కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి”

“ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి”

“ స్వస్థ బుద్ధిగలవారై, ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి.”1 పేతు. 4:7.

1, 2. (ఎ) ‘ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండడం’ ఎందుకు ప్రాముఖ్యం? (బి) ప్రార్థనకు సంబంధించి మనం ఏమని ప్రశ్నించుకోవాలి?

 “రాత్రంతా మెలకువగా ఉండే ఓ వ్యక్తికి చాలా కష్టంగా అనిపించే సమయం ఎప్పుడంటే, తెల్లవారడానికి కాస్త ముందున్న సమయమే” అని గతంలో రాత్రుళ్లు పనిచేసిన ఒకాయన అన్నాడు. రాత్రంతా మెలకువగా ఉండాల్సివచ్చే ఎవరైనా ఆయన మాటలతో ఏకీభవిస్తారు. సాతాను దుష్టలోకమనే సుదీర్ఘ రాత్రి త్వరలోనే తెల్లవారబోతోన్న ఈ సమయంలో నేటి క్రైస్తవులు కూడా అలాంటి సవాలునే ఎదుర్కొంటున్నారు. (రోమా. 13:12) ఇలాంటి సమయంలో మనం నిద్రలోకి జారుకోవడం ఎంత ప్రమాదకరమో కదా! కాబట్టి మనం ‘స్వస్థబుద్ధి గలవారమై’ ఉంటూ, లేఖనాలు ప్రోత్సహిస్తున్నట్లుగా ‘ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండడం’ ఎంతో ప్రాముఖ్యం.—1 పేతు. 4:7.

2 కాలగమనంలో ఎక్కడున్నామో మనకు తెలుసు కాబట్టి, ఇలా ప్రశ్నించుకోవడం మంచిది: ‘ప్రార్థన చేసే విషయంలో నేనెంత మెలకువగా ఉన్నాను? నేను “ప్రతి విధమైన ప్రార్థన” చేస్తున్నానా? నేను ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నానా? నా అవసరాలు, కోరికల గురించే ఎప్పుడూ ప్రార్థిస్తున్నానా లేక ఇతరుల కోసం కూడా ప్రార్థిస్తున్నానా? నేను రక్షణ పొందాలంటే ప్రార్థన ఎంత ప్రాముఖ్యం?’

“ప్రతి విధమైన ప్రార్థన” చేయండి

3. ప్రార్థనలోని కొన్ని విధానాలు ఏమిటి?

3 అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన ఉత్తరంలో “ప్రతి విధమైన ప్రార్థన” గురించి మాట్లాడాడు. (ఎఫె. 6:18) మన అవసరాలు తీర్చమని, అడ్డంకులు అధిగమించేందుకు సహాయం చేయమని మనం తరచూ యెహోవాకు ప్రార్థిస్తాం. సహాయం కోసం మనం చేసే అలాంటి విన్నపాలను “ప్రార్థన ఆలకించే” యెహోవా ప్రేమగా వింటాడు. (కీర్త. 65:2) అయితే మనం ప్రార్థనలోని ఇతర విధానాలపై కూడా దృష్టిపెట్టాలి. వాటిలో స్తుతించడం, కృతజ్ఞతలు చెల్లించడం, విజ్ఞాపనలు చేయడం ఉన్నాయి.

4. మనం ప్రార్థించేటప్పుడు యెహోవాను ఎందుకు తరచూ స్తుతించాలి?

4 ప్రార్థించేటప్పుడు యెహోవాను స్తుతించడానికి మనకెన్నో కారణాలున్నాయి. ఆయన “పరాక్రమ కార్యముల” గురించి, “మహా ప్రభావము” గురించి ఆలోచించడం ఆయనను స్తుతించేలా మనల్ని కదిలిస్తుంది. (కీర్తన 150:1-6 చదవండి.) ఓసారి 150వ కీర్తనను చూడండి, దానిలోని ఆరు వచనాల్లో యెహోవాను స్తుతించమని 13 సార్లు ఉంది. దేవుని మీదున్న భక్తితో మరో కీర్తనకర్త ఇలా పాడాడు: “నీ న్యాయవిధులనుబట్టి దినమునకు ఏడు మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను.” (కీర్త. 119:164) మన స్తుతులకు యెహోవా నిస్సందేహంగా అర్హుడు. కాబట్టి, మనం ప్రార్థనలో “దినమునకు ఏడు మారులు” అంటే తరచూ ఆయనను స్తుతించవద్దా?

5. ప్రార్థనలో కృతజ్ఞతలు చెల్లించడం ఎలా ఓ కాపుదలగా ఉంటుంది?

5 ప్రార్థనలో మరో విధానం కృతజ్ఞతలు చెల్లించడం. ఫిలిప్పీలోని క్రైస్తవులను పౌలు ఇలా ప్రోత్సహించాడు: “దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.” (ఫిలి. 4:6) నేడు మన చుట్టూ “కృతజ్ఞతలేని” ప్రజలే ఉన్నారు కాబట్టి, ప్రార్థనల్లో యెహోవాకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించడం ఓ కాపుదలగా ఉంటుంది. (2 తిమో. 3:1, 2) చేసిన మేలును మర్చిపోయే స్వభావమే ఈ లోకంలో ఎక్కువగా ఉంది. మనం గనుక అజాగ్రత్తగా ఉంటే ఆ స్వభావం మనలో కూడా చొరబడే ప్రమాదం ఉంది. ప్రార్థనలో యెహోవాకు కృతజ్ఞతలు తెలియజేయడం వల్ల సంతృప్తితో జీవించడం అలవాటు చేసుకుంటాం, అంతేకాక ‘సణిగేవారిగా, తమ గతినిగూర్చి నిందించేవారిగా’ తయారవ్వం. (యూదా 16) అలాగే, కుటుంబ శిరస్సులు తమ కుటుంబ సభ్యులతో కలిసి చేసే ప్రార్థనల్లో కృతజ్ఞతలు చెల్లించడం ద్వారా తమ భార్యాపిల్లల్లో కృతజ్ఞతాస్ఫూర్తిని పెంపొందించిన వాళ్లవుతారు.

6, 7. విజ్ఞాపనలు చేయడం అంటే ఏమిటి? వేటి గురించి మనం యెహోవాకు విజ్ఞాపనలు చేయవచ్చు?

6 తీవ్రమైన భావాలను మనస్ఫూర్తిగా చెప్పుకోవడమే విజ్ఞాపనలు చేయడం. మనం వేటిగురించి యెహోవాకు విజ్ఞాపనలు చేయవచ్చు? హింసను ఎదుర్కొంటున్నప్పుడు లేదా ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్నప్పుడు తప్పకుండా విజ్ఞాపనలు చేయవచ్చు. అలాంటి సమయాల్లో సహాయం కోసం మనం దేవునికి చేసే ప్రార్థనలు సహజంగానే విజ్ఞాపనలు అవుతాయి. అయితే, మనం యెహోవాకు విజ్ఞాపనలు చేసే సందర్భాలు కేవలం అవేనా?

7 దేవుని నామం, ఆయన రాజ్యం, ఆయన చిత్తం గురించి మాదిరి ప్రార్థనలో యేసు ఏమని చెప్పాడో గమనించండి. (మత్తయి 6:9, 10 చదవండి.) ఈ లోకం దుష్టత్వంలో మునిగిపోయి ఉంది. మానవ ప్రభుత్వాలు తమ పౌరుల ప్రాథమిక అవసరాలను కూడా తీర్చలేకపోతున్నాయి. అందుకే, మనం యెహోవా నామం పరిశుద్ధపర్చబడాలని, ఆయన రాజ్యం సాతాను పరిపాలనకు చరమగీతం పాడాలని తప్పకుండా ప్రార్థించాలి. అలాగే ఆయన చిత్తం పరలోకంలో నెరవేరినట్లు ఈ భూమ్మీద నెరవేరాలని వేడుకోవడానికి కూడా ఇదే సమయం. కాబట్టి మనం మెలకువగా ఉంటూ ప్రార్థనలోని అన్ని విధానాలను ఉపయోగిద్దాం.

ప్రార్థిస్తూనే ఉండండి

8, 9. పేతురు, ఇతర అపొస్తలులు గెత్సేమనే తోటలో నిద్రపోయినందుకు మనమెందుకు విమర్శించకూడదు?

8 ‘ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి’ అని తొలి క్రైస్తవులకు ఉపదేశించిన పేతురే గతంలో ఓసారి అలా ఉండలేకపోయాడు. యేసు గెత్సేమనే తోటలో ప్రార్థించినప్పుడు నిద్రలోకి జారుకున్న శిష్యుల్లో ఆయన కూడా ఉన్నాడు. “మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి” అని యేసు చెప్పిన తర్వాత కూడా వాళ్లు నిద్రపోయారు.—మత్తయి 26:40-45 చదవండి.

9 మెలకువగా ఉండనందుకు పేతురును, ఇతర అపొస్తలులను మనం విమర్శించే బదులు, వాళ్లప్పటికే ఆ రోజు ఎంతో ప్రయాసపడ్డారని గుర్తుంచుకోవడం మంచిది. వాళ్లు పస్కా కోసం ఏర్పాట్లు చేసి, ఆ సాయంత్రం దానిని ఆచరించారు. ఆ సందర్భంలో యేసు ప్రభువు రాత్రి భోజనాన్ని స్థాపించి, మున్ముందు తన మరణాన్ని ఎలా జ్ఞాపకం చేసుకోవాలో చూపించాడు. (1 కొరిం. 11:23-25) “అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్లిరి,” అక్కడకు వెళ్లడానికి వాళ్లు యెరూషలేములోని ఇరుకు సందుల గుండా కొంతసేపు నడిచారు. (మత్త. 26:30, 36) బహుశా, అప్పటికే మధ్యరాత్రి దాటి ఉంటుంది. ఒకవేళ మనం కూడా ఆ రాత్రి గెత్సేమనే తోటలో ఉండుంటే బహుశా మనమూ నిద్రపోయేవాళ్లమే. బడలికతో ఉన్న తన అపొస్తలులను విమర్శించే బదులు, “ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని” యేసు ప్రేమతో అర్థం చేసుకున్నాడు.

పేతురు మొదట తొట్రిల్లినా, ‘ప్రార్థన చేయుటకు మెలకువగా ఎలా ఉండాలో’ నేర్చుకున్నాడు (10, 11 పేరాలు చూడండి)

10, 11. (ఎ) గెత్సేమనే తోటలో ఎదురైన అనుభవం నుండి పేతురు ఏ పాఠం నేర్చుకున్నాడు? (బి) పేతురు అనుభవం నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?

10 గెత్సేమనే తోటలో పేతురుకు ఎదురైన అనుభవం వృథాగా పోలేదు. ఆ రోజు ఆయన మెలకువగా ఉండకపోవడం వల్ల ఓ గుణపాఠం నేర్చుకున్నాడు. అంతకు ముందు యేసు ఇలా చెప్పాడు: “ఈ రాత్రి మీరందరు నా విషయమై అభ్యంతరపడెదరు.” పేతురు వెంటనే యేసుతో, “నీ విషయమై అందరు అభ్యంతరపడినను నేను ఎప్పుడును అభ్యంతరపడను” అని అన్నాడు. దానికి యేసు, తనను పేతురు మూడుసార్లు ఎరుగనంటాడని చెప్పాడు. పేతురు మళ్లీ స్థిరంగా, “నేను నీతో కూడ చావవలసివచ్చినను, నిన్ను ఎరుగనని చెప్పను” అని అన్నాడు. (మత్త. 26:31-35) అయితే యేసు ముందే చెప్పినట్లు పేతురు అభ్యంతరపడ్డాడు. యేసు ఎవరో తనకు తెలియదని చివరిసారి అన్న తర్వాత పేతురు, “సంతాపపడి యేడ్చెను.”—లూకా 22:60-62.

11 పేతురు ఈ అనుభవం నుండి నిస్సందేహంగా ఓ పాఠం నేర్చుకొని, ఆ తర్వాత మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఉండకుండా జాగ్రత్తపడ్డాడు. ఈ విషయంలో పేతురుకు తప్పకుండా ప్రార్థనే ఎంతో సహాయం చేసివుంటుంది. నిజానికి, “ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి” అనే ఉపదేశాన్ని పేతురే ఇచ్చాడని గమనించండి. మనం ఆ ప్రేరేపిత ఉపదేశాన్ని పాటిస్తున్నామా? ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ యెహోవాపై ఆధారపడుతున్నామని చూపిస్తున్నామా? (కీర్త. 85:8) అపొస్తలుడైన పౌలు ఇచ్చిన ఈ హెచ్చరికను కూడా మనం మనస్సుల్లో ఉంచుకుందాం: “తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను.”—1 కొరిం. 10:12.

నెహెమ్యా ప్రార్థనలకు జవాబు దొరికింది

12. నెహెమ్యా మనకెందుకు మంచి మాదిరిగా ఉన్నాడు?

12 సా.శ.పూ. 5వ శతాబ్దంలో, పారసీక రాజైన అర్తహషస్త దగ్గర ద్రాక్షారసపు గిన్నె అందించే పనిచేసిన నెహెమ్యా విషయాన్ని పరిశీలించండి. హృదయపూర్వకంగా ప్రార్థించే విషయంలో నెహెమ్యా మనకు మంచి మాదిరిగా ఉన్నాడు. యెరూషలేములో ఉన్న యూదుల దుస్థితి విషయంలో ఆయన ‘దుఃఖముతో ఉపవాసముండి, ఆకాశమందలి దేవుని యెదుట’ కొన్నిరోజుల పాటు ప్రార్థించాడు. (నెహె. 1:4) ఆయన ముఖం ఎందుకు విచారంగా ఉందని అర్తహషస్త రాజు అడిగినప్పుడు, నెహెమ్యా వెంటనే ‘ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేశాడు.’ (నెహె. 2:2-4) ఫలితం? ఆయన ప్రార్థనలను యెహోవా ఆలకించి తన ప్రజలకు ప్రయోజనం కలిగే విధంగా విషయాలను నిర్దేశించాడు. (నెహె. 2:5, 6) దానివల్ల నెహెమ్యా విశ్వాసం ఎంతగా బలపడి ఉంటుందో కదా!

13, 14. విశ్వాసాన్ని స్థిరంగా కాపాడుకోవాలన్నా, సాతాను తంత్రాలను ఎదిరించాలన్నా మనమేమి చేయాలి?

13 మనం కూడా నెహెమ్యాలా ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉంటే విశ్వాసంలో స్థిరంగా ఉండగలుగుతాం. ఏమాత్రం కనికరంలేని సాతాను మనం బలహీనంగా ఉన్నప్పుడే దాడి చేస్తాడు. బహుశా మనం అనారోగ్యంవల్లో, కృంగుదలవల్లో సతమతమౌతుండవచ్చు. దానివల్ల, ప్రతీనెల మనం పరిచర్యలో గడిపే సమయం యెహోవాకు అంత విలువైనది కాదని అనిపించవచ్చు. మనలో కొంతమందికి గతంలో జరిగిన సంఘటనలను బట్టి కృంగదీసే ఆలోచనలు వస్తుంటాయి. మనం ఎందుకూ పనికిరాని వాళ్లమనే భావనను సాతాను కలిగిస్తాడు. అతను సాధారణంగా మన భావోద్వేగాల మీద దాడిచేసి మన విశ్వాసాన్ని నీరుగార్చాలని ప్రయత్నిస్తుంటాడు. అయితే, ‘ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండడం’ ద్వారా మనం మన విశ్వాసాన్ని బలంగా కాపాడుకోవచ్చు. నిస్సందేహంగా, ‘విశ్వాసమను డాలు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పేలా మనల్ని శక్తిమంతుల్ని చేస్తుంది.’—ఎఫె. 6:16.

‘ప్రార్థన చేయుటకు మెలకువగా ఉంటే’ మనం అనేక సవాళ్లను అధిగమించగలం (13, 14 పేరాలు చూడండి)

14 మనం ‘ప్రార్థన చేయుటకు మెలకువగా ఉంటే’ అజాగ్రత్తగా ప్రమాదాల్లో చిక్కుకోం, ఊహించని పరీక్షలు ఎదురైనప్పుడు విశ్వాసంలో రాజీపడం. కష్టాలు, పరీక్షలు ఎదురైనప్పుడు నెహెమ్యా మాదిరిని గుర్తుతెచ్చుకొని వెంటనే ప్రార్థనలో యెహోవాను సమీపించాలి. కేవలం యెహోవా సహాయంతోనే మనం శోధనలను ఎదిరించగలుగుతాం, విశ్వాసానికి ఎదురయ్యే సవాళ్లను స్థిరంగా తట్టుకోగలుగుతాం.

ఇతరుల కోసం ప్రార్థించండి

15. ఇతరుల కోసం ప్రార్థించే విషయంలో మనం ఏ ప్రశ్నలు వేసుకోవాలి?

15 పేతురు తన విశ్వాసంలో రాజీపడకుండా ఉండేలా యేసు పేతురు కోసం ఎంతో ప్రార్థించాడు. (లూకా 22:32) మొదటి శతాబ్దపు క్రైస్తవుడైన ఎపఫ్రా కూడా యేసు మాదిరిని అనుకరిస్తూ కొలొస్సయిలోని తన తోటి సహోదరుల కోసం ఎంతో ప్రార్థించాడు. ఆయన గురించి పౌలు ఇలా రాశాడు: “మీరు సంపూర్ణులును, ప్రతి విషయములో దేవుని చిత్తమునుగూర్చి సంపూర్ణాత్మ నిశ్చయతగలవారునై నిలుకడగా ఉండవలెనని యితడెల్లప్పుడును మీకొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు.” (కొలొ. 4:12) మనం ఇలా ప్రశ్నించుకుందాం: ‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న తోటి సహోదరసహోదరీల కోసం ప్రార్థించడానికి నేను గట్టిగా కృషి చేస్తున్నానా? ప్రకృతి విపత్తుల వల్ల బాధపడుతున్న తోటి విశ్వాసుల కోసం నేనెంత తరచుగా ప్రార్థిస్తున్నాను? యెహోవా సంస్థలో బరువైన బాధ్యతల్ని నిర్వహిస్తున్న వాళ్ల కోసం నేను చివరిసారి ఎప్పుడు ప్రార్థించాను? కష్టాలను ఎదుర్కొంటున్న సంఘ సభ్యుల కోసం నేను ఈ మధ్యకాలంలో ప్రార్థించానా?’

16. ఇతరుల కోసం మనం చేసే ప్రార్థనలు నిజంగా అంత ప్రాముఖ్యమైనవా? వివరించండి.

16 ఇతరుల కోసం మనం చేసే ప్రార్థనలు వాళ్లకు నిజంగా సహాయపడతాయి. (2 కొరింథీయులు 1:11 చదవండి.) తన ఆరాధకులు చాలామంది పదేపదే ప్రార్థిస్తున్నారు కాబట్టి ఫలానా పని చేయాల్సిన అవసరం యెహోవాకు లేకపోయినా వాళ్లందరికున్న ఆసక్తిని, నిజమైన శ్రద్ధను ఆయన తప్పకుండా గమనించి సరైన విధంగా ప్రతిస్పందిస్తాడు. అందుకే, ఇతరుల కోసం ప్రార్థించే బాధ్యతను మనం ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఎపఫ్రాలానే మనం కూడా తోటి విశ్వాసుల కోసం తీవ్రంగా ప్రార్థిస్తూ వారిపై హృదయపూర్వక ప్రేమను, శ్రద్ధను కనబర్చాలి. అలా చేయడం మన సంతోషానికి తోడవుతుంది ఎందుకంటే, “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము.”—అపొ. 20:35.

‘మన రక్షణ సమీపించింది’

17, 18. ‘ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండడం’ మనకెలా సహాయం చేస్తుంది?

17 “రాత్రి చాల గడచి పగలు సమీపముగా ఉన్నది” అని చెప్పడానికి ముందు పౌలు ఇలా అన్నాడు: “మీరు కాలమునెరిగి, నిద్రమేలుకొను వేళయైనదని తెలిసికొని, ఆలాగు చేయుడి. మనము విశ్వాసుల మైనప్పటికంటె ఇప్పుడు, రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది.” (రోమా. 13:11, 12) దేవుడు వాగ్దానం చేసిన కొత్త లోకం సమీపంలోనే ఉంది, మన రక్షణ కూడా మనం అనుకునే దానికన్నా మరింత సమీపంగా ఉంది. అందుకే మనం ఆధ్యాత్మిక నిద్రలోకి జారిపోకూడదు, అలాగే ప్రార్థనలో యెహోవాతో ఏకాంతంగా మాట్లాడే సమయాన్ని ఈ లోకంలోని విషయాలు దోచుకోకుండా చూసుకోవాలి. బదులుగా, “ప్రార్థన చేయుటకు మెలకువగా” ఉందాం. అలా చేయడం వల్ల, యెహోవా దినం కోసం ఎదురుచూస్తూ మనం “పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను” జీవించగలుగుతాం. (2 పేతు. 3:11, 12) అలా మనం ఆధ్యాత్మికంగా మెలకువగా ఉన్నామనీ, ఈ విధానాంతం వస్తుందని ఖచ్చితంగా నమ్ముతున్నామనీ మన జీవన శైలి ద్వారా చూపిస్తాం. కాబట్టి మనం ‘యెడతెగక ప్రార్థన చేస్తూ’ ఉందాం. (1 థెస్స. 5:16-18) యేసును ఆదర్శంగా తీసుకుని మన వ్యక్తిగత ప్రార్థనల కోసం ఏకాంత సమయాల్ని కేటాయిద్దాం. మనం సమయం తీసుకుని యెహోవాకు వ్యక్తిగతంగా ప్రార్థిస్తే ఆయనకు మరింత దగ్గరౌతాం. (యాకో. 4:7, 8) అది ఎంత గొప్ప ఆశీర్వాదమో కదా!

18 క్రీస్తు “శరీరధారియైయున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతోను, తన్ను మరణమునుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి, భయభక్తులు కలిగి యున్నందున ఆయన అంగీకరింపబడెను” అని బైబిలు చెబుతోంది. (హెబ్రీ. 5:7) యేసు ప్రార్థనలో విజ్ఞాపనలు, విన్నపాలు అర్పించాడు, తన భూజీవితపు చివరివరకూ దేవునికి యథార్థంగా ఉన్నాడు. దానివల్ల, యెహోవా తన ప్రియ కుమారుణ్ణి పునరుత్థానం చేసి, పరలోకంలో అమర్త్యమైన జీవాన్ని బహుమతిగా ఇచ్చాడు. భవిష్యత్తులో మనకు ఎన్ని శోధనలు, పరీక్షలు ఎదురైనా మనం కూడా మన పరలోక తండ్రికి యథార్థంగా ఉండగలం. మనం “ప్రార్థన చేయుటకు మెలకువగా” ఉంటే నిత్యజీవితమనే బహుమానాన్ని పొందుతాం.