కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కొండల ఛాయలలో కంటికి రెప్పలా కాపాడాడు

కొండల ఛాయలలో కంటికి రెప్పలా కాపాడాడు

తెల్లవారుజామున, ఇంటి తలుపు తెరిచిన ఓ స్త్రీ, తన గుమ్మం ముందు పడివున్న ఓ పార్సిల్‌ గమనించింది. ఆమె దాన్ని తీసుకుని అటూఇటూ చూసింది, వీధిలో ఎవ్వరూ లేరు. ఎవరో అజ్ఞాత వ్యక్తి బహుశా రాత్రిపూట దాన్ని అక్కడ పెట్టుంటాడు. ఆమె దాన్ని కాస్త తెరిచి చూసి, ఒక్క ఉదుటున ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకుంది. ఆమె చేసినదాంట్లో ఆశ్చర్యమేమీ లేదు ఎందుకంటే, ఆ పార్సిల్‌ మరేదో కాదు, నిషేధించబడిన బైబిలు సాహిత్యమే! ఆమె ఆ పార్సిల్‌ని గుండెకు హత్తుకుని, అమూల్యమైన ఆ ఆధ్యాత్మిక ఆహారాన్ని అందించినందుకు మనసులోనే యెహోవాకు కృతజ్ఞతలు చెప్తూ ప్రార్థించింది.

జర్మనీలో, 1930వ దశకంలో అలాంటి ఎన్నో సన్నివేశాలు కనిపించాయి. 1933లో నాజీల శకం మొదలయ్యాక, యెహోవాసాక్షుల పని దాదాపు దేశమంతా నిషేధించబడింది. ప్రస్తుతం 100 ఏళ్లు పైబడిన రిస్చార్ట్‌ రూడాల్ప్‌ a ఇలా అన్నాడు: “యెహోవా గురించి, ఆయన నామం గురించి ప్రకటించడాన్ని ఏ మానవ చట్టాలూ ఆపలేవని మాకు తెలుసు. మన అధ్యయనానికి, పరిచర్యకు ముఖ్య ఆధారం బైబిలు సాహిత్యమే. కానీ, నిషేధం వల్ల అది దొరకడం గగనమైపోయింది. ఇకపై ఈ పని ఎలా కొనసాగుతుందోనని మేము ఆందోళనపడ్డాం.” అయితే, ఆ అవసరాన్ని ఓ అసాధారణరీతిలో తీర్చే పనిలో తానుకూడా పాలుపంచుకోనున్నానని రిస్చార్ట్‌ అనతికాలంలోనే తెలుసుకున్నాడు. ఆ పని కొండల ఛాయలలో జరగనుంది.—న్యాయా. 9:36.

రహస్య రవాణా మార్గాల్లో

ఎల్బీ నది (లేబ్‌ నది) ఎగువకు వెళ్తే కర్కొనోషి పర్వతాలు కనిపిస్తాయి. అవి ప్రస్తుతం జెక్‌ రిపబ్లిక్‌కు, పోలాండ్‌కు మధ్య సరిహద్దుగా ఉన్నాయి. వాటి ఎత్తు సుమారు 1,600 మీటర్లే అయినా అవి ఎక్కువగా మంచుతో కప్పబడివుండేవి. సంవత్సరానికి ఆరు నెలలపాటు దాదాపు 10 అడుగులమేర మంచు కొండల్ని కప్పివుంటుంది. ఎప్పుడెలా మారుతుందో తెలియని అక్కడి వాతావరణాన్ని తక్కువ అంచనా వేసి వాటిపై ప్రయాణించే వాళ్లు, పర్వత శిఖరాల్ని ఆకస్మాత్తుగా కప్పే దట్టమైన పొగమంచులో చిక్కుకుంటారు.

శతాబ్దాలుగా ఈ పర్వత శ్రేణి రాష్ట్రాలకు, రాజ్యాలకు, దేశాలకు సహజ సరిహద్దుగా నిలిచింది. ఈ కష్టమైన ప్రాంతాన్ని పహరా కాయడం అసాధ్యమైన పని అందుకే గతంలో ఈ పర్వతాల మీదుగా చాలామంది దొంగతనంగా వస్తువులను రవాణా చేసేవాళ్లు. పట్టుదల గల సాక్షులు 1930లలో, జెకస్లోవేకియా-జర్మనీ మధ్య ఉన్న ఈ పర్వతాల్లోని రహస్య రవాణా మార్గాలను ఉపయోగించడం మొదలుపెట్టారు. దేని కోసం? అమూల్యమైన బైబిలు సాహిత్యం దొరికే ప్రాంతాల నుండి వాటిని రవాణా చేయడం కోసం. అలా రవాణా చేసిన వాళ్లలో రిస్చార్ట్‌ కూడా ఉన్నాడు.

పర్వతారోహకుల్లా బట్టలు వేసుకున్న సహోదరసహోదరీలు కర్కొనోషి పర్వతాల మీదుగా జర్మనీకి ప్రచురణలు మోసుకెళ్తున్నారు

ప్రమాదకరమైన ప్రయాణాలు

రిస్చార్ట్‌ ఇలా గుర్తుచేసుకున్నాడు: “వారాంతాల్లో, ఏడుగురం లేదా అంతకంటే ఎక్కువమంది సహోదరులం పర్వతారోహకుల్లా బట్టలు వేసుకుని గుంపుగా పర్వతాల వైపు వెళ్లేవాళ్లం. జర్మనీ భూభాగం నుండి పర్వతాలు దాటుకుంటూ స్పిండెల్‌రూవ్‌మ్లీన్‌కు చేరుకోవడానికి మాకు మూడు గంటలు పట్టేది.” అది జెక్‌ దేశపు సరిహద్దుకు 16.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోటల్‌. ఆ రోజుల్లో చాలామంది జర్మనీ వాసులు అక్కడ నివసించేవాళ్లు. వాళ్లలో ఒక రైతు మన సహోదరులకు సహకరించడానికి ఒప్పుకున్నాడు. ప్రేగ్‌ నగరం నుండి దగ్గర్లోని ఓ పట్టణానికి వచ్చిన సాహిత్యపు పెట్టెలను ఆయన అందుకుని, వాటిని ఓ గుర్రపుబండిలో తీసుకెళ్లి తన గోదాములో దాచిపెట్టేవాడు. అప్పుడు జర్మనీ నుండి సహోదరులు వచ్చి వాటిని తీసుకెళ్లేవాళ్లు.

రిస్చార్ట్‌ ఇంకా ఇలా అన్నాడు: “మేము ఆ గోదాము దగ్గరికి వెళ్లి, మా సంచులను ప్రచురణలతో నింపుకొనేవాళ్లం. ఆ సంచులు పెద్దపెద్ద బరువులు మోయడానికి అనువుగా ఉండడం వల్ల మేము ఒక్కొక్కరం 50 కిలోల వరకూ ప్రచురణలు మోసేవాళ్లం.” వాళ్లు పట్టుబడకుండా ఉండడానికి చీకట్లో ప్రయాణించేవాళ్లు. సూర్యుడు అస్తమించాక బయలుదేరి తెల్లారేలోపే ఇంటికి చేరుకునేవాళ్లు. వాళ్లు తీసుకున్న కొన్ని జాగ్రత్తల గురించి, అప్పట్లో ప్రాంతీయ పర్యవేక్షకునిగా జర్మనీలో సేవచేసిన ఎర్నెస్ట్‌ వీస్నర్‌ ఇలా చెప్పాడు: “ఇద్దరు సహోదరులు ముందు వెళ్లేవాళ్లు, వాళ్లకు ఎవరైనా ఎదురుపడితే టార్చ్‌లైట్‌తో సిగ్నల్‌ ఇచ్చేవాళ్లు. దాంతో, వెనకాల దాదాపు 100 మీటర్ల దూరంలో ఉన్న సహోదరులు పొదల్లో దాక్కునేవాళ్లు. ముందు వెళ్లిన ఆ ఇద్దరు సహోదరులు తిరిగి వచ్చి మరో కోడ్‌ చెప్పేవరకు వాళ్లు అలాగే ఉండేవాళ్లు. ఆ కోడ్‌లు ప్రతీవారం మారుతుండేవి.” అయితే, వాళ్లకు పొంచివున్న ప్రమాదం జర్మన్‌ పోలీసుల నుండి మాత్రమే కాదు.

రిస్చార్ట్‌ ఇలా గుర్తుచేసుకున్నాడు: “ఓ సాయంత్రం నేను ఎక్కువసేపు పనిచేయాల్సి రావడంతో మిగతా సహోదరుల కన్నా కొంచెం ఆలస్యంగా జెక్‌కు బయలుదేరాను. అప్పటికే చాలా చీకటి పడింది, పైగా మంచు. నేను వణుకుతూ ఆ మంచు వర్షంలో నడుస్తూ వెళ్లాను. ఆ పర్వతం మీది చెట్లమధ్య నేను దారితప్పాను, చాలా గంటలపాటు నాకు సరైన దారి కనిపించలేదు. పైగా ఆ మార్గంలో చాలామంది పర్వతారోహకులు చనిపోయారు. చివరికి తెల్లవారుజామున సహోదరులు తమ తిరుగు ప్రయాణంలో నాకు ఎదురైనప్పుడుకానీ మనసు కుదుటపడలేదు.”

ధైర్యసాహసాలుగల ఆ చిన్న గుంపు దాదాపు మూడు సంవత్సరాలు ప్రతీవారం అలా పర్వతాల మీదుగా ప్రయాణించింది. చలికాలంలో వాళ్లు ఆ అమూల్యమైన సాహిత్యాన్ని స్కేటింగ్‌కు ఉపయోగించే కొయ్య పలకమీద లేదా బల్లమీద తీసుకొచ్చేవాళ్లు. అప్పుడప్పుడు, 20 మంది దాకా సహోదరులు ముందే గుర్తులు పెట్టుకున్న మార్గంలో పగటిపూట కూడా సరిహద్దులు దాటేవాళ్లు. తాము కేవలం పర్వతారోహకులమేనని చూపించుకోవడానికి కొన్నిసార్లు వాళ్లు తమతోపాటు సహోదరీలను కూడా తీసుకెళ్లేవాళ్లు. వాళ్లలో కొంతమంది ముందుగా నడుస్తూ, ఏదైనా ప్రమాదం ఉందని తెలిస్తే తమ టోపీలను గాల్లోకి ఎగరేసి సంకేతం ఇచ్చేవాళ్లు.

పర్వత శిఖరాల మీదున్న దట్టమైన మంచు వల్ల కర్కొనోషి పర్వతాల్ని దాటడం ప్రమాదకరం

అలా సహోదరులు రాత్రంతా ప్రయాణం చేసి తీసుకొచ్చిన సాహిత్యాన్ని ఏమి చేసేవాళ్లు? ఆ సాహిత్యం వెంటనే అందరికీ చేరవేసే ఏర్పాట్లు చేసేవాళ్లు. ఎలా? సాహిత్యాన్ని సబ్బుల్ని ప్యాక్‌ చేసినట్లుగా ప్యాక్‌చేసి హిర్ష్‌బర్క్‌ రైల్వేస్టేషన్‌కు తీసుకెళ్లేవాళ్లు. అక్కడనుండి రైలు మార్గం ద్వారా జర్మనీలోని వివిధ ప్రాంతాలకు తరలించేవాళ్లు. ఆ తర్వాత, ప్రారంభంలో చూసినట్లుగా సహోదరసహోదరీలు తెలివిగా వాటిని తోటి విశ్వాసులకు చేరవేసేవాళ్లు. ఈ పనికోసం సహోదరుల మధ్య ఎంత సమన్వయం అవసరమంటే, ఏ మాత్రం తేడా వచ్చిన ఫలితాలు తీవ్రంగా ఉండేవి. భయపడినట్లుగానే, ఓ రోజు ఊహించని పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.

బెర్లిన్‌ నగర సమీపంలో, 1936వ సంవత్సరంలో సాహిత్యాన్ని ఉంచిన స్థావరాన్ని కనిపెట్టేశారు. అందులో హిర్ష్‌బర్క్‌ నుండి ఓ అజ్ఞాత వ్యక్తి పంపించిన మూడు ప్యాకేజీలు ఉన్నాయి. పోలీసులు వాటిమీదున్న చేతిరాతను విశ్లేషించి, వాటిని అక్రమంగా రవాణా చేస్తున్న వాళ్లలో ముఖ్యుడైన సహోదరుణ్ణి గుర్తించి, అరెస్టు చేశారు. కొద్దికాలంలోనే మరో ఇద్దరు అనుమానితులను కూడా అరెస్టు చేశారు. వాళ్లలో రిస్చార్ట్‌ రూడాల్ప్‌ కూడా ఉన్నాడు. అయితే, ఆ సహోదరులు వాటికి సంబంధించిన పూర్తి బాధ్యతను తమపై వేసుకోవడంతో, మరికొంత కాలం ఇతరులు ప్రమాదకరమైన ఆ రవాణాను కొనసాగించగలిగారు.

మనకు పాఠం

ఆ పర్వతాల మీదుగా సహోదరులు తమ భుజాలపై మోసుకొచ్చిన ఆ అమూల్యమైన బైబిలు సాహిత్యమే జర్మనీలోని సాక్షులకు ముఖ్య ఆధారమైంది. అయితే, సహోదరులు వేరే మార్గాల్లో కూడా రవాణా చేసేవాళ్లు. జర్మనీ దళాలు 1939లో, జెకస్లోవేకియాను స్వాధీనం చేసుకునేంత వరకు ఆ ఇరు దేశాల సరిహద్దు గుండా చాలా మార్గాల్లో రవాణా చేసేవాళ్లు. జర్మనీలోని సాక్షులు అలాగే దాని సరిహద్దులో ఉన్న ఫ్రాన్స్‌, నెదర్లాండ్స్‌, స్విట్జర్లాండ్‌ దేశాల్లోని సాక్షులు హింసకు గురౌతున్న తోటి విశ్వాసుల కోసం ప్రాణాలకు తెగించి మరీ ఆధ్యాత్మిక ఆహారాన్ని అందించారు.

నేడు మనకు, బైబిలు సాహిత్యం వివిధ రూపాల్లో, సరిపడా అందుబాటులో ఉంది. మీరు ఓ కొత్త ప్రచురణను రాజ్యమందిరంలో తీసుకుంటున్నా లేదా jw.org వెబ్‌సైట్‌ నుండి డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నా అవి అలా అందుబాటులోకి రావడం వెనక ఎంత కృషి జరిగిందో ఒక్కసారి ఆలోచించండి. ఎవరో అర్థరాత్రి మంచుతో నిండిన పర్వతాలను దాటుకుంటూ రవాణా చేయడం వల్ల కాదుగానీ, మీ కోసం తోటి విశ్వాసులు నిస్వార్థంగా చెమటోడ్చి కష్టపడితేనే అవి మీ చేతుల్లోకి వచ్చాయని గుర్తుంచుకోండి.

a ఆయన సిలిసియాలోని హిర్ష్‌బర్క్‌ సంఘంలో సేవచేశాడు. ఆ హిర్ష్‌బర్క్‌ నగరమే ప్రస్తుతం పోలాండ్‌కు తూర్పున ఉన్న యెలెన్యాగూరా నగరం.