కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా మన సాటిలేని స్నేహితుడు

యెహోవా మన సాటిలేని స్నేహితుడు

‘అబ్రాహాముకు దేవుని స్నేహితుడని పేరుకలిగెను.’—యాకో. 2:23.

1. మనకు ఏ సామర్థ్యం ఉంది?

 “తండ్రిలాగే కొడుకు కూడా” అనే మాట మీరు వినేవుంటారు. అవును చాలామంది పిల్లలు వాళ్ల అమ్మానానల్లా ఉంటారు. ఎంతైనా, పిల్లల్లో కనిపించేది వాళ్ల అమ్మానాన్నల నుండి వచ్చిన లక్షణాలే. మన పరలోక తండ్రియైన యెహోవా మనకు జీవాన్నిచ్చాడు. (కీర్త. 36:9) ఆయన పిల్లలమైన మనం కొంతవరకు ఆయనలాగే ఉంటాం. పైగా దేవుడు మనల్ని తన స్వరూపంలో సృష్టించాడు కాబట్టి, ఆలోచించి నిర్ణయాలు తీసుకునే, సన్నిహిత స్నేహాల్ని ఏర్పర్చుకునే సామర్థ్యం మనకు ఉంది.—ఆది. 1:26.

2. యెహోవాతో మన స్నేహం దేనివల్ల సాధ్యమైంది?

2 యెహోవాను మన సన్నిహిత స్నేహితునిగా చేసుకోవచ్చు. దేవునికి మనమీద ఉన్న ప్రేమవల్ల, మనకు ఆయనమీద, ఆయన కుమారుని మీద ఉన్న విశ్వాసం వల్ల అది సాధ్యమయ్యింది. యేసు ఇలా చెప్పాడు: “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” (యోహా. 3:16) యెహోవాకు సన్నిహిత స్నేహితులైనవాళ్లు చాలామంది ఉన్నారు. వాళ్లలో ఇద్దరి గురించి ఇప్పుడు చూద్దాం.

“నా స్నేహితుడైన అబ్రాహాము”

3, 4. యెహోవాతో స్నేహం చేసే విషయంలో అబ్రాహాముకు, ఆయన సంతానానికి ఉన్న తేడా ఏమిటి?

3 ఇశ్రాయేలీయుల మూలపురుషుడైన అబ్రాహామును యెహోవా “నా స్నేహితుడు” అని పిలిచాడు. (యెష. 41:8) అలాగే 2 దినవృత్తాంతములు 20:7 కూడా అబ్రాహామును దేవుని స్నేహితునిగా వర్ణిస్తుంది. నమ్మకస్థుడైన అబ్రాహాము ఏకంగా తన సృష్టికర్తతోనే స్నేహం చేయడం ఎలా సాధ్యమైంది? ఆయన విశ్వాసంవల్లే.—ఆది. 15:6; యాకోబు 2:21-23 చదవండి.

4 అబ్రాహాము సంతానమైన ఇశ్రాయేలు జనాంగానికి యెహోవా ఒకప్పుడు తండ్రిలా, స్నేహితునిలా ఉన్నాడు. అయితే, విచారకరంగా వాళ్లు దేవునితో తమకున్న స్నేహాన్ని కోల్పోయారు. ఎందుకు? ఎందుకంటే వాళ్లు యెహోవా వాగ్దానాల మీద విశ్వాసం ఉంచలేదు.

5, 6. (ఎ) యెహోవా ఎలా మీ స్నేహితుడు అయ్యాడు? (బి) మనం ఏ ప్రశ్నల గురించి ఆలోచించాలి?

5 మీరు యెహోవా గురించి నేర్చుకునే కొద్దీ, ఆయన మీదున్న మీ విశ్వాసం బలపడుతుంది, మీ ప్రేమ అధికం అవుతుంది. దేవుడు ఒక నిజమైన వ్యక్తని, ఆయనతో అనుబంధం పెంచుకోవడం సాధ్యమేనని మీరు మొదటిసారి తెలుసుకున్న రోజుల్ని ఓసారి గుర్తుచేసుకోండి. మనందరం ఆదాము అవిధేయతవల్లే పాపులమయ్యామని మీరు నేర్చుకున్నారు. మానవజాతి మొత్తంగా దేవుని నుండి దూరమయ్యిందనే విషయం మీరు అర్థం చేసుకున్నారు. (కొలొ. 1:21) అలాగే మన ప్రేమగల పరలోక తండ్రియైన యెహోవా మనకు అందనంత దూరంలో లేడని, మనల్ని ఏమాత్రం పట్టించుకోని వ్యక్తికాడని కూడా మీరు గ్రహించారు. యేసు అర్పించిన విమోచన క్రయధనం గురించి నేర్చుకుని, దానిమీద విశ్వాసం ఉంచడం మొదలుపెట్టినప్పుడు మనం దేవునితో సన్నిహిత స్నేహాన్ని పెంపొందించుకోవడం మొదలుపెట్టాం.

6 ఆ రోజులను గుర్తుచేసుకుంటూ మనం ఈ ప్రశ్నల గురించి ఆలోచించడం మంచిది: ‘దేవునితో నాకున్న స్నేహాన్ని మరింతగా పెంచుకుంటున్నానా? నా ప్రియ స్నేహితుడైన యెహోవాపై నాకున్న నమ్మకం, ప్రేమ రోజురోజుకూ పెరుగుతున్నాయా? యెహోవాతో సన్నిహితంగా స్నేహం చేసిన మరో వ్యక్తి గిద్యోను. ఇప్పుడు ఆయన గురించి పరిశీలించి, ఏమి నేర్చుకోవచ్చో చూద్దాం.

“యెహోవా సమాధానకర్త”

7-9. (ఎ) గిద్యోనుకు ఏ ప్రత్యేక అనుభవం ఎదురైంది? దాని ఫలితమేమిటి? (ప్రారంభ చిత్రం చూడండి.) (బి) మనం యెహోవా స్నేహితులుగా ఉండాలంటే ఏమి చేయాలి?

7 ఇశ్రాయేలు జనాంగం వాగ్దాన దేశంలో ప్రవేశించిన తర్వాత, వాళ్ల పరిస్థితి అల్లకల్లోలంగా మారినకాలంలో న్యాయాధిపతియైన గిద్యోను యెహోవాను సేవించాడు. న్యాయాధిపతులు 6వ అధ్యాయంలోని వృత్తాంతం వివరిస్తున్నట్లుగా, ఒఫ్రాలో ఉన్న గిద్యోను దగ్గరకు ఓ దేవదూత వచ్చాడు. ఆ కాలంలో పొరుగునవున్న మిద్యానీయులు ఇశ్రాయేలీయుల మీద పదేపదే దాడులు చేసేవాళ్లు. అందుకే, తన పంటను వెంటనే దాచిపెట్టుకోవడానికి వీలుగా గిద్యోను, బయట పొలంలో కాకుండా గానుగచాటున గోధుమలు నూర్చుతున్నాడు. అప్పుడు దేవదూత ప్రత్యక్షమై, గిద్యోనును “పరాక్రమముగల బలాఢ్యుడా” అని పిలుస్తూ మాట్లాడేసరికి ఆయన ఆశ్చర్యపోయాడు. అయితే, యెహోవా గతంలో ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తీయుల నుండి రక్షించినట్లే ఈసారి కూడా రక్షిస్తాడనే నిర్ధారణకు గిద్యోను రాలేకపోయాడు. అదే సందేహాన్ని దూత దగ్గర వెలిబుచ్చినప్పుడు, దూత యెహోవా తరఫున మాట్లాడుతూ గిద్యోనుకు యెహోవా సహాయం ఉంటుందని అభయం ఇచ్చాడు.

8 “మిద్యానీయుల చేతిలోనుండి ఇశ్రాయేలీయులను” రక్షించడం తనకు సాధ్యం కాదేమోనని గిద్యోను ఆందోళనపడ్డాడు. అయితే, యెహోవా గిద్యోనుతో “నేను నీకు తోడైయుందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతముచేయుదువు” అని చెప్పి భరోసా ఇచ్చాడు. (న్యాయా. 6:11-16) అయితే ఇంకా నమ్మకం కుదరని గిద్యోను దేవుణ్ణి ఓ సూచన అడిగాడు. ఆ సందర్భంలో వాళ్లిద్దరి మధ్య జరిగిన సంభాషణను చూస్తే గిద్యోను యెహోవాను నిజమైన వ్యక్తిగా దృష్టించాడని నిస్సందేహంగా చెప్పవచ్చు.

9 దాని తర్వాత జరిగిన సంఘటన గిద్యోనుకు మరింత నమ్మకం కలిగించి, ఆయనను దేవునికి ఇంకా సన్నిహితం చేసింది. గిద్యోను ఆ దూతకోసం భోజనం సిద్ధం చేసి వడ్డించాడు. అయితే దూత తన కర్రతో ఆ భోజనాన్ని తాకినప్పుడు, అది అద్భుతరీతిలో కాలిపోవడంతో ఆ దూతను ఖచ్చితంగా యెహోవాయే పంపించాడని గిద్యోను గ్రహించాడు. అప్పుడు గిద్యోను భయంతో “అహహా నా యేలినవాడా, యెహోవా, . . . నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితిననెను.” (న్యాయా. 6:17-22) జరిగిన ఆ సంఘటన గిద్యోనుకు యెహోవాతో ఉన్న స్నేహాన్ని దెబ్బతీసిందా? అస్సలు కాదు! బదులుగా గిద్యోను దేవునితో సమాధానపడినట్లు భావించాడు. అందుకే, గిద్యోను ఆ స్థలంలో ఒక బలిపీఠం కట్టి దానికి “యెహోవా సమాధానకర్త” అనే పేరు పెట్టాడు. (న్యాయాధిపతులు 6:23, 24 చదవండి.) యెహోవా ప్రతీరోజు మనకోసం చేసేవాటన్నిటి గురించి ఆలోచించినప్పుడు ఆయన ఒక నిజమైన స్నేహితుడని మనం గ్రహిస్తాం. మనం దేవునికి క్రమంగా ప్రార్థిస్తే, మన సమాధానం, ఆయనతో స్నేహం బలపడతాయి.

“యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు?”

10. కీర్తన 15:3, 5 ప్రకారం, తనతో స్నేహం చేసేవాళ్లకు ఏ అర్హతలు ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు?

10 అయితే, యెహోవాతో స్నేహం చేయాలంటే మనం కొన్నిటిని పాటించాలి. ‘యెహోవా గుడారంలో అతిథిగా ఉండే’ వ్యక్తికి అంటే ఆయనతో స్నేహం చేసే వ్యక్తికి ఉండాల్సిన అర్హతల గురించి 15వ కీర్తనలో దావీదు వివరించాడు. (కీర్త. 15:1) వాటిలోని రెండు అర్హతలను మనమిప్పుడు చర్చిద్దాం, ఆ వ్యక్తి కొండెములు చెప్పకూడదు, అన్ని విషయాల్లో నిజాయితీగా ఉండాలి. ఆ విషయాలను ప్రస్తావిస్తూ దావీదు ఇలా పాడాడు: “అట్టివాడు నాలుకతో కొండెములాడడు, . . . నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు.”—కీర్త. 15:3, 5.

11. మనం ఎందుకు కొండెములు చెప్పకూడదు?

11 “చెడ్డ మాటలు పలుకకుండ నీ నాలుకను . . . కాచుకొనుము” అని మరో కీర్తనలో దావీదు హెచ్చరించాడు. (కీర్త. 34:13) ఆ ప్రేరేపిత సలహాను పాటించకపోతే మనం, నీతిగల మన పరలోకపు తండ్రికి దూరమవుతాం. నిజానికి, కొండెములు చెప్పడం దేవుని ప్రధాన శత్రువైన సాతాను అలవాటు. “అపవాది” అని అనువదించిన గ్రీకు పదానికి “కొండెములు చెప్పువాడు” అని అర్థం. ఇతరుల గురించి మనం ఏమి మాట్లాడుతున్నామో జాగ్రత్తగా చూసుకుంటే యెహోవాతో మనకున్న సాన్నిహిత్యాన్ని కాపాడుకుంటాం. సంఘంలోని నియమిత సహోదరుల విషయంలో ముఖ్యంగా ఆ జాగ్రత్త తీసుకోవాలి.—హెబ్రీయులు 13:17; యూదా 8 చదవండి.

12, 13. (ఎ) మనం అన్నివిషయాల్లో ఎందుకు నిజాయితీగా ఉండాలి? (బి) మనం నిజాయితీగా ఉండడం వల్ల ఎలాంటి ఫలితం ఉంటుంది?

12 అలాగే యెహోవా సేవకులు తోటివారితో నిజాయితీగా ఉంటారే తప్ప వాళ్లను తమ స్వార్థానికి వాడుకోరు. అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “మా నిమిత్తము ప్రార్థనచేయుడి; మేమన్ని విషయములలోను యోగ్యముగా ప్రవర్తింప గోరుచు మంచి మనస్సాక్షి కలిగియున్నామని నమ్ముకొనుచున్నాము.” (హెబ్రీ. 13:18) ‘అన్ని విషయాల్లో యోగ్యంగా ప్రవర్తించాలని’ నిర్ణయించుకున్నాం కాబట్టే మనం తోటి క్రైస్తవులను మోసం చెయ్యం. ఉదాహరణకు, వాళ్లు మన దగ్గర పనిచేస్తుంటే, వాళ్లతో మనం నిజాయితీగా ప్రవర్తిస్తాం, ఎంత జీతం ఇస్తామని మాటిచ్చామో అంత ఇస్తాం. మనం క్రైస్తవులం కాబట్టి మన దగ్గర పనిచేస్తున్న వాళ్లతో, ఇతరులతో నిజాయితీగా వ్యవహరిస్తాం. అలాగే, తోటి క్రైస్తవుని కింద మనం పనిచేస్తుంటే, మనల్ని ప్రత్యేకంగా చూడాలని పట్టుబట్టకూడదు.

13 యెహోవాసాక్షులతో లావాదేవీలు జరిపే కొందరు వాళ్ల నిజాయితీని తరచూ ప్రశంసిస్తారు. యెహోవాసాక్షులు మాటమీద నిలబడతారని గమనించిన ఒక పెద్ద నిర్మాణ కంపెనీ యజమాని ఓసారి ఇలా అన్నాడు: “మీరు ఒప్పుకున్నదానికి ఎప్పుడూ కట్టుబడి ఉంటారు.” (కీర్త. 15:4) అలాంటి ప్రవర్తన వల్ల మనం ఎల్లప్పుడూ యెహోవాతో స్నేహాన్ని కాపాడుకుంటాం, అంతేకాక మన ప్రేమగల పరలోక తండ్రికి స్తుతిని తీసుకొస్తాం.

యెహోవా స్నేహితులయ్యేలా ఇతరులకు సహాయం చేయండి

యెహోవా స్నేహితులయ్యేలా ఇతరులకు మనం సహాయం చేస్తాం (14, 15 పేరాలు చూడండి)

14, 15. మనం పరిచర్యలో, యెహోవా స్నేహితులయ్యేలా ప్రజలకు ఎలా సహాయం చేయవచ్చు?

14 పరిచర్యలో మనం కలిసే చాలామంది దేవుడు ఉన్నాడని నమ్ముతున్నా, ఆయనను ఓ మంచి స్నేహితునిలా భావించకపోవచ్చు. అలాంటివాళ్లకు మనం ఎలా సహాయం చేయగలం? యేసు తన 70 మంది శిష్యులను పరిచర్యకు పంపిస్తూ ఇచ్చిన ఈ నిర్దేశాల్ని గమనించండి: “మీరు ఏ యింటనైనను ప్రవేశించునప్పుడు—ఈ యింటికి సమాధానమగుగాక అని మొదట చెప్పుడి. సమాధానపాత్రుడు అక్కడ నుండినయెడల మీ సమాధానము అతనిమీద నిలుచును; లేనియెడల అది మీకు తిరిగి వచ్చును.” (లూకా 10:5, 6) కాబట్టి మనం స్నేహపూర్వకంగా ఉండడం ద్వారా ఇతరులను సత్యం వైపు ఆకర్షించవచ్చు. సువార్తను వ్యతిరేకించేవాళ్లతో కూడా మనం అలా ఉంటే వాళ్లలోని ద్వేషం తగ్గి, వాళ్లు మరో సందర్భంలో సువార్త వినే అవకాశం ఉంది.

15 అబద్ధమతంలో కూరుకుపోయినవాళ్లను లేదా లేఖనవిరుద్ధమైన ఆచారాలు పాటిస్తున్నవాళ్లను కలిసినప్పుడు కూడా మనం స్నేహపూర్వకంగా, సమాధానంగా ఉంటాం. మనం అందరినీ మన కూటాలకు సాదరంగా ఆహ్వానిస్తాం, ముఖ్యంగా ప్రస్తుత లోకంతో విసిగిపోయి, మనం ఆరాధించే దేవుణ్ణి తెలుసుకోవాలని కోరుకునేవాళ్లను మనం కూటాలకు ఆహ్వానిస్తాం. అలాంటి వాళ్లకు సంబంధించిన చక్కని ఉదాహరణలు “బైబిలు జీవితాలను మారుస్తుంది” ఆర్టికల్స్‌లో చూడవచ్చు.

మన సాటిలేని స్నేహితునితో పనిచేద్దాం

16. మనం యెహోవా స్నేహితులుగా ఉండడంతోపాటు ఆయన ‘జతపనివారిగా’ ఎలా అవుతాం?

16 తరచూ, కలిసి పనిచేసేవాళ్లు మంచి స్నేహితులవుతారు. యెహోవాకు సమర్పించుకున్న వాళ్లందరికీ ఆయన స్నేహితులుగా, ‘జతపనివారిగా’ ఉండే అమూల్యమైన అవకాశం ఉంది. (1 కొరింథీయులు 3:9 చదవండి.) అవును, మనం ప్రకటనా పనిలో, శిష్యులను చేసే పనిలో పాల్గొన్నప్పుడు మన పరలోక తండ్రికున్న అద్భుత లక్షణాలను మరింత బాగా అర్థం చేసుకుంటాం. సువార్త ప్రకటించే పనిలో పరిశుద్ధాత్మ ఎలా సహాయం చేస్తుందో కూడా స్వయంగా చూడగలుగుతాం.

17. సమావేశాల్లో మనం పొందే ఆధ్యాత్మిక ఆహారం యెహోవా మన స్నేహితుడని ఎలా చూపిస్తుంది?

17 శిష్యులను చేసే పనిలో ఎక్కువగా పాల్గొనే కొద్దీ మనం యెహోవాకు మరింత దగ్గరవుతాం. ఉదాహరణకు, ప్రకటనాపనిని ఆపాలని శత్రువులు చేస్తున్న ప్రయత్నాలను యెహోవా ఎలా అడ్డుకుంటున్నాడో చూస్తున్నాం. కొన్నేళ్ల వెనక్కి వెళ్లి ఆలోచించండి. యెహోవా మనల్ని ఎలా నడిపిస్తున్నాడో మనం స్పష్టంగా చూడలేదా? పుష్టికరమైన ఆధ్యాత్మిక ఆహారం క్రమంగా అందడం మనకు ఆశ్చర్యమనిపిస్తుంది. సమావేశాల్లోని కార్యక్రమాల్ని చూస్తే మన సమస్యల, అవసరాల విషయంలో యెహోవా ఎంతగా ఆలోచిస్తున్నాడో తెలుస్తుంది. జిల్లా సమావేశానికి హాజరైన ఒక కుటుంబం తమ కృతజ్ఞతను తెలియజేస్తూ ఇలా రాసింది: “ఆ కార్యక్రమం నిజంగా మా మనసుల్ని కదిలించింది. మాలో ప్రతీ ఒక్కరిని యెహోవా ఎంతగా ప్రేమిస్తున్నాడో, మేము సంతోషంగా ఉండాలని ఎంతగా కోరుకుంటున్నాడో గ్రహించాం.” ఐర్లాండ్‌లో ప్రత్యేక సమావేశానికి హాజరైన ఓ జర్మనీ జంట, తమను సాదరంగా ఆహ్వానించినందుకు, బాగోగులు చూసుకున్నందుకు ఇలా కృతజ్ఞత తెలియజేశారు: “యెహోవాకు, రాజైన యేసుక్రీస్తుకు మేము ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నిజమైన ఐక్యత ఉన్న జనాంగంలోకి వాళ్లు మమ్మల్ని ఆహ్వానించారు. మనం ఐక్యత గురించి కేవలం మాట్లాడుకోవడమే కాదు, దాన్ని ప్రతీరోజు ఆస్వాదిస్తున్నాం. డబ్లిన్‌లో జరిగిన ఆ ప్రత్యేక సమావేశంలో మేము పొందిన అనుభవాలు, గొప్ప దేవుడైన యెహోవాను మీ అందరితో కలిసి సేవించే అరుదైన అవకాశం మాకుందని ఎల్లప్పుడూ గుర్తుచేస్తాయి.”

స్నేహితులు ఎక్కువగా మాట్లాడుకుంటారు

18. యెహోవాతో మాట్లాడే విషయంలో మనం ఏమని ప్రశ్నించుకోవాలి?

18 చక్కగా మాట్లాడుకోవడం వల్ల స్నేహం బలపడుతుంది. ఇప్పుడున్న ఇంటర్నెట్‌ యుగంలో సోషల్‌ నెట్‌వర్కింగ్‌ ద్వారా, మెసేజ్‌ల ద్వారా మాట్లాడుకోవడం బాగా ఎక్కువయ్యింది. అయితే దానితో పోలిస్తే మన సన్నిహిత స్నేహితుడైన యెహోవాతో మనం ఎంతవరకు మాట్లాడుతున్నాం? నిజమే, యెహోవా “ప్రార్థన ఆలకించు” దేవుడే. (కీర్త. 65:2) అయితే మనం చొరవ తీసుకుని ఆయనతో తరచూ మాట్లాడుతున్నామా?

19. మన పరలోక తండ్రి ఎదుట హృదయాన్ని కుమ్మరించడం కష్టంగా ఉంటే, మనకు ఏ సహాయం అందుబాటులో ఉంది?

19 కొంతమంది యెహోవా సేవకులకు, తమ హృదయాన్ని కుమ్మరించి, మనసు లోతుల్లో ఉన్నవాటిని చెప్పుకోవడం కష్టంగా ఉంటుంది. అయినా అలాగే ప్రార్థించమని యెహోవా అడుగుతున్నాడు. (కీర్త. 119:145; విలా. 3:41) మనసు లోలోపల ఉన్నవాటిని మాటల్లో వ్యక్తం చేయడం మనకు కష్టం అనిపిస్తే బాధపడాల్సిన అవసరం లేదు. రోమాలోని క్రైస్తవులకు పౌలు ఇలా చెప్పాడు: “మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మయొక్క మనస్సు ఏదో యెరుగును; ఏలయనగా ఆయన దేవుని చిత్తప్రకారము పరిశుద్ధులకొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు.” (రోమా. 8:26, 27) యోబు, కీర్తనలు, సామెతలు వంటి బైబిలు పుస్తకాలను చదివి వాటిగురించి ఆలోచిస్తే, మన లోతైన భావాలను ప్రార్థనలో యెహోవాకు ఎలా చెప్పుకోవచ్చో తెలుస్తుంది.

20, 21. ఫిలిప్పీయులు 4:6, 7 వచనాల్లో ఏ ఓదార్పుకరమైన మాటలు ఉన్నాయి?

20 కృంగదీసే పరిస్థితులు ఎదురైనప్పుడు, పౌలు ఫిలిప్పీయులకు ఇచ్చిన ఈ సలహాను పాటిద్దాం: “దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.” మన మంచి స్నేహితునితో అలా మనసువిప్పి మాట్లాడినప్పుడు ఎంతో ఊరటను, ఉపశమనాన్ని పొందుతాం. ఎందుకంటే పౌలు ఆ తర్వాత, “సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును” అని అన్నాడు. (ఫిలి. 4:6, 7) మన హృదయాలకు, తలంపులకు నిజంగా కావలివుండే ఆ సాటిలేని “దేవుని సమాధానము” విషయంలో ఎల్లప్పుడూ రుణపడివుందాం.

యెహోవాతో మన స్నేహాన్ని ప్రార్థన ఎలా బలపరుస్తుంది? (21వ పేరా చూడండి)

21 ప్రార్థన వల్ల మనం యెహోవాతో స్నేహాన్ని వృద్ధి చేసుకుంటాం. కాబట్టి మనం ‘ఎడతెగక ప్రార్థిద్దాం.’ (1 థెస్స. 5:16) దేవునితో మనకున్న అమూల్యమైన బంధాన్ని, ఆయన నీతియుక్త ప్రమాణాల ప్రకారం జీవించాలనే మన నిర్ణయాన్ని ఈ అధ్యయనం బలపర్చాలని కోరుకుందాం. అలాగే యెహోవా మన నిజమైన తండ్రి, దేవుడు, స్నేహితుడు అవ్వడం వల్ల పొందుతున్న ఆశీర్వాదాల గురించి ఎల్లప్పుడూ ఆలోచిద్దాం.