కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు రాజ్యం కోసం త్యాగాలు చేస్తారా?

మీరు రాజ్యం కోసం త్యాగాలు చేస్తారా?

“దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును.”​—2 కొరిం. 9:7.

1. చాలామంది ఎలాంటి త్యాగాలు చేస్తారు, ఎందుకు?

 తమకు ప్రాముఖ్యమైన వాటికోసం ప్రజలు ఎన్ని త్యాగాలు చేయడానికైనా వెనుకాడరు. తల్లిదండ్రులు తమ పిల్లల కోసం సమయాన్ని, డబ్బుని, శక్తిని ధారపోస్తారు. ఇక యువ క్రీడాకారుల విషయానికొస్తే, తమ తోటివాళ్లు సరదాల్లో మునిగి ఉంటే, వీళ్లు మాత్రం తమ దేశం తరఫున ఒలింపిక్‌ క్రీడల్లో పాల్గొనాలనే కోరికతో రోజుకు ఎన్నో గంటలు చెమటోడ్చి కఠోర సాధన చేస్తుంటారు. యేసు కూడా తనకు ప్రాముఖ్యమైన వాటికోసం త్యాగాలు చేశాడు. ఆయన సుఖభోగాల కోసం ప్రాకులాడలేదు, తనకంటూ సంతానం ఉండాలని కోరుకోలేదు. బదులుగా, రాజ్య సంబంధ విషయాలను వృద్ధి చేయడంపైనే దృష్టి నిలిపాడు. (మత్త. 4:17; లూకా 9:58) ఆయన అనుచరులు కూడా దేవుని రాజ్యానికి మద్దతివ్వడం కోసం ఎన్నో వదులుకున్నారు. దేవుని రాజ్యమే వాళ్లకు జీవితంలో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, అందుకే వాళ్లు దానికోసం ఎన్నో త్యాగాలు చేశారు. (మత్త. 4:18-22; 19:27) కాబట్టి, మనం ఇలా ప్రశ్నించుకోవాలి, ‘నా జీవితంలో ఏది అన్నిటికంటే ప్రాముఖ్యమైనది?’

2. (ఎ) నిజ క్రైస్తవులందరూ తప్పకుండా చేయాల్సిన కొన్ని త్యాగాలు ఏమిటి? (బి) కొంతమంది ఏ అదనపు త్యాగాలు కూడా చేయగలుగుతారు?

2 నిజ క్రైస్తవులందరూ తప్పకుండా చేయాల్సిన త్యాగాలు కొన్ని ఉన్నాయి. యెహోవాతో మంచి సంబంధం ఏర్పర్చుకోవాలన్నా, దాన్ని కాపాడుకోవాలన్నా అవి అవసరం. ప్రార్థన చేయడానికి, బైబిలు చదవడానికి, కుటుంబ ఆరాధన చేయడానికి, కూటాలకు-పరిచర్యకు హాజరవ్వడానికి మన సమయాన్ని, శక్తిని వెచ్చించడం ఆ త్యాగాల్లో కొన్ని. a (యెహో. 1:8; మత్త. 28:19, 20; హెబ్రీ. 10:24, 25) మన ప్రయత్నాల వల్ల, యెహోవా ఆశీర్వాదం వల్ల ప్రకటనా పని ఇంకా వృద్ధి చెందుతోంది, అంతేకాక ‘యెహోవా మందిర పర్వతానికి’ అనేకమంది ప్రవాహంలా వస్తున్నారు. (యెష. 2:2) రాజ్యసంబంధ పనులకు మద్దతివ్వడానికి చాలామంది ఎన్నో త్యాగాలు చేసి బెతెల్‌ సేవ చేయడం, రాజ్యమందిరాలను, సమావేశ హాళ్లను నిర్మించడం, సమావేశాలను ఏర్పాటుచేయడం, విపత్తులు వచ్చినప్పుడు సహాయక చర్యలను చేపట్టడం వంటివి చేస్తున్నారు. నిత్యజీవాన్ని సంపాదించుకోవడానికి ఈ పనులు తప్పనిసరి కాకపోయినా రాజ్యసంబంధమైన విషయాలకు మద్దతివ్వడానికి ఇవి కీలకం.

3. (ఎ) రాజ్యం కోసం త్యాగాలు చేయడం వల్ల మనమెలా ప్రయోజనం పొందుతాం? (బి) మనం ఏ ప్రశ్నలను పరిశీలించాలి?

3 రాజ్యానికి మరింతగా మద్దతివ్వడం మునుపటికన్నా ఇప్పుడు చాలా అవసరం. యెహోవా కోసం ఎంతోమంది ఇష్టంగా త్యాగాలు చేయడం చూస్తుంటే మనకు ఎంత ఆనందంగా ఉంటుందో కదా! (కీర్తనలు 54:5, 6 చదవండి.) దేవుని రాజ్యం కోసం ఎదురుచూస్తున్న మనం కూడా అలాంటి ఉదారస్ఫూర్తి చూపిస్తే ఎంతో ఆనందాన్ని పొందుతాం. (ద్వితీ. 16:15; అపొ. 20:35) అయితే, మనల్ని మనం నిజాయితీగా పరిశీలించుకోవాలి. మనం రాజ్యం కోసం త్యాగాలు చేయగల మార్గాలు ఇంకేమైనా ఉన్నాయా? మన సమయాన్ని, డబ్బుని, శక్తిసామర్థ్యాలను మనమెలా ఉపయోగిస్తున్నాం? మనం ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి? ఇష్టపూర్వకంగా త్యాగాలు చేసే విషయంలో కొన్ని ఉదాహరణల నుండి మనమేమి నేర్చుకోవచ్చో ఇప్పుడు పరిశీలించి, మన సంతోషాన్ని రెట్టింపు చేసుకుందాం.

ప్రాచీన ఇశ్రాయేలులో బలులు

4. ప్రాచీన ఇశ్రాయేలీయులు బలులు అర్పించడం వల్ల ఎలాంటి ప్రయోజనం పొందారు?

4 ప్రాచీన ఇశ్రాయేలులో, పాపక్షమాపణ పొందాలంటే బలులు తప్పనిసరి. ప్రజలు దేవుని అనుగ్రహం పొందాలన్నా బలులు అర్పించాలి. కొన్ని బలులను తప్పకుండా అర్పించాలి, మరికొన్ని స్వచ్ఛందంగా అర్పించవచ్చు. (లేవీ. 23:37, 38) దహనబలులను స్వేచ్ఛార్పణగా లేదా కానుకగా యెహోవాకు అర్పించవచ్చు. బలులు అర్పించే విషయంలో సాటిలేని ఉదాహరణను సొలొమోను రోజుల్లో ఆలయ ప్రతిష్ఠాపనప్పుడు చూడవచ్చు.​—2 దిన. 7:4-6.

5. బీదవాళ్ల కోసం యెహోవా ఏ ఏర్పాటు చేశాడు?

5 అందరూ ఒకే రకంగా బలులు అర్పించలేరని యెహోవా ప్రేమతో అర్థంచేసుకున్నాడు. తాము ఇవ్వగలిగిందే ఇవ్వమని ఆయన ఇశ్రాయేలీయులను అడిగాడు. జంతువుల రక్తాన్ని చిందించాలని ధర్మశాస్త్రం నిర్దేశించింది, ఆ ఏర్పాటు దేవుని కుమారుడైన యేసు ద్వారా ‘రాబోవుచున్న మేలుల ఛాయగా’ ఉంది. (హెబ్రీ. 10:1-4) అయితే ఆ ఆజ్ఞను అన్వయించే విషయంలో యెహోవా మరీ కఠినంగా లేడు. ఉదాహరణకు, ఒకవ్యక్తి గొఱ్ఱెపిల్లను లేదా కోడెను బలిగా అర్పించలేని స్థితిలో ఉంటే అతను తెల్ల గువ్వలనైనా యెహోవాకు బలిగా అర్పించవచ్చు. అలా, బీదవాళ్లు కూడా యెహోవాకు ఆనందంగా బలులు అర్పించడం సాధ్యమయ్యేది. (లేవీ. 1:3, 10, 14; 5:7) స్వేచ్ఛార్పణలు అర్పించే వ్యక్తి ఏ జంతువును అర్పించినప్పటికీ, అతని నుండి రెండు విషయాలు మాత్రం యెహోవా కోరేవాడు.

6. బలులు అర్పించే వ్యక్తి నుండి యెహోవా ఏమి కోరాడు? వాటిని పాటించడం ఎంత ప్రాముఖ్యం?

6 మొదటిది, ఆ వ్యక్తి శ్రేష్ఠమైనదే ఇవ్వాలి. తన ‘అంగీకారం’ పొందాలంటే ఏ దోషంలేని జంతువును బలిగా అర్పించాలని యెహోవా ఇశ్రాయేలీయులకు చెప్పాడు. (లేవీ. 22:18-20) లోపాలున్న జంతువులను బలి అర్పిస్తే, యెహోవా ఆ అర్పణను అంగీకరించడు. రెండవది, బలి అర్పించే వ్యక్తి పరిశుభ్రంగా, పవిత్రంగా ఉండాలి. అపవిత్రుడైన ఓ వ్యక్తి స్వేచ్ఛార్పణను అర్పించాలనుకుంటే, దానికి ముందు పాపపరిహారార్థ బలి లేదా అపరాధపరిహారార్థ బలిని అర్పించి యెహోవాతో తన బంధాన్ని పునరుద్ధరించుకోవాలి. (లేవీ. 5:5, 6, 15) యెహోవా ఈ విషయాన్ని తీవ్రంగా ఎంచేవాడు. అపవిత్రుడైన ఓ వ్యక్తి స్చేచ్ఛార్పణగా అర్పించే సమాధానబలిలో భాగం వహిస్తే అతన్ని ప్రజల్లో నుండి కొట్టివేయాలని ఆయన ఆజ్ఞాపించాడు. (లేవీ. 7:20, 21) మరోవైపున, యెహోవాతో మంచి సంబంధం కలిగివుండి, ఏ లోపంలేని జంతువును బలిగా అర్పించే వ్యక్తి ఆ బలివల్ల ఎంతో సంతోషంగా, సంతృప్తిగా ఉంటాడు.1 దినవృత్తాంతములు 29:9 చదవండి.

ఈ రోజుల్లో మనం చేసే త్యాగాలు

7, 8. (ఎ) రాజ్యం కోసం త్యాగాలు చేయడం వల్ల చాలామంది ఎలాంటి ఆనందాన్ని సొంతం చేసుకున్నారు? (బి) మనం రాజ్యం కోసం ఏయే వనరులను త్యాగం చేయవచ్చు?

7 నేడుకూడా చాలామంది యెహోవా సేవను మరింత ఎక్కువగా చేయడానికి స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు, అది చూసి యెహోవా ఎంతో సంతోషిస్తున్నాడు. మన సహోదరుల కోసం పనిచేయడం వల్ల ఎన్నో ఆశీర్వాదాలు వస్తాయి. రాజ్యమందిర నిర్మాణపనిలో, విపత్తు సహాయక పనుల్లో పాల్గొన్న ఓ సహోదరుడు, ఇలాంటి సేవ చేయడం వల్ల వచ్చే సంతృప్తిని మాటల్లో వర్ణించలేమని చెప్పాడు. ఆయనిలా అంటున్నాడు: “తమ కొత్త రాజ్యమందిరాల్లో తొలిసారి కలుసుకున్నప్పుడు లేదా విపత్తు సంభవించిన తర్వాత సహాయం పొందినప్పుడు సహోదరసహోదరీల ముఖాల్లో కనిపించే ఆనందం, కృతజ్ఞతా భావం చూస్తే మేము పడిన కష్టం, శ్రమ వృథా కాలేదనిపిస్తుంది.”

నేడు మనం చేస్తున్న త్యాగాల్లాగే, చాలా అర్పణలు స్వచ్ఛందంగా అర్పించేవి (7-13 పేరాలు చూడండి)

8 యెహోవా సంస్థ, రాజ్యానికి మద్దతిచ్చే అవకాశాల కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉంది. 1904లో, సహోదరుడు సి. టి. రస్సెల్‌ ఇలా రాశారు: ‘ప్రతి ఒక్కరూ తమ సమయం, పలుకుబడి, డబ్బు మొదలైనవాటి విషయంలో తమకుతామే ప్రభువు చేత నియమించబడిన గృహనిర్వాహకులమని అనుకోవాలి, వాటిని తమ చేతనైనంత మట్టుకు మన యజమానికి మహిమ తీసుకొచ్చేలా ఉపయోగించాలి.’ త్యాగాలు చేయడం వల్ల మనం ఎన్నో ఆశీర్వాదాలు పొందుతున్నా, వాటిని చేయాలంటే కొన్ని వదులుకోవాల్సి ఉంటుంది. (2 సమూ. 24:21-24) మనకున్న వనరుల్ని మనం మరింత శ్రేష్ఠంగా ఉపయోగించగలమా?

ఆస్ట్రేలియాలోని బెతెల్‌ సభ్యులు

9. సమయాన్ని ఉపయోగించే విషయంలో, లూకా 10:2-5 వచనాల్లో యేసు ఇచ్చిన ఏ సూత్రాన్ని మనం పాటించవచ్చు?

9 మన సమయం. మన సాహిత్యాన్ని అనువదించి ముద్రించడానికి, ఆరాధనా స్థలాలను నిర్మించడానికి, సమావేశాలను ఏర్పాటు చేయడానికి, విపత్తులు వచ్చినప్పుడు సహాయం చేయడానికి, మరితర అవసరమైన పనులు చేయడానికి ఎంతో సమయం, కృషి అవసరం. మనకు రోజుకు 24 గంటలు మాత్రమే ఉన్నాయి. అయితే యేసు ఇచ్చిన ఒక సూత్రం, సమయాన్ని సరిగ్గా ఉపయోగించడానికి మనకు సహాయం చేస్తుంది. పరిచర్య కోసం తన శిష్యులను పంపించేటప్పుడు, ‘త్రోవలో ఎవనినైనను కుశలప్రశ్నలు అడుగవద్దు’ అని యేసు వాళ్లకు చెప్పాడు. (లూకా 10:2-5) యేసు అలాంటి నిర్దేశం ఎందుకిచ్చాడు? ఒక బైబిలు పండితుడు ఇలా చెప్పాడు: “మధ్యప్రాచ్య దేశాల్లోని ప్రజలు మనలా కొద్దిగా వంగి లేదా షేక్‌హ్యాండ్‌ ఇచ్చి నమస్కరించుకునే వాళ్లు కాదు, బదులుగా వాళ్లు నమస్కరించేటప్పుడు ఆలింగనం చేసుకోవడం, భుజాలమీద వాలడం లేదా నేలమీద సాష్టాంగపడడం వంటివి చాలాసార్లు చేసేవాళ్లు.” అవన్నీ చేయడానికి చాలా సమయం పట్టేది. అయితే తన అనుచరులు అమర్యాదగా ఉండాలని యేసు ఇక్కడ ప్రోత్సహించడం లేదు. కానీ వాళ్లకు పరిమిత సమయమే ఉందని, ఆ సమయాన్ని అత్యంత ప్రాముఖ్యమైన పనుల కోసమే ఉపయోగించాలని తన శిష్యులు అర్థంచేసుకోవడానికి సహాయంచేశాడు. (ఎఫె. 5:15, 16) రాజ్య సంబంధ పనులకు మద్దతివ్వడానికి ఎక్కువ సమయం మిగిలేలా మనం కూడా ఈ సూత్రాన్ని పాటించగలమా?

ఆఫ్రికాలోని, కెన్యాలో ఉన్న ఓ రాజ్యమందిరంలో రాజ్యప్రచారకులు

10, 11. (ఎ) ప్రపంచవ్యాప్త పనికోసం మనమిచ్చే విరాళాలను ఏయే విధాలుగా ఉపయోగిస్తారు? (బి) మొదటి కొరింథీయులు 16:1, 2 వచనాల్లోని ఏ సూత్రం మనకు సహాయకరంగా ఉంటుంది?

10 మన డబ్బు. రాజ్య సంబంధ పనులు సక్రమంగా జరగడానికి చాలా నిధులు అవసరం. ప్రయాణ పర్యవేక్షకుల, ప్రత్యేక పయినీర్ల, మిషనరీల బాగోగులు చూసుకోవడానికి ప్రతీ ఏట కొన్ని కోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయి. 1999 నుండి, పరిమితమైన వనరులున్న దేశాల్లో 24,500 కన్నా ఎక్కువ రాజ్యమందిరాలు నిర్మించారు. ఇంకా, సుమారు 6,400 రాజ్యమందిరాలు అవసరం. ప్రతీనెల దాదాపు పదికోట్ల కావలికోట, తేజరిల్లు! ప్రతులు ముద్రితమౌతున్నాయి. ఇవన్నీ మీరిచ్చే స్వచ్ఛంద విరాళాలతో జరుగుతున్నాయి.

11 విరాళాలిచ్చే విషయంలో పాటించాల్సిన ఒక సూత్రాన్ని అపొస్తలుడైన పౌలు చెప్పాడు. (1 కొరింథీయులు 16:1, 2 చదవండి.) వారమంతా ఆగి వారం చివర్లో ఏమైనా మిగిలితే దాన్ని విరాళంగా ఇవ్వాలని చూడకుండా, వారం ప్రారంభంలోనే ఎంత ఇవ్వగలరో ఆలోచించి ఆ మొత్తాన్ని పక్కన పెట్టమని పౌలు కొరింథులోని సహోదరులను ప్రోత్సహించాడు. మొదటి శతాబ్దంలోలాగే, మన కాలంలోని సహోదరసహోదరీలు కూడా తమ పరిస్థితులను బట్టి ఎంత ఇవ్వగలరో ముందే ప్రణాళిక వేసుకుని ఉదారంగా విరాళాలిస్తారు. (లూకా 21:1-4; అపొ. 4:32-35) అలాంటి ఉదార స్ఫూర్తిని యెహోవా అమూల్యమైనదిగా ఎంచుతాడు.

అమెరికాలోని, న్యూయార్క్‌లో ఉన్న, టక్సీడోలో రీజనల్‌ బిల్డింగ్‌ కమిటీ స్వచ్ఛంద సేవకుడు

12, 13. తమ శక్తిసామర్థ్యాలను పూర్తిగా ఉపయోగించడానికి చాలామంది ఎందుకు వెనకాడతారు? అయితే యెహోవా వాళ్లకు ఎలా సహాయం చేస్తాడు?

12 మన శక్తిసామర్థ్యాలు. రాజ్యం కోసం శక్తిసామర్థ్యాలను ఉపయోగిస్తూ మనం చేసే పనులకు యెహోవా మద్దతిస్తాడు. మనం సొమ్మసిల్లినప్పుడు బలాన్నిస్తానని ఆయన మాటిస్తున్నాడు. (యెష. 40:29-31) రాజ్యపనికి మద్దతివ్వడానికి మనకున్న నైపుణ్యాలు సరిపోవనీ, మనకంటే ఎక్కువ నైపుణ్యాలు ఉన్నవాళ్లు చాలామంది ఉన్నారనీ మనమనుకుంటున్నామా? బెసలేలుకు, అహోలీయాబుకు ఉన్న సహజ సామర్థ్యాలను యెహోవా మెరుగుదిద్దినట్లే, మనకున్న సామర్థ్యాలను కూడా పెంచుతాడని గుర్తుంచుకోండి.​—నిర్గ. 31:1-6; ప్రారంభ చిత్రం చూడండి.

13 మనం మన పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించే విషయంలో వెనుదీయకూడదని యెహోవా ప్రోత్సహిస్తున్నాడు. (సామె. 3:27) ఆలయ పునర్నిర్మాణ సమయంలో, యెరూషలేములోని యూదులు ఆ పనికి తగినంత మద్దతిస్తున్నారో లేదో జాగ్రత్తగా పరిశీలించుకోమని యెహోవా వాళ్లకు చెప్పాడు. (హగ్గ. 1:2-5) వాళ్ల ధ్యాస వేరేవాటి మీదకు మళ్లింది, వాళ్లు యెహోవా పనికి మొదటి స్థానం ఇవ్వలేదు. కాబట్టి, యెహోవాకు ప్రాముఖ్యమైనవి మనకు కూడా ప్రాముఖ్యమైనవిగా ఉన్నాయో లేవో పరిశీలించుకోవడం మంచిది. ఈ చివరి రోజుల్లో రాజ్యసంబంధ పనుల్లో ఎక్కువగా పాల్గొనేలా మనంకూడా ‘మన ప్రవర్తన గురించి ఆలోచించవద్దా?’

మనకు ఉన్నదాన్ని బట్టి త్యాగాలు

14, 15. (ఎ) పేద దేశాల్లోని సహోదరుల ఆదర్శం మనల్ని ఎలా ప్రోత్సహిస్తుంది? (బి) మనకు ఏ కోరిక ఉండాలి?

14 నేడు చాలామంది కష్టాలతో నిండిన నిరుపేద దేశాల్లో జీవిస్తున్నారు. అలాంటి దేశాల్లోని సహోదరసహోదరీలకు సహాయం చేయడానికి మన సంస్థ కృషి చేస్తుంది. (2 కొరిం. 8:14) అయితే, ఆర్థికస్థితి అంతంత మాత్రంగానే ఉన్న దేశాల్లోని సహోదరులు కూడా విరాళాలిచ్చే అవకాశాన్ని అమూల్యంగా ఎంచుతారు. బీదవాళ్లు ఆనందంగా విరాళాలిచ్చినప్పుడు యెహోవా ఎంతో సంతోషిస్తాడు.​—2 కొరిం. 9:7.

15 ఆఫ్రికాలోని ఒకానొక పేద దేశంలో నివసించే కొంతమంది సహోదరులు తమ పెరట్లోని కొంత భాగాన్ని కేటాయించి, దాంట్లో పండే పంటను అమ్మి, ఆ డబ్బును రాజ్యపని కోసం విరాళంగా ఇస్తున్నారు. అదే దేశంలో, ఒక రాజ్యమందిర నిర్మాణ పనిలో పాల్గొనాలని స్థానిక సహోదరసహోదరీలు ఎంతో కోరుకున్నారు. అయితే వచ్చిన చిక్కేమిటంటే, ఆ నిర్మాణం ప్రారంభమయ్యేది మొక్కలునాటే కాలంలో. అయినాసరే సహాయం చేయాలనే పట్టుదలతో వాళ్లు పగటిపూట రాజ్యమందిర నిర్మాణపనిలో పాల్గొని, సాయంత్రం పొలానికి వెళ్లి మొక్కలునాటే పని చూసుకున్నారు. అది ఎంతటి స్వయంత్యాగ స్ఫూర్తో కదా! దాన్ని చూస్తుంటే మనకు మొదటి శతాబ్దపు మాసిదోనియాలోని సహోదరులు గుర్తుకొస్తారు. వాళ్లు “నిరుపేదలైనను,” తోటి సహోదరులకోసం విరాళాలిచ్చే అవకాశాన్ని తమకు ఇవ్వమని పౌలును వేడుకున్నారు. (2 కొరిం. 8:1-4) మనం కూడా, ‘మన దేవుడైన యెహోవా మనకు అనుగ్రహించిన దీవెన చొప్పున’ ఇద్దాం.​—ద్వితీయోపదేశకాండము 16:17 చదవండి.

16. మన త్యాగాలు యెహోవాకు అంగీకారమైనవిగా ఉండేలా ఎలా చూసుకోవచ్చు?

16 అయితే ఒక్క విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రాచీన ఇశ్రాయేలీయుల అర్పణల్లాగే మన స్వేచ్ఛార్పణలు కూడా దేవునికి అంగీకారమైనవిగా ఉండేలా చూసుకోవాలి. కుటుంబం విషయంలో, యెహోవా ఆరాధన విషయంలో మనకున్న ప్రాథమిక బాధ్యతలను చక్కగా నిర్వర్తించడానికి మనకు సమతుల్యత అవసరం. మన కుటుంబసభ్యుల ఆధ్యాత్మిక, భౌతిక అవసరాలను నిర్లక్ష్యం చేసేంతగా మనం ఇతరుల కోసం మన సమయాన్ని, వనరుల్ని వెచ్చించకూడదు. అలా చేస్తే, మనం మనదగ్గర లేనివాటిని ఇస్తున్నవాళ్లమవుతాం. (2 కొరింథీయులు 8:12 చదవండి.) దానితోపాటు మనసొంత ఆధ్యాత్మికతను కూడా కాపాడుకోవాలి. (1 కొరం. 9:26, 27) మనం బైబిలు ప్రమాణాల ప్రకారం జీవిస్తున్నప్పుడు మనం చేసే త్యాగాలు మనకు ఎంతో ఆనందాన్ని, సంతృప్తిని తీసుకొస్తాయి. అంతేకాదు అవి యెహోవాకు ‘ప్రీతికరంగా’ ఉంటాయి.

మన త్యాగాలు ఎంతో విలువైనవి

17, 18. రాజ్యం కోసం త్యాగాలు చేసే వాళ్లందరి విషయంలో మనమెలా భావిస్తాం, మనందరం ఏ విషయం గురించి ఆలోచించాలి?

17 రాజ్యసంబంధ పనులకు మద్దతునివ్వడం కోసం మన సహోదరసహోదరీలు చాలామంది తమనుతాము “పానార్పణముగా” అర్పించుకుంటున్నారు. (ఫిలి. 2:17) అలాంటి స్ఫూర్తిని చూపిస్తున్న సహోదరసహోదరీలను మనం ఎంతో మెచ్చుకుంటాం. రాజ్యసంబంధ పనుల్లో ముందుండి నడిపించే సహోదరుల భార్యాపిల్లలు చూపించే ఉదార స్వభావం బట్టి, స్వయంత్యాగ స్ఫూర్తిని బట్టి వాళ్లను కూడా మనం మెచ్చుకుంటాం.

18 రాజ్యానికి సంబంధించిన పనులు చేయాలంటే ఎంతో కష్టపడాలి. వాటిలో వీలైనంత ఎక్కువగా ఎలా పాల్గొనవచ్చో మనందరం ప్రార్థనాపూర్వకంగా ఆలోచిద్దాం. అలా చేయడం వల్ల మీరు ఇప్పుడు, అలాగే “రాబోవు లోకమందు” ఎన్నో ఆశీర్వాదాలు పొందుతారనే నమ్మకంతో ఉండవచ్చు.​—మార్కు 10:28-30.

a కావలికోట 2012, జనవరి 15 సంచికలోని 21-25 పేజీల్లో ఉన్న, “యెహోవాకు మనస్ఫూర్తిగా బలులు అర్పించండి” ఆర్టికల్‌ చూడండి.