కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఇది ‘మీకు జ్ఞాపకార్థంగా’ ఉండాలి

ఇది ‘మీకు జ్ఞాపకార్థంగా’ ఉండాలి

“ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండుగగా దాని నాచరింపవలెను.”​—నిర్గ. 12:14.

1, 2. క్రైస్తవులందరూ ఏ వార్షికోత్సవం గురించి తెలుసుకోవాలి? ఎందుకు?

 వార్షికోత్సవాల గురించి ఆలోచించినప్పుడు, ఏది మీకు వెంటనే గుర్తుకొస్తుంది? “మా వివాహ వార్షికోత్సవం” అని ఓ పెళ్లయిన వ్యక్తి చెప్పొచ్చు. ఇంకొంతమందికి, దేశమంతా వేడుకగా జరుపుకునే స్వాతంత్ర్య దినోత్సవంలాంటి చారిత్రక ఘట్టం గుర్తుకురావచ్చు. అయితే, 3,500 సంవత్సరాల కన్నా ఎక్కువకాలం ప్రజలు జరుపుకున్న ఓ జాతీయ వార్షికోత్సవం గురించి మీకు తెలుసా?

2 అదే పస్కా ఆచరణ. ప్రాచీన ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వం నుండి విడుదలౌతున్న సందర్భంలో దాన్ని ఆచరించారు. ఆ ఆచరణ మీకు కూడా ప్రాముఖ్యమైనదే. ఎందుకు? ఎందుకంటే, అది మీ జీవితంలోని కొన్ని అతి ముఖ్యమైన అంశాలతో ముడిపడి ఉంది. ‘పస్కాను యూదులు ఆచరిస్తారు, కానీ నేను యూదుణ్ణి కాదుగా. అలాంటప్పుడు, ఆ వార్షికోత్సవం గురించి నేనెందుకు తెలుసుకోవాలి’ అని మీరనవచ్చు. దానికి జవాబు, “క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను” అనే ప్రాముఖ్యమైన మాటల్లో ఉంది. (1 కొరిం. 5:7) ఆ మాటలను సరిగ్గా అర్థంచేసుకోవాలంటే, మనం యూదుల పస్కా గురించి మరింతగా తెలుసుకోవాలి. అంతేకాక క్రైస్తవులందరికీ ఇచ్చిన ఓ ఆజ్ఞకు, ఆ వార్షికోత్సవానికి మధ్యవున్న సంబంధం ఏమిటో తెలుసుకోవాలి.

ఇశ్రాయేలీయులు పస్కాను ఎందుకు ఆచరించారు?

3, 4. మొట్టమొదటి పస్కాకు ముందు ఏమి జరిగిందో వివరించండి.

3 యూదులుకాని కోట్లాదిమందికి కూడా మొట్టమొదటి పస్కాకు ముందు జరిగిన సంఘటన గురించి కాస్తోకూస్తో తెలుసు. వాళ్లు బైబిల్లోని నిర్గమకాండములో బహుశా దానిగురించి చదివివుంటారు లేదా ఓ కథగా దానిగురించి వినివుంటారు లేదా ఆ సంఘటన ఆధారంగా తీసిన సినిమా చూసివుంటారు.

4 ఎన్నో ఏళ్లుగా ఐగుప్తు బానిసత్వంలో మగ్గుతున్న ఇశ్రాయేలీయులను విడుదల చేయమని ఫరోను అడగడానికి యెహోవా మోషేను, అహరోనును పంపించాడు. అయితే, గర్విష్ఠియైన ఆ ఐగుప్తు రాజు ఇశ్రాయేలీయులను విడిచిపెట్టలేదు. దాంతో యెహోవా ఆ దేశం మీదకు నాశనకరమైన తెగుళ్లు రప్పించాడు. చివరిగా, దేవుడు పదో తెగులును రప్పించి ఐగుప్తులోని మొదటి సంతానాన్ని చంపడంతో ఫరో వాళ్లను విడిచిపెట్టాడు.—నిర్గ. 1:11; 3:9, 10; 5:1, 2; 11:1, 5.

5. ఇశ్రాయేలీయులు విడుదల పొందడానికి ముందు ఏమి చేయాల్సివుంది? (ప్రారంభ చిత్రం చూడండి.)

5 అయితే, ఇశ్రాయేలీయులు విడుదల పొందడానికి ముందు ఏమి చేయాల్సివుంది? అది సా.శ.పూ. 1513 వసంత కాలం, అబీబు నెల. ఆ నెలనే తర్వాత నీసాను అని పిలుస్తున్నారు. a ఇశ్రాయేలీయులు, నీసాను 14న చేయాల్సిన కొన్ని పనుల కోసం ఆ నెల పదవ రోజు నుండే సిద్ధపడడం మొదలుపెట్టాలని దేవుడు చెప్పాడు. నీసాను 14వ రోజు, సూర్యాస్తమయంతో మొదలౌతుంది. ఎందుకంటే, అప్పట్లో సూర్యాస్తమయం నుండి సూర్యాస్తమయం వరకు ఓ రోజుగా లెక్కించేవాళ్లు. నీసాను 14న, ప్రతీ కుటుంబం ఒక మగ గొర్రెను లేక మేకను వధించి ఆ రక్తాన్ని ‘ఇళ్ల ద్వారబంధపు నిలువు కమ్ముల మీద, పైకమ్మి మీద చల్లాలి.’ (నిర్గ. 12:3-7, 22, 23) తర్వాత వాళ్లు కాల్చిన మాంసాన్ని పులియని రొట్టెలతో, చేదుకూరలతో కలిపి తినాలి. ఆ తర్వాత, దేవుని దూత దేశంలో సంచరించి, ఐగుప్తీయుల మొదటి సంతానాన్ని సంహరిస్తాడు. అయితే, దేవుని మాటకు విధేయులైన ఇశ్రాయేలీయులు మాత్రం భద్రంగా ఉండి విడుదల పొందుతారు.—నిర్గ. 12:8-13, 29-32.

6. పస్కా పండుగను తర్వాతి కాలాల్లోని దేవుని ప్రజలు ఎలా దృష్టించాలి?

6 సరిగ్గా అలాగే జరిగింది, ఇశ్రాయేలీయులు తమ విడుదలను తర్వాతి ఏళ్లలో జ్ఞాపకం చేసుకోవాల్సివుంది. దేవుడు వాళ్లకిలా చెప్పాడు: “కాబట్టి యీ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండుగగా దాని నాచరింపవలెను; తరతరములకు నిత్యమైన కట్టడగా దాని నాచరింపవలెను.” నీసాను 14ను ఆచరించిన తర్వాత వాళ్లు మరో ఏడు దినముల పండుగను ఆచరించాల్సివుంది. అసలు పస్కా పండుగ నీసాను 14నే అయినా, పస్కా అనే పేరు ఆ ఎనిమిది రోజులపాటు జరిగే పండుగకు కూడా వర్తించవచ్చు. (నిర్గ. 12:14-17; లూకా 22:1; యోహా. 18:28; 19:14) హెబ్రీయులు ప్రతీ సంవత్సరం తప్పకుండా ఆచరించాల్సిన ‘సాంవత్సరిక ఉత్సవాల్లో’ లేదా వార్షికోత్సవాల్లో పస్కా పండుగ ఒకటి.—2 దిన. 8:13, పవిత్ర గ్రంథము, కతోలిక అనువాదము.

7. చివరి పస్కాను ఆచరించిన తర్వాత యేసు ఏ కొత్త ఆచరణను స్థాపించాడు?

7 మోషే ధర్మశాస్త్రం పాటించే యూదులుగా యేసు, ఆయన అపొస్తలులు పస్కా వార్షికోత్సవాన్ని ఆచరించారు. (మత్త. 26:17-19) వాళ్లు చివరిసారి దాన్ని ఆచరించినప్పుడు యేసు ఓ కొత్త ఆచరణను స్థాపించాడు, అదే ప్రభువు రాత్రి భోజనం. దాన్ని ఆయన అనుచరులు ప్రతీ సంవత్సరం ఆచరించాలి. కానీ, సరిగ్గా ఏ రోజున దాన్ని ఆచరించాలి?

ప్రభువు రాత్రి భోజనం—ఏ రోజు?

8. పస్కా గురించి, ప్రభువు రాత్రి భోజనం గురించి పరిశీలిస్తున్నప్పుడు ఏ ప్రశ్న తలెత్తుతుంది?

8 యేసు తన చివరి పస్కా తర్వాత ప్రభువు రాత్రి భోజనాన్ని స్థాపించాడు కాబట్టి, ఈ కొత్త ఆచరణను కూడా పస్కా ఆచరణ రోజే చేయాలి. అయితే, నేటి క్యాలెండర్లలోని యూదుల పస్కా తేదీకి, మనం ఆచరించే ప్రభువు రాత్రి భోజనం తేదీకి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రోజుల తేడా ఉందని మీరు గమనించివుంటారు. ఎందుకు ఆ తేడా? ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలో ఆ ప్రశ్నకు కొంతమేర జవాబుంది. ‘ఇశ్రాయేలు సమాజపు వారందరు తమతమ కూటములలో . . . [గొర్రెపిల్లను] చంపాలి’ అని చెప్పాక నీసాను 14వ రోజున ఏ సమయంలో వాళ్లు ఆ పని చేయాలో కూడా మోషే నొక్కిచెప్పాడు.—నిర్గమకాండము 12:6, 7 చదవండి.

9. నిర్గమకాండము 12:7 వ వచనం ప్రకారం పస్కా గొర్రెపిల్లను ఎప్పుడు వధించాలి?

9 గొర్రెపిల్లను “సాయంకాలమందు” వధించాలని నిర్గమకాండము 12:7వ వచనం చెబుతుంది. యూదుల తనఖ్‌లో, మరితర బైబిలు అనువాదాల్లో “పొద్దుగ్రుంకే వేళ” అని ఉపయోగించారు. కాబట్టి, గొర్రెపిల్లను నీసాను 14వ తేదీ ఆరంభంలో, సూర్యుడు అస్తమించాక కొంచెం వెలుతురు ఉన్నప్పుడే వధించాలి.

10. గొర్రెపిల్లను ఎప్పుడు వధించాలని కొంతమంది అంటారు? అయితే ఆ విషయంలో ఏ ప్రశ్న తలెత్తుతుంది?

10 ఆలయానికి తెచ్చిన గొర్రెలన్నిటినీ వధించడానికి చాలా గంటలు పడుతుందని తర్వాతి కాలాల్లోని కొంతమంది యూదులు అనుకున్నారు. దాంతో, నిర్గమకాండము 12:7వ వచనం నీసాను 14 ముగింపును, అంటే మధ్యాహ్నం సూర్యుడు దిగిపోవడం మొదలుపెట్టి, పూర్తిగా అస్తమించడానికి మధ్య ఉన్న సమయాన్ని సూచిస్తుందని వాళ్లు అర్థంచేసుకున్నారు. ఒకవేళ అదే నిజమైతే, వాళ్లు పస్కా భోజనాన్ని ఎప్పుడు తినివుంటారు? ప్రాచీన యూదామత పండితుడైన ప్రొఫెసర్‌ జొనాథన్‌ క్లావన్స్‌ ఇలా చెప్పాడు: “సూర్యుడు అస్తమించడంతో కొత్త రోజు ప్రారంభమౌతుంది, కాబట్టి వాళ్లు నీసాను 14న బలి అర్పించేవాళ్లు కానీ, అసలు పస్కా ఆచరణ, భోజనం వంటివి 15న చేసేవాళ్లు. అయితే, నిర్గమకాండములో ఈ తేదీల క్రమం గురించిన ప్రస్తావన లేదు.” సా.శ. 70లో యెరూషలేము దేవాలయం నాశనమవ్వడానికి ముందు పస్కా భోజనాన్ని ఎలా ఆచరించేవాళ్లో రబ్బీల సాహిత్యం ఏమి చెప్పడం లేదని కూడా ఆయన చెప్పాడు.—ఇటాలిక్కులు మావి.

11. (ఎ) సా.శ. 33 పస్కా రోజున యేసు ఏమేమి చేశాడు, ఏమి ఎదుర్కొన్నాడు? (బి) సా.శ. 33, నీసాను 15వ తేదీ ఎందుకు “మహా” విశ్రాంతి దినము అయ్యింది? (అథఃస్సూచి చూడండి.)

11 మరైతే, సా.శ. 33లో జరిగిన పస్కా సంగతేంటనే ప్రశ్న మీకు రావచ్చు? పస్కాకు ముందు రోజైన నీసాను 13న పేతురు, యోహానులకు క్రీస్తు ఇలా చెప్పాడు: “మీరు వెళ్లి మనము భుజించుటకై పస్కాను మనకొరకు సిద్ధపరచుడి.” (లూకా 22:7, 8) నీసాను 14 గురువారం సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పస్కా భోజనం చేసే ‘గడియ వచ్చింది.’ యేసు తన అపొస్తలులతో పస్కా భోజనం చేసి, ఆ తర్వాత ప్రభువు రాత్రి భోజనాన్ని స్థాపించాడు. (లూకా 22:14, 15) ఆ రాత్రి యేసును బంధించి, విచారణ చేశారు. నీసాను 14న, మధ్యాహ్నం దగ్గరపడుతున్న సమయంలో ఆయనను మ్రానుమీద వేలాడదీశారు, అదే రోజు మధ్యాహ్నం యేసు చనిపోయాడు. (యోహా. 19:14) అలా, పస్కా గొర్రె వధించబడే రోజే “క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను.” (1 కొరిం. 5:7; 11:23; మత్త. 26:2) నీసాను 15 ప్రారంభం కావడానికి ముందే అంటే నీసాను 14వ తేదీ చివర్లోనే యేసు సమాధి చేయబడ్డాడు. bలేవీ. 23:5-7; లూకా 23:54.

ఆ జ్ఞాపకార్థ దినం వల్ల మీకూ ప్రయోజనమే

12, 13. యూదుల పిల్లలు ఎలా పస్కా ఆచరణలో భాగమై ఉన్నారు?

12 మనం ఐగుప్తులో జరిగిన సంఘటన దగ్గరికి మళ్లీ వెళ్దాం. దేవుని ప్రజలు ముందుముందు కూడా పస్కాను ఆచరించాలని మోషే చెప్పాడు. అది వాళ్లకు “నిరంతరము . . . కట్టడగా” ఉండాలి. ప్రతీ సంవత్సరం పస్కాను ఆచరించేటప్పుడు, దాన్ని ఎందుకు ఆచరించాలో చెప్పమని పిల్లలు తమ తల్లిదండ్రులను అడిగేవాళ్లు. (నిర్గమకాండము 12:24-27 చదవండి; ద్వితీ. 6:20-23) అలా పస్కాపండుగ పిల్లలకు కూడా ఓ “జ్ఞాపకార్థ” దినమే.—నిర్గ. 12:14.

13 కొత్త తరం పిల్లలు పెరిగి పెద్దవుతున్నప్పుడు తండ్రులు వాళ్లకు ప్రాముఖ్యమైన పాఠాలు నేర్పించేవాళ్లు. తన ఆరాధకులను కాపాడే శక్తి యెహోవాకు ఉందనేది అందులో ఒకటి. యెహోవా నిజమైన, సజీవుడైన దేవుడని, తన ప్రజలను పట్టించుకుంటూ వాళ్ల తరఫున చర్య తీసుకునే దేవుడని పిల్లలు అర్థం చేసుకున్నారు. “ఐగుప్తీయులను హతము” చేసి, ఇశ్రాయేలీయుల ప్రథమ సంతానాన్ని సజీవంగా కాపాడి ఆయన ఆ విషయాన్ని నిరూపించుకున్నాడు.

14. తమ పిల్లలు ఏ విషయాన్ని అర్థంచేసుకోవడానికి తల్లిదండ్రులు పస్కా వృత్తాంతాన్ని ఉపయోగించవచ్చు?

14 క్రైస్తవ తల్లిదండ్రులారా, మీ పిల్లలకు ప్రతీ సంవత్సరం పస్కా గురించి చెప్పమని దేవుడు ఆజ్ఞాపించలేదు. కానీ ఇశ్రాయేలీయులు తమ పిల్లలకు నేర్పించినట్లే, దేవుడు తన ప్రజల్ని కాపాడతాడనే పాఠాన్ని మీరు మీ పిల్లలకు నేర్పిస్తున్నారా? యెహోవా ఇప్పటికీ తన ప్రజల్ని కాపాడే నిజమైన సంరక్షకుడని మీరు నమ్ముతున్నట్లు మీ పిల్లలు స్పష్టంగా చూడగలుగుతున్నారా? (కీర్త. 27:11; యెష. 12:2) మీరు ఆ విషయాన్ని ఉపన్యాసంలా కాకుండా, ఆహ్లాదకరంగా సాగే సంభాషణ రూపంలో మీ పిల్లలకు చెబుతున్నారా? మీ కుటుంబం యెహోవాపై మరింత నమ్మకం పెంచుకోవడానికి ఆ పాఠం సహాయం చేస్తుంది.

పస్కా గురించి చర్చించేటప్పుడు మీ పిల్లలు ఏ పాఠాలు నేర్చుకునేలా మీరు సహాయం చేయవచ్చు? (14వ పేరా చూడండి)

15, 16. పస్కా, నిర్గమకాండములోని ఇతర వృత్తాంతాలు యెహోవా గురించి ఏ విషయాన్ని నొక్కిచెబుతాయి?

15 యెహోవాకు తన ప్రజల్ని కాపాడే శక్తి ఉందని మాత్రమే పస్కా ఆచరణ తెలియజేయడం లేదు. ఆయన వాళ్లను ‘ఐగుప్తు నుండి బయటికి రప్పించి,’ విడుదల చేశాడు. దాని కోసం ఆయన ఏమేమి చేశాడో ఆలోచించండి. యెహోవా మేఘ స్తంభం ద్వారా, అగ్ని స్తంభం ద్వారా వాళ్లను నడిపించాడు. ఎర్ర సముద్రం రెండు పాయలుగా విడిపోయినప్పుడు ఆరిన నేలమీద వాళ్లు నడిచారు. వాళ్లు క్షేమంగా ఆ సముద్రాన్ని దాటిన తర్వాత ఐగుప్తు సైన్యాలను ఆ నీళ్లు ముంచేయడం చూశారు. విడుదలైన ఇశ్రాయేలీయులు తర్వాత గళమెత్తి ఇలా పాడారు: “యెహోవానుగూర్చి గానముచేసెదను . . . గుఱ్ఱమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను. యెహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయెను.”—నిర్గ. 13:14, 21, 22; 15:1, 2; కీర్త. 136:11-15.

16 తల్లిదండ్రులారా, విమోచకునిగా యెహోవా మీద నమ్మకం పెంచుకునేలా మీ పిల్లలకు సహాయం చేస్తున్నారా? మీరు యెహోవాను విమోచకునిగా నమ్ముతున్నట్లు మీ మాటల ద్వారా, నిర్ణయాల ద్వారా వాళ్లకు చూపిస్తున్నారా? యెహోవా ఎలా తన ప్రజల్ని విడిపించాడో చూపించే నిర్గమకాండము 12-15 అధ్యాయాల్లోని వృత్తాంతాన్ని అలాగే అపొస్తలుల కార్యములు 7:30-36, దానియేలు 3:16-18, 26-28 వచనాల్లోని వృత్తాంతాలను మీరు మీ కుటుంబ ఆరాధనలో చర్చించవచ్చు. అవును యెహోవా తన ప్రజల్ని గతంలో విడిపించడం మాత్రమే కాదు భవిష్యత్తులో కూడా విడిపిస్తాడనే నమ్మకం పిల్లలమైనా, పెద్దలమైనా మనందరికీ ఉండాలి.—1 థెస్సలొనీకయులు 1:9, 10 చదవండి.

మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సినవి

17, 18. మొదటి పస్కాలో రక్తం ఉపయోగించిన విధానం మనకు ఏమి గుర్తుచేస్తుంది?

17 నిజ క్రైస్తవులు పస్కాను ఆచరించరు. ఆ వార్షికోత్సవం మోషే ధర్మశాస్త్రంలో భాగం, కానీ మనం ఆ ధర్మశాస్త్రం కింద లేము. (రోమా. 10:4; కొలొ. 2:13-16) బదులుగా, మనం దేవుని కుమారుని మరణాన్ని ప్రేమతో జ్ఞాపకం చేసుకుంటాం. అయినప్పటికీ, పస్కా ఆచరణలోని కొన్ని విషయాలు మనకు కూడా ప్రయోజనకరమే.

18 అప్పట్లో, గొర్రెపిల్ల రక్తాన్ని ద్వారబంధపు అడ్డకమ్మిల మీద నిలువుకమ్మి మీద చల్లడం వల్ల ప్రాణాలు దక్కాయి. నేడు, మనం పస్కా రోజున గానీ, మరో రోజున గానీ దేవునికి బలులు అర్పించం. కానీ, ప్రాణాల్ని నిరంతరం కాపాడే ఓ మెరుగైన బలి ఉంది. అపొస్తలుడైన పౌలు “పరలోకమందు వ్రాయబడియున్న జ్యేష్ఠుల సంఘము” గురించి రాశాడు. ఆ అభిషిక్త క్రైస్తవుల జీవాన్ని కాపాడేది యేసు ‘ప్రోక్షించిన రక్తమే.’ (హెబ్రీ. 12:23, 24) భూమ్మీద నిరంతరం జీవించాలనే నిరీక్షణ కలిగివున్న క్రైస్తవుల జీవాన్ని కాపాడేది కూడా ఆ రక్తమే. వాళ్లు ఎల్లప్పుడూ ఈ అభయాన్ని గుర్తుపెట్టుకోవాలి: “దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తమువలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది.”—ఎఫె. 1:7.

19. పస్కా గొర్రెపిల్లకు జరిగినదాన్ని పరిశీలిస్తే ప్రవచనాల మీద మన నమ్మకం ఎలా బలపడుతుంది?

19 ఇశ్రాయేలీయులు పస్కా భోజనం కోసం గొర్రెపిల్లను వధిస్తున్నప్పుడు ఒక్క ఎముకను కూడా విరువకూడదని యెహోవా చెప్పాడు. (నిర్గ. 12:46; సంఖ్యా. 9:11, 12) అయితే, విమోచన క్రయధనం చెల్లించిన “దేవుని గొఱ్ఱెపిల్ల” మాటేమిటి? (యోహా. 1:29) యేసును ఇద్దరు నేరస్తుల మధ్యలో మ్రానుకు వేలాడదీశారు. వాళ్ల ముగ్గురి ఎముకలు విరుగగొట్టించమని యూదులు పిలాతును అడిగారు. అలాచేస్తే వాళ్లు త్వరగా చనిపోతారు, దాంతో మహా విశ్రాంతి దినమైన నీసాను 15కు ముందే వాళ్ల దేహాలను మ్రాను మీదనుండి తీసేయడం వీలౌతుంది. సైనికులు ఇద్దరు నేరస్తుల కాళ్లు విరగ్గొట్టారు, కానీ “వారు యేసునొద్దకు వచ్చి, అంతకుముందే ఆయన మృతిపొంది యుండుట చూచి ఆయన కాళ్లు విరుగగొట్టలేదు.” (యోహా. 19:31-34) పస్కా గొర్రెపిల్ల విషయంలో చేసినదానికి అది సరిగ్గా సరిపోయింది. అలా, ఆ పస్కా గొర్రెపిల్ల ఒకవిధంగా సా.శ. 33, నీసాను 14న జరిగినదానికి “ఛాయ.” (హెబ్రీ. 10:1) అలాగే ఆ రోజు జరిగిన సంఘటనలు కీర్తనలు 34:20లోని మాటల్ని నెరవేర్చాయి. అది ప్రవచనాల మీద మన నమ్మకాన్ని బలపరుస్తుంది.

20. పస్కాకు, ప్రభువు రాత్రి భోజనానికి మధ్య ఉన్న ముఖ్యమైన తేడా ఏమిటి?

20 అయితే, పస్కాను యూదులు ఆచరించిన విధానానికి, ప్రభువు రాత్రి భోజనాన్ని యేసు అనుచరులు ఆచరించాల్సిన విధానానికి మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి. ఉదాహరణకు, ఐగుప్తులో ఇశ్రాయేలీయులు పస్కాను ఆచరించినప్పుడు గొర్రెపిల్ల మాంసాన్ని తిన్నారు గానీ దాని రక్తాన్ని తాగలేదు. అది యేసు తన శిష్యులకు చెప్పిన దానికి భిన్నంగా ఉంది. తనతోపాటు ‘దేవుని రాజ్యంలో’ పాలించబోయేవాళ్లు తన శరీరానికి, రక్తానికి ప్రతీకలుగా ఉన్న రొట్టెను తిని, ద్రాక్షారసాన్ని తాగాలని యేసు చెప్పాడు. తర్వాతి ఆర్టికల్‌లో మనం వీటి గురించి మరింత వివరంగా పరిశీలిస్తాం.—మార్కు 14:22-25.

21. పస్కా గురించి తెలుసుకోవడం ఎందుకు ప్రయోజనకరం?

21 అయినప్పటికీ, దేవుడు ఇశ్రాయేలీయులతో జరిపిన వ్యవహారాల్లో పస్కా కీలక పాత్ర పోషించింది. అది మనలో ప్రతీఒక్కరికి ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. అవును పస్కా, క్రైస్తవులకు కాదుగానీ యూదులకే ‘జ్ఞాపకార్థంగా’ ఉంది. అయినప్పటికీ, క్రైస్తవులమైన మనం దానిగురించి తెలుసుకుని, ‘దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనములో’ భాగమైన అది నేర్పించే కొన్ని ముఖ్యమైన పాఠాలను హృదయంలో పదిలంగా దాచుకోవాలి.—2 తిమో. 3:16.

a హెబ్రీ క్యాలెండరులోని మొదటి నెల పేరు అబీబు. ఇశ్రాయేలీయులు బబులోను చెర నుండి విడుదలైన తర్వాత దాన్నే నీసానుగా పిలిచారు. ఈ ఆర్టికల్‌ అంతట్లో మనం నీసాను అనే పేరును ఉపయోగిస్తాం.

b సూర్యాస్తమయం తర్వాత మొదలైన నీసాను 15వ తేదీ శనివారం కాబట్టి అది విశ్రాంతి దినం; పులియని రొట్టెల పండుగలోని మొదటి రోజును ఎల్లప్పుడూ విశ్రాంతి దినంగానే పరిగణిస్తారు. సా.శ. 33లో, ఈ రెండు విశ్రాంతి దినాలు ఒకే రోజు వచ్చాయి కాబట్టి అది “మహా” విశ్రాంతి దినం అయ్యింది.​—యోహాను 19:31, 42 చదవండి.