కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

గొర్రెపిల్ల వివాహం విషయంలో ఆనందించండి!

గొర్రెపిల్ల వివాహం విషయంలో ఆనందించండి!

‘గొఱ్ఱెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది కాబట్టి మనం సంతోషించి, ఉత్సహిద్దాం.’—ప్రక. 19:6, 7.

1, 2. (ఎ) పరలోకంలో అంతులేని ఆనందాన్ని కలిగించే వివాహోత్సవం ఎవరిది? (బి) ఏ ప్రశ్నలను ఇప్పుడు పరిశీలిస్తాం?

 పెళ్లి ఏర్పాట్లు ఒక్క రోజులో పూర్తవ్వవు, వాటికి సమయం పడుతుంది. ఇప్పుడు మనం ఓ ప్రత్యేకమైన పెళ్లి గురించి చూద్దాం, అది రాజకుటుంబంలో జరిగే పెళ్లి. ఆ వివాహోత్సవం కోసం దాదాపు 2,000 సంవత్సరాల నుండి ఏర్పాట్లు జరుగుతున్నాయి! పెళ్లికొడుకు, పెళ్లికూతురి చేయి అందుకునే గడియ ఇంకెంతో దూరంలో లేదు. త్వరలోనే రాజభవనంలో ఉల్లాసభరితమైన సంగీతం వినిపిస్తుంది, పరలోక బృందాలు ఇలా పాడతాయి: “సర్వాధికారియు ప్రభువునగు [“యెహోవా,” NW] మన దేవుడు ఏలుచున్నాడు; ఆయనను స్తుతించుడి, గొఱ్ఱెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది; ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొనియున్నది; గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదము.”—ప్రక. 19:6, 7.

2 తన పెళ్లి ద్వారా పరలోకంలో అంతులేని ఆనందానికి కారణమయ్యే ఆ “గొర్రెపిల్ల” మరెవరో కాదు, యేసుక్రీస్తే. (యోహా. 1:29) ఆయన పెళ్లి కోసం ఎలాంటి వస్త్రాలు ధరించాడు? పెళ్లికూతురు ఎవరు? పెళ్లికోసం ఆమెను ఎలా సిద్ధం చేశారు? ఆ పెళ్లి ఎప్పుడు జరుగుతుంది? పరలోకంలో ఆనందాన్ని నింపే ఆ పెళ్లి ఈ భూమ్మీద నిత్యం జీవించబోయే వాళ్లకు కూడా సంతోషం తీసుకొస్తుందా? 45వ కీర్తనను పరిశీలించి ఆ ప్రశ్నలకు ఆసక్తిగా జవాబులు చూద్దాం.

‘ఆయన వస్త్రములు సువాసనగలవి’

3, 4. (ఎ) పెళ్లికొడుకు ధరించే వస్త్రాల ప్రత్యేకత ఏమిటి? ఆయన సంతోషాన్ని ఏది అధికం చేస్తుంది? (బి) పెళ్లికొడుకు ఆనందంలో పాలుపంచుకునే “రాజుల కుమార్తెలు,” “రాణి” ఎవరు?

3 కీర్తన 45:8, 9 చదవండి. పెళ్లి కోసం యేసుక్రీస్తు శోభాయమానమైన రాజవస్త్రాలు ధరించాడు. ఆయన వస్త్రాలు గోపరస వాసన, లవంగిపట్ట వాసన వంటి సువాసనలు వెదజల్లుతున్నాయి, ఆ సుగంధ ద్రవ్యాలను ప్రాచీన ఇశ్రాయేలులోని ప్రతిష్ఠాభిషేక తైలంలో ఉపయోగించేవాళ్లు.—నిర్గ. 30:23-25.

4 రాజభవనమంతటా వినిపించే ఆ పరలోక సంగీతం, పెళ్లి దగ్గరపడేకొద్దీ ఆ పెళ్లికొడుకు సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. “రాణి,” అంటే దేవుని సంస్థలోని పరలోక భాగం కూడా ఆ సంతోషంలో పాలుపంచుకుంటుంది, అందులో “రాజుల కుమార్తెలు” అంటే పరిశుద్ధ దూతలు కూడా ఉన్నారు. ‘గొఱ్ఱెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది కాబట్టి మనం సంతోషించి, ఉత్సహిద్దాం’ అని పరలోక బృందాలు పాడడం విన్నప్పుడు మనసు ఎంతగా పులకరిస్తుంది!

పెళ్లికోసం పెళ్లికూతుర్ని సిద్ధం చేశారు

5. ‘గొర్రెపిల్ల భార్య’ ఎవరు?

5 కీర్తన 45:10, 11 చదవండి. పెళ్లికొడుకు ఎవరో చూశాం, మరి పెళ్లికూతురు ఎవరు? యేసుక్రీస్తు శిరస్సుగా ఉన్న అభిషిక్త క్రైస్తవుల సంఘమే ఆ పెళ్లికూతురు. (ఎఫెసీయులు 5:23, 24 చదవండి.) వాళ్లు మెస్సీయ రాజ్యంలో క్రీస్తుతోపాటు పరిపాలిస్తారు. (లూకా 12:32) ఈ 1,44,000 ఆత్మాభిషిక్త క్రైస్తవులు “గొఱ్ఱెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్ల ఆయనను వెంబడింతురు.” (ప్రక. 14:1-4) వీళ్లు ‘గొర్రెపిల్ల భార్య’ అయ్యి, ఆయనతోపాటు పరలోకంలో నివసిస్తారు.—ప్రక. 21:9; యోహా. 14:2, 3.

6. అభిషిక్త క్రైస్తవులను “రాజుకుమార్తె” అని బైబిలు ఎందుకు పిలుస్తుంది? “స్వజనమును” మర్చిపోమని దేవుడు వాళ్లకు ఎందుకు చెప్పాడు?

6 కాబోయే పెళ్లికూతుర్ని బైబిలు కేవలం “కుమారీ” అని మాత్రమే కాకుండా “రాజుకుమార్తె” అని కూడా పిలుస్తుంది. (కీర్త. 45:13) ఇంతకీ ఆ “రాజు” ఎవరు? యెహోవా దేవుడు. ఆయన అభిషిక్త క్రైస్తవులను ‘పిల్లలుగా’ దత్తత తీసుకున్నాడు. (రోమా. 8:15-17) వాళ్లు ఆ పెళ్లికూతురులో భాగం అవుతారు కాబట్టి, “నీ స్వజనమును నీ తండ్రి యింటిని మరువుము” అని యెహోవా వాళ్లకు చెప్పాడు. వాళ్లు తమ మనసులను “పైనున్న వాటిమీదనేగాని, భూసంబంధమైన వాటిమీద” పెట్టకూడదు.—కొలొ. 3:1-4.

7. (ఎ) క్రీస్తు తనకు కాబోయే భార్యను ఎలా సిద్ధం చేస్తూ వచ్చాడు? (బి) పెళ్లికూతురు తనకు కాబోయే భర్తను ఎలా గౌరవిస్తుంది?

7 ఈ వివాహోత్సవం కోసం క్రీస్తు శతాబ్దాలుగా పెళ్లికూతుర్ని సిద్ధం చేస్తూ వచ్చాడు. అపొస్తలుడైన పౌలు ఇలా వివరించాడు: “క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన యెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదకస్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్నుతాను అప్పగించుకొనెను.” (ఎఫె. 5:25-27) ఆయన ప్రాచీన కొరింథులోని అభిషిక్త క్రైస్తవులకు ఇలా చెప్పాడు: “దేవాసక్తితో మీ యెడల ఆసక్తి కలిగి యున్నాను; ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి, అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని, మిమ్మును ప్రధానము చేసితిని.” (2 కొరిం. 11:2) పెళ్లికొడుకైన యేసుక్రీస్తు తనకు కాబోయే భార్య ఆధ్యాత్మిక ‘సౌందర్యానికి’ ఎంతో విలువిస్తాడు. పెళ్లికూతురు కూడా తనకు కాబోయే భర్తకు ‘నమస్కరించి,’ ఆయనను మనస్ఫూర్తిగా ‘ప్రభువుగా’ అంగీకరిస్తుంది.

పెళ్లికూతుర్ని “రాజునొద్దకు” తీసుకొచ్చారు

8. కీర్తనకర్త పెళ్లికూతుర్ని ‘మహిమగలదానిగా’ వర్ణించడం ఎందుకు తగినది?

8 కీర్తన 45:13, 14ఎ చదవండి. ఆ పెళ్లి కోసం పెళ్లికూతుర్ని ‘మహిమగలదానిగా’ సిద్ధం చేశారు. ప్రకటన 21:2 వ వచనం, పెళ్లికూతుర్ని “తన భర్తకొరకు అలంకరింపబడిన” నూతనమైన యెరూషలేము పట్టణంతో పోలుస్తుంది. ఆ పరలోక పట్టణానికి “దేవుని మహిమ” ఉంది, అది “ధగధగ మెరయు సూర్యకాంతమువంటి అమూల్యరత్నమును పోలి” ప్రకాశిస్తుంది. (ప్రక. 21:10, 11) నూతన యెరూషలేము పట్టణపు సౌందర్యాన్ని ప్రకటన గ్రంథం మనోహరంగా వర్ణిస్తుంది. (ప్రక. 21:18-21) అందుకే కీర్తనకర్త పెళ్లికూతుర్ని ‘మహిమగలదానిగా’ వర్ణించడంలో ఆశ్చర్యం లేదు. పైగా ఆ రాజు పెళ్లి జరిగేది పరలోకంలో!

9. పెళ్లికూతుర్ని ఏ “రాజు” దగ్గరకు తీసుకొచ్చారు? పెళ్లికోసం ఆమెను ఎలా అలంకరించారు?

9 పెళ్లికూతుర్ని పెళ్లికొడుకు దగ్గరకు అంటే మెస్సీయ రాజు దగ్గరకు తీసుకొచ్చారు. ఆయన ఆమెను ‘ఏ కళంకం లేకుండా పరిశుద్ధంగా ఉండేలా, వాక్యముతో ఉదకస్నానము చేయించి పవిత్రపరుస్తూ’ సిద్ధం చేస్తున్నాడు. (ఎఫె. 5:25-27) అయితే పెళ్లికూతుర్ని కూడా ఆ ఘనమైన సందర్భానికి తగిన వస్త్రాలతో అలంకరించాలి. అలాగే అలంకరించారు! నిజానికి, ఆమెకు ‘బంగారు బుట్టాపని చేసిన, విచిత్రమైన పనిగల వస్త్రములను ధరింపచేసి రాజునొద్దకు తీసుకొచ్చారు.’ గొర్రెపిల్లతో పెళ్లికోసం, “ధరించుకొనుటకు ప్రకాశములును నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకియ్యబడెను; అవి పరిశుద్ధుల నీతిక్రియలు.”—ప్రక. 19:8.

“వివాహోత్సవ సమయము వచ్చినది”

10. గొర్రెపిల్ల వివాహం ఎప్పుడు జరగాలి?

10 ప్రకటన 19:6, 7 చదవండి. గొర్రెపిల్ల వివాహం ఎప్పుడు జరుగుతుంది? ఈ లేఖనాలు, వివాహం కోసం గొర్రెపిల్ల “భార్య తన్ను తాను సిద్ధపరుచుకొనియున్నది” అని చెబుతున్నా, తర్వాతి వచనాలు మాత్రం పెళ్లి గురించి వివరించడం లేదు. అవి, మహాశ్రమల ముగింపులో జరిగే సంఘటనలను సవివరంగా వర్ణిస్తున్నాయి. (ప్రక. 19:11-21) అంటే, పెళ్లికొడుకు-రాజైన క్రీస్తు విజయ పరంపర ముగియకముందే ఆ పెళ్లి జరుగుతుందా? కాదు. ప్రకటన గ్రంథంలోని దర్శనాలు, అవి నెరవేరే వరుసక్రమంలో నమోదు కాలేదు. అయితే 45వ కీర్తన ప్రకారం రాజైన క్రీస్తు కత్తిని ధరించి, మొదట తన శత్రువుల మీద విజయం సాధిస్తాడు, దాని తర్వాతే పెళ్లి జరుగుతుంది.—కీర్త. 45:3, 4.

11. క్రీస్తు ఏ వరుసక్రమంలో తన విజయ పరంపరను పూర్తి చేస్తాడు?

11 కాబట్టి ఈ వరుసక్రమంలో సంఘటనలు జరుగుతాయని చెప్పవచ్చు: మొదటిగా, “మహావేశ్య” అయిన మహాబబులోను మీద అంటే ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యం మీద తీర్పులు అమలు అవుతాయి. (ప్రక. 17:1, 5, 16, 17; 19:1, 2) తర్వాత క్రీస్తు, మిగిలిన సాతాను దుష్ట వ్యవస్థపై దేవుని తీర్పులు అమలుచేస్తాడు అంటే, “సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమైన” హార్‌మెగిద్దోనులో దాన్ని సమూలంగా నాశనం చేస్తాడు. (ప్రక. 16:14-16; 19:19-21) చివరిగా, యోధుడైన రాజు సాతానును, అతని దయ్యాలను అగాధంలో బంధిస్తాడు, అంటే మరణంవంటి నిష్క్రియా స్థితిలో పడేసి తన విజయ పరంపరను పూర్తిచేస్తాడు.—ప్రక. 20:1-3.

12, 13. (ఎ) గొర్రెపిల్ల వివాహం ఎప్పుడు జరుగుతుంది? (బి) గొర్రెపిల్ల వివాహం వల్ల పరలోకంలో ఎవరెవరు సంతోషిస్తారు?

12 క్రీస్తు ప్రత్యక్షతా కాలంలో జీవిస్తున్న అభిషిక్త క్రైస్తవులు తమ భూజీవితాన్ని ముగించిన వెంటనే పరలోకానికి పునరుత్థానం అవుతారు. మహాబబులోను నాశనమైన కొంతకాలానికి, పెళ్లికూతురులో భాగమైన మిగతావాళ్లను యేసు తన దగ్గరకు తెచ్చుకుంటాడు. (1 థెస్స. 4:16, 17) కాబట్టి, హార్‌మెగిద్దోను యుద్ధం మొదలవ్వడానికి ముందే, పెళ్లికూతురులో భాగమైన ప్రతీ ఒక్కరు పరలోకంలో ఉంటారు. ఆ యుద్ధం ముగిశాక గొర్రెపిల్ల వివాహం జరుగుతుంది. ఆ వివాహోత్సవం ఎంత సంతోషాన్ని తీసుకొస్తుందో! “గొఱ్ఱెపిల్ల పెండ్లివిందుకు పిలువబడినవారు ధన్యులు” అని ప్రకటన 19:9 చెబుతుంది. అవును, పెళ్లికూతురులో భాగమైన 1,44,000 మంది నిజంగా ఎంతో ధన్యులు. రాజైన క్రీస్తు కూడా ‘తన రాజ్యములో తన బల్లయొద్ద’ సూచనార్థక భావంలో “అన్నపానములు పుచ్చుకొనే” తన సహవాసులందరూ తన దగ్గరుండడం చూసి ఎంతో సంతోషిస్తాడు. (లూకా 22:18, 28-30) అయితే, గొర్రెపిల్ల వివాహం వల్ల సంతోషించేది వాళ్లు మాత్రమే కాదు.

13 మనం ముందే గమనించినట్లు, పరలోక బృందాలు ముక్తకంఠంతో ఇలా పాడతాయి: “గొఱ్ఱెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది; గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను [యెహోవాను] మహిమపరచెదము.” (ప్రక. 19:6, 7) అయితే భూమ్మీదున్న యెహోవా సేవకుల విషయమేమిటి? ఆ సంబరంలో వాళ్లుకూడా పాలుపంచుకుంటారా?

“ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు”

14. కీర్తనలు 45వ అధ్యాయంలోని “చెలికత్తెలైన కన్యకలు” ఎవరు?

14 కీర్తన 45:12, 14బి, 15 చదవండి. అన్యజనులు అంత్యదినాల్లో, ఆధ్యాత్మిక ఇశ్రాయేలులోని శేషించిన సభ్యులతో సంతోషంగా సహవసిస్తారని జెకర్యా ప్రవచించాడు. ఆయనిలా రాశాడు: “ఆ దినములలో ఆయా భాషలు మాటలాడు అన్యజనులలో పదేసిమంది యొక యూదుని చెంగుపట్టుకొని—దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతోకూడ వత్తుమని చెప్పుదురు.” (జెక. 8:23) ఆ ‘పదిమందిని’ కీర్తన 45:12, “తూరు కుమార్తె” అని, “జనులలో ఐశ్వర్యవంతులు” అని వర్ణించింది. వీళ్లు అభిషిక్తుల దయ కోసం, ఆధ్యాత్మిక సాయం కోసం “నైవేద్యము” అంటే కానుకలు తీసుకొస్తారు. అభిషిక్త క్రైస్తవుల వల్ల, 1935 నుండి లక్షలాది ప్రజలు ‘నీతిమార్గము ననుసరించి నడుచుకుంటున్నారు.’ (దాని. 12:3) వీళ్లు అభిషిక్త క్రైస్తవులతో యథార్థంగా సహవసిస్తూ తమ జీవితాల్ని పవిత్రం చేసుకుని, ఆధ్యాత్మిక “కన్యకలు” అయ్యారు. ఈ “చెలికత్తెలైన కన్యకలు” తమ జీవితాల్ని యెహోవాకు సమర్పించుకుని, పెళ్లికొడుకైన రాజుకు నమ్మకస్థులైన పౌరులమని నిరూపించుకున్నారు.

15. భూమ్మీదున్న అభిషిక్తులతో కలిసి “చెలికత్తెలైన కన్యకలు” ఎలా పనిచేస్తున్నారు?

15 ఈ ‘చెలికత్తెలైన కన్యకలకు’ భూమ్మీదున్న అభిషిక్తులు ఎంతో కృతజ్ఞత చూపిస్తున్నారు. ఎందుకంటే వాళ్లు అభిషిక్తులకు మద్దతిస్తూ, “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను” ఉత్సాహంగా ప్రకటిస్తున్నారు. (మత్త. 24:14) “ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు,” అంతేకాదు “వినువాడును రమ్ము అని చెప్పవలెను.” (ప్రక. 22:17) అవును, అభిషిక్త క్రైస్తవులు “రమ్ము” అని చెప్పడం వింటున్న “వేరే గొర్రెలు” వాళ్లతో కలిసి “రమ్ము” అనే ఆహ్వానాన్ని ప్రజలందరికీ ఇస్తున్నారు.—యోహా. 10:16.

16. వేరే గొర్రెలకు యెహోవా ఏ అవకాశం ఇచ్చాడు?

16 భూమ్మీదున్న అభిషిక్తులు ఈ సహవాసులను ఎంతో ప్రేమిస్తున్నారు. అందుకే గొర్రెపిల్ల వివాహం వల్ల కలిగే ఆనందంలో పాలుపంచుకునే అవకాశాన్ని యెహోవా వాళ్లకు కూడా ఇచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నారు. ఈ “చెలికత్తెలైన కన్యకలు” ‘ఉత్సాహ సంతోషాలతో’ వస్తారని బైబిలు ప్రవచించింది. అవును, భూమ్మీద నిత్యం జీవించే నిరీక్షణగల వేరే గొర్రెలు కూడా, పరలోకంలో గొర్రెపిల్ల వివాహం వల్ల జరిగే విశ్వవ్యాప్త సంబరాల్లో పాలుపంచుకుంటారు. అందుకే ప్రకటన గ్రంథం ‘గొప్పసమూహపు’ సభ్యులు “సింహాసనము ఎదుటను, గొఱ్ఱెపిల్లయెదుటను నిలువబడి” ఉన్నారని వర్ణిస్తుంది. వాళ్లు యెహోవా ఆధ్యాత్మిక ఆలయంలోని భూసంబంధ ఆవరణలో పరిశుద్ధ సేవ చేస్తున్నారు.—ప్రక. 7:9, 15.

గొర్రెపిల్ల వివాహం వల్ల, పెళ్లికూతురు “చెలికత్తెలైన కన్యకలు” ఎంతో సంతోషిస్తారు (16వ పేరా చూడండి)

“నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురు”

17, 18. గొర్రెపిల్ల వివాహం ఎలా ప్రయోజనాలు తీసుకొస్తుంది? క్రీస్తు వెయ్యేళ్ల పరిపాలన కాలంలో ఎవరికి తండ్రి అవుతాడు?

17 కీర్తన 45:16 చదవండి. గొర్రెపిల్ల వివాహం వల్ల నూతనలోకంలో ప్రయోజనం పొందేటప్పుడు, పెళ్లికుమార్తె “చెలికత్తెలైన కన్యకలు” మరో విషయాన్నిబట్టి కూడా ఎంతో సంతోషిస్తారు. పెళ్లికొడుకైన రాజు తన ‘పితరులను’ పునరుత్థానం చేసి మళ్లీ బ్రతికిస్తాడు, అలావాళ్లు ఆ రాజు భూసంబంధ “కుమారులు” అవుతారు. (యోహా. 5:25-29; హెబ్రీ. 11:35) ఆయన వాళ్లలో కొంతమందిని ‘అధికారులుగా’ భూమంతటా నియమిస్తాడు. ప్రస్తుతం నమ్మకంగా ఉన్న కొందరు సంఘపెద్దల్ని కూడా నూతనలోకంలో తన ప్రజల్ని నడిపించడానికి క్రీస్తు ఉపయోగించుకుంటాడని చెప్పవచ్చు.—యెష. 32:1.

18 వెయ్యేళ్ల పరిపాలన కాలంలో క్రీస్తు ఇతరులకు కూడా తండ్రి అవుతాడు. ఎలా? యేసు విమోచన క్రయధనంపై విశ్వాసం ఉంచే వాళ్లందరూ అప్పుడు భూమ్మీద నిరంతరం జీవిస్తారు. (యోహా. 3:16) అలా ఆయన వాళ్లకు “నిత్యుడగు తండ్రి” అవుతాడు.—యెష. 9:6, 7.

‘ఆయన నామాన్ని తెలియజేస్తారు’

19, 20. కీర్తనలు 45వ అధ్యాయంలో నమోదైన ఆసక్తికరమైన సంఘటనలతో నేటి నిజక్రైస్తవులందరికీ సంబంధం ఉందని ఎందుకు చెప్పవచ్చు?

19 కీర్తన 45:1, 17 చదవండి. 45వ కీర్తనలోని విషయాలపై క్రైస్తవులందరూ ఆసక్తి చూపించాలి. భూమ్మీదున్న అభిషిక్తుల విషయానికొస్తే, పరలోకానికి వెళ్లిన తమ సహోదరులనూ పెళ్లికొడుకునూ త్వరలో కలుసుకోబోతున్నందుకు ఎంతో సంతోషిస్తారు. వేరేగొర్రెలు, తమ మహిమాన్విత రాజుకు మరింతగా లోబడుతూ, భూమ్మీదున్న అభిషిక్తులతో సహవసిస్తున్నందుకు ఎంతో కృతజ్ఞతతో ఉంటారు. పెళ్లి తర్వాత క్రీస్తు, ఆయన తోటి రాజులు భూనివాసుల మీద అంతులేని ఆశీర్వాదాలు కుమ్మరిస్తారు.—ప్రక. 7:17; 21:1-4.

20 మెస్సీయ రాజ్యానికి సంబంధించిన “దివ్యమైన సంగతి” నెరవేరే సమయం కోసం ఎదురుచూస్తుండగా, ‘ఆయన నామాన్ని’ తెలియజేయాలనే పురికొల్పు మనం పొందడం లేదా? ‘తరములన్నిటా రాజును స్తుతించేవాళ్లలో’ మనం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.