన్నీ ఎంత పెద్ద సవాలుగా నిలిచాయో మనం ఊహించుకోవచ్చు. చాలామంది ఆ నేపథ్యం నుండి వచ్చిన వాళ్లే కాబట్టి, నిజ క్రైస్తవులు అవ్వడానికి వాళ్లు రూపాంతరం పొందాల్సివచ్చింది. అయితే, అలా రూపాంతరం పొందడం వాళ్ల బాప్తిస్మంతో ఆగిపోదు.

8. నేటి ప్రపంచం క్రైస్తవులకు ఎలా ఒక ముప్పుగా మారింది?

8 రోమా సామ్రాజ్యంలాగే, నేటి ప్రపంచం కూడా సమర్పిత క్రైస్తవులకు ఓ ముప్పుగా మారింది. అలాగని ఎందుకు చెప్పవచ్చు? ఎందుకంటే, లౌకికాత్మ అంతటా వ్యాపించివుంది. (ఎఫెసీయులు 2:2, 3; 1 యోహాను 2:16 చదవండి.) ఈ లోకపు కోరికలు, ఆలోచనలు, విలువలు, నైతిక ప్రమాణాలు మనకు అనుక్షణం ఎదురౌతున్నాయి కాబట్టి మనం కూడా ఈ లోకంలో భాగంగా మారే ప్రమాదం ఉంది. అందుకే, “ఈ లోక మర్యాదను అనుసరింపక . . . రూపాంతరము పొందుడి” అనే ప్రేరేపిత ఉపదేశాన్ని లక్ష్యపెట్టడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అలా రూపాంతరం పొందాలంటే మనమేమి చేయాలి?

ఏయే విషయాల్లో రూపాంతరం పొందాలి?

9. బాప్తిస్మానికి అర్హత సాధించడానికి ముందు చాలామంది ఎలాంటి మార్పులు చేసుకున్నారు?

9 ఒక వ్యక్తి బైబిలు సత్యాలను నేర్చుకుంటూ, వాటిని పాటిస్తుండగా ఆయన యెహోవాకు మరింత దగ్గరవ్వడం మొదలుపెడతాడు. ఆయన అబద్ధమత ఆచారాలను, తనకున్న చెడ్డ అలవాట్లను విడిచిపెట్టి, క్రీస్తులాంటి వ్యక్తిత్వాన్ని అలవర్చుకుంటాడు. (ఎఫె. 4:22-24) ప్రతీ సంవత్సరం లక్షలమంది అలా మార్పులు చేసుకుంటూ, యెహోవా దేవునికి సమర్పించుకొని బాప్తిస్మం తీసుకోవడం చూస్తుంటే మనకెంతో సంతోషం కలుగుతుంది. ఇది తప్పకుండా యెహోవా హృదయాన్ని కూడా సంతోషపరుస్తుంది. (సామె. 27:11) అయితే, ఈ మార్పులు మాత్రమే సరిపోతాయా?

చాలామంది సాతాను లోకం నుండి బయటికొచ్చి రూపాంతరం పొందాల్సిన అవసరం ఉంది (9వ పేరా చూడండి)

10. మెరుగవ్వడానికి, రూపాంతరం పొందడానికి మధ్య ఉన్న తేడా ఏమిటి?

10 నిజానికి రూపాంతరం పొందడం అంటే, ప్రగతి సాధించడం లేదా మెరుగవ్వడం మాత్రమే కాదు. ఉదాహరణకు, ఫలానా వస్తువు “మరింత మెరుగైంది” అంటూ వాణిజ్య ప్రకటనల్లో చూపిస్తుంటారు. నిజానికి, అది పాత వస్తువే అయ్యిండవచ్చు లేదా పాతదానికే ఒకటో అరో మార్పులు చేసివుండవచ్చు లేదా దాని ప్యాకింగ్‌ను ముందుకన్నా ఇంకాస్త ఆకర్షణీయంగా చేసివుండవచ్చు. రోమీయులు 12:2లో “రూపాంతరము పొందుడి” అనే మాట పరిశుద్ధాత్మ శక్తి సహాయంతో మన ఆలోచనా విధానాన్ని కొత్తదిగా చేసుకోవడం లేదా పూర్తిగా మార్చుకోవడం అనే అర్థాన్నిస్తుందని ఒక బైబిలు నిఘంటువు చెబుతుంది. కాబట్టి రూపాంతరం పొందడం అంటే, కేవలం హానికరమైన అలవాట్లను, చెడ్డ మాటలను, అనైతిక ప్రవర్తనను మానుకోవడం మాత్రమే కాదు. బైబిలు జ్ఞానంలేని వాళ్లలో కూడా కొందరు సహజంగానే అలాంటి వాటికి దూరంగా ఉండడానికి కొద్దోగొప్పో ప్రయత్నిస్తుంటారు. మరైతే, క్రైస్తవులముగా మనం రూపాంతరం పొందాలంటే ఇంకా ఏమి చేయాలి?

11. ఏ విధంగా రూపాంతరం పొందాలని పౌలు చెప్పాడు?

11 “మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి” అని పౌలు రాశాడు. “మనస్సు” మన ఆలోచన సామర్థ్యానికి సంబంధించినది. అయితే బైబిల్లో ఆ పదం, మన దృక్పథాన్ని, వైఖరిని, తర్కించే సామర్థ్యాన్ని కూడా సూచించవచ్చు. రోమీయులకు రాసిన పత్రికలో అంతకుముందు పౌలు, “భ్రష్ట మనస్సు” కలిగివున్న ప్రజల గురించి రాశాడు. వాళ్లు, “దుర్నీతిచేతను, దుష్టత్వముచేతను, లోభము చేతను, ఈర్ష్యచేతను నిండుకొని, మత్సరము నరహత్య కలహము కపటము” వంటివాటితో పాటు ఇతర హానికరమైన లక్షణాలను చూపించారు. (రోమా. 1:28-31) కాబట్టి, అలాంటి వాతావరణంలో పెరిగి ఆ తర్వాత దేవుని సేవకులైనవాళ్లను, “మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి” అని పౌలు ఎందుకు ప్రోత్సహించాడో మనం అర్థంచేసుకోవచ్చు.

“సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ . . . మీరు విసర్జించుడి.”—ఎఫె. 4:31

12. నేడు ప్రజల ఆలోచన విధానం ఎలా ఉంది? అది క్రైస్తవులకు ఎలా ఓ ముప్పుగా పరిణమించవచ్చు?

12 విచారకరంగా, నేడు మన చుట్టూ ఉన్న ప్రజల్లో పౌలు వర్ణించినలాంటి చెడ్డ లక్షణాలే ఉన్నాయి. ప్రమాణాల ప్రకారం, సూత్రాల ప్రకారం జీవించడం పాతకాలపు విషయమని అలాంటి జీవితం భరించలేమని వాళ్లు అనుకుంటారు. పిల్లలు ఏమి చేసినా చాలామంది టీచర్లు, తల్లిదండ్రులు పట్టించుకోరు. పైగా, తప్పొప్పులను నిర్ణయించుకునే స్వేచ్ఛ ప్రతీ ఒక్కరికీ ఉందని కూడా వాళ్లకు నేర్పిస్తారు. ఏది సరైనది, ఏది కాదో తెలుసుకోవడం నిజంగా సాధ్యంకాదని అలాంటి వాళ్లు నమ్ముతుంటారు. ఆఖరికి, దేవుణ్ణి నమ్ముతున్నామని చెప్పే ప్రజలు కూడా దేవునికి, ఆయన ఆజ్ఞలకు ఏమాత్రం లోబడకుండా, తమ దృష్టికి సరైనదాన్ని చేయవచ్చని భావిస్తారు. (కీర్త. 14:1) ఇలాంటి వైఖరి క్రైస్తవులకు ముప్పుగా పరిణమించవచ్చు. జాగ్రత్తగా లేకపోతే ఓ క్రైస్తవుడు దైవిక ఏర్పాట్ల పట్ల అలాంటి వైఖరినే కనబర్చే ప్రమాదం ఉంది. అలాంటి వాళ్లు సంఘంలోని ఏర్పాట్లకు సహకరించరు, తమకు నచ్చని వాటి గురించి ఫిర్యాదు కూడా చేస్తుంటారు. లేదా వినోదం, ఇంటర్నెట్‌, ఉన్నత విద్య వంటి విషయాల్లో బైబిలు ఆధారిత సలహాలను పూర్తిగా పాటించడానికి ఇష్టపడరు.

13. మనల్ని మనం ఎందుకు నిజాయితీగా పరిశీలించుకోవాలి?

13 కాబట్టి, ఈ లోకం మనల్ని మలచకుండా ఉండాలంటే మన అంతర్గత వైఖరి, భావాలు, లక్ష్యాలు, విలువలు ఎలా ఉన్నాయో నిజాయితీగా పరిశీలించుకోవాలి. బహుశా అవి పైకి కనిపించకపోవచ్చు. మనం అన్నీ బాగానే చేస్తున్నామని ఇతరులు అనవచ్చు. కానీ, బైబిలు నుండి నేర్చుకున్న వాటికి అనుగుణంగా మన అంతరంగ వ్యక్తిత్వం నిజంగా రూపాంతరం చెందిందో లేదో, ఇంకా అలా చెందుతూనే ఉందో మనకు మాత్రమే తెలుసు.—యాకోబు 1:23-25 చదవండి.

ఎలా రూపాంతరం పొందవచ్చు?

14. అవసరమైన మార్పులు చేసుకోవడానికి మనకు ఏది సహాయం చేస్తుంది?

14 రూపాంతరం పొందాలంటే మన అంతరంగాన్ని లేదా లోపలి వ్యక్తిత్వాన్ని మార్చుకోవాలి. అలాంటి అంతర్గత మార్పులు చేసుకోవడానికి మనకేది సహాయం చేస్తుంది? బైబిలును చదివినప్పుడు, మనం ఎలా ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడో నేర్చుకుంటాం. బైబిలు ఉపదేశానికి మనం స్పందించే తీరు, మన హృదయంలో నిజంగా ఏముందో తెలియజేస్తుంది. అప్పుడు, ‘సంపూర్ణమైన దేవుని చిత్తానికి’ అనుగుణంగా మనం ఎలాంటి మార్పులు చేసుకోవాలో తెలుసుకోగలుగుతాం.—రోమా. 12:2; హెబ్రీ. 4:12.

15. యెహోవా మనల్ని మలచినప్పుడు మనమెలాంటి రూపాంతరం పొందుతాం?

15 యెషయా 64:8 చదవండి. యెషయా ప్రవక్త ఉపయోగించిన పదచిత్రం నుండి మనం ఓ ప్రాముఖ్యమైన పాఠం నేర్చుకోవచ్చు. మన కుమ్మరియైన యెహోవా జిగటమన్నులాంటి మనల్ని ఎలా మలుస్తాడు? ఒకటి మాత్రం ఖచ్చితం, మనం అందంగా, ఆకర్షణీయంగా కనిపించేలా ఆయన మన పైరూపాన్ని మార్చడు. ఎందుకంటే, యెహోవా మనకు ఇచ్చేది ఆధ్యాత్మిక శిక్షణ, భౌతిక శిక్షణ కాదు. మనల్ని మలిచేందుకు యెహోవా ఇచ్చే క్రమశిక్షణను స్వీకరిస్తే, మనం అంతర్గతంగా లేదా ఆధ్యాత్మికంగా రూపాంతరం చెందుతాం. ఈ లోకపు ప్రభావాలతో మనం పోరాడాలంటే మనకు కావాల్సింది సరిగ్గా అదే. ఇంతకీ యెహోవా మనల్ని ఎలా మలుస్తాడు?

16, 17. (ఎ) నాణ్యమైన పాత్రలు చేయడానికి ఉపయోగించే జిగటమట్టిని ఓ కుమ్మరి ఏమేమి చేస్తాడో వివరించండి. (బి) మనం యెహోవా దృష్టిలో విలువైన వ్యక్తులుగా ఉండేలా రూపాంతరం పొందడానికి ఆయన వాక్యం మనకెలా సహాయం చేస్తుంది?

16 నాణ్యమైన పాత్రలు చేయడానికి కుమ్మరి చాలా శ్రేష్ఠమైన జిగటమట్టిని ఉపయోగిస్తాడు. అయితే, ఆయన రెండు పనులు చేయాల్సి ఉంటుంది. ముందుగా ఆ మట్టిని నీళ్లతో కడిగి దానిలోని మలినాలన్నిటినీ తీసేయాలి. ఆ తర్వాత, తగిన మోతాదులో నీళ్లు పోసి దాన్ని బాగా పిసకాలి. అలా చేస్తేనే, ఆ పాత్ర సరైన ఆకారంలో ఉండగలుగుతుంది.

17 బలహీనమైన పాత్రలతో సహా ఏ పాత్రను చేయడానికైనా ముందు ఆ జిగటమట్టిలోని మలినాలు తీసేయడానికి, తగిన మెత్తదనాన్ని చేకూర్చడానికి వాడేది నీళ్లేనని గమనించండి. దేవుని వాక్యం కూడా మన జీవితంలో ఆ నీళ్లలాంటి పాత్రే పోషిస్తుందని గమనించారా? దేవుణ్ణి తెలుసుకోకముందు మనకున్న పాత ఆలోచనా తీరును వదిలిపెట్టి, దేవుని దృష్టిలో విలువైన వ్యక్తులుగా రూపాంతరం పొందడానికి దేవుని వాక్యం సహాయం చేస్తుంది. (ఎఫె. 5:25, 26) ప్రతీరోజు బైబిలు చదవమని, దేవుని వాక్యాన్ని చర్చించే కూటాలకు క్రమంగా రమ్మని మనకు ఎన్నిసార్లు ప్రోత్సాహం అందిందో ఒకసారి ఆలోచించండి. ఇంతకీ అవన్నీ చేయమనే ప్రోత్సాహం మనకు ఎందుకు అందుతోంది? ఎందుకంటే అవన్నీ చేయడం ద్వారా, యెహోవా మనల్ని మలుస్తున్నప్పుడు మనం సరిగ్గా స్పందిస్తున్నామని చూపిస్తాం.—కీర్త. 1:2; అపొ. 17:11; హెబ్రీ. 10:24, 25.

రూపాంతరం పొందడం వల్ల మీరు సమస్యలతో గతంలో కన్నా మెరుగ్గా వ్యవహరించగలుగుతారు (18వ పేరా చూడండి)

18. (ఎ) దేవుని వాక్యం మనపై ప్రభావం చూపించి, మనం రూపాంతరం పొందేలా చేయాలంటే ధ్యానించడం ఎందుకు ప్రాముఖ్యం? (బి) ఏ ప్రశ్నల గురించి ఆలోచిస్తే బాగుంటుంది?

18 దేవుని వాక్యం వల్ల రూపాంతరం పొందాలంటే, మనం క్రమంగా బైబిలు చదవడం, అందులోని విషయాలు నేర్చుకోవడం తొలి మెట్టు మాత్రమే. చాలామంది ప్రజలు అప్పుడప్పుడూ బైబిలు చదివి దానిలోని విషయాలతో సుపరిచితులయ్యారు. బహుశా, మీరు పరిచర్యలో అలాంటి ప్రజల్ని కలిసే ఉంటారు. కొందరైతే బైబిల్లోని ఆయా వృత్తాంతాలను కంఠతా చెప్పగలుగుతారు. a అయితే, దానివల్ల వాళ్ల ఆలోచనా తీరులో గానీ, జీవన విధానంలో గానీ పెద్దగా మార్పేమీ కనిపించదు. కారణం? దేవుని వాక్యం ఓ వ్యక్తిపై ప్రభావం చూపించి, ఆయన రూపాంతరం పొందేలా చేయాలంటే, అది ఆయన హృదయంలోకి చొచ్చుకెళ్లాలి. కాబట్టి, బైబిలు నుండి మనం నేర్చుకుంటున్న విషయాల గురించి సమయం తీసుకొని ఆలోచించాలి. మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవడం మంచిది: ‘ఇది కేవలం ఓ మతబోధ మాత్రమే కాదని నేను బలంగా నమ్ముతున్నానా? ఇదే సత్యమని నేను అర్థంచేసుకోలేదా? నేను నేర్చుకుంటున్న ఫలాని విషయం కేవలం ఇతరులకు బోధించడానికి మాత్రమే ఉపయోగపడుతుందని అనుకోకుండా, దాన్ని నా జీవితంలో అన్వయించుకోగల రంగాల గురించి ఆలోచిస్తానా? యెహోవా నాతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నట్లు నేను భావిస్తానా?’ అలాంటి ప్రశ్నల గురించి ఆలోచించి, ధ్యానిస్తే మనం యెహోవాకు దగ్గరౌతాం. ఆయన పట్ల మనకున్న ప్రేమ అధికమౌతుంది. ఆ ప్రేరణ వల్ల, మనం సానుకూలమైన మార్పులు చేసుకుంటాం.—సామె. 4:23; లూకా 6:45.

19, 20. బైబిలు ఉపదేశాన్ని పాటిస్తే మనం ఎలా ప్రయోజనం పొందుతాం?

19 దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతూ ధ్యానించడం వల్ల మనం పౌలు ఇచ్చిన ఈ సలహాను మున్ముందు కూడా పాటిస్తాం: “ప్రాచీనస్వభావమును దాని క్రియలతో కూడ మీరు పరిత్యజించి, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించినవాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీనస్వభావమును ధరించుకొనియున్నారు.” (కొలొ. 3:9, 10) మనం బైబిలు చెబుతున్న దాన్ని నిజంగా అర్థం చేసుకొని, నేర్చుకున్నవాటిని పాటిస్తే, అది సాతాను ఉరుల నుండి కాపాడగల నవీన స్వభావాన్ని ధరించుకునేందుకు మనకు ప్రేరణ ఇస్తుంది.

20 “విధేయులగు పిల్లలై, మీ పూర్వపు అజ్ఞానదశలో మీకుండిన ఆశల ననుసరించి ప్రవర్తింపక . . . సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి” అని అపొస్తలుడైన పేతురు మనకు గుర్తుచేశాడు. (1 పేతు. 1:14, 15) మన పాత ఆలోచన విధానాన్ని, వైఖరిని విడిచిపెట్టి రూపాంతరం పొందడానికి మనం చేయగలిగినదంతా చేయడం వల్ల మనం ఎన్నో ఆశీర్వాదాలు పొందుతాం, దాని గురించి తర్వాతి ఆర్టికల్‌లో చూస్తాం.

a 1994, ఫిబ్రవరి 1, కావలికోట సంచికలోని 10వ పేజీలో ఉన్న 7వ పేరా చూడండి.