కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘త్వరపడి చంచల మనస్కులు కాకుండా ఉండండి!’

‘త్వరపడి చంచల మనస్కులు కాకుండా ఉండండి!’

‘సహోదరులారా, మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా ఉండాలని మిమ్మును వేడుకొనుచున్నాము.’2 థెస్స. 2:1, 2.

1, 2. ఈ రోజుల్లో మోసం ఎందుకు సర్వసాధారణమైపోయింది? అది ఏయే రూపాల్లో జరుగుతుంది? (ప్రారంభ చిత్రం చూడండి.)

 కుంభకోణాలు, మోసాలు, వంచనలు ప్రస్తుత లోకంలో సర్వసాధారణమైపోయాయి. అయితే అలాంటివి జరుగుతున్నందుకు మనం ఆశ్చర్యపోము. ఎందుకంటే సాతాను మోసం చేయడంలో ఆరితేరాడని, ఇప్పుడీ లోకాన్ని పరిపాలిస్తుంది అతనేనని బైబిలు స్పష్టంగా చెబుతుంది. (1 తిమో. 2:14; 1 యోహా. 5:19) ఈ దుష్టలోకానికి అంతం దగ్గరౌతున్న కొద్దీ సాతాను కోపంతో ఊగిపోతున్నాడు. ఎందుకంటే “తనకు సమయము కొంచెమే” మిగిలివుందని అతనికి తెలుసు. (ప్రక. 12:12) కాబట్టి, సాతాను ప్రభావం కిందున్న వాళ్లు మరింత మోసగాళ్లుగా మారతారని, సత్యారాధనకు మద్దతిచ్చేవాళ్లను మోసగించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తారని చెప్పడంలో సందేహం లేదు.

2 యెహోవా సేవకుల గురించి, వాళ్ల నమ్మకాల గురించి తప్పుడు ఆరోపణలు, పచ్చి అబద్ధాలు వార్తామాధ్యమాల్లో అప్పుడప్పుడు వస్తుంటాయి. పేపర్లలోని పతాక శీర్షికల్లో, టీవీ కార్యక్రమాల్లో, ఇంటర్నెట్‌లో అలాంటి అబద్ధాలను వ్యాప్తి చేస్తుంటారు. అందువల్ల, వాటిని కొంతమంది గుడ్డిగా నమ్మి కంగారు పడుతుంటారు.

3. మోసపోకుండా ఉండడానికి మనకేది సహాయం చేస్తుంది?

3 మన స్థైర్యాన్ని దెబ్బతీయడానికి శత్రువు ఉపయోగించే అలాంటి దాడిని తిప్పికొట్టేందుకు మనకు బైబిలు సహాయం చేస్తుంది. ఎందుకంటే అది, ‘తప్పు దిద్దుటకు ప్రయోజనకరమైనది.’ (2 తిమో. 3:16, 17) మొదటి శతాబ్దపు థెస్సలొనీకలోని కొంతమంది క్రైస్తవులు అబద్ధాలను నమ్మి మోసపోయారని పౌలు రాసిన మాటలను చూస్తే అర్థమౌతుంది. అందుకే పౌలు వాళ్లకు, ‘త్వరపడి చంచల మనస్కులు కాకుండా ఉండండి’ అని ఉపదేశించాడు. (2 థెస్స. 2:1, 2) పౌలు ప్రేమతో ఇచ్చిన ఆ ఉపదేశం నుండి మనమే పాఠాలు నేర్చుకోవచ్చు? వాటిని మన పరిస్థితికి ఎలా అన్వయించుకోవచ్చు?

సమయానుకూలమైన హెచ్చరికలు

4. రానున్న ‘యెహోవా దినం’ గురించి థెస్సలొనీకలోని క్రైస్తవులకు జ్ఞాపికలు ఎలా అందాయి? నేడు అవి మనకెలా అందుతున్నాయి?

4 పౌలు థెస్సలొనీక సంఘానికి రాసిన మొదటి పత్రికలో, రానున్న ‘యెహోవా దినం’ గురించి వాళ్లకు గుర్తుచేశాడు. తన తోటి సహోదరులు ఆధ్యాత్మిక చీకట్లో ఏమరుపాటుగా ఉండాలని ఆయన కోరుకోలేదు. బదులుగా ‘వెలుగు సంబంధులైన’ వ్యక్తులుగా ‘మెలకువగా ఉండమని, మత్తులుగా ఉండవద్దని’ వాళ్లను వేడుకున్నాడు. (1 థెస్సలొనీకయులు 5:1-6 చదవండి.) మనందరం, ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన మహాబబులోను నాశనమయ్యే రోజు కోసం ఎదురుచూస్తున్నాం. ఆ నాశనంతో యెహోవా మహాదినం మొదలౌతుంది. అయితే యెహోవా తన సంకల్పాన్ని ఎలా నెరువేరుస్తాడో మనం మరింతగా అర్థంచేసుకున్నాం. దానితోపాటు మనం అప్రమత్తంగా ఉండడానికి సహాయం చేసే సమయానుకూలమైన జ్ఞాపికల్ని కూడా సంఘం ద్వారా ఎప్పటికప్పుడు అందుకుంటున్నాం. సంస్థ పదేపదే ఇచ్చే ఆ హెచ్చరికల్ని లక్ష్యపెడితే, మన ఆలోచనా సామర్థ్యాన్ని ఉపయోగిస్తూ ‘పరిశుద్ధ సేవ’ చేయాలన్న మన నిశ్చయం మరింత బలపడుతుంది.—రోమా. 12:2.

పౌలు రాసిన పత్రికలు క్రైస్తవులకు సమయానుకూలమైన హెచ్చరికలు అందించాయి (4, 5 పేరాలు చూడండి)

5, 6. (ఎ) థెస్సలొనీకయులకు రాసిన రెండవ పత్రికలో పౌలు ఏ విషయం గురించి ప్రస్తావించాడు? (బి) యేసు త్వరలోనే ఏమి చేస్తాడు? మనం ఏ ప్రశ్నల గురించి ఆలోచించాలి?

5 థెస్సలొనీకలోని క్రైస్తవులకు మొదటి పత్రిక రాసిన కొంత కాలానికే పౌలు వాళ్లకు రెండవ పత్రిక రాశాడు. ఈ పత్రికలో పౌలు, ప్రభువైన యేసు తీర్పు తీర్చినప్పుడు “దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి” వచ్చే శ్రమ గురించి రాశాడు. (2 థెస్స. 1:6-8) ఆ సంఘంలోని కొంతమంది యెహోవా దినం విషయంలో ఎంత అత్యుత్సాహంతో ఉన్నారంటే అది అతి త్వరలోనే రానుందని వాళ్లు నమ్మినట్లు పౌలు రెండవ అధ్యాయంలో రాసిన మాటల్ని బట్టి తెలుస్తుంది. (2 థెస్సలొనీకయులు 2:1, 2 చదవండి.) ఆ తొలి క్రైస్తవులకు యెహోవా సంకల్పం నెరవేరే విధానం గురించి పరిమిత అవగాహన మాత్రమే ఉంది. పౌలు కూడా ఆ విషయాన్ని ఒప్పుకుంటూ, ప్రవచనాల గురించి ఆ తర్వాత ఇలా రాశాడు: “మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంతమట్టుకు ప్రవచించుచున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణముకానిది నిరర్థకమగును.” (1 కొరిం. 13:9, 10) అయితే పౌలు, పేతురు, ఇతర నమ్మకస్థులైన అభిషిక్తులు దైవప్రేరణతో రాసిన హెచ్చరికలు వినడం వల్ల ఆ కాలంలోని సహోదరులు తమ విశ్వాసాన్ని కాపాడుకోగలిగారు.

6 యెహోవా దినం వచ్చే ముందు గొప్ప భ్రష్టత్వం సంభవిస్తుందని, ధర్మవిరోధి బయటపడతాడని పౌలు దైవప్రేరణతో వివరించి వాళ్ల ఆలోచనను సరిదిద్దాలని ప్రయత్నించాడు. a అవి జరిగిన తర్వాత, ప్రభువైన యేసు తప్పుడు మార్గంలో వెళ్లే వాళ్లందరినీ సరైన సమయంలో ‘నాశనం చేస్తాడు.’ అలాంటి తీర్పుకు వాళ్లు ఎందుకు పాత్రులో పౌలు సూటిగా ఇలా చెప్పాడు: ‘వాళ్లు సత్యవిషయమైన ప్రేమను అవలంభించలేదు.’ (2 థెస్స. 2:3, 8-10) మనం ఈ ప్రశ్నల గురించి ఆలోచించాలి: ‘సత్యాన్ని నేనెంతగా ప్రేమిస్తున్నాను? ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవుని ప్రజలకు అందుతున్న ఈ పత్రిక ద్వారా, మరితర బైబిలు ప్రచురణల ద్వారా వచ్చే కొత్త అవగాహనను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నానా?’

సహవాసులను జాగ్రత్తగా ఎంచుకోండి

7, 8. (ఎ) తొలి క్రైస్తవులను ఏ అపాయాలు వెంటాడాయి? (బి) నేటి నిజక్రైస్తవులకు ఏది పెద్ద అపాయం?

7 మతభ్రష్టుల వల్ల, వాళ్ల బోధల వల్ల వచ్చే అపాయాలే కాదు ఇతర అపాయాలు కూడా క్రైస్తవులను వెంటాడతాయి. “ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము” అని పౌలు తిమోతికి రాశాడు. “కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి” అని కూడా పౌలు చెప్పాడు. (1 తిమో. 6:10) “శరీరకార్యములు” కూడా పక్కలో బల్లెంలా అపాయకరమే.—గల. 5:19-21.

8 కొంతమంది తీవ్రమైన అనర్థాలకు కారణమౌతారని పౌలు థెస్సలొనీక క్రైస్తవులను ఎందుకు తీవ్రంగా హెచ్చరించాడో మీరు అర్థంచేసుకోవచ్చు. అలాంటి వాళ్లను “దొంగ అపొస్తలులు” అని పౌలు మరోచోట పిలిచాడు. వాళ్లలో “శిష్యులను తమవెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు” మనుషులు కూడా ఉన్నారు. (2 కొరిం. 11:4, 13; అపొ. 20:30) కొంతకాలం తర్వాత, యేసు ఎఫెసు సంఘాన్ని అభినందించాడు, ఎందుకంటే వాళ్లు ‘దుష్టులను సహించలేదు.’ ఆ ఎఫెసీయులు దొంగ అపొస్తలులను “పరీక్షించి వారు అబద్ధికులని” కనుగొన్నారు. (ప్రక. 2:2) ఆసక్తికరమైన విషయమేమిటంటే థెస్సలొనీకయులకు రాసిన రెండవ పత్రికలో పౌలు వాళ్లకిలా ఉపదేశమిచ్చాడు: “సహోదరులారా, మావలన పొందిన బోధన ప్రకారముకాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్దనుండి తొలగిపోవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము.” తర్వాత ఆయన ‘పనిచేయడానికి’ ఇష్టపడని క్రైస్తవుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. (2 థెస్స. 3:6, 10) అలాంటివాళ్లే అక్రమంగా నడుచుకునే వాళ్లయితే, మతభ్రష్టత్వంవైపు అడుగులేసే వాళ్లు ఇంకెన్నిరెట్లు అక్రమమైన వాళ్లో ఆలోచించండి! అవును, అలాంటి వాళ్లతో సహవాసం చేయడం ఆ కాలంలో చాలా ప్రమాదకరం, అలాంటి వాళ్లకు అప్పటి క్రైస్తవులు దూరంగా ఉన్నారు. మన కాలానికి కూడా అది వర్తిస్తుంది.—సామె. 13:20.

9. ఎవరైనా బైబిల్లో లేని విషయాల గురించి ఊహాగానాలు చేస్తుంటే లేదా యెహోవా సంస్థ గురించి విమర్శిస్తుంటే మనం ఎందుకు జాగ్రత్తగా ఉండాలి?

9 మహాశ్రమలు విరుచుకుపడే, ఈ దుష్ట వ్యవస్థ నాశనమయ్యే సమయం దగ్గరపడింది, కాబట్టి తొలి క్రైస్తవులకు ఇచ్చిన ఆ ప్రేరేపిత హెచ్చరికలు మనకు కూడా ఎంతో ప్రాముఖ్యమైనవి. యెహోవా ‘కృపను వ్యర్థం చేసుకోవాలని’ గానీ, నిత్యం జీవించే అవకాశాన్ని కోల్పోవాలని గానీ మనం ఏ మాత్రం కోరుకోం. (2 కొరిం. 6:1) సంఘ కూటాలకు హాజరౌతున్న వారెవరైనా, బైబిల్లో లేని విషయాల గురించి ఊహాగానాలు చేసేలా లేదా పెద్దల గురించి, ఇతర దేవుని సేవకుల గురించి విమర్శించేలా మనల్ని పురికొల్పుతుంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.—2 థెస్స. 3:13-15.

నేర్చుకున్నవాటిని గట్టిగా పట్టుకొని ఉండండి

10. ఏ బోధలకు అంటిపెట్టుకుని ఉండమని పౌలు థెస్సలొనీకయులకు విజ్ఞప్తి చేశాడు?

10 “నిలుకడగా ఉండి” నేర్చుకున్న వాటికి అంటిపెట్టుకుని ఉండమని పౌలు థెస్సలొనీకలోని తన సహోదరులకు విజ్ఞప్తి చేశాడు. (2 థెస్సలొనీకయులు 2:15 చదవండి.) ఏ బోధలకు అంటిపెట్టుకుని ఉండమని పౌలు వాళ్లకు చెప్పాడు? పౌలు ఇక్కడ అబద్ధమత బోధల గురించి మాట్లాడడం లేదుగానీ, యేసు నేర్పించిన బోధల గురించి, అలాగే తనను, ఇతరులను ప్రేరేపించి దేవుడు రాయించిన బోధల గురించి మాట్లాడుతున్నాడు. పౌలు కొరింథు సంఘంలోని తోటి సహోదరులను మెచ్చుకుంటూ, “మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసికొనుచు, నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారు” అని రాశాడు. (1 కొరిం. 11:2) నిజానికి ఆ బోధలు యెహోవా నుండి, ఆయన కుమారుని నుండి వచ్చాయి కాబట్టి, వాటిని పూర్తిగా నమ్మవచ్చు.

11. మోసం కొంతమందిపై ఏయే రకాలుగా ప్రభావం చూపించవచ్చు?

11 ఓ క్రైస్తవుడు ఏ రెండు విధానాల్లో విశ్వాసాన్ని కోల్పోయి, యెహోవా పట్ల యథార్థతను పోగొట్టుకుంటాడో హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు రాశాడు. (హెబ్రీయులు 2:1; 3:12 చదవండి.) యెహోవా నుండి ‘కొట్టుకొనిపోవడం’ గురించి, ఆయనను ‘విడిచిపెట్టిపోవడం’ గురించి పౌలు రాశాడు. ఓ పడవ తీరం నుండి కొట్టుకొనిపోతుందని గుర్తించడం కష్టం. ఎందుకంటే అది తీరం నుండి నెమ్మదినెమ్మదిగా, అంతకంతకూ దూరంగా వెళ్తుంది. మరోవైపున, ఒక వ్యక్తి కావాలనే తన పడవను తీరం నుండి నీళ్లలోకి నెట్టే అవకాశం ఉంది. ఓ వ్యక్తి మోసంలో చిక్కుకుని, సత్యం మీద తన నమ్మకాన్ని బలహీనపర్చుకుంటే ఏమి జరుగుతుందో ఈ రెండు ఉదాహరణలు చక్కగా చూపిస్తాయి.

12. ఎలాంటి కార్యకలాపాలు మన ఆధ్యాత్మికతను దెబ్బతీయవచ్చు?

12 థెస్సలొనీకలోని కొంతమంది విషయంలో అదే జరిగివుండవచ్చు. మరి నేటి సంగతేమిటి? సమయాన్ని హరించివేసే పనులే మన చుట్టూరా ఉన్నాయి. కొన్ని రకాల హాబీల కోసం, సోషల్‌ నెట్‌వర్కింగ్‌ కోసం, ఈ-మెయిల్స్‌ చదివి వాటికి జవాబివ్వడం కోసం, క్రీడల తాజా సమాచారం తెలుసుకోవడం కోసం ఎన్ని గంటలు వెచ్చించాలో ఆలోచించండి! వీటిలో ఏదైనా, ఓ క్రైస్తవుని దృష్టి మళ్లించి, ఆయన ఉత్సాహాన్ని నీరుగార్చవచ్చు. ఫలితం? హృదయపూర్వకంగా ప్రార్థించడం, దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం, కూటాలకు హాజరవడం, సువార్త ప్రకటించడం వంటివాటి కోసం సమయం మిగలకపోవచ్చు. త్వరపడి చంచల మనస్కులు కాకుండా ఉండాలంటే మనం ఏమి చేయాలి?

‘చంచల మనస్కులం’ కాకుండా కాపుదల

13. బైబిలు ముందే చెప్పినట్లుగా, చాలామంది వైఖరి ఎలా ఉంది? మన విశ్వాసం బలహీనం కాకుండా ఏది కాపాడుతుంది?

13 సాతాను లోకానికి అంతం సమీపించిందనే విషయాన్ని మనం మనసులో ఉంచుకోవాలి, దానితోపాటు ‘అంత్యదినాల్లో’ జీవిస్తున్నామని ఒప్పుకోని వాళ్లతో స్నేహం ఎంత ప్రమాదకరమో గుర్తుపెట్టుకోవాలి. అంత్యదినాల గురించి అపొస్తలుడైన పేతురు ఇలా రాశాడు: “అంత్యదినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి, తమ స్వకీయ దురాశలచొప్పున నడుచుకొనుచు, —ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయెను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచి యున్నదే అని చెప్పుదురు.” (2 పేతు. 3:3, 4) దేవుని వాక్యాన్ని ప్రతీరోజు చదవడం వల్ల, అధ్యయనం చేయడం వల్ల మనం ‘అంత్యదినాల్లో’ జీవిస్తున్నామనే సంగతి మర్చిపోకుండా ఉంటాం. బైబిలు ముందే చెప్పిన భ్రష్టత్వం చాలాకాలం క్రితమే పుట్టుకొచ్చింది, అది మనకాలంలో కూడా ఉంది. “ధర్మవిరోధి” ఇంకా ఉనికిలోనే ఉన్నాడు, దేవుని సేవకులను వ్యతిరేకిస్తూనే ఉన్నాడు. అందుకే మనం యెహోవా దినం దగ్గర్లో ఉందని గుర్తుపెట్టుకుని మరింత అప్రమత్తంగా ఉండాలి.—జెఫ. 1:7.

సరిగ్గా సిద్ధపడడం వల్ల, పరిచర్యలో పాల్గొనడం వల్ల త్వరపడి చంచల మనస్కులం కాకుండా ఉండగలుగుతాం (14, 15 పేరాలు చూడండి)

14. దేవుని సేవలో నిమగ్నమై ఉండడం ఎలా కాపుదలగా ఉంటుంది?

14 చంచల మనస్కులం కాకుండా ఉండడానికి, రాజ్య సువార్త ప్రకటించే పనిలో క్రమంగా పాల్గొనడమే విరుగుడు. అందుకే, సంఘ శిరస్త్సెన యేసుక్రీస్తు, “సమస్త జనులను శిష్యులనుగా చేయుడి . . . నేను మీకు ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి” అని తన అనుచరులకు చెప్పినప్పుడు నిజానికి ఆయన వాళ్ల క్షేమం కోసమే ఆ పని అప్పగించాడు. (మత్త. 28:19, 20) ఆయన నిర్దేశానికి లోబడాలంటే మనం ప్రకటనాపనిలో ఉత్సాహంగా పాల్గొనాలి. థెస్సలొనీకలోని మన సహోదరులు ప్రకటనా పనిని నామమాత్రంగా, ఏదో చేయాలి కదా అన్నట్టు చేశారా? పౌలు వాళ్లకు చెప్పిన ఈ మాటల్ని గుర్తుచేసుకోండి: “ఆత్మను ఆర్పకుడి. ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి.” (1 థెస్స. 5:19, 20) నిజంగా ఎంతటి ఉత్తేజకరమైన ప్రవచనాలను మనం అధ్యయనం చేస్తూ, ప్రజలతో పంచుకుంటున్నామో కదా!

15. కుటుంబ ఆరాధనలో ఎలాంటి విషయాలు చర్చించవచ్చు?

15 అలాగే, మన ఇంట్లోవాళ్లు కూడా పరిచర్యలో తమ సామర్థ్యం పెంచుకునేలా మనం సహాయం చేయాలనుకుంటాం. కుటుంబ ఆరాధనలో కొంత సమయాన్ని పరిచర్య గురించి వెచ్చించడం అందుకు ఓ చక్కని మార్గమని చాలామంది సహోదరసహోదరీలు తెలుసుకున్నారు. పరిచర్యలో ఆసక్తి చూపించిన వాళ్లకు సహాయం చేయడానికి ఎలా సిద్ధపడాలో మీరు చర్చించవచ్చు. పునర్దర్శనంలో ఏ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నారు? పునర్దర్శనంలో ఏయే అంశాలు మాట్లాడడం వల్ల గృహస్థుల ఆసక్తిని రేకెత్తించవచ్చు? ఎప్పుడు పునర్దర్శనాలు చేయడం చాలా మంచిది? చాలామంది కుటుంబ ఆరాధనలో కొంత సమయాన్ని సంఘకూటాలకు సిద్ధపడేందుకు కూడా ఉపయోగిస్తారు. కూటాలకు సిద్ధపడేందుకు, వాటిలో భాగంవహించేందుకు మీరు మరింతగా కృషి చేయగలరా? కూటాల్లో వ్యాఖ్యానించడం వల్ల మీరు విశ్వాసంలో బలపడి, చంచల మనస్కులు కాకుండా ఉండగలుగుతారు. (కీర్త. 35:18) అవును, కుటుంబ ఆరాధన మిమ్మల్ని ఊహాగానాల నుండి, సందేహాల నుండి కాపాడుతుంది.

16. ఆలోచనా సామర్థ్యాన్ని కాపాడుకున్నందుకు అభిషిక్తులకు ఎలాంటి బహుమతి దక్కనుంది?

16 సంవత్సరాలు గడుస్తుండగా బైబిలు ప్రవచనాలను మనం మరింత మెరుగ్గా అర్థం చేసుకునేలా యెహోవా ఆశీర్వదించాడు. ఆ విషయాన్ని ఆలోచించినప్పుడు ముందుముందు మనకోసం ఎంతగొప్ప ప్రతిఫలం వేచివుందో అర్థంచేసుకుంటాం. అభిషిక్తులకు పరలోకంలో క్రీస్తుతోపాటు పరిపాలించే నిరీక్షణ ఉంది. తమ ఆలోచనా సామర్థ్యాన్ని కాపాడుకున్నందుకు వాళ్లకు ఎంతటి బహుమతి దక్కనుందో కదా! థెస్సలొనీకయులకు పౌలు చెప్పిన ఈ మాటలు వాళ్లకు సరిగ్గా సరిపోతాయి: ‘ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుటవలనను, మీరు సత్యమును నమ్ముట వలనను, దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమై ఉన్నాము.’—2 థెస్స. 2:13.

17. రెండవ థెస్సలొనీకయులు 3:1-5 వచనాల్లో మనకు ఎలాంటి ప్రోత్సాహం ఉంది?

17 అలాగే, భూమ్మీద నిత్యం జీవించే రోజు కోసం ఎదురుచూస్తున్న వాళ్లు కూడా త్వరపడి చంచల మనస్కులు కాకుండా ఉండడానికి కృషిచేయాలి. మీకు భూపరదైసు నిరీక్షణ ఉంటే, పౌలు థెస్సలొనీకలోని తన తోటి అభిషిక్తులకు ప్రేమతో ఇచ్చిన ప్రోత్సాహాన్ని మనసులో ఉంచుకోండి. (2 థెస్సలొనీకయులు 3:1-5 చదవండి.) పౌలు ఆ మాటల్లో వ్యక్తం చేసిన మనోభావాల పట్ల మనం ఎంతో కృతజ్ఞత చూపిస్తాం. అవును, థెస్సలొనీకయులకు పౌలు రాసిన రెండు పత్రికలు ఊహాగానాల విషయంలో, తప్పుడు అభిప్రాయాల విషయంలో గట్టి హెచ్చరికలు ఇస్తున్నాయి. అంతానికి అతి దగ్గర్లో జీవిస్తున్న నేటి క్రైస్తవులందరూ ఆ హెచ్చరికలను ఎంతో అమూల్యంగా ఎంచుతారు.

a మనం అపొస్తలుల కార్యములు 20:29, 30లో చూస్తున్నట్లుగా, “శిష్యులను తమవెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు” క్రైస్తవ సంఘంలోనే బయలుదేరతారని పౌలు స్పష్టంగా చెప్పాడు. కాలం గడుస్తుండగా మతనాయకుల వర్గం పుట్టుకొచ్చిందని చరిత్ర నిరూపిస్తుంది. సా.శ. 3వ శతాబ్దానికల్లా, క్రైస్తవమత సామ్రాజ్యంలోని మతనాయకుల వర్గం రూపంలో “ధర్మవిరోధి” బయటపడ్డాడు.—కావలికోట 1990, సెప్టెంబరు 1 సంచికలోని 12-16 పేజీలు చూడండి.